NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

నో ఫ్లై జాబితాలోనే ఖలిస్థానీ ఉగ్రవాదులు.. కెనడా కోర్టు కీలక తీర్పు

కెనడా ప్రభుత్వం విధించిన నో ఫ్లై జాబితా నుంచి తమ పేర్లు తొలగించాలంటూ ఇద్దరు ఖలిస్థానీ వేర్పాటువాదులు చేసిన అభ్యర్థనను కెనడాలోని ఫెడరల్ కోర్టు ఆఫ్ అప్పీల్‌ తిరస్కరించింది. ఇద్దరు కెనడియన్ సిక్కులు విమానాలు ఎక్కేందుకు 2018లో నిషేధం విధించింది. అయితే ఇద్దరూ రవాణా భద్రతకు ముప్పు కలిగిస్తారని.. ఉగ్ర చర్యకు పాల్పడతారన్న సహేతుకమైన కారణాలు ఉన్నాయన్న ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించి.. వారి అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది.

సీఎం చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమల రావు భేటీ

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డీజీపీ ద్వారకా తిరుమల రావు భేటీ అయ్యారు. బాపట్ల జిల్లా ఈపూరుపాలెం హత్య ఘటనపై ప్రాథమిక సమాచారాన్ని సీఎం చంద్రబాబుకు డీజీపీ ద్వారకా తిరుమల రావు వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి డీజీపీని ఆదేశించారు. త్వరలోనే పోలీస్ యంత్రాంగం ప్రక్షాళన ఉంటుందని డీజీపీకి సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కల్పించడమే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. మహిళల రక్షణకు హై ప్రయార్టీ ఇవ్వాలని డీజీపీకి ఏపీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈపూరుపాలెం ఘటనలో దోషులకు వెంటనే కఠిన శిక్ష పడేలా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

రైతులకు గుడ్‌ న్యూస్‌.. పంట రుణాల మాఫీకి గ్రీన్‌ సిగ్నల్‌

రుణమాఫీపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 9 2023లోపు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, మద్దతు ధరపై ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంది. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణతో పాటు విధివిధానాలను కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే.. ఈ పథకాలకు ఎవరెవరు అర్హులు అన్న దానిపై నిర్ణయం కూడా తీసుకోనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ ట్యాక్స్ చెల్లింపు దారులు రైతు రుణమాఫీ వర్తించే అవకాశం లేదు. ఇప్పటికే అధికారులు మహారాష్ట్ర, రాజస్థాన్ వెళ్లి అక్కడ అధ్యయనం చేసి నివేదిక సమర్పించారు అధికారులు. ఈ కేబినెట్ మొత్తం రైతులకు సంబంధించిన ప్రయోజనాలపైనే ఎక్కువగా చర్చించనున్నారు.

అసెంబ్లీకి సీఎం చంద్రబాబు.. నారా భువనేశ్వరి ఆసక్తికర ట్వీట్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టడంపై ఆయన సతీమణి భువనేశ్వరి సంతోషం వ్యక్తం చేశారు. ‘నేడు గౌరవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు! నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది.. ప్రజలకు ప్రణామం!’ అంటూ ట్వీట్ చేశారు. వైసీపీ హయాంలో తన కుటుంబ సభ్యులను అవమానించారంటూ శపథం చేసి వెళ్లిపోయారు చంద్రబాబు. ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగుపెడతానని ఆయన చెప్పారు. ఈ రోజు చంద్రబాబు అసెంబ్లీకి రావడంతో ఆయన సతీమణి భువనేశ్వరి సంతోషపడ్డారు. ఆనాడు చంద్రబాబు శపథం చేసిన వీడియోను ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఆమె చేసిన ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఎన్నికల తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గానికి వైయస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. రేపు(జూన్‌ 22న) పులివెందులకు వెళ్లనున్నారు వైఎస్‌ జగన్. రేపు ఉదయం ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి కడపకు చేరుకోనున్నారు. కడప విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు పయనం అవుతారు. ఐదు రోజులపాటు పులివెందులలోనే మకాం వేయనున్నారు వైఎస్‌ జగన్. సోమవారం తిరిగి విజయవాడకు వెళ్లనున్న వైఎస్ జగన్.

ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ ఎన్నిక కోసం ఇవాళ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరిగింది. అయితే టీడీపీ నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు. స్పీకర్‌ పదవి కోసం ఒకే ఒక నామినేషన్‌ రాగా.. గడువులోగా మరో నామినేషన్‌ దాఖలు కాలేదు. మరో నామినేషన్ రాకపోవడంతో అయ్యన్నపాత్రుడు ఎన్నిక ఏకగ్రీవం అని అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. అయ్యన్నపాత్రుడు తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ శుక్రవారం ఉదయం అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ల దాఖలుకు సాయంత్రం వరకూ గడువు ఉండగా.. గడువులోగా అయ్యన్న నామినేషన్ ఒక్కటే దాఖలైంది. దీంతో ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయింది. శనివారం ఏపీ శాసనసభాపతిగా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

ఈపూరుపాలెంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి

బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో యువతి సుచరిత అత్యాచారం, హత్య జరిగిన ఘటనా స్థలాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. సుచరిత కుటుంబ సభ్యులను హోం మంత్రి అనిత పరామర్శించి ధైర్యం చెప్పారు. పోలీసులను అడిగి ఘటన జరిగిన తీరు తెన్నులను అడిగి తెలుసుకున్నారు. నిందితులను త్వరితగతిన అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హోం మంత్రి అనిత హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్ గ్రేషియాను ఆమె ప్రకటించారు.

‘అంబేద్కర్ అభయహస్తం’ హామీని ప్రభుత్వం అమలు చేయాలి

వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్‌ అభయహస్తం కింద దళితులకు రూ.12 లక్షల సాయం ప్రకటించి ఇచ్చిన హామీని నెరవేర్చాలని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కెటి రామారావు డిమాండ్‌ చేశారు. దళితుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటే బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన దళిత బందు కంటే గొప్ప పథకాన్ని ప్రకటించాలి. దళితుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడం ద్వారా వారిని సంపన్నులుగా మార్చేందుకు, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా చంద్రశేఖర్ రావు దళిత బందును ప్రవేశపెట్టారు.

రేపు ఏపీలోని ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు

రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, వైయస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయాలని నిర్ణయించాం

తెలంగాణలో రైతు రుణమాఫీపై రాష్ట్రం కేబినెట్‌ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం భేటి అయ్యింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పినట్లు రూ.2లక్షల రుణమాఫీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8నెలల్లోనే అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఐదు సంవత్సరాల మధ్య కాలంలో రాష్ట్రంలో రైతులు తీసుకున్న రుణాల్లో.. 2 లక్షల రూపాయల వరకు రుణామాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయం దండగ కాదు.. పండగలా అనుకునే విధంగా సాగు రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ఒకే విడతలో మొత్తం రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం రెండుసార్లు రూ.21వేల కోట్లు రుణమాఫీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కటాఫ్ డేట్ 2018 డిసెంబర్ 11గా తీసుకుంది. అప్పటి నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తుందని సీఎం ప్రకటించారు.