బండి సంజయ్ కి భవిష్య వాణి తెలుసా..? : పైలెట్ రోహిత్ రెడ్డి
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది ఈడీ. వ్యాపార లావాదేవీలపై ఈడీ అధికారులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని విచారించనున్నట్లు తెలుస్తోంది. 2014 నుంచి జరిపిన ఆర్థిక లావాదేవీలు, కంపెనీల వ్యవహారాలపై ఈడీ రోహిత్ రెడ్డిని ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈడీ నా బయోడేటా అడగడం హాస్యాస్పదమన్నారు. బండి సంజయ్ చెప్పిన రెండు రోజలకే ఈడీ సమన్లు వచ్చాయని, బండి సంజయ్‌కి భవిష్యవాణి తెలుసా.. నాకు నోటీసులు వచ్చే విషయం బండి సంజయ్‌కి ఎలా తెలుసు అని ఆయన ప్రశ్నించారు. ఈడీ, సీబీఐలు బండి సంజయ్ కింద పనిచేస్తున్నాయా అని ఆయన మండిపడ్డారు.
చమురు కంపెనీలకు లాభాలు-జనం జేబులకు చిల్లులు..! : మంత్రి కేటీఆర్
ప్రధాని మోడీ ప్రభుత్వం కామన్ మ్యాన్ ప్రభుత్వం కాదు, కార్పోరేట్ల ప్రభుత్వమంటూ మండిపడ్డారు మంత్రి కేటీఆర్. పెట్రో ధరలను తగ్గించకుండా, కార్పోరేట్ అయిల్ కంపెనీలకు విండ్ ఫాల్ టాక్స్ తగ్గించడంపైన మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కార్పొరేట్లకు వరం – సామాన్యులపై భారం..! అంటూ ఆయన వ్యాఖ్యానించారు. చమురు కంపెనీలకు లాభాలు-జనం జేబులకు చిల్లులు..! అని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇదే బీజేపీ ప్రభుత్వ విధానం అన్న కేటీఆర్.. ప్రజలపై పెట్రోభారం తగ్గించడమంటే స్పందించని మోడీ సర్కార్, కార్పొరేట్ కంపెనీలకు మాత్రం పన్నులు తగ్గిస్తున్నది అంటూ చురకలు అంటించారు. ప్రజల బాధలు తీర్చడం కంటే తనకు కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలే ముఖ్యమని తన నిర్ణయంతో కేంద్రం మరోసారి స్పష్టం చేసిందని, రష్యా నుంచి తక్కువ రేటుకు ముడిచమురు కొన్నా… పైసా మందం కూడా ప్రజలకు ప్రయోజనం కలగలేదన్నారు. 35 వేల కోట్ల రూపాయల ముడిచమురు పొదుపు అంతా మోడీ ప్రభుత్వ నిర్ణయంతో ఒకటి రెండు ఆయిల్ కంపెనీలకే దక్కిందన్నారు. ఈ కంపెనీల లాభాలు ఎవరి జేబుల్లోకి పోతున్నాయని ప్రశ్నించిన కేటీఆర్.. ఆ కంపెనీల లాభాలపై పన్ను తగ్గించి, కేంద్ర ప్రభుత్వం తన ప్రజావ్యతిరేక నైజాన్ని మరోసారి చాటుకుందన్నారు. మోడీ మిత్రులైన కార్పొరేట్ ఆయిల్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, కేంద్రం కార్పొరేట్ కంపెనీల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేయాలన్నారు. 2014 నుంచి అడ్డగోలుగా పెంచిన సెస్సులను రద్దుచేసి పెట్రోల్ ధరలు తగ్గించాలని,
ఇప్పటికే సెస్సుల రూపంలో 30 లక్షల కోట్ల రూపాయలను ప్రజల నుంచి బీజేపీ ప్రభుత్వం దోచుకుందన్నారు. పెట్రో ధరల పెంపులో ఎలాంటి ప్రమేయం లేని తెలంగాణలాంటి రాష్ర్టాలపై దుష్ప్రచారాన్ని అపాలని ఆయన మండిపడ్డారు.
బీజేపీ ప్రభుత్వం నిద్రపోతోంది : రాహుల్ గాంధీ
దేశ సరిహద్దుల వద్ద భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా నుంచి వచ్చే ముప్పును ప్రభుత్వం తక్కువ మాత్రమే చేసిందని రాహుల్ గాంధీ అన్నారు. కానీ చైనా యుద్ధానికి సిద్ధమవుతోందని.. అయితే ప్రధాని నరేంద్ర మోదీ పరిపాలన దానిని అంగీకరించడం లేదన్నారు. డ్రాగన్ యుద్ధానికి కాలు దువ్వుతుంటే.. బీజేపీ ప్రభుత్వం నిద్రపోతోందని రాహుల్ విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం తన భారత్ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్‌లో పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ.. చైనా యుద్ధానికి సిద్ధమవుతున్నా.. కేంద్రం నిద్రపోతోందని ఆరోపించారు.”ప్రస్తుత పరిస్థితిని బట్టి చైనా చొరబాటుకు సిద్ధపడటం లేదు, పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధపడుతోంది. ముప్పు స్పష్టంగా ఉంది, కానీ మన ప్రభుత్వం బెదిరింపును విస్మరిస్తోంది. కేంద్రం మన నుంచిస్తవాలను దాచడానికి ప్రయత్నిస్తోంది. ఇలాంటి విషయాలను ఎక్కువ కాలం దాచలేం” అని రాహుల్ గాంధీ అన్నారు. చైనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ హెచ్చరించారు. చైనా తీరు చూస్తే వారు లడఖ్, అరుణాచల్ వైపులా సన్నాహాలు చేస్తున్నారు, కానీ భారత ప్రభుత్వం నిద్రపోతోందని రాహుల్ పేర్కొన్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్ సమీపంలోని యాంగ్‌స్టే ప్రాంతంలో భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. 300 మందికి పైగా చైనా సైనికులు 17,000 అడుగుల శిఖరానికి చేరుకోవడానికి ప్రయత్నించారు. భారత పోస్ట్‌ను కూల్చివేయడానికి ప్రయత్నించారు, అయితే వారి ప్రయత్నాలను భారత వైపు బలగాలు విజయవంతంగా అడ్డుకున్నాయని రక్షణ వర్గాలు తెలిపాయి. ఘర్షణ జరిగిన వెంటనే ఇరువర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
బిగ్‌బాష్ లీగ్‌లో అత్యంత చెత్తరికార్డు
బిగ్‌బాష్ లీగ్‌లో అత్యంత చెత్త రికార్డు నమోదైంది. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ 15 పరుగులకే ఆలౌట్ అయి టోర్నీ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ తరహాలో ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ టీ20 లీగ్‌లో ఈ చెత్త రికార్డు నమోదు కావడం గమనార్హం. సిడ్నీ థండర్స్ జట్టు కేవలం 15 పరుగులకే ఆలౌట్ అయింది. పురుషుల సీనియర్ టీ20 క్రికెట్‌లో ఇది అతి తక్కువ స్కోరు. ఇప్పటివరకు ఈ చెత్తరికార్డు టర్కీ పేరిట ఉండేది. టర్కీ జట్టు చెక్ రిపబ్లిక్ జట్టుతో మ్యాచ్ లో 21 పరుగులకే ఆలౌటైంది. ఇప్పుడు టర్కీ జట్టుకు ఊరట కలిగిస్తూ సిడ్నీ థండర్ జట్టు ఆ రికార్డును తన పేరిట లిఖించుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. అడిలైడ్ స్ట్రైకర్స్‌లో క్రిస్ లిన్ 36 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కొలిన్ డీ గ్రాండ్‌హోం 33 పరుగులు చేశాడు. సిడ్నీ థండర్స్ బౌలింగ్‌లో ఫజల్లా ఫరుఖీ మూడు వికెట్లు తీయగా.. గురీందర్ సందు, డేనియల్ సామ్స్, బ్రెండన్ డోగ్గెట్‌లు తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ 5.5 ఓవర్లకే 15 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాషాయ బికినీ ఫోటో వైరల్..
ప్రస్తుతం బాలీవుడ్ కు, బీజేపీ కు మధ్య పెద్ద పెద్ద యుద్ధమే నడుస్తోందని చెప్పొచ్చు. పఠాన్ సినిమాలో దీపికా వేసుకున్న కాషాయ రంగు బికినీతో ఈ చిక్కంతా వచ్చింది. ఆ రంగు దుస్తులను ధరించి ఇలాంటి రొమాంటిక్ సీన్లు ఎలా చేస్తారని మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా మండిపడ్డ విషయం తెల్సిందే.. ఆ సీన్లు, ఆ డ్రెస్ తొలగించకపోతే సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామని మీడియా ముందు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ విషయాన్ని బీజేపీ పెద్దది చేసి చూపిస్తోందని మరికొందరు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా దీపికా కన్నా ముందు కాషాయ రంగు బికినీ వేసుకున్న హీరోయిన్ల ఫోటోలను షేర్ చేస్తూ అప్పుడెందుకు రియాక్ట్ అవ్వలేదని ప్రశ్నిస్తున్నారు.
ఇక తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కూడా ఇందులోకి లాకొచ్చారు. ఆమె ఒకప్పుడు మోడల్ అన్న విషయం తెల్సిందే. 1998 లో ఆమె మిస్ ఇండియా పోటీల్లో కాషాయ రంగు బికినీ వేసుకొని క్యాట్ వాక్ చేసింది ఆ వీడియోను వైరల్ చేస్తూ దీపిక అభిమానులు రైట్ వింగ్ ట్రోల్స్ పై ఎన్ కౌంటర్ స్టార్ట్ చేసారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. బీజేపీ కావాలనే ఈ బికినీ వివాదాన్ని రెచ్చగొడుతోందని పలువురు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.
మహేష్ కు నాకు మధ్య గొడవలు.. వారివల్లే..?
టాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ లో ఒకరు మహేష్ బాబు- నమ్రత. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంటకు గౌతమ్, సితార ఇద్దరు పిల్లలు. పెళ్లి తరువాత నటనకు స్వస్తి చెప్పిన నమ్రత, ఘట్టమనేని ఇంటి బాధ్యతలను అందుకుంది. మహేష్ భార్యగా, పిల్లలకు తల్లిగా, బిజినెస్ విమెన్ గా రాణిస్తుంది. నిత్యం మహేష్ కు తోడుగా ఉండే నమ్రత బయట కనిపించడం కానీ, మహేష్ లేకుండా ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ చాలా తక్కువ. అయితే తాజాగా నమ్రత ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన మనోగతాన్ని మొత్తం వివరించింది. తాను మోడల్ అయినప్పటినుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో చెప్పుకొచ్చింది. వర్క్ ను సీరియస్ గా తీసుకోమని తన నానమ్మ చెప్పిన విషయం చెప్పుకొచ్చింది. మోడల్ గా బోర్ కొట్టి హీరోయిన్ గా ట్రై చేసినట్లు చెప్పుకొచ్చిన నమ్రత తన జీవితంలో లైఫ్ టర్నింగ్ పాయింట్ అంటే మహేష్ తో లవ్ లో పడి పెళ్లి చేసుకోవడమే అని చెప్పుకొచ్చింది.
ఇక భార్యాభర్తల అన్నాకా గొడవలు ఉంటాయి.. మీ జీవితంలో అలాంటి గొడవలు ఎవరి వల్ల వస్తాయి అన్న ప్రశ్నకు నమ్రత మాట్లాడుతూ ” మా ఇద్దరి మధ్య గొడవలు ఖచ్చితంగా మా పిల్లల వల్లే వస్తాయి. వాళ్లు ఏదైనా కావాలని కోరుకుంటే దాన్ని నేను వద్దు అంటాను.. వెంటనే వారు మహేష్ దగ్గరకు వెళ్లడం, ఆయన ఒప్పుకోవడం జరుగుతుంది. దీంతో ఆమె ఇద్దరి మధ్య గొడవలు మొదలు” అని చెప్పుకొచ్చింది. ఇక సితార కావాలని తాము కోరుకోలేదని, తను అన్ ఎక్స్ పెక్టేడ్ బేబీ అని చెప్పిన నమ్రత గౌతమ్ పుట్టాక తన లైఫ్ మొత్తం మారిపోయిందని చెప్పుకొచ్చింది. ఇక మహేష్ సినిమాల్లో పోకిరి ఇష్టమని, తామిద్దరు కలిసి నటించిన వంశీ తనకు నచ్చదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.
కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన దిల్ రాజు.. నిర్మాతలు ఎవరంటే..?
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరో కొత్త ప్రొడక్షన్ హౌస్ ను ఓపెన్ చేస్తున్నట్లు ప్రకటించాడు. దిల్ రాజు ప్రొడక్షన్స్ (DRP) పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ ను ఓపెన్ చేశాడు. ఇక ఈ ప్రొడక్షన్ హౌస్ కు తన కూతురు హన్షిత రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తోందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి మొదటి సినిమాగా ‘బలగం’వస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ప్రొడక్షన్ లాంచ్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ “దిల్ రాజు ప్రొడక్షన్స్ (DRP) పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ లాగా.. కొత్త సినిమాలు, ఎక్స్పరిమెంటల్ సినిమాలు ఈ బ్యానర్ పై తీయబోతున్నాం. హర్షిత్, హన్షిత నిర్మాతలు. ఇంతకు ముందు ఈ బ్యానర్ పై ఏటీఎం అనే వెబ్ సిరీస్ తీసాం.. ఇప్పుడు బలగం అనే సినిమా తీస్తున్నాం.
జబర్దస్త్ వేణు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.. మొదట శ్రీ వెంకటేశ్వర బ్యానర్ స్టార్ట్ చేసినప్పుడు కొత్త కొత్త డైరెక్టర్స్ ను, నటీనటులను, టెక్నీషయన్స్ ను పరిచయం చేశాం. తరువాత తరువాత మేము ఎదుగుతున్న కొద్దీ అందరిలోనూ ఒకటే భయం.. రాజు గారి దగ్గరకు వెళితే పెద్ద సినిమాలే తీస్తాడు అని అనుకుంటున్నారు. ఇలా కాకుండా మారుతున్న ట్రెండ్ ను బట్టి మా నెక్స్ట్ జనరేషన్ కూడా చిత్ర పరిశ్రమలోకే వచ్చారు. చిన్న చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడానికి ఈ బ్యానర్ స్టార్ట్ చేశాం. అందులో మొదటిగా బలగం తీస్తున్నామని” చెప్పుకొచ్చారు.
మాచర్లలో ఉద్రిక్తత
పల్నాడు జిల్లాలోని మాచర్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నిర్వహిస్తున్న రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణుల యత్నించడంతో ఈ గొడవ ప్రారంభమైంది. మాజీ ఛైర్మన్ తురకా కిషోర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో నేడు జూలకంటి బ్రహ్మరెడ్డి అధ్వర్యంలో టీడీపీ ఇదేం ఖర్మ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నించారు. కర్రలతో టీడీపీ వారిపై దాడి చేశారు. టీడీపీ శ్రేణులు వారిపై తిరగబడడంతో ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ గొడవలో కొందరికి గాయాలు అయినట్లు సమాచారం. వారిని ఆసుపత్రికి తరలించారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో ఈ గొడవ సద్దుమణిగింది. మళ్లీ గొడవలు జరగొచ్చనే అనుమానంలో పోలీసులు ఆ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.