NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

పవన్‌ కల్యాణ్‌కు పెద్దిరెడ్డి వార్నింగ్‌.. పరువు నష్టం దావా వేస్తాం..
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిత్తూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంపై స్పందించారు.. ఇక, పవన్ కల్యాణ్‌కు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయనడం అలవాటు అయ్యిందంటూ మండిపడ్డారు.. గతంలో వాలంటీర్లపై ఆరోపణలు చేశారు.. ఈ రోజు 50 మంది హత్యలు అని ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అయితే, పోలీసులను ఈ అంశాలపై విచారణ చేయాల్సిందిగా కోరుతాం.. అవి అబద్ధాలని తేలితే పరువు నష్టం దావా వేస్తాం అంటూ హెచ్చరించారు. ఇక, చంద్రబాబు అరెస్ట్ విషయంలో సొంత కుమారుడు నారా లోకేష్‌లో కూడా పవన్ కల్యాణ్‌ పడిన తపన కనిపించలేదు.. అది నటనా? లేదా? మరేంటి అని ప్రజలకు తెలుసు అంటూ సెటైర్లు వేశారు మంత్రి పెద్దిరెడ్డి.. ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ గ్రిడ్ పై కూడా విచారణ జరుగుతుంది.. అక్రమాలు చేసిన వారికి చంద్రబాబు తరహాలోనే శిక్షలు తప్పవు అన్నారు.. చంద్రబాబు అరెస్టుకు… పెట్టుబడులకు సంబంధం లేదని స్పష్టం చేశారు.. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలి.. ఇలాంటి కేసులు అన్ని చాలా ఎదుర్కోవాలని కామెంట్‌ చేశారు.. చంద్రబాబు అరెస్ట్ కి మేం సంతోష పడట్లేదు.. ఎవరైన సంతోషించారు అంటే అది రామారావు గారు ఆత్మ మాత్రమే అన్నారు.. మరోవైపు.. చంద్రబాబు తప్పు చేయలేదు అని లాయర్లు, టీడీపీ నాయకులు మాట్లాడలేదు.. 24 గంటలు దాటాక కోర్టుకు ప్రవేశ పెట్టారు, గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు అని టెక్నికల్ పాయింట్స్ మాట్లాడారు అంటూ దుయ్యబట్టారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

చంద్రబాబును అయ్యో పాపం అనేవాడే లేడు.. బంద్ విఫలమే నిదర్శనం..
చంద్రబాబును అరెస్ట్ చేస్తే అయ్యో పాపం అనేవాడే లేడు.. బంద్ విఫలం అవ్వడమే దీనికి నిదర్శనం అన్నారు ఏపీ హోంశాఖ మంతరి తానేటి వనిత.. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో లోకేష్ ప్రమేయం ఉందన్నారు.. పూర్తి విచారణ తర్వాత బాధ్యులైన అందరినీ ఫిక్స్ చేస్తాం అన్నారు. రాజమండ్రి జైలులో చంద్రబాబుకు ముప్పు లేదు.. ప్రజలలో సానుభూతి కోసమే టీడీపీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.. జనసేన, టీడీపీ అరాచకాల నుంచి ప్రజలను కాపాడ డానికే రాష్ట్రంలో 144 అమలు చేశాం అన్నారు. విశాఖలో జరిగిన జాతీయ జైళ్ల శాఖ ఉన్నతాధికారుల సమావేశానికి హాజరైన వనిత.. చంద్రబాబు కంటే ఎక్కువ వయసు ఉన్న చాలా మంది ఇతర రాష్ట్రాలలో ఆర్ధిక నేరాల్లో అరెస్ట్ అయ్యారని గుర్తుచేశారు.. చట్టం ముందు చంద్రబాబు వయసు మినహాయింపు కాదు అదంతా సానుభూతిని పొందే ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు.

వరుస పిటిషన్లు.. చంద్రబాబు తరపు న్యాయవాదులపై కోర్టు ఆగ్రహం
స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. అయితే, ఆయను ఎలాగైనా బయటకు తీసుకురావాలని ఆయన తరపు న్యాయవాదులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.. కోర్టులో వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.. తాజాగా ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున మరో పిటిషన్ దాఖలైంది.. స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించటానికి అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేశారు.. సీఐడీ కార్యాలయంలో ఉన్న కేసు అన్ని పత్రాలు పరిశీలన కోసం అనుమతి కోరారు.. 207 CRPC కింద పిటిషన్ వేశారు న్యాయవాదులు.. దీనిపై వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు చంద్రబాబు తరపున న్యాయవాది సిద్దార్థ లోధ్ర.. అయితే, చంద్రబాబు తరపున వరుస పిటిషన్లు దాఖలు చేస్తున్న న్యాయవాదులపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.. వరుసగా పిటిషన్లు వేస్తూ ఉంటే కోర్టు విధులు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు న్యాయమూర్తి.. పిటిషన్ వేరే వేస్తారు, ఆర్డర్స్ ఇచ్చే సమయానికి మరో కొత్త పిటిషన్ వేస్తున్నారని న్యాయమూర్తి మండిపడ్డారు. వేరే కేసులు పెండింగ్ లో ఉంటున్నాయని, కోర్టు ప్రొసీజర్ ఫాలో అవడం లేదని.. కోర్టులో పిటిషన్లు వేయటానికి ఒక ప్రొసీజర్ ఉంటుందన్నారు న్యాయమూర్తి.. పిటిషన్ వేయాలంటే 12 లోపు వేయాలి, నంబర్ అవ్వాలి.. తర్వాత విచారణ ఉంటుందని, అలాకాకుండా నేరుగా పిటిషన్ తీసుకు వచ్చి వాదనలు వినాలని అనటం సరికాదని హితవుపలికారు న్యాయమూర్తి. అయితే, ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అభ్యంతరాలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు తరపున న్యాయవాది సిద్దార్థ లోధ్ర.. కొత్త పిటిషన్ మీద వాదనలు వినిపించే ప్రయత్నం చేయగా.. ప్రొసీజర్ ఫాలో కావాల్సిందే అన్నారు న్యాయమూర్తి.. అయితే, చంద్రబాబు హౌస్‌ అరెస్ట్ పిటిషన్ పై మరో మారు వాదనలు వినిపించారు సిద్దార్థ లోధ్ర.. వాదనల్లో భాగంగా కొన్ని అంశాలపై క్లారిఫికేషన్ కోరారు న్యాయమూర్తి… ఇక, న్యాయమూర్తి అడిగిన క్లారిఫికేషన్ పై వివరణ ఇచ్చారు సిద్దార్థ లోధ్ర.

చంద్రబాబు హౌస్ రిమాండ్‌ పిటిషన్‌ విచారణలో ట్విస్ట్..! తీర్పు రేపటికి వాయిదా..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్నారు.. అయితే, చంద్రబాబును హౌస్‌ రిమాండ్‌ కు అనుమతించాలనంటూ ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.. ఈ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘ విచారణ సాగింది.. ఈ పిటిషన్‌పై కోర్టులో వాదనలు వినిపించారు ఇరు పోఆల న్యాయవాదులు.. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించగారు.. ఇరు వర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పును రేపటికి వాయిదా వేశారు.. మంగళవారం ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది విజయవాడ ఏసీబీ కోర్టు.. రేపు మధ్యాహ్నం తీర్పు ఇవ్వనుంది ఏసీబీ కోర్టు.. అయితే, తీర్పు రేపు ఉదయం ఇవ్వాలని కోరారు చంద్రబాబు తరపు న్యాయవాదులు.. కాగా, స్కిల్‌ స్కామ్‌ కేసులో సీఐడీ చంద్రబాబును అరెస్ట్‌ చేయగా.. ఆయనకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించిన విషయం విదితమే.. స్కామ్‌లో చంద్రబాబు ప్రమేయం ఉందని సీఐడీ వాధిస్తోంది.. మరోవైపు.. చంద్రబాబు హౌస్‌ రిమాండ్‌ పిటిషన్‌ పై ఎలాంటి తీర్పు వస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.

పవన్‌ కల్యాణ్‌కు లోకేష్‌ ధన్యవాదాలు.. నా అన్న..!
నేను అన్నగా భావించే పవన్ కల్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని తెలిపారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కష్టం సమయంలో అండగా నిలిచిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారు.. ప్రజలు, దేశం ,అభివృద్ధి గురించి తప్ప.. మరో ఆలోచన చేయని వ్యక్తి చంద్ర బాబు.. అవినీతి గురుంచి తెలియని వ్యక్తి చంద్రబాబు.. అలాంటి వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేసి ఈ సైకో ప్రభుత్వం జైల్లో పెట్టిందని మండిపడ్డారు.. ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి బంద్ కి మద్దతు ఇచ్చారని తెలిపిన ఆయన.. బంద్‌కి సహకరించిన అన్నగా భావించే పవన్ కల్యాణ్‌కి వామపక్షాలుకి కృతజ్ఞతలు తెలిపారు.. ఇక, సీఎం వైఎస్‌ జగన్ ఈ అరెస్ట్ కి మూల్యం చెల్లించుకుంటారని వార్నింగ్‌ ఇచ్చారు.. జగన్ పైన ఎన్ని కేసులు ఉన్నాయి.. దానికి సమాధానం చెప్పగలడా? వ్యవస్థలు ఎంత అద్బుతంగా మెనేజ్ చేస్తున్నాడో తెలుస్తుందన్నారు.

బీసీల గురించి గొప్పగా చెప్పే సీఎం కేసీఆర్ బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చారు
సంగారెడ్డిలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల గురించి గొప్పగా చెప్పే సీఎం కేసీఆర్ బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చారని ఆయన మండిపడ్డారు. కేవలం 20 శాతం టికెట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారని, రెండో సారి సీఎం అయ్యాక కేసీఆర్ కళ్ళు నెత్తికెక్కాయి కావచ్చు అంటూ ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. సారు కారు పదహారు అంటే సింగిల్ డిజిట్ కె మిమ్మల్ని తెలంగాణ ప్రజలు పరిమితం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. మీ కేబినెట్ లో ఎంత మందికి బీసీలకు టికెట్లు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. మోడీ క్యాబినెట్ లో 78 మందిలో 65 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలను తీసుకున్నారని ఎమ్మెల్యే రఘునందన్‌ రావు తెలిపారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో బీసీలను సీఎం అభ్యర్థిగా ప్రకటించే దమ్ముందా..? అని ఆయన ప్రశ్నించారు. భవిష్యత్తులో బీజేపీ తెలంగాణలో బీసీలకు న్యాయం చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క సారి బీజేపీకి తెలంగాణలో అవకాశం ఇవ్వండని ఎమ్మెల్యే రఘునందన్‌ రావు కోరారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి..
కర్ణాటక లో ఘోర ప్రమాదం జరిగింది.. సోమవారం తెల్లవారు జామున చిత్రదుర్గ జిల్లాలో ని జాతీయ రహదారి-150పై కల్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కెకెఆర్‌టిసి) మరియు ట్రక్కు ఢీకొనడంతో ఒక చిన్నారితో సహా వ్యక్తులు మరణించారు.. మృతులను మాబమ్మ (35), రమేష్ (40), పార్వతమ్మ (45), నరసప్ప (5), రవి (23)గా గుర్తించారు. వీరంతా రాయచూరు జిల్లా వాసులు. మరో ఆరుగురికి గాయాలై చిత్రదుర్గ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గొల్లహళ్లి సమీపంలో తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కేకేఆర్‌టీసీ బస్సు ట్రక్కును ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించి అదుపు తప్పి దాన్ని ఢీకొట్టింది. రాయచూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ, అలోక్ కుమార్ ఈ ప్రమాదం గురించి వివరించారు.. ఈరోజు ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు ఆయన తెలిపారు.. చిత్రదుర్గ జిల్లాలో ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న KSRTC బస్సు లారీని తప్పుగా ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించింది, ఫలితంగా ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఒక మనిషి చేసిన విపత్తు.. డ్రైవర్ అతి వేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు.. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.. ఈ ఘోర ప్రమాదం తో జనాలు ఉలిక్కి పడ్డారు.. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.. గతంలో ఎన్నో యాక్సిడెంట్స్ ఇక్కడే జరిగాయని, ప్రమాద హెచ్చరిక ఉన్నా కూడా ఇలాంటి ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయని, నెమ్మదిగా వెళ్లాలని వాహనాదారులకు పోలీసులు సూచిస్తున్నారు..

కర్ణాటకలో 7000కు పైగా డెంగ్యూ కేసులు.. చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం
కర్ణాటకలో పెరుగుతున్న డెంగ్యూ కేసుల దృష్ట్యా, ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. డెంగ్యూ కేసులను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైందని.. ప్రజలు తమ ఇళ్ల చుట్టూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సిద్ధరామయ్య కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేలకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేశారు. అయితే 4,000 కంటే ఎక్కువ బెంగళూరు నగరంలో నమోదయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య మాట్లాడుతూ.., డెంగ్యూ కేసుల పెరుగుదలపై సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నగరంలో దోమల నివారణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టడంతోపాటు రసాయనాలు పిచికారీ చేయడం, నీరు పేరుకుపోయిన ప్రదేశాలను గుర్తించడం, వాటిని శుభ్రం చేయడం వంటివి చేస్తున్నట్లు తెలిపారు.

అచ్చం రష్మికలానే ఉంది.. ఈమే ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సనా మీర్ గురించి తెలియని వారుండరు. ఆమే పాకిస్తాన్ క్రికెట్ జట్టు తరఫున 14 సంవత్సరాల పాటు ఆడి అత్యుత్తమ క్రికెటర్ గా పేరు తెచ్చుకుంది. తన క్రికెట్ కెరీర్ లో ఆఫ్ స్పిన్నర్ గా, అసాధారణ ఆట తీరును ప్రదర్శించింది. సనామీర్ 226 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడగా.. 137 మ్యాచ్ లలో జట్టు కెప్టెన్ గా వ్యవహరించింది. మరోవైపు వన్డేలలో 100 వికెట్లు తీసిన మొదటి పాకిస్తాన్ బౌలర్ గా రికార్డులకెక్కింది. 2018లో ఐసీసీ వన్డే బౌలర్ ర్యాక్సింగ్ లో నెం.1 ర్యాంకు సాధించిన మొదటి పాకిస్తాన్ మహిళా బౌలర్ గా సనా మీర్ నిలిచింది. 2010, 2014 ఆసియా క్రీడలలో పాకిస్తాన్ కు రెండు బంగారు పతకాలను సాధించిపెట్టింది సనా మీర్. 240 అంతర్జాతీయ వికెట్లను తీయగా.. 2009 నుంచి 2017 వరకు పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ గా సారథ్యం వహించింది. ఈమే అంతర్జాతీయ క్రికెట్ కు 2020 మేలో రిటైర్మెంట్ ప్రకటించింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో జరుగుతున్న మ్యాచ్ లకు వ్యాఖ్యాతగా చేస్తున్నారు.

శతక్కొట్టారు.. సెంచరీలతో అదరగొట్టిన కోహ్లీ, రాహుల్
ఆసియా కప్ 2023లో భాగంగా.. టీమిండియా బ్యాట్స్ మెన్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో అదరగొట్టారు. కేఎల్ రాహుల్ 100 బంతుల్లో ఎదుర్కొని సెంచరీ చేయగా.. కోహ్లీ 84 బంతుల్లో 100 పరుగులు చేశాడు. మరోవైపు ఈ మ్యాచ్ లో కోహ్లీ అరుదైన రికార్డును సాధించాడు. వేగంగా వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో 13000 పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ గా కోహ్లీ ఘనత సాధించాడు. ఇదిలా ఉంటే కోహ్లీకి వన్డే కెరీర్ లో ఇది 47వ సెంచరీ. మరోవైపు మరో బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 5 నెలల తర్వాత మైదానంలోకి వచ్చిన రాహుల్.. 100 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. పాకిస్థాన్‌పై భారత్‌ విజృంభించడంతో.. నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. పాకిస్థాన్‌ విజయలక్ష్యం 357 పరుగులు ఉండగా.. ఇప్పుడు మ్యాచ్ టీమిండియా బౌలర్లపై ఆధారపడి ఉంది. విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ 94 బంతుల్లో 122 పరుగులు చేశాడు. విరాట్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. కేఎల్ రాహుల్ 111 పరుగులు చేశాడు. అటు పాక్ బౌలర్లలో షాదాబ్, షాహీన్ అఫ్రిది చెరో వికెట్ తీశారు.

అదిరిపోయే బిజినెస్ ఐడియా.. నెలకు రూ.40 వేలు సంపాదన..
బిజినెస్ చెయ్యాలనే వారికి ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి అందులో కొన్ని భారీ లాభాలను కూడా ఇస్తున్నాయి..అయితే చాలా మంది తక్కువ పెట్టుబడితో బెస్ట్ బిజినెస్ ను ఎంచుకోవాలని భావిస్తున్నారు..అలాంటి వారు ఈ బిజినెస్ ను కేవలం రూ. 22, 000 వేలతో ప్రారంభించి నెలకు రూ. 50 వేలకు పైగా సంపాధించవచ్చు.. ఆ బిజినెస్ కారు వాషింగ్ బిజినెస్.. ఈ వ్యాపారంలో పెద్ద మొత్తంలో డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారం మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీకు అదృష్టం కలిసి వస్తే మెకానిక్‌ని కూడా నియమించుకుని వాషింగ్ తో పాటు, మీరు కారు మరమ్మత్తు బిజినెస్ కూడా ప్రారంభించవచ్చు.. ఈ బిజినెస్ ను మొదలు పెట్టాలంటే మీకు ప్రొఫెషనల్ మెషిన్ అవసరం. మార్కెట్లో అనేక రకాల యంత్రాలు ఉన్నాయి. ఈ యంత్రాల ధర రూ.12 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. మీరు చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, మీరు తక్కువ ఖర్చుతో కూడిన యంత్రాన్ని కొనుగోలు చేయవచ్చు.. అంటే రూ.14 వేల యంత్రం మీకు సరిపోతుంది.. వీటితో పాటు మీకు రెండు హార్స్ పవర్ యంత్రాలని పొందుతారు. అంతేకాదు మీరు 30 లీటర్ల వాక్యూమ్ క్లీనర్‌ను కొనుగోలు చేయాలి. దీని ధర దాదాపు రూ. 9 వేల నుంచి రూ.10 వేల రూపాయలు. షాంపూ, గ్లోవ్స్, టైర్ పాలిష్ మరియు డాష్‌బోర్డ్ పాలిష్‌తో సహా అన్ని వస్తువులకు రూ. 2 వేల వరకు ఖర్చు అవుతుంది..

జవాన్ తో పాటు రిలీజైనా నిలదొక్కుకుంది.. ‘మిస్ శెట్టి’కి దిల్ రాజు ప్రశంసలు
నవీన్ పొలిశెట్టి. అనుష్క జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ అందుకుంది. ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల అప్రిషియేషన్స్ తో పాటు చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోలు, హీరోయిన్స్, డైరెక్టర్స్ నుంచి ప్రశంసలు అందుకుంటోండగా తాజాగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు అభినందించారు. హైదరాబాద్ లోని యూవీ క్రియేషన్స్ ఆఫీస్ లో జరిగిన ప్రెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరిస్తారని మరోసారి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో ప్రూవ్ చేశారని ఎందుకంటే ఈ సినిమా జవాన్ తో పాటు రిలీజైనా స్టడీగా నిలదొక్కుకుందని అన్నారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చూస్తున్నప్పుడు మంచి ఫీల్ కలిగిందన్న ఆయన నవీన్ పోలిశెట్టి తన క్యారెక్టర్ లో నవ్విస్తూనే ఉన్నాడని, అలాగే అనుష్క యాక్టింగ్ తో ఎమోషనల్ అయ్యేలా చేస్తోందని అన్నారు. సినిమా ఫినిష్ అయ్యేప్పటికి ఒక మంచి సినిమా చూశాననిపించిందన్న ఆయన వెంటనే యూవీ వంశీకి, నవీన్ కు ఫోన్ చేశానని అన్నారు. మీరు మంచి సినిమా చేశారు. మౌత్ టాక్ బాగుంది, దీన్ని ప్రజల దగ్గరకు మరింతగా తీసుకెళ్లాలి అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టమని నేనే అడిగానని అన్నారు. గుడ్ ఫిలింస్ వచ్చినప్పుడు వాటిని మనమంతా ఎంకరేజ్ చేయాలి, మీరు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని తెలుసని అన్నారు. ఇంకా సినిమా చూడని వాళ్లుంటే వాళ్లు చూసేలా ప్రమోట్ చేసుకోవాలని, మీరు ఎక్కడికి రమ్మన్నా ఈ సినిమా ప్రచారం కోసం వస్తానని అన్నారు. నాలుగు వారాల దాకా ఈ సినిమా స్టడీగా వెళ్తుందనే నమ్మకం ఉందన్న ఆయన ఇవాళ మ్యాట్నీస్ కూడా ఫుల్ అయ్యాయని అన్నారు. ఒక కొత్త పాయింట్ ను ప్రేక్షకులకు ఈ సినిమా ద్వారా చెప్పారని, ఫిల్మ్ పూర్తయ్యేసరికి ఒక గుడ్ మూవీ చూసిన ఫీల్ కలిగించారని అన్నారు. జవాన్ ను తట్టుకుంటూ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా నిలబడగలిగిందని, స్ట్రాంగ్ కలెక్షన్స్ తో ముందుకెళ్తోందన్నారు.

పీఎంతో జైలర్ భేటీ!
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనడంలో సందేహం లేదు. కేవలం ఇండియాలోనే కాక జపాన్, మలేషియా లాంటి దేశాల్లో కూడా రజనీ అంటే చెవి కోసుకుని అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఇక తాజాగా మలేషియా పర్యటనలో ఉన్న రజనీకాంత్‌ ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. ఇద్దరు ప్రధానమంత్రి కార్యాలయంలో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న వీడియో షేర్ చేశారు. జైలర్ హీరో రజినీకాంత్ తెల్లటి చొక్కాతో తెల్లని ధోతీని ధరించి కనిపించారు. ఇక ఈ విషయాన్ని ఒక వీడియోను, కొన్ని ఫోటోలను ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీం సోషల్ మీడియాలో షేర్ చేశారు. నేను భారత చలనచిత్ర నటుడు రజనీకాంత్ తో భేటీ అయ్యాను, ఆయన ఆసియా సహా అంతర్జాతీయ కళా ప్రపంచ వేదికపై సుపరిచితులు. ముఖ్యంగా ప్రజల కష్టాలు, కష్టాల విషయంలో నా పోరాటానికి ఆయన ఇచ్చిన గౌరవాన్ని అభినందిస్తున్నాను, క్యాజువల్‌గా మేము కొన్ని విషయాలు చర్చించినా, భవిష్యత్తులో ఆయన సినిమాల్లో నేను ప్రయత్నిస్తున్న సామాజిక అంశాలు చేర్చే విషయంలో కూడా చర్చించామని న్నారు. ఇక రజనీకాంత్ సినిమా ప్రపంచంలో రాణించాలని ప్రార్థిస్తున్నాను” అన్నారు. రజనీ సినిమాల విషయానికి వస్తే ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన జైలర్, OTT విడుదలైనప్పటికీ థియేటర్లలో రన్ అవుతూ వసూళ్లను అందుకుంటుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 7న అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవడం మొదలైంది. ఇప్పుడు ఆ ప్లాట్‌ఫారమ్‌లో అత్యధికంగా వీక్షించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక మరో పక్క రజనీకాంత్ హీరోగా జైలర్ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ మరో సినిమాను అనౌన్స్ చేసింది. లోకేష్ కనగారాజ్ డైరెక్షన్లో రజనీ 157వ సినిమా చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించింది.