NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

*మనవడి మొక్కు.. కుటుంబ సమేతంగా తిరుమలకు సీఎం రేవంత్‌ రెడ్డి
తిరుమల శ్రీవారి దర్శనార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట ఎయిర్‌పోర్టుకు కుటుంబసమేతంగా చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన శ్రీవారి దర్శనార్థం తిరుమలకు బయలుదేరి వెళ్లారు. రచనా అతిధిగృహం వద్ద సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. తన మనవడి పుట్టెంట్రుకులు స్వామి వారికి రేవంత్ కుటుంబ సభ్యులు సమర్పించనున్నారు. ఈ రాత్రికి తిరుమల్లోనే రేవంత్ రెడ్డి బస చేయనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా బాలాజీని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం రేపు (బుధవారం) తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు సీఎం రేవంత్.

 

*ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా?.. మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు.
ప్రశాంత్ కిషోర్, ఎన్నికల కన్సల్టెన్సీలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మా.. ప్రశాంత్ కిషోర్ ఓ క్యాష్ పార్టీ అంటూ ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిషోర్ గిమ్మిక్కులు చేస్తారు.. ఒన్ టైం వ్యవహరం అనుకున్నాం.. తర్వాత వదిలేశామని మంత్రి అన్నారు. ప్రస్తుతానికి ఐ-ప్యాక్ నిర్మాణాత్మకంగానే ఉందని అనుకుంటున్నామన్నారు. ప్రశాంత్ కిషోరైనా, ఐ-ప్యాక్ అయినా తాత్కాలికం.. వైసీపీ శాశ్వతమన్నారు. కో-ఆర్డినేషన్ కోసం ఐ-ప్యాక్ సంస్థ సేవలు తీసుకున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. కన్సల్టెన్సీ సంస్థలు ఎన్నైనా చెబుతాయి.. నిర్ణయం తీసుకోవాల్సింది మేమేనన్నారు. ఐ-ప్యాక్ చెప్పిన వారికే టిక్కెట్లు ఇచ్చారనేది అవాస్తవమని.. ఐ-ప్యాక్ ఓ జాబితా ఇస్తుంది.. అందులో నుంచి అభ్యర్థులను పార్టీ సెలెక్ట్ చేసుకుందన్నారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్‌ నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఫలితాల్లో వైసీపీ ఓటమి తప్పదని పీకే పేర్కొనగా.. ఆ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు.

 

*నేతన్నలకు గుడ్ న్యూస్.. జౌళిశాఖ మంత్రి ప్రతిపాదనలకు సీఎం ఆమోదం
వ్యవసాయ, సహకార శాఖ, చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రతిపాదించిన విషయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి మంత్రి తెలిపారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ కనుముక్కల నందు (23) ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) నందు డిప్లొమా, డిగ్రీ ప్రోగ్రాంలలో విద్యార్థులకు ప్రవేశాల కల్పనకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారని మంత్రి నాగేశ్వరరావు పేర్కొన్నారు. మరమగ్గాల, చేనేత మగ్గాల ఆధునీకరణ కొరకు బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా, నేతన్నలకు సహాయం.. 2024 -25 ఏడాదికి బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా కేటాయింపబడిన రూ.400 కోట్ల బడ్జెట్ వినియోగించుటకు సీఎం అంగీకరించినట్లు తెలిపారు. TSCO ద్వారా సానిటరీ నాప్కిన్లు ఉత్పతి పరిశ్రమను పోచంపల్లిలో స్థాపించుటకు అంగీకరించారని మంత్రి వెల్లడించారు. పాఠశాలలకు వెళ్ళే బాలికలకు ఋతుక్రమ సమయంలో పరిశుభ్రత పాటించడానికి, బడికి గైర్హాజరును నిరోధించడానికిగాను సానిటరీ నాప్కిన్లు స్వయం సహాయక సంఘాల ద్వారా సరఫరా చేయుటక నిశ్చయించామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల నుంచి TSCO కి రావాలసిన అన్ని పెండింగ్ బాకాయిలను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని మంత్రి తెలిపారు. ఈ ప్రభుత్వం చేనేత కార్మికుల అభివృద్ధికి కట్టుబడి ఉందని, అలాగే వారి సంక్షేమం కోసం పాటు పడుతుందని ఈ సందర్భంగా మంత్రిగారు మరోమారు గుర్తుచేశారు. చేనేత కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఏడాదికి బీసీ వెల్ఫేర్ శాఖ ద్వారా కేటాయింపబడిన రూ.400 కోట్లు ఖర్చు చేసి వారి అభివృద్ధికి పాటుపడతామన్నారు.

 

*బెంగళూరు రేవ్‌ పార్టీ విషయంలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
బెంగుళూరు రేవ్ పార్టీలో తనకు సంబంధించిన వాళ్లెవరూ లేరని.. ఈ విషయంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. బెంగుళూరు రేవ్ పార్టీ విషయంలో తనపై తప్పడు ప్రచారం చేస్తున్నారని.. సోమిరెడ్డి చంద్రమోహన్ ఏదేదో మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఎవడో అనామకుడు తన పేరుతో ఉన్న ఎమ్మెల్యే జిరాక్స్ కాపీ స్టిక్కర్‌ను వాడారని.. ఇప్పటికే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. ఏమి ఆధారం లేకుండా గోవర్ధన్ రెడ్డి ఆర్గనైజ్ చేశాడు అని సోమిరెడ్డి అంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాస్ నెల్లూరులోని తన ఇంట్లోనే ఉందని.. ఎవరు అయినా వెళ్లి చూసుకోవచ్చన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ బతుకు ఏంటో నెల్లూరు ప్రజలకు తెలుసన్నారు. ఇద్దరం బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం.. ఎవరు రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుందంటూ సోమిరెడ్డికి సవాల్ విసిరారు. బెంగుళూరులో రేవ్ పార్టీ వ్యవహారంపై తాను సీబీఐ విచారణకు కూడా సిద్ధమన్నారు. చంద్ర మోహన్ రెడ్డి నోటికి, సెప్టిక్ ట్యాంక్‌కు తేడా లేదంటూ తీవ్రంగా మండిపడ్డారు. రేవ్ పార్టీపై ఎటువంటి విచారణకు అయిన తాను సిద్ధమన్నారు. రేవ్ పార్టీలో చంద్ర బాబు కుటుంబ సభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి తెలిపారు. బెంగుళూరు పోలీసుల నుంచి ఎటువంటి కాల్ రాలేదన్నారు. ఆ ఫార్మ్ హౌస్ ఓనర్ ఎవరో కూడా తనకు తెలియదని.. కుట్ర కోణం ఏమైనా ఉందా విచారణ చేయాలని ఏపీ డీజీపీని కోరామన్నారు.

 

*కాంగ్రెస్ రైతులను మోసం చేసింది.. రూ.500 బోనస్ పై స్పష్టత ఇవ్వాలి
కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. “రాష్ట్రంలో 90 శాతం రైతులు దొడ్డువడ్లు పండిస్తారు. అది తెలిసే సన్న వడ్ల కు 5 వందల బొనస్ అంటూ ప్రకటన చేశారు. యసంగిలో తెలంగాణలో సన్న వడ్లు పండవు.. బోనస్ ఇవ్వకుండా ఎగబెట్టడమే కోసమే ఇది. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పలేదని అసెంబ్లీలో చేతులు ఎత్తేసింది కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ మ్యనిఫెస్ట్ లో ఇచ్చినట్టుగా పంటలకు బోనస్ ఇవ్వాలినీ డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ మ్యనిఫెస్ట్ లో ఎక్కడ సన్నవడ్లు అని రాయాలేదు.. అప్పుడు వరి ధాన్యం అని మాత్రమే రాశారు. రాష్ట్ర రైతులకు హామీ ఇచ్చి.. కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుంది. రైతు భరోసా ఇస్తాం అన్నారు.. కానీ రైతు బంధూ పాక్షికంగా ఇచ్చారు. రాహుల్ గాంధీ నిర్మల్ సభలో రైతు భరోసా ఇచ్చాము అని చెప్పారు. కానీ ఇవ్వలేదు.కాబట్టి మిగతా 2500 రూపాయలు యసంగిలో రైతులకు ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు భరోసా కింద ఎకరానికి 7500 రూపాయలను జూన్ నెలలోనే ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ను BRS డిమాండ్ చేస్తున్నది.” అని ఆయన వ్యాఖ్యానించారు. వరి కి బోనస్ పై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని హరీష్ రావు అన్నారు. “ఎప్పటి నుంచి 500 రూపాయలు బోనస్ ఇచ్చి దొడ్డు వడ్లు కొంటారో చెప్పాలి. ఇతర పంటలకు బోనస్ ఇచ్చే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని BRS పోరాటం చేస్తుంది. రైతుల పక్షాన పోరాటం చేస్తాం. వరి బోనస్ బోగస్ అయ్యింది. భట్టి మాటలు వట్టి మాటలు అని తేలింది. వడ్లు తడిసినవి కాబట్టి తీసుకొం అని రైస్ మిల్లులు అంటున్నాయి. వరి ధాన్యం సేకరణ సరిగ్గా లేక.. రైతులు ఇబ్బంది పడుతున్నారు.రెండు మూడు రోజులు వడ్లు రైస్ మిల్లులు దగ్గర దించుకునే పరిస్థి.తి లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అయిన స్పందించాలి. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి. ఎకరానికి 25 వేలు పంట నష్టం ను రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం సేకరణను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వంను డిమాండ్ చేస్తున్నాం.” అని ఆయన పేర్కొన్నారు.

 

*లిక్కర్ బ్రాండ్ల మీద నిషేధం లేదు.. ఆబ్కారీ మంత్రి స్పష్టం
లిక్కర్ లో ప్రభుత్వ పాలసీ ఉంటది.. కానీ అనధికార పాలసీ ఉంటదా? అని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. “మద్యం అందుబాటులో లేకుంటే సేల్స్ తగ్గాలి. కానీ ఎందుకు పెరిగింది సేల్స్. గత ప్రభుత్వం 2300 కోట్లు బిల్లులు డ్యూ పెట్టింది. మేము వచ్చాకా కొన్ని తీర్చినం చేశాం. మీరు బకాయిలు పెట్టి మమ్మల్ని నిందిస్తున్నారు. చెల్లింపులు చేయకపోతే మీకేం నష్టం.. ప్రజలకు నష్టం లేదు. బ్రాండ్ల మీద నిషేధం లేదు. గతంలో ముడుపులు చెల్లిస్తే పోస్టులు ఇచ్చే వాళ్ళు మీరు. ఇప్పుడు పైరవీలు లేకుండా పోస్టింగులు ఇస్తున్నాం. వచ్చి మూడు నెలలు కాలేదు ఐదు వేల కోట్ల ముడుపులు వస్తాయా..?. జూపల్లి శాఖలో అవినీతి ఉంటదా? కేబినెట్ నిర్ణయం లేకుండా పాలసీ వస్తుందా..? పే మెంట్ల పెండింగ్ వాస్తవం. పెండింగ్ కి కారణం మీరే కదా” అని జూపల్లి వ్యాఖ్యానించారు. ఆర్థిక పరిస్థితి బట్టి పేమెంట్స్ ఉంటాయని.. కొత్త బ్రాండ్లుకు దరఖాస్తు లే రాలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కాగా.. రాష్ట్రంలో మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎక్స్ వేదికగా అధికార పార్టీ, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లు, రూ. 500 బోనస్ తదితర పథకాల అమలు ఏమైందని అడుగుతున్నారు.

 

*రాష్ట్ర, దేశ భవిష్యత్తును నిర్ణయించేది ఓటుహక్కే
నేటి రాజకీయాలలో చదువుకున్న వాళ్లకు కూడా వెలకట్టే పరిస్థితి వచ్చిందని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. వరంగల్ జిల్లా ఏకశిలా నగర్‌లో జరిగిన యూత్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. మనం ఎమ్మెల్యేలను, ఎంపీలను, కార్పొరేటర్లను ఎన్నుకుంటున్నాము… వాళ్లు సరిగ్గా పని చేస్తే మనకు సంతోషం. కానీ వారు డబ్బు మనుషులై ప్రజలను పీడిస్తే వీడికి ఎందుకు ఓటేశామురా అని బాధ పడతామన్నారు. పట్టభద్రుల ఓట్లలో అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలన్నారు. ఓటేసే ముందే వారి నిజాయితీని తెలుసుకోవాలని తెలిపారు. రాష్ట్రభవిష్యత్తును, దేశ భవిష్యత్తును నిర్ణయించేది మన ఓటు హక్కేనని గుర్తించాలన్నారు. మీ అరచేతిలోని సెల్‌ఫోన్‌లో దేశంలో జరిగే ప్రతీ విషయం తెలుసుకుంటున్నారని.. ప్రధాని మోడీ గురించి మీకే ఎక్కువ తెలుసని ఈటల రాజేందర్ అన్నారు. కరోనా కాలంలో ఆయన ఇతర దేశాల నాయకులలాగ కన్నీళ్లు పెట్టకుండా ప్రజలకు ధైర్యం చెప్పి, వ్యాక్సిన్ ఇప్పించి కరోనా భయం లేకుండా చేసిన గొప్ప ప్రధాని అని కొనియాడారు. అయోధ్య రామమందిరాన్ని ప్రపంచం మెచ్చుకునే రీతిలో వైభవంగా కట్టించారని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాల మహిళలకు 12 కోట్ల టాయిలెట్లు కట్టించి వారి ఆత్మగౌరవాన్ని కాపాడారన్నారు. 4 కోట్ల మంది పేదలకు ఇల్లు కట్టించి సొంతింటి కల నెరవేర్చారని చెప్పారు. ప్రధాని మోడీ ప్రపంచంలోనే గొప్ప నాయకునిగా కీర్తించబడుతున్నారన్నారు. దేశంలో బాంబులు పేలకుండా ఉండాలంటే, దేశం సుభిక్షంగా ఉండాలంటే, ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే మోడీ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పునరుద్ఘాటించారు. ప్రేమేందర్ రెడ్డి 40 ఏళ్లుగా పార్టీని, ప్రజలను నమ్ముకుని సేవ చేస్తున్నారని.. వారిని గెలిపించాలని పట్టభద్ర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

 

*స్వాతి మాలివాల్ కేసులో బిభవ్ కుమార్‌ ముంబైకి తరలింపు
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో బిభవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు ముంబైకు తీసుకెళ్లారు. పోలీసుల కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌ను ముంబైకి తరలించారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముంబై తీసుకెళ్లింది. బిభవ్.. సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి తన ఐఫోన్‌ను ఫార్మాట్‌ చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫార్మాట్ చేసిన ఐఫోన్ లోని డేటాను సేకరించడానికి పోలీసులు ముంబైకి తీసుకెళ్లారు. బిభవ్ కుమార్ కస్టడీ వచ్చే గురువారంతో ముగియనుంది. తమ విచారణలో తేలిన అంశాల ఆధారంగా ఆయన రిమాండ్‌ను పొడిగించమని కానీ, సెక్షన్ 201 విధించేందుకు అనుమతించమని కానీ కోర్టును పోలీసులు కోరే అవకాశం ఉంది. నేరానికి సంబంధించిన సాక్ష్యాలను ధ్వంసం చేసే వ్యక్తులను శిక్షించేందుకు సెక్షన్ 201 నమోదు చేస్తారు. మే 13న కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మాలివాల్‌పై బిభవ్ కుమార్ దాడికి తెగబడ్డాడు. ఆమెను ఇష్టానురీతిగా హింసించి.. దాడికి పాల్పడ్డాడు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిభవ్ కుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీసులు కస్టడీలో ఉండడంతో లోతుగా విచారిస్తున్నారు. కేజ్రీవాల్‌ నివాసంలో కూర్చుని ఉండగా బిభవ్‌కుమార్ వచ్చి దాడి చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. 7-8 సార్లు చెంపపై కొట్టాడని.. ఛాతి, కడుపుపై కాలితో తన్నాడని తెలిపింది. పరిగెడుతుంటే చొక్కా పట్టుకొని వెనక్కి లాగాడని ఆరోపించింది. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పితో నడవలేకపోయానని.. ఎలాగోలా అతని నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్‌ చేసినట్లు స్వాతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం పోలీసులు మాలివాల్‌ను కేజ్రీవాల్ నివాసానికి తీసుకెళ్లి సీన్‌ రీక్రియేషన్‌ చేశారు. మెజిస్ట్రేట్‌ ముందు ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్‌ చేశారు. ఇదిలా ఉంటే స్వాతి మలివాల్‌పై దాడి అంశంపై దర్యాప్తునకు ఢిల్లీ పోలీసులు తాజాగా సిట్‌ని ఏర్పాటు చేసింది. దీనికి నార్త్ ఢిల్లీ అడిషనల్ డిప్యూటరీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంజిత చెప్యాల నేతృత్వం వహించనున్నారు. సిట్‌లో ముగ్గురు ఇన్‌స్పెక్టర్ ర్యాంకు అధికారులను చేర్చారు. వీరిలో కేసు నమోదైన సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లోని ఒక అధికారి కూడా ఉన్నారు.

 

*హైకోర్టులో చుక్కెదురు.. సిసోడియా బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియాకు హైకోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో బెయిల్ ఇవ్వాలని సిసోడియా కోరారు. కానీ ధర్మాసనం తిరస్కరించింది. మనీష్ సిసోడియా దాఖలు చేసిన ఇది రెండో బెయిల్ పిటిషన్. సీబీఐ అరెస్టు చేసిన తర్వాత 2023 ఫిబ్రవరి 26 నుంచి సిసోడియా కస్టడీలో ఉన్నారు. ఆ తర్వాత, మార్చి 9, 2023న ఈడీ అరెస్టు చేసింది. అయితే అనారోగ్యంతో ఉన్న భార్యను కలుసుకునేందుకు మాత్రం గతంలో సిసోడియాకు కోర్టు అనుమతినిచ్చింది. లిక్కర్ పాలసీ కేసులో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. కొంతమందికి లాభదాయకంగా పాలసీని రూపొందించినట్లుగా తెలిపింది. కొంతమంది వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చే భాగంలో అవినీతికి పాల్పడినట్లు న్యాయస్థానం పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. ఇంకా తీహార్ జైల్లోనే ఉన్నారు. ఆమెకు ఇంకా బెయిల్ లభించలేదు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా మార్చి 21న అరెస్ట్ అయ్యారు. అనంతరం తీహార్ జైలుకు తరలించారు. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా ప్రచారం చేసేందుకు జూన్ 1 వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. తిరిగి జూన్ 2న సరెండర్ కావాలని ఆదేశించింది.

 

*జార్జియాలో కారు ప్రమాదం.. ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి
అగ్రరాజ్యం అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా దూసుకెళ్లిన కారు.. చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు శ్రీయ అవసరాల, ఆర్యన్ జోషి, అన్వీ శర్మగా గుర్తించారు. అమెరికాలోని జార్జియా రాష్ట్రంలోని అల్ఫారెట్టాలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు భారతీయ సంతతికి చెందిన అమెరికన్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా… మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆస్పత్రిలో చేర్పించారు. బాధితులంతా 18 ఏళ్ల వయసు గలవారు. యువకుడితో పాటు ఇద్దరు మహిళలు ఉన్నారు. జార్జియాలోని అల్ఫారెట్టాలోని మాక్స్‌వెల్ రోడ్‌కు ఉత్తరాన వెస్ట్‌సైడ్ పార్క్‌వేలో మే 14న ఈ ప్రమాదం జరిగింది. ఆల్ఫారెట్టా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలిపారు. కారు చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. కారులో ఐదుగురు ఉన్నారు. ఆల్ఫారెట్టా ఉన్నత పాఠశాల మరియు జార్జియా విశ్వవిద్యాలయ విద్యార్థులు. వారిని అల్ఫారెట్టా హైస్కూల్‌లో సీనియర్ ఆర్యన్ జోషి, జార్జియా యూనివర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీయ అవసరాల, అన్వీ శర్మగా గుర్తించారు. గాయపడిన వారిని రిత్వాక్ సోమేపల్లిగా గుర్తించారు. ఇతడు జార్జియా స్టేట్ యూనివర్శిటీ విద్యార్థి. ఇక డ్రైవింగ్ చేస్తున్న మహమ్మద్ లియాకత్‌.. అల్ఫారెట్టా హై స్కూల్‌లో సీనియర్‌గా గుర్తించారు. వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఆర్యన్ జోషి, శ్రియ అవసరాల ఘటనా స్థలంలో మృతి చెందారు. అన్వీ శర్మ నార్త్ ఫుల్టన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఇక ఏప్రిల్‌లో జరిగిన కారు ప్రమాదంలో గుజరాత్‌లోని ఆనంద్‌కు చెందిన ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీషాబెన్ పటేల్ మృతిచెందారు.