Site icon NTV Telugu

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

చంద్రబాబు అరెస్ట్‌పై ఇలా స్పందించిన కేఏ పాల్.. ఏంటి? మీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ కావడంపై స్పందించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. విజయనగరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు దోచుకున్నాడని జగన్.. వైఎస్‌ జగన్ దోచుకున్నాడని చంద్రబాబు.. ఏంటి? మీ మ్యాచ్ ఫిక్సింగ్ అని నిలదీశారు. నరేంద్ర మోడీ, అమిత్‌షా, అదానీల తొత్తులా మీరు? అని ఫైర్ అయ్యారు. చంద్రబాబు అవినీతికి పాల్పడాడు గనుకే అరెస్టు అయ్యారని వ్యాఖ్యానించారు. బాబు రావాలను అంటున్నారు.. ప్రత్యేక హోదా తేలేకపోయారు.. కియా తప్పా మరే కంపెనీ తేలేకపోయారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు అంబేద్కర్, మహాత్మా గాంధీ అంటా.. లోకేష్ భగత్ సింగ్‌ అట అంటూ ఎద్దేవా చేశారు. దోచుకున్నవాళ్లు దేశనాయకులంట.. చాలా దారుణం అంటూ విరుచుకుపడ్డారు పాల్..

స్కిల్‌ స్కామ్‌ కేసు.. ఆధారాలు బయటపెట్టిన సజ్జల..!
చంద్రబాబు అవినీతి చేశారనడానికి అన్ని ఆధారాలున్నాయని తెలిపారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అసలు ఈ స్కామ్‌ ఎలా జరిగిందనే వివరాలను వెల్లడించారు. ఈ కేసులో చంద్రబాబు అరెస్టై జైల్‌లో ఉండడమే తప్పన్నట్లు టీడీపీ వాళ్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.. వాళ్ల దబాయింపులకు మేం సమాధానం ఇవ్వాల్సి వస్తోందంటూ ఆధారాలతో సహా టీడీపీ నేతలపై కౌంటర్‌ ఎటాక్‌ దిగారు.. గత ప్రభుత్వంలో డబ్బులు ఎవరి చేతుల్లోకి వెళ్లాయని.. కుట్రలతో కూడిన యజ్ఞంలా ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు.. ఇక, స్కిల్‌ స్కామ్‌తో ప్రభుత్వ ఖజానాకు నేరుగా నష్టం వాటిల్లింది.. దోచుకోవడానికే ఓ స్కీమ్‌ పెట్టారు.. షెల్‌ కంపెనీల ద్వారా క్యాష్‌గా మార్చుకున్నారని చెప్పుకొచ్చారు.. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగింది.. పక్కా ఆధారాలతో సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌ ఇచ్చిందని.. నేషనల్‌ ఏజెన్సీలు కూడా దోపిడీ రిపోర్ట్‌ ఇచ్చాయని పేర్కొన్నారు.

అందుకే చంద్రబాబు అరెస్ట్‌.. కీలక అంశాలు వెల్లడించిన సీఐడీ చీఫ్
స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో కీలక అంశాలను బయటపెట్టారు సీఐడీ చీఫ్‌ సంజయ్.. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు అరెస్ట్‌, రిమాండ్ అనంతరం చాలా ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి.. సాధారణంగా కేబినెట్ అనుమతి తర్వాత కార్పొరేషన్ నిధులు షెల్ కంపెనీలకు అటు నుంచి వ్యక్తులకు వెళ్తాయి.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు పూర్తి సంబధం ఉంది కాబట్టే అరెస్టు చేశాం అన్నారు. ఒక ప్రైవేటు వ్యక్తికే చాలా పదవులు ఇవ్వడంతోపాటు కేబినెట్ అనుమతి లేకుండా కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్న ఆయన.. టీడీపీకి చెందిన జే. వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని చార్టెడ్ అకౌంటెంట్ గా నియమించారు.. ఈ వ్యవహారంలో మొత్తం 13 చోట్ల చంద్రబాబు సంతకాలు ఉన్నాయన్నారు. బడ్జెట్ అనుమతి తో పాటు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాల ఏర్పాటు, కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం తదితర అంశాల పై చంద్రబాబు సంతకాలు చేశారు.. జీవోలో 90 – 10 శాతం వాటాలను పేర్కొన్నారు.. కానీ, ఒప్పందంలో లేదన్నారు. ఇది దురుద్దేశంతో తీసుకున్న నిర్ణయమే అన్నారు సీఐడీ చీఫ్.. సేమెన్స్ కంపెనీ ఇండియా ఎండీ కూడా 164 స్టేట్ మెంట్ ఇచ్చారు అని తెలిపారు. 58 కోట్లు మాత్రమే మాకు వచ్చాయని సిమెన్స్ సంస్థ పేర్కొంది.. 241 కోట్లు నేరుగా షెల్ కంపెనీలకు వెళ్లిపోయినట్టు వివరించారు. మిగతా డబ్బులు మాత్రమే కేంద్రాల ఏర్పాటుకు ఖర్చు చేశారు.. ఇక్కడ నేరం లో ఇమిడి ఉన్న డబ్బు 241 కోట్ల రూపాయలు అన్నారు. డిజైన్ టెక్ ద్వారా డబ్బులు వెళ్లిపోయాయి.. 58 కోట్లతో కొనుగోలు చేసి 2800 కోట్లుగా చూపించారు.. గుజరాత్ లో 85-15 శాతం మోడల్ లో ఒప్పందాలు జరిగాయి.. కానీ, గుజరాత్ లో 85 శాతం పరికరాలు క్షేత్ర స్థాయిలో ఉన్నాయి.. ఇందులో కొందరు అధికారులు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఏపీలో 2800 కోట్ల సాప్ట్ వేర్ గాల్లో మాత్రమే కనిపిస్తోందని దుయ్యబట్టారు.. డిజైన్ టెక్ కు చెందిన 32 కోట్లు ఈడీ సీజ్ చేసిందని తెలిపారు.

ఒకే రోజు రాజమండ్రి జైలుకు పవన్‌, బాలయ్య, లోకేష్‌..
ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు.. అయితే, ములాఖత్‌లో చంద్రబాబును కలిసేవారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది.. ఇప్పటికే నారా ఫ్యామిలీ చంద్రబాబును కలిసింది.. 40 నిమిషాల పాటు చంద్రబాబుతో భువనేశ్వరి, లోకేష్‌, బ్రహ్మణి భేటీ అయ్యారు.. మరోవైపు.. ఈ రోజు సుప్రీంకోర్టు న్యాయవాది, ప్రస్తుతం చంద్రబాబు కేసును వాదిస్తోన్న సిద్ధార్థ్ లూథ్రా కూడా ములాఖత్‌లో చంద్రబాను కలిశారు.. ఈ కేసు విషయంలో న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న విషయంపై చర్చించారు.. ఇక, రేపు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్‌ కలబోతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ముందుగా రేపు చంద్రబాబును పవన్‌ కల్యాణ్‌ కలుస్తారని తెలసింది.. ఆ తర్వాత చంద్రబాబుతో రాజమండ్రి సెంట్రల్ జైలులో పవన్ ములాఖత్ కి సంబంధించి ఇప్పటివరకు తమకు ఎటువంటి దరఖాస్తులు రాలేదని జైలు సూపరిండెండెంట్‌ పేర్కొన్నారు.. ఇక, ములాఖత్ కు జైలు అధికారులు పర్మిషన్ ఇస్తే నిబంధనల ప్రకారం పవన్ కల్యాణ్‌ రావొచ్చని పోలీసులు తెలిపారు.. దీంతో.. పవన్‌ కల్యాణ్‌ రేపు రాజమండ్రి వస్తున్నారా? లేదా? అనే చర్చ సాగుతూ వచ్చింది. అయితే, రాత్రి 7 గంటల తర్వాత కాస్త క్లారిటీ వచ్చింది.. సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబును రేపు ములాఖత్‌లో పవన్‌ కల్యాణ్‌, బాలకృష్ణ, లోకేష్‌ కలుస్తారని చెబుతున్నారు. కాగా, ఇప్పటికే ఓసారి జైలులో ఉన్న చంద్రబాబును కుటుంబ సభ్యులతో వెళ్లి పరామర్శించారు లోకేష్.. అయితే, గురువారం రోజు పవన్‌, బాలయ్య, లోకేష్‌ ఒకేసారి వెళ్లి చంద్రబాబును కలుస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా దీక్ష కొనసాగుతుంది
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లోని ధర్నా చౌక్‌లో బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా 24 గంటల దీక్ష నిర్వహించారు. ఈ దీక్షలో.. ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌తో పాటు పలువురు రాష్ట్ర నాయకులు, కార్యదర్శులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కిషన్‌రెడ్డి ప్రసంగిస్తూ ఈ దుస్థితిని ఎత్తిచూపారు. రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులు ప్రాథమిక జీవనోపాధి కోసం తమ పోరాటాన్ని నొక్కి చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, తొమ్మిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరాలను విస్మరించిందని ఆరోపించిన ఈ యువకులకు ఆయన సంఘీభావం తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో వదిలేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు, అవకాశాలు కల్పించడంలో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలుచేసినా దీక్ష కొనసాగుతుందని కిషన్ రెడ్డి హెచ్చరించారు. లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే తీవ్రంగా పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు కిషన్‌ రెడ్డి.

‘ఇండియా’ తొలి వ్యూహాత్మక భేటీ.. కీలక నిర్ణయం
ఢిల్లీ వేదికగా ‘ఇండియా’ కూటమి తొలి కో-ఆర్డినేషన్‌ సమావేశం జరిగింది.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు నేతలు.. అక్టోబర్ మొదటి వారంలో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో తొలి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది.. ధరల పెరుగుదల, నిరుద్యోగం, బీజేపీ అవినీతి పాలన వంటి ప్రధాన అంశాలను జనంలోకి తీసుకెళ్లడంపై దృష్టి సారించింది.. సమావేశానికి 12 మంది నేతలు హాజరయ్యారు.. అయితే, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేయడంతో సమావేశానికి హాజరు కాలేకపోయారు తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత అభిషేక్ బెనర్జీ. కక్షపూరిత రాజకీయాలకు అధికార బీజేపీ పాల్పడుతోందని ఈ సమావేశం ఖండించింది.. ఇక, కులాల గణన చేపట్టాలని.. ఉమ్మడిగా ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సీట్ల సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించాలని.. ఈ మేరకు, భాగస్మామ్య పక్షాలు చర్చలు త్వరితగతిన ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు.. వివిధ టీవీ ఛానెల్స్ లో ఏఏ యాంకర్లు నిర్వహించే చర్చా కార్యక్రమాల్లో కూటమి పక్షాల నేతలు పాల్గొనరాదో.. ఆయా యాంకర్లతో కూడిన జాబితాను రూపొందించే బాధ్యతలను “ఇండియా” కూటమి కి చెందిన మీడియా “సబ్ గ్రూప్”కు అప్పగించింది సమన్వయ కమిటీ సమావేశం. మొత్తంగా ప్రతిపక్ష బ్లాక్ ఇండియా మొదటి వ్యూహాత్మక సమావేశంలో కుల గణన కోసం ముందుకు వచ్చారు.. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఇండియా బ్లాక్‌ల ముంబై సమావేశంలో కుల గణనపై అభ్యంతరం వ్యక్తం చేశారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ.. కానీ, నేటి సమావేశానికి గైర్హాజరయ్యారు.

గుర్తుపట్టలేకుండా.. అతి దారుణంగా మారిపోయిన తారకరత్న హీరోయిన్..
నెమలి కన్నోడా.. నమిలే చూపోడా అంటూ ఒకటో నెంబర్ కుర్రాడు చిత్రంలో తారకరత్న అందాన్ని పొగిడిన ముద్దుగుమ్మ గుర్తుందా..?.. పోనీ ఎవరైనా ఎప్పుడైనా ఈ చిత్రం చూశారా అంటూ ఆనందం సినిమాలో ఆకాష్.. తన ఫ్రెండ్ తో ప్రేమలో పడిన భావాలను చెప్తూ ఉంటాడు.. ఆ ఫ్రెండ్ గుర్తుందా.. ? హా.. ఆమెనే రేఖ వేదవ్యాస్. మొదటి సినిమా ఆనందం సినిమాతోనే భారీ విజయాన్ని అందుకోని కుర్రకారు గుండెల్లో రేఖ తనదైన ముద్ర వేసుకుంది. ఇక ఈ సినిమా తరువాత వరుస అవకాశాలు అందుకోవడమే కాకుండా మంచి హిట్లు కూడా అందుకుంది. జానకి వెడ్స్ శ్రీరామ్, దొంగోడు లాంటి సినిమాల్లో కనిపించి మెప్పించింది. ఇక తెలుగులో కాకుండా కన్నడలో ఆమె స్టార్ హీరోయిన్ గా ఓకే వెలుగు వెలిగింది. ఇక 2014 తరువాత రేఖ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అప్పుడప్పుడు షోస్ లో మెరవడమే కానీ, సినిమాలు చేసిన దాఖలాలు అయితే లేవు. ఇక ఎంతో అందంగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత బొద్దుగా మారి కనిపించింది. ఇక తాజాగా రేఖ గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. దారుణంగా అస్తిపంజరంలా మారిపోయింది. అందుకు కారణం ఆమె అనారోగ్య సమస్యలు అని తెలుస్తోంది. చాలా గ్యాప్ తరువాత ఆమె ఈటీవీ లో ప్రసారం అవుతున్న శ్రీదేవిడ్రామా కంపెనీకి గెస్ట్ గా వచ్చింది. సడెన్ గా ఆమెను చూసి అక్కడఉన్నవారే కాదు.. ఆమె అభిమానులు కూడా షాక్ అయ్యారు. బక్కచిక్కిపోయి.. ముఖం మొత్తం కళతప్పి కనిపించింది. అసలు ఆమెకు ఏమైందో అని అభిమానులు కంగారు పడ్డారు. అయితే తనకేం అయ్యిందో రేఖ స్టేజిమీద చెప్పుకొచ్చింది ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. ఆమెకు ఏమైందో తెలియాలంటే ఈ ఎపిసోడ్ రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

ఆ డైరెక్టర్ పెట్టిన ఇబ్బందులు.. వేరే హీరో అయితే గుండెపోటుతో చచ్చేవాడు
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ .. ఈ మధ్య కోలీవుడ్ ను షేక్ ఆడిస్తున్నాడు. నిర్మాతల గురించి, డైరెక్టర్ల గురించి నిజాలు చెప్పి కోలీవుడ్ మేకర్స్ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు. మొన్నటికి మొన్న నిర్మాతలు హీరోలతో ఎలా ఆడుకొనేవారో.. ఎంతలా ఇబ్బంది పెట్టేవారో చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ తనను ఎంతో ఇబ్బందులకు గురిచేసాడని, నా ప్లేస్ లో మరో హీరో ఉంటే చచ్చిపోయేవాడని ఘాటు ఆరోపణలు చేశాడు. విశాల్ ప్రస్తుతం మార్క్ ఆంటోని అనే సినిమాలో నటిస్తున్నాడు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా సెప్టెంబర్ 15 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే విశాల్ ప్రమోషన్స్ షురూ చేశాడు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనతో కలిసి పనిచేసిన ఒక డైరెక్టర్ గురించి విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ డైరెక్టర్ ఎవరో కాదు. సస్పెన్స్ థ్రిల్లర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ అయిన మిస్కిన్. వీరిద్దరి కాంబోలో తుప్పరివాలన్‌ అనే సినిమా వచ్చింది. తెలుగులో ఇదే సినిమా డిటెక్టివ్ పేరుతో రిలీజ్ అయ్యింది. 2017 లో రిలీజ్ అయిన ఈ చిత్రం విశాల్ కు భారీ విజయాన్ని తీసుకొచ్చిపెట్టింది. ఇక ఆ విజయంతోనే వీరు తుప్పరివాలన్‌ 2 ప్లాన్ చేశారు. అది అధికారికంగా ప్రకటించారు కూడా.. కానీ, ఆ ప్రాజెక్ట్ సగంలోనే ఆగిపోయింది. ఇక దానికి కారణం విశాల్ చెప్పుకొచ్చాడు.. ” తుప్పరివాలన్‌ 2 విషయంలో నేను పడ్డ బాధలు అన్ని ఇన్ని కావు.. మిస్కిన్ తో మరోసారి పనిచేయడం జరగని పని. అతను పెట్టిన ఇబ్బందులకు.. మరో హీరో అయితే గుండెపోటు వచ్చి చచ్చేవాడు.. నేను ఎన్నో సార్లు లండన్ వీధుల్లో కూర్చొని బాధపడ్డాను. ఆ క్షణాలను నేనెప్పటికీ మర్చిపోలేను. ఎంతో నష్టాన్ని మిగిల్చాడు. ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టినా అది పూర్తవదు అని తెలుసు. అందుకే ఆ సినిమాను మధ్యలోనే ఆపేసాను. వచ్చే ఏడాది.. ఆ సినిమాను నేనే తెరకెక్కించాలనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విశాల్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి మార్క్ ఆంటోని సినిమాతో విశాల్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

తొరి బొరి అంటున్న రాఘవ లారెన్స్
స్టార్ కొరియోగ్రాఫర్, యాక్టర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన భారీ బ‌డ్జెట్ మూవీ ‘చంద్రముఖి 2’ రిలీజ్ కి రెడీ అయింది. లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మిస్తోన్న ఈ సినిమాను సీనియ‌ర్ డైరెక్ట‌ర్ పి.వాసు డైరెక్ట్ చేశారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా తెలుగు, త‌మిళ, హిందీ, కన్నడ, మలయాళ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబ‌ర్ 28న విడుదలవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ‘చంద్రముఖి 2’ సినిమాను రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట్ ఉప్పుటూరి, వెంక‌ట ర‌త్నం శాఖ‌మూరి రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్‌గా రిలీజైన ‘చంద్రముఖి 2’ ట్రైలర్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కి తీసుకెళ్లగా హారర్, మరో వైపు కామెడీ ఎలిమెంట్స్‌తో అలరించనుందని స్పష్టమైంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఓ అందమైన పాటను రిలీజ్ చేశారు. తొరి బొరి అంటూ రిలీజ్ చేసిన లిరికల్ వీడియో ఆకట్టుకుంటోంది. ఈ పాటను భువనచంద్ర రచించగా అరుణ్ కౌండిన్య, అమల చెంబోలు ఆలపించారు. ఇక ఎం ఎం కీరవాణి వినసొంపైన బాణీ అందరినీ మెప్పిస్తోంది. ఈ పాటలో రాఘవ లారెన్స్, వడివేలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ల‌క్ష్మీ మీన‌న్‌, మ‌హిమా నంబియార్‌, రాధికా శ‌ర‌త్ కుమార్‌, విఘ్నేష్‌, ర‌విమారియ, శృష్టి డాంగే, శుభిక్ష‌, వై.జి.మ‌హేంద్ర‌న్ రావు ర‌మేష్‌, సాయి అయ్య‌ప్ప‌న్, సురేష్ మీన‌న్‌, శత్రు, టి.ఎం.కార్తీక్‌ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకి ఆర్‌.డి.రాజ‌శేఖ‌ర్‌ సినిమాటోగ్ర‌ఫీ అందించారు.

Exit mobile version