Site icon NTV Telugu

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

ఆ అధికారులు, ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అధికారులు, ఉద్యోగుల బదిలీలపై నిషేధం విధించారు.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సీఈవో ఎంకే మీనా… 2024 ఓటర్ల తుది జాబితా రూపొందే వరకూ నియామకాలు, బదిలీలపై ఎన్నికల ప్రధానాధికారి అనుమతి తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.. ఓటర్ల తుది జాబితా రూపకల్పనలో భాగస్వాములైన సిబ్బంది ఖాళీల పైనా అక్టోబర్ 10 తేదీలోగా వివరాలివ్వాలని జిల్లా కలెక్టర్లు సహా ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల ప్రక్రియలో ఉన్న వారి బదిలీకి వీల్లేదని ఉత్తర్వుల్లో స్పష్టీకరణ. ఫొటో ఓటర్ల తుది జాబితా రూపకల్పన కోసం అన్ని ఖాళీలను అక్టోబర్ 10వ తేదీ లోగా భర్తీ చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. 2023 అక్టోబర్ 27 నాటికి ముసాయిదా జాబితా, అలాగే 2024 జనవరి 5 తేదీ నాటికి ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామన్న పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం.. సీఈవో ముఖేష్ కుమార్ మీనా.. కాగా, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల సమయంలో.. దేశవ్యాప్తంగా పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికల జరగనున్న విషయం విదితమే.

సినిమా వాళ్లు భయంతో ఉన్నారు.. పవన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబు అరెస్ట్‌ వ్యవహారంలో సినీ ఇండస్ట్రీ పెద్దగా స్పందించలేదు.. కొందరు సినీ పెద్దలు తప్పితే.. బాబు అరెస్ట్‌పై ఎవరూ నోరు మెదిపింది లేదు.. అయితే, దీనిపై ఇప్పటికే బాలయ్య.. స్పందించకపోయినా పట్టించుకోం.. ఐ డోంట్‌ కేర్‌.. బ్రో ఐ డోంట్‌ కేర్‌ అంటూ వ్యాఖ్యానించారు నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు ఇదే వ్యవహారంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. సినిమా ఇండస్ట్రీ మీద పూర్తి ఒత్తిడి ఉంటుందన్న ఆయన.. ప్రస్తుత పరిస్థితుల్లో స్పందించడానికి కూడా సినిమా వాళ్లు భయపడతారని తెలిపారు.. గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడే మండలాధీశుడు వంటి చాలా సినిమాలు తీశారు. కోట, పృధ్వీ వంటి వారు ఎన్టీఆర్ క్యారెక్టర్‌లో నటించారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. అందుకే ఏం మాట్లాడాలన్న భయంతో ఉన్నారని తెలిపారు. అయితే, సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి.. మొండి వాడ్ని కాబట్టి.. నేను స్పందించాను అని వ్యాఖ్యానించారు పవన్‌ కల్యాణ్.. ఇక, సీట్లు కేటాయింపు అనేది బహుత్ దూర్ కీ బాత్ గా పేర్కొన్న ఆయన.. టీడీపీ బలహీన పడిందనేది మీ అభిప్రాయం.. సజ్జల అభిప్రాయంగా తెలిపారు. చంద్రబాబును రజనీకాంత్ పొగిడినందుకు ఆయన్నే వదలలేదు. సినీ ఇండస్ట్రీ అనేది వల్నరబుల్. ఇండస్ట్రీకి కొంచెం వెసులుబాటు ఇవ్వాలని చెప్పుకొచ్చారు పవన్‌ కల్యాణ్‌. మరోవైపు.. జీ-20 సదస్సు జరుగుతున్నప్పుడు నక్క జిత్తులతో చంద్రబాబును అరెస్ట్ చేశారని మండిపడ్డారు..

మేం ఎవరితో పొత్తు పెట్టుకుంటే మీకెందుకు..? ఎన్ని సీట్లల్లో.. ఎక్కడ పోటీ చేస్తామో వైసీపీకి ఎందుకు?
టీడీపీ-జనసేన పొత్తులపై విమర్శలు గుప్పిస్తున్న అధికార వైసీపీ నేతలకు ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. మేం ఎవరితో పొత్తు పెట్టుకుంటే వైసీపీకి ఎందుకు..? ఇక్కడ మేం ఎన్ని సీట్లల్లో పోటీ చేస్తామో.. ఎక్కడ పోటీ చేస్తామోననేది వైసీపీకి ఎందుకు..? అని నిలదీశారు. జనసేన-టీడీపీ-బీజేపీ కలిసే ఎన్నికలకు వెళ్లాలనేది నా ఆకాంక్షగా తెలిపారు పవన్‌. ఇక, వారాహి యాత్రలో వివిధ సమస్యలు మా దృష్టికి వచ్చాయి అని తెలిపారు. నీటి సమస్య, కొల్లేరులో విష పదార్దాల వ్యర్ధాల కలుషితం, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు సరిగా ఇవ్వడం లేదనే అంశం మా దృష్టికి వచ్చింది. చాలా మంది టీచర్లకు ఇప్పటికీ జీతాల్లేవు.. ఆదోని మండలంలో ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఓ టీచర్ ఆత్మహత్య చేసుకున్నారు.. ఏపీలోని ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులకు జీతాలు చెల్లించడం లేదు. టీచర్లకు జీతాలు ఎలా రావడం లేదో.. ఐఏఎస్‌లకూ జీతాలివ్వలేకపోతున్నారు.. రిటైర్డ్ ఐఏఎస్‌లకు పెన్షన్ సరిగా రావడం లేదు. కేంద్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి దేశ వ్యాప్తంగా ఐఏఎస్‌లకు వేతనాలు చెల్లిస్తారు. కానీ, ఆ ఫండ్ నుంచి జీతాలివ్వడం లేదు.. ఇది రాజ్యాంగ విరుద్దం అన్నారు పవన్‌ కల్యాణ్‌. ఏపీలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు.. ఫ్లైట్లు కూడా రానివ్వని పరిస్థితి ఉందని ఆరోపించారు పవన్‌.. మేం ఎక్కడ పోటీ చేయాలో.. ఎన్ని సీట్లు పోటీ చేయాలో వైసీపీ నేతలేం చెప్పాల్సిన అవసరం లేదన్న ఆయన.. ఢిల్లీకి వెళ్లి వైసీపీ నేతలు రాష్ట్రానికి మేలు చేకూరే పనుల గురించి మాట్లాడాలని సూచించారు. సీఎం జగన్ కేంద్రానికి ఎన్నిసార్లు వెళ్లినా రైతులకు మేలు కలిగే పనులేం చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం పసుపు బోర్డు సాధించుకుంది. కాష్యూ బోర్డ్.. కోకో బోర్డ్ వంటి వాటి కోసం వైసీపీ ప్రభుత్వం కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించదు..? అని నిలదీశారు. ఇక, జీ-20 సదస్సు జరుగుతున్నప్పుడు నక్క జిత్తులతో చంద్రబాబును అరెస్ట్ చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదనే వైఖరికి అనుగుణంగానే టీడీపీకి మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు.. ఢిల్లీలో బీజేపీ పెద్దలు బిజీగా ఉండడం వల్ల టీడీపీతో పొత్తు విషయం చెప్పలేకపోయాం. బీజేపీతో సమన్వయ కమిటీ ఉంది. ఇటీవల కాలంలో బీజేపీతో కలిసి పోరాటాలు కూడా చేశామని వెల్లడించారు..

చంద్రబాబు ఫ్యామిలీకి పేర్నినాని సవాల్.. పవన్‌పై ఘాటు వ్యాఖ్యలు
1995లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ చంద్రబాబు సంపాదించిన ఆస్తులు, వ్యాపారాలపై.. కోర్టు పర్యవేక్షణలో విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని.. నిజంగా నీతివంతమైన కుటుంబమే అయితే, ఆస్తులపై విచారణకు సిద్ధం కావాలన్నారు. రోజుకు కోటి, కోటిన్నర తీసుకున్న లాయర్లు బెజవాడలో తిరుగుతుంటే.. పాతిక రోజులు ఢిల్లీలో లోకేష్‌ ఏం చేశారని ప్రశ్నించారు.. కన్నతండ్రి జైలులో ఉంటే.. తల్లి, భార్యను రోడ్డున వదిలేసి.. ఢిల్లీలో తిరుగుతావా అని నిలదీశారు. 3 వేల కోట్ల స్కామ్‌ చేశారనే మొదటి నుంచి వైసీపీ చెబుతోందన్నారు పేర్ని నాని. 27 కోట్లు టీడీపీ అకౌంట్‌లో సిగ్గులేకుండా వేసుకున్నారని ఆరోపించారు. అయితే, సీమెన్స్ ఇస్తామన్న 3 వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయో చెప్పాలని లోకేశ్‌కు పేర్నినాని సవాల్ చేశారు. ఆడబ్బులు తేవడానికి ఢిల్లీ వెళ్లారా చెప్పాలన్నారు. వీరప్పన్‌లా చంద్రబాబు కూడా ఒక్కసారే దొరికారన్నారు పేర్నినాని. ఆ ఒక్కసారితోనే ఆయన చరిత్ర అంతమైందన్నారు. దొరకనన్నాళ్లు వీరప్పన్‌ ఎలా మాట్లాడారో… మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారన్నారు పేర్నినాని. వైసీపీ ఎప్పుడు పొత్తు లేకుండా పోటీ చేస్తుందన్నారు పేర్నినాని. పవన్‌లా రోజుకో వేషం మార్చే రాజకీయనాయకుడు సీఎం జగన్ కాదన్నారు పేర్నినాని. ప్రజల్ని నమ్ముకుని ధైర్యంగా రాజకీయం చేసే నేత సీఎం జగనన్నారు. ఇక, ఏపీకి రావాలంటే పాస్‌పోర్టు కావాలా అన్న ప్రశ్నకు పేర్ని నాని కౌంటరిచ్చారు. పవన్‌కు… ఆధార్ నుంచి ఇల్లు, ఆస్తులు, వ్యాపారం ఏవీ ఏపీలో ఉండవన్నారు. తానేదో ఎన్డీఏ నుంచి బయటకొచ్చినట్లు పవన్ చెబుతున్నాడని.. మరి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా బదులిస్తారన్నారు. బీజేపీ నేతలంటే పవన్‌కు చాలా భయమన్న సంగతి స్పష్టంగా తెలుస్తోందన్నారు.

కేసీఆర్ లెక్కల ప్రకారమే కాంగ్రెస్ లో బీ-ఫామ్ పంపకాలు
నేడు ( శుక్రవారం ) హైదరాబాద్ వేదికగా బీజేపీ స్టేట్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తురుణ్ చుగ్, బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. అవకాశం ఇస్తే ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తానని పేర్కొన్నారు. 119 నియోజక వర్గాలలో కనీవినీ ఎరుగని అభ్యర్థులను బరిలో దించుతాము అని ఆయన అన్నారు. పార్టీ మారే ప్రసక్తే లేదు అని బీజేపీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి అన్నారు. BRSను ఓడించే పార్టీ బీజేపీ పార్టీనే అని ప్రజలు భావిస్తున్నారు.. తుది శ్వాస వరకు బీజేపీలోనే ఉంటాను అని ఆయన స్పష్టం చేశారు.. కొంత మంది పని కట్టుకొని నాపై తప్పుడు ప్రచారం చెస్తున్నారు.. రేవంత్ రెడ్డి, కేటీఆర్ కలిసి నన్ను మునుగొడులో ఓడించారు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇండియా కూటమిని నిజమైన సవాల్‌గా భావిస్తున్నా.. ఎందుకంటే?
ప్రతిపక్ష ఇండియా కూటమిని నిజమైన సవాల్‌గా భావిస్తున్నానని కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం అన్నారు. తన సొంత రాష్ట్రం ఒడిశా నుంచి 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తనను అనుమతించాలని తన పార్టీని అభ్యర్థించినట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి దేశానికి సేవ చేయాలనేది బీజేపీ ఎజెండా అని ఆయన అన్నారు. ఏ ఎన్నికలను కూడా బీజేపీ తేలిగ్గా తీసుకోదని.. ఆ కారణంగానే ఇండియా కూటమిని ప్రధాన ఛాలెంజ్‌గా తాను భావిస్తున్నానని చెప్పారు. ఎన్నికలు ఏవైనా బీజేపీ కింది స్థాయి కార్యకర్తల నుంచి అగ్రనేతల వరకూ ప్రతి ఒక్కరూ చాలా సీరియస్‌గా తీసుకుని పనిచేస్తారని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమను ముందుండి నడిపిస్తుంటారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరికపై ఆయన మాట్లాడుతూ, “నేను ఇప్పటికే నా కోరిక గురించి పార్టీకి తెలియజేశాను. నాకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించాను, ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి మూడోసారి సేవ చేయాలనేది బీజేపీ ఎజెండా.” అని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. దేశంలోని తల్లులు, సోదరీమణులకు రాజకీయ హక్కులను కల్పించడం ద్వారా ప్రధాని మోడీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. కాంగ్రెస్ తమ హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎలాంటి చిత్తశుద్ధి చూపించలేదని, బిల్లు గడువు కూడా తీరిపోయిందని అన్నారు. అవకాశం వచ్చినా వాళ్లు (కాంగ్రెస్) దానిని ఉపయోగించుకోలేకపోయారని విమర్శలు గుప్పించారు.

అసభ్య పోస్టులను ఉపేక్షించం.. ఎక్స్, యూట్యూబ్‌, టెలిగ్రామ్‌లకు కేంద్రం హెచ్చరిక
భారతదేశంలోని తమ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి పిల్లల లైంగిక వేధింపుల విషయాలను తొలగించాలని ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఎక్స్ గతంలో ట్విట్టర్, యూట్యూబ్, టెలిగ్రామ్‌లకు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన తెలిపింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఇంటర్నెట్‌లోని వారి ప్లాట్‌ఫారమ్‌ల నుంచి చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (CSAM)ని తీసివేయమని హెచ్చరించింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లకు ఇచ్చిన నోటీసుల్లో వాటి ప్లాట్‌ఫారమ్‌లలో ఏదైనా చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (CSAM)కి సంబంధించిన విషయాలు ఉంటే శాశ్వతంగా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ వ్యాప్తిని నిరోధించడానికి కంటెంట్ మోడరేషన్ అల్గారిథమ్‌లు, రిపోర్టింగ్ మెకానిజమ్స్ వంటి చురుకైన చర్యలను అమలు చేయాలని కూడా సూచించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తమ ప్లాట్‌ఫారమ్‌లలో పిల్లలపై లైంగిక వేధింపుల మెటీరియల్ కనిపించకుండా చూసేందుకు ఎక్స్, యూట్యూబ్, టెలిగ్రామ్‌లకు నోటీసులు పంపామని చెప్పారు. ఐటీ నిబంధనల ప్రకారం సురక్షితమైన. విశ్వసనీయమైన ఇంటర్నెట్‌ను రూపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఐటీ చట్టంలోని నిబంధనలు సోషల్ మీడియా మధ్యవర్తులపై కఠినమైన అంచనాలను ఉంచుతాయని, వారు తమ ప్లాట్‌ఫారమ్‌లలో క్రిమినల్ లేదా హానికరమైన పోస్ట్‌లను అనుమతించకూడదని మంత్రి హెచ్చరించారు. వారు వేగంగా చర్య తీసుకోకపోతే, ఐటీ చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం, భారత చట్టం ప్రకారం పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన హెచ్చరికలు జారీ చేశారు.

స్విగ్గీ డెలివరీ బాయ్స్ డ్రెస్సులా టీమిండియా ప్రాక్టీస్ జెర్సీ.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్..
ఐసీసీ టోర్నీలాగే ఈసారి కూడా వన్డే ప్రపంచకప్ 2023 టోర్నమెంట్ లో కొత్త జెర్సీలో టీమిండియా కనిపించబోతోంది. అయితే, ఈసారి కిట్ స్పాన్సర్ కూడా మారడంతో కొత్త లుక్‌లో రోహిత్ సేన దర్శనమివ్వబోతోంది. ఇంతకు ముందు ప్రాక్టీస్ సెషన్స్‌లో కాస్త లేత ముదురు నీలి రంగులో ఉన్న జెర్సీలను ఇండియా టీమ్ వాడేది. అయితే ఇప్పుడు ఆరెంజ్ కలర్ జెర్సీలను వినియోగిస్తుంది. ఆరెంజ్ కలర్ టీ షర్ట్, ఆరెంజ్ కలర్ క్యాప్, బ్లాక్ కలర్ షార్ట్‌తో టీమిండియా ప్రాక్టీస్ జెర్సీ.. చూడడానికి సెమ్ స్విగ్గీ డెలవరీ బాయ్స్ యూనిఫామ్‌లా కనిపిస్తుంది. ఇక, దీనిపై స్విగ్గీ ఇండియా కూడా ట్విట్టర్‌ వేదికగా స్పందించింది. టీమిండియా ప్రాక్టీస్ జెర్సీ చూస్తుంటే ఆరెంజ్ జెర్సీ బాయ్స్, డెలివరీ చేయడానికి రెఢీగా ఉన్నట్టుగా ఉంది అని తెలిపింది. భారత ఫ్యాన్స్ కూడా దీనిపై ఇదే విధంగా రియాక్ట్ అవుతున్నారు. చూస్తుంటే టీమిండియా జెర్సీని స్విగ్గీ తయారు చేసినట్టుగా ఉందంటూ.. అందుకే డెలివరీ బాయ్స్ డ్రెస్ కోడ్‌ని సెమ్ టూ సెమ్ దించేశార సోషల్ మీడియా వేదికగా చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.

ఏంటి పాప.. మొత్తం చూపిస్తే కుర్రాళ్లు ఏమైపోతారు..
బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అషురెడ్డి పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. సోషల్ మీడియాను తన హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తుంది.. తన అందంతో బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది.. ఇప్పుడు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ఇటీవల అషురెడ్డి సోషల్ మీడియాలో చేస్తున్న గ్లామర్ షో బోల్డ్ గా ఉంటోంది.. రోజు రోజుకు బట్టలను పొదుపు చేస్తూ హాట్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. ఆమె ఏ ఫోటో పెట్టిన క్షణాల్లోనే వైరల్ అవుతుంది.. తాజాగా బీచ్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.. అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది.. రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషురెడ్డి మరింత పాపులర్ అయింది. సినిమాల్లో కూడా అషురెడ్డి కొన్ని చిత్రాల్లో మెరిసింది. అయితే ఆమెకు బలమైన పాత్రలు దక్కడం లేదు.. సైడ్ క్యారెక్టర్ లో కనిపిస్తూ జనాలను అల్లరిస్తుంది.. ఇక బుల్లితెరపై పలు షోలల్లో కనిపిస్తూ సందడి చేస్తుంది.. ఒక వైపు రాహుల్ సిప్లిగంజ్ తో రొమాంటిక్ వ్యవహారం సాగిస్తోంది అని కూడా వార్తలు వస్తున్నాయి. అషు రెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో గ్లామర్ పిక్స్ తో పాటు డబ్ స్మాష్ వీడియోల్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది..

ఎప్పుడూ హీరోలే ఎందుకు గెలవాలి..విలన్లు కూడా గెలవాలి కదా!
సినిమా మీద ఇష్టం ఏర్పడితే ఏ వృత్తిలో ఉన్నా ఫిలిం ఇండస్ట్రీ వైపే ఆకర్షిస్తుంటుంది. అలా సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా విదేశాల్లో ఉంటూ నిర్మాతగా, ఫైనాన్షియర్ గా సినిమాల మీద తనకున్న ప్యాషన్ చూపిస్తున్న శింగనమల కళ్యాణ్ తన సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్ మీద భాగ్ సాలే సినిమాను నిర్మించారు. ఇక ఇప్పుడు దాము రెడ్డితో కలిసి గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్ పార్టనర్ షిప్లో రాక్షస కావ్యం సినిమా చేస్తున్నారు. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దర్శకుడు శ్రీమాన్ కీర్తి రూపొందించగా అక్టోబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా “రాక్షస కావ్యం” సినిమా విశేషాలు, తన కెరీర్ జర్నీ గురించి శింగనమల కళ్యాణ్ పలు విశేషాలు పంచుకున్నారు. ఒకరోజు ప్రొడ్యూసర్ దాము రెడ్డిని మధుర శ్రీధర్ రెడ్డి నా దగ్గరకు తీసుకొచ్చి “రాక్షస కావ్యం” సబ్జెక్ట్ బాగుంది, తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రా అండ్ రస్టిక్ మూవీ అని చెప్పగా సినిమా స్టోరీ లైన్ నచ్చి “రాక్షస కావ్యం” మూవీ ప్రొడక్షన్ లో అడుగుపెట్టానని అన్నారు. “రాక్షస కావ్యం” సినిమా కథ సహజంగా ఉంటూ రా అండ్ రస్టిక్ గా సాగుతుందని, ఎక్కువ మెలోడ్రామా చూపించడం లేదని అన్నారు. ఈ సినిమా మనం రియల్ లైఫ్ లో చూసేదానికి దగ్గరగా ఉంటుందని, ముఖ్యంగా దిగువ మధ్య తరగతికి చెందిన మనుషులు, బస్తీల్లో ఉండేవాళ్ల మైండ్ సెట్, జీవన విధానం మూవీలో కనిపిస్తుందని అన్నారు. అక్కడ తాగుడుకు బానిసై పిల్లలను చదివించకుండా పనికి పంపిస్తుంటారు, ఈ కథలో విలన్స్ కూడా గెలవాలి, ఎప్పుడూ హీరోలే ఎందుకు గెలవాలి అనే కామెడీ పాయింట్ కూడా కొత్తగా ఉంటుందని అన్నారు. మన సినిమాల్లో విలన్స్ ను ఎలా తక్కువ చేసి చూపిస్తున్నారు, హీరోలను ఎలా హైప్ చేస్తున్నారు అని చెప్పే సరదా సీన్స్ కూడా ఉంటాయని అన్నారు. “రాక్షస కావ్యం” కథకు పురాణాల్లోని ఓ సందర్బం రిలేట్ అయి ఉంటుందని పేర్కొన్న ఆయన ఒక రుషి కైలాసగిరికి వస్తున్నప్పుడు ఇద్దరు ద్వారపాలకులకు అడ్డుకుంటారని, ఆ రుషి ఆగ్రహించి శపిస్తాడని అన్నారు. ఆ కాలంలోని ఇద్దరు ద్వారపాలకులు కలియుగంలో మళ్లీ పుట్టారనేది పోలిక అని వీళ్లిద్దరిలో ఒకరు హీరోల కంటే విలన్స్ ను ఇష్టపడతాడు, మరొకరు రాక్షసంగా అందర్నీ చంపే రౌడీగా కనిపిస్తాడని అన్నారు. ఈ సినిమా కథను చెప్పినదానికంటే బాగా తెరకెక్కించాడు దర్శకుడు, ఎలాంటి ఫాంటసీ, మెలోడ్రామా, ఫారిన్ లొకేషన్స్ షూట్స్ లేకుండా సహజంగా మనం బస్తీల్లో చూసే వ్యక్తుల జీవితాలను రా అండ్ రస్టిక్ గా రూపొందించాడని అన్నారు.

‘మ్యాడ్’తో గట్టి హిట్ కొడుతున్నాం అన్నారూ.. కొట్టి చూపించాం!
నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమైన ‘మ్యాడ్’ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూర్యదేవర నాగ వంశీ సమర్పించిన ఈ సినిమాకి ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరించగా కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయయ్యారు. ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీలో సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రలలో నటించారు. ప్రీమియర్స్ వేయగా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి వసూళ్లను కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించిన చిత్ర బృందం ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ అందరూ కొత్త వాళ్ళు కలిసి చేసిన ఈ సినిమా బాగుంది, ఆడియన్స్ కి నచ్చుతుందని నమ్మకంతో ఈ సినిమాకి కాన్ఫిడెంట్ గా ప్రమోట్ చేశాము. కొత్త వాళ్ళు నటించిన ఈ సినిమాకు ఇంత మంచి ఓపెనింగ్స్ రావడం సంతోషంగా ఉందని, ఇలాంటి సినిమాలు చేయడానికి మరింత ధైర్యం వచ్చిందని అన్నారు. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్లు రాబడుతుందని పేర్కొన్న ఆయన మీడియా నుంచి కూడా ఈ సినిమాకి మంచి స్పందన లభించిందని అన్నారు.

Exit mobile version