NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్ న్యూస్

Top Headlines@9am

Top Headlines@9am

నేడు రోజ్‌గార్‌ మేళా.. 71 వేల మందికి నియామక పత్రాలను అందించనున్న ప్రధాని మోడీ

నేడు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొలువల జాతర జరగబోతుంది. ఉదయం 10:30 గంటలకు ‘రోజ్‌గార్‌ మేళా’లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 71 వేల మంది యువకులకు నియామక పత్రాలను అందించనున్నారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరిగే రోజ్‌గార్‌ మేళా ప్రోగ్రాంలో ప్రధాని వర్చువల్‌గా పాల్గొని మాట్లాడనున్నారు. ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లో కేంద్ర మంత్రుల ద్వారా నియామక పత్రాలను ఇవ్వనున్నారు.

ఇక, ఉన్నత విద్యా శాఖ, వైద్య ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆర్థిక సేవలు, కేంద్ర హోంశాఖ, పోస్టల్‌ డిపార్ట్మెంట్ తదితర శాఖల్లో 71 వేల మందిని ఒకేసారి భర్తీ చేస్తున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. అయితే, రోజ్‌గార్ మేళా దేశ నిర్మాణంతో పాటు స్వీయ-సాధికారతలో యువకుల భాగస్వామ్యం ఉండాలని ప్రధాని మోడీ తెలిపారు.

యుద్ధం అనివార్యం అంటున్న డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో సరికొత్త టాపిక్ తీసుకొచ్చాడు. టాపిక్ పేరు ‘ఎండ్ లెస్ బాటిల్’. మరి పూరి మాటల్లోనే ‘ఎండ్ లెస్ బాటిల్’ అంటే ఏంటో విందాం. పూరి మాటల్లో.. ‘అనంత మహాసముద్రం.. అరుస్తున్న కెరటాలు.. అదుపు తప్పిపోయిన గాలులు.. అలలపై కలల మధ్య గుంపులుగా చేరిన జనం. ఎలాగూ పోతాం.. తప్పించుకునేందుకు మరో దారేలేదు. అందుకే పోయే ముందు బతుకుదాం. అనుభవిద్దాం, ఆస్వాదిద్దాం, అర్థం పరమార్థం ఏంటో తేల్చేద్దాం. ఇంకా నడి మధ్యనే ఉన్నాం. ఇంకెంత దూరమో ఈ ప్రయాణం. గత ప్రయాణం అదొక కథ. రేపటి ప్రయాణం మరొక కథ. పిట్ట కథలు మనకెందుకు ? ఇప్పుడే ఇక్కడే తాపీగా బతికేద్దాం. మళ్లీ మబ్బులు.. చంపుకుని తినే చినుకులు. ఇది వానో పెను తుపానో! పడవలోకి నీరొస్తే.. పరదా చిరిగిపోతే.. భయపడేదేలే. వలలో ఒక్క చేపా చిక్కలే.. అయితేనేం ? పస్తులుందాం.. ఫర్వాలేదు. ఇవాళ ఆకలితో కడుపు మాడితే.. రేపటి వేట తీరు వేరేలా ఉంటుంది.

మెరిసిన స్మృతి, రేణుక.. 211 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం!

వెస్టిండీస్‌పై టీ20 సిరీస్‌ను 2-1తో గెలుచుకున్న భారత మహిళా జట్టు.. మూడు వన్డేల సిరీస్‌లోనూ బోణీ కొట్టింది. వదోదర వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో 211 పరుగుల తేడాతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. 315 పరుగుల ఛేదనలో విండీస్‌ 26.2 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ అయింది. అఫీ ఫ్లెచర్ (24) టాప్ స్కోరర్. భారత బౌలర్ రేణుక సింగ్‌ (5/29) ఐదు వికెట్స్ పడగొట్టింది. రేణుకకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. డిసెంబర్ 24న భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య రెండో వన్డే జరగనుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ 9 వికెట్లకు 314 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (91; 102 బంతుల్లో 13×4), ప్రతీక రావల్‌ (40; 69 బంతుల్లో 4×4)లు తొలి వికెట్‌కు 110 పరుగులు జోడించారు. రావల్‌ అనంతరం హర్లీన్‌ డియోల్‌ (44) దూకుడుగా ఆడింది. సెంచరీ చేసేలా కనిపించిన స్మృతి 91 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఎల్బీగా వెనుదిరిగింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (34), రిచా ఘోష్‌ (26), జెమీమా రోడ్రిగ్స్‌ (31) రాణించడంతో భారత్ స్కోరు 300 దాటింది. విండీస్‌ బౌలర్లలో జైదా జేమ్స్‌ (5/45) ఐదు వికెట్స్ తీసింది.

“సలార్ పార్ట్ 2” రిలీజ్ పై సాలిడ్ అప్డేట్.. వచ్చేది ఎప్పుడంటే ?

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ పార్ట్ 1 తెరకెక్కింది. ఈ సినిమా బావుందని కొంతమంది బాలేదని కొంతమంది ఇలా రకరకాల ప్రచారాలు చేశారు. అయితే డబ్బులు మాత్రం దండిగానే వచ్చాయి కానీ ఆశించిన మేరకు రాకపోవడంతో సెకండ్ పార్ట్ ఉండకపోవచ్చు అని ప్రచారం జరిగింది. కానీ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సలార్ 2 సినిమా షూటింగ్ మొదలుపెట్టినట్లు పలువురు బాలీవుడ్ క్రిటిక్స్ తో పాటు బడా మీడియా సంస్థల అధికారిక హ్యాండిల్స్ నుంచి న్యూస్ షేర్ అయింది. అయితే నిజానికి అది నిజం కాదని తెలుస్తోంది.

దుబాయ్‌లో భారత్‌ మ్యాచ్‌లు.. భారత్‌ అర్హత సాధించకపోతే..!

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఆతిథ్యంపై అనిశ్చితి వీడిన విషయం తెలిసిందే. బీసీసీఐ కోరిక మేరకు హైబ్రిడ్ మోడల్‌లోనే టోర్నీ జరిపేందుకు పీసీబీ అంగీకరించింది. అయితే పీసీబీ కోరినట్లుగా 2024-27 మధ్య ఐసీసీ ఈవెంట్లలో ఇండో, పాక్ మ్యాచ్‌లు.. భారత్‌ లేదా పాకిస్థాన్‌లో ఎక్కడ జరిగినా తటస్థ వేదికలోనే నిర్వహిస్తారు. భద్రతా కారణాల దృష్ట్యా పాక్‌లో పర్యటించబోమని ఐసీసీకి బీసీసీఐ తేల్చిచెప్పడంతో.. పీసీబీ టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించేందుకు సిద్దమైంది.

సలార్ థియేటర్స్ లో సరిగా ఆడలేదు : ప్రశాంత్ నీల్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం సలార్. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టింది. శృతిహాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలోని యక్షన్ సీక్వెన్స్ ఫ్యాన్స్ ఎంతగానో అలరించాయి. కెజిఎఫ్ వంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మించిన హోంబాలే ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిచింది. రవి బస్రుర్ సంగీతం అందించారు. వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను రూ. 800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.

నేడు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష

సీఎం రేవంత్‌ రెడ్డి నేడు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ భారతి, ఇందిరమ్మ ఇళ్లపై వివరాలను అధికారుల నుంచి తెలుసుకోనున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కోసం ఇంటింటికి సర్వేలు చేపడుతున్న ప్రభుత్వం.. చాలా వరకు సర్వేను పూర్తి చేసింది. అయితే… సంక్రాంతి తర్వాత పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేసే యోచనలో తెలంగాణ సర్కార్‌ ఉంది. ఈ క్రమంలోనే అధికారులతో ఇందిరమ్మ ఇళ్లపై సమీక్షించనున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. అంతేకాకుండా.. గత ప్రభుత్వంలో ఉన్న ధరణి పోర్టల్‌ను భూభారతిగా మార్చనున్న విషయం తెలిసిందే. అయితే.. భూభారతిపై కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

వివాహ బంధంలోకి పీవీ సింధు.. దీవి ప్రత్యేకతలు ఇవే!

ఇన్నాళ్లూ రాకెట్ పట్టి మైదానంలో ప్రత్యర్థులను హడలెత్తించిన భారత స్టార్‌ పీవీ సింధు.. వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకట దత్త సాయితో సింధు వివాహం ఘనంగా జరిగింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌ సాగర్‌ సరస్సులో ఉన్న రఫల్స్‌ హోటల్‌లో ఆదివారం రాత్రి 11.20కి మూడుముళ్ల బంధంతో సింధు, సాయి ఒక్కటయ్యారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, ప్రత్యేక అతిథులు మాత్రమే హాజరయ్యారు. కొత్త జంటకు ప్రముఖులు, ఫాన్స్, నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.

ఎయిరిండియా విమానంలో కొట్టుకున్న ప్రయాణికులు.. ఎందుకో తెలుసా..?

ఎయిర్‌ ఇండియా విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఆర్మ్‌రెస్ట్‌ కోసం ఘర్షణకు దిగారు. అయితే, డెన్మార్క్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఫ్లైట్ లోని ఎకానమి తరగతిలో సీటు పక్కన చేయి పెట్టుకునే ఆర్మ్‌రెస్ట్‌ విషయంలో ఆ ఇద్దరు ప్రయాణికుల మధ్య తొలుత వాగ్వాదం జరిగింది. ఇక, విమానంలోని క్యాబిన్‌ సిబ్బంది వారి సమస్యను పరిష్కరించి అందులో ఒకరికి దూరంగా మరో సీటును ఇచ్చారు.

కుర్చీ కోసం వైసీపీ, టీడీపీ మధ్య వార్.. నేటి సర్వసభ్య సమావేశంకు భారీ బందోబస్తు!

కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో వేదికపైన ఎమ్మెల్యేలకు కుర్చీలు ఏర్పాటు చేసే అంశం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. గత మున్సిపల్ సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవికి కుర్చీ వేయలేదని ఆమె నిలబడి ప్రసంగించారు. ఈ క్రమంలో మున్సిపల్ మేయర్ సురేష్ బాబుపై ఆరోపణల వర్షం కురిపించారు. దీంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది. వాయిదా పడ్డ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశాన్ని నేడు నిర్వహించడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.

నవంబర్ 7వ తేదీన జరిగిన మున్సిపల్ సమావేశంలో గందరగోళం నెలకొనడంతో మున్సిపల్ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ సమావేశాన్ని నేడు (డిసెంబర్ 23) నిర్వహించాలని మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి భారీ బందోబస్తు కావాలంటూ పోలీసులను మున్సిపల్ మేయర్ సురేష్ బాబు కోరారు. గత నెల రోజులుగా మున్సిపల్ సమావేశంలో వేదికపై కుర్చీ కోసం వైసీపీ, టీడీపీ మధ్య వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు జరగబోవు సమావేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొనే పరిస్థితులు ఉన్న కారణంగా మున్సిపల్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నారు.

 

Show comments