NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ.. ఘనంగా వీడ్కోలు.. ఆసక్తికర వ్యాఖ్యలు..
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ఈ రోజు పదవీ విరమణ చేశారు.. ఏబీవీపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) తొలగించిన విషయం తెలిసిందే కాగా… ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే, క్యాట్‌ ఆదేశాల నిలుపుదలకు నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు గురువారం ఉత్తర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులను సీఎస్‌ జవహర్‌రెడ్డికి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలోనూ ఏబీ వెంకటేశ్వరరావు అందజేశారు. దీంతో.. ఎట్టకేలకు ఆయన్ను సర్వీసులోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ, స్టోర్స్‌ పర్చేజ్‌ కమిషనర్‌ ఆయనకు పోస్టింగ్‌ ఇచ్చింది. అయితే, ప్రింటింగ్ అండ్‌ స్టేషనరీ డీజీ హోదా ఏబీ వెంకటేశ్వరరావు ఈ రోజు పదవీ విరమణ చేశారు. ఏబీవీకి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా వీడ్కోలు పలికారు అభిమానులు.

పోస్టల్‌ బ్యాలెట్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు..
పోస్టల్‌ బ్యాలెట్‌ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో వాదనలు ముగిశాయి.. పోస్టల్ బ్యాలెట్ పై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం విదితమే కాగా.. ఆ పిటిషన్‌పై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి.. అయితే, తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు.. రేపు సాయంత్రం 6 గంటలకు తీర్పు వెల్లడిస్తామంది తెలింది ఏపీ హైకోర్టు.. దీంతో.. రేపు సాయంత్రం ఎలాంటి తీర్పు రానుంది అనేది ఉత్కంఠగా మారింది.. కాగా, రిటర్నింగ్ అధికారి సీల్ (స్టాంపు) లేకపోయినా సంతకం ఉంటే చాలని, అలాంటి పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించవద్దంటూ.. సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ ఇచ్చిన మార్గదర్శకాలను ఏపీ సీఈవో ముఖేష్‌ కుమార్ మీనా.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు పంపించిన విషయం విదితమే.. అయితే, ఈ నిబంధనను అధికార వైసీపీ వ్యతిరేకించింది.. పోస్టల్ బ్యాలెట్ నిబంధనపై హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ.. బ్యాలెట్ పై ఆర్వో సీల్ లేకపోయినా.. ఓటును తిరస్కరించవద్దంటూ ఇచ్చిన మెమో సమంజసం కాదని.. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించింది ఏపీ హైకోర్టు.. ఇరు పక్షాల వాదనలను వింది.. చివరకు తీర్పును రిజర్వ్‌ చేసింది.. దీంతో.. రేపు సాయంత్రం 6 గంటలకు ఏపీ హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోంది..? అనేది ఆసక్తికరంగా మారింది.

కౌంటింగ్ సందర్భంగా ఘర్షణలకు దిగితే కఠిన చర్యలు.. పోలీసుల వార్నింగ్‌
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం కొన్ని ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగిన విషయం విదితమే.. అయితే, ఫలితాల సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేస్తోంది పోలీస్‌యంత్రాంగం.. ఓట్ల కౌంటింగ్ సందర్భంగా ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్… అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలోని బంగ్లా సర్కిల్ లో పోలీసు బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ రోజు కానీ.. కౌంటింగ్ అనంతరం కానీ.. ఘర్షణలు జరిగితే ఎలా అణచివేయాలో కళ్ళకు పట్టినట్లు పోలీసులు వివరించారు. జన సమూహం రెచ్చిపోయినప్పుడు లేదా రాళ్లదాడి జరిగినప్పుడు ఎలాంటి చర్యలు చేపడతారన్నది పోలీసులు వివరించారు. కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి అల్లర్లకు పాల్పడరాదంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు . కౌంటింగ్ రోజు ఎటువంటి ఘర్షణలు జరిగినా అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాని అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్ హెచ్చరించారు. ప్రజలు, రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలనీ ఆయన కోరారు. కౌంటింగ్ రోజున రాయచోటిలో 144 సెక్షన్ విధించామన్నారు. కౌంటింగ్ ముందు రోజే ఇతర ప్రాంతాలకు చెందిన వారు రాయచోటిని వదిలి వెళ్లాలంటూ ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డిఎస్పి రామచంద్రరావు, అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఆయనదే గెలుపు రూ.20 లక్షలు పందెం.. లేదు మా నాయకుడే.. రూ.50 లక్షలు పందెం..
పోలింగ్‌ ముగిసింది.. మరో మూడు రోజులు ఆగితే.. నాలుగో రోజు ఫలితాలు రాబోతున్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు అధికారంలోకి వస్తారు? అనేదానిపై ఎవరి అంచనాలు వారికున్నాయి.. ఇదే సమయంలో.. బెట్టింగ్‌ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.. అధికారంలోకి వచ్చే పార్టీ ఏది? అని మొదలుకొని.. కీలక నేతలు పోటీ చేసే స్థానాల్లో గెలుపు ఓటములతో పాటు.. మెజార్టీలపై బెట్టింగ్‌ కాస్తున్నారు.. అయితే, ఇప్పుడు ఈ జాబితాలోకి నేతలు సైతం చేరుతున్నారు.. కర్నూలు జిల్లా కోసిగి జడ్పీటీసీ మంగమ్మ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.. మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి నాలుగోసారి గెలిచి మంత్రి పదవి చేపడుతాడని.. వైఎస్‌ జగన్‌ రెండోసారి సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తాడని నేను రూ.20 లక్షలు పందెం కాస్తాను.. ఎవరికైన ధైర్యం ఉంటే పందెంకు రావాలని.. రేపు ఒకటో తారీఖున కోసిగి ఎల్లమ్మ గుడి దగ్గర ఉంటానని అక్కడకు రావాలని బహిరంగంగా సవాల్ విసిరారు మంగమ్మ.. అయితే, కోసిగి జడ్పీటీసీ మంగమ్మకు ధీటుగా మంత్రాలయం మండలం వగరూరుకు చెందిన టీడీపీ నాయకుడు మడ్రి చిన్నన్న.. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని ప్రతిసవాల్ చేశారు.. రూ. 50 లక్షలు విలువ చేసే రెండు ఎకరాల పొలం పందెం కాస్తానని ప్రతి సవాల్ వదిలారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నిబంధనల విరుద్ధంగా పందెం కాయడం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఇరు పార్టీల బహిరంగంగా నాయకులు సోషల్ మీడియా ద్వారా పందెం కాయడం ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఇరువర్గాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని సిటిజన్స్ అంటున్నారు.

ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్‌కు ఆహ్వానం.. సీఎం రేవంత్‌ ప్రత్యేక లేఖ
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రభుత్వం ఆహ్వానించింది. విపక్ష నేతగా, తెలంగాణ ఉద్యమ భాగస్వామిగా కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్‌ నందినగర్‌లోని నివాసంలో కేసీఆర్‌ను కలిసి ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్‌, ప్రోటోకాల్ సెక్రటరీ అర్విందర్‌సింగ్‌ ఆహ్వానపత్రికను అందించారు. కేసీఆర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి రాసిన లేఖను కూడా అందించామని వారు వెల్లడించారు. కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున విపక్ష నేత కేసీఆర్‌ను కోరామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కేసీఆర్‌ను ఆహ్వానించామమన్నారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్‌ పాత్ర ఉందని వచ్చి ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు.

టీజీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రఘునాథరావు ప‌ద‌వీ విర‌మణ.. ఘనంగా వీడ్కోలు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-ఆపరేషన్స్ టి.రఘునాథరావు ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ – ఆపరేషన్స్ పి.జీవన్ ప్రసాద్‌తో పాటు మరో ఏడుగురు రిటైర్డ్ అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆర్టీసీకి ఎన్నో ఏళ్ల పాటు సేవ‌లందించిన వారిని టీజీఎస్ఆర్టీసీ ఘ‌నంగా స‌న్మానించి వీడ్కోలు ప‌లికింది. హైద‌రాబాద్‌లోని బస్ భవన్‌లో శుక్రవారం వీడ్కోలు కార్యక్రమాన్ని సంస్థ నిర్వహించింది. కుటుంబ సభ్యుల సమక్షంలో కోలాహలంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ స‌జ్జనార్‌ హాజరయ్యారు. పదవీ విరమణ పొందిన వారందరినీ శాలువా క‌ప్పి ఆయన ఘనంగా స‌న్మానించారు. నిజాయ‌తీ గ‌ల అధికారులు, సిబ్బందిగా సంస్థలో పేరు గడించిన వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. రఘునాథరావు 1990 నుంచి 34 ఏళ్ల పాటు ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీలో వివిధ హోదాల్లో ప‌నిచేశార‌ని గుర్తుచేశారు. చీఫ్ మెకానికల్ఇంజనీర్‌గా దాదాపు 2 వేల కొత్త బస్సులను రోడ్డు మీదకు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారన్నారు. మెకానికల్ ఇంజనీర్ విభాగంలో అపారమైన అనుభవం ఆయనకు ఉందని, సంస్థ క్లిష్ట ప‌రిస్థితుల్లో చాలా కూల్‌గా ప‌నిచేసి.. మంచి ఫ‌లితాల‌ను తీసుకువ‌చ్చార‌ని చెప్పారు. 16 పర్యాయాలు మేడారం జాతరలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని పేర్కొన్నారు.

హెచ్‌డీ రేవణ్ణ భార్యకు లభించని ఊరట.. కిడ్నాప్ కేసులో నో బెయిల్
సస్పెన్షన్‌కు గురైన జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లి, ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. మైసూరు జిల్లాలోని కేఆర్ నగర్‌లో ఓ మహిళ కిడ్నాప్‌కు సంబంధించిన కేసులో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ కోడలు భవానీ బుధవారం ముందస్తు బెయిల్‌ను కోరింది. ఈ క్రమంలో ఆ పిటిషన్‌ను స్థానిక కోర్టు తిరస్కరించింది. ఓ మహిళ కిడ్నాప్‌కు సంబంధించిన కేసులో భవానీ రేవణ్ణ భర్త.. ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణ నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం అతను బెయిల్‌పై బయట ఉన్నారు. విచారణలో పాల్గొనాల్సిందిగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసు జారీ చేయడంతో భవానీ కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే అరెస్టయిన నిందితుడి వాంగ్మూలాల ఆధారంగా నోటీసులిచ్చింది.

దేశభక్తి గీతాన్ని ఆలపిస్తూ గుండెపోటుతో మరణించిన రిటైర్డ్ ఆర్మీ సోల్జర్.. వీడియో..
మధ్యప్రదేశ్‌లో తాజాగా ఓ దురదృష్టకర సంఘటన చోటు చేయుకుంది. రాష్ట్రంలోని ఇండోర్‌లో జరిగిన ఒక ప్రదర్శనలో భారత ఆర్మీకి చెందిన రిటైర్డ్ సైనికుడు గుండెపోటుతో మరణించాడు. మరణించిన సైనికుడిని బల్బిందర్ చావ్డా గా గుర్తించారు. ఇండోర్‌ నగరంలో దేశభక్తి గీతం పాడుతున్న సమయంలో బల్బిందర్ చావ్డాకు ఒక్కసారిగా గుండెపోటు వచనదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 55 సెకన్ల నిడివి గల ఈ వీడియో క్లిప్‌ లో పిల్లలు, పెద్దలందరు చావ్డాతో కలిసి దేశభక్తి గీతాన్ని పాడుతున్నట్లు కనిపిస్తుంది. వీడియో గమనిస్తే., చావ్డా గుండెపోటు రావడంతో అక్కడిక్కడే వేదికపై కుప్పకూలినట్లు కనిపించింది. ఆ సమయంలో పిల్లలు చప్పట్లు కొడుతూ దేశభక్తి గీతాన్ని ఆలపిస్తూ ఉన్నారు. గుండె పోటు కారణంగా చావ్డా వేదికపై పడుకున్నట్లు వీడియోలో కనపడుతుంది. ఇక విషయాన్ని గ్రహించిన కొందరు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా చావ్డా మృతి చెందినట్లు సమాచారం అందింది.

ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేప్ కేసులో ఎప్పుడు ఏం జరిగిందంటే..?
సెక్స్ టేపుల కుంభకోణంలో ఇండియా నుంచి జర్మనీ వెళ్లిపోయిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఈరోజు (శుక్రవారం) తెల్లవారుజామున ఇండియాకు వచ్చాడు. బెంగళూరు ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు అక్కడే అరెస్ట్ చేశారు. కాగా.. ప్రజ్వల్ రేవణ్ణను సాధారణ వైద్య పరీక్షల కోసం నగర ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత రిమాండ్ విచారణ కోసం కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో 6 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో రేపటి నుంచి 6 రోజుల పాటు ప్రజ్వల్ రేవణ్ణను సిట్ అధికారులు విచారించనున్నారు. ఇంతకుముందు.. ప్రజ్వల్ రేవణ్ణ మే 31న విచారణ బృందం ముందు హాజరవుతానని, విచారణకు సహకరిస్తానని ఓ వీడియో సందేశం విడుదల చేశాడు. వారం తర్వాత దేశానికి తిరిగి వచ్చాడు.

పాపులర్ మీమ్స్ తో కల్కి యానిమేషన్ సిరీస్ ను నింపేసారుగా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 ఏడి’.మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో అమితాబ్ ,కమల్ వంటి దిగ్గజ నటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని మేకర్స్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ సినిమాలో బుజ్జి అంటే ఓ రోబోటిక్ కార్ ..అంతే కాదు ప్రభాస్ కి క్లోజ్ ఫ్రెండ్ కూడా…ఈ సినిమాలో బుజ్జి క్యారెక్టర్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం.అందుకే బుజ్జిని పరిచయం చేయడానికి మేకర్స్ రామోజీ ఫిలిం సిటీ లో ఓ భారీ ఈవెంట్ ఏర్పాటు చేసారు.ఇదిలా ఉంటే ఈ సినిమాతో మేకర్స్ ఒక కొత్త సినిమాటిక్ యూనివర్స్ ని కూడా క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాటిక్ యూనివర్స్ ప్రేక్షకులకి అర్థంకావడం కోసం.. మేకర్స్ ఒక యానిమేటెడ్ సిరీస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఈ సిరీస్ కు బుజ్జి అండ్ భైరవ అనే టైటిల్ ను పెట్టారు. రెండు ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఫ్యూచర్ లో రాబోయే అడ్వాన్స్డ్ వెహికల్స్ ,వెపన్స్ వంటివి ఈ సిరీస్ లో చూపించారు.ఈ సిరీస్ లో ఎంటెర్టైనేమేంట్ కోసం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని మీమ్స్ ని నాగ్ అశ్విన్ బాగా ఉపయోగించుకున్నారు.ప్రస్తుతం ఈ మీమ్స్ తో వున్న స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

స్టోరీ డిమాండ్ చేస్తే అలాంటి పాత్రలో కూడా నటిస్తాను..
టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అద్భుతమైన నటనతో ఈ భామ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది.ఈ భామ నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ పొలిమేర సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.చేతబడి వంటి థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.గత ఏడాది ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన పొలిమేర 2 సినిమా రిలీజ్ అయింది.ఈ సినిమా కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. ఈ సినిమాలో కామాక్షి నటన అద్భుతమని చెప్పాలి.ఈ సినిమాలో కామాక్షి నటనకు గాను అవార్డు కూడా లభించింది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ భామ షాకింగ్ కామెంట్స్ చేసింది.నటనకు ప్రాధాన్యత వున్నఏ పాత్ర అయిన చేయడానికి తాను సిద్ధం అని కామాక్షి తెలిపింది.కథ డిమాండ్ చేస్తే తాను న్యూడ్ గా అయిన నటిస్తాను అని కామాక్షి తెలిపింది.అలాగే తనకి డాన్స్ కూడా వచ్చని..స్టార్ హీరోల సరసన స్పెషల్ సాంగ్స్ చేసే అవకాశం వస్తే అస్సలు వదులుకోను అని కామాక్షి తెలిపింది.నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే ఈ భామ తన హాట్ పిక్స్ తో రెచ్చగొడుతుంది.