తిరుమలలో భారీ వర్షం.. చల్లబడిన వాతావరణం
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసినా 45 డిగ్రీలు, 46 డిగ్రీలు నమోదవుతోంది. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటేనే జనం జంకుతున్నారు. మండే ఎండలతో వడగాలులకు వడదెబ్బ తాకి జన ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంటే.. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల కొండల్లో జోరు వాన పడింది. భారీ వర్షం పడడంతో వాతావరణం చల్లబడింది. తిరుపతి దేవస్థానం సమీపంలోని మాఢవీధుల చుట్టుపక్కల్లో ఈ వర్షం పడింది. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, వడగాలులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఉపశమనం పొందారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు..
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ఏళ్లతరబడి రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ చట్టాన్ని అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో సజ్జల మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టంపై బీజేపీని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించాలని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. కానీ వైసీపీపై దుష్ప్రచారం చేయడం రాజకీయ కుతంత్రలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ చట్టంపై ఏపీ బీజేపీ శాఖ స్పందించాలని డిమాండ్ చేశారు. ముస్లింలకు 4శాతం రిజర్వేషన్‌పై బీజేపీ విధానాన్ని స్పష్టం చేయాలని కోరారు. రాజకీయ జీవితంలో ఏనాడు ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసే అలవాటు టీడీపీ అధినేత చంద్రబాబుకు లేదని , ఇటీవల కూటమి నాయకులు విడుదల చేసిన మేనిఫెస్టోకు బీజేపీ సహకారం లేదని అన్నారు.
దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం నియంత పాలన కొనసాగిస్తుంది
బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకొని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలే స్వయంగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఓటు వేయాలని చెప్పడం విడ్డూరంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక మర్చిపోయారన్నారు బాల్క సుమన్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టిన ప్రజలు స్వాగతిస్తున్నారని, ప్రజాదరణ పొందుతున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద 48 గంటలు ఈసీ నిషేధించడం బిజెపి పార్టీ కుట్రలో భాగం మాత్రమేనన్నారు. రైతు రుణమాఫీ, మహాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి, లాంటి సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదో తెలంగాణ ప్రజానీకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు బాల్క సుమన్. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ సూచించిన బలహీనమైన అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బరిలో నిలిపిందన్నారు. ఆర్.ఆర్ టాక్సీ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజానీకాన్ని దోపిడీకి గురి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఒకే రోజు మిగిలి ఉంది.. అయేథీ, రాయ్‌బరేలీపై ఖర్గే, రాహుల్ గాంధీ చర్చలు..
కాంగ్రెస్ కంచుకోటలైన అయేథీ, రాయ్‌బరేలీ స్థానాలపై ఆ పార్టీ ఇంకా ఎటూ తేల్చడం లేదు. శుక్రవారంతో నామినేషన్ గడువుకు ముగుస్తున్న నేపథ్యంలో, అభ్యర్థి ఎవరనేదాన్ని కాంగ్రెస్ చెప్పడం లేదు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆందోళన పెరుగుతోంది. అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో చర్చిస్తున్నారు. రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల ర్యాలీ తర్వాత ఇరువురు నేతలు అభ్యర్థుల ఎంపికపై ఒక నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థిపై ఏ క్షణానైన ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.
చివరికి ఈసీ కూడా బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోంది
కేసీఆర్ పై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుందని, ఎన్నికల కమిషన్ బీజేపీ కనుసన్నల్లో నడుస్తోందని విమర్శలు గుప్పించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టే విదంగా మాట్లాడుతుందని, బీజేపీ సోషల్ మీడియా లో ముస్లింల ను టార్గెట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారని, నరేంద్ర మోడీ ముస్లిం ల పిల్లల పై విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారన్నారు. కానీ ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు కేటీఆర్. కేసీఆర్ విషయం లో ఆఘమేఘాల మీద నోటీస్ లు ఇచ్చారని, కేసీఆర్ సిరిసిల్లలో రైతుల దగ్గరకు వెళ్ళినప్పుడు మీడియా తో మాట్లాడారని, నేతన్నల తరుపున కొంచెం పరుష పదజాలం తో మాట్లాడారన్నారు. దీనికే నోటీసులు ఇచ్చారని, సీఎం రేవంత్ రెడ్డి ఇంకా తీవ్ర స్థాయిలో మాట్లాడారని, మేము ఇప్పటి వరకు 9 సార్లు రేవంత్ రెడ్డి పై కంప్లైంట్ ఇచ్చామని తెలిపిన కేటీఆర్.. మొత్తం 27 కంప్లైంట్ లు ఇచ్చామన్నారు. అయినా ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, బడాబాయ్ , చోటాబాయ్ లపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదన్నారు. 48 గంటలు కేసీఆర్ ను తాత్కాలికంగా ఆపగలరని, కానీ ఓట్లు వేసే జనాలను ఆపలేరని కేటీఆర్ అన్నారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మైనార్టీలను కంటికి రెప్పలా కాపాడుకున్నాం..
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రచారంలో తనదైన శైలిలో ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మైనార్టీ నాయకులతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథులుగా రాగిడి లక్ష్మారెడ్డితో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల బీఆర్‌ఎస్ అభ్యర్థిని నివేదిత పాల్గొన్నారు. కంటోన్మెంట్ లీ ప్యాలెస్‌లో గార్వి వేడుకలతో పాటు సమావేశాన్ని మైనర్టీ నాయకులు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రి మల్లారెడ్డితో టు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఉప ఎన్నికల ఇంచార్జి రావుల శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తమ అభ్యర్ధులను గెలిపించాలంటూ అతిధులు విజ్ఞప్తి చేశారు.
ఆదిలాబాద్ అంటే నాకు అభిమానం
కొమురంభీం జిల్లాలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదివాసీలపై బీజేపీ, బీఆర్ఎస్ లకు ప్రేమ లేదన్నారు. ఆదివాసీల సమస్యల్ని పట్టించు కోలేదని ఆయన మండిపడ్డారు. సోయం బాపూరావు సమస్యలు పరిష్కరించాలని బీజేపీ కేంద్ర మంత్రుల చూట్టూ తిరిగినా పట్టించు కోలేదని, ఆఖరికి బీజేపీ సిట్టింగ్ ఎంపీ అయిన సోయం బాపు రావు కు టికెట్ ఇవ్వకుండా అవమానించిందని ఆయన విమర్శించారు. ఆత్రం సుగుణకు అవకాశం ఇవ్వండి మీకోసం పనిచేస్తుందని, ఆదిలాబాద్ అంటే నాకు అభిమానమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే యూనివర్శిటి ఇస్తా అని హమీ ఇచ్చానని, ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను ఆదుకున్నామన్నారు. పేదలను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. 1881 నుంచి జనాభా లెక్కలు చెయ్యడం విధానం ఉందని, బీజేపి అధికారం లోకి వచ్చాక జనాభా లెక్కించ లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2021 జనాభా లెక్కించ కుండా మోడీ, అమిత్ షా కుట్ర చేసారని, బలహీన వర్గాల కుల గణగణ చేయాలనే డిమాండ్ వచ్చిందని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచే తప్పని సరి పరిస్తితి వస్తుందని జనాభా లెక్కించలేదన్నారు.
చేవెళ్ల గడ్డపై బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం పక్కా
మండుటెండలో సుడిగాలి పర్యటన చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్ బస్సు యాత్రకు అన్యుహ్య స్పందన వస్తుందని 12 సీట్లలో బీఆర్ఎస్ గెలుస్తుందని నివేదికలు రావటంతో బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కై కేసీఆర్ 48 గంటలు ప్రచారాన్ని అడ్డుకుంటున్నారన్నారు. 5 నెలల్లో రేవంత్ పరిపాలన చూసి కేసీఆర్‌ని ఎందుకు వదులుకున్నాం అని నేడు ప్రజలు బాధపడుతున్నారన్నారు. కేసీఆర్ పాలనలో రెప్పపాటు కరెంట్ పోకుండే… ఇపుడు తరుచూ పోతుందన్నారు. మోడీ,రేవంత్ రెడ్డిలు ఎన్నికల ప్రచారాల్లో మాట్లాడింది కనిపించటం లేదా అని ప్రశ్నించారు. 96 బీసీ కులాలను ఏకం చేసిన గొప్ప నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ ని గెలిపించుకుని సత్తా చాటాలన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కోసం పార్లమెంట్ లో గట్టిగా పోరాటం చేస్తారన్నారు. కేసీఆర్ తయారు చేసిన ఇద్దరు నేతలే కాసాని జ్ఞానేశ్వర్ కి పోటీగా వస్తున్నారని, వారిద్దరికీ ఓటుతో బుద్ధి చెబుతాం అన్నారు. 2 లక్షల రుణమాఫీ,4 వేల పెన్షన్, రైతు బంధు ఎకరాకు 15 వేలు డిసెంబర్ 9 నాడే ఇస్తామని నేటికి ఇవ్వలేదని, గతంలో ఇచ్చిన రైతు బంధు కూడా నాలుగు, ఐదు ఎకరాల వరకే ఇచ్చారని, పెన్షన్లు రెండు వేల రూపాయలే ఇచ్చి ఒక నెల 25 వ తేదీన, మరొక నెల ఇవ్వనే లేదన్నారు. ప్రజలంతా కసిగా కారు గుర్తుకు ఓటు వేసి అబద్ధాల ప్రచార కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలన్నారు.ఆగస్ట్ 15 వ తేదీన 2 లక్షల రుణమాఫీ చేస్తామని దేవుళ్ళ మీద ముఖ్యమంత్రి ఒట్టు వేస్తున్నారని, ఆ మాటలను ప్రజలు నమ్మటం లేదన్నారు.
ఈ పాపమంతా చంద్రబాబుదే.. అనుభవించక తప్పదు..
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పైచంద్రబాబు నాయుడు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ల్యాండ్ ఓనర్లకు మంచి చేయడానికి జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకువచ్చారని మంత్రి చెప్పారు. చిలువలు పలువులుగా మాట్లాడుతూ స్వప్రయోజనానికి తీసుకొచ్చారంటున్నారని ఆయన ఆగ్రహించారు. రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డి భూములంతా తీసుకుంటాడా.. ఇలాంటి మాటలు విపక్షాలకు తగవన్నారు.
