Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

43 మంది భారతీయుల్ని బహిష్కరించిన మాల్దీవ్స్.. చైనాపై మాత్రం చర్యలు లేవు..

మాల్దీవుల్లో కొత్త అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు వచ్చిన తర్వాత నుంచి భారత్ వ్యతిరేఖ, చైనా అనుకూల ధోరణిని అవలంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి మంత్రులు భారత ప్రధాని మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవ్స్‌కి పర్యాటకంగా ఎక్కువ వెళ్లే భారతీయులు వారి టూర్లను క్యాన్సిల్ చేసుకున్నారు. ‘‘బాయ్‌కాట్ మాల్దీవులు’’ హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు. ఈ వివాదంతో మాల్దీవ్స్ పర్యాటక ఇండస్ట్రీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

ఇదిలా ఉంటే, మరోసారి మాల్దీవులు భారత వ్యతిరేక వైఖరిని కనబరిచింది. అక్రమ వ్యాపారాలు నిర్వహిస్తున్నారనే పేరుతో 43 మంది భారతీయులతో సహా 12 వేర్వేరు దేశాలకు చెందిన 186 మంది విదేశీయులను బహిష్కరించింది. అయితే, చైనాకు చెందిన ఒక్కరు కూడా ఈ జాబితాలో లేరు. బహిష్కరణకు గురైన వారిలో బంగ్లాదేశ్ నుంచి 83 మంది ఉండగా.. భారత్ నుంచి 43 మంది, శ్రీలంక నుంచి 25 మంది, నేపాల్ నుంచి 8 మంది ఉన్నారు. అయితే, వారి బహిష్కరణ తేదీ ఇంకా తెలియరాలేదు. బ్యాంక్ ఖాతాలు కలిగి ఉన్న విదేశీయులు అక్రమంగా దేశంలో నిర్వహిస్తున్న వ్యాపారాలను మూసేసే ప్రయత్నాలను చేపట్టామని మాల్దీవుల హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నమోదిత యజమానికి బదులుగా విదేశీయలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని ఆరోపించింది.

బీజేపీఎల్పీ నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి

నెలరోజుల ఉత్కంఠ అనంతరం నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని శాసనసభాపక్ష నేతగా బీజేపీ అధిష్టానం బుధవారం నియమించింది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, కామారెడ్డి ఎమ్మెల్యే కె వెంకట రమణారెడ్డిని డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌లుగా నియమించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ముధోలే ఎమ్మెల్యే రామారావు పటేల్‌ను శాసనసభా పక్ష కార్యదర్శిగా నియమించారు. పార్టీ చీఫ్ విప్‌గా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, విప్‌గా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూరయ్యనారాయణ గుప్తా నియమితులయ్యారు. ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డిని పార్టీ కోశాధికారిగా నియమించారు.

కేజ్రీవాల్‌కు మరోసారి ఈడీ నోటీసు.. హాజరుపై ఉత్కంఠ!

లిక్కర్ పాలసీ కేసులో (Liquor Policy Case) ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌కు (Delhi CM Arvind Kejriwal) మరోసారి ఈడీ నోటీసు ఇచ్చింది. ఈ నెల 19న హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. ఇప్పటికే కేజ్రీవాల్‌కు ఐదుసార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. కానీ ఆయన ఇప్పటి వరకు విచారణకు హాజరుకాలేదు. ఇలా దాదాపుగా ఐదుసార్లు విచారణకు డుమ్మా కొట్టారు. దీంతో ఈడీ అధికారులు కోర్టును ఆశ్రయించగా విచారణకు కేజ్రీవాల్ సహకరించాలని తెలిపింది. దీంతో లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది.

ఇంతకుముందు 2023 నవంబర్ 2, డిసెంబర్ 21, 2024 జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2 తేదీల్లో ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది. తాజాగా మరోసారి బుధవారం(14-02-2024) నోటీసులు ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల ముందు ఈడీ (Enforcement Directorate) నోటీసులు ఇవ్వడాన్ని ఆప్ తప్పుపడుతోంది. ఉద్దేశ పూర్వకంగానే ఈడీని బీజేపీ అడ్డంపెట్టుకుని వేధిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది. తాజా నోటీసుపై కేజ్రీవాల్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఆరోసారి కూడా విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కొడతారా? లేదంటే హాజరవుతారా? అన్నది వేచి తెలియాల్సి ఉంది.

మా కుటుంబం 4కోట్ల తెలంగాణ ప్రజలు…

ఎల్బీ స్టేడియంలో పోలీస్ కానిస్టేబుల్స్‌కు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. నిరుద్యోగులను ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నుంచి బయట పడేయాలనే మా ప్రయత్నమన్నారు. ఆనాటి పాలకులు తమ కుటుంబం కోసం ఆలోచించారు తప్ప నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదని, మా కుటుంబం 4కోట్ల తెలంగాణ ప్రజలు అని ఆయన అన్నారు. అందుకే మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకున్నామని ఆయన వెల్లడించారు. న్యాయపరమైన చిక్కులు తొలగించి నియామక పత్రాలు అందిస్తున్నామని, 13,444 మంది ఉద్యోగులకు ఇవాళ నియామక పత్రాలు అందిస్తున్నామన్నారు. ఈ వేదికగా చెబుతున్నా.. మీ రేవంతన్నగా నిరుద్యోగ యువకులకు నేను అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం మీది.. ఇది పేదల ప్రభుత్వం.. ప్రజా ప్రభుత్వమని ఆయన స్పష్టం చేశారు. ఆనాటి ప్రభుత్వం వేసిన చిక్కుముడులను ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ముందుకు వెళుతున్నామని, నర్సింగ్ ఆఫీసర్స్, సింగరేణి ఉద్యోగాల్లో చిక్కుముడులు విప్పి నియామకాలు పూర్తి చేసామన్నారు రేవంత్‌ రెడ్డి.

తాడిపత్రిలో డీజిల్ దొంగ ఎవరో ప్రజలకు తెలియాలి..

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రిలో డీజిల్ దొంగ ఎవరో ప్రజలకు తెలియాలని ఆయన అన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు డీజిల్ బిల్లులు, ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డీజిల్ బిల్లుల వ్యత్యాసం ప్రజలు గమనించాలని కేతిరెడ్డి పేర్కొన్నారు.

తాడిపత్రిలో ఆలీబాబా 40 దొంగలు ఉన్నారని.. ఆలీబాబా 40 దొంగల నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి అంటూ విమర్శలు గుప్పించారు. మా పార్టీ జెండా కింద ఉండి ఇతర పార్టీకి మద్దతు పలికే వారికి సిగ్గు శరం ఉంటే పార్టీ వదిలి వారి బస్సులను క్లీన్ చేయాలన్నారు. తాటాకు చప్పళ్లకు భయపడే వ్యక్తిని తాను కాదన్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలో ఏ సమస్య వచ్చినా తనకే ఫోను వస్తుందని అంటే తాడిపత్రిలో మున్సిపల్ ఛైర్మన్ లేనట్లే కదా అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎద్దేవా చేశారు.

KRMBకి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు…

రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ లు మోడీ చేసినవి కాదు… విభజన చట్టం లో ఉన్నవన్నారు బీజేపీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి మురళీధర్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. KRMB కి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం లేదని ఆయన వెల్లడించారు. నదీ జలాల పంపిణీ అనేది కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉండదని, ట్రిబ్యునల్ కు మాత్రమే అధికారం ఉందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో స్థానం లేదు…డిపాజిట్ తెచ్చుకోవడం కోసం , ఉనికి కోసం కెసిఆర్, కాంగ్రెస్ దొంగ నాటకాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. SLBC పూర్తి చేస్తా అని కేసీఆర్‌ డైలాగ్ లు కొట్టారు.. ద్రోహం చేశారని, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు కేసీఆర్‌ అని మురళీధర్‌ రావు మండిపడ్డారు. దిండి ఎత్తిపోతల పథకం ఏమైందని ఆయన ప్రశ్నించారు.

అబుదాబిలో తొలి హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన మోడీ

అబుదాబిలో (Abu Dhabi) నిర్మించిన తొలి హిందూ దేవాలయాన్ని (Hindu Temple) ప్రధాని మోడీ (PM Modi) ప్రారంభించారు. యూఏఈ చరిత్రలో నిర్మించిన తొలి హిందూ దేవాలయం ఇదే కావడం విశేషం. రెండ్రోజుల పర్యటనలో భాగంగా బుధవారం రెండోరోజు మోడీ పర్యటన కొనసాగుతోంది. ఈ ఉదయం ప్రపంచ ప్రభుత్వ సదస్సులో మోడీ పాల్గొని ప్రసంగించారు.

అబుదాబిలోని అబు మురీఖా ప్రాంతంలో ఈ మందిరం 27 ఎకరాల్లో విస్తరించి ఉంది. 2019 ఏప్రిల్‌లో శంకుస్థాపన చేయగా.. అదే ఏడాది డిసెంబర్‌లో ఆలయ నిర్మాణ పనులు స్టార్ట్ అయ్యాయి. క్రౌన్స్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆలయ నిర్మాణం కోసం 2015లో 13.5 ఎకరాల భూమిని విరాళంగా అందించారు. 2019 జనవరిలో యూఏఈ ప్రభుత్వం మరో 13.5 ఎకరాలను ఆలయ నిర్మాణం కోసం గిఫ్ట్ ఇచ్చింది. ఈ హిందూ ఆలయ నిర్మాణానికి సుమారు 400 మిలియన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ లు ( రూ. 700 కోట్లు ) అయ్యాయి.

అన్నాడీఎంకేలో చేరిన సినీనటి గౌతమి.. నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?

తమిళ సినీ నటి గౌతమి (Tamil actor Gautami Tadimalla) అన్నాడీఎంకే గూటికి (AIADMK) చేరారు. మాజీ ముఖ్యమంత్రి పళినిస్వామి (Palaniswami) సమక్షంలో ఆమె రెండు ఆకుల పార్టీలో చేరారు. కొద్ది కాలం క్రితమే ఆమె బీజేపీకి గుడ్‌బై చెప్పారు. కమలనాథులు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని గౌతమి ఆరోపించారు. తాజాగా ఆమె అమ్మ (జయలలిత) పార్టీలో చేరారు.

ఇదిలా ఉంటే త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె అన్నాడీఎంకేలో చేరినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతోనే ఆమె పార్టీలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరీ అన్నాడీఎంకే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

మరోవైపు హీరో విజయ్ కూడా తమిళనాడులో  కొత్త పార్టీని స్థాపించారు. కానీ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని ఆయన విమర్శించారు.

రేపు కొమురవెల్లి (హాల్ట్) రైల్వే స్టేషన్‌కు శంకుస్థాపన

కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ నిలయమైన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి (హాల్ట్) రైల్వే స్టేషన్ నిర్మాణానికి గురువారం కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, రైల్వే అధికారుల సమక్షంలో జరగనుంది. ప్రతి సంవత్సరం, వేలాది మంది యాత్రికులు ప్రముఖ మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శిస్తూ, అధిష్టానం ఆశీస్సులు కోరుతూ ఉంటారు. ఈ ఆలయ పట్టణం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, రైల్వే మంత్రిత్వ శాఖ సెంట్రల్ తెలంగాణలోని కొమురవెల్లిలో హాల్ట్ స్టేషన్‌ను ప్రారంభించేందుకు ఆమోదించింది. అయితే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ హాజరుకానున్నారు.

2 లక్షల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది

ఉద్యోగాల భర్తీలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చి రాబోయే 10 సంవత్సరాల పాటు తనతో కలిసి ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. బుధవారం ఎల్‌బీ స్టేడియంలో కొత్తగా ఎంపికైన 13,444 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేసి, ఉద్యోగ నియామకాలకు అడ్డంకిగా ఉన్న అడ్డంకులను, న్యాయపరమైన చిక్కులను కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం దశలవారీగా ఉద్యోగాలు భర్తీ చేస్తుందని, యువత అధైర్యపడవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు.

Exit mobile version