NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఊరట.. ఓ కేసులో నిర్దోషిగా ప్రకటన

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్, ఆయన సన్నిహితులకు ఇస్లామాబాద్ కోర్టులో ఉపశమనం లభించింది. సెక్షన్ 144 ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో బుధవారం మాజీ ప్రధాని, అతని సన్నిహితులను నిర్దోషులుగా ప్రకటించింది. ఇమ్నాన్ ఖాన్, షేక్ రషీద్, అసద్ ఖైజర్, సైఫుల్లా నియాజీ, సదాకత్ అబ్బాసీ, ఫైసల్ జావేద్, అలీ నవాజ్‌లను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇస్లామాబాద్‌లోని జిల్లా మరియు సెషన్స్ కోర్టు అభియోగాలను కొట్టివేసింది.

మీరు చేసినవి మోసాలు కాదా.. మీపై 420 కేసులు పెట్టకూడదా..?

చంద్రబాబు హయాంలోనే రాష్ట్రం కుదేలు అయ్యో పరిస్థితి ఏర్పడిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే సమయానికి 19.54 శాతం అప్పులు చేశారు.. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 15.61 శాతం అప్పులు చేశామన్నారు. ఫైనాన్స్ సెక్టార్ ను బాగా నడిపిన వైసీపీకి అవార్డు ఇవ్వాలని పేర్కొన్నారు. అప్పు రత్న ఎవరికి ఇవ్వాలి..? అని ప్రశ్నించారు. రెండేళ్లు కోవిడ్ ఉన్నా చంద్రబాబు కంటే మంచి పరిపాలన ఇచ్చాం.. జీడీపీలో రాష్ట్రం నుంచి టీడీపీ హయం కంటే వైసీపీ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసిందన్నారు. ఉద్యోగాల సృష్టిలో Phd చేసినట్టు చంద్రబాబు బిల్డప్ ఇస్తున్నారు.. రాష్ట్రంలో అంబానీలు, అదానీలు, ఆదిత్య మిట్టల్, బిర్లా లాంటి పారిశ్రామిక వేత్తలు వైసీపీ సమయంలో నే అనేక ఏంఓయూలు చేసుకున్నారు.. జిందాల్ కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ముందుకు వస్తే ఇబ్బంది పెట్టు పంపిస్తున్నారు అని జగన్ ఆరోపించారు.

సైబర్ నేరగాళ్లపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొరడా

సైబర్ క్రైమ్‌పై గణనీయమైన అణిచివేతలో, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) రాష్ట్రవ్యాప్తంగా 48 మంది వ్యక్తులను స్థానిక పోలీసుల సమన్వయంతో అరెస్టు చేసింది. ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) డైరెక్టర్ డైరెక్టర్ శిఖా గోయల్ మాట్లాడుతూ.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసుల స్పెషల్ ఆపరేషన్ నిర్వహించినట్లు, మ్యూల్ ఖాతాలను గుర్తించేందుకు TGCSB స్పెషల్ ఆపరేషన్ చేపట్టిందని తెలిపారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ ఆపరేషన్ నిర్వహించామని, సైబర్ నేరగాళ్ళకు మ్యూల్ అకౌంట్లను సమకూర్చే వారిని అరెస్టు చేసామన్నారు. 508 కేసుల్లో భాగస్వాములుగా ఉన్నా 48 మంది నిందితులను అరెస్టు చేశామని, నిందితులకు దేశవ్యాప్తంగా 2194 కేసుల్లో పాత్ర ఉందని ఆమె తెలిపారు. నిందితులు సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు బాధితుల నుండి కొల్లగొట్టడానికి సైబర్ నేరగాలకు సహకరించారని, అరెస్ట్ అయినా వారిలో 38 మంది మ్యూల్ ఖాతాదారులు ఉన్నారు. 10 మంది ఏజెంట్లు ఉన్నారన్నారు. ఏజెంట్లు ఆధార్ పాన్ కార్డు తీసుకుని ఖాతాలు ఓపెన్ చేస్తారని, ఆయా ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అప్పగిస్తున్నారన్నారు.

అసభ్య పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు అయ్యాయి..

అసభ్య పోస్టులు పెట్టిన వారిపై పలు కేసులు నమోదు అయ్యాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. వైసీపీ నేతలు ఈ కేసులపై గగ్గోలు పెడుతున్నారు.. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెడుతున్నారో వాళ్ళకు తెలుసా అని అడిగారు. రాజకీయ ముసుగులో వచ్చిన వైసీపీ నాయకుల గురించి ప్రజల ముందు ప్రభుత్వం ఉంచుతుంది.. వాళ్ళ పార్టీలోనే ఎంపీగా రఘురామ కృష్ణం రాజుపై అప్పట్లో పెట్టింది అక్రమ కేసు కాదా అని ఆమె అడిగారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం.. మీలా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయడం లేదు అని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు.

శ్రీరెడ్డిపై పోలీస్ కేసు

తూర్పుగోదావరి జిల్లాలో నటి శ్రీరెడ్డిపై పోలీస్ కేసు నమోదు అయింది. శ్రీరెడ్డిపై రాజమండ్రి బొమ్మూరు పి.ఎస్.లో టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ మజ్జి పద్మ ఫిర్యాదు చేశారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వంగలపూడి అనితలపై చేసిన వ్యాఖ్యలకు శ్రీ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మజ్జి పద్మ ఫిర్యాదు మేరకు బొమ్మూరు పి.ఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఇక నిజానికి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఇప్పుడు సోషల్ మీడియా పోస్టులు కాకరేపుతున్నాయి.

లక్డీకాపూల్ లోని పలు రెస్టారెంట్స్ లో మేయర్‌ ఆకస్మిక తనిఖీలు.. ప్రిజర్వ్ చేసిన మాంసం గుర్తింపు

హైదరాబాద్‌లో ఇటీవల హోటల్స్‌లో ఆహార పదార్థాల అపరిశుభ్రత, నిల్వ ఉంచిన మాంసం, సరైన నిబంధనలు పాటించకపోవడం, కస్టమర్లకు వడ్డించిన ఆహారంలో పురుగులు, కీటకాలు కనిపించడం వంటి సంఘటనలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాలలో బాధితులు వాటి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుండగా, నెటిజన్లు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి, పలు హోటల్స్‌ను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

భావి భారత పౌరుల భవిష్యత్తు కోసమే.. విద్యా రంగంలో మార్పులకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం

స్వాంతత్య్ర సమరయోధులు, భారతదేశ ప్రథమ ప్రధానమంత్రి స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ జయంతి (నవంబర్ 14) సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆ మహనీయుడికి నివాళులు అర్పించారు. నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి బాలబాలికలు అందరికీ హార్ధిక శుభాకాంక్షలు తెలియజేశారు. నేటి బాలబాలికలే భావి భారత పౌరులని విశ్వసించి ప్రజా ప్రభుత్వం పాఠశాల విద్యా రంగంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేయరాదన్న చిత్తశుద్ధితోనే ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ప్రతి ఏటా రెండు యూనిఫామ్స్ అందించాలని, ఆ బాధ్యతను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించడం జరిగింది. అలాగే పాఠశాలలకు ఉచిత విద్యుత్తు అందించే నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

స‌మాధానం చెప్పకుండా బుర‌ద‌జ‌ల్లడం ఆ పార్టీ అధినేత‌కు అలవాటే..

మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మండిపడ్డారు. శాస‌న మండ‌లిలో నేను న‌వ్వుతూ స‌మాధానం చెప్పాన‌ని జ‌గ‌న్ వ‌క్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.. చట్ట సభల్లో నవ్వుతూ కాకుండా ఏడుస్తూ సమాధానాలు చెప్తారా అని ప్రశ్నించారు. ఓల్డ్ హ్యాబిట్స్.. డై హార్డ్ (OLD HABITS DIE HARD) అంటే ఇదే అని చెప్పుకొచ్చారు. అబ‌ద్ధాలు చెప్పడం, వక్రీకరించడం జగన్ నైజం.. నాది కాదన్నారు. ఇక, విజ‌య‌న‌గ‌రం జిల్లా గుర్లలో డ‌యేరియా ప్రబ‌ల‌డానికి ప్రధాన కార‌ణాలున్నాయి.. గ‌త ఐదేళ్లుగా పైపు లైన్ల నిర్వహ‌ణ స‌రిగా లేక‌పోవ‌డంతో పాటు చెంపా న‌దీ తీరంలో టాయిలెట్లు లేక‌పోవ‌డం వ‌ల్ల బ‌హిరంగ మ‌ల విసర్జన కూడా ఒక కారణం అని మంత్రి సత్య కుమార్ అన్నారు.

‘‘సిగ్గుమాలిన చర్య’’.. అత్తపై అల్లుడి అత్యాచారం.. కోర్టు కీలక తీర్పు..

తన కూతురినిచ్చి పెళ్లి చేసిన అత్తపైనే అల్లుడు అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించిన కేసుని బాంబే హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇది సిగ్గుమాలిన చర్య’’ అని, తల్లిలాంటి మహిళలపై ఇలాంటి ఘటనకు పాల్పడిన నిందితుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీఏ సనప్‌తో కూడిన సింగిల్ బెంచ్ ఈ కేసును విచారిస్తూ.. బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ మంగళవారం వ్యక్తికి విధించిన శిక్షను సమర్థించింది. డిసెంబర్ 2018లో తన 55 ఏళ్ల అత్తగారిపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి సెషన్స్ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ 2022లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని దోషి హైకోర్టులో సవాల్ చేశాడు. తన అల్లుడు, కూతురు విడిగా ఉంటున్నారని, ఇద్దరు మనవళ్లు తండ్రి వద్దే ఉంటున్నారని బాధిత మహిళ కోర్టు చెప్పింది.

గ్యాస్ లీకేజీ కావడంతో.. ఆగి ఉన్న రైల్వే కోచ్‌లో భారీ అగ్నిప్రమాదం

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్‌లో లుని రైల్వే స్టేషన్‌లోని క్యాంపింగ్ కోచ్‌లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ కోచ్ రైల్వే కార్మికులకు చెందినది. అందులో వారు ఆహారం వండుతున్నారు. వంట చేస్తుండగా గ్యాస్ లీకేజీ కావడంతో మంటలు చెలరేగడంతో కోచ్‌లో ఉన్న ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. మంటలు చెలరేగడంతో స్టేషన్‌లో గందరగోళం నెలకొనడంతో మంటలను అధికారులు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ కోచ్‌ జోధ్‌పూర్‌ – లూని సెక్షన్‌ మధ్య ట్రాక్‌ లపై పనిచేసే ఉద్యోగుల కోసమేనని రైల్వే అధికారులు తెలిపారు. రైలుకు కోచ్ కనెక్ట్ కాకపోవడంతో మంటలు చెలరేగడంతో పెద్ద ప్రమాదం జరగలేదు. అయితే, కోచ్‌లో రెండు గ్యాస్ సిలిండర్లు ఉంచి ఉండడంతో వాటిని బయటకు తీయలేకపోవడంతో పేలుడు ప్రమాదం పొంచి ఉంది.

పైశాచికం.. వెంటాడి వీధికుక్కల్ని కర్రలతో కొట్టి చంపిన దుండగులు

జవహర్ నగర్ వీధికుక్కలను విచక్షణారహితంగా చంపకూడదని, వాటి జనాభా నిర్వహణకు ఎలాంటి చర్యలు తీసుకున్నా చట్టపరిధిలోకి రావాలని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే..! కానీ ఎలాంటి సోయి లేకుండా ఇష్టానుసారంగా కుక్కలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మనుషుల్లో పెరుగుతున్న పైశాచికత్వానికి పరాకాష్ఠగా నిలిచిన ఘటన జవహర్ నగర్ లో చోటుచేసుకుంది. వీధికుక్కలపై కర్రలతో దాడి చేసిన దుండగులు వాటిని చిత్ర హింసలకు గురిచేసి చంపారు.