NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

వంద రోజుల్లో పూర్తి చేస్తానన్న ఆరు గ్యారెంటీలు తుంగలో తొక్కింది…

జనగామ జిల్లా జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దశమంత్ రెడ్డి నివాసంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల జీవితాలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పెంక మీది నుండి పొయ్యలో పడ్డట్టయిందని ఆయన అన్నారు. నిజాం రాజ్యం లాగా బిఆర్ఎస్ పరిపాలన చేసింది, కాంగ్రెస్ పరిపాలన కూడా అలాగే ఉందని, వంద రోజుల్లో పూర్తి చేస్తానన్న ఆరు గ్యారెంటీలు తుంగలో తొక్కిందన్నారు కిషన్‌ రెడ్డి. అన్ని విధాల నమ్మపలికి నట్టేట ముంచిందని, దేవుడి పేరుమోద ఓట్లు తింటూ రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడన్నారు కిషన్‌ రెడ్డి. 100 రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని ఆగస్టు వరకు వాయిదా వేశారని ఆయన మండిపడ్డారు. క్వింటాలు ధాన్యం పై 500 రూ”ఇస్తామని సన్నరకం ధాన్యానికి ఇస్తామని నమ్మబలికారని, రాష్ట్ర ప్రభుత్వం బోనస్ నుండి తప్పించుకుని రైతులకు అన్యాయం చేయాలని చూస్తుందని కిషన్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

పాజిటివ్ వచ్చిందా ఏం చేసుకుంటారో చేసుకోండి.. హేమ షాకింగ్ కామెంట్స్!

బెంగళూరు డ్రగ్స్ కేసు గంట గంటకు ఒక మలుపు తిరుగుతోంది. ఆ కేసు మొత్తం ఒక ఎత్తు అయితే ఆ కేసులో ఇరుక్కున్న హేమ వ్యవహారం మరో ఎత్తులాగా అనిపిస్తోంది. బెంగళూరు ఫామ్ హౌస్ లో హేమ ఉందని అంటూ మీడియాలో వార్తలు ప్రసారమైన వెంటనే తాను అక్కడ లేనని హైదరాబాద్ లో ఉన్నానని ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈ విషయం మీద బెంగళూరు పోలీసులు సీరియస్ అయ్యి మరో కేసు కూడా నమోదు చేశారు. అయితే ఆ తర్వాత కూడా హేమ ఆ డ్రగ్స్ కేసుకి తనకి సంబంధం లేదనే ప్రయత్నమే చెబుతూ వచ్చింది. కానీ హేమ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ట్రేసెస్ ఉండడంతో ఈ ఉదయం మీడియా ప్రతినిధులను మళ్ళీ ఆమె వివరణ అడిగే ప్రయత్నం చేశారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో పాజిటివ్ గా రావడంపై స్పందించమని కోరిన మీడియాపై ఆగ్రహించిన హేమ, తాను ఇప్పుడేం మాట్లాడనని, సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని, అప్పటివరకు ఏం చేసుకుంటారో చేసుకోండని మీడియాపై దురుసుగా మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక నిజానికి రేవ్ పార్టీలో పాల్గొనడానికి హేమ తన ఒరిజినల్ పేరు కాకుండా కృష్ణవేణి అని పేరు నమోదు చేసుకున్నట్లు బెంగళూరు పోలీసులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా రేపు 250 కేంద్రాల్లో పాలీసెట్

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్) 2024 శుక్రవారం నిర్వహించేందుకు సిద్ధంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 250 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షకు మొత్తం 92,808 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. పరీక్ష ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించబడుతుంది , పరీక్ష ప్రారంభానికి ఒక గంట ముందుగా కేంద్రాలలోకి ప్రవేశం ప్రారంభమవుతుంది. ఉదయం 11 గంటల తర్వాత అభ్యర్థులను పరీక్ష హాలులోకి అనుమతించరు. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, పాలీసెట్‌ను కలిగి ఉంది , విద్యార్థులు రెండు వైపులా OMR షీట్ వివరాలను పూరించి సంతకం చేయవలసిందిగా కోరింది.

కావాలనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయలేదు..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్ వంటి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రుల్ని టార్గెట్ చేస్తోందని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తాను జైలు నుంచి ముఖ్యమంత్రిగా పనిచేయడం గురించి ఆయన మాట్లాడుతూ.. ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది కాబట్టి ఉద్దేశపూర్వకంగానే తాను సీఎం పదవికి రాజీనామా చేయలేదని వెల్లడించారు. ప్రతిపక్ష నేతల్ని టార్గెట్ చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని కేజ్రీవాల్ అన్నారు. బుధవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

జూన్ 1 తర్వాత మధ్యంతర బెయిల్ ముగిసిన తర్వాత కేజ్రీవాల్ మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా జైలు నుంచి విధులు నిర్వహించడానికి కోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించారు. ఢిల్లి లిక్కర్ పాలసీలో మనీలాండరింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌‌ని ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసింది. 50 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్న తర్వాత లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అతడిని అరెస్ట్ చేసినప్పటి నుంచి సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.

ఢిల్లీలోని మహిళా కాలేజీలకు బెదిరింపు కాల్స్

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా ఈ మెయిల్ బెదిరింపు కాల్స్ రావడం అధికారుల్ని పరుగులు పెట్టిస్తోంది. మరోవైపు ప్రజలు కూడా బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం కేంద్ర హోంశాఖకు బెదిరింపు కాల్ రాగా.. అది వట్టిదిగా పోలీసులు తేల్చారు. ఇక గురువారం కూడా బెంగళూరులోని ప్రముఖ హోటళ్లకు బెదిరింపు కాల్స్ రాగా.. అలాగే ఢిల్లీలోని పలు కాలేజీలకు కూడా బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని మహిళా శ్రీరామ్, వెంకటేశ్వర కాలేజీ, ఢిల్లీ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది, ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సోదాలు చేపట్టారు. బుధవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయానికి బూటకపు బెదిరింపు కాల్ తేల్చిన మరుసటి రోజే బెదిరింపులు రావడంపై అధికారులు అయోమయానికి గురవుతున్నారు. లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు.

“నేను జీవించి ఉన్నంత వరకు అది సాధ్యం కాదు”.. రిజర్వేషన్లపై ప్రధాని మోడీ..

హర్యానాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ రిజర్వేషన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జీవించి ఉన్నంత వరకు దళితులు, గిరిజనుల రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరని అన్నారు. కలకత్తా హైకోర్టు 2010 తర్వాత జారీ అయిన ఓబీసీ సర్టిఫికేట్లను క్యాన్సిల్ చేసిన చేసింది. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మోడీ విరుచుకుపడ్డారు. ‘‘పశ్చిమ బెంగాల్‌లో వారు రాత్రికి రాత్రే ముస్లింలకు, చొరబాటుదారులకు ఓబీసీ సర్టిఫికేట్లు జారీ చేశారు. గత 10-12 ఏళ్లలో ముస్లింలకు జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికేట్లను హైకోర్టు రద్దు చేసింది. కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని సీఎం మమతా బెనర్జీ అంగీకరించడం లేదని, వారు ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఇది ఇండియా కూటమి మనస్తత్వం’’ అని ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు.

తనకు ఏమి కాలేదని క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే కొడాలి నాని..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, వైస్సార్సీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారని., నేడు ఆయన తన స్వగృహంలో నందివాడ మండల పార్టీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అప్రమత్తమైన పార్టీ నేతలు, గన్‌మెన్లు ఆయనకు సపర్యలు చేసి., వెంటనే డాక్టర్లకు సమాచారం అందించారని వార్తలు వచ్చాయి. ఇక ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేరని అంటూ రకరకాల వార్తల వచ్చాయి. ఇక ఈ విషయల్నిటికి చెక్ పెడుతూ.. తాను ఎలాంటి అస్వస్థతకు గురి కాలేదని తాజాగా క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే కొడాలి నాని. తాను బాగానే ఉన్నానంటూ ఆయన తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

రాజకీయ హత్యలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి

వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీ పల్లి లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ మహోబాద్ కి దుకాన్ అంటారు ఇదేనా తెలంగాణ లో ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తున్నారని, 10 సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ఇలాంటి హత్యలు ఎప్పుడు జరగలేదు మేము అనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇలా ఉండేదా అని ఆయన అన్నారు. కొల్లాపూర్ ప్రాంతాన్ని కల్లోళ్ల ప్రాంతంగా సమస్యత్మక ప్రాంతంగా ప్రకటించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పేరుకేమో ప్రజాపాలన చేస్తున్నదేమో ప్రతికరణ పాలన అని ఆయన మండిపడ్డారు. రాజకీయ హత్యలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలన్నారు కేటీఆర్‌. మధ్య జూపల్లి కృష్ణారావు సహకారం లేకుండా ఈ హత్యలు జరగవని కేటీఆర్‌ మండిపడ్డారు. కొల్లాపూర్ లో ఫ్యాక్షన్ సంస్కృతి నెలకొంది.కొల్లాపూర్ లో జరుగుతున్న వరుస హత్యల మీద జ్యుడీషియల్ విచారణ జరపాలని, శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్నారు కేటీఆర్‌. సీఎం రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో మంత్రి జూపల్లి.కృష్ణారావు ను బర్తరపు చేయాలని, తెలంగాణలో ఎక్కడలేని ఫ్యాక్షని సంస్కృతి కొల్లాపూర్ లో నెలకొందన్నారు కేటీఆర్‌.

మంత్రి అంబటి రాంబాబు పిటిషన్ ను కొట్టేసిన ఏపీ హైకోర్టు..

మంత్రి అంబటి పిటిషన్‌ డిస్మిస్‌ చేసిన ఏపీ హైకోర్టు. సత్తెనపల్లిలో 4 పోలింగ్‌ బూత్‌లలో రీపోలింగ్‌ జరపాలని అంబటి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ దశలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది. చంద్రగిరిలో రీపోలింగ్‌ జరపాలంటూ మోహిత్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను కూడా కోర్టు డిస్మిస్‌ చేసింది. కాగా.. పల్నాడు జిల్లాలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ రోజున అల్లర్లు, అరాచకాలు చెలరేగాయి. అయితే, ఈ భయాందోళనలకు పెద్ద ఎత్తున అవకతవకలు జరగడాన్ని మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. సత్తెనపల్లి నియోజక వర్గంలోని 236, 237, 253, 254 వార్డుల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ మంత్రి అంబటి రాంబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తన నియోజకవర్గంలో తాజాగా ఎన్నికలు నిర్వహించాలని అంబటి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు (గురువారం) విచారణ చేపట్టింది.

వంద కాదు 180 రోజులైనా 6 గ్యారంటీలకు దిక్కులేదు

తొర్రూరులో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నో ఆలోచనలు కల్పించి మభ్యపెట్టిందని, బాండ్ పేపర్ రాసిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పై పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలన్నారు. 6 గ్యారంటీలు 13 హామీలు వంద రోజుల్లో అమలు చేస్తామని మోసం చేశారని, వంద కాదు 180 రోజులైనా 6 గ్యారంటీలకు దిక్కులేదన్నారు హరీష్‌ రావు. నిరుద్యోగ భృతి రాలేదు, ఉద్యోగాలు రాలేదని, చేసేది లేక దేవుళ్ళ మీద ఒట్లు పెడుతున్నరని ఆయన అన్నారు. ఆగష్టు 15 లోగా చెప్పిన హామీలు అమలు చేస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా, మల్లా పోటీ కూడా చెయ్యను అని చెప్పానని, రైతులు, మహిళలు, విద్యార్థుల కోసం నేను సవాల్ విసిరానన్నారు. ఒక్క మాట మాట్లాడకుండా వెళ్ళిపోయాడని, దొడ్డు వడ్లను బోనస్ ఇవ్వము అన్న రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు హరీష్‌ రావు.