NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు.. గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో.. రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు భూముల పట్టాల పంపిణీ, తదితర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 24 నుంచి 30 వరకు గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. నూతనంగా పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి.. రైతుబంధు వర్తింపచేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా రైతుబంధు పొందుతున్న వారితో పాటు కొత్తగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్దిదారులతో క్రోడికరించి.. రాష్ట్రంలో మిగతా రైతులకు ఎలాగైతే రైతుబందు అందుతోందో, వీరికి కూడా అదే పద్ధతిలో రైతుబందు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా.. ప్రభుత్వమే బ్యాంక్ అకౌంట్‌ను తెరిచి, పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లోనే రైతుబంధును జమ చేస్తుందని అన్నారు. కొత్తగా పోడు పట్టాలు అందుకునే గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖ వారికి అందజేయాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను సిఎం కేసిఆర్ ఆదేశించారు. అంతేకాదు.. పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని కేసీఆర్ తెలిపారు. అలాగే.. ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలున్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను, అర్హులైన నిరుపేదలను గుర్తించి, వారి ఇండ్ల నిర్మాణాల కోసం ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టాలని కూడా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. గృహలక్ష్మి పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్‌ను త్వరగా తయారు చేయాలని, జూలై నెలలో గృహలక్ష్మి పథకం ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. జులైలోనే దళితబందు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను కేసీఆర్ ఆదేశించారు.

మరోసారి ఢిల్లీకి సీఎం వైఎస్‌ జగన్‌.. ఈసారి ఎందుకంటే..?
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు.. ఇప్పటికే పలు సందర్భాల్లో ఢిల్లీ వెళ్లిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్ర మంత్రులను కలుస్తూ.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తూ.. పెండింగ్‌ నిధుల విడుదల తదితర అంశాలపై చర్చిస్తూ వచ్చారు. ఇక, ఈనెల 27న మరోసారి ఢిల్లీకి వెళ్తున్నారు ఏపీ సీఎం.. న్యూఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశానికి హాజరుకానున్నారు.. మరోవైపు.. గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో చర్చించనున్న అంశాలపై అధికారులతో ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు సీఎం జగన్‌.. కాగా, 27వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌లో వికాస్‌ భారత్‌ @ 2047, ఎంఎస్‌ఎంఈలు, మౌలిక సదుపాయాలు–పెట్టబడులు, వ్యాపార వర్గాలకు సులభతరమైన విధానాలు, మహిళా సాధికారత, ఆరోగ్యం మరియు పౌష్టికాహారం, నైపుణ్యాభివృద్ధి, గతి శక్తి ఏరియా డెవలప్‌మెంట్, సోషల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ పై చర్చించనుంది నీతిఆయోగ్‌ పాలక మండలి. ఆరోగ్యం, పౌష్టికాహారం రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన చరిత్రాత్మక మార్పులను నీతి ఆయోగ్‌ వేదికపై వివరించనున్నారు సీఎం జగన్‌.. ఫ్యామిలీ డాక్టర్, ఎన్‌సీడీఎస్‌ల నియంత్రణ, ఆరోగ్యశ్రీ, ఆస్పత్రుల్లో నాడు–నేడు, తల్లులు, పిల్లలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ, ఆస్పత్రుల్లో సరిపడా సిబ్బంది నియామకం.. తదితర అంశాలను నీతి ఆయోగ్‌ సమావేశంలో వివరించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌.. సీఎం వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు గతంలో అవినీతమయం అయ్యాయని విమర్శించిన ఆయన.. ప్రభుత్వ సొమ్మ 371 కోట్ల రూపాయలను దోచుకున్నారని ఫైర్‌ అయ్యారు.. అలాంటి పరిస్థితులకు ఆస్కారం ఉండకూడదని స్పష్టం చేశారు. నిధుల వినియోగంలో జవాబుదారీతనం ఉండాలని పేర్కొన్నారు.. ప్రభుత్వ రంగంలో స్కిల్‌ కాలేజీలు, ప్రభుత్వం అమలు చేయనున్న ప్రణాళికతో మంచి వ్యవస్థలు ఏర్పడతాయని వెల్లడించారు.. నిరంతరాయంగా పిల్లలకు నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు సీఎం వైఎస్‌ జగన్‌. కాగా, దేశచరిత్రలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ అతి పెద్దదని గతంలో ఆరోపించారు సీఎం వైఎస్‌ జగన్‌.. స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు దోపిడీ విజన్ కనిపిస్తోందన్న ఆయన.. ఇది స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్‌గా చెప్పుకొచ్చారు. విదేశీ లాటరీ తరహాలోనే ఈ స్కిల్‌ స్కామ్‌ను నడిపించారని ఆరోపించారు. దీంతో 371 కోట్ల రూపాయల జనం సొమ్మును మాయం చేశారని.. ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కీమ్‌ ఖర్చు మొత్తం 3 వేల 356 కోట్లు అని తెలిపారు.. ఇందులో ప్రభుత్వం వాటా 10శాతం కాగా.. 90శాతం సీమెన్స్ కంపెనీ భరిస్తుందని చెప్పారన్నారు. అయితే, ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీ 3 వేల కోట్ల రూపాయలను గ్రాంట్‌గా ఇస్తుందా? అని గతంలో అసెంబ్లీ వేదికగా చంద్రబాబును సీఎం జగన్‌ నిలదీసిన విషయం విదితమే.

సీబీఐని అవినాష్‌రెడ్డి వెసులుబాటు అడగడం తప్పా..? ఎందుకంత కడుపు మంట..
తన తల్లి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉంటే.. ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణలో వెసులుబాటు అడగడం తప్పా? అని నిలదీశారు మాజీ మంత్రి పేర్ని నాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఆక్టోపస్ అంటూ మండిపడ్డారు.. చంద్రబాబు అప్పట్లో మోడీతో తగాదా పెట్టుకున్నాడు.. 2014-2019 మధ్య ప్రభుత్వం జీవో 176 తెచ్చింది.. సీబీఐకి చంద్రబాబు ప్రభుత్వ జనరల్ కంసెంట్ ను రద్దు చేస్తూ జీవో విడుదల చేసిందని గుర్తుచేశారు.. కానీ, ఇప్పుడు అవినాష్ రెడ్డి కేసు విషయంలో టీడీపీ, వారి మీడియా చిలవలు, పలవలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు అంటూ అప్పుడు వార్తా కథనాలు రాశారని సెటైర్లు వేశారు. సీబీఐ పిలిచినప్పుడల్లా అవినాష్ రెడ్డి విచారణకు వెళ్తూనే ఉన్నాడు.. తల్లికి హార్ట్ ఎటాక్ రావటంతో దగ్గర ఉండి చూసుకోవటం కోసం వెసులుబాటు కావాలని సీబీఐని అడగటం తప్పా? అంటూ నిలదీశారు. కేంద్ర బలగాలు హెలికాప్టర్లలో వచ్చేస్తున్నారు అంటూ ఊదర గొడుతున్నారు అంటూ విరుచుకుపడ్డారు పేర్ని నాని.. అవినాష్ రెడ్డిని కాల్చేస్తారు అని ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేసిన ఆయన.. చంద్రబాబు ఇంత వరకు ఎప్పుడైనా విచారణకు హాజరయ్యాడా? చంద్రబాబు జీవితం అంతా స్టేలు తెచ్చుకుని బతుకటమేగా? కానీ, ఇప్పుడు ఎందుకు ఇంత కడుపు మంట? అంటూ ఫైర్‌ అయ్యారు.. ఇక, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా అవినాష్ రెడ్డి కేసు కోసమే వెళ్ళారని ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు నాని.. ఇప్పుడు కేంద్రం పదివేల కోట్ల రూపాయల పెండింగ్ నిధులు విడుదల చేస్తే తట్టుకోలేక పోతున్నారన్న ఆయన.. ఈ నిధుల కోసమే ముఖ్యమంత్రి అన్ని సార్లు ఢిల్లీ తిరిగిందన్నారు.. 2014-19లో మధ్య రాష్ట్రానికి హక్కుగా రావలసిన నిధులను చంద్రబాబు తీసుకుని రాలేక పోయాడని విమర్శించారు. కానీ, అలుపు ఎరుగని పోరాటం చేసి సీఎం వైఎస్‌ జగన్ తెచ్చాడని ఎందుకు ఒక్క మాట చెప్పలేక పోతున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని.

జగన్‌ పాలనకు నాలుగేళ్లు.. 175 వైపు అడుగులు వేస్తున్నాం..
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రోజుతో నాలుగేళ్లు పూర్తి అవుతుంది.. ఏకంగా151 అసెంబ్లీ స్థానాలను, 22 ఏంపీ సీట్లను సాధించిన విజయం కేతనం ఎగురవేసింది వైసీపీ.. ఈ నాలుగేళ్ల కాలంలో ఎన్నో సవాళ్లును ఎదుర్కొంటూ ముందుకు సాగారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. అధికారంలోకి రాకముందు ఎన్నో హామీలను ఇచ్చారు జగన్‌.. ముఖ్యంగా నవరత్నాల పేరుతో ఆ పార్టీ చేసిన క్యాంపెయిన్‌, ఒక్క అవకాశం ఇవ్వండి.. పాలన అంటే ఏమిటో చూపిస్తామంటూ చేసిన ప్రచారం.. ఆ పార్టీ ఎంతగానో కలిసి వచ్చింది.. అయితే, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతీ హామీని అమలు చేస్తున్నామని.. నాలుగేళ్ల పాలనలో ఏకంగా 98.4 శాతం హామీలను నెరవేర్చామని చెబుతున్నారు అధికార పార్టీ నేతలు.. అందుకే ప్రతీ గడపకు వెళ్లి.. ధైర్యంగా మేం చేసిన పనులను, అందించిన పథకాలను వివరిస్తున్నామని.. ప్రజల నుంచి అపూర్వమైన మద్దతు లభిస్తోందని పేర్కొంటున్నారు. ఇక, నాలుగేళ్ల పాలనపై ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.. ”దేవుడి ద‌య‌, మీ అంద‌రి చ‌ల్ల‌ని దీవెన‌ల‌తో నాలుగేళ్ళ క్రితం మ‌న ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చింది.. మీరు అప్పగించిన బాధ్యతను మీకు సేవ చేసే అవ‌కాశంగా భావించి, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను మ‌న ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా అమ‌లు చేశాం.. మ‌రోసారి మీకు సేవ చేసే అవ‌కాశం ల‌భించేందుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175కు 175 స్థానాల్లో గెలుపొందేలా అడుగులు వేస్తున్నాం.” అని పేర్కొంటు.. #YSRCPAgain2024 హ్యాష్‌టాగ్‌ను జోడించి ట్వీట్‌చేశారు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఆ హామీలన్ని అమలు చేస్తాం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్‌తో పాటు ఇచ్చిన ఇతర హామీలన్నింటినీ అమలు చేస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లాలో బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ దగ్గర తన అనుచరులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న అనంతరం వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. నల్గొండ, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు అందించే బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు తన చిరకాల స్వప్నమని తెలిపారు. ఆలస్యంగానైనా ప్రాజెక్టు పనులు పూర్తిచేసినందుకు బీఆర్ఎస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు. ఇంకా 10% పనులు మిగిలున్నాయని, వాటిని త్వరగా పూర్తి చేయాలని కోరారు. రాజకీయ భిక్ష పెట్టిన తన ప్రాంత ప్రజల రుణాన్ని తాను తీర్చుకున్నానని అన్నారు. ఈసారి తెలంగాణలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ నెలలో నల్లగొండ జిల్లాకు ప్రియాంక గాంధీని తీసుకువస్తామని తెలిపారు. అంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వేడుకల సందర్భంగానే సీఎం పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వేడుకలకి విచ్చేసిన ప్రజలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేయగా.. తనని సీఎం అనొద్దని అన్నారు. తాను మంత్రి పదవినే వదిలేశానని, తనకు పదవి కాదు ప్రజలే ముఖ్యమని తెలిపారు. తనకు సీఎం పదవి అవసరం లేదన్న ఆయన.. ఆ పదవే తనను వెతుక్కుంటూ వస్తుందని పేర్కొన్నారు. తాను ఏరోజూ పదవుల కోసం ఆశపడలేదని.. పదవులే తనను వెతుక్కుంటూ వచ్చాయన్నారు. తాను సీఎం పదవి కోసం పాకులాడే వ్యక్తిని కాదన్నారు. మీకోసం (నియోజకవర్గ ప్రజల్ని ఉద్దేశిస్తూ) చావడానికైనా, చంపడానికైనా తాను సిద్ధమేనని.. ఐదు సార్లు గెలిపించిన మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. సీఎం ఎవరన్న అంశంపై అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. కాగా.. గతంలో ఓసారి దళిత అభ్యర్థినే సీఎం చేయాలంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.

రుతురాజ్ వీరవిహారం.. 10 ఓవర్లలో చెన్నై పరిస్థితి ఇది!
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఈరోజు (23-05-23) గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి క్వాలిఫైయర్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో జీటీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. చెన్నై బ్యాటింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 85 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అర్థశతకంతో వీరవిహారం చేయడం వల్లే.. చెన్నై స్కోరు ఇలా దూసుకెళ్తోంది. తొలుత క్రీజులో కుదురుకోవడం కోసం కొంత సమయం తీసుకున్న రుతురాజ్.. ఆ తర్వాతి నుంచి రెచ్చిపోయాడు. జీటీ బౌలర్ల స్వభావాన్ని అర్థం చేసుకున్న తర్వాత, వారిపై విరుచుకుపడటం మొదలుపెట్టాడు. బౌండరీల మోత మోగించేసి, మైదానంలో పరుగుల వర్షం కురిపించాడు. రుతురాజ్‌తో పాటు బరిలోకి దిగిన డెవాన్ కాన్వే మాత్రం ఇంకా తన ఖాతా తెరువలేదు. రుతురాజ్ ఊపందుకోవడంతో.. అతనికి స్టాండ్ ఇస్తున్నాడు. సింగిల్స్ తీస్తూ.. రుతురాజ్‌ని మద్దతుగా నిలిచాడు. నిజానికి.. ఇతడు ఆరో ఓవర్‌లోనే క్యాచ్ ఔట్ అవ్వాల్సింది. మూడో స్లిప్‌లో నిల్చున్న ఫీల్డర్ చేతికి క్యాచ్ చిక్కినట్టే చిక్కి, అది బౌండరీ వైపుకు పరుగులు పెట్టింది. అలా అతనికి లైఫ్ రావడంతో, దాన్ని తనదైన శైలిలో సద్వినియోగపరచుకుంటున్నాడు. అనవసరమైన షాట్ల జోలికి వెళ్లకుండా, క్రీజులో తన స్థానాన్ని పదిలపరచుకున్నాడు. మరోవైపు రుతురాజ్ మాత్రం.. జీటీ బౌలర్లపై తాండవం చేస్తున్నాడు. ఇంకా పది ఓవర్లు ఉండటం, చెన్నైలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడే ఆటగాళ్లు ఉన్నారు కాబట్టి.. మరో 10 ఓవర్లలో ఊచకోత కోసి.. గుజరాత్ టైటాన్స్‌కి చెన్నై జట్టు భారీ లక్ష్యమే నిర్దేశించేలా కనిపిస్తోంది.

ఏంటీ.. ఆ బల్లి నెక్లెస్ అన్ని కోట్లా.. ఒక పాన్ ఇండియా సినిమా తీయొచ్చు తెలుసా..?
76 వ కేన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌లో తన అందాలతో ప్రపంచాన్ని ఊర్వశి రౌతేలా ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా మే 16న ఆమె వేసుకున్న కాస్ట్యూమ్‌ నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. ముఖ్యంగా ఆమె పెట్టుకున్న మొసలి నెక్లెస్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పింక్‌ కలర్‌ గౌనులో మెరిసిన ఊర్వశి.. మెడలో తనకెంతో ఇష్టమైన మొసలి నెక్లెస్‌, చెవులకు మొసలి రింగులు పెట్టుకుంది. ఆ తర్వాత దీనిపై నెట్టింట చర్చ జరిగింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఫేక్ నెక్లెస్‌ పెట్టుకుని వెళ్లారా అని ఊర్వశి రౌతేలాను ప్రశ్నించారు. దీంతో ఆమె టీమ్‌ దీని ధరను ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టింది. ఊర్వశి ధరించిన నెక్లెస్‌ ఫేక్‌ కాదు.. దాని ధర రూ.200 కోట్ల దాకా ఉంటుందని వెల్లడించారు. దీని ధర చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఈ నెక్లెస్‌ను ఫ్రెంచ్ లగ్జరీ సంస్థ కార్టియర్ తయారు చేసింది. ఒరిజినల్ నెక్లెస్ అనేది కార్టియర్ బ్రాండ్ యొక్క అత్యుత్తమ కలెక్షన్ పురాతన ఆభరణాలలో భాగం. ఈ నెక్లెస్ మొదటిసారిగా 2018 సంవత్సరంలో పరిచయం చేయబడింది. ఈ నెక్లెస్‌లో కేవలం ఒక మొసలిని తయారు చేయడంలో వెయ్యికి పైగా కట్ ఫ్యాన్సీ పసుపు వజ్రాలు ఉపయోగించబడ్డాయి. ఇందులో 18 క్యారెట్ల పసుపు బంగారాన్ని కూడా ఉపయోగించారు. నెక్లెస్‌లో 60.02 క్యారెట్లు ఉపయోగించబడ్డాయి. ఫోర్బ్స్ ప్రకారం, రెండవ మొసలిలో 18 క్యారెట్ల తెల్ల బంగారాన్ని ఉపయోగించారు మరియు దానిపై 66.86 క్యారెట్ల బరువున్న పచ్చలు ఉంచబడ్డాయి. దీంతో ఈ నెక్ల్సెస్ ధర సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

పెద్దరికం నన్ను ఆపేస్తుంది.. అందుకే ఆ పని చేయడం లేదు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తున్న విషయం తెల్సిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక నటిస్తోంది. ఇప్పటికే పుష్ప తో ఐకాన్ స్టార్ గా మారిన బన్నీ.. పుష్ప 2 తో గ్లోబల్ స్టార్ గా మారడానికి ట్రై చేస్తున్నాడు. ఇక ఈ మధ్యకాలంలో బన్నీ బయట కనిపించడం లేదు. ఉంటే పుష్ప 2 షూటింగ్.. లేకపోతే కుటుంబంతో వెకేషన్ లో కనిపిస్తున్నాడు. ఇక తాజాగా బన్నీ.. తెలుగు ఇండియన్ ఐడల్ లో మెరిశాడు. ఆహా లో ప్రసారం అవుతున్న టాప్ సింగింగ్ షో. ఈ షో ఫైనల్ లో బన్నీ సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. అతిరథ సంగీత విద్వాంసుల మధ్య బన్నీ ఫైనల్ ఎపిసోడ్ కు జడ్జిగా వచ్చాడు. ఇక తాజాగా బన్నీ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. పుష్ప 2 ఫస్ట్ గ్లింప్స్ మ్యూజిక్ తో డ్యాన్సర్ ల మధ్య నుంచి బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో పుష్ప రాయల్ ఎంట్రీ ఇచ్చాడు. అనంతరం ఇలాంటి సింగింగ్ షోకు జడ్జిగా రావడం తన అదృష్టమని చెప్పాడు. ఫైనల్ కంటెస్టెంట్స్ కు అల్ ది బెస్ట్ చెప్పుకొచ్చాడు. ఇక వారి పాటలు వింటుంటే.. తనకు కాళ్లు ఆగడం లేదని, డ్యాన్స్ చేయాలనిపిస్తోందని తెలిపాడు. కానీ, ఒక జడ్జీ స్థానంలో వచ్చాను కాబట్టి ఆ పెద్దరికం తనను ఆపేస్తుందని, అందుకే డ్యాన్స్ చేయాలనే తన కోరికను ఆపేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక చివరగా ఫైనల్ కంటెస్టెంట్ కు బన్నీ ట్రోఫీని బహుకరించినట్లు చూపించారు. ఆహా లో జరిగే ఈవెంట్ అనే కాదు.. బన్నీ ఏ ఈవెంట్ కు గెస్ట్ గా పిలిచినా వారిని ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు వెనుకాడడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.