NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి భార్యకు గాయాలు.. మాచర్లలో ఉద్రిక్తత..
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా.. తెలుగుదేశం పార్టీ వర్గీయులు అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు.. అంతే కాదు.. టీడీపీ-వైసీపీ వర్గీయుల మధ్య జరిగిన దాడి ఘటనలో.. వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి భార్య రమతో పాటు ప్రచారంలో పాల్గొన్న మరికొందరు మహిళలకి స్వల్ప గాయాలు అయ్యాయి.. మరోవైపు.. టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య దాడిని అడ్డుకుంటున్న వెల్దుర్తి ఎస్సై శ్రీహరి తలకి గాయాలు అయినట్టుగా తెలుస్తోంది.. వృద్ధుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో ఈ గొడవ జరిగిందంటున్నారు.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమాదేవిపై కూడా దాడి చేసి.. వాహనాలు కూడా ధ్వంసం అయినట్టు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

కడప కోర్టులో షర్మిల, సునీత, బీటెక్ రవికి చుక్కెదురు.. రూ.10వేల ఫైన్‌ విధింపు
కడప కోర్టులో వైఎస్ షర్మిల, వైఎస్‌ సునీత, టీడీపీ అభ్యర్థి బీటెక్ రవికి చుక్కెదురైంది.. అంతే కాదు పదివేల రూపాయల జరిమానా విధించింది కడప కోర్టు.. అయితే, ఎన్నికల ప్రచారంలో వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును ప్రస్తావించరాదని గతంలో కోర్టు స్పష్టం చేసిన విషయం విదితమే కాగా.. కడప కోర్టు ఆర్డర్‌ను డిస్మిస్‌ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు సునీత.. అయితే, సునీత పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.. కడప కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది.. ఇక, హైకోర్టు ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన కడప కోర్టు.. ఇరువర్గాల వాదనలు వింది.. ఆ తర్వాత షర్మిల, సునీత, బీటెక్ రవి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారన్న పేర్కొంది.. షర్మిల, సునీతకు, పులివెందుల టీడీపీ అభ్యర్థి మా రెడ్డి రంగారెడ్డికి అలియాస్ బీటెక్ రవికి రూ.10 వేల జరిమానా విధించింది కడప కోర్టు.. ఆ జరిమానాను జిల్లా లీగల్ సెల్‌కు కట్టాలన పేర్కొంది కడప కోర్టు.

మేం ఓటు అమ్ముకోం.. ఊరంతా పోస్టర్లు, ఫ్లెక్సీలు..
ఎన్నికలంటేనే హడావిడి.. పోలింగ్ సమయం దగ్గర పడే కొద్ది వివిధ రాజకీయ పార్టీలు ఓట్లను కొనుగోలు చేసేందుకు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తుంటారు. ఎన్నికల్లో విజయే లక్ష్యంగా.. డబ్బులు, మద్యం ఏరులైపారిస్తుంటారు.. కొన్ని వర్గాలను, కొన్ని కుటుంబాలను టార్గెట్‌ చేసి డబ్బులు కుమ్మరిస్తుంటారు.. అయితే, నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామ ప్రజలు మాత్రం తమ ఓటు అమ్ముకోబోమంటున్నారు.. వారు ప్రతిజ్ఞ బూనడమే కాదు.. ఆ ఊరిలోకి వచ్చేవారికి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో.. ఊరంతా గోడ పత్రాలు.. ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇక, అసలు విషయానికి వస్తే.. చేజర్ల మండలంలోని కాకివాయి గ్రామంలో ప్రజలంతా ఒకే నిర్ణయం తీసుకొని.. గ్రామ అభివృద్ధికి సహకరిస్తుంటారు. గతంలో పలుమార్లు ఈ గ్రామంలో ఎన్నికలు లేకుండా సర్పంచులు ఎన్నుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీతో పాటు, లోక్‌సభ ఎన్నికలు రావడంతో తాము ఓట్లు అమ్ముకోబోమంటూ.. గ్రామస్తులు.. ఊరంతా వేసిన గోడపత్రాలు.. ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. మా గ్రామంలో ఓట్లు అమ్మబడవు.. మీకు అన్ని విధాలా సహకరిస్తాం.. మీరు కూడా మా గ్రామ అభివృద్ధికి సహకరించాలని గ్రామస్తులందరూ తమ ఇంటి ముందు గ్రామాల్లో గోడపత్రాలను ఏర్పాటు చేశారు.. మా గ్రామ అభివృద్దే మా లక్ష్యం ఎన్నికల్లో మేం ఎలాంటి తాయిలాలకు మా ఓట్లు అమ్ముకోబోము.. మా గ్రామ అభివృద్ధికి ఎవరైతే సహకరిస్తారో వారికే మా ఓట్లు అంటూ గ్రామంలో ప్రతి ఇంటి ముంది నా ఓటు అమ్మకానికి లేదు అనే గోడ పత్రాన్ని అంటించారు. ఈ నెల 13వ తేదీన జరుగనున్న ఎన్నికల కోసం సృజనాత్మక వ్యక్తీకరణ ద్వారా ఓటు ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరిస్తున్నారు..

బెజవాడలో ప్రధాని మోడీ రోడ్‌షో.. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌తో ప్రత్యేక భేటీ..
విజయవాడ బందర్ రోడ్డులో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో ముగిసింది.. గంట పాటు బందర్ రోడ్డులో రోడ్ షో నిర్వహించారు ప్రధాని మోడీ.. ఈ రోడ్‌ షోలో వాహనంపై ప్రధాని మోడీకి ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మరోవైపు జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌ నిలబడి.. దారిపొడవునా.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.. ప్రధాని మోడీ రోడ్‌ షో.. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిలో కొత్త జోష్ నింపిందని కూటమి నేతలు చెబుతున్నారు.. ఇక, రోడ్ షో అనంతరం బెంజ్ సర్కిల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెంటులోకి వెళ్లారు ప్రధాని మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. ఆంధ్రప్రదేశ్‌లో తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల సరళిపై చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌తో మోడీ మంతనాలు జరిపారు.. ఐదారు నిమిషాల పాటు చంద్రబాబు, పవన్‌తో మోడీ చిట్ చాట్ జరిగింది.. ఈ భేటీలో తాజాగా జరిగిన పరిణామాలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లారట ఇద్దరు నేతలు.. ప్రచారసరళి.. ప్రజల నుంచి వస్తున్న స్పందన.. అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల తీరు సహా.. కీలక విషయాలపై ప్రత్యేకంగా మోడీతో చర్చించినట్టుగా తెలుస్తోంది.

కర్ణాటకలోని నారాయణపూర్ డ్యాం నుంచి తెలంగాణకు 2.25 టీఎంసీల నీళ్లు విడుదల
పార్లమెంట్ ఎన్నికలకు ముందు కర్ణాటక నుంచి అత్యవసరంగా విడుదల చేసిన 2.25 టీఎంసీల నీటిని రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది . రాబోయే నీటి ఎద్దడిని ఊహించి, తీవ్రమైన కొరత పరిస్థితులలో ఎగువ కృష్ణా ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులు మార్చిలో కర్ణాటక ప్రభుత్వానికి అభ్యర్థన చేశారు. తమ అభ్యర్థనకు కర్ణాటక కౌంటర్లు సానుకూలంగా స్పందించి బుధవారం నారాయణపూర్ డ్యాం నుండి నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. కర్ణాటకలో విడుదల చేసిన నీరు 167 కిలోమీటర్ల మేర దిగువకు ప్రవహిస్తున్న జూరాల ప్రాజెక్టులోకి రావడానికి రెండున్నర రోజులు పడుతుంది. కర్నాటక ప్రాజెక్టు నుండి నీటిని తీసుకోవడంలో ప్రధాన ఆందోళన ఏమిటంటే వేసవిలో అధిక ప్రసార నష్టం. గుల్జాపూర్ ప్రాజెక్టుకు (నారాయణపూర్ నుండి 112 కి.మీ దూరంలో) సాధారణ నీటి సరఫరాతో రాయచూర్ పవర్ స్టేషన్‌లో థర్మల్ కార్యకలాపాలకు కర్ణాటక ఇప్పటికే మద్దతు ఇస్తోంది కాబట్టి ఈసారి నష్టం కనిష్టంగా ఉంటుందని భావిస్తున్నారు. నారాయణపూర్ ఆనకట్ట నుంచి నీరు అందుకోవాల్సిన జూరాల ప్రాజెక్టు 55 కి.మీ. ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌ల కింద నీటి ఎద్దడి నెలకొనడంతో తక్షణమే స్పందించలేదని కర్ణాటక నుంచి రాష్ట్రం 10 టీఎంసీల నీటిని కోరింది. నీటిపారుదల శాఖ కార్యదర్శి రహుక్ బొజ్జా తన కర్ణాటక కౌంటర్‌కు ఇటీవల మరోసారి కనీసం 5 టీఎంసీలను కోరుతూ లేఖ రాశారు. కావేరి పరీవాహక ప్రాంతంలోకి వచ్చే బెంగళూరు నగరంతో పోలిస్తే కర్ణాటక జిల్లాలు, కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల కింద ఉన్న నగరాల్లో పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు.

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. 48 గంట‌ల పాటు మ‌ద్యం దుకాణాలు బంద్‌..
మండు వేసవిని చల్లటి బీరుతో ఎంజాయ్ చేయాలనుకునే మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. లోక్‌సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు రెండు రోజుల డ్రైడేస్ ను ప్రకటించారు. ఫలితంగా మద్యం విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని అధికారులు ఆదేశించారు. మే 11వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటల నుంచి మే 13వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలను మూసివేయాలని ఎక్సైజ్ శాఖ ఆదేశించింది.మద్యం దుకాణాలతో పాటు కల్లు ప్రాంగణాలను కూడా మూసివేయనున్నారు. అంతేకాకుండా, ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు జూన్ 4వ తేదీన మద్యం దుకాణాలు మూసివేయబడతాయి. పండుగలు, సెలవులు, ఓట్ల లెక్కింపు, ఎన్నికల సమయంలో రాష్ట్రంలో మద్యం దుకాణాలను మూసివేస్తారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వివాదాలు, ఘర్షణలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది.

క్రిశాంక్‌ను వెంటనే విడుదల చేయాలి
బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ అరెస్ట్‌ అప్రజాస్వామికమని, ఆయనను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు డిమాండ్‌ చేశారు. యూనివర్సిటీ హాస్టళ్లకు వేసవి సెలవులు, మెస్‌లకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నకిలీ సర్క్యులర్‌ను పోస్ట్ చేసిన ఆరోపణలపై క్రిశాంక్‌ని అరెస్టు చేశారు. బుధవారం క్రిశాంక్‌ను కలిసిన అనంతరం చంచల్‌గూడ జైలు వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడిన రామారావు, తనను వేధించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్రిశాంక్‌పై పనికిమాలిన కేసు పెట్టిందని అన్నారు. “ఓయూ చీఫ్ వార్డెన్ సర్క్యులర్‌ను ఫోర్జరీ చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి సీటులో కూర్చున్నాడు. ఈ దుశ్చర్యను బయటపెట్టిన వ్యక్తిని అరెస్టు చేశారు’ అని ఆయన పేర్కొన్నారు. నకిలీ పత్రాన్ని గుర్తించేందుకు నిపుణుల విశ్లేషణ కోసం డిమాండ్ చేస్తూ, క్రిశాంక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సర్క్యులర్ నకిలీదని రాష్ట్ర ప్రభుత్వం నిరూపిస్తే, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాను జైలుకు వెళ్తానని అన్నారు. అయితే రేవంత్ రెడ్డి పెట్టిన సర్క్యులర్ నకిలీదని రుజువైతే జైలుకు వెళ్లేందుకు సిద్ధమా? ఆయన అన్నారు.

ప్రజ్వల్ తండ్రికి జ్యుడీషియల్ కస్టడీ.. ఎప్పటివరకంటే..!
మహిళ కిడ్నాప్‌ కేసులో మాజీ మంత్రి, మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు హెచ్‌డీ రేవణ్ణకు బెంగళూరు కోర్టు రిమాండ్‌ విధించింది. ఆరు రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపింది. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డ మహిళను కిడ్నాప్‌ చేశారని రేవణ్ణపై కేసు నమోదైంది. ఈ కేసులో రేవణ్ణను ఇటీవలే సిట్‌ అరెస్టు చేసింది. తన తల్లిని కిడ్నాప్‌ చేయడమే కాక ఆమెపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారని కిడ్నాప్‌కు గురైన మహిళ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో రేవణ్ణపై కేసు నమోదైంది. హెచ్‌డీ రేవణ్ణను ఈనెల 14వ తేదీ వరకూ జ్యూడిషయల్ కస్టడీలోకి తీసుకోవాలని స్థానిక కోర్టు బుధవారం ఆదేశించింది. ఈ కేసులో హెచ్‌డీ రేవణ్ణకు విధించిన మూడు రోజుల పోలీస్ కస్టడీ బుధవారంతో ముగిసింది. దీంతో ఆయనను కోర్టు ముందు హాజరుపరచారు. కోర్టు ఈనెల 14వరకూ జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో ఆయనను పరప్పన అగ్రహార జైలుకు సిట్ తరలించింది. పోలీసు కస్టడీలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా అని విచారణ సందర్భంగా కోర్టు ఆయనను ప్రశ్నించింది. కడుపునొప్పి కారణంగా తాను గత మూడు రోజులుగా నిద్రపోలేదని, విచారణ పూర్తయిందని వారు చెప్పారని తెలిపారు. తాను ఏదైనా తప్పుచేసి ఉంటే అంగీకరించేందుకు సిద్ధమేనని అన్నారు. ఎమ్మెల్యేగా 25 ఏళ్ల కాలంలో తనపై ఎలాంటి ఆరోపణలు లేవన్నారు. కడుపునొప్పి విషయాన్ని అధికారులకు చెప్పినప్పటికీ తాను ఆసుపత్రిలో చేరలేదని తెలిపారు. తనకు నిరంతరాయంగా కడుపునొప్పి వస్తోందని, వారెంట్ లేకుండానే తనను అరెస్టు చేశారని చెప్పారు. తాను ఎలాంటి ప్రెస్‌ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయలేదని, అది కూడా అరెస్టుకు ముందు ప్రెస్‌తో మాట్లాడానని అన్నారు. తప్పుడు ఆరోపణలు బనాయించడం ద్వారా రాజకీయ కుట్ర జరుగుతోందని రేవణ్ణ విచారణ సందర్భగా తెలిపారు.

ఇమ్రాన్ ఖాన్‌ వద్దకు బుష్రా బీబీ.. పాకిస్థాన్ కోర్టు ఆదేశం
ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీకి హైకోర్టు నుంచి ఊరట లభించింది. సబ్ జైలు నుండి అడియాలా జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. రెండు కేసుల్లో దోషిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను రావల్పిండిలోని హై సెక్యూరిటీ అడియాలా జైలులో ఉన్నారు. కాగా.. బుష్రా బీబీని ఇస్లామాబాద్ శివారులోని ఇమ్రాన్ ఖాన్ నివాసం బనిగాలాలో ఖైదుగా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడి నుంచి అడియాలా జైలుకు తరలించారు. బుష్రా బీబీ.. ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆమెను అరెస్టు చేసిన తర్వాత తన నివాసాన్ని సబ్ జైలుగా ప్రకటించడంతో బనిగాలా నుండి అడియాలా జైలుకు తరలించాలని అభ్యర్థించారు. అధికారులు తన గోప్యతను ఉల్లంఘించారని, తన ఇంటి సెల్‌లో కలుషిత ఆహారాన్ని అందించారని బుష్రా బీబీ ఇస్లామాబాద్ హెచ్‌సికి చేసిన పిటిషన్‌లో తెలిపారు. బీబీ, తన న్యాయ బృందం కూడా సబ్-జైలుగా నిర్దేశించబడిన బనిగాలా నివాసంలో ప్రధానంగా పురుషులే ఉన్నారని పేర్కొన్నారు. ఈ వాదనను జైలు అధికారులు తోసిపుచ్చారు. ఇస్లామాబాద్‌లోని ఖాన్‌కు చెందిన హిల్‌టాప్ మాన్షన్‌లో తాను ఒకే గదికి పరిమితమయ్యానని ఖాన్ భార్య ఆరోపించింది.

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాకు ఊరట.. యాప్‌పై ఆంక్షలు ఎత్తివేత
బ్యాంక్ ఆఫ్ బరోడాపై ఉన్న ఆంక్షలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎత్తివేసింది. దీంతో బ్యాంక్ ఆఫ్ బరోడాకు భారీ ఊరట లభించింది. బాబ్ వరల్డ్ యాప్‌పై ఆంక్షలను ఎత్తివేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. అప్లికేషన్ ద్వారా కొత్త కస్టమర్‌లను ఆన్‌బోర్డ్ చేయడానికి బ్యాంక్‌కు అనుమతిస్తుంది. ఈ మేరకు బ్యాంక్‌ విషయాన్ని వెల్లడించింది. మొబైల్‌ అప్లికేషన్‌లో కొన్ని లోపాలు బయటపడడంతో కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. దీంతో దాదాపు 7 నెలలుగా తమ మొబైల్‌ అప్లికేషన్‌పై అమల్లో ఉన్న ఆంక్షలను ఆర్‌బీఐ ఎత్తివేసిందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తాజాగా తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని పేర్కొంది. దీంతో కొత్త కస్టమర్లను చేర్చుకోవడానికి ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయని తెలిపింది. ఇకపై ఆర్‌బీఐ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటామని బ్యాంక్ ఆప్ బరోడా స్పష్టం చేసింది.

గుడ్ న్యూస్.. ఫోన్‌పేలో భారీగా ఉద్యోగాలు.. ఎలా అప్లై చెయ్యాలంటే?
ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్ ఫామ్ పోన్ పే నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.. అడ్వైజర్‌, ఓఎన్‌డీసీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అభ్యర్థులు అప్లయ్‌ చేసుకోవచ్చు.. అర్హత, ఆసక్తి కలిగిన వాళ్లు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ పోస్టుల పై ఆసక్తి కలిగిన వాళ్లు పోస్టులకు సంబందించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. గుర్తింపు పొందిన యూనివర్సీటీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.. ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం , ఇండస్ట్రీస్‌ (చాట్ సపోర్ట్ ఎక్స్‌పీరియన్స్), కస్టమర్ ఫేసింగ్‌లో 0-3 ఏళ్ల పని అనుభవం ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌ ఉండాలి.. ఈ పోస్టులకు అప్లై చేసుకొనే అభ్యర్థులు ఆన్ లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.. ఈ పోస్టుల గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే https://boards.greenhouse.io/embed/job_app?token=5958724003 ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి.. పూర్తి వివరాలను తెలుసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది..

అందరి ఎదురు చూపులు ఆ ఒక్క విషయం మీదే?
పుష్ప -2 ఫస్ట్ సింగిల్ పై మార్కెట్ లో గట్టిగానే డిస్కషన్ నడుస్తుంది. దీంతో మే20న రిలీజయ్యే దేవర ఫస్ట్ సింగిల్ రిసీవింగ్ ఎలా ఉంటుందా అనే ముచ్చట… మార్కెట్లో సీరియస్ గా నడుస్తుంది. ప్రెస్టీజియస్ ఫిలింస్ నుంచి వచ్చే చిన్న చిన్న అప్ డేట్స్ సినిమా బజ్ పై సీరియస్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి.పుష్ప 2 విషయంలో సరిగ్గా జరిగింది ఇదే. టీజర్ ,లిరికల్ సాంగ్ ట్రెండింగ్లో నిలిచినప్పటికీ కొన్ని భాషల్లో బజ్ క్రియేట్ చేయలేకపోయింది.ఎప్పుడూ ఒకే రకమైన రిసీవింగ్ ఏ క్రేజీ ఫిలింకు ఉండదనే విషయం పుష్ప 2 తో మరోసారి ప్రూవ్ అయ్యింది.ఇప్పుడు ఇదే భయం దేవరను వెంటాడుతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ , జాన్వీ కపూర్ లతో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” . హాలీవుడ్ లెవెల్ హంగులతో ఈ పిక్చర్ ని తెరకెక్కిస్తున్నారు. ఐతే ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండడంతో అందరి చూపు దేవర పై పడింది.ఆల్రెడీ అనిరుద్ మ్యూజిక్ పై ఇప్పటికే భారీ హైప్ ఫామ్ అయింది. మే నెలలోకి ప్రాజెక్ట్ అడుగు పెట్టడంతోనే తారక్ ఫ్యాన్స్ లో సినిమా ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి రేకెత్తిస్తోంది.మే20న తారక్ బర్త్ డే కావడంతో ఆ రోజు వచ్చే ఫస్ట్ సింగిల్ నందమూరి అభిమానులను డిస్టర్బ్ చేసే స్థాయిలో ఉంటుందా ఉండదా అనే చర్చ అయితే జరుగుతుంది.ఎందుకంటే ఇక్కడ అనిరుద్ మ్యూజిక్ కావడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.వేరే సంగీత దర్శకుడైతే ఈ లెక్క ఉండేది కాదు.

లక్కునే నమ్ముకుంటున్న హీరోయిన్లు
మాలీవుడ్ మీదుగా చెన్నైలో ఓ ఛాన్స్ పట్టుకుని ఆ తర్వాత తెలుగులోకి వచ్చి సెటిల్ కావాలనుకుంటున్న హీరోయిన్లు అందరిదీ లక్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. కొందరు భామలకు గ్లామర్ అనుకున్నంతగా లేకపోయినా మేకర్స్ తో ఉన్న ర్యాపోతో ఏదో నెట్టుకొచ్చేస్తుంటారు. ఇంకొందరు సెకండ్ హీరోయిన్ ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ లతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. తమిళ్ లో మెయిన్ హీరోయిన్ గా సెటిల్ కావాలని తెగ ట్రై చేస్తున్న ఐశ్వర్యలక్ష్మి పిఎస్ సిరీస్ తో కొంతవరకు మెరిసినప్పటికీ…ఆ మెరుపులు మెయిన్ హీరోల వరకు వెళ్లలేకపోయాయి. ఇలాక్కాదని మోడ్రన్ డ్రెస్ లతో సోషల్ మీడియాలో రచ్చచేసిననప్పటికీ..అది కూడా అంతంత మాత్రంగానే కిక్ ఇస్తుంది. ఇక తాజాగా ఐశ్వర్య లక్ష్మీ మరోసారి నెట్టింట్లో నేనున్నానని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ వస్తుంది. అలాగే జైలర్ లో రజనీ కోడలుగా ఇప్పుడిప్పుడే గుర్తింపుకు నోచుకుంటున్న మిర్నా మీనన్… తెలుగులో ఉగ్రంతో ఏదో ట్రై చేసింది గాని… అది ఓ పట్టాన వర్కవుట్ కాలేదు. కానీ అదేంటో జైలర్ ఇమేజ్ చూసి తమిళ తంబీలు అమ్మడికి ఆఫర్స్ ఇస్తున్నారు. వీటితో ట్రాక్ లోకి వస్తే మెయిన్ హీరోయిన్ గా మాత్రమే సినిమాలు చేస్తానంటుంది.లేదంటే జైలర్ ఇచ్చిన ఎక్స్ పీరియన్స్ తో టాప్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్ తో ఎడ్జెస్ట్ అవుతానంటుంది.