NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఏఐ సాంకేతికతతో 60 ఏనుగుల ప్రాణాలు కాపాడిన లోకో పైలట్.. వీడియో వైరల్

అస్సాంలో ఓ లోకో పైలట్ తన తెలివి తేటలతో పెను ప్రమాదాన్ని కాపాడారు. వాస్తవానికి.. రైలు నంబర్ 15959 కమ్రూప్ ఎక్స్‌ప్రెస్ గౌహతి నుంచి లుమ్‌డింగ్‌కు వెళ్తోంది. రాత్రి 8:30 గంటల సమయంలో.. లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ అకస్మాత్తుగా 60 కంటే ఎక్కువ ఏనుగుల గుంపు రైల్వే ట్రాక్ గుండా వెళుతున్నట్లు చూశారు. ఏనుగుల గుంపును చూసిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. లోకో పైలట్ విజ్ఞత చూపకపోతే చాలా ఏనుగులు చనిపోయి రైలు కూడా ఢీకొనే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏనుగులన్నీ మెల్లగా రైల్వే ట్రాక్ దాటుతున్న దృష్యాన్ని వీడియోలో చూడొచ్చు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీకి అండగా రంగంలోకి దిగిన ఆర్ఎస్ఎస్..

మహారాష్ట్ర ఎన్నికలకు మరో నెల మాత్రమే సమయం ఉంది. నవంబర్ 20న ఎన్నికలు నిర్వహిస్తే, 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ‘‘మహాయుతి’’, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘‘మహావికాస్ అఘాడీ’’ మధ్య పోరు నెలకొంది. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కూటమి భావిస్తోంది. ఇటీవల హర్యానాలో ఎన్నికల్లో గెలుపు మహారాష్ట్ర బీజేపీలో కూడా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. అందరి కన్నా ముందుగా బీజేపీ 99 మందితో తన తొలి జాబితాను ఆదివారం విడుదల చేసింది.

ఇదిలా ఉంటే, హర్యానా ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ వర్క్ బీజేపీకి ఎలా కారణమైందో అందరికి తెలిసిన విషయమే. క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ సమావేశాలు, ప్రతీ ఇంటికి వెళ్లి ఓటర్లను కలిసిన విధానం అక్కడ ఫలితాలనే మార్చేశాయి. కాంగ్రెస్ తప్పకుండా గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ ఢంకా భజాయించి చెప్పినప్పటికీ, బీజేపీ మాత్రం ఘట విజయం సాధించింది. ఆ రాష్ట్రంలో మొత్తం 90 సీట్లలో 48 స్థానాలను బీజేపీ గెలవగా, కాంగ్రెస్ 37 స్థానాలు గెలిచి మరోసారి ప్రతిపక్షానికే పరిమితమైంది.

మూసీ బాధితులకు సీఎం రేవంత్ ఏం న్యాయం చేశారు

సిగ్గులేకుండా మల్లన్నసాగర్ నిర్వాసితులకు కేసీఆర్ అన్యాయం చేశారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని, మూసీ బాధితులకు సీఎం రేవంత్ ఏం న్యాయం చేశారన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2013 భూ సేకరణ చట్టం కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని, కాంగ్రెస్ తెచ్చిన భూ చట్టం కంటే మెరుగైన సహాయం మేము చేశామన్నారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఒక్క ఇల్లు అయిన కట్టించారా అని సీఎం రేవంత్ మాట్లాడుతున్నారని, ఒక్క గజ్వేల్ లొనే 3 వేలకు పైగా ఇల్లు కట్టి మేము నిర్వాసితులకు ఇచ్చామన్నారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నిర్వాసితులపై కాంగ్రెస్ నేతలు కపట ప్రేమ చూపిస్తున్నారని, మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్, 25 వేల రూపాయలు ఖర్చుకు ఇస్తున్నామని సీఎం రేవంత్ గొప్పలు చెబుతున్నారన్నారు హరీష్‌ రావు. మల్లన్న సాగర్ భూ సేకరణ చేసినప్పుడు పాత ఇంటికి రెండింతలు నష్ట పరిహారం ఇచ్చామని, దీని కోసం 694 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. ఇంటి యజమాని, భార్యకు 7 లక్షల 50 వేలు ఉపాధి కోసం ఇచ్చామని, ఇంట్లో 18 ఏళ్ళు దాటిన పెళ్లికాని వారికి ఉపాధి కోసం 5 లక్షల రూపాయలు ఇచ్చామన్నారు హరీష్‌ రావు. అందరికి ఇల్లు కట్టి ఇచ్చాము…పెళ్లి కాని వారికి కూడా 250 గజాల స్థలం ఇచ్చామని, ఖర్చులకు 30 వేల నుంచి 50 వేల రూపాయలు ఇచ్చామన్నారు. గజ్వేల్ నడిబొడ్డున డబుల్ రూమ్ ఇల్లు కట్టి ఇచ్చామని, మూసీ బాధితులకు కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు రేవంత్ ఇచ్చి గొప్పలు చెబుతున్నారన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరి విధానాలు ఒక్కటే

పోలీసులది దౌర్జన్య దమనకాండ కాంగ్రెస్ దురహంకారానికి నిదర్శనమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హిందూ నిరసనకారులపై లాఠీచార్జీ సహించరానిదని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇద్దరి విధానాలు ఒక్కటే అని కిషన్‌ రెడ్డి అన్నారు. అన్యమతస్థుల ప్రార్థనాలయాల్లో శబ్దాలు పోలీసులకు, సీఎంకు వినిపించవా? గుడిపక్కనే అంతమంది క్లాసుల పేరిట ఉంటే పోలీసులేంచేస్తున్నారు? వీకీపీడీయా, గూగూల్ ద్వారా సమాధానాలు రాయాలా? నిరుద్యోగులు, విద్యార్థులతో మాట్లాడరెందుకు? పరీక్షల్లో ఒకే విధానం ఎందుకు పెట్టలేదు? అని ప్రశ్నించారు కిషన్‌ రెడ్డి. నిరుద్యోగ యువకులు గత వారం రోజులుగా అశోక్ నగర్ లో నిరసన కార్యక్రమాలు చేపడితే సీఎం మాటలు చేతలు దాటుతున్నాయే తప్ప సచివాలయం గేటు దాటటడం లేదని, నిరుద్యోగ, రైతాంగ, పేదలకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలు, ఎన్నికలలో హామీలు ఏ ఒక్కటి సచివాలయం గేటు దాటడం లేదన్నారు కిషన్‌ రెడ్డి. దేవాలయంలో రక్తాభిషేకం చేస్తారా? నిరసనాకారులు టెర్రరిస్టులా? అని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి హిందూ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నారని, వినాయక చవితి, బోనాలు, దేవీ నవరాత్రుల సందర్భంగా అనేకమందిపై కేసులు పెట్టించారన్నారు. అన్యమతస్థులకు సంబంధించిన ప్రార్థన కేంద్రాల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వస్తున్న శబ్దాలు పోలీసులకు, ముఖ్యమంత్రికి వినబడవా? కనబడవా? అని కిషన్‌ రెడ్డి అన్నారు.

ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు పవన్ శుభవార్త..

ఏటికొప్పాక, కొండపల్లి కళాకారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభవార్త చెప్పారు. అంకుడు, తెల్ల పొణికి చెట్లు విస్తారంగా పెంపునకు ఆయన ఆదేశాలిచ్చారు. ఉపాధి హామీ పథకంలో అంకుడు, తెల్ల పొణికి పెంపునకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఏటికొప్పాక, కొండపల్లి పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ, అటవీ, సామాజిక స్థలాల్లో వీటి పెంపకంపై దృష్టి సారించాలని పవన్ తెలిపారు. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీదారులకు అవసరమయ్యే కర్ర లభ్యత కష్టంగా మారిందని, చెట్ల సంఖ్య క్రమంగా తగ్గుతోందని తన దృష్టికి రావడంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు పవన్ దిశానిర్దేశం చేశారు.

జీఓ 29తో నష్టం అనేది అపోహ మాత్రమే.. ఎవరికి నష్టం జరగదు

గ్రూప్ 1 పరీక్ష పై.. బీజేపీ.. బీఆర్‌ఎస్‌ కుమ్మక్కై లేనిపోని అనుమానాలు సృష్టిస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని, బీసీ బిడ్డగా.. నేను మీకు మాట.. భరోసా ఇస్తున్నానన్నారు. సెలక్షన్ ప్రక్రియలో ఎక్కడా.. రిజర్వేషన్‌ కేటగిరీకి అన్యాయం జరగదన్నారు. ఇది..మా పార్టీ ప్రభుత్వం నుండి ఇస్తున్న భరోసా అని, జీఓ 29తో నష్టం అనేది అపోహ మాత్రమే అని ఆయన వ్యాఖ్యానించారు. రిజర్వేషన్ కోటా ప్రకటించేటప్పుడు ఎవరికి నష్టం జరగదని, 75 శాతం వరకు ఎస్సీ.. ఎస్టీ అని, బీసీ విద్యార్థులే లాభ పడతారన్నారు మహేష్ కుమార్‌ గౌడ్‌. మీరు అపోహ పడకండి అని, మాక్కూడా ఉన్న అనుమానాలు మంత్రులతో మాట్లాడిన అని ఆయన వ్యాఖ్యానించారు. అన్ని అభిప్రాయాలు అధ్యయనం చేసిన తర్వాత మాకు క్లారిటీ వచ్చిందని, జీవో 29 కోర్టులో ఉన్న అంశం అని, విద్యార్దులు తొందర పడకండన్నారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ అన్నారు. బాగా పరీక్షలు రాయండని, మీకు అన్యాయం జరగదు..నేను భరోసా ఇస్తున్న అని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్.. మీ హయం లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు.. మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు అని ఆయన అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ

పంతాలు.. పట్టింపులకు పోకుండా 29 జీవోను ఉపసంహరించుకోవాలని, రేపు పరీక్షలని తెలిసి కూడా ఈరోజు కూడా ఆందోళనను కొనసాగిస్తున్నారంటే అర్ధం చేసుకోండి, నిరుద్యోగులంతా మీ కుటుంబ సభ్యులుగా భావించి వారి ఆవేదనను అర్ధం చేసుకోండి, గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయండని కేంద్రం మంత్రి బండి సంజయ్‌ అన్నారు. 29జీవో వల్ల గ్రూప్ 1 పరీక్షల్లో 5003 మంది ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులు అనర్హలయ్యారని, 563 పోస్టులకు గుండుగుత్తగా 1:50 చొప్పున అభ్యర్థులను ప్రకటించడం అన్యాయమన్నారు. ఈ మొత్తం పోస్టుల్లో 354 రిజర్వ్ పోస్టులు.. 29 జీవోవల్ల ఓపెన్ కేటగిరిలో అర్హత సాధించిన రిజర్వ్.. అభ్యర్థులను సైతం రిజర్వ్ కేటగిరీలో చేర్చడం అన్యాయమన్నారు. ఈ జీవోవల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులు 1:50 చొప్పున అర్హత సాధిస్తే…. ఓసీ వర్గాలు 1:65 శాతం మేరకు అర్హత సాధించారని, జీవో నెంబర్ 29 రాజ్యాంగ స్పూర్తికి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు వ్యతిరేకమన్నారు. గ్రూప్ 1 అభ్యర్థులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని, గ్రూప్ 1 పరీక్షలను రీషెడ్యూల్ చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారన్నారు బండి సంజయ్‌.. 29 జీవో వల్ల రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్ల వ్యవస్థనే రద్దు చేయబోతున్నారనే చర్చ మొదలైందని, తక్షణమే 29 జీవోను ఉపసంహరించుకోవాలన్నారు.

పర్యాటకులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం

పర్యాటకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అక్టోబర్ 26 నుంచి ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాంతంలో ప్రముఖ ఆధ్యాత్మిక దేవాలయాలు, పంచారామ క్షేత్రాలు సందర్శించేలా ఒక రోజు టూర్ ప్యాకేజీకి పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తుందని మంత్రి వెల్లడించారు. అసెంబ్లీలో శాసనసభ్యుల సూచనల మేరకు ప్రణాళిక సిద్ధం చేశామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. భక్తులకు ఆధ్యాత్మిక సాంత్వనను అందించేందుకు 6 పుణ్య క్షేత్రాలతో ఆధ్యాత్మిక యాత్ర చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.

సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన హైదరాబాదీ.. సాయం కోసం ఎదురుచూపులు

సుమారు ఓ 50 ఏళ్లకు దగ్గరలో వయసున్న వ్యక్తి.. పైగా వికలాంగుడు.. రెండేళ్లుగా సౌదీ అరేబియాలోని రియాద్‌లో చిక్కుకుపోయాడు. దిక్కూ మొక్కు లేక దేశం కాని దేశంలో ఇరుక్కుపోయి ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. దయనీయమైన అతని కన్నీటి గాథకి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నగరానికి చెందిన సయ్యద్ హాజీ స్వతహాగా వికలాంగుడు. ఉమ్రా , హజ్ తీర్థయాత్ర చేయడానికి తీసుకెళ్తామంటే గుడ్డిగా నమ్మేశాడు. కానీ అతనికి అలా చెప్పి తీసుకెళ్లిన ఏజెంట్ల ద్వారా మోసపోయాడు. ఉమ్రా అంటే ఓ ఏడాది కాలంలో ముస్లింలు ఎప్పుడైనా మక్కా తీర్థయాత్ర చేస్తే దానిని ఉమ్రా అంటారు. అయితే.. అతనిని ఉచితంగా ఉమ్రా తీర్థయాత్ర చేయడానికి తీసుకెళ్తానని, తిరిగి మళ్లీ తీసుకువస్తామని ఏజెంట్లు వాగ్దానం చేసినట్లు వికలాంగుడైన సయ్యద్ హాజీ ఆరోపిస్తున్నాడు. ఉమ్రా పూర్తయిన తర్వాత వారు అతడిని సౌదీ అరేబియాలోని రియాద్‌కు తీసుకెళ్లి పని చేయమన్నారని చెబుతున్నాడు. ఈ క్రమంలో ఒక హోటల్‌లో పని కోసం ఉన్నప్పటికీ తన ఆరోగ్య పరిస్థితుల కారణంగా చేయలేనని నిర్ణయించుకుని తిరిగి ఇండియా రావాలని భావించాడు.

తన భార్య రోజూ మద్యం తాగుతూ.. తనతో కూడా బలవంతంగా తాగిస్తుందని భర్త ఆవేదన..

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ వింత కేసు వెలుగు చూసింది. మహిళా పోలీస్ స్టేషన్‌లో నడుస్తున్న ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌లో భార్యాభర్తల మధ్య గొడవ జరగడానికి గల కారణాన్ని విని అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. ఓ వ్యక్తి తన భార్య తనకు బలవంతంగా తాగించిందని ఆరోపించాడు. భార్య ఒత్తిడికి విసిగిపోయిన భర్త తన భార్యను ఆమె తల్లి వద్ద వదిలిపెట్టాడు. ఈ విషయమై భార్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు భార్యాభర్తలను కుటుంబ సలహా కేంద్రానికి తరలించారు.

 

Show comments