NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

గ్రూప్‌-1 మెయిన్‌ అభ్యర్థులకు షాక్‌.. పరీక్షలకు లైన్‌ క్లియర్‌..!

తెలంగాణలో గ్రూప్-1 అభ్యర్థులు, సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసి పరీక్షలను రీషెడ్యూల్ చేయాలని హైకోర్టును ఆశ్రయించినప్పటికీ, డివిజన్ బెంచ్ ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు, కోర్టు అభ్యర్థులకు షాక్ ఇచ్చింది, ముఖ్యంగా ఈ నెల 21 నుంచి 27 వరకు జరగబోయే పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. అంతేకాక, కోర్టు చివరి నిమిషంలో పరీక్షలను రద్దు చేయడం సాధ్యం కాదని, 8 మంది పిటిషనర్ల కోసం లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందుల్లో పడడం ఏమిటని ప్రశ్నించింది. ఇప్పటికే రెండు సార్లు పరీక్షలు రద్దు కావడంతో, నిరుద్యోగులు ఈ పరీక్షలకు ఎంతో ఎదురుచూస్తున్నారని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ గ్రూప్-1 పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరవుతుండగా, రాష్ట్రవ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద కఠిన బందోబస్తు ఏర్పాటు చేయబడుతుందని కూడా సమాచారం అందించారు.

మూసీని మురికి కూపంగా మార్చిన పాపం.. కాంగ్రెస్, టీడీపీలదే

మూసీ ప్రక్షాళన పై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, సీఎం రేవంత్ రెడ్డి చేసిన అర్థరహిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు పవర్ పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మూసీపై అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారన్నారు. ఢిల్లీకి‌ మూటలు పంపటం కోసమే ముఖ్యమంత్రికి మూసీపై ప్రేమ అని, నోట్ల రద్దు సమయంలో మోడీ మాటలు మార్చినట్లు.. మూసీపై రేవంత్ రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. మూసీ సుందరీకరణ అనే పదం మాట్లాడిందే మొదట రేవంత్ రెడ్డి అని, లక్షన్నర కోట్లు ఖచ్చు చేస్తామని చెప్పింది కూడా రేవంత్ రెడ్డినే అని కేటీఆర్‌ అన్నారు. మూసీపై ప్రభుత్వం అస్సలు సర్వేనే చేయలేదని, తన చేసిన పాపం బయటకి రావటంతో ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పడ్తున్నాయన్నారు. గ్రాఫిక్స్ మాయాజాలంతో రేవంత్ అబద్దాలు చెప్పారని కేటీఆర్‌ మండిపడ్డారు.

ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 26వ తేదీ నుంచి తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిసారి కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించామన్నారు. సాధారణ సభ్యత్వ రుసుము ఎప్పటిలాగా రూ.100 ఉంటుందని.. ఈ ఏడాది నుంచి కొత్తగా లైఫ్ టైం సభ్యత్వాన్ని ప్రవేశపెడుతున్నాం.. దీని రుసుము రూ.1,00,000 గా నిర్ణయించామన్నారు. మెంబర్ షిప్ ఉన్న వారు చనిపోతే అందించే ఇన్సూరెన్స్‌ను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నామన్నారు. చనిపోయిన కార్యకర్తలకు రూ.10 వేలు మట్టి ఖర్చులు ఇస్తామన్నారు. గతంలో ఇన్స్యూరెన్స్ రాని 73 మందికి రెండు లక్షల చొప్పున ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. ప్రమాద బీమా కింద ఇప్పటి వరకు రూ.102 కోట్లు, సహజ మరణం, ఇతర సమస్యలకు రూ.18 కోట్లు సాయంగా అందించామన్నారు. విద్యార్థుల చదువు కోసం రూ.2 కోట్ల 35 లక్షలు అందించామని సీఎం చంద్రబాబు తెలిపారు. లీడర్‌, క్యాడర్‌, ఎంపవర్‌మెంట్‌ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు పోలీస్ కస్టడీ

మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు పోలీస్ కస్టడీ విధిస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన మహిళ హత్య కేసులో రిమాండ్ ఖైదీ నందిగం సురేష్‌ ను పోలీస్ కస్టడీకి ఇస్తూ మంగళగిరి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రేపటి నుండి రెండు రోజులపాటు పోలీస్ కస్టడీలో విచారణ జరగనుంది. మహిళ హత్యకేసులో నందిగం సురేష్‌ను పోలీసులు ప్రశ్నించనున్నారు. రేపు ఉదయం 11:30 నుండి సోమవారం మధ్యాహ్నం 12:30 గంటల వరకు కస్టడీలోకి తీసుకుని మహిళ హత్య కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పోలీసులు విచారించనున్నారు. కాగా, 2020 డిసెంబర్‌లో రెండు సామాజిక వర్గాల మధ్య గొడవలు జరిగడంతో.. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్న ఘటనలో మరియమ్మ అనే మహిళ మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా అప్పట్లో తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. అయితే, ఈ కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను 78వ నిందితుడిగా తుళ్లూరు పోలీసులు చేర్చారు.

నలుగురు అంతరాష్ట్ర గంజాయి ముఠా సభ్యులు అరెస్ట్

ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ పరిధిలో నలుగురు అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి మీడియా సమావేశం లో ఏర్పాటుచేసి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెల లో తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో మహారాష్ట్రతో అనుసంధానంగా ఉన్న లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద భారీ ఎత్తున గంజాయి పట్టుబడిన సందర్భంలో ఈ నిందితులు ఆ కేసులో మిగిలినవారుగా ఉండడం, అదేవిధంగా ఆ గంజాయి తరలించే క్రమం లో వాహనానికి ముందు ఒక వాహనంలో ఉంటూ గంజాయి పోలీసులకు లభ్యం కాకుండా ఫోన్ ద్వారా సంభాషిస్తూ ఉండడం జరిగిందని తెలిపారు.

మంత్రి లోకేష్‌కు మంత్రి సత్యకుమార్ యాదవ్ వినతి

మంత్రి లోకేష్‌కు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఓ విజ్ఞప్తి చేశారు. రాయలసీమలో మహిళలకు ప్రత్యేక ఇంజనీరింగ్ కళాశాల కోసం విద్యా మంత్రి లోకేష్‌ను మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం తెలుగు వారి కోసం అంతర్జాతీయంగా అనేక సాంకేతిక అవకాశాలను అందిపుచ్చుకుని అద్భుతాలు సాధించిందన్నారు. ప్రస్తుతం మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో పయనిస్తున్నామని.. జనాభాలో సగం వున్న మహిళలకు స్థిరమైన అభివృద్ది అవకాశాలు కల్పించే అంశంపై సీఎం చంద్రబాబు స్ఫూర్తితో దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.

రూ. 1.07 కోట్ల చోరీలో దొంగల్ని పట్టించిన పోలీస్ జాగిలం..

ఒక రైతు దగ్గర నుంచి రూ.1.07 కోట్లను దొంగతనం చేసిన దొంగల్ని పోలీస్ జాగిలం పట్టించింది. పెన్నీ అనే డాబర్‌మాన్ కుక్క నిందితులను రోజుల వ్యవధిలోనే పోలీసులు పట్టుకునేలా సాయం చేసింది. వివరాల్లోకి వెళ్తే గుజరాత్ అహ్మదాబాద్ జిల్లాలోని ధోల్కా తాలూకాలోని సరగ్వాలా గ్రామానికి చెందిన 52 ఏళ్ల రైతు తన గ్రామానికి సమీపంలోని లోథాల్ పురావస్తు ప్రదేశానికి సమీపంలోని భూమిని విక్రయించాడు. దీని ద్వారా అతడికి రూ. 1.07 కోట్లు వచ్చాయి. వచ్చిన డబ్బుతో మరోచోట భూమిని కొనుగోలు చేయాలని యోచిస్తున్నాడు. ఈ డబ్బును రెండు ప్లాస్టిక్ సంచుల్లో నింపి, అక్టోబర్ 10న తన శిథిలమైన ఇంటిలో దాచిపెట్టాడు.

ఉక్రెయిన్ యుద్ధంలోకి “కిమ్” ఆర్మీని దింపిన పుతిన్..

రష్యా-ఉక్రెయిన్ వార్‌లోకి ఉత్తర కొరియా సైనికులు ఎంట్రీ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. రష్యా తరుపున పోరాడటానికి కిమ్ సైన్యాన్ని పుతిన్ రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. తమపై పోరాటంలో 10,000 మంది ఉత్తర కొరియా సైనికులను మోహరించడానికి రష్యా సిద్ధమవుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలన్ స్కీ గురువారం చెప్పారు. ఉత్తర కొరియా రష్యాకి తన సైనికులను పంపిందని జెలన్ స్కీ గతంలో కూడా ఆరోపించారు. అయితే, మొదటిసారి ఎంత మంది సైనికులను పంపించారనే విషయంపై వివరాలు వెల్లడించారు.

ప్రభుత్వం అనాలోచితంగా జీవో29ని తెచ్చారు..

గ్రూప్ 1 అభ్యర్థులపై లాఠీ ఛార్జీ చేయడం దారుణమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులపై లాఠీచార్జి ని ఖండిస్తున్నామని, ప్రభుత్వం గ్రూప్ 1 విషయంలో తప్పు చేసిందన్నారు. ప్రభుత్వం అనాలోచితంగా జీవో29ని తెచ్చారని, ఇది చిల్లర చర్య…. ఈ జీవో ఎవరి ఆలోచన అని, గ్రూప్స్ పరీక్షను వాయిదా వేయాలి… జీవో-29 పై చర్చ చేయండన్నారు. షాపుల్లో ఉన్నవారిని కూడా లాక్కొచ్చి మరీ కొడుతున్నారు… ఇదేం పద్ధతి, ప్రభుత్వం అబద్దాలు ఆడుతోంది… 15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 30 వేల జాబ్స్ ఇచ్చామంటున్నారన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు… అమలు చేయడం లేదని, గత ప్రభుత్వనికి ప్రస్తుత ప్రభుత్వానికి ఏమాత్రం తేడాలేదన్నారు. నోటిఫికేషన్ల విషయంలో కేసీఆర్ ఆలోచనా విధానం కాంగ్రెస్ అమలు చేస్తూ… కోర్ట్ కేసులు, నోటిఫికేషన్ లోపాలు చేస్తున్నారని, నిరుద్యోగులకు కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ అని అంటున్నాడన్నారు. సిగ్గుందాలి.. కేటీఆర్ పదేళ్ళలో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుని ఇప్పుడు పోరాటం అంటున్నారని, పేపర్ లీకేజీలకు, కోర్ట్ కేసులకు విద్యార్థుల, నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేటీఆర్ బాధ్యత వహించాలన్నారు.

మియాపూర్‌లో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు

మియాపూర్‌ మెట్రోస్టేషన్‌ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత సంచరిస్తోందని తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చిరుత సంచారం గురించి స్థానికులు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో పోలీసులు, అటవీ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని చిరుత ఆనవాళ్లు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మియాపూర్ మెట్రో స్టేషన్‌ వెనుక భాగంలో ఇప్పటికే తవ్వకాలు జరిగాయి. ఆ తవ్వకాలు జరిగిన స్థలం నుంచే చిరుత వెళ్లినట్లు వీడియోలో కనిపిస్తోంది. అటవీ శాఖ అధికారులు దీనిని నిర్ధారించాల్సి ఉంది. స్థానికులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.