జీతాల మోసం..185 మందిని తొలగించిన యాపిల్.. ఇంత కక్కుర్తి ఎందుకు..
జీతాల మోసానికి పాల్పడిన ఉద్యోగులను యాపిల్ సంస్థ తొలగించింది. ఛారిటీ నిబంధనలను దుర్వినియోగం చేసిన ఉద్యోగులను తీసేస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు కోల్పోయిన వారిలో భారతీయులతో సహా 185 మంది ఉన్నట్లు సమాచారం. ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అనుమతించే కార్యక్రమాన్ని ఉద్యోగులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అమెరికా కాలిఫోర్నియాలోని కుపెర్టినోలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నివేదికల ప్రకారం..జీతాల మోసానికి పాల్పడ్డారు. తమ పరిహారాన్ని పెంచుకోవడానికి మెసానికి పాల్పడ్డారని గుర్తించారు. దీంతో యాపిల్ దీనితో సంబంధం ఉన్న ఉద్యోగులను తొలగించింది. తొలగించబడిన ఉద్యోగుల్లో బే ఏరియాలోని అధికారులు ఆరుగురిని గుర్తించారు. వారిపై అరెస్ట్ వారెంట్ల్ జారీ చేయబడ్డాయి. అయితే, ఆరుగురిలో ఎవరూ భారతీయులు లేరు. కానీ తొలగించబడిని ఉద్యోగుల్లో ఎక్కువ మంది భారత సంతతికి చెందిన వ్యక్తులే ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి.
అప్పుడే ఉద్యోగ నోటిఫికేషన్లు.. TGPSC చైర్మన్ కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్రా వెంకటేశం ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2025 ఏప్రిల్ తరువాతే టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. 2025 మార్చి 31లోపు పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ల ఫలితాలను విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి జాప్యం లేకుండా ఫలితాలు త్వరగా విడుదల చేసే విధానాన్ని తీసుకుంటామన్నారు. ఈ రోజు గ్రూప్ 3 ప్రాథమిక కీ విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే వారం పదిరోజుల వ్యవధిలో గ్రూప్-1, 2, 3 ఫలితాలు కూడా విడుదల చేయాలనుకుంటున్నారు.
భారత్‌ను ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా మోడీ మార్చారు
భారత్‌ను ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా మార్చిన ఘనత ప్రధాని మోడీకి దక్కుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మోడీ ఏకతాటిపై నడిపిస్తున్నారని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకున్నారని.. అందుకే ప్రజలు భారీ మెజార్టీ అందించారని చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధికి మోడీ ఎంతగానో సహకరిస్తున్నారని… ఇందులో భాగంగానే ఈరోజు ఏపీకి రూ.2 లక్షల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. అభివృద్ధి అంటే ఏంటో ఎన్డీఏ ప్రభుత్వం చేసి చూపిస్తోందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
అంతకముందు సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఓపెన్ టాప్ వాహనం పైనుంచి ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పురందేశ్వరి ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు. దారి పొడవునా ప్రజలు పూల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు.
ఉత్సవాల ఊరేగింపులో రెచ్చిపోయిన గజరాజు
కేరళలోని మలప్పురం జిల్లాలోని తిరుర్ పట్టణంలోని పుతియంగడి ఆలయ ఉత్సవం సందర్భంగా ఒక ఏనుగు విరుచుకుపడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఐదు ఏనుగులు ఈ వేడుకలో పాల్గొన్నాయి. అయితే, ఇందులో పక్కాతు శ్రీకుట్టన్ అనే ఏనుగు ఒక్కసారిగా దూకుడుగా ప్రజలపై ఆగ్రహం చూపించింది. ఈ ఏనుగు తొండంతో ఓ వ్యక్తిని పైకి ఎత్తి పడేయడంతో అతడు పది అడుగుల దూరంలో పడ్డాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ గాయపడిన వ్యక్తిని వెంటనే అక్కడి ప్రజల సహాయంతో చికిత్స కోసం కొట్టక్కల్‌లోని మిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో ఆ వ్యక్తి మాతరమే కాకుండా మొత్తంగా 20 మంది దాకా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
చంద్రబాబు లక్ష్యాలకు అండగా ఉంటా
ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుకున్న లక్ష్యాలకు మేము అండగా ఉంటామని ప్రధాని మోడీ అన్నారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో మోడీ మాట్లాడారు. అంధ్రప్రదేశ్ అన్ని అవకాశాలు ఉన్న రాష్ట్రం అన్నారు. అభివృద్ధిలో ఏపీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. మీ ఆశీర్వాదంతో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు ప్రసంగాన్ని విన్నాను. రాష్ట్ర అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తానని. ఏపీ ప్రజల సేవే తమ సంకల్పం అని పేర్కొన్నారు. విశాఖలో దక్షిణ రైల్వే జోన్‌కు పునాది వేశామని.. ప్రత్యేక రైల్వేజోన్‌తో ఏపీ ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతోందన్నారు. రైల్వే జోన్‌తో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతోందని.. పర్యాటక రంగంతో కొత్త అవకాశాలు కూడా లభిస్తాయని వెల్లడించారు. మత్స్యాకారుల ఆదాయం పెరిగేలా చూస్తామని.. ఇప్పటికే వారికి కిసాన్ క్రిడెట్ కార్డులు కూడా అందజేసినట్లు తెలిపారు. సముద్రంలో మత్స్యకారుల భద్రత కోసం చర్యలు తీసుకుంటామని… నేడు చేపట్టిన ప్రాజెక్ట్‌లు ఏపీ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని మోడీ పేర్కొన్నారు.
గ్రూప్-3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ప్రిలిమినరీ కీ రిలీజ్
నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా దూసుకెళ్తోంది రేవంత్ సర్కార్. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల గ్రూప్స్ కు సంబంధించిన పరీక్షలను కూడా నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. గ్రూప్ 1, 2, 3 పరీక్షలను పూర్తి చేసింది టీజీపీఎస్సీ. లక్షలాది మంది నిరుద్యోగులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ క్రమంలో గ్రూప్ 3 అభ్యర్థులకు బిగ్ అలర్ట్ ఇచ్చింది టీజీపీఎస్సీ. గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని తాజాగా రిలీజ్ చేసింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి టీజీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను నమోదు చేసి కీని పొందొచ్చు. 12వ తేదీ వరకు గ్రూప్-3 కీ అందుబాటులో ఉండనుంది.
మోడీ అంటే నమ్మకం, విశ్వాసం
ఏపీలో ఎక్కడా లేని ఉత్సాహం విశాఖలో కనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. విశాఖలో మోడీ రోడ్ షో అదిరిందన్నారు. ఎక్కడికి పోయినా.. మోడీపై విశ్వాసం, నమ్మకం ప్రజలకు కలుగుతోందని తెలిపారు. రూ.2లక్షల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం కావడం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. విశాఖ ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వేజోన్ కల నెలవేరిందన్నారు. ఇకపై విజయాలే తప్ప.. అపజయాలు ఉండవన్నారు. గత ఐదేళ్లు ఏపీ వెంటిలేటర్‌పై ఉందని పేర్కొన్నారు. కష్టాలు ఉన్నాయని.. వాటిన్నంటినీ అధిగమిస్తామని.. అరకు కాఫీని మోడీనే ప్రమోట్ చేశారన్నారు. త్వరలో అమరావతికి మోడీ రావాలని కోరారు.
త్వరలో ఆ శాఖలో పదోన్నతులు.. గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్
జనవరి మాసాంతానికి నీటిపారుదల శాఖలో పదోన్నతులు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అదే క్రమమంలో బదిలీల ప్రక్రియ మొదలవుతుందన్నారు. ఫైవ్ మెన్ కమిటీ సిఫార్సులననుసరించి.. న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి బదిలీలు చేస్తామన్నారు. దశాబ్దాకాలంగా నీటిపారుదల శాఖ గాడి తప్పిందన్నారు మంత్రి ఉత్తమ్. ఎక్కువ ఖర్చుతో తక్కువ ప్రయోజనం జరిగిందని, నీటిపారుదల శాఖా బడ్జెట్ లో 11000 వేల కోట్లు అప్పులకు, వడ్డీలకే సరిపోతుందన్నారు. సంవత్సర కాలంగా శాఖాను గాడిలో పెడుతున్నామని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మానవ వనరులు, మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. సంవత్సరం వ్యవధిలో 700 ఏఈఈలు,1800 లష్కర్ ఉద్యగాల భర్తీ ఉంటుందన్నారు.
విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళన.. మోడీ స్పందించకపోవడంపై హైవేపై ధర్నా
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు రోడ్డెక్కారు. కూర్మన్నపాలెం గేట్ దగ్గర నేషనల్ హైవేపై కార్మికులు బైఠాయించారు. దీంతో పోలీసులు-కార్మికుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ప్రధాని మోడీ విశాఖ పర్యటనలో స్టీల్ ప్లాంట్‌పై సానుకూల ప్రకటన చేయలేదంటూ కార్మికులు ధ్వజమెత్తారు. ఎన్డీఏ ప్రభుత్వ తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ బుధవారం విశాఖలో పర్యటించారు. సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్ వరకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని రూ.2లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధికి సహకరిస్తామని.. చంద్రబాబు లక్ష్యాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రైల్వే జోన్‌తో ఏపీ ప్రజల కలనెరవేరుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సభలో స్టీల్ ప్లాంట్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు ప్రధాని మోడీ చేయలేదు.
భార్య వేధింపులకు మరొకరు బలి.. తుపాకీతో కాల్చుకుని న్యాయవాది ఆత్మహత్య
దేశంలో భార్య వేధింపులకు భర్తలు బలైపోతున్నారు. వరుస ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ మధ్య బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అతుల్ సుభాష్ ఆత్మహత్య.. అనంతరం ఢిల్లీలో కేఫ్ యజమాని పునీత్ ఖురానా సూసైడ్.. తాజాగా హస్తినలోనే న్యాయవాది ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో భార్య వేధింపులు తాళలేక న్యాయవాది సమీర్ మెహెందిర్తా (45) తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనకు ముందు భార్యతో విడాకులకు సంబంధించిన ఘర్షణ జరిగినట్లుగా తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 45 ఏళ్ల సమీర్ మెహెందిర్తా అనే న్యాయవాది ఢిల్లీలోని ముఖర్జీ నగర్ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో న్యాయవాద వృత్తిని చేస్తున్నారు. భార్యాభర్తలు విడివిడిగా జీవిస్తున్నారు. అయితే భార్యతో విడాకులకు సంబంధించిన గొడవ జరిగింది. దీంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బెదిరించాడు. భార్యతో చాటింగ్ చేస్తుండగా బుధవారం మధ్యాహ్నం సమీర్ తుపాకీ తీసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.