NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

విద్యుత్, పప్పు, నూనెల ధరలు పెరిగిన మాట వాస్తవమే.. కానీ..!
రాష్ట్రంలో విద్యుత్, పప్పు, నూనెల ధరలు పెరిగిన మాట వాస్తవమే.. కానీ, ధరలు పెరుగుదల ఒక్క ఆంధ్రప్రదేశ్ లో నే కాదు దేశం అంతటా ఇదే పరిస్థితి ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. అనకాపల్లి జిల్లాలో జరుగుతోన్న వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో ఆయన మాట్లాడుతూ.. ధరల పెరుగుదలపై వాస్తవాలు దాచిపెట్టి టీడీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.. 4,200 గ్రామాల్లో భూ సర్వే పూర్తయ్యింది.. టైటిల్ ఫ్రీ రికార్డులు రూపొందిస్తున్నాం అని తెలిపారు. 14 ఏళ్ల పాలన తర్వత ఇప్పుడు.. పవన్ కల్యాణ్‌, చంద్రబాబు పారిశ్రామిక అభివృద్ధి, కొత్త విధానాలపై చర్చించడం హ్యాస్యాస్పదంగా ఉందన్నారు.. ప్రజలకు మేలు చేస్తున్న వైఎస్‌ జగన్ కు వద్దని మోసం చేసిన తనకు ఓటేయమని అడగడానికి చంద్రబాబుకి సిగ్గు అనిపించడం లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు కుల పిచ్చి.. ఆయన సామాజిక వర్గం వారికే పదవులు..!
చంద్రబాబుకు కుల పిచ్చి ఎక్కువ.. ఆయన సామాజిక వర్గంవారికే పదవులు కట్టబెడతారని ఆరోపించారు మంత్రి సీదిరి అప్పలరాజు.. నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు.. మంత్రి అప్పలరాజుతో పాటు పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు.. రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ రావు, జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ.. సామాజిక సాధికార యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన కొందరికి కనిపించడం లేదు.. కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

రేపటితో ముగియనున్న వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర
ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇచ్చిన ఆదేశాలతో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రను చేపట్టింది. గత నెల 26వ తేదీన ప్రారంభమైన మొదటి దశ బస్సు యాత్ర… శుక్రవారంతో ముగియనుంది. ఫస్ట్ ఫేజ్ లో 39 నియోజకవర్గాల్లో పర్యటించాలని నిర్దేశించుకున్నా… పలు కారణాలతో 35 నియోజకవర్గాల్లో పూర్తి అవుతోంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో ఏకకాలంలో ప్రతి రోజు మూడు నియోజకవర్గాల్లో మూడు బస్సు యాత్రలు, మూడు సభలు నిర్వహించారు. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, కోస్తాలో తెనాలి, రాయలసీమలో శింగ‌న‌మ‌ల‌ నుంచి బస్సు యాత్ర ప్రారంభం అయింది. ఈ బస్సు యాత్ర పూర్తిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలు పాల్గొనే విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో ఈ సామాజిక వర్గాలకు తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమాలను ప్రజలకు వివరించడమే ప్రధాన అజెండా.

ముహూర్త బలం.. భారీగా నామినేషన్లు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నేతలు పలువురు.. ఇవాళ ముహూర్తం బాగుండటంతో.. ర్యాలీగా వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి, గులాబీబాస్‌ కేసీఆర్ ఉదయం గజ్వేల్‌లో, మధ్యాహ్నం కామారెడ్డి నియోజకవర్గాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. గజ్వేల్‌లో రెండు సెట్ల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. కామారెడ్డిలో ఆర్డీవో కార్యాలయంలో కేసీఆర్‌ నామినేషన్ వేశారు. నామినేషన్ తర్వాత ప్రచారం వాహనం పైనుంచి ప్రజలకు అభివాదం చేశారు. మరోవైపు మంత్రి హరీశ్‌రావు సిద్ధిపేటలో నామినేషన్‌ దాఖలు చేశారు. సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో హరీశ్‌రావు, సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయంలో కేటీఆర్‌ నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. బోధన్‌లో బీఆర్ఎస్‌ అభ్యర్థి షకీల్‌ నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ కవిత కాసేపు బైక్‌ ప్రయాణించి సందడి చేశారు. సీఎల్పీనేత భట్టి విక్రమార్క.. మధిరలో నామినేషన్ దాఖలు చేశారు. ఉదయాన్నే వివిధ మతపెద్దల ఆశీర్వచనాలు తీసుకున్న సీఎల్పీనేత.. ఆ తర్వాత ర్యాలీగా బయలుదేరారు. అభిమానులు, కార్యకర్తలు వెంట రాగా భట్టి విక్రమార్క.. నామినేషన్ వేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి నామినేషన్‌ వేశారు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి. భారీ ర్యాలీగా రిటర్నింగ్‌ కార్యాలయానికి వెళ్లి.. నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నిజామాబాద్‌లో నామినేషన్ వేశారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి బరిలోకి దిగుతున్న ఆయన.. స్థానిక నేతలతో కలిసి వెళ్లి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.

కేసీఆర్‌ ఆస్తుల కంటే.. అప్పులే ఎక్కువ.. నామినేషన్‌ అఫిడవిట్‌లో కీలక విషయాలు
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పులను ప్రకటించారు. గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో కేసీఆర్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. చరాస్తులలో నగదు, డిపాజిట్లు, పెట్టుబడులు, రూ. 25.61 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, హెచ్‌యూఎఫ్‌లో రూ. 9.81 కోట్లతో కలిపి మొత్తం రూ.35.42 కోట్లకు చేరుకుంది. స్థిరాస్తుల్లో బంజారాహిల్స్‌లోని ఆయన నివాసం, కరీంనగర్‌లోని ఫామ్‌హౌస్, రూ.8.50 కోట్ల విలువైన భూములు, హెచ్‌యూఎఫ్‌లో రూ.15 కోట్లతో కలిపి మొత్తం రూ.23.50 కోట్లకు చేరుకుంది. ఇన్‌ఫ్రా ఫ్యామిలీ లోన్‌లు, రాజేశ్వర హేచరీస్, జి వివేకానందకు చెల్లించాల్సిన రూ. 17.27 కోట్ల రుణాలు ఆయన అప్పుల్లో ఉన్నాయి. కేసీఆర్‌కు వ్యవసాయ భూమి లేదని, ఆయన భార్య శోభ పేరు మీద ఎలాంటి ఆస్తి లేదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తమకు ఉన్న భూమిని కుటుంబ ఆస్తిగా చూపించారు. కుటుంబానికి 62 ఎకరాలు ఉండగా, ఇందులో 53.30 ఎకరాలు సాగుభూమి కాగా, 9 ఎకరాలకు పైగా వ్యవసాయేతర భూమి ఉన్నట్లు తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆయన ఆదాయం రూ. 1.60 కోట్లు, ఆయన సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని కలిగి ఉన్నాడు.

ఇది ఉత్తర కొరియా “వోల్వో కార్”ల కహానీ.. 50 ఏళ్లుగా స్వీడన్‌కి పైసా చెల్లించలేదు..
ఉత్తర కొరియా ప్రపంచంలోనే ఓ నిగూఢ దేశం. నిజానికి ఆ దేశ ప్రజలకు బయట ఒక ప్రపంచం ఉందని తెలియదంటే అతిశయోక్తి కాదు. కేవలం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చెప్పేదే న్యాయం, చేసేదే చట్టం అక్కడ. తన తాత, తండ్రులే అక్కడ దేవుళ్లు. ఇంతలా అక్కడి ప్రజలు అణిచివేతకు గురవుతున్నారు. శిక్షల్లో, వింత వింత రూల్స్‌కి నార్త్ కొరియా పెట్టింది పేరు. ఇదిలా ఉత్తర కొరియాకు చెందిన ఓ కార్ల కహానీ ఇప్పుడు వైరల్ అవుతోంది. 49 ఏళ్ల క్రితం 1974 ఉత్తర కొరియా 1000 వోల్వో కార్లను ఆర్డర్ పెట్టి, స్వీడన్ నుంచి తమ దేశానికి తెప్పించింది. అప్పట్లో వీటి విలువ 73 మిలియన్ డాలర్లు. అయితే ఇప్పటి వరకు ఆ డబ్బును ఉత్తర కొరియా, స్వీడిష్ కంపెనీ వోల్వోకు చెల్లించలేదు. దాదాపుగా 5 దశాబ్ధాల నుంచి ఈ డబ్బులను చెల్లించలేదు. ఇప్పుడు వాటి విలువ 330 మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఉత్తర కొరియా పాశ్చాత్య దేశాల నుంచి విదేశీ మూలధంన, సాంకేతికత కోసం పరికరాలను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. భవిష్యత్తులో ఉత్పత్తి, మైనింగ్ ఉత్పత్తులతో రుణదాతలకు రుణాలు చెల్లిస్తామని వాగ్దానం చేసింది. అయితే నార్త్ కొరియా పాలకులు ఈ అప్పులను చెల్లించే ఉద్దేశం లేదని రుణదాతలకు తర్వాత అర్థమైంది. 2016లో స్వీడిష్ ఎంబసీ ఒక పోస్టులో దీని గురించి పేర్కరొంది. డీపీఆర్ కొరియా 1974 స్వీడన్ నుంచి దిగుమతి చేసుకున్న కార్లలో ఒక్కదానికి కూడా డబ్బులు చెల్లించలేదని ట్వీట్ చేసింది.

వీడు ‘బాల బాహుబలి’.. 6.8 కిలోల బరువుతో పుట్టాడు..
సాధారణంగా అప్పుడే పుట్టిన శిశువు బరువు సగటున 3.5 కిలోలు ఉంటుంది. 2.5 కిలోల నుంచి 4.5 కిలోల బరువును సాధారణంగా పరిగణిస్తారు. ఇది ఆరోగ్యం ఉన్న శిశువు బరువు. కొన్ని సందర్భాల్లో పుట్టిన సమయంలో పిల్లల బరువు దీని కన్నా తక్కువగా లేదా ఎక్కువగా ఉండటం చూస్తుంటాం. కానీ చాలా అరుదుగా కొందరు మాత్రం బాహుబలిగా జన్మిస్తుంటారు. తాజాగా కెనడాలో ఓ పిల్లాడి జననం 2010 నుంచి ఉన్న రికార్డులను తుడిపేసింది. అయితే కెనడాకు చెందిన ఓ జంటకు రికార్డు స్థాయి బరువుతో బాబు జన్మించాడు. ఏకంగా 6.8 కిలోల బరువు ఉండటంతో ఇటు డాక్టర్లు, అటు పేరెంట్స్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 2010 నుంచి ఇదే రికార్డ్. అక్టోబర్ 263న ఒంటారియోలోని కేంబ్రిడ్జ్‌లోని కేంబ్రిడ్జ్ మెమోరియల్ హాస్పిటల్‌లో బ్రిట్నీ అనే మహిళలకు ఈ ‘బాల బహుబలి’ జన్మించాడు. బ్రిట్నీ, ఛాన్స్ ఐరెస్‌లకు ఇది ఐదో సంతానం. ఇతనికి సోనీ అనే పేరు పెట్టారు.

సచిన్ రికార్డు బ్రేక్.. రచిన్ అరుదైన ఘనత
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈరోజు శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో కివీస్ స్టార్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర అరుదైన ఫీట్ సాధించాడు. వన్డే వరల్డ్ కప్ సింగిల్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రచిన్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్ లో రచిన్ రవీంద్ర 42 రన్స్ చేసి ఔటయ్యాడు. ఈ మెగా టోర్నీలో రచిన్ ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్‌లలో 565 పరుగులు చేశాడు. కాగా.. ఇంతకుముందు ఈ అరుదైన రికార్డు భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉండేది. ఆయన 1996 వరల్డ్‌కప్‌ ఎడిషన్‌లో 523 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో సచిన్‌ 27 ఏళ్ల రికార్డును రచిన్‌ బద్దలు కొట్టాడు. అలాగే వరల్డ్‌కప్‌ 2023లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కూడా రవీంద్రనే ఉన్నాడు. అతడి ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు, 2 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక న్యూజిలాండ్-శ్రీలంక మ్యాచ్ లో గెలుపు దిశగా ముందుకెళ్తుంది. 22 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. ఇంక కివిస్ కు కావాల్సింది 15 పరుగులు మాత్రమే. ప్రస్తుతం క్రీజులో డేరిల్ మిచెల్ 39, గ్లేన్ ఫిలిప్స్ 9 పరుగులతో ఉన్నారు.

థియేటర్ లోకి మరో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ వస్తుందిరోయ్..
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరో సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేదు. కథ బావుంటే.. చిన్న సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఇక ఎంతపెద్ద స్టార్లు ఉన్నా కూడా కథలేకపోతే ప్రేక్షకులు మెచ్చడం లేదు. అందుకే చిన్న కథలు రావడం ఎక్కువ అవుతున్నాయి. తాజాగా మరో చిన్న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే ది ట్రయల్. స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాకు రామ్ గన్ని దర్శకత్వం వహించాడు. ఎస్ఎస్ ఫిలింస్, కామన్ మ్యాన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ నిర్మించారు. సుదర్శన్ రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక ఈ సినిమా నవంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ది ట్రయల్ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ కు మంచి స్పందన వచ్చింది. థియేటర్స్ లోనూ సినిమాకు ఇదే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని ది ట్రయల్ టీమ్ ఆశిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ కు మంచి గుర్తింపు ఉంది. మూడు గంటలు ప్రేక్షకులను సీట్ లో కూర్చోబెట్టేలా కథ ఉంటుందని మేకర్స్ తెలుపుతున్నారు. ది ట్రయల్ సినిమా ఇప్పటిదాకా తెలుగు తెరపై చూడని కంప్లీట్ ఇంటరాగేటివ్ కథతో ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇస్తుందని చిత్రబృందం నమ్మకంతో చెబుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

‘బజార్’ కు ఎక్కిన సమంత.. లక్షల విలువ చేసే డ్రెస్ ధరించి..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా మారిపోయింది. ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది. ఇంకోపక్క మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటుంది. అమ్మడు సినిమాలు తప్ప అన్ని చేస్తుంది. యాడ్స్, ఫోటోషూట్స్.. ఈవెంట్స్ ఇలా అన్నింటిలో పాల్గొంటుంది. ఇక పెళ్ళికి ముందు ఎలా ఉన్నా నాగ చైతన్యతో పెళ్లి అయ్యాక సామ్ డ్రెస్సింగ్ స్టైల్లో మార్పు వచ్చింది. చీరలు, నిండుగా కప్పి ఉంచే దుస్తులనే ధరించేది. ఇక చై తో విడాకుల తరువాత ముద్దుగుమ్మ మళ్లీ పాత స్టైల్లోకి వచ్చేసింది. గతంలో ఒక బ్యాగ్ యాడ్ కోసం బికినిలో కనిపించి మెప్పించిన ఈ భామ .. తాజాగా చాలా గ్యాప్ తరువాత బజార్ కెక్కింది. అదేనండీ బజార్ మ్యాగజైన్ పై ఫోటోలకు ఫోజిచ్చింది. బ్లాక్ కలర్ స్విమ్ సూట్ లో బజార్ మ్యాగజైన్ పై సామ్ హాట్ లుక్ ఇంటర్నెట్ ను షేక్ చేసింది. ఎద అందాలను ఆరబోస్తూ.. తడి జుట్టుతో అమ్మడు హీట్ రాజేసింది. ఇక తాజాగా మరో ఫోటోను సామ్ రిలీజ్ చేసింది. ఇందులో బ్యాక్ చూపిస్తూ బెంబేలెత్తించింది. ఇక ఈ డ్రెస్ గురించే సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యింది. లూయిస్ విట్టన్ బ్రాండ్ లో రౌండ్ షోల్డర్ ట్యూబ్ డ్రెస్ లో సామ్ బ్యాక్ అందాలను ఆరబోసింది. ఇక ఈ డ్రెస్ ధర తెలుసుకొని అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ డ్రెస్ విలువ.. ఆరు లక్షలు అని తెలుస్తోంది. ఇక ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు కొందరు బావుంది అంటుంటే.. ఇంకొందరు మాత్రం ఏంటి సామ్.. ఇలాంటి బట్టల్లో కనిపిస్తావు .. ట్రోల్ చేస్తారు అంటూ సలహాలు ఇస్తున్నారు.

దారుణంగా ఈ వారం సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్
ఈ వారం నేరుగా పెద్ద తెలుగు సినిమాలు ఏవీ రిలీజ్ కావడం లేదు. ఇలా నిన్ను చేరి, జనం అనే రెండు స్ట్రైట్ తెలుగు సినిమాలు రిలీజ్ అవుతుండగా దీపావళికి రెండు కొంచెం బజ్ ఉన్న తమిళ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జపాన్ – జిగర్తాండ డబుల్ X సినిమాలు రేపు అంటే శుక్రవారం నాడు 10వ తేదీన రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ సినిమాలకి మంచి బజ్ ఉన్నా తమిళనాడు సహా తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు బుకింగ్‌ల విషయంలో దారుణంగా రిపోర్టులు కనిపిస్తున్నాయి కార్తీ కెరీర్‌లో జపాన్ ల్యాండ్‌మార్క్ చిత్రం ఎందుకంటే ఆయనకి ఇది 25వ చిత్రం. ఇక జిగర్తాండ డబుల్ ఎక్స్ రాఘవ లారెన్స్, ఎస్‌జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన భారీ బడ్జెట్ చిత్రమే కాకుండా డైరెక్టర్ గా మంచి పేరున్న కార్తీక్ సుబ్బరాజు డైరెక్ట్ చేశాడు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద గట్టి ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్ బాగుంటాయని అనుకున్నారు. కానీ దానికి పూర్తి వ్యతికరేకంగా అడ్వాన్స్‌ బుకింగ్లు దారుణంగా ప్రారంభమయ్యాయి. పాటలు మరియు ప్రోమోల వంటి ప్రచార కంటెంట్ ఈ సినిమాలకు వర్కౌట్ కాలేదు, పండుగకు ముందు వాటితో బజ్ పెంచే ప్రయత్నం చేసే ఉండవచ్చు కానీ అది కూడా చేయలేదు. రెండు సినిమాలు ఊపందుకోవాలంటే పాజిటివ్ మౌత్ టాక్ అవసరం. ఇప్పటి వరకు అయితే ఈ రెండు చిత్రాలకు అన్ని ప్రాంతాల్లో తక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. జపాన్, జిగర్తాండ డబుల్ ఎక్స్ మేకర్స్ తమిళనాడులో స్పెషల్ షోల కోసం దరఖాస్తు చేసుకోగా ప్రత్యేక షోలను ప్రదర్శించడానికి ప్రభుత్వం వారిని అనుమతించింది. ఇక ఈ రెండు సినిమాల విషయానికి వస్తే ముందుగా జపాన్ కు రాజు మురుగన్ రచన, దర్శకత్వం వహించగా హీస్ట్ కామెడీ సినిమాగా తెరకెక్కించారు. చిత్రంగా అభివర్ణించబడింది మరియు CBFC ద్వారా U/A సర్టిఫికేట్ అందించబడింది. కార్తీతో పాటు అను ఇమ్మాన్యుయేల్, సునీల్, KS రవికుమార్, జితన్ రమేష్, బావ చెల్లదురై ఈ సినిమాలో నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. 200 కోట్ల విలువైన నగలు దోచుకున్న దొంగగా కార్తీ కనిపిస్తారని అంటున్నారు. ఇక జిగర్తాండ డబుల్ ఎక్స్ అనేది కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన 2014 చిత్రం జిగర్తాండకి ప్రీక్వెల్. ఈ సినిమాకి CBFC U/A సర్టిఫికెట్ అందించింది. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ -ఇవేనియో ఆరిజిన్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ అందించగా, ఎస్ తిరునావుక్కరసు కెమెరాను హ్యాండిల్ చేశారు.