NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

డాక్టర్ల నిరసనకు గవర్నర్ సంఘీభావం.. ఆస్పత్రి దగ్గరకు వెళ్లి మద్దతు

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన ఓ వైపు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంకోవైపు బుధవారం అర్ధరాత్రి వందలాది మంది అల్లరి మూకలు ఆర్‌జీ కర్ ఆస్పత్రిలోకి ప్రవేశించి సాక్ష్యాలను చెరిపివేయడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వమే ఇదంతా చేయిస్తోందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. సీబీఐ రంగంలోకి దిగిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఉద్దేశ పూర్వకంగా ఆనవాళ్లు చెరిపేందుకే మమత ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.

రాజ్భవన్లోని ఎట్ హోమ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

నేడు 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంప్రదాయం ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాజ్ భవన్ లో ‘ఎట్ హోమ్’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తేనీటి విందు ఇచ్చారు. కాగా, ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, హైకోర్టు జడ్జిలు, వివిధ రంగాల ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే, రాజ్ భవన్ లో జాతీయ గీతాలపానతో ఎట్ హోం ప్రారంభం అయింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం చంద్రబాబు.. ఏపీ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ను ఆత్మీయంగా పలకరించారు. అలాగే, రాజ్ భవన్ లోని ఎట్ హోం కార్యక్రమంలో ఏపీ మంత్రి నారా లోకేష్ – వైఎస్ షర్మిళ పరస్పరం అభివాదం చేసుకున్నారు.

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల బరిలో 39 మంది అభ్యర్థులు..

ద్వీప దేశం శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో ఏకంగా 39 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ముగ్గురు మైనారిటీ తమిళులతో పాటు ఇద్దరు బౌద్ధ సన్యాసులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పెద్ద నాయకులు పోటీ చేస్తున్నారు. అయితే, సెప్టెంబర్ 21న జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఒక్క మహిళా అభ్యర్థి కూడా లేకపోవడం గమనార్హం. 2019లో జరిగిన చివరి అధ్యక్ష ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 1982 అక్టోబర్‌లో జరిగిన తొలిసారి అధ్యక్ష ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీ చేశారు. ద్వీప దేశంలోని 22 ఎన్నికల జిల్లాల్లో 17 మిలియన్ల మంది ఈ సారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో పాటు మాజీ అధ్యక్షుడు గోటబయ రాజపక్సే కుటుంబ వారసుడు 38 ఏల్ల నమల్ రాజపక్సే, ప్రధాన ప్రతిపక్ష నేత సజిత్ ప్రేమదాస, మార్క్సిస్ట్ జేవీపీ నాయకుడు అనుర కుమార దిసనాయకే ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన అభ్యర్థులు. 1948లో బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందిన తర్వాత 2022లో శ్రీలంక దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఏకంగా అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశాన్ని విడిచి పారిపోయాడు. ఆ తర్వాత పరిణామాల్లో రణిల్ విక్రమ‌సింఘే అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టారు. ఈ ఆర్థిక సంక్షోభం తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరగబోతున్నాయి.

ఖమ్మం గడ్డ.. కాంగ్రెస్ కు అడ్డా

సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంకితం చేశారు. రెండో పంప్‌ హౌస్‌ వద్ద పైలాన్‌ ఆవిష్కరించిన సీఎం రేవంత్‌.. అనంతరం స్విచ్‌ ఆన్‌ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం గడ్డ కాంగ్రెస్ కు అడ్డా అని, ఖమ్మం గడ్డ మీద నుంచే రెండు లక్షల రుణ మాఫి గురించి హామి ఇచ్చామన్నారు. సోనియాగాంధీ మాట ఇచ్చింది అంటే హామీ నెరవేర్చలసిందేనని, పట్టువదలకుండ భట్టి విక్రమార్క రైతు రుణ మాఫీ చేస్తున్నారన్నారు. ఎంత మంది అడ్డుపడ్డ, కాళ్ళకి అడ్డం పడ్డా హామీ నెరవేరుస్తున్నామన్నారు. 18000 కోట్ల రూపాయలు 27 రోజుల్లో రైతులకి ఇచ్చామన్నారు. హరీష్ రావు చీము నెత్తురు వుంటే సిగ్గు లజ్జ వుంటే రాజీనామా చెయ్య్ అని ఆయన వ్యాఖ్యానించారు. సిగ్గు వుంటే రాజీనామా చెయ్ అని ఆయన సవాల్‌ విసిరారు.

నేషన్ ఫస్ట్.. నేడు మోడీ ప్రసంగంలో కీలక అంశాలు..

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా 11వ సారి జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోటలో తన ప్రసంగంలో ప్రతిసారీ.. రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వం ఏమి చేయబోతుందో సూచనలు ఇస్తూనే ఉన్నారు. తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. ఈసారి కూడా ప్రధాని మోడీ, తన 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో రాబోయే రోజుల్లో భారత ప్రభుత్వం చేయాలనుకుంటున్న చాలా విషయాలను చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తక్కువ సీట్లు రావడంతో ప్రధాని బలహీనపడ్డారని లేదా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వివాదానికి దారితీసే నిర్ణయాన్ని తీసుకోబోదని భావించే వారు.. కానీ ఆయన ప్రసంగం దానిని కొట్టిపారేసింది. సెక్యులర్ కోడ్, సంస్కరణలు, హిందువుల భద్రత పేరుతో బంగ్లాదేశ్‌కు సందేశం వంటి అనేక విషయాల గురించి మోడీ మాట్లాడారు. దీంతో ప్రభుత్వం ఎక్కడా బలహీనంగా లేదని అర్థమవుతోంది.

తిరుమలలో ప్రారంభమైన పవిత్రోత్సవాలు..

తిరుమలలోని శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఇవాళ్టి (గురువారం) నుంచి శాస్త్రోక్తంగా స్టార్ట్ అయ్యాయి. ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి వారి పవిత్ర మండపంలోని యాగశాలకు తీసుకు వచ్చి హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు కొనసాగించారు. ఆ తర్వాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో స్వామివారి విగ్రహాలకు అభిషేకం నిర్వహించారు. ఇక, వేద పండితులు పంచసూక్తాలను సుదీర్ఘంగా పఠించారు. ఆ తర్వాత మొదటి రోజు పవిత్ర ప్రతిష్ట, మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ చేసేశారు. పవిత్రోత్సవాల కారణంగా ఆలయంలో తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను తిరుమల తిరుపతి దేవాస్థానం బోర్డు అధికారులు రద్దు చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, ఆల‌య డిప్యూటీ ఈవో లోకనాథంతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

దేశ చరిత్రలో లిఖించదగ్గ రోజు

ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ లో రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఖమ్మంలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల ముందు ఛాలెంజ్ చేసి రుణ మాఫీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ రోజు చరిత్రలో లిఖించదగిన రోజు అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. దేశ చరిత్రలో తొలిసారి రూ.2లక్షల రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. ఛాలెంజ్ చేసి ఆగస్టు 15నాటికి రుణమాఫీ చేస్తామని చెప్పాం… చేసి చూపించామన్నారు.

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రోడ్లు జలమయం

హైదరాబాద్‌లో భారీ వర్షం దంచికొడుతోంది. నగరంలో కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మరోవైపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం నగరంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో ఒక్కసారిగా భారీగా వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్, లింగంపల్లి, తెల్లాపూర్, అమీర్‌పేట, ఖైరతాబాద్, యూసఫ్‌గూడ, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, బోయిన్‌పల్లి, అల్వాల్, సికింద్రాబాద్, పటాన్‌చెరు, ఆర్సీపురం, అమీన్ పూర్, హైటెక్ సిటీ సహా పలు ప్రాంతాల్లో నాన్‌స్టాప్‌గా వాన కురుస్తోంది. గత రెండు గంటల నుంచి వర్షం పడుతుండగా.. మరో రెండు గంటలపాటు  కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్?

తెలంగాణ మహిళల పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ పై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్స్ లు, రికార్డింగ్ డాన్స్ లు చేసుకోవచ్చు అని కేటీఆర్ అత్యంత జుగుప్సకరంగా మాట్లాడారని ఆమె మండిపడ్డారు. మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం సంస్కారం ఇదేనా కేటీఆర్? అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డాన్స్ లు చేస్తున్నారా? అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవాళ్ళంటే మీకు గౌరవం లేదని, మహిళల పట్ల కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమన్నారు మంత్రి సీతక్క. బేషరతుగా కేటీఆర్ తెలంగాణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల అని ఆమె డిమాండ్‌ చేశారు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా బ్రేక్ డాన్సులు చేసుకోండి అనడం మీ బుర్రలో వున్న బురదకు నిదర్శనమని, గత పది సంవత్సరాలు హైదరాబాద్లో క్లబ్బులు, పబ్బులు, బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది అని మంత్రి సీతక్క నిప్పులు చెరిగారు.