పక్కాగా పోలీస్ ప్లానింగ్.. ఆల్ హ్యాపీస్!
సెప్టెంబర్ 01 ఆదివారం నాడు ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 నిన్న ఆదివారంతో ముగిసింది. దాదాపు 105 రోజుల పాటు సాగిన బిగ్‌బాస్ సీజన్ 8లో విజేతగా కన్నడ నటుడు నిఖిల్ మలియక్కల్ బిగ్‌బాస్ సీజన్ 8 గెలిచి కప్ న అందుకున్నాడు. బిగ్‌బాస్ సీజన్ 8 తెలుగులో ముందు ఎంటర్ అయిన వారు, వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ మొత్తం 22 మంది పాల్గొనగా ఫినాలే వీక్‌కి చేరేసరికి గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్, అవినాష్‌లు టాప్ 5లో నిలిచారు. నిఖిల్ వర్సెస్ గౌతమ్‌ల మధ్య విన్నింగ్ రేస్ ఉండగా నిఖిల్ విజేతగా నిలవగా గౌతమ్ రన్నరప్‌గా నిలిచాడు. విజేత నిఖిల్ రూ.55 లక్షల ప్రైజ్‌మనీతో పాటు.. మారుతీ సుజూకీ కారును సొంతం చేసుకున్నాడని నిర్వాహకులు తెలిపారు. నిఖిల్ సొంతూరు కర్ణాటకలోని మైసూరు కాగా గోరింటాకు సీరియల్ ద్వారా పార్థుగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక హీరో రాంచరణ్ చేతుల మీదుగా విన్నర్ నిఖిల్‌కు రూ.55 లక్షల చెక్కు అందజేశారు.
శ్రీతేజ్ కోసం సింగపూర్ నుంచి ఇంజెక్షన్ తెప్పించిన అల్లు అర్జున్?
సంధ్య థియేటర్ దుర్ఘటన తరువాత హీరో అల్లు అర్జున్, నిర్మాతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని, దర్శకుడు సుకుమార్‌తో పాటు పుష్ప-2 టీమ్ అంతా తీవ్ర మనస్తాపంలో ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ హస్పిటల్ ఖర్చులు హీరో అల్లు అర్జున్‌తో పాటు మైత్రీ మూవీస్ నిర్మాతలు బాధ్యతగా తీసుకున్నట్టు సమాచారం. దుర్ఘటన జరిగిన రోజు నుంచి హస్పటల్ ఖర్చులు తమ బాధ్యతగా స్వీకరించి అప్పటి నుంచి అన్నీ తామై వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్‌లో కూడా శ్రీతేజ్ పూర్తి ఆరోగ్యంగా కోలుకునే వరకు వైధ్య ఖర్చులన్నీ అల్లు అర్జున్‌తో పాటు నిర్మాతలే భరించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల శ్రీతేజ్ వైద్యంలో భాగంగా అవసరమైన ఓ ఇంజెక్షన్‌ను ఖర్చకు వెనుకాడకుండా సింగపూర్‌ను నుంచి తెప్పించారని చెబుతున్నారు. ఇటీవల హీరో అల్లు అర్జున్ తాను 25 లక్షల రూపాయలు ప్రకటించడంతో పాటు హస్పటల్ ఖర్చులు, భవిష్యత్‌లో ఎలాంటి అవసరం వచ్చినా అండగా ఉంటానని తెలియజేసిన సంగతి తెలిసిందే. దుర్ఘటన జరిగిన రోజు నుంచి నిర్మాత బన్నీవాస్, మైత్రీ నిర్మాలు, హీరో అల్లు అర్జున్ అండ్ టీమ్ ఎప్పటికప్పుడూ శ్రీతేజ్ ఆరోగ్య అప్‌డేట్‌ను తెలుసుకుంటున్నారు.
మంచు కథా చిత్రమ్.. పోలీసులకు ఫిర్యాదు చేయనున్న మనోజ్
మంచు కుటుంబ కథా చిత్రానికి ఇంకా శుభం కార్డు పడ్డట్టు కనిపించడం లేదు. ముందుగా మోహన్ బాబు ఆయన కుమారుడు నటుడు మనోజ్ మధ్య జరిగిన వివాదం కారణంగా ఇరువురు పోలీస్ స్టేషన్లో ఒకరిపై ఒకరు కంప్లైంట్ లు ఇచ్చుకున్నారు. మొదట దెబ్బలు తగిలాయని మనోజ్ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా ఆ తరువాత మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామా నెలకొంది. మోహన్ బాబు మీడియా ప్రతినిధి మీద దాడి చేయడం, ఆ తర్వాత మంచు మోహన్ బాబు దంపతులు అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో జాయిన్ అయి విడుదలవడం వరుస వరుసగా జరిగాయి. ఇదంతా ఇలా కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి మంచి వారి ఫ్యామిలీలో మరో వివాదం చోటు చేసుకుంది. మొన్న రాత్రి మంచు ఇంట్లో జల్‌పల్లిలో మోహన్‌బాబు భార్య బర్త్‌డే పార్టీ జరుగుతుండగా కరెంట్ పోయింది. ఆ సమయంలో జనరేటర్‌ను ఆన్ చేసి చేయడానికి చూస్తే అందులో పంచదార ఉంది.
తెలంగాణలో రెండోరోజు గ్రూప్-2 పరీక్ష..
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు తొలిరోజు (ఆదివారం) ప్రశాంతంగా జరిగాయి. మొదటి, రెండో పేపర్‌లను ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్‌లుగా నిర్వహించగా, సోమవారం మూడు, నాలుగు పేపర్లు నిర్వహిస్తున్నారు. TGPSC జారీ చేసిన గ్రూప్ నోటిఫికేషన్‌లలో ఇది చివరిది. ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-3 పరీక్షలు పూర్తి కాగా, గ్రూప్-4 ఉద్యోగాలు కూడా భర్తీ అయ్యాయి.
నేడు పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన
వైఎస్సార్సీపీ ప్రభుత్వ రివర్స్ విధానాల కారణంగా అస్తవ్యస్థంగా మారిన పోలవరానికి కూటమి ప్రభుత్వం జీవం పోసి పనులను వేగవంతం చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరానికి వెళ్లి ప్రాజెక్టు పనులను సమీక్షించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి ప్రాజెక్టు వ్యూ పాయింట్ వద్దకు చేరుకుని అక్కడి హెలిప్యాడ్ వద్ద దిగుతారు. పనుల పురోగతిని పరిశీలించిన తరువాత, ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల పునరావాస అంశాలపై అధికారులతో సమావేశమవుతారు.
నేడు తిరిగి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ..
రాష్ట్ర శాసనసభ సమావేశాలు నేటి (సోమవారం) నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నెల (డిసెంబర్) 9న శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కాగా, తొలిరోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆ అంశంపై ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించిన అనంతరం సభలు 16వ తేదీకి వాయిదా పడిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. అనంతరం పలు సంతాప తీర్మానాలను ప్రవేశపెడతారు. అనంతరం తెలంగాణ యువభారతి ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల సవరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణలో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. శాసనసభలో కూడా ఇదే అంశంపై చర్చ జరగనుంది.
శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపటి నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవ రద్దు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారుల నిర్ణయ ప్రకారం, రేపటి నుంచి జనవరి 14 వరకు సుప్రభాత సేవలను రద్దు చేస్తారు. ధనుర్మాసంలో శ్రీవారి ఆలయంలో మాసోత్సవాలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ఈ మాసం అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. ధనుర్మాస ఘడియలు ఈరోజు ఉదయం 6.57 గంటలకు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, టీటీడీ సుప్రభాత సేవల రద్దుకు సంబందించిన నిర్ణయాన్ని తీసుకుంది.
వణికిస్తున్న చలి.. రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. నగరంలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అత్యల్ప ఉష్ణోగ్రతలు 7.1 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత పెరుగుతుందని చెబుతున్నారు. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా తెలంగాణలో కొద్ది రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
మనమే బెస్ట్ అని అనుకోకూడదు.. ఎప్పుడూ విద్యార్థిగా ఉండాలి!
ప్రముఖ తబలా విద్వాంసుడు, పద్మ విభూషణ్ గ్రహీత జాకీర్ హుస్సేన్ (73) తుదిశ్వాస విడిచారు. పదేళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. కొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో పాటు అధిక రక్తపోటుతో బాధపడిన జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 1951 మార్చి 9న ముంబైలో జన్మించిన ఆయన సంగీత ప్రపంచానికి ఎనలేని సేవలు అందించారు.