Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఫైనల్‌లో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. ఆసియాకప్ విజేతగా బంగ్లాదేశ్

దివారం నాడు జరిగిన అండర్-19 ఆసియా కప్ 2024 టైటిల్‌ను బంగ్లాదేశ్ గెలుచుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ 59 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి టైటిల్‌ను కాపాడుకుంది. 9వ ట్రోఫీని గెలుచుకోవాలన్న భారత్ కల నెరవేరలేకపోయింది. ఈ టోర్నీలో భారత్ అత్యంత విజయవంతమైన జట్టు. ఇప్పటికి ఎనిమిది సార్లు ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్లో భారత్ టాస్ గెలిచి బంగ్లాదేశ్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపింది. బంగ్లాదేశ్ 49.1 ఓవర్లలో 198 పరుగులు జోడించింది. బంగ్లాదేశ్ తరఫున మహ్మద్ రిజాన్ అత్యధికంగా 47 పరుగులు చేశాడు. మహ్మద్ శిబాబ్ 40 పరుగులు, మహ్మద్ ఫరీద్ 39 పరుగులు చేశారు. జవాద్ అబ్రార్ 20 పరుగులు, అజీజుల్ హకీమ్ తమీమ్ 16 పరుగులు చేశారు. హార్దిక్ రాజ్, చేతన్ శర్మ, యుధాజిత్ గుహా చెరో రెండు వికెట్లు తీశారు.

కెనడాలో భారత్ సంతతి వ్యక్తి హత్య.. వారంలో రెండో ఘటన..

కెనడాలో మరో భారత సంతతి వ్యక్తి హత్య జరిగింది. శుక్రవారం ఎడ్మింటన్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న 20 ఏళ్ల భారత సంతతికి చెందిన వ్యక్తిని ఒక ముఠా కాల్చి చంపింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. భారతీయ సంతతికి చెందిన వ్యక్తిని హర్షన్‌దీప్ సింగ్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి 12.30 గంటల ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ భవనంలో కాల్పులు జరిగినట్లు సమాచారం అందింది. 107 అవెన్యూ వద్దకు చేరుకోగానే, అపార్ట్‌మెంట్ మెట్లపై హర్షన్‌దీప్ సింగ్ మృతదేహాన్ని గుర్తించారు. ప్రథమ చికిత్స చేసి, ఆస్పత్రికి తరలించే లోపే అతను మరణించాడు. ముగ్గురు సభ్యుల ముఠాలోని ఒక వ్యక్తి బాధుతుడు హర్షన్‌ని మెట్లపై నుంచి కిందికి తోయగా, మరొకరు వెనక నుంచి కాల్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది.

సిరియా అధ్యక్షుడు అస్సాద్ దేశం విడిచిపెట్టాడు: రష్యా..

తిరుగుబాటుతో సిరియా రెబల్స్ హస్తగతమైంది. ఇప్పటికే ఇస్లామిక్ గ్రూప్ హయరత్ తహ్రీర్ అల్ షామ్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు రాజధాని డమాస్కస్‌ని ఆక్రమించుకున్నారు. ఇప్పటికే కీలక నగరాలైన అలెప్పో, హోమ్స్ వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో 24 ఏళ్లుగా సిరియాను పాలిస్తున్న అధ్యక్షుడు బషర్ అల్ అస్సాద్ పాలనకు తెరపడింది. 15 ఏళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం ముగిసింది.

ట్యాంక్ బండ్‌పై ఆకట్టుకున్న ఎయిర్‌ షో

కాంగ్రెస్‌ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ ఆకాశంలో వైమానిక ప్రదర్శన కనువిందు చేసింది. ఆదివారం నాడు ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ ఉత్కంఠభరితమైన విన్యాసాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి పి శ్రీనివాస రెడ్డి సహా పలువురు మంత్రులు హాజరై వైమానిక ప్రదర్శనను తిలకించారు. హైదరాబాద్‌లో వైమానిక ప్రదర్శన సందర్భంగా, ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయబడ్డాయి. పెద్ద సంఖ్యలో రద్దీని నియంత్రించడానికి, కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు పోలీసు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.

రేపు కాకినాడ జేఎన్టీయూలో టీచర్‌ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్

ఏపీలో డిసెంబర్‌ 5న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్‌ ఎమ్మెల్సీ ఉపఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉపఎన్నిక ఫలితాలు రేపు(డిసెంబర్‌ 9) వెలువడనున్నాయి. టీచర్‌ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్‌ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. రేపు కాకినాడ జేఎన్టీయూలో జరిగే టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ పర్యవేక్షించారు. 14 రౌండ్స్‌లో 9 టేబుల్స్‌పై అధికారులు ఓట్లను లెక్కించనున్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో ఐదుగురు అభ్యర్థులు నిలిచిన విషయం విదితమే.

జార్జ్ సోరోస్ ఫండింగ్ చేసిన సంస్థతో సోనియాగాంధీకి సంబంధం..

బీజేపీ అమెరికన్ డీప్ స్టేట్, జార్జ్ సోరోస్‌పై విరుచుకుపడుతోంది. గత కొన్నాళ్లుగా బీజేపీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు అమెరికాలోని డీప్‌స్టేట్, దాని వెనక జార్జ్ సోరోస్ వంటి వ్యక్తులు కుట్రలు చేస్తు్న్నారని, ఈ కుట్రల వెనక అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. ఈ వ్యాఖ్యలను అమెరికన్ రాయబార కార్యాలయం ఖండించింది. నిరాధారమైన ఆరోపణలు, దురుద్దేశపూరితమైన నివేదికలతో భారత దేశ వృద్ధిని దెబ్బతీసేందుకు అమెరికా డీప్ స్టేట్ పనిచేస్తోందని, ఇది కొంతమంది జర్నలిస్టులతో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కుమ్మక్కయ్యాయని సంబిత్ పాత్ర ఆరోపించడం సంచలనంగా మారింది.

ఇదిలా ఉంటే, తాజాగా మరోసారి బీజేపీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కాశ్మీర్‌ని స్వతంత్ర దేశంగా భావించేందుకు జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం అందించిన సంస్థతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆదివారం ఆరోపించింది. ఈ అసోసియేషన్ భారత్ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ సంస్థల ప్రభావాన్ని చూపుతుందని ఎక్స్ వేదికగా బీజేపీ ట్వీట్ చేసింది.

రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. స్పీకర్‌ ముందస్తు సమావేశం

రేపటి నుండి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ శాసనమండలి సమావేశాల నేపధ్యంలో ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో ఈరోజు శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు హాజరయ్యారు. వీరితో పాటు.. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఫైనాన్స్) -రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ MA &UD- దానకిశోర్, GAD సెక్రటరీ రఘనంందన్ రావు, హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ- రవి గుప్తా, రాష్ట్ర DGP డాక్టర్ జితేందర్, ADG, లా& ఆర్డర్ మహేష్ భగవత్, DG ఫైర్ నాగిరెడ్డి, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు -సివి అనంద్, సుధీర్ బాబు, అవినాష్ మహాంతి, ఇంటెలిజెన్స్ IG- కార్తికేయ, అసెంబ్లీ ఛీఫ్ మార్షల్- కర్ణాకర్, కౌన్సిల్ చీఫ్ మార్షల్ సంజీవ రెడ్డి పాల్గొన్నారు.

మంచు మనోజ్‌కు వైద్య పరీక్షలు పూర్తి.. డాక్టర్లు ఏం చెప్పారు?

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని టీఎక్స్‌ హాస్పిటల్‌లో మంచు మనోజ్‌కు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. సినీ నటుడు మంచు మనోజ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన కాలికి గాయం కావడంతో సతీమణి మౌనికతో కలిసి ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో వైద్యులు సిటీ స్కాన్, ఎక్స్‌రే పరీక్షలు జరిపారు. మెడ భాగంలో కండరాలపై స్వల్ప గాయమైనట్లు వైద్యులు వెల్లడించారు. కుడి కాలు కండరం నొప్పితో మంచు మనోజ్ ఆస్పత్రికి వచ్చారు. సిటీ స్కాన్, ఎక్స్‌రే రిపోర్టులలో నార్మల్ అని తేలింది. రెండు గంటల పాటు మంచు మనోజ్‌కు వైద్య పరీక్షలు సాగాయి. మరికొద్దిసేపట్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి మంచు మనోజ్ ఇంటికి వెళ్లనున్నారు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ మనోజ్ ఆస్పత్రికి వెళ్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది

అధికారం లోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని, ప్రభుత్వ చేతకాని తనం వల్ల అస్తవ్యస్తంగా మారిన పాలనకు విసుగుచెందిన రాష్ట్ర ప్రజలు తిరగబడుతున్న నేపథ్యంలో, తెలంగాణను తెచ్చి పదేండ్లు ప్రగతి పథాన నిలిపిన పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎక్కడికక్కడ ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరులను నిలదీయాలని, అందుకు సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీని వేదికగా చేసుకుని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గొంతు విప్పాలని, పార్టీ ఎమ్యెల్యేలకు ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

గురుకులాలపై సమీక్షించిన మంత్రి పొన్నం.. కీలక ఆదేశాలు

మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకులాల పై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. ఈ సమావేశంలో ఏంజెపి గురుకుల సెక్రటరీ సైదులు , ఆర్సీవో లు, డిసిఓలు , ప్రిన్సిపల్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత ఆహారంలో నాణ్యత తప్పనిసరిగా పాటించాలన్నారు. ఏదైనా స్కూల్లో సమస్యలు ఉంటే వెంటనే సెక్రటరీకి తెలియజేస్తే సెక్రెటరీ ద్వారా ప్రభుత్వానికి ఆ సమస్యలను చెప్పి పరిష్కరించడానికి ప్రతి ప్రిన్సిపల్ కృషి చేయాలన్నారు మంత్రి పొన్నం. విద్యార్థుల కోసం ఇప్పటికే సొంత భవనాలు ఉన్న 21 గురుకుల పాఠశాలలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగిందని, 4 సొసైటీ కార్యదర్శులలో తో కలిసి మెనోచార్టు ఫైనల్ చేసి ఆ మెనూలో మార్పులకు అనుగుణంగా విద్యార్థుల ఆరోగ్యాన్ని కి అధిక ప్రాధాన్యత ఇస్తూ సరికొత్త మెనూను అతి త్వరలో విద్యార్థులకు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యార్థులు ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి అవసరమైన పోషక ఆహారాన్ని అందించడంపై శ్రద్ధ వహించాలన్నారు.

 

Exit mobile version