NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

ముక్కు సూటిగా అవినాష్ రెడ్డిని ప్రశ్నలు అడిగా.. ఆయనకు న్యాయం జరగాలి..
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా నడుస్తోంది.. ఈ కేసు ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందోన్న ఉత్కంఠ కొనసాగుతోంది.. అయితే, ఇప్పుడు ఈ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి చికిత్స పొందుతుండగా.. ఆ స్పత్రికి వెళ్లి కేఏ పాల్.. శ్రీలక్ష్మిని పరామర్శించారు.. ఈ సందర్భంగా కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.. వైఎస్‌ వివేకా కేసులో తాజాగా వైఎస్‌ విమలాదేవి హార్ట్‌ టచ్‌ వీడియో చూశానని తెలిపారు పాల్.. నేను టర్కీ వెళ్లాల్సి ఉంది.. కానీ, అవినాష్ రెడ్డి తల్లిని చూడాలని కర్నూలుకు వచ్చానని తెలిపారు.. ఆస్పత్రిలో అవినాష్‌రెడ్డిని కలిసి సందర్భంగా నేను ముక్కు సూటిగా అవినాష్ ని కొన్ని ప్రశ్నలు అడిగానని.. కానీ, వైఎస్‌ వివేకా హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పినట్టు వెల్లడించారు. అయితే, ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ అవినాష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు కేఏ పాల్.. ఎప్పుడు పిలిచినా సీబీఐ విచారణకు వెళ్లానని చెప్పారన్నారు.. ఇక, వైఎస్‌ వివేకా హత్య కేసులో న్యాయం జరగాలని కోరుకున్నారు పాల్.. అన్యాయంగా నిర్దోషిని దోషిగా చిత్రీకరించరాదని హితవుపలికారు.. ఈ కేసులో ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డికి న్యాయం జరగాలని ఆకాక్షించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్.. కాగా, 16వ తేదీ సీబీఐ విచారణకు గైర్హాజరైన అవినాశ్‌ రెడ్డి.. 19వ తేదీన తన తల్లికి అనారోగ్యమంటూ మరోసారి విచారణకు రాలేదు. పులివెందులలో అనారోగ్యంపాలైన తన తల్లి శ్రీలక్ష్మిని అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలిస్తారని అంతా భావించారు.. అయితే, కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చేర్చారు. ఆమె ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అక్కడే ఉండి అన్నీ చూసుకుంటున్నారు అవినాష్‌రెడ్డి.. 22వ తేదీన మళ్లీ విచారణకు రావాలని సీబీఐ కోరింది.. తల్లి ఆరోగ్యం దృష్ట్యా ఇప్పుడు రాలేనని ఎంపీ అవినాష్‌రెడ్డి కోరిన విషయం విదితమే.

మహానాడులో జగన్‌పై ధన్యవాద తీర్మానం చేయాలి.. ఎందుకంటే..?
ఈ నెల 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు రాజమండ్రి వేదికగా టీడీపీ మహానాడు జరగనుంది.. తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు సంబంధించి, రాష్ట్రాభివృద్ధి ప్రజల సంక్షేమానికి సంబంధించి మహానాడులో 15 తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు సిద్ధం అయ్యింది తెలుగు దేశం పార్టీ.. అయితే, మహానాడులో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయాలని డిమాండ్‌ చేవారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ… రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజమండ్రిలో జరగనున్న టీడీపీ మహానాడు ఓ మోసం అంటూ ఆరోపణలు గుప్పించారు. ఎన్టీఆర్ పేరును చంద్రబాబు నాయుడు చెరిపేశారని, ఎన్టీఆర్ పేరుతో ఓ జిల్లాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇందుకు మహానాడులో సీఎం వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఇక, పుష్కరాల్లో 29 మంది మరణాలకు పశ్చాత్తాపం పడుతూ మహానాడులో తీర్మానం చేయాలని డిమాండ్ కూడా చేశారు.. నాడు ఏన్టీఆర్.. చంద్రబాబు ఉచ్చులో పడి మోసపోతే.. నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. చంద్రబాబు ఉచ్చులో పడి మోసపోయారని ఎద్దేవా చేశారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ.

మైలవరం జిలేబీ దేవినేని.. చేసేవన్నీ జిలేబీ పనులే..!
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై సెటైర్లు పేల్చారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాజీమంత్రి దేవినేని ఉమపై విమర్శలు గుప్పించారు.. మైలవరం జిలేబీ దేవినేని ఉమ, ఇతను చేసేవన్నీ జిలేబీ పనులేనంటూ ఎద్దేవా చేశారు.. జీవన్మృతుడు దేవినేని ఉమ అంటూ మండిపడ్డ ఆయన.. గతంలో నేను ప్రతిపక్షంలో ఉండగా ఎన్ని కక్ష్యసాధింపు చర్యలు చేశావో ఆత్మ పరిశీలన చేసుకోవాలని అని హితవుపలికారు. గతంలో మా నాయకులపై రౌడీ షీట్లు తెరిపించిన చరిత్ర దేవినేని ఉమదని ఫైర్‌ అయ్యారు.. అయితే, నాకు మాత్రం ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, తర్వాత అభివృద్ధి, ప్రజా సంక్షేమమే నా లక్ష్యం అని స్పష్టం చేశారు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్.. దేవినేని ఉమ అధికారంలో ఉన్నంత కాలం మైలవరం నియోజకవర్గంలో కనీసం తాగునీటి సమస్యను తీర్చలేకపోయాడని ఆరోపించారు.. మా హయాంలో జల జీవన్ మిషన్ తో ఇంటింటికి నీటి కుళాయిని ఇస్తున్నామని వెల్లడించారు. మైలవరంలో పదేళ్లు శాసనసభ్యునిగా ఉండి పట్టాలు ఇవ్వడం చేతగాని దద్దమ్మ దేవినేని ఉమ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, మైలవరం అయ్యప్ప నగర్ పేరు మార్చాలని ఆలోచన వచ్చినా.. చెప్పు తెగుద్ది దేవినేని ఉమ అంటూ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం గుడ్‌న్యూస్‌..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఆమోదం తెలిపారు.. జూన్ 10వ తేదీ వరకు గ్రామ సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం.. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులందరూ బదిలీలకు అర్హులుగా పేర్కొన్నారు.. జిల్లా పరిధిలో బదిలీలతో పాటు అంతర్ జిల్లాల బదిలీలకు కూడా అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. జిల్లాల్లో రిక్వెస్ట్ చేసుకున్న ఉద్యోగులందరికీ బదిలీలకు అవకాశం కల్పించనున్నారు.. ఇక, అంతర్ జిల్లా బదిలీలలో స్పౌజు కేసు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం ఇవ్వనున్నారు.. కాగా, పరస్పర అంగీకార బదిలీలతో పాటు భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వోద్యోగులై ఉండి వేర్వేరుచోట్ల పనిచేస్తున్న వారికి.. ఆరోగ్య సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న వారికి మాత్రమే ఈ ఏడాది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలను పరిమితం చేయాలని ఆ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది… కానీ, ఇప్పుడు అందరికీ అవకాశం కల్పించారు.. ఇక, ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికనే ఈ బదిలీల ప్రక్రియను నిర్వహిస్తూ.. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు, అలాగే ఒకే జిల్లా పరిధిలో బదిలీలకు సైతం అవకాశం కల్పించాలని నిర్ణయించారు. మరోవైపు.. 2019లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గ్రాండ్‌ విక్టరీ కొట్టిన తర్వాత.. సీఎంగా వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు.. ఆ తర్వాత రాష్ట్రంలో కొత్తగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసి, కేవలం నాలుగు నెలల కాలంలోనే కొత్తగా 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వోద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. ఇక, ఇటీవ‌ల వీరికి వేత‌నాలు కూడా ప్రభుత్వం పెంచిన విషయం విదితమే.

అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌పై కొనసాగుతోన్న ఉత్కంఠ.. రేపు తేలనుందా..?
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటూనే ఉంది.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ముందుస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది.. ఎంపీ అవినాష్‌ రెడ్డి తరపున హైకోర్టులో వాదనలు వినిపించారు సీనియర్‌ కౌన్సిల్‌ ఉమామహేశ్వరరావు. అయితే వాదనలకు ఎంత సమయం పట్టే అవకాశం ఉందని న్యాయమూర్తి ప్రశ్నించగా.. గంటల సమయం పడుతుందని న్యాయవాది బదులిచ్చారు.. దీంతో.. విచారణను రేపటికి వాయిదా వేసింది హై కోర్టు.. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం ఉదయం 10.30 గంటలకు తిరిగి విచారణ చేపట్టనుంది హైకోర్టు.. ఇరు వర్గాలు వాదనలు వినిపించనున్నారు. కాగా, ఎంపీ అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.. ముందస్తు బెయిల్‌పై అవినాష్‌ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు.. ముందస్తు బెయిల్‌ కోరే హక్కు పిటిషనర్‌కు ఉందని పేర్కొంది.. అవినాష్‌ పిటిషన్‌పై విచారణ చేసి ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తల్లి అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన విషయం విదితమే.. ఆస్పత్రిలోనే ఉండి.. ఆమె బాగోగులు చూసుకుంటున్నారు ఎంపీ అవినాష్‌రెడ్డి. మరి.. రేపు హైకోర్టులో ఎలాంటి వాదనలు జరగనున్నాయి.. తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించనుంది అనేది ఉత్కంఠగా మారిపోయింది.

ప్రజల్ని మోసం చేసిన ఆ సంస్థని ప్రమోట్ చేయొద్దు.. ఐపీఎల్ యాజమాన్యంకు సజ్జనార్ రిక్వెస్ట్
సీనియర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌, తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా ఒక సంచలన ట్వీట్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థతో పాటు ప్రజల జీవితాలను హెర్బల్ లైఫ్ వంటి సంస్థలు నాశనం చేస్తున్నాయని.. అలాంటి సంస్థను స్పాన్సర్‌షిప్‌గా పెట్టుకోవడం కరెక్ట్ కాదని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. హెర్బల్ లైఫ్ లాంటి గొలుగుకట్టు సంస్థలు అమాయకపు ప్రజల్ని మోసం చేస్తూనే ఉన్నాయని, ఇలాంటి మోసపూరిత సంస్థలను పార్ట్‌నర్స్‌గా పెట్టుకోవద్దని సూచించారు. మల్టీలెవెల్ మార్కెటింగ్ చేస్తూ.. ఐపీఎల్‌కు అఫీషియల్ స్పాన్సర్‌గా ఉన్నామని చెప్తూ.. ఇలాంటి సంస్థలకు మోసాలకు పాల్పడుతున్నాయని చెప్పారు. ఐపీఎల్‌ను అడ్డం పెట్టుకొని హెర్బల్ లైఫ్ తన వస్తువులను అమ్మి బురిడీ కొట్టిస్తుందని, హెర్బల్ లైఫ్ చేస్తున్న మోసాలకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. హెర్బల్ లైఫ్ లాంటి సంస్థలపై విచారణ సంస్థలు కేసులు నమోదు చేసి, విచారణ జరపాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ఫోటోలు సైతం షేర్ చేశారు. ‘‘హెర్బల్ లైఫ్‌లాంటి గొలుసుక‌ట్టు సంస్థలు అమాయ‌క‌పు ప్రజలను మోసం చేస్తున్నాయి. ఐపీఎల్‌కు అఫీషియ‌ల్ పార్ట్‌నర్‌గా ఉన్నామని చెప్పుకొని, ప్రొడ‌క్ట్‌ల పేరుతో బురిడీ కొట్టిస్తున్నాయి. ఇలాంటి మోస‌పూరిత సంస్థల్ని పార్ట్‌నర్స్‌గా పెట్టుకోవ‌డంపై ఐపీఎల్ యాజ‌మాన్యం ఓసారి పునరాచించుకోవాలి. హెర్బల్ లైఫ్‌పై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీస్ చ‌ట్ట ప్రకారం చర్యలు తీసుకుని, మోసాల‌కు అడ్డుక‌ట్ట వేయాలి’’ అంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు. అంతేకాదు.. గతంలోనూ ఆయన ఇలాంటి వాటిపై ఎన్నో అభ్యర్థనలు చేశారు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోలకు కూడా.. ఇలాంటి సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండొద్దని సూచించారు. అలాగే.. జనాలకు కూడా ఇలాంటి సంస్థల ప్రకటనలు, బంఫర్ ఆఫర్లు చూసి మోసపోవద్దని తరచుగా సూచనలు ఇస్తూనే ఉన్నారు.

ఏ టైంలో పెట్రోల్, డీజిల్ కొట్టిస్తే రెట్టింపు ప్రయోజనం..? నిజమెంత..?
పెట్రోల్‌, డీజిల్‌ కొట్టించే సమయాన్ని బట్టి మైలేజ్‌ ఇస్తుందా? ఏ సమయంలో చమురు కొట్టిస్తే ఎంత ఉపయోగం.. ఏ టైంలో పెట్రోల్ కొట్టిస్తే నష్టం అనే విషయంపై సోషల్‌ మీడియోలో ఓ రచ్చ నడుస్తోంది. అసలే చమురు ధరలకు రెక్కలు వచ్చాయి.. పెట్రోల్, డీజిల్ ధరలతో ప్రజల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దీంతో ప్రజలు తమ వాహనాలను బయటకు తీసేందుకు జంకుతున్నారు. చాలా పొదుపుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో ఎక్కువ మైలేజీ ఇచ్చే వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఎవరైనా ఎక్కువ మైలేజీ రావాలని కోరుకుంటారు.. మైలేజీ వాహనం పరంగానే కాదు.. ఇంధనం నింపుకునే సమయం కూడా ప్రభావితం చేస్తుంది. అవును.. పెట్రోలు, డీజిల్ నింపుకునే సమయం వచ్చిందని పలువురు వాదిస్తున్నారు. ఉదయాన్నే పెట్రోలు నింపుకుంటే మంచిదని కొందరు అంటుంటే.. మరికొందరు రాత్రిపూట పెట్రోలు నింపుకుంటే మంచిదని అంటున్నారు. మరి ఏ సమయంలో పెట్రోలు నింపడం ప్రయోజనకరం? ఈ వాదనల్లో నిజం ఏమిటి? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. అసలు ఇందులో నిజముందా? ఏది వాస్తవం అనే విషయంలోకి వెళ్తే.. స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ఇంధనాన్ని నిల్వ చేయడం ద్వారా, ఉష్ణోగ్రత ఇంధనాన్ని ప్రభావితం చేయదు. పెట్రోల్ మరియు డీజిల్ సాంద్రతలో తేడా లేదు. దీన్నిబట్టి.. పగటిపూట పెట్రోల్ కొన్నారా? రాత్రిపూట పెట్రోల్ కొంటారా? ఎలాంటి తేడా లేదని నిపుణులు చెబుతున్నారు. అంటే… ఏ సమయంలో తమ వాహనంలో ఇంధనం కొట్టించుకున్నా.. ఆ వాహనాన్ని బట్టి సమాంతర ప్రయోజనం ఉంటుంది తప్పా.. ఒక్కో సమయాన్ని బట్టి ఇక్కో విధంగా ప్రభావితం చేయదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు..

వచ్చే ఏడాది నాటికి 3 రకాల వందే భారత్ ట్రైన్లు.. రైల్వే మంత్రి కీలక ప్రకటన
భారతీయ రైల్వేలను ఆధునీకీకరించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వందేభారత్ రైళ్లను ప్రారంభించింది. సెమీ హైస్పీడ్ ట్రైన్ గా ఇప్పటికే పలుమార్గాల్లో ఈ రైల్ ప్రారంభం అయింది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి 3 రకాల వందే భారత్ ట్రైన్లను తీసుకువస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. శతాబ్ధి రాజధాని, లోకల్ ట్రైన్ల స్థానంలో వీటిని తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ స్వదేశీ సెమీ హైస్పీడ్ ట్రైన్లను చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే మూడు నాలుగు ఏళ్లలో వందేభారత్ గరిష్ట వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లు చేస్తామని, దీని కోసం ట్రాక్ అప్ గ్రేడ్ చేస్తామని తెలిపారు. వందేభారత్ రైళ్లు 3 ఫార్మాట్లలో రానున్నట్లు తెలిపారు. వంద కిలోమీటర్ల లోపు వందే మెట్రో, 100-550 కిలోమీటర్లకు వందే చైర్ కార్, 550 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణానికి వందే స్లీపర్స్ రైళ్లను తీసుకు రాబోతున్నట్లు చెప్పారు. వార్తా సంస్థ పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి మాట్లాడుతూ, వచ్చే మూడు, నాలుగు సంవత్సరాలలో వందే భారత్ రైళ్ల గరిష్ట వేగానికి 160 కి.మీల వేగంతో రైల్వే ట్రాక్‌లను అప్‌గ్రేడ్ చేస్తామని చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నుండి ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ రైల్వే స్టేషన్ వరకు వందే భారత్ రైలును ప్రారంభించిన తర్వాత వైష్ణవ్ అన్నారు. ఢిల్లీ-డెహ్రాడూన్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ మధ్య నడుస్తుంది. ప్రయాణ సమయాన్ని ఆరు గంటల 10 నిమిషాల నుంచి నాలుగున్న గంటలకు తగ్గుతుంది.

బిగ్ బ్రేకింగ్.. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై హైకోర్టు కీలక తీర్పు
నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణపై హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో ఎన్టీఆర్ .. 57 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న విషయం తెల్సిందే. మే 28 న ఈ విగ్రహావిష్కరణ ఉండనుంది. అయితే కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం కావడంతో.. హిందూ సంఘాలు, యాదవ సంఘాలు ఆ విగ్రహావిష్కరణపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఈ పోరాటంలో నటి కరాటే కళ్యాణి కీలక పాత్ర పోషించింది. ఎన్టీఆర్ దేవుడు కాదని, ఆయన ఏ వర్గానికి దేవుడిగా భావించి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారని ప్రశ్నించింది. అంతేకాకుండా ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను నిలిపివేయాల్సిందిగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఏ పిటిషన్ పై హైకోర్టు కీలక తీర్పును తెలిపింది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్ట్ స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విగ్రహం ఏర్పాటు చేయకూడదని, తదుపరి విచారణ జూన్ 6 కి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. ఇక విగ్రహ ఏర్పాటుకి అనుమతులు ఉన్నాయంటూ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ జీవోలను కోర్టుముందు ప్రవేశ పెట్టగా వాటిని కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో మే 28 న ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో ఎన్టీఆర్ విగ్రహవిష్కరణ ఉండదని తెలుస్తుంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ ఆదేశాలపై నందమూరి బాలకృష్ణ ఎలా స్పందిస్తాడో చూడాలి.