NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

టెట్, డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ప్రిపరేషన్ కు సమయం

ఏపీలో టెట్, మెగా డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ఈ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం కొత్త తేదీలను ప్రకటించనుంది. మంత్రి నారా లోకేష్‌ను కలిసి టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్దమయ్యేందుకు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరారు. ఈ క్రమంలో.. టెట్‌, మెగా డీఎస్సీ సన్నద్ధతకు సమయమిచ్చే అంశంపై విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్‌ సమీక్ష నిర్వహించారు. అభ్యర్థుల వినతిని పరిగణనలోకి తీసుకున్న మంత్రి లోకేష్‌.. టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధతకు మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరెన్.. చంపై సోరెన్ అసంతృప్తి..

ల్యాండ్ స్కామ్ కేసులో ఈడీ జనవరిలో హేమంత్ సోరెన్‌ని అరెస్ట్ చేసింది. అయితే, ఇటీవల జార్ఖండ్ హైకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. ఆరోపించిన విధంగా హేమంత్ సోరెన్ నేరానికి పాల్పడలేదని హైకోర్టు వ్యాక్యానించింది. ఇదిలా ఉంటే ఈడీ అరెస్టుకు ముందు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన హేమంత్ సోరెన్, ఇప్పుడు మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టడానికి రెడీ అవుతున్నారు. సోరెన్ అరెస్టు తర్వాత చంపై సోరెన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. సీఎంగా హేమంత్ సోరెన్‌ని కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు ఎన్నుకున్నాయి.

దగ్గు సిరప్ బాటిల్ మింగిన నాగుపాము.. చివరికి ఏమైందంటే..!

ఓ నాగుపాము ఇంటి పెరటిలోకి వచ్చి హల్‌చల్ చేసింది. ఇంటి ఆవరణలో కలియ తిరుగుతుండగా ఓ పెద్ద దగ్గు సిరప్ బాటిల్ కనిపించింది. దాన్ని ఏమనుకుందో.. ఏమో తెలియదు గానీ అమాంతంగా మింగేసింది. అది కాస్త లోపలికి వెళ్లక.. బయటకు రాక స్నేక్ విలవిలలాడింది. పాము పడుతున్న ఇబ్బందులను చూసి స్థానికులు స్నేక్ హెల్ప్ లైన్‌కు సమాచారం ఇచ్చారు. పాములు పట్టే వాలంటీర్లు వచ్చి చాకచక్యంగా.. చాలా రిస్క్ చేసి బాటిల్‌ను నోట్లో నుంచి నెమ్మది నెమ్మదిగా విడిచిపెట్టేలా చేశారు. దవడను సున్నితంగా నొక్కుతూ.. బాటిల్ బయటకు వచ్చేలా ప్రయత్నం చేశారు. అలా కొద్దిసేపటికి సిరప్ బాటిల్‌ను విడిచిపెట్టింది. అంతే బ్రతుకుజీవుడా అంటూ అక్కడ నుంచి నాగుపాము జారుకుంది. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది.

మిషన్ భగీరథ కార్మికుల వేతనాల పై సమగ్ర నివేదిక ఇవ్వండి

మిషన్ భగీరథ పథకం కింద 42 వేల కోట్లు ఖర్చు చేసి రాష్ట్రంలోని 1150 ఆవాసాలకు 50 శాతం నీళ్ళు సరఫరా చేస్తున్నామని ప్రస్తుతం చెబుతున్నారు.. ఇదే పథకం కింద రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు తాగునీటి సరఫరా జరుగుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. నీటి ఎద్దడి లేదని సర్పంచుల సంతకాలతో గతంలో అసెంబ్లీలో ప్రకటించారు. కేంద్రానికి నివేదిక పంపారని, అంటే ఆనాటి ప్రకటన బోగస్ అని భావించాలా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులను ప్రశ్నించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం..

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సీఎం హోదాలో తొలిసారి హస్తినకు వెళ్తున్నారు. రాష్ట్రానికి కీలక ప్రాజెక్టులు, నిధుల సమీకరణ, పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం ఢిల్లీ టూర్ ఉండనుంది. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. పోలవరం, అమరావతి పూర్తి, రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు నివేదిక ఇవ్వనున్నారు.

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కేకే

లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ కండువాను కప్పి కే.కేశవరావు ని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ(ఆర్గ్. ఇన్చార్జి) కేసీ వేణుగోపాల్ , తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపదాస్ మున్షీ , తదితరులు పాల్గొన్నారు. కేశవ రావుకు ఇంకా రెండేళ్ల పదవీ కాలం మిగిలి ఉన్నప్పటికీ రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకునే అవకాశాలు ఉన్నాయని వర్గాలు తెలిపాయి. ఆయన వైదొలిగితే, కాంగ్రెస్ పార్టీ ఆయనను తెలంగాణ నుంచి మళ్లీ నామినేట్ చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కేశవ రావు, కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన తర్వాత, BRS లో కీలక పదవిలో కొనసాగారు, దాని అధినేత కె. చంద్రశేఖర్ రావు ఆయనకు గొప్ప స్థానాన్ని కల్పించి, గులాబీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన పొలిట్‌బ్యూరోలో చేర్చుకున్నారు. పార్టీ. 2014లో బీఆర్‌ఎస్ టిక్కెట్‌పై మళ్లీ 2020లో రాజ్యసభకు పంపబడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023లో బీఆర్‌ఎస్ అధికారం నుంచి వైదొలిగిన తర్వాత , ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు అధికార కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ అసెంబ్లీలో 64 నుంచి 70కి చేరిన బీఆర్‌ఎస్‌కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు .

పదవి ఉన్న లేకపోయినా నేను రాజా లానే ఉంటాను..

కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్త పల్లి సెంటర్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిఠాపురం ప్రజలు తనకు చాలా బాధ్యతలు ఇచ్చారన్నారు. ఏలేరు సుద్దగడ్డ ఆధునికీకరణ చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా.. పిఠాపురంని టెంపుల్ టూరిజంగా డెవలప్ చేస్తామని తెలిపారు. పిఠాపురం ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనన్నారు. 18 నెలల్లో తీరం కోత సమస్యను పరిష్కరిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఉప్పాడ తీర ప్రాంతంను టూరిజం స్పాట్ గా మారుస్తానని అన్నారు.

కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారు

అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్నా హామీలు అమలు చేయడం లేదని బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారని, వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన కాంగ్రెస్ హామీల అమలు ఏమైంది ? అని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 9న రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పారు… కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇచ్చిన మ్యానిఫెస్టో మీద, సోనియా మీద, ఇందిరా గాంధీ మీద కూడా గౌరవం లేదని, అభయహస్తం పేరు తో మ్యానిఫెస్టోలో వరి ధాన్యానికి 2683 రూపాయల మద్దతు ధర ఇస్తామని చెప్పారు ఏమైంది ? అని ఎంపీ రఘునందన్‌ రావు అన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ ఎందుకు చేయలేదు ? అని, ఇందిరమ్మ రైతు భరోసా ఎక్కడ ? వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు.. ఏమైంది ? అని ఆయన అన్నారు. రుణ మాఫీ పద్రాగస్ట్ చేస్తామని భువనగిరిలో లక్ష్మి నరసింహ స్వామీ మీద, మెదక్ లో ఏడుపాయల దుర్గమ్మ మీద రేవంత్ రెడ్డి ఒట్లు వేశారని, ఎలా చేస్తారో చెప్పడం లేదన్నారు.

చంద్రబాబు.. నితీష్ తో మోడీ మూడోసారి ప్రధాని అయ్యారు

చంద్రబాబు.. నితీష్ తో మోడీ మూడోసారి ప్రధాని అయ్యారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 400 సీట్లు గెలుస్తాం అని చెప్పిన మోడీకి మూడోసారి ప్రధాని అయ్యిన ఆనందం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు అపాయింట్ మెంట్ అడిగితే కూడా ఇవ్వని మోడీ.. చంద్రబాబు బలంతో ప్రధాని అయ్యారని జగ్గారెడ్డి విమర్శించారు. పవన్ కల్యాణ్‌ని ముందు పెట్టి… టీడీపీ ని కలుపుకుని బీజేపీ గేమ్ ఆడిందని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ ప్రధాని అయ్యాడు అంటే టీడీపీ..నితీష్ పుణ్యమే అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కుటుంబం ది త్యాగాల చరిత్ర..మోసాల చరిత్ర బీజేపీ ది.. మోడీ ది అని, శివుడి పటం తో పార్లమెంట్ కి రాహుల్ గాంధీ వచ్చాడు.. మోడీ ఎప్పుడైనా రాముడి చిత్రపటం తెచ్చాడా అని ఆయన మండిపడ్డారు. రాహుల్ గాంధీ మీద ఏం మాట్లాడాలో తెలియక పిల్ల చేష్టలు అంటున్నాడు మోడీ అని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు మోడీ మైండ్ బ్లాంక్ అయ్యిందని, రాహుల్ గాంధీ వయసు గురించి మాట్లాడుతున్న మోడీ కి కాంగ్రెస్ వయసంత లేదన్నారు. బీజేపీ కి కూడా కాంగ్రెస్ కి ఉన్నంత వయసు లేదన్నారు జగ్గారెడ్డి.

మియాపూర్‌లో గ్యాంగ్ రేప్ కేసు.. నిందితులు అరెస్ట్‌

మియాపూర్‌లో గ్యాంగ్ రేప్ కేసు పురోగతి లభించింది. గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సైబరాబాద్‌ పోలీసులు మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ కంపెనీ సేల్స్ మెన్ లు గ్యాంగ్ రేప్ పాల్పడ్డారని, సైట్ విజిట్ కోసం అని చెప్పి యువతిని హాస్టల్ నుంచి పికప్ చేసుకున్నారని తెలిపారు. యాదగిరిగుట్ట వద్ద నిర్మానుష భవనం లో కారుని నిలిపివేశారని, కారు చెడిపోయిందని చెప్పి యువతికి సాకుగా చూపెట్టారని పోలీసులు పేర్కొన్నారు. యువతి చేత బలవంతంగా ఆహారాన్ని తినిపించే ప్రయత్నం చేశారని, యువతి ఆహారం తినకపోవడంతో కూల్ డ్రింక్ తీసుకొచ్చి ఇచ్చారని, కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి యువతి కి యువకులు తాగించారని పోలీసులు పేర్కొన్నారు. అదే సమయంలో యువతికి కి కొంత ఆహార పదార్థాలు కూడా బలవంతంగా తినిపించారని, కారులోనే యువతి స్పృహా కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. యువతికి స్పృహా వచ్చిన తర్వాత హాస్టల్లో వదిలిపెట్టి వెళ్లిపోయారని, యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని విచారణ జరిపామని పోలీసులు వెల్లడించారు. గ్యాంగ్ రేప్ జరిపిన సంగారెడ్డి, జనార్ధలపై చర్యలు తీసుకోవాలని యువతి ఫిర్యాదు చేసిందని, యువతి ఫిర్యాదు పైన ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.