టర్కీలో బలమైన భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.6గా నమోదు
మిడిల్ ఈస్ట్ దేశం టర్కియేలో బలమైన భూకంపం సంభవించింది. సెంట్రల్ టర్కియేలో గురువారం ఒక మోస్తరు తీవ్రతతో భూకంపం సంభవించిందని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. భూకంప తీవ్రత 5.6గా నమోదైంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం.. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు రాలేదు. డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ప్రెసిడెన్సీ ప్రకారం.. రాజధాని అంకారాకు తూర్పున 450 కిలోమీటర్లు (280 మైళ్ళు) దూరంలో ఉన్న టోకట్ ప్రావిన్స్‌లోని సులుసరాయ్ నగరంలో భూకంపం సంభవించింది.
భూకంపం రావడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అయితే, అంతకుముందు టర్కీలో సంభవించిన భూకంపాలలో, మరణించిన వారి సంఖ్య వెయ్యికి పైగా చేరుకుంది. అంతకుముందు కూడా ఫిబ్రవరి 2023లో టర్కీలో సంభవించిన భూకంపం కారణంగా అనేక వేల మంది చనిపోయారు.
కూతురి హంతకుడిని చంపిన తల్లి.. బెంగళూర్‌లో డబుల్ మర్డర్ కలకలం..
బెంగళూర్ నగరంలో డబుల్ మర్డర్ కలకలం సృష్టించింది. 24 ఏళ్ల మహిళను ఓ వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేయగా.. ఆమె తల్లి హంతకుడిని చంపేసింది. ఈ ఘటన గురువారం జయనగర్‌లోని సారక్కి పార్క్‌లో జరిగింది. మృతురాలిని అనూషగా, మృతుడిని 44 ఏళ్ల సురేష్‌గా గుర్తించారు. వీరిద్దరికి ఐదేళ్లుగా పరిచయం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఓ పార్క్‌లో అనూష, సురేష్ మధ్య వాగ్వాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కొన్నాళ్లుగా అనూష్, సురేష్‌కి దూరంగా ఉంటోంది. అతడితో సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేదని చెప్పడంతో సురేష్ ఆమెని రెండుసార్లు కత్తితో పొడిచారని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
ఫస్ట్ టైం మొబైల్ నెట్ వర్క్ అందుకున్న గ్రామం.. గ్రామస్తులతో మాట్లాడిన మోడీ
స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినా దేశంలోని కొన్ని ప్రాంతాలకు కనీస సౌకర్యాలు లేవు. కానీ క్రమంగా మోడీ ప్రభుత్వం వారికి అన్ని సౌకర్యాలు, వసతులు కల్పిస్తోంది. అలాంటి గ్రామమే హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితికి చెందిన గ్యు. ఈ గ్రామం మొదటిసారిగా మొబైల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయబడింది. అనంతరం గ్యు గ్రామ వాసులతో ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్‌లో మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రధాని మోడీ 13 నిమిషాలకు పైగా ప్రజలతో ఫోన్‌లో మాట్లాడారు. సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఒక గ్రామస్థుడు ప్రధానమంత్రికి తన ప్రాంతం మొబైల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయబడుతుందని తాను నమ్మలేకపోతున్నానని తన ఆనందానికి అవధులు లేవని చెప్పాడు. గతంలో మొబైల్ ఫోన్లలో మాట్లాడాలంటే దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చేదని గ్రామస్తులు తెలిపారు.
పెద్ద సంఖ్యలో ఓటేయాలి.. ఓటర్లకు ప్రధాని మోడీ సందేశం..
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ రోజు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు పోలింగ్ జరగబోతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఓటర్లకు సందేశాన్ని పంపారు. ప్రజలు, ముఖ్యంగా యువకులు, తొలిసారి ఓటు వేసే ఓటర్లు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని కోరారు. ఇంగ్లీషు, హిందీ, తమిళం, మరాఠీ, బెంగాలీ మరియు అస్సామీ భాషల్లో ఎక్స్ వేదికగా ఆయన ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల్లో ప్రతీ ఓటు, ప్రతీ గొంతు ముఖ్యమైనదని అన్నారు.
‘‘2024 లోక్‌సభ ఎన్నికలు ఈరోజు ప్రారంభం కానున్నాయి! 21 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో 102 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నందున, ఈ స్థానాల్లో ఓటు వేసే వారందరూ తమ ఓటు హక్కును రికార్డు సంఖ్యలో వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా యువకులు మరియు మొదటిసారి ఓటర్లు పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని నేను పిలుపునిస్తున్నాను. ప్రతి ఓటు లెక్కించబడుతుంది మరియు ప్రతి వాయిస్ ముఖ్యమైనది!’’ అంటూ ట్వీట్ చేశారు.
నేడు నామినేషన్ దాఖలు చేయనున్న జి.కిషన్ రెడ్డి
పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు తొలిరోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారులు తెలిపారు. మల్కాజిగిరి స్థానానికి 8 నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు. ఇక మరోవైపు ఇవాళ సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరుకానున్నారు. ముందుగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేశారు.
కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఆర్మీ చీఫ్ సహా 9 మంది మృతి
కెన్యా మిలిటరీ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒగోలా గురువారం దేశంలోని పశ్చిమ ప్రాంతంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ ఫ్రాన్సిస్ ఒగోలాతో పాటు మరో తొమ్మిది మంది ఆర్మీ సభ్యులు మరణించారని కెన్యా అధ్యక్షుడు విలియం రూటో తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారని ఆయన తెలిపారు. గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన వెంటనే హెలికాప్టర్ కూలిపోయిందని చెబుతున్నారు. కెన్యా డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ ఒమోండి ఒగోలా మరణాన్ని ప్రకటించడానికి నేను చాలా బాధపడ్డాను అని అధ్యక్షుడు అన్నారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు ఎల్జియో మరక్వెట్ కౌంటీలోని సంఘటనా స్థలానికి పరిశోధకుల బృందాన్ని పంపినట్లు ఆయన తెలిపారు. కెన్యాలోని నార్తర్న్ రిఫ్ట్ ప్రాంతంలోని దళాలను సందర్శించడానికి.. స్కూల్ రినోవేషన్ పనులను పరిశీలించడానికి జనరల్ ఒగోలా గురువారం నైరోబీ నుండి బయలుదేరినట్లు విలియం రూటో చెప్పారు.
నేడు కాకినాడ జిల్లాలోకి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర
నేడు కాకినాడ జిల్లాలోకి సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర ప్రవేశించనుంది. సాయంత్రం అచ్చంపేట జంక్షన్‌లో బహిరంగ సభ నిర్వహించనుండగా.. ఆ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం వైఎస్ జగన్ గురువారం రాత్రి బస చేసిన ఎస్‌టీ రాజపురం ప్రాంతం నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్దకు చేరుకొని బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
తల్లిని రాజకీయాలకి ఎందుకు లాగుతున్నారు.. బండిసంజయ్ పై పొన్నం ఫైర్
తల్లిని రాజకీయాలకు తల్లిని ఎందుకు లాగుతున్నారు అంటూ బండి సంజయ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. కరీంనగర్ జిల్లా అంబేద్కర్ స్టేడియంలో మంత్రి పొన్నం మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలతో ముచ్చటించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణకి సంబంధించిన విభజన హామీలు పదేండ్లలలొ నెరవేర్చలేదన్నారు. 29 రాష్ట్రాలకి ఏ విధంగా నిధులు వస్తాయో తెలంగాణ కి అదే విధంగా నిధులు వస్తున్నాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి ప్రస్టేషన్ లో ఉన్నాడని తెలిపారు. ప్రభుత్వం కూలుతుందని పిల్లి శాపనార్థలు పెడుతున్నారని అన్నారు. కావాలని బీజేపీ,బీఆర్ఎస్ దుష్ప్రాచారం చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ.వచ్చే పంటకినుగొలు 500 బోనస్ ఇచ్చి తీరుతామన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించండని కోరారు.
నేటి ఓటింగ్ రోజున ఏది క్లోజ్.. ఏది ఓపెన్ ఉంటుందో తెలుసా?
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నేడు తొలి విడత పోలింగ్ జరగబోతోంది. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఈ రోజు ఉదయం 7 గంటలకు తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రజాస్వామ్య పండుగలో ఎక్కువ మంది పాల్గొని ఓటు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం సన్నాహాలు చేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఓటు వేసేందుకు వీలుగా పలు సంస్థలకు సెలవు ప్రకటించారు. ఏది మూసివేయబడుతుందో.. ఏది తెరవబడుతుందో తెలుసుకుందాం.
జగన్‌పై దాడి కేసులో కీలకంగా ఏ2 పాత్ర
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై శనివారం అజిత్‌సింగ్ నగర్ సమీపంలో జరిగిన రాళ్ల దాడికి సంబంధించి ఐదుగురు అనుమానితులను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అయితే.. సీఎం జగన్‌పై దాడి కేసులో A1గా ఉన్న సతీష్‌కు విజయవాడ సెషన్స్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో A1 సతీష్‌ను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. సీఎం జగన్‌ను అంతమొందించాలన్న ఉద్దేశంతోనే దాడి చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపారు పోలీసులు. అదును చూసి సున్నితమైన తల భాగంలోనే కుట్ర ప్రకారం దాడి చేశాడన్నారు. సీఎం జగన్‌పై ఏ2 ప్రోద్బలంతో ఏ1 దాడి చేసినట్టు రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు స్పష్టం చేశారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న దుర్గారావు పాత్ర కీలకమని పోలీసులు భావిస్తున్నారు. దుర్గారావు వెనుక ఉన్న పాత్రధారులపైనా పోలీసుల ఆరా తీస్తున్నారు. అయితే ఈ ఘటనలో రాజకీయ కుట్ర కోణం ఉందని పోలీసులు చెప్తున్నారు. ఇవాళ దుర్గారావును కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది. కోర్టు ఇచ్చే ఆదేశానుసారం దర్యాప్తులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి రానున్నాయి.
నేడు మహబూబాబాద్ జన జాతర సభకు సీఎం రేవంత్‌రెడ్డి..
నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఇవాళ ఉదయం మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్‌కు హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి. సాయంత్రం నాలుగు గంటలకు హెలికాప్టర్ మహబూబాబాద్ చేరుకొని జన జాతర సభలో పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి మానుకోటకు రానున్న సీఎంకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షణలో జన సమీకరణ ఏర్పాట్లు చేశారు. మహబూబాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో సభకు భారీ ఏర్పాట్లు పూర్తి చేశారు.
కాగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. మానుకోట కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అక్కడి నుంచి జరిగే బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయ నేతలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. నేటి నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, మానుకోట నియోజకవర్గాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.