ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి రాయ్‌పూర్-బలోదబజార్ రోడ్డులోని సారగావ్ సమీపంలో ఒక టిప్పర్, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. మృతుల్లో 9 మంది మహిళలు, ఇద్దరు బాలికలు, ఒక టీనేజర్, 6 నెలల శిశువు ఉన్నారు. మృతులందరూ ఛత్తీస్‌గఢ్‌లోని చటౌడ్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
టిబెట్‌లో 5.7 తీవ్రతతో భూకంపం
టిబెట్ లో భూకంపం వణికించింది. ఆదివారం తెల్లవారుజామున 2:41 గంటలకు (IST) టిబెట్‌ను రిక్టర్ స్కేల్‌పై 5.7 తీవ్రతతో భూకంపం కుదిపేసిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం 29.02N అక్షాంశం, 87.48E రేఖాంశం వద్ద, 10 కిలోమీటర్ల లోతులో ఉంది. భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూమి కంపించడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
రిటైర్మెంట్‌పై తుది నిర్ణయం తీసుకోని విరాట్ కోహ్లీ!
ఇప్పటికే టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. టెస్టు క్రికెట్ నుంచి కూడా తప్పుకోవాలనుకుంటున్నాడు. తాను టెస్టు ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంటున్నానని, ఇంగ్లండ్ పర్యటనకు తనను ఎంపిక చేయొద్దని తాజాగా బీసీసీఐకి కోహ్లీ సమాచారం ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టులకు దూరమైన నేపథ్యంలో విరాట్ కూడా తప్పుకొంటే ఇంగ్లండ్ పర్యటనలో అనుభవ లేమి భారత జట్టును దెబ్బ తీస్తుందని బీసీసీఐ భావిస్తోంది.
ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన పాక్ ఆర్మీ సిబ్బంది.. పేర్లను విడుదల చేసిన భారత్
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పైక్ పై ఆపరేషన్ సింధూర్ ప్రకటించింది. మే 7న పాక్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరైన అనేక మంది పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, సిబ్బందిని చూపించే వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. భారత సాయుధ దళాలు అంత్యక్రియలకు హాజరైన పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది, పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన కీలక పోలీసు అధికారుల పేర్లను విడుదల చేశాయి. అయితే పాకిస్తాన్ మాత్రం అంత్యక్రియల్లో పాల్గొనలేదని వాధించినప్పటికీ, భారత్ ఫొటోలు రిలీజ్ చేయడంతో పాక్ గొంతులో వెలక్కాయ పడ్డట్లైపోయింది.
రాజమౌళి చిత్రాలపై లోకేష్ సెటైర్లు..
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌కు ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పకర్లేదు. ‘మా నగరం’ ‘ఖైదీ’ ‘మాస్టర్’ ‘లియో’ ‘విక్రమ్’ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి విజయం సాధించిన లోకేష్ పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రజంట్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ‘కూలీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు అందుకున్న ఈ మూవీలో రజనీకాంత్‌తో పాటుగా కింగ్ అక్కినేని నాగార్జున, ఆమీర్ ఖాన్, ఉపేంద్ర, షౌబిన్ షాహిర్, శృతి హాసన్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నీరజ్ చోప్రా నేతృత్వంలో రంగంలోకి నలుగురు అథ్లెట్లు..!
ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ మీటింగ్‌లో భారత అథ్లెట్లకు ఇదివరకెప్పుడూ లేని స్థాయిలో ప్రాతినిధ్యం లభించింది. మే 16న దోహాలో జరగనున్న ఈ లీగ్‌లో ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా నేతృత్వంలో నాలుగు మంది భారత అథ్లెట్లు తలపడనున్నారు. 2023లో దోహా డైమండ్ లీగ్‌ను 88.67 మీటర్ల త్రో వేసి గెలిచిన నీరజ్, 2024లో 88.36 మీటర్లతో రెండో స్థానాన్ని సాధించాడు. ఈ ఏడాది కూడా జావెలిన్ విభాగంలో పోటీ పడనున్నాడు. అతనితో పాటు మరో భారత అథ్లెట్ కిషోర్ జెనా కూడా జావెలిన్ విభాగంలో పోటీకి సిద్ధమవుతున్నాడు. జెనా 2024 డైమండ్ లీగ్‌లో పాల్గొన్నప్పటికీ.. 76.31 మీటర్ల త్రో తో తొమ్మిదవ స్థానాన్ని మాత్రమే పొందాడు.
నాలుగు నగరాల్లోనే ఐపీఎల్.. ఆ జట్లకు చెరో పాయింట్!
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 వారం పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటనతో ఐపీఎల్‌కు మార్గం సుగమమైంది. ప్రభుత్వం అనుమతిస్తే.. ఐపీఎల్ 2025 మే 16 లేదా 17న ఆరంభమయ్యే అవకాశముంది. ఐపీఎల్ 18వ సీజన్ పునరుద్ధరణపై పాలకవర్గ సభ్యులు, బీసీసీఐ అధికారులు ఆదివారం సుదీర్ఘంగా చర్చించారు. బీసీసీఐ రీషెడ్యూలును సిద్ధం చేసే పనిలో ఉందని ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఓ ప్రకటలో తెలిపారు. ఐపీఎల్ 2025పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, టోర్నమెంట్‌ను త్వరగా ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం.. 35 మందికి గాయాలు, కొందరి పరిస్థితి విషమం!
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. డివైడర్‌ను ఢీకొట్టిన అనంతరం బస్సు కొంత దూరం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 35 మందికి గాయాలు అయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సులో ఇరుక్కున్న వారిని బయటకు పోలీసులు, స్థానికులు బయటికి తీశారు. క్షతగాత్రులు తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్టీసీ బస్సు తిరువన్నామలై నుంచి తిరుపతికి వస్తుండగా ఐతేపల్లె వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటమే ఈ ప్రమాదం కారణం అని పోలీసులు ప్రాధమికంగా తేల్చారు. గాయపడిన వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నేడు నాగార్జునసాగర్‌కు మిస్ వరల్డ్ పోటీదారులు
మిస్ వరల్డ్ – 2025 పోటీల్లో పాల్గొంటున్న ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు బుద్ధపూర్ణిమ సందర్భంగా సోమవారం నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక పర్యటనలో మొత్తం 30 దేశాలకు చెందిన మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొననుండగా, వీరిలో ఎక్కువమంది ఆసియా దేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. బౌద్ధమతంపై గల విశ్వాసం, బుద్ధుని చరిత్రపై ఆసక్తితో, ఈ సుందరీమణులు బౌద్ధ థీమ్ పార్క్‌లోని మహాస్థూపం వద్ద ప్రత్యేక ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుద్ధుని విగ్రహాల సమీపంలో ఆయా దేశాల సంప్రదాయాలకు అనుగుణంగా ప్రార్థనలు జరగనున్నాయి.
రౌడీ షీటర్ పప్పు రాయల్‌ను చావబాదిన క్రికెట్ ప్లేయర్స్!
క్రికెట్ ఆడుతున్న యువతను ఓ రౌడీ షీటర్ తన అనుచరులతో కలిసి బెదిరించాలని చూశాడు. తాను మద్యం తాగాలని, వెంటనే స్థలం ఖాళీ చేసి వెళ్లిపోవాలని హల్‌చల్ చేశాడు. క్రికెట్ ప్లేయర్స్ కాస్త ఓపిక పట్టినా.. రౌడీ షీటర్ మరింత రెచ్చిపోయాడు. సహనం కోల్పోయిన యువత.. రౌడీ షీటర్‌ను చావబాదారు. ఈ ఘటన ఏపీలోని తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి తిరుపతిలోని కొత్త రోడ్డు సమీపంలో క్రికెట్ ఆడుతున్న యువకులతో మద్యం మత్తులో ఉన్న రౌడీ షీటర్ పప్పు రాయల్ గోడవకు దిగాడు. నేను మద్యం తాగాలి, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాడు. యువకులు అలానే క్రికెట్ ఆడుతుండగా.. వెళ్లలేదంటే కోడుతానంటూ తన అనుచరులతో వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు. మాటమాట పెరిగడంతో రౌడీ షీటర్ పప్పు రాయల్‌ను క్రికెట్ ఆడుతున్న యువకులు చితకబాదారు. దాంతో అతడికి గాయాలు అయ్యాయి.