NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

మొదటి రోజు ముగిసిన ఆట.. భారీ స్కోర్‌ దిశగా భారత్‌

చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. కాగా.. హోంగ్రౌండ్‌లో అశ్విన్ సెంచరీతో చెలరేగాడు. 108 బంతుల్లో శతకం సాధించాడు. ప్రస్తుతం క్రీజులో జడేజా (86*), అశ్విన్ ఉన్నారు. తొలి రోజు ఆటలో ముగ్గురు ఆటగాళ్లు అర్ధ సెంచరీలు చేశారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముగ్గురు బ్యాటర్లు స్వల్ప స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. 88 పరుగుల వద్ద రోహిత్ శర్మ (6), శుభ్‌మన్ గిల్ (0), విరాట్ కోహ్లీ (6) రన్స్‌కే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత.. రిషబ్ పంత్ (39) పరుగులు చేసి ఔటయ్యాడు. నాలుగో వికెట్‌కు జైస్వాల్‌తో కలిసి పంత్ అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం.. యశస్వి జైస్వాల్‌కు మద్దతుగా కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చాడు. యశస్వి జైస్వాల్ 95 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. 144 పరుగుల స్కోరు వద్ద యశస్వి రూపంలో భారత్‌ ఐదో వికెట్ కోల్పోయింది. యశస్వి 56 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ 16 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా, అశ్విన్ బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం నెలకొంది. ఆ తర్వాత.. అశ్విన్ 108 బంతుల్లో సెంచరీ సాధించాడు. వీరిద్దరి మధ్య 227 బంతుల్లో 195 పరుగుల భాగస్వామ్యం ఉంది. బంగ్లాదేశ్‌ తరఫున హసన్‌ మహమూద్‌ నాలుగు వికెట్లు తీశాడు.

సీఎం రిలీఫ్ ఫండ్కు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం..

ఓవైపు భారీ వర్షాలు.. మరోవైపు కృష్ణానదిలో వరద. ఇంకో వైపు బుడమేరు కాలువకు గండ్లు పడడంతో విజయవాడ అతలాకుతలం అయ్యింది. ఇక, రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో తీరని నష్టాన్ని మిగిల్చాయి వరదలు. అయితే.. వరద బాధితులకు విరాళాలు ఇవ్వడానికి ప‌లువురు దాత‌లు ముందుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వం.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో స్పందించిత‌న దాత‌లు, ప్రముఖులు, పారిశ్రామిక, వ్యాపార‌, విద్యా, వాణిజ్య సంస్థల‌కు చెందిన వారు సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు విరాళాలు అందించారు.

ఏపీలో ఉన్నట్లు కౌలు రైతు ఒప్పందాలు తెలంగాణలో లేవు

ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో ప్రపంచ ఆహార సదస్సులో తెలంగాణ స్టాల్ ఏర్పాటు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. సదస్సుకు హాజరైన వ్యాపారవేత్తలకు తెలంగాణా లో ఉన్న అవకాశాలను వివరించా అని, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ, పారిశ్రామిక విధానం గురించి వివరించి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కొత్తగూడెం లో ఎయిర్‌పోర్టుల విషయంలో వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కోరానని, కొత్తగూడెం విమానాశ్రయం కోసం భూమి కేటాయింపు జరిగినా ముందడుగు పడలేదన్నారు మంత్రి తుమ్మల. ఖమ్మం జిల్లా వరదల గురించి శివరాజ్ సింగ్ చౌహాన్ తో చర్చించానని, ఆయన కళ్ళారా చూశారు. అందుకే తగిన మొత్తంలో కేంద్రం నుంచి సహాయం అందజేయాలని కోరానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నివేదిక రాగానే త్వరగా సహాయం అందిస్తామని చెప్పారని, ఆయిల్ పామ్ మీద ఇంపోర్ట్ డ్యూటీ విధిస్తేనే ఆ పంట సాగు చేసే రైతులకు ప్రయోజనం ఉంటుందని చెప్పాననన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.

మంచి విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి… ఆనంద్‌ మహీంద్ర ప్రశంసలు

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కీలక అంశాలను పారిశ్రామికవేత్తలకు వివరించారు అధికారులు. స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకు ప్రభుత్వం తరపున రూ.100 కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు. ఎవరికి తోచిన విధంగా వారు వివిధ రూపాలలో యూనివర్సిటీ నిర్వహణకు సహకారం అందించాలని సీఎం రేవంత్‌ రెడ్డి కోరారు. అంతేకాకుండా.. ఈ ఏడాది నుంచే స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించే పలు కోర్సుల వివరాలను పారిశ్రామికవేత్తలకు అధికారులు వివరించారు. తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన గొప్పదని ఆనంద్ మహీంద్రా కొనియాడారు. మంచి విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ప్రశంసలు కురిపించారు. అందుకే యూనివర్సిటీ బోర్డు చైర్మన్ గా ఉండాలని ఆయన కోరగానే ఒప్పుకున్నానన్న ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.

రాహుల్ గాంధీ వదిలిన బీసీ బాణాన్ని నేను

రాహుల్ గాంధీ వదిలిన బీసీ బాణాన్ని నేను అని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఉత్తర భారతదేశంలో అగ్రవర్ణాలకు ధీటుగా కుల గణన జరగాలని దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు న్యాయం జరగాలని భారత్ జోడో నుండి చాటుతున్న మహనుభావుడన్నారు. అందుకే చంపేస్తామని బెదిరిస్తున్నారని, బీసీ ల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు మహేష్‌ కుమార్‌ గౌడ్‌. రాహుల్ గాంధీ చెప్పినట్టు జిస్కి జిత్ని అబాధి , ఉస్కి ఉత్ని బాగేదారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో brs ఎందుకు 42 శాతం నుండి 23 శాతం కు బీసీ కోటా తగ్గించారు..ముందు సమాధానం చెప్పాలన్నారు మహేష్‌ కుమార్ గౌడ్‌. దమ్ముంటే ఒక బీసీ బిడ్డను మీ రాష్ట్ర అధ్యక్షునిగా చేసే దమ్ము ఉందా అని, బీజేపీ బండి సంజయ్ ఆక్టీవ్ గా పనిచేసే బీసీ ను ఎందుకు తొలగించారన్నారు.

చంద్రబాబు వచ్చారు.. జనాన్ని వరదల్లో ముంచారు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. వంద రోజుల చంద్రబాబు పాలనలో ఆరుసార్లు క్యాబినెట్ సమావేశమైనా.. ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని విమర్శించారు. పన్నులు వేయటం, జనాన్ని పీక్కుతినటం తప్ప మరేమీ లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు వచ్చారు, పన్నులు పెంచారు.. చంద్రబాబు వచ్చారు, జనాన్ని వరదల్లో ముంచారు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులు ఇలా ఉంటే మాది‌ మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అంబటి రాంబాబు దుయ్యబట్టారు. అమ్మకు వందనం పేరుతో మహిళలను మోసం చేసినందుకా మీది మంచి‌ ప్రభుత్వమా..? వాలంటీర్లను నిలువునా మోసం చేసిన మీది మంచి ప్రభుత్వామా?.. వరదల్లో జనాన్ని ముంచినందుకు‌ మంచి ప్రభుత్వమా?.. లిక్కర్ తో జనాన్ని తాగించబోతున్నందుకు మంచి ప్రభుత్వమా?.. ఇసుక దోపిడీ చేస్తున్నందుకు మీది మంచి ప్రభుత్వమా?.. అని ప్రశ్నించారు. జనమంతా మీది ముంచే ప్రభుత్వం అంటుంటే చంద్రబాబు మాత్రం డబ్బాలు కొట్టుకుంటున్నారని అంబటి రాంబాబు తెలిపారు.

రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో లాభాలు లేవటా.. అందుకే డ్రగ్స్ అమ్ముతున్నారు..!

మాదాపూర్‌లో డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. బెంగళూరు నుంచి తీసుకువచ్చిన ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీన పరుచుకున్నారు అధికారులు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నప్పటికీ లాభాలు లేకపోవడంతో డ్రగ్స్ అమ్మకాలు మొదలుపెట్టినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. పెద్ద మొత్తంలో లాభాలు గడించాలని డ్రగ్స్ అమ్మకాలకు తెరలేపారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. ఈ నేపథ్యంలోనే.. నిందితులు దత్తి లితిన్, పడాల అభిరామ్ నాయుడు, కొడాలి ఏ మార్ట్ లను పోలీసులు అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం, హోటల్ మేనేజ్మెంట్, చిరు ఉద్యోగం చేస్తున్న ముగ్గురు యువకులు వస్తున్న ఆదాయాన్ని సరిపోవడం లేదని ఒకటికి మూడింతలు లాభాలు గడించాలని పక్క దారిలో నడుస్తూ డ్రగ్స్ అమ్మకాలు చేస్తూ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడి కటకటాల పాలైన ముగ్గురు వ్యక్తుల ఉదాంతం ఇది అని పోలీసులు వివరించారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ప్రాంతంలో డ్రగ్స్ అమ్ముతున్నారని సమాచారం మేరకు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ కాపు కాసి డ్రగ్స్ అమ్మకాలకు ప్రయత్నిస్తున్న ముగ్గురు వ్యక్తులనుపట్టుకున్నారు. ఈ ముగ్గురి వద్ద 5.77 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తో పట్టుబడిన వారిలో. దత్తి లితిన్, పడాల అభిరామ్ నాయుడు, కొడాలి ఏ మార్ట్ ఉన్నారు. వీరిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. బెంగళూరు నుంచి దిగుమతి చేసే మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.

2019లో ఏకలవ్య గురుకుల పాఠశాల ఏర్పాటు చేశాం

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల దుమాల  గ్రామంలో ఏకలవ్య గురుకుల పాఠశాలను బండి సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా 10 తరగతి విద్యార్థినిలతో మమేకమై మాట్లాడారు బండి సంజయ్‌. విద్యార్థినులతో పై చదువులు చదివిన తర్వాత మీరు  ఏమవుతారు అని అడుగగా టీచర్, ఐఏఎస్, ఐపీఎస్ అవుతానని సమాధానం చెప్పిన విద్యార్థులు. ఒక్కొక్క విద్యార్థినిపై కేంద్ర ప్రభుత్వం ఒక సంవత్సరానికి 1 లక్ష 9 వేల రూపాయలు ఖర్చు చేస్తుందని విద్యార్థినులకు తెలిపారు బండి సంజయ్. 2019 లో ఏకలవ్య గురుకుల పాఠశాల ఏర్పాటు చేశామని, ఎస్టీ సామాజిక వర్గానికి వారు ఉన్నత చదువులు చదివి వారికున్న లక్ష్యాలను నెరవేర్చాలని సంకల్పంతో ఏకలవ్య గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేశామని బండి సంజయ్‌ తెలిపారు.

జనసేనలోకి ఎమ్మెల్సీ తోట జంప్..!?

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. సామినేని ఉదయభాను ద్వారా జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తోట త్రిమూర్తులు, సామినేని ఉదయభాను వరుసకు వియ్యంకులు.. తోట త్రిమూర్తులు తనతో పాటు వస్తారని జనసేన పెద్దలకు సామినేని చెప్పినట్లు సమాచారం. అయితే.. తోట చేరికకు జనసేన నుంచి ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతానికి మూడు పార్టీలకు అనుకూలంగా నేతలను చేర్చుకుంటున్నారని సమాచారం. గత వారం జగన్ పిఠాపురం పర్యటనకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దూరంగా ఉన్నారు. దీంతో.. పార్టీ మారుతారన్న వార్తలు వస్తున్నాయి.

కూటమి నేతలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా..- బాలినేని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ ముగిసింది. దాదాపు గంటకు పైగా వీరిద్దరూ చర్చించారు. పవన్‌తో భేటీ అనంతరం మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిశానని.. పవన్ కళ్యాణ్ తనను పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. త్వరలో మంచిరోజు చూసి పార్టీలో చేరతాను.. ఒంగోలులోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరుతానని చెప్పారు. ఒంగోలులో తనతో పాటు పలువురు నేతలు జనసేనలో చేరతారన్నారు. వైఎస్ ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వచ్చానని.. వైఎస్ఆర్ మరణానంతరం మంత్రి పదవిని వదిలి జగన్ వెంట నడిచానని బాలినేని అన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబానికి అండగా ఉండటం కోసమే రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చానని చెప్పారు. తనతో పాటు 17 మంది రాజీనామాలు చేసి జగన్ వెంట నడిచారు.. అందరూ రాజీనామాలు చేసి అధికార పక్షాన్ని వదిలి ప్రతిపక్షంలోకి వచ్చామని పేర్కొన్నారు.