NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

త్వరలో పట్టాలెక్కనున్న వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభమెప్పుడంటే..?

వందే భారత్ స్లీపర్ రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులకు శుభవార్త. వందే భారత్ రైళ్ల విజయవంతమైన తర్వాత.. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే యోచిస్తోంది. భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించాలని భావిస్తున్నారు. కాగా.. వందే భారత్ స్లీపర్ రైలు వందే భారత్ సిరీస్ యొక్క మూడవ వెర్షన్. ఈ సిరీస్ రైళ్లలో చైర్-కార్ రైళ్లు కూడా ఉన్నాయి. అలాగే.. వందే మెట్రో గుజరాత్‌లో నడుస్తుంది. అయితే.. వచ్చే నెలలోగా తొలి వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనున్నట్లు జనరల్ మేనేజర్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) చెన్నై, యు. సుబ్బారావు తెలిపారు.

ఆయన మాట్లాడుతూ.. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) బెంగళూరు ప్లాంట్ నుండి సెప్టెంబర్ 20 నాటికి మొదటి రైలు నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. “BEML కోచ్‌లను అసెంబ్లింగ్ చేస్తోంది. సెప్టెంబర్ 20 నాటికి కోచ్‌లు ICF, చెన్నైకి చేరుకుంటాయని మేము భావిస్తున్నాము. ఆ తర్వాత మేము రేక్ తయారీ, ఫైనల్ టెస్టింగ్.. కమీషనింగ్ చేస్తాము. ఇది సుమారు 15-20 రోజులు పడుతుంది. ఆ తర్వాత.. లక్నో ఆధారిత రైల్వే డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) కింద డోలనం ట్రయల్స్‌ను.. నార్త్ వెస్ట్రన్ రైల్వే జోన్‌లో నిర్వహించనున్నారు.” అని సుబ్బారావు పేర్కొన్నారు.

గుజరాత్‌లో 10 రోజుల పాటు ఆపరేషన్‌.. వెయ్యి కేసుల్లో నిందితులు అరెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులు ఏడు బృందాలుగా గుజరాత్‌లో పది రోజులపాటు ఓ ఆపరేషన్ నిర్వహించారని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆపరేషన్‌లో భాగంగా వివిధ సైబర్ క్రైమ్‌లకు పాల్పడిన 36 మందిని అరెస్ట్ చేశారని.. ఆ నిందితులు దేశవ్యాప్తంగా సుమారు వెయ్యి కేసుల్లో నిందితులుగా ఉన్నారన్నారు. ఇందులో 20 కేసుల్లో నిందితులు సుమారు 12 కోట్ల రూపాయలకు పైగా మోసం చేశారని తెలిపారు. ఇందులో గతంలో 4.4 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశామని.. ఫ్రీజ్ చేసిన డబ్బులో ఇప్పటికే బాధితులకు ఒకటిన్నర కోట్లు రీఫండ్ చేశామన్నారు. నిందితులు చేసిన నేరాల్లో 11 ఇన్వెస్ట్మెంట్ మోసాలు ,4 ఇన్వెస్ట్మెంట్ , నాలుగు ఫెడెక్స్, ఒకటి ట్రేడింగ్ కేసులు ఉన్నాయన్నారు. నిందితుల వద్ద నుంచి 38 లక్షల నగదు బంగారం ల్యాప్‌టాప్‌లు, బ్యాంక్ చెక్ బుక్స్, పాస్ బుక్స్ సీజ్ చేశామన్నారు. షెల్ కంపెనీలకు చెందిన నకిలీ స్టాంపులను కూడా సీజ్ చేశామన్నారు. నిందితులపై తెలంగాణ వ్యాప్తంగా సుమారు 150 కేసులు ఉన్నాయన్నారు.

ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మొత్తం 8 అంశాలపై కేంద్ర ఆర్ధిక మంత్రి కి వినతిపత్రం ఇచ్చామని తెలిపారు. కేంద్ర మంత్రి చాలా సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేసి సహాయం చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని, పెండింగ్ నిధులను వెంటనే విడదల చేయాలని కోరామన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ రుణాలు పెను భారంగా మారాయని, గత ప్రభత్వం 31, 795 కోట్ల రూపాయలు రుణాలు తీసుకుందన్నారు భట్టి. 10.75 శాతం, 11.25 శాతం వడ్డీ రేటు తో రుణాలు తీసుకుందని, రుణాలు “రీస్ట్రక్చర్” చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే జీతాల కంటే, పెద్ద మొత్తంలో తీసుకున్న అప్పులకు వడ్డీలు కడుతున్నామని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో 11 నగర వనాల అభివృద్ధికి కేంద్రం నిధులు మంజూరు

రాష్ట్రంలో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో నగర వనాలు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ ఆమోదం తెలియజేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. 11 మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో నూతనంగా నగర వనాలు అభివృద్ధి నిమిత్తం తొలి విడతగా రూ.15.4 కోట్లను కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నిధులను మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిధులతో కర్నూలులో గార్గేయపురం నగర వనం, కడప నగర వనం, నెల్లిమర్లలో వెలగాడ నగర వనం, చిత్తూరు డెయిరీ నగర వనం, చిత్తూరులో కలిగిరి కొండ నగర వనం, శ్రీకాళహస్తిలో కైలాసగిరి నగర వనం, తాడేపల్లిగూడెంలో ప్రకాశరావుపాలెం నగర వనం, పెనుకొండలో శ్రీకృష్ణదేవరాయ కోట ఎకో పార్క్ నగర వనం, కదిరిలో బత్రేపల్లి వాటర్ ఫాల్స్ ఎకో పార్క్ నగరవనం, పలాసలో కాశీబుగ్గ నగర వనం, విశాఖపట్నంలో ఈస్టర్న్ ఘాట్ బయోడైవర్సిటీ సెంటర్ నగర వనాలను అభివృద్ధి చేస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.

700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు చేపట్టాం

కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్ణీత్ సింగ్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈరోజు రి కన్స్ట్రక్షన్ అవుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రైల్వే కేంద్ర సహాయ మంత్రి రవ్ణీత్ సింగ్ మాట్లాడుతూ.. 712 కోట్లతో మొదటి విడత స్టేషన్ అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. అధునాతనమైన టెక్నాలజీ అంతర్జాతీయ విమానాశ్రయ తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ప్లాట్ ఫామ్ లకు రూఫ్ టాప్ లు, పార్కింగ్ స్థలాలు ఏసి వెయిటింగ్ హాల్స్, స్టేషన్ రెండువైపులా కొత్త బిల్డింగులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 2026 కల్లా పనులు మొత్తం పూర్తి కావాలి అని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 27 శాతం పనులు పూర్తి అయ్యాయని, చర్లపల్లి స్టేషన్ పనులు శరవేగంగా సాగి పూర్తి అయ్యాయన్నారు రవ్ణీత్ సింగ్.

డిసెంబర్‌ మొదటి వారం నుంచి అమరావతి నిర్మాణ పనులు

ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని ఏడీసీ నర్సరీలను మంత్రి నారాయణ పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రూ. 41వేల కోట్లతో అమరావతికి గతంలో టెండర్లు ఇచ్చామని.. గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి అమరావతిని నిర్వీర్యం చేసిందని ఆయన మండిపడ్డారు. అమరావతి పనుల కోసం రూ. 5000 కోట్లు కూడా చెల్లించామన్నారు. లండన్ సంస్థ నార్మన్ పోస్టర్ వారితో డిజైన్ చేయించామని.. రూ. 36 కోట్లతో కంప తొలగింపు చేపట్టామని.. 50 శాతం తొలగించామని మంత్రి తెలిపారు. అమరావతిలో 4 నర్సరీలను డెవలప్ చేశామని.. అక్కడి చెట్లు చాలా పెద్దవి అయిపోయాయన్నారు.

విద్యార్థులను నిరసనకు తీసుకెళ్లారని మూడు స్కూళ్లపై విద్యాశాఖ చర్యలు..

పశ్చిమ బెంగాల్‌లోని విద్యా శాఖ మూడు పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా జరిగిన ర్యాలీలలో ఈ విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొన్నారని తెలిపింది. ఈ క్రమంలో.. విద్యాశాఖ చర్యలు చేపట్టింది. హౌరా జిల్లాలోని బలుహతి సెకండరీ స్కూల్, బలుహతి గర్ల్స్ సెకండరీ స్కూల్, బంట్ర రాజలక్ష్మి గర్ల్స్ స్కూళ్లకు నోటీసులు పంపింది. 24 గంటల్లోగా స్పష్టత ఇవ్వాలని విద్యాశాఖ ఈ పాఠశాలలను ఆదేశించింది. విద్యార్థులతో పాటు పలువురు ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది కూడా ర్యాలీలో పాల్గొన్నారని.. ఇది నిబంధనలను ఉల్లంఘించడమేనని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ విషయంలో సరైన సమాధానాలు లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తరగతుల సమయంలో విద్యార్థులు ఇలాంటి ర్యాలీల్లో పాల్గొనకూడదని పేర్కొన్నారు. కొంతమంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది విద్యార్థులను ర్యాలీకి తీసుకెళ్లినట్లు తమకు తెలిసిందని విద్యాశాఖ తెలిపింది.

ఎన్నికలు వాయిదా వేయాలని ఈసీకి బీజేపీ లేఖ.. కారణాలు ఇవే..

హర్యానాలో అక్టోబర్ 1న జరగాల్సిన పోలింగ్ ను నిలిపేయాలని భారతీయ జనతా పార్టీ (BJP) ఎన్నికల కమిషన్‌ను అభ్యర్థించింది. సుదీర్ఘ వారంతపు సెలవుల( లాంగ్ వీకెండ్) కారణంగా పోలింగ్ శాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఎన్నికల తేదీకి ముందు, తర్వాత సెలవులు ఉన్నాయని.. దీంతో ఓటింగ్ శాతం తగ్గే అవకాశం ఉందని లేఖలో పేర్కొంది. శనివారం, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ మోహన్‌లాల్ బడోలి కమిషన్‌కు లేఖ పంపినట్లు రాష్ట్ర బిజెపి నాయకుడు ఒకరు తెలిపారు. ఆగస్టు 22న ఈ-మెయిల్ ద్వారా కమిషన్‌కు లేఖ కాపీ అందిందని హర్యానా చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పంకజ్ అగర్వాల్ ధృవీకరించారు. రాష్ట్ర బీజేపీ నుంచి లేఖ పంపినట్లు అగర్వాల్ తెలిపారు.

భారత్ నెట్ ప్రాజెక్టు కోసం కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

ఏపీలో భారత్ నెట్ ప్రాజెక్టును విస్తృతపరిచేందుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. భారత్ నెట్ సమర్థ వినియోగం కోసం రాష్ట్రానికి 35 లక్షల సీపీఈ బాక్సులు సరఫరా చేయాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కేంద్ర టెలీకమ్యూనికేషన్ల శాఖ సహయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, ఆ శాఖ కేంద్ర కార్యదర్శితో ఐ అండ్ ఐ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ సమావేశమయ్యారు. భారత్ నెట్ రెండో దశలో భాగంగా మల్టీ ప్రొటోకాల్ లేబుల్ స్విచ్చింగ్ టెక్నాలజీ కోసం ఖర్చు చేసిన రూ. 650 కోట్లు ఏపీకి తిరిగి చెల్లించాలని అధికారులు కోరారు. ఏపీ ఎఫ్ఎస్ఎల్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 9.7 లక్షల గృహాలకు హైస్పీడ్ బ్రాడ్ బాండ్ సేవలందిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో 6200 పాఠశాలలు, 1978 ఆరోగ్య కేంద్రాలు, 11254 గ్రామ పంచాయతీలు, 5800 రైతు కేంద్రాలకు, 9104 ప్రభుత్వ కేంద్రాలకు ఫైబర్ నెట్ సేవలు అందిస్తున్నట్టు కేంద్రానికి ఏపీ సర్కారు వివరించింది. తక్షణం 35 లక్షల సీపీఈ బాక్సులు అందిస్తే భారత్ నెట్ సేవలను మరింత విస్తృతపరుస్తామని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం తెలిపింది. భారత్ నెట్ ఫేజ్-3 ప్రతిపాదనలు కూడా సమర్పిస్తామని కేంద్రానికి అధికారులు వివరించారు.

ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్‌.. కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం

ప్రభుత్వ ఉద్యోగుల్లో పాత పెన్షన్ స్కీమ్ (OPS) డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యుపిఎస్) ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 25 ఏళ్లు పని చేసే ఉద్యోగికి పూర్తి పెన్షన్ వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. యూపీఎస్ పథకం ద్వారా 23 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఈ పథకం 2025 ఏప్రిల్ 1 నుండి అమలు చేయనుంది. కేబినెట్ సమావేశానికి సంబంధించిన సమాచారంపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. పదేళ్లు సర్వీస్ చేసిన వారికి రూ.10,000 పింఛన్ వస్తుందని తెలిపారు.అలాగే ఉద్యోగులు సర్వీసులో ఉండగా చనిపోతే వారి భార్యలకు 60 శాతం పెన్షన్ ఇస్తారని పేర్కొన్నారు. ఎన్‌పిఎస్ పథకాన్ని మెరుగుపరచాలని దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల నుండి ఎప్పటి నుంచో డిమాండ్ ఉందని అన్నారు. 2023 ఏప్రిల్‌లో ప్రధాని మోడీ ఈ సంస్కరణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారన్నారు. ఈ కమిటీకి డాక్టర్ సోమనాథన్ అధ్యక్షుడిగా ఉన్నారని.. ఈ కమిటీ 100కు పైగా ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలతో మాట్లాడిందని తెలిపారు. ఈ కమిటీ దాదాపు అన్ని రాష్ట్రాలతో చర్చలు జరిపిందని.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంస్థలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ఈ అంశాన్ని ప్రధాని సీరియస్‌గా తీసుకుని.. కమిటీ సిఫార్సు మేరకు సమీకృత పింఛను పథకాన్ని ప్రభుత్వం ఆమోదించిందని పేర్కొన్నారు.