NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ముగిసిన రెండో రోజు ఆట.. భారత్ ఆధిక్యమెంతంటే..?

బంగ్లాదేశ్‌తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్ (33*), రిషబ్ పంత్ (12*) ఉన్నారు. భారత్ 308 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. యశస్వీ జైస్వాల్ (10), రోహిత్ శర్మ (5) పరుగులకే ఔటయ్యారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (17) పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో నహీద్ రానా, టస్కిన్ అహ్మద్, మెహిదీ హసన్ మిరాజ్ తలో వికెట్ పడగొట్టారు.

శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం.. కర్ణాటక సర్కారు సంచలన నిర్ణయం

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల లడ్డూ.. వెంకన్న భక్తులకు ఎంతో పవిత్రమైంది. అయితే ఇప్పుడు ఆ లడ్డూ వివాదాస్పదం అయింది. లడ్డూ తయారీలో నెయ్యి కాంట్రవర్సీకి కారణమైంది. తిరుమల లడ్డూ జంతువుల కొవ్వుతో తయారయిందన్న కామెంట్ కలకలం రేపింది. నెయ్యి నాణ్యతను ఎత్తి చూపుతున్న అధికారపక్షం, ఎలాంటి విచారణకైనా సిద్ధమంటున్న ప్రతిపక్షం తీరు భక్తకోటిని గందరగోళానికి గురి చేస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటక రాష్ట్రంలోని ఆలయాల్లో ప్రసాదాల తయారీకి నందిని నెయ్యిని మాత్రమే వినియోగించాలని కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కర్ణాటకలోని ప్రధాన ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతను తరచూ పరిశీలన జరుపుతుమన్నారు.

విదేశాల్లో భారత పరువు తీస్తున్న కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై పీఎం మోడీ..

రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటనలో చేసిన వ్యాఖ్యలు భారతదేశంలో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ నేతలు తమ విదేశీ పర్యటనల సందర్భంగా దేశాన్ని అవమానించే వ్యాఖ్యలు చేశారని శుక్రవారం ఆరోపించారు. ‘‘నేటి కాంగ్రెస్‌లో దేశభక్తి స్పూర్తి చచ్చిపోయింది. నేటి కాంగ్రెస్‌లో ద్వేషం అనే దెయ్యం ప్రవేశించింది. పరాయి గడ్డపై కాంగ్రెస్ వాళ్ళ భాష, వారి దేశ వ్యతిరేక ఎజెండా, సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం, దేశ సంస్కృతిని అవమానించడం గురించి మాట్లాడటం చూడండి – ఇది ‘‘తుక్డే తుక్డే గ్యాంగ్’’, ‘‘అర్బన్ నక్సల్స్’’ కి చెందినవారు నడుపుతున్న కాంగ్రెస్. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం గణేషుడి విగ్రహాన్ని పోలీస్ వ్యాన్‌లో ఎలా ఉంచిందో చూశాం.’’ అని మహారాష్ట్ర వార్ధాలో జరిగిన జాతీయ ప్రధానమంత్రి విశ్వకర్మ కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు.

సింగరేణి కార్మికులకు సీఎం శుభవార్త.. దసరాకు రూ.లక్షా 90 వేల బోనస్

సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దసరా పండుగకు ముందుగానే సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే లాభాల్లో వాటా కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సింగరేణిది కీలక పాత్ర అని.. లాభాల్లో వాటాను దసరా ముందు కార్మికులకు అందిస్తున్నామన్నారు. కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1.90 లక్షల చొప్పున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోనస్‌ ప్రకటించారు. దసరా ముందు లాభాల్లో వాటా పంచి కార్మికుల కుటుంబాల్లో ఆనందం చూడాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఇందుకోసం రూ.796 కోట్లు కేటాయించామన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రతిపాదన మేరకు సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటిస్తున్నామన్నారు.

పాకిస్థాన్ ఆర్మీపై తెహ్రీక్-ఏ-తాలిబాన్ భారీ ఉగ్రదాడి.. ఆరుగురు సైనికులు మృతి

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆరుగురు పాక్ సైనికులు మరణించారు. రాత్రి అకస్మాత్తుగా జరిగిన ఈ ఉగ్రదాడిలో దాదాపు 11 మంది సైనికులు గాయపడినట్లు సమాచారం. ఈ దాడుల్లో 12 మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఈ దాడికి పాల్పడింది. దాడి అనంతరం పాక్ ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో గురువారం రాత్రి ఈ దాడి జరిగింది. ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ప్రకటించింది. ఆర్మీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ వజీరిస్థాన్ జిల్లాలోని లాధా తహసీల్‌లోని మిష్టా గ్రామంలోని భద్రతా పోస్ట్‌పై టిటిపి ఉగ్రవాదుల బృందం దాడి చేసింది. ఈ ఘటనలో ఆరుగురు భద్రతా సిబ్బంది మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు ఆర్మీ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారిక వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ ప్రాంతంలో టీటీపీ.. ఇంతకుముందు కూడా భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులకు పాల్పడింది. ఇదిలా ఉంటే.. శుక్రవారం దక్షిణ వజీరిస్థాన్‌లోని వార్సాక్ ప్రాంతంలో జరిగిన మరో ఘటనలో ఏడుగురు ఉగ్రవాదులు మరణించగా, ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.

కాళేశ్వరం ఖర్చే రూ.93వేల కోట్లు.. రూ. లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగింది.?

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐఎస్‌)పై కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందని మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌, ఇతర జలాశయాలు నిరూపిస్తున్నాయని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు . “కేఎల్‌ఐఎస్ విఫలమైతే నీటిపారుదల శాఖ 21 టీఎంసీల నీటిని మల్లన్న సాగర్‌లోకి ఎలా పంపుతుంది? అని హరీశ్ రావు ప్రశ్నించారు. శుక్రవారం మల్లన్న సాగర్‌ను సందర్శించేందుకు ఎమ్మెల్సీలు పి వెంకట్రామిరెడ్డి, డాక్టర్‌ వి యాదవరెడ్డి, దేశపతి శ్రీనివాస్‌, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితర నేతలు మల్లన్న సాగర్‌ను సందర్శించారు.

దీపావళికి ఆడబిడ్డలకు ఉచిత గ్యాస్.. అన్నీ హామీలను నెరవేరుస్తాం..

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో అర్హులైన 200 మందికి ఇళ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. భూసేకరణ చేయాలని అధికారులను ఆదేశిస్తున్నామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అయ్యింది.. మీటింగ్ పెట్టాలనుకుంటే ఒక లక్ష మందితో పెట్టొచ్చు.. ప్రజలను చూడటానికి వచ్చా తప్ప.. ఆర్భాటాలు.. హంగుల కోసం కాదని సీఎం చంద్రబాబు అన్నారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ఆర్భాటంలో లేనన్నారు. మళ్ళీ నేనైతేనే గాడితప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతానని అవకాశం ఇచ్చారన్నారు. 93 శాతం సీట్లు మాకు ఇచ్చారని, రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలని తనకు ఓట్లు వేశారన్నారు. రాష్ట్రం వెంటిలేటర్ మీద ఉందన్నారు. 21 మంది ఎంపీలను ఇచ్చి కేంద్రంలో మన పరపతి పెంచారన్నారు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని.. లక్ష కోట్ల వడ్డీలు కట్టకపోతే రాష్ట్రం పరువు పోతుందన్నారు. ఏడు వైట్ పేపర్లు పెట్టి.. వాస్తవాలు అందరి ముందు ఉంచానన్నారు. ఒక్కొక్క సమీక్ష చూస్తుంటే భయం వేస్తోందన్నారు. కేంద్ర నిధులు కూడా లెక్క పత్రం లేకుండా పక్కదారి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీవారి లడ్డూ వివాదంపై పవన్‌ కల్యాణ్ ఫస్ట్ రియాక్షన్..

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా స్పందించారు. శ్రీవారి లడ్డూ కల్తీ గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు ఆయన అన్నారు. స్వచ్ఛమైన నెయ్యి ధర ఎక్కువ ఉంటుందన్న పవన్‌ కల్యాణ్‌.. తక్కువ ధరకు వస్తుందని ఎలా కొంటారని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా దేవాలయాలకు సంబంధించిన సమస్యలను పరిశీలించేందుకు ‘సనాతన ధర్మ రక్షణ బోర్డు’ను ఏర్పాటు చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం కోరారు. తిరుమలలో కొనసాగుతున్న లడ్డూ వివాదంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయం దేవాలయాల అపవిత్రత, దాని భూ సమస్యలు, ఇతర ధార్మిక పద్ధతుల చుట్టూ ఉన్న అనేక సమస్యలను సూచిస్తుందన్నారు.

ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్‌కు  శ్రీకారం చుట్టిన జీహెచ్ఎంసీ

ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ కు  జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈ రోజు 14 విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది ముఖాన్ని మొబైల్ బేస్డ్ యాప్ లో క్యాప్చర్ చేసింది ఐటీ విభాగం.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ పై ఫేషియల్ అటెండెన్స్ పనిచేయనుంది. 39 విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది హాజరు కు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్‌కు సిద్ధం చేస్తోంది జీహెచ్ఎంసీ. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టంను ఏప్రిల్, 2024 నుండి అమలు చేస్తున్నారు.. పారదర్శక, కచ్చితత్వంతో కూడిన హాజరు నమోదుకు తోడ్పడుతుందని GHMC నిర్ణయం తీసుకుంది. ఉద్యోగి కార్యాలయానికి వచ్చిన సమయం, వెళ్లిన సమయాల తో సహా నమోదవ్వనుంది. కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలతో రెండు గేట్ల ప్రవేశ ద్వారాల వద్ద క్యాప్చుర్ చేసే కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అమర్చిన కెమెరా లో ఫోటో క్యాప్చర్ చేసి ఎంప్లాయ్ ఐడి నెంబర్ అటెండెన్స్ సమయం నమోదు అయ్యేలా ఏర్పాటు చేశారు.

ఏపీలో అక్టోబర్ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

అక్టోబర్‌ 1 నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. 10 జిల్లాల జాయింట్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించామన్నారు. జేసీలు, డీఎస్వోలతో మంత్రి మరోసారి భేటీ కానున్నారు. ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లపై చర్చించనున్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతులు ఖాతాల్లోకి డబ్బులు చెల్లిస్తామన్నారు. ముందస్తుగా పెద్ద సంఖ్యలో లారీలను సిద్ధం చేశామన్నారు. ప్రతి వాహనానికి జీపీఎస్ అనుసంధానం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పంట నష్టం, తడిచిన ధాన్యానికి సంబంధించి విధి విధానాలు రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. రైతు నష్టపోకుండా పండించిన ప్రతి గింజ కొంటామన్నారు. వైసీపీ ప్రభుత్వం 100 రోజుల్లో ఎన్ని పథకాలు అమలు చేసిందని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం పెండింగులో పెట్టిన రూ. 1700 కోట్ల నిధులను రైతులు ఖాతాల్లో వేశామన్నారు. ఐదేళ్లల్లో వైసీపీ పరిపాలన గురించి ఒక్కరోజు కూడా గర్వంగా చెప్పుకోలేకపోయారన్నారు. మా వంద రోజుల పరిపాలనను ప్రజలు గమనించారని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.