NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

విదేశాల్లో ఉన్నందుకే నాపై దుష్ప్రచారం.. రాజకీయాల్లో ఉంటే జగన్‌ తోనే..!
రాజకీయాల్లో ఉంటే అది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితోనే అని స్పష్టం చేశారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్‌ ఆర్కే.. ఆర్ 5 జోన్ లోని లేఅవుట్లను పరిశీలించిన ఆయన.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.. అమరావతి ప్రాంతంలో పేదల సొంత ఇంటి కల నెరవేరనుందని తెలిపారు.. మొత్తం 50 వేల మందిలో 22 వేల మంది లబ్ధిదారులు మంగళగిరి నియోజకవర్గంవారేనని సంతోషం వ్యక్తం చేశారు.. ఇక, సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని న్యాయ స్థానాలకు వెళ్ళటం టీడీపీ పెత్తందారీ స్వభావం అర్థం అవుతుంది అని మండిపడ్డారు.. లోకేష్ ను ఓడించటానికే అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నారన్న వాదన కరెక్ట్ కాదని కొట్టిపారేశారు. లబ్ధిదారుల్లో 80 శాతం మంది మంగళగిరి – తాడేపల్లి పరిధిలో నివాసం ఉంటున్న వారే నని.. బయట నుంచి కొత్తగా వచ్చే ఓటర్లు కాదు అని తెలిపారు ఎమ్మెల్యే ఆర్కే.. దీపావళి నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తాను అన్నారు. కొద్ది రోజుల పాటు విదేశాల్లో ఉన్నందుకే నా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా నాకు ఎందుకు అసంతృప్తి ఉంటుంది? అని ఎదురుప్రశ్నించారు.. రాజకీయాల్లో ఉంటే అది సీఎం వైఎస్‌ జగన్‌తోనేనని స్పష్టం చేశారు. మరోవైపు.. ఈ స్థలాలను సమాధులుగా పోల్చిన చంద్రబాబుకు మతి స్థిమితం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇళ్లు లేని పేదలకు ఇవి తాజ్ మహల్స్ అంటూ అభివర్ణించారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. కాగా, గత కొంత కాలంగా ఎమ్మెల్యే ఆర్కే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని.. మరోసారి ఆయనకు వైసీపీ టికెట్‌ వచ్చే అవకాశం లేదని.. అందుకే దూరం జరుగుతున్నారని.. మరో పార్టీలో చేరతారని.. ఇలా ఆర్కేపై రకరకాల ప్రచారాలు సాగుతోన్న విషయం విదితమే.

హజ్‌ యాత్రికులకు సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. విజయవాడ నుంచి విమానాలు..
ముస్లింలు హజ్ ‍యాత్ర పవిత్రంగా భావిస్తారు.. తమ జీవితంలో ఒక్కసారైనా హజ్‌ యాత్రకు వెళ్లాలని తాపత్రయపడతారు.. అయితే, హజ్‌ యాత్రికులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. ఇప్పటి వరకు పొరుగు రాష్ట్రాలకు వెళ్తేనే హజ్‌ యాత్రకు విమానాలు ఉండేవి.. కానీ, విజయవాడలోనే ఎంబార్కేషన్ పాయింట్‌ ఏర్పాటు కావడంతో జూన్ 7వ తేదీ నుంచి విజయవాడ నుంచి హజ్ యాత్రలు ప్రారంభం కానున్నాయి. 2014 తర్వాత తొలిసారి హజ్ యాత్రికుల కోసం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి అంతర్జాతీయ విమానాలు నడవనున్నాయి.. గన్నవరం నుంచి జెడ్డా చేరుకోనున్నాయి విమానాలు. జూన్ 9వ తేదీన 155 మంది హజ్ యాత్రికులతో వెళ్లనుంది మొదటి విమానం.. ఇక, జూన్ 17వ తేదీ వరకు రోజు ఒకటి చొప్పున హజ్‌ యాత్రికులతో వెళ్లనున్నాయి విమానాలు.. ఇక, ఆ తర్వాత 22వ తేదీ వరకు మరిన్ని విమాన సర్వీసులు పెంచనున్నారు.. జూన్ 7వ తేదీన ఉదయం 9 గంటలకు బయల్దేరనున్న విమానం.. మధ్యాహ్నం 2.45 గంటలకు జెడ్డా చేరుకోనుంది. ఇప్పటి వరకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి హజ్ యాత్రకు వెళ్తుండేవారు ఆంధ్రప్రదేశ్‌ హజ్ యాత్రికులు.. కానీ, ఇకపై నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచే ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం.. 2023 జూన్ 7 నుంచి నుండి 2023 జూన్ 19 వరకు హజ్ యాత్ర కొనసాగనుంది. ప్రతి రోజూ విజయవాడ నుంచి 155 మంది హజ్ యాత్రకు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఇక, 1,813 మంది హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి రూ.80,000 ల చొప్పున రూ.14.51 కోట్ల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి హజ్‌కు వెళ్లే యాత్రికుల కోసం గుంటూరు జిల్లా నంబూరులోని మదరసాలో వసతి కల్పించారు. అక్కడి నుంచి బస్సుల ద్వారా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుస్తారు.. అయితే, ఏపీలో తొలిసారి యాత్రికులు నేరుగా హజ్ యాత్రకు వెళ్లేందుకు ఎంబార్కింగ్ పాయింట్ సాధించినట్లు హర్షం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం, మైనార్టీ శాఖ మంత్రి అంజాద్ బాషా.

ఆర్ ఫైవ్ జోన్‌లో లేఅవుట్లు రెడీ..
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి రాజధాని ప్రాంతంలో పేదల ఇళ్ళ పట్టాల పంపిణీ సాకారం కానుంది. కోర్టు కేసులు కొలిక్కి రావటం, అమరావతి రైతుల వ్యతిరేకత మధ్య ఆర్ 5 జోన్ లో ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన రెడ్డి ఈ నెల 26వ తేదీన లబ్దిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 50 వేల మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలను ప్రభుత్వం ఇవ్వనుంది. అమరావతి పరిధిలోని పలు గ్రామాల పరిధిలో సుమారు 1402.58 ఎకరాల్లో 25 లే అవుట్లు వేసి అభివృద్ధి పనులు చేపట్టారు. కొన్ని లే అవుట్ లలో అభివృద్ధి ప్రక్రియ పూర్తి అయ్యింది. సరిహద్దు రాళ్లు వేయటమే కాకుండా వాటి పై నెంబరింగ్ ప్రక్రియ కూడా పూర్తి అయ్యింది. ఆ యా లే అవుట్ల దగ్గర లే అవుట్ మ్యాప్ లను కూడా ప్రదర్శనకు పెట్టారు. మరోవైపు వెంకటపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర భారీ బహిరంగ సభకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు 50 వేల మంది లబ్దిదారులు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తంగా సుమారు రెండు లక్షల మంది వస్తారని అధికార యంత్రాంగం అంచనా వేస్తోంది. దీనికి తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా లే అవుట్ లలోనే సభ ఏర్పాటు చేయాలని భావించినా…గ్రామాల రహదారులు ఇరుకుగా ఉండటంతో సీడ్ యాక్సిస్ పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని సభకు ఎంపిక చేశారు. ఆ పక్కన వాహనాల పార్కింగ్ కోసం స్థలాన్ని ఏర్పాటు చేశారు.

ఎంపీ అవినాష్‌రెడ్డి వ్యవహారంపై ఉత్కంఠ.. రేపు ఏం జరగబోతోంది..?
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తీసుకుంటూనే ఉంది.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్‌ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌కు సంబంధించి గురువారం కీలకం కానుంది. బెయిల్ పిటిషన్ విచారణను.. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్‌ తేల్చాలన్న అవినాష్ రెడ్డి అభ్యర్థనను.. సుప్రీంకోర్టు అంగీకరించడంతో, గురువారం హైకోర్టులో పిటిషన్ విచారణకు రానుంది. అవినాష్‌ ముందస్తు బెయిల్ పిటిషన్ అంశం మరోసారి తెలంగాణ హైకోర్టుకు చేరడంతో న్యాయస్థానం నిర్ణయం ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే, ఎంపీ అవినాష్‌ రెడ్డి విషయంలో దూకుడుగా ఉన్న సీబీఐ..హైకోర్టు నిర్ణయం కోసం వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. అటు సీబీఐ ఇటు అవినాష్‌ రెడ్డి, మరోవైపు వైఎస్ సునీత వాదనలు ఎలా ఉంటాయి?.. విచారణ తర్వాత హైకోర్టు వెకేషన్ బెంచ్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. మరోవైపు వైఎస్‌ వివేకా హత్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన సోదరి విమలారెడ్డి. వివేకాను చంపిన వారు బయట తిరుగుతున్నారని.. తప్పుచేయని వారిని జైల్లో పెట్టారని ఆరోపించారు. అవినాష్‌ను టార్గెట్‌ చేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబం ఎవరినీ హత్య చేయలేదని మొదట చెప్పిన సునీత.. ఆ తర్వాత మాట మార్చారని ఆరోపించారు. కర్నూలు ఆసుపత్రిలో అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మిని పరామర్శించిన విమలారెడ్డి.. అవినాష్‌రెడ్డికి ధైర్యం చెప్పారు. ఇక, వైఎస్‌ వివేకా హత్యకేసులో నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను సుప్రీం కోర్టులో సవాల్ చేశారు సునీతారెడ్డి. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు వెకేషన్‌ బెంచ్‌.. శుక్రవారానికి విచారణను వాయిదా వేసింది.

లక్నో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్న ముంబై బ్యాటర్లు.. 10 ఓవర్లకు స్కోర్..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తుది దశకు చేరుకుంది. ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో ఓడిన జట్టు ప్రస్తుత ఐపీఎల్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది. టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే తొలుత బ్యాటింగ్ కు వచ్చిన ముంబై టీమ్ ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయింది. ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ 11 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. దీంతో 30 పరుగులకే తొలి వికెట్ పడింది. ధాటిగా ఆడుతున్నట్లు కనిపించిన మరో ఓపెనర్ ఇషాంత్ కిషన్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. యశ్ ఠాకూర్ బౌలింగ్ లో నికోలస్ పూరన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 62 పరుగులకే కీలకమైన రెండు వికెట్లను ముంబై ఇండియన్స్ జట్టు కోల్పోయింది. ఇక క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్.. సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కలిసి భారీ షాట్స్ కొట్టడంతో 6 ఓవర్లు ముగిసే సరికే ముంబై స్కోర్ 62 పరుగులు చేసింది.

ఒక్క ప్లే ఆఫ్స్ లో 84 డాట్ బాల్స్.. 42వేల మొక్కలు నాటనున్న బీసీసీఐ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ప్లే ఆఫ్స్ మ్యాచ్ ల సందర్భంగా బీసీసీఐ.. ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్ టాటా కలిసి ఒక నూతన కార్యక్రమానికి తెరతీశాయి. Green Campaign పేరిట ప్లేఆఫ్స్‌ మ్యాచ్‌ల్లో ప్రతీ డాట్‌ బాల్‌కు 500 మొక్కలు నాటాలని నిర్ణయించారు. అందుకే మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్ లో బౌలర్‌ రన్స్ ఇవ్వకుండా ‘డాట్‌ బాల్‌’ వేసిన సమయంలో టీవీ స్కోరు బోర్డులో సున్నాకు బదులుగా ఒక పచ్చని మొక్క చూపిస్తూ వచ్చారు. కాగా ఈ మ్యాచ్‌లో మొత్తం 84 డాట్‌బాల్స్‌ నమోదు అయ్యాయి. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో 34.. మిగతా 50 డాట్‌బాల్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఇన్నింగ్స్‌లో వచ్చాయి. ప్రతీడాట్‌ బాల్‌కు 500 మొక్కలు చొప్పున 84 డాట్‌బాల్స్‌కు 42వేల మొక్కలు నాటనున్నట్లు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జై షా స్వయంగా తన ట్విటర్‌ అకౌంట్ లో పోస్ట్ పెట్టాడు. ఇక ఈ మొక్కల కాన్సెప్ట్‌ మిగతా మూడు ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లకూ(ఫైనల్‌తో కలిపి) వర్తించనుంది. దీంతో ప్లేఆఫ్‌ మ్యాచ్‌లు ముగిసేలోపే లక్షల్లో మొక్కలను నాటే సంఖ్య పెరిగే అవకాశం ఉంది. బీసీసీఐ, టాటా కలిపి చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమానికి ప్రశంసలతో పాటు అన్ని వర్గాల నుంచి విశేష స్పందన దొరుకుతుంది.

ఆధార్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. అప్పటి వరకు ఫ్రీ..
ఆధార్‌ వినియోగదారులకు శుభవార్త చెప్పింది భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్‌)… ఆధార్‌లోని డెమొగ్రాఫిక్‌ అంటే పుట్టినతేదీ, చిరునామా, పేరులో మార్పులు లాంటివి ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కలిపించింది.. వీటికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా ఉచితంగా మార్చుకునేందుకు అవకాశం కల్పించింది.. అయితే, అవి ఇప్పటికే ఉచితంగా పొందే అవకాశం ఉండదు.. ఎందుకంటే.. జూన్‌ 14 వరకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది.. ఈ లోగా ఆన్‌లైన్‌లో నేరుగా మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం ఉండగా.. జూన్‌ 14వ తేదీ తర్వాత వాటికి సంబంధించిన రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్‌లో మార్పులు ఎలా చేసుకోవాలి అనే విషయానికి వెళ్తే.. మైఆధార్‌ పోర్టల్‌ ద్వారా మాత్రమే ఈ సేవలు ఉచితం.. కానీ, ఆధార్‌ సేవా కేంద్రాల ద్వారా అప్‌డేట్‌, డెమొగ్రాఫిక్‌ మార్పులు చేయిస్తే మాత్రం 50 రూపాయాలు చెల్లించాల్సి వుంటుంది. అయితే, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది పౌరులకు ప్రయోజనం చేకూరనుంది.. ఈ ఉచిత సేవలో.. పేరులో అక్షర దోషాలు, పుట్టిన తేదీ, అడ్రాస్‌ మార్పులు, లింగం, పదేళ్లుగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోనివారు కూడా ఈ ఉచిత సౌకర్యాన్ని పొందవచ్చు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉడాయ్‌ పేర్కొంది.. అయితే, ఏ మార్పులు చేసినా ఇందుకోసం నిర్దేశిత జాబితాలోని వోటర్‌, పాన్‌కార్డ్‌, పాస్‌పోర్ట్‌, టెన్త్‌ మెమో.. మొదలైనవి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. కాగా, పదేళ్ల క్రితం ఆధార్‌ పొందినవారు, ఆ తర్వాత అప్‌డేట్‌ చేసుకోనట్టయితే.. ఇప్పుడు అప్‌డేట్‌ తప్పనిసరైన విషయం విదితమే.. అయితే, ఉడాయ్‌ ఇచ్చిన ఈ అవకాశం కొన్ని కోట్ల మందికి ఉపయోగం కానుంది.

మెటా మూడో రౌండ్ లేఆఫ్స్.. 5000 మంది ఉద్యోగాలు ఊస్ట్..
ఫేస్‌బుక్, ఇస్టా‌గ్రామ్ మాతృసంస్థ మెటా తన మూడో రౌండ్ ఉద్యోగుల తొలగింపులను ప్రారంభించింది. ఇప్పటికే రెండు విడతల్లో వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ఇన్‌స్టాగ్రామ్ లో క్రియేటర్ మార్కెటింగ్‌గా పనిచేస్తున్న ఒక ఉద్యోగిని కూడా కంపెనీ తొలగించింది. తన ఇతర సహోద్యోగులతో పాటు 5000 మందిని కూడా తొలగించినట్లు ఆమె లింక్డ్‌ఇన్ లో పేర్కొంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ , మెటా ఇతర విభాగాల్లో పనిచేస్తున్న వారిని కూడా తొలగించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు అధికారిక వివరాలు తెలియనప్పటికీ.. మెటాలో 6000 మంది ఉద్యోగులను తొలగిస్తారని వోక్స్ కథనం గతంలో నివేదించింది. ఈ తొలగింపుల్లో మార్కెటింగ్, కమ్యూనికేషన్స్, సేల్స్, పార్ట్‌నర్ షిప్ ఇలా పలు విభాగాల్లో ఉద్యోగులను తొలగిస్తారని తెలుస్తోంది. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ ఏడాది మార్చిలో 10,000 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్స్ ఇచ్చారు. ఆదాయం తగ్గిన నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునేందుకు మెటా ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. సోషల్ మీడియా దిగ్గజం అయిన మెటా ఇప్పటికే రెండు సార్లు ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గతేడాది నవంబర్ నెలలో 11,000 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చింది. ఇది కంపెనీ వర్క్ ఫోర్స్ లో 13 శాతం.ఇదిలా ఉంటే ఈ ఏడాది మార్చిలో 10,000 మందిని తొలగిస్తున్నట్లు మెటా ప్రకటించింది.

కుదరని ఏకాభిప్రాయం.. ఆర్థిక సంక్షోభం అంచున అమెరికా..
అమెరికా ఆర్థిక సంక్షోభం అంచున నిలిచింది. అమెరికా రుణపరిమితి పెంచడంపై అధికార డెమోక్రాట్స్, విపక్ష రిపబ్లికన్ల మధ్య ఒప్పదం కుదరలేదు. రుణపరిమితి పెంపుపై అధ్యక్షుడ జో బైడెన్, స్పీకర్ కెవిన్ మెకార్థీల మధ్య సోమవారం రాత్రి చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల్లో అంగీకారం కుదరలేదున. జోబైడెన్ డెమెక్రాటిక్ పార్టీకి చెందిన వారు కాగా.. మెకార్థీ రిపబ్లికన్ పార్టీకి చెందినవారు. ప్రస్తుతం కాంగ్రెస్ దిగువసభలో రిపబ్లికన్లకే ఆధిక్యత ఉంది. సెనెట్‌లో డెమెక్రాట్లకు ఆధిక్యత ఉంది. జూన్ 1 నాటి కల్లా రుణ పరిమితి పెంచకపోతే అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, ఫించన్లతో సహా విదేశాల కొనుగోలు చేసి బాండ్లకు చెల్లింపులు నిలిచిపోతాయి. ఇదే జరిగితే అమెరికాలో ఆర్థిక సంక్షోభం తప్పకపోవచ్చు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కూడా దెబ్బతీసే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి జెనెట్ యెలెన్ ఇటీవల కాంగ్రెస్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అమెరికా ప్రభుత్వం ఎక్కువ రుణాలు తీసుకునేందుకు అనుమతిస్తే ప్రతిగా డెమోక్రాట్లు తమ విధానాలను మార్చుకోవాలని రిపబ్లికన్లు కోరుతున్నారు. దీనికి అధికార డెమెక్రాట్ సిద్ధంగా లేదు.

రిపోర్టర్ కు పేలింది.. స్టేజి మీదనే ఇచ్చిపడేసిన డైరెక్టర్
స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్.. చాలా కాలం తరువాత పవన్ తో మరో గబ్బర్ సింగ్ లాంటి పవర్ ఫుల్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక హరీష్ శంకర్ కు, బన్నీ వాసుకుఉన్న ప్రత్యేక అనుబంధం గురించి అందరికి తెల్సిందే. ఆయన అనే కాదు కొత్త దర్శక నిర్మాతలు కానీ, హీరోలు కానీ తమకు సపోర్ట్ కావాలని అడగడం ఆలస్యం నిర్మొహమాటంగా హరీష్ ముందుడి సపోర్ట్ ఇస్తాడు. తాజాగా బన్నీ వాసు తెలుగులో రిలీజ్ చేస్తున్న 2018 సినిమా ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఇక ఈ ప్రెస్ మీట్ కు హరీష్ శంకర్ కూడా హాజరయ్యాడు. మలయాళంలో సూపర్ హిట్ సినిమాగా నిలిచిన 2018 సినిమాను బన్నీ వాస్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే మీడియా ఇంట్రాక్షన్ పెట్టిన బన్నీ వాస్ ను రిపోర్టర్ సురేష్ కొండేటి ఒక ప్రశ్న అడిగాడు. సురేష్ కొండేటి గురించి మీడియాలో ఉన్నవారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రెస్ మీట్లు జరిగినప్పుడు ఏ రిపోర్టర్ అడగని ప్రశ్నలు, హీరోయిన్లను అభ్యంతరకరమైన ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. తాజాగా ఆయన.. తెలుగు ఇండస్ట్రీని అవమానించే విధంగా ఒక ప్రశ్న అడిగాడు. ” ఈ సినిమా చూసాకా మన తెలుగు డైరెక్టర్ ఇలాంటి సినిమా తీయగలడా..? తెలుగు నిర్మాత ఇంత సాహసం చేయగలడా..? అని ఒక నిర్మాతగా మీకు అనిపించిందా..? ” అని అడిగాడు. అందుకు బన్నీ వాస్ .. ఈ ప్రశ్నకు డైరెక్టర్ హరీష్ శంకర్ ఆన్సర్ చెప్తాడు అని చెప్పగా.. హరీష్.. సురేష్ కొండేటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ” నేను ఈ మధ్య యూట్యూబ్ ల్లో చూస్తున్నా.. సురేష్ కొండేటి.. ప్రతి ప్రెస్ మీట్ లో ఎవరు అడగని ఒక సాహోసోపేతమైన ప్రశ్నలు వేసి.. దాన్ని యూట్యూబ్ లో వైరల్ చేసి ఒక ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఒక సామెత ఉంది.. వినేవాడు సురేష్ అయితే.. చెడ్డోడు హరీష్ అంట. అసలు ప్రపంచం సినిమా మొత్తం మన చేతికి వస్తుంటే.. నువ్వింకా డబ్బింగ్ సినిమా అది అంటున్నావ్. ఆర్ఆర్ఆర్ సినిమాను హిందీలో డబ్బింగ్ సినిమా అనుకున్నారా..? బాహుబలిని డబ్బింగ్ సినిమా అన్నారా..?.. కెజిఎఫ్ సినిమాను డబ్బింగ్ సినిమా అనుకున్నారా..? డబ్బింగ్ సినిమా, రీమేక్ సినిమా కాదు.. సినిమా ఆంటే. ఏ సినిమా ఎక్కడికైనా వెళ్తుంది అంటే సంతోషించాలి. మన ఆర్టిస్టులు, మన దర్శకులు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తెలుగు దర్శకులు ఇలాంటి సినిమాలు తీయలేరా అంటే.. ప్రపంచం మొత్తం తెలుగు సినిమా చూస్తున్న రోజుల్లో ఇలాంటి ప్రశ్న వేసావంటే జాలి వేస్తుంది.

కారు యాక్సిడెంట్ లో సీరియల్ నటి మృతి
గత కొన్ని రోజుల నుంచి చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ అని లేకుండా సినీ తారలు మృత్యువాత పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ యువ సీరియల్ నటి కారు ప్రమాదంలో మృతిచెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. బాలీవుడ్ సీరియల్ నటి వైభవి ఉపాధ్యాయ కారు ప్రమాదంలో మృతి చెందింది. ఆమె ‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’ సీరియల్ తో ఫేమస్ అయ్యింది. వైభవి వయస్సు 32 ఏళ్ళు. ఇటీవలే ఆమె.. తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి హిమాచల్ ప్రదేశ్ వెకేషన్ కు వెళ్ళింది. ఇక ఎంతో ఆనందంగా జ్ఞాపకాలను పోగుచేసుకొని తిరిగి వస్తుండగా.. ఆమె కారు లోయలోకి దూసుకు వెళ్లింది. దాంతో వైభవి అక్కడిక్కడే మృతి చెందింది. ఇక కారులో ఉన్న వైభవి ప్రియుడు గాయాలతో బయటపడ్డాడు. ఈ అనుకోని సంఘటనకు అభిమానులే కాదు ఇండస్ట్రీ మొత్తం షాక్ కు గురయ్యింది. అతి చిన్న వయస్సులోనే వైభవి ఇంత దారుణంగా మృతిచెందడం విషాదమని సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. వైభవి సీరియల్స్ మాత్రమే కాదు దీపికా నటించిన ఛపాక్ సినిమాలో కూడా నటించి మెప్పించింది. నేడు ముంబైకి వైభవి మృతదేహంను తీసుకు వచ్చారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని సినీ ప్రముఖులు ట్వీట్ చేస్తున్నారు.