NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తుంది

బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తుందన్నారు ఎంపీ ఆర్‌ కృష్ణయ్య. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ బీసీ కాదని సీఎం రేవంత్ అంటున్నాడు.. కానీ ప్రధాని ఒరిజినల్ బీసీనే అని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ ప్రధాని అయిన తర్వాత భారత్ అభివృద్ధిలో పరిగెడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ హయాంలో భారత దేశం కీర్తి ఖండాంతరాలు దాటి వెళ్ళిందని ఆయన అన్నారు. సర్వేజనా సుఖినోభవంతు అనేది బీజేపీ మూల సిద్ధాంతమని, ప్రపంచంలోనే అగ్ర దేశంగా మన దేశాన్ని తీర్చి దిద్దుతున్నారన్నారు ఆర్‌ కృష్ణయ్య. బీజేపీ బీసీల పార్టీ అని, తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీదే గెలుపు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండని, తెలంగాణ పోరాటాల గడ్డ.. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు ఆర్‌.కృష్ణయ్య.

కేంద్రం ప్రవేశపెట్టింది ప్రజా బడ్జెట్.. మధ్యతరగతి ప్రజలకు బడ్జెట్‌లో ఊరట

రాజమండ్రిలో కేంద్ర బడ్జెట్ 2025-26పై మేధావుల సమావేశం జరిగింది. ఈ సదస్సుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మేధావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ప్రజా బడ్జెట్ అని అన్నారు. వ్యవసాయ రంగానికి కేంద్ర బడ్జెట్లో పెద్దపీట వేశారని తెలిపారు. ధన ధాన్య యోజన పథకంతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. పప్పు దినుసులు దిగుమతి పెంచుకునేందుకు బడ్జెట్‌లో ఆలోచించారని పేర్కొన్నారు. మరోవైపు.. ఆక్వా రంగానికి, పాడి పశువులకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని పురంధేశ్వరి తెలిపారు.

కార్మికుల క్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది

తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలో జరిగిన SLBC టన్నెల్ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. శ్రీశైలం ఎడమ కాలువ టన్నెల్‌లో కొంత భాగం కూలిపోవడంతో, అక్కడ పనిచేస్తున్న కార్మికులు సొరంగం లోపలే చిక్కుకుపోయారు. ఈ హఠాన్ని ఎదుర్కొనడానికి ప్రభుత్వం అత్యవసరంగా చర్యలు చేపట్టింది. సహాయక చర్యల కోసం రాష్ట్ర అధికారులతో పాటు కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగాయి.

ఈ విషాద ఘటనపై కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, నాగర్ కర్నూల్ జిల్లా SLBC టన్నెల్ పైకప్పు కూలిపోయిన ఘటన హృదయ విదారకమని, కార్మికుల క్షేమం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు..

రేపటి నుంచి(ఫిబ్రవరి 24) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై ఉన్న నిబంధనల్ని కట్టుదిట్టంగా అమలు చేయలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా, విజిటర్లు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక పాస్ లు జారీ చేశారు. భద్రతా కారణాల రీత్యా పాస్ లు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. అసెంబ్లీ, మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా వివిధ కలర్ కోడ్ లతో పాస్ లను జారీ చేశారు. అసెంబ్లీ గేట్ 1 నుంచి మండలి చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎంలకు మాత్రమే అనుమతి కల్పించనున్నారు.

ఎన్నికలను ఉదాసీనంగా తీసుకోవద్దు

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని శ్రీ కన్వేక్షన్ హల్ లో అర్బన్ మండల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ కార్యదర్శి విశ్వ నాథన్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే అది శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గత 15 నెలలుగా మనం చేసిన అభివృద్ధి పనులు పట్టభద్రుల ఎన్నికల్లో మన అభ్యర్థి నరేందర్ రెడ్డి నీ గెలిపించాలన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత తీసుకొని మండలంలో ఉన్న 800 కి పైగా ఓట్లు ఒక్కోక్కరుగా బాధ్యత తీసుకొని వాళ్ళని ప్రత్యక్షంగా కలిసి వారు కాంగ్రెస్ కి ఓటు వేపించే బాధ్యత మీదని, ఎన్నికలను ఉదాసీనంగా తీసుకోవద్దన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. ఒకసారి ఓటరు కాంగ్రెస్ ను కాదని ఓటు వేరే పార్టీకి వేస్తే ఆది మీకు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బంది వస్తదని, ఇది స్థానిక సంస్థల ఎన్నికల కొరకు రిహార్సల్ అనుకోండన్నారు. మీ ఊర్లో ఉన్న పట్టబద్రులు కాంగ్రెస్ వైపు తిప్పుకొని కాంగ్రెస్ కు ఓటు వేసేలా చేసే బాధ్యత స్థానిక నాయకులదని, బీజేపీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నదన్నారు. బీజేపీ ఒకనాటి రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు కేంద్ర మంత్రి వేములవాడకు నిధులు తీసుకొస్తా అన్నారు ఏం చేశారని, మేము వేములవాడ ఆలయ అభివృద్ధి,మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్య, సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్య లు పరిష్కారం చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటే హిందువుల పేరు మీద రెచ్చగొడుతున్నారని, దేశంలో ఎక్కడా లేనివిధంగా కులగల చేసి చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం కంకణం కట్టుకుంటే బీసీల్లో ముస్లింలు ఉన్నారని అంటుండన్నారన్నారు.

వ్యవసాయాన్ని సర్వ నాశనం చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు..

ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎంగా చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కరువు కాటకాలు వస్తాయని ఆరోపించారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పూర్తిగా తగ్గిపోతాయి.. ఇప్పుడు మిర్చి ధర పతనం అయ్యిందన్నారు. పెట్టుబడి పెరిగిపోయింది, ఉత్పత్తి తగ్గిపోయింది అని అధికారులు ముందే చెప్పారు.. అయినా సీఎం చంద్రబాబు పట్టించుకోలేదని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు జగన్.. మిర్చి రైతుల ఆవేదన తెలుసుకోవడానికి వస్తే గానీ ప్రభుత్వం మిర్చి రైతుల సమస్య గుర్తుకు రాలేదని దుయ్యబట్టారు. ఇప్పుడు చంద్రబాబు కొత్త నాటకం మొదలు పెట్టారు.. ఎప్పుడైనా కేంద్రం మిర్చి కొంటుందా? అని ప్రశ్నించారు. మిర్చి రైతులతో, ట్రేడర్లతో సమావేశాలు పెట్టి కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. ఒకప్పుడు లక్షలోపు మిర్చి పెట్టుబడులు ఉండేవి.. తెగుళ్లతో ఇప్పుడు రెండులక్షల పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని తెలిపారు. చంద్రబాబు వెంటనే మిర్చి రైతుకు మద్దతు ధర ప్రకటించాలి.. మార్క్‌ఫెడ్ ను ఎందుకు రంగ లోకి దించడం లేదని ప్రశ్నించారు. తాము మూడు వేల కోట్లు ధరల స్థిరీకరణ కోసం నిధి పెట్టాం.. ప్రభుత్వం మీన మేషాలు లెక్కపెట్టడం కాదు, మార్క్ ఫెడ్‌ను రంగంలోకి దించి, మిర్చి రైతులను ఆదుకోవాలని అంబటి రాంబాబు తెలిపారు. మ్యూజికల్ నైట్‌లు పెట్టుకుంటే వర్తించని ఎన్నికల కోడ్.. రైతులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వస్తే, ఎన్నికల కోడ్ అడ్డంకి వస్తుందా అని ప్రశ్నించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్ కు సెక్యూరిటీ తగ్గించారని అంబటి రాంబాబు తెలిపారు.

ఎస్‌ఎల్‌బీసీ ఘటన.. రంగంలోకి నేవీ ప్రత్యేక బృందం

తెలంగాణలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) టన్నెల్‌లో సంభవించిన ఘోర ప్రమాదం మరింత తీవ్రతను సంతరించుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సిబ్బంది టన్నెల్ లోపల చిక్కుకుపోవడంతో వారిని సురక్షితంగా బయటికి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోంది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), భారత సైనిక బృందాలు (Indian Army Teams) రంగంలోకి దిగాయి. ప్రమాద స్థితిని అంచనా వేసి రక్షణ చర్యలను మరింత వేగవంతం చేయడానికి సింగరేణి ఇంజినీర్ల బృందం (Singareni Engineers Team) కూడా టన్నెల్ వద్దకు చేరుకుంది. ప్రభుత్వం పరిస్థితిని తీవ్రంగా పరిగణిస్తూ వెంటనే సహాయక చర్యలను సమీక్షించడానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను అక్కడికి పంపింది. వారు అధికారులతో కలిసి రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష నిర్వహిస్తూ, తగిన సూచనలు అందిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలకు మరింత బలాన్ని చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించింది. ఈ విజ్ఞప్తి మేరకు భారత నావికాదళం (Indian Navy) ప్రత్యేక బృందం రంగంలోకి దిగేందుకు సిద్ధమైంది.

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు.. 92 శాతం హాజరు

ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ(ఫిబ్రవరి 23) నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఒక వైపు అభ్యర్థుల ఆందోళనలు మరో వైపు చివరి నిమిషం వరకు రాని స్పష్టత నడుమ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 175 సెంటర్లలో పరీక్షలు జరిగాయి. గ్రూప్-2 మెయిన్స్ కు 92 శాతం మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. మొత్తం 92,250 మంది అభ్యర్థుల్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నవారు 86,459 మంది ఉన్నారు. 80 వేలకు పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్టు సమాచారం.

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల ప్రాథమిక ‘కీ’ విడుదల..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఆదివారం నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షల ప్రాథమిక ‘కీ’ విడుదల చేసింది. రెండు పేపర్ల ‘కీ’ లు ఏపీపీఎస్సీ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రకటించింది. అభ్యర్థుల అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈ నెల 25 నుంచి 27 వరకు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లింక్ ద్వారా మాత్రమే పంపాలని ఏపీపీఎస్సీ సూచించింది. అలా కాకుండా వాట్సాప్, పోస్ట్, ఎస్ఎంఎస్, ఫోన్, నేరుగా వచ్చిన స్వీకరించబడవు అని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. గడువు తర్వాత అభ్యంతరాలు కూడా స్వీకరించబడవని ప్రకటనలో తెలిపింది. http://psc.ap.gov. in సైట్‌లో ఆన్ లైన్ ద్వారా మాత్రమే అభ్యంతరాలు స్వీకరిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది.

రాష్ట్రంలో యూరియా కొరత లేదు.. రైతులు ఆందోళన పడవద్దు

రాష్ట్రంలో యూరియా కొరతలేదని, రైతుల ఆందోళనకు గురికావద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. వ్యవసాయాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఈ వారంలో రాష్ట్రానికి మరో 81,800 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుందని తెలిపారు. గత యాసంగిలో రైతులు ఫిబ్రవరి 20 నాటికి 6.9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొనుగోలు చేయగా, ఈ సారి 8.80 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారని, గత సంవత్సరం ఫిబ్రవరిలో 1.99 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే, ఈ సంవత్సరం ఫిబ్రవరి 20 నాటికి 2.59 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారని పేర్కొన్నారు.