NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

సంబరాలకు సిద్ధం కండి.. గెలిచేది మనమే..
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం అన్నారు జోగి రమేష్.. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణాల పేదలు.. ఒక్కతాటిపైకి వచ్చే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటువేశారని తెలిపారు.. అయితే, ఓటమి భయంతోనే టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి నేతలు మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని విమర్శించారు. మరోసారి అధికారంలోకి రాబోతున్నాం.. వైసీపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడని దుయ్యబట్టారు.. కూటమి గెలుస్తుందంటూ మావాళ్లను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారన్న ఆయన.. జూన్ 4వ తేదీన వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.. ఇక, పవన్ కల్యాణ్‌, చంద్రబాబు, పురంధేశ్వరి మాపై దాడులకు పురికొల్పుతున్నారని మండిపడ్డారు.. మరోవైపు.. ఈసారి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్‌, నందమూరి బాలకృష్ణ కూడా ఓడిపోతున్నారని జోస్యం చెప్పారు జోగి రమేష్‌.. కాగా, రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు మండిపడుతున్నారు.. ఇక, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను కలిసిన వైసీపీ నేతలు.. పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఫిర్యాదు చేశారు.. ఏపీ సీఈవోను కలిసిన వైసీపీ నేతల బృందంలో అంబటి రాంబాబు, జోగి రమేష్, మేరుగ నాగార్జున, పేర్ని నాని, అప్పిరెడ్డి తదితరులున్నారు..

ఈసీకి ఏం చెబుదాం..? సీఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ మల్లగుల్లాలు..!
ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డితో అత్యవసరంగా సమావేశం అయ్యారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ కూడా పాల్గొన్నారు.. అయితే, ఆ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది.. సుమారు గంటన్నర పాటు ముగ్గురు కీలక అధికారుల భేటీ అయ్యారు. మాచర్ల, నరసరావుపేట, తాడిపత్రి, అనంతపురం, గురజాల ఘటనలపై సమీక్షించారు. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై చర్చించారు. కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వాల్సిన అంశంపై కూడా ముగ్గురు కీలక అధికారులు చర్చించుకున్నారు. ఎన్నికల తర్వాత జరుగుతున్న హింసను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికలు ఇవ్వాలని భావిస్తున్నారు సీఎస్, డీజీపీ. మాచర్ల మొత్తం 144 సెక్షన్ అమలు చేశామన్నారు సీఈసీకి వివరించనున్నారు. హింసాత్మక ఘర్షణ విషయంలో ఇప్పటి వరకు ఎన్ని కేసులు పెట్టాం.. ఎంత మందిని అదుపులోకి తీసుకున్నామనే విషయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టం తెలపనున్నారు.

రాజకీయ కక్షతో దాడులు.. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు..
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల తర్వాత జరుగుతున్న గొడవలకు ఎన్నికల సంఘం వైఫల్యమే కారణమన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు అధికారులను ఎన్నికల ముందే బదిలీ చేశారన్నారు. ఈసీ నియమించిన పోలీసు అధికారులు… గొడవలను అరికట్టలేకపోతే… బాధ్యత వారిది కాదా అని ప్రశ్నించారు సజ్జల. ఏపీలో ఏకపక్షంగా దాడులు జరుగుతున్నాయన్నారు. ఈ గొడవలకు ఎలక్షన్‌ కమిషనే బాధ్యత వహించాలన్నారాయన. గొడవలను అరికట్టే ప్రయత్నం కూడా చేయడంలేదని ఆరోపించారు. పరిస్థితి ఇలానే కొనసాగితే బాధ్యత ఎవరిది అంటూ ప్రశ్నించారు సజ్జల. రాజకీయ కక్షతో టీడీపీ హింసా ఖాండ ప్రదర్శిస్తుందన్న ఆయన.. ఈసీ ఉదాసీనంగా వ్యవహరించింది.. ఘర్షణకు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదు.. ఎన్నికల సంఘం ముసుగులో ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహణ జరిగింది.. ఎన్నికల సంఘం అధికార, ప్రతిపక్షాలను సమానంగా చూడాలి.. కానీ అలా జరగలేదన్నారు. టిడిపి, బిజెపి పిర్యాదు ఇవ్వడం.. ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చెయ్యడం పథకం ప్రకారం జరిగిందని విమర్శించారు సజ్జల.. పోలీసు అబ్జర్వర్ పేరుతో వచ్చిన దీపక్ మిశ్రా అధికారులను బెదిరించాడు.. ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ అంతా టిడిపి ఆఫీస్ నుండి జరిగాయి.. వాటికి కావాల్సిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ మైనారిటీ రెడ్డి సామాజిక వర్గాల అధికారులను మార్చేశారు.. మా వాళ్ళని హౌస్ అరెస్టు చేశారు.. టీడీపీ వాళ్ళను బయట తిరగనిచ్చారు.. షెడ్యుల్ విడుదల అయినప్పటి నుండి ఈసీ ఏకపక్షంగానే వ్యవహరించింది.. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఇక్కడ ఈసీ తీరు ఉందని మండిపడ్డారు.

ఏపీలో కొనసాగుతోన్న టెన్షన్‌..! ఆ నియోజకవర్గాల్లో 144 సెక్షన్‌
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసినా… హింస్మాతక ఘటనలు మాత్రం ఆగడంలేదు. పల్నాడు జిల్లాలో నిన్న కూడా టీడీపీ-వైసీపీ మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో పోలీసులు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. నరసరావుపేటతోపాటు మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల నియోజకవర్గాల్లో నిన్న సాయంత్రం 6గంటల నుంచి 144 సెక్షన్‌ అమల్లో ఉంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు 144 సెక్షన్‌ కొనసాగుతుందని పోలీసు అధికారులు తెలిపారు. తాడిపత్రిలోనూ ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. తాడేపల్లి నియోజకంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో తాడిపత్రి పట్టణంలోనూ 144 సెక్షన్‌ విధించారు. మరోవైపు.. కడప, జమ్మలమడుగులోనూ 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు పోలీసులు. అభ్యర్థులు, కీలక నేలను ఇళ్లకే పరిమితం చేశారు. జమ్మలమడుగులో వైసీపీ, టీడీపీ, బీజేపీ పార్టీ ఆఫీసుల దగ్గర భారీగా పోలీసుల బలగాలు మోహరించాయి. అభ్యర్థుల ఇంటి దగ్గర కూడా… భద్రత పెంచారు. ఇక, 144 సెక్షన్‌ అమల్లో ఉన్న చోట… గుంపులుగా బయట తిరగకూడదు. రెచ్చగొట్టేలా కవ్వింపు చర్యలకు పాల్పడకూడదు. సభలు, సమావేశాలు పెట్టకూడదు. నిబంధనలు మీరితే… కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచర్చించారు.

బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాల వల్లే ప్రజల్లో ఆదరణ కోల్పోయింది
మిర్యాలగూడలో మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణలో మెజార్టీ స్థానాలలో కాంగ్రెస్ గెలుస్తుందని, కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి మంచి మెజార్టీతో గెలవబోతున్నాడని, ఏ పార్టీలో ఉన్నా జానారెడ్డి పార్టీ టికెట్లు, పదవులు అడగలేదన్నారు. ప్రజల్లో తనకు ఉన్న ఆదరణ చూసి తనకు అవకాశాన్ని ఆ పార్టీలు కల్పించాయని, రాష్ట్ర ఏర్పాటు కోసం సోనియా గాంధీని ఒప్పించడంలో నా పాత్ర ముఖ్యమైనదన్నారు జగ్గారెడ్డి. బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాల వల్లే ప్రజల్లో ఆదరణ కోల్పోయిందని, కేసిఆర్ మాటలు ప్రజలు విశ్వసించట్లేదన్నారు జగ్గారెడ్డి. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లక్ష్మణ్ పండితుడిలా జాతకాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఆగస్టులో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడుతుందని లక్ష్మణ్ ఎలా అన్నారని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారు అనటంలో అర్థం ఏంటి? అని ప్రశ్నించారు. 65 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఎందుకు పడిపోతుంది? అని ప్రశ్నించారు. ఐదేళ్లు మా ప్రభుత్వమే ఉంటుంది. మాకు 65.. బీఆర్ఎస్ నుంచి మనసుమార్చుకుని 20 మంది.. బీజేపీ నుంచి ఐదుగురు వస్తే.. మేము సేఫ్ కదా?, అప్పుడు మా బలం 90 కదా? సీఎం రేవంత్ రెడ్డికి క్లారిటీ ఉంది.. అదే నేను చెబుతున్నా?, కేసీఆర్ పార్టీ విలీనం చేస్తారు అనేది అవివేకం. చెప్పింది చేయడం గాంధీ కుటుంబానికి అలవాటు. మోసగాళ్లకు మోసగాళ్లు బీజేపీ నేతలు. మోసాలు చేయడంలో బీజేపీది ఇంటర్నేషనల్‌లో మొదటి ర్యాంక్ అని ఆయన అన్నారు.

బీజేపీకి ఈ కారణంగానే ఎక్కువ ఓట్లు వచ్చాయి
బీజేపీకి అనుకూలంగా అనూహ్య ఫలితాలు రానున్నాయని తెలంగాణ బీజేపీ చీఫ్‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలు ఉంటాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మా పై తప్పుడు ప్రచారం చేశారని, మజ్లిస్ పార్టీ సూట్ కేసులు తీసుకుని కాంగ్రెస్, బీఆరెస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారని ఆయన ఆరోపించారు. బీజేపీకి ఈ కారణంగానే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. మహిళలు, యువత పెద్ద ఎత్తున బీజేపీకి మద్దతుగా ఓటు వేశారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం కనబడుతోందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు బీజేపీ సరైన ప్రత్యామ్నాయంగా అవతరించబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అస్తిత్వం కోల్పోనుందని, ప్రజలు బీజేపీకి ఏకపక్షంగా మద్దతు తెలిపారన్నారు. తెలంగాణలో ఆర్థిక సంక్షోభం ఏర్పడే పరిస్థితులున్నాయని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా అనవసర ఖర్చులు చాలా చేశాయని ఆయన అన్నారు. డిసెంబర్‌ 9న రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పారు, ఇప్పటికైనా సీఎ రేవంత్‌ రెడ్డి అబద్ధాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉందన్నారు. అడుగడుగునా హామీలపై కాంగ్రెస్‌ను నిలదీస్తామని చెప్పారు. రేవంత్ పాలన మొదలుపెట్టకుండానే పరీక్ష అంటున్నారని, వచ్చే ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వస్తే రేవంత్ ఏం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వచ్చిందన్నారు.

ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ నామినేషన్ తిరస్కరణ..
ప్రముఖ హాస్యనటుడు, యూట్యూబర్ శ్యామ్ రంగీలా అభ్యర్థిత్వాన్ని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా శ్యామ్ రంగీలా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా.. అఫిడవిట్ సమర్పించనందున శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. శ్యామ్ రంగీలా ప్రధాని నరేంద్ర మోడీపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగిన సంగతి తెలిసిందే.. శ్యామ్ రంగీలా మిమిక్రీ ఆర్టిస్ట్.. అతను ప్రధాని మోడీ, రాహుల్ గాంధీతో సహా చాలా మంది నాయకులను అనుకరించేవాడు. దీంతో ఆయన పలుమార్లు వివాదాల్లో కూడా చిక్కుకున్నాడు. కొద్ది రోజుల క్రితం నుంచి ప్రధాని మోడీపై ఎన్నికల్లో పోటీ చేస్తానని శ్యామ్ ప్రకటిస్తూ వస్తున్నాడు. శ్యామ్ రంగీలా ఎంతో కృషి తర్వాత వారణాసి లోక్‌సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఇందుకోసం సోషల్ మీడియాలో నిరంతరం పోస్టులు పెట్టేవాడు. అయితే.. నామినేషన్ తిరస్కరణకు గురైన తర్వాత.. భావోద్వేగానికి గురయ్యాడు. శ్యామ్ రంగీలా మాట్లాడుతూ.. కష్టపడి కష్టపడి నిన్న వారణాసి లోక్‌సభ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేశామని చెప్పారు. తాము అన్ని పత్రాలు, ముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకుని నమోదు చేశామని.. కానీ ఈరోజు మీరు నామినేషన్ సమయంలో చేసిన ప్రమాణాన్ని నెరవేర్చలేదని చెప్పారు. దీని కారణంగా నామినేషన్ ఫారమ్ తిరస్కరించబడిందని ఎన్నికల అధికారులు తెలిపారన్నారు. కాగా.. కొద్దిరోజుల క్రితం తనను నామినేషన్ దాఖలు చేసేందుకు అనుమతించడం లేదంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ఎన్నో వివాదాల తర్వాత మే 14న నామినేషన్ దాఖలు చేశారు.

స్లోవేకియా ప్రధానిపై కాల్పులు.. తృటిలో తప్పిన ప్రాణాపాయం..
స్లోవేకియా ప్రధాని రాబర్ట్ ఫికోపై దుండుగుడు కాల్పులు జరిపాడు. అయితే, ఈ కాల్పుల్లో ప్రధాని గాయపడ్డాడు. తృటిలో ప్రాణాపాయం తప్పింది. అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం మధ్యాహ్నం జరిగిన కాల్పుల్లో ప్రధాని రాబర్ట్ ఫికోపై కాల్పులు జరిపిన తర్వాత, ఆయనని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ పరిణామంతో దేశ పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. రాజధానికి ఈశాన్యంగా 150కి.మీ దూరంలో ఉన్న హ్యాండ్‌లోవా పట్టణంలోని తన మద్దతుదారులతో మాట్లాడుతున్న సమయంలో హౌజ్ ఆఫ్ కల్చర్ వెలుపల ఈ దాడి జరిగింది. నాలుగు రౌండ్లు కాల్పులు జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దాడి జరిగిన ప్రాంతాన్ని పోలీసులు ముట్టడించారు. కీలకమైన యూరోపియన్ పార్లమెంట్ ఎన్నికలకు మూడు వారాల ముందు స్లోవేకియాలో కాల్పులు జరిగాయి. ప్రధాని ఫికోపై జరిగిన దాడిని ఆ దేశ ప్రతిపక్షాలు ఖండించాయి. ఈ దాడిని ప్రెసిడెంగ్ జునానా కాపుటోవా క్రూరమైనదిగా వర్ణించారు. క్లిష్టసమయంలో రాబర్ట్ ఫికోకు అండగా ఉండాలని, త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఫికో కరడుగట్టిన రైట్ వింగ్ నాయకుడిగా పేరుంది. పాశ్చాత్య దేశాలను కాదని, ఇతను హాలాండ్ మార్గాన్ని అనుసరిస్తున్నారనే పేరుంది. ఫికో విధానాలను నిరసిస్తూ వేలాది మంది రాజధానిలో మరియు స్లోవేకియా అంతటా ఇటీవల ర్యాలీలు నిర్వహించారు. ఫికోపై దాడిని యూరప్ లోని ఇతర దేశాధినేతలు తీవ్రంగా ఖండించారు.

పాకిస్తాన్‌కి మోడీ లాంటి నాయకుడు కావాలి.. పాక్ వ్యాపారవేత్త ప్రశంసలు..
పాకిస్తాన్‌కి ప్రధాని నరేంద్రమోడీ లాంటి నాయకుడు కావాలని పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ వ్యాఖ్యానించారు. మోడీ మూడోసారి కూడా గెలుస్తారని జోస్యం చెప్పారు. పాకిస్తాన్-భారత్‌తో చర్చలు ప్రారంభించి వాణిజ్యం ప్రారంభించాలని సూచించారు. భారతదేశాన్ని ప్రధాని మోడీ కొత్త శిఖరాలకు తీసుకెళ్లాడని, ఆయన బలమైన నేత అని తరార్ కొనియాడారు. సాజిద్ తరార్ మాట్లాడుతూ.. మోడీ భారతదేశానికి మాత్రమే కాదు, ఈ ప్రాంతానికి, ప్రపంచానికి చాలా మంచివాడు. పాకిస్తాన్‌కి కూడా అతనిలాంటి నాయకుడు వస్తాడని ఆశిస్తున్నానని అన్నారు. భారత్ యువజనాభా నుంచి లాభం పొందుతుందని చెప్పారు. ‘‘ మోడీ గొప్పనాయకుడు. ఆయన సహజ నాయకుడు, ప్రతికూల పరిస్థితుల్లో పాకిస్తాన్‌లో పర్యటించి, తన రాజకీయాలను పణంగా పెట్టిన ఏకైక ప్రధాని ఆయనే. మోడీజీ పాకిస్తాన్‌తో చర్చలు, వాణిజ్యం ప్రారంభిస్తారని ఆశిస్తున్నాను’’ అని తరార్ చెప్పారు. శాంతియుత పాకిస్తాన్ భారత్‌కి కూడా మంచిదని, భారతదేశ తదుపరి ప్రధాని మోడీనే అని అన్నారు. తరార్ 1990లో యూఎస్ వెళ్లి వ్యాపారంలో స్థిరపడ్డారు.

ఫ్యూచర్లో ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలవాలంటే.. మాజీ క్రికెటర్ సలహా..!
ఈసారి ఐపీఎల్లో ఆర్సీబీ టైటిల్ సాధిస్తుందనే గట్టి నమ్మకం క్రికెట్ అభిమానుల్లో ఉండేది. కానీ.. ఈసారి కూడా టైటిల్ గెలువలేకపోతుంది. సీజన్ ప్రారంభంలో అన్నీ మ్యాచ్ ల్లో ఓడిపోయి.. చివర్లో గెలుస్తూ వస్తున్నారు. కానీ.. ఆర్సీబీకి ప్లేఆఫ్స్ చేరడం కష్టమే. ఈ క్రమంలో.. టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆర్సీబీకి సలహా ఇచ్చారు. భవిష్యత్తులో ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవాలంటే.. భారత ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. 17 ఏళ్ల నుంచి వేచి చూస్తున్న ఆర్సీబీ కప్ గెలవాలంటే భారత ఆటగాళ్లపై నమ్మకం ఉంచాలని కైఫ్ సూచించారు. మహ్మద్ కైఫ్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.., ఆర్సీబీ వరుస ఓటములపై స్పందించారు. ఈ సీజన్ లో ఆర్సీబీ చాలా పేలవంగా ఆడిందని అన్నారు. అయితే, చివర్లో వరుస విజయాలను కూడా అభినందించారు. వరుసగా ఆరు పరాజయాలు పొంది జట్టు చాలా వెనుకబడిపోయిందని కైఫ్ తెలిపారు. వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిపోవడంతో టోర్నీలో ఆ జట్టుకు నెల రోజుల పాటు విజయం లేకుండానే మిగిలిపోయిందని అన్నారు. టోర్నీలో ఆర్సీబీ వెనుకబడి ఉండటానికి కారణం ఇదే అన్నారు. అయితే పునరాగమనాన్ని అభినందించాలని.. ఆర్సీబీ వారి అనుభవాల నుండి నేర్చుకోవాలని సూచించారు.

కాజల్ కోసం ‘వెతుకు వెతుకు..’ అంటున్న కీరవాణి
‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. “సత్యభామ” సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు “సత్యభామ” సినిమా నుంచి థర్డ్ సింగిల్ ‘వెతుకు వెతుకు..’ రిలీజ్ చేశారు. ఈ పాటను శ్రీచరణ్ పాకాల కంపోజిషన్ లో ఆస్కార్ విజేత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పాడటం విశేషం. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించారు. అమ్మాయిలపై జరుగుతున్న హత్యాయత్నాల నేపథ్యంలో..బాధిత యువతులను చూసి చలించిపోతుంది పోలీస్ ఆఫీసర్ సత్యభామ. ఆ నేరస్తులను పట్టుకోవడానికి సిద్ధమవుతుంది. ఆ సందర్భంలో వచ్చే పాట ఇది. ‘వెతుకు వెతుకు వెతుకు వెనకాడకుండ వెతుకు, వెతుకు వెతుకు వెతుకు ఆశ కొరకు నిరాశలోనే వెతుకు. కాంతి కొరకు నిశీధిలోనే వెతుకు…’ అంటూ ఇన్ స్పైర్ చేసేలా సాగుతుందీ పాట. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, లిరికల్ సాంగ్స్ తో “సత్యభామ” సినిమా మీద మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఏర్పడుతున్నాయి.

భయపెట్టడానికి దేవర వస్తున్నాడు.. గెట్ రెడీ!
సోషల్ మీడియా అంతా ఎన్టీఆర్ నామస్మరణతో మారుమోగిపోతుంది. దేవర ఫస్ట్ సింగిల్ మే 19న రిలీజ్ చేయబోతున్నాం అని మేకర్స్ అనౌన్స్ చేసినప్పటి నుంచి దేవర ట్యాగ్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. కొత్త ప్రపంచంలో పీరియాడిక్ సీ బ్యాక్ డ్రాప్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 5న గ్రాండ్ రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ అక్టోబర్ 10కి వాయిదా పడింది. ఇక మే 19న దేవర ఫస్ట్ సింగిల్ రానుండడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈ మేరకు దేవర సినిమా యూనిట్ ఒక పోస్టర్ కూడా వదిలింది. ఫియర్ సాంగ్ వస్తోందని చెబుతూ పోస్టర్ లో ఎన్టీఆర్ చేయి గొడ్డలి పట్టుకుని ఉన్నట్టుగా రిలీజ్ చేశారు. ఇక దేవర ప్రాజెక్ట్.. సౌత్ ట్రేడ్లో కంటే బాలీవుడ్ లోనే ఎక్కువగా హైలెట్ అవుతుంది. జాన్వీ కపూర్,సైఫ్ అలీ ఖాన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఇందులో నటించడం పైగా బి టౌన్ మార్కెట్ స్పేస్ వీరికంటూ స్పెషల్ గా ఉండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయేలా చేశాయి. సైఫ్ అలీ ఖాన్ నటించిన ఫస్ట్ తెలుగు టెక్నీషియన్స్ మూవీగా దేవరను ట్రీట్ చేస్తున్నారు. తాజాగా తారక్ వార్ -2 సెట్ లోకి అడుగు పెట్టడంతో దేవర హిందీ రైట్స్ అప్ డేట్స్ ను బి టౌన్ మీడియా వైరల్ చేస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పుడున్న ట్రెండ్ ను అర్థం చేసుకుని హిందీ థియేట్రికల్ రైట్స్ ను ధర్మ ప్రొడక్షన్స్ , ఏఏ ఫిలిమ్స్ ఇండియా వారు సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో విపరీతమైన క్రేజ్ వచ్చింది. దేవర కి ఇది ప్లస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంతేకాక హిందీ లో ప్రముఖ నిర్మాణ సంస్థలు హిందీ రైట్స్ కొనుగోలు చేయడం తో దేవర హిందీ వసూళ్ల పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ప్రేమలు నటుడి ఇంట తీవ్ర విషాదం
ప్రేమలు సినిమాలో థామస్ అనే పాత్రతో తెలుగు వారికి కూడా దగ్గరైన యువ నటుడు మాథ్యూ థామస్‌ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. మాథ్యూ థామస్‌ కుటుంబం ప్రయాణిస్తున్న జీపు బోల్తా పడి దగ్గరి బంధువు ఒకరు మృతి చెందారు. మామల తురుత్తికి చెందిన రిటైర్డ్ టీచర్ బీనా డేనియల్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. బీనా వయసు 61 సంవత్సరాలు. బీనాను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. ఇక తిరువనంతపురంలో మాథ్యూ తండ్రి బిజు, తల్లి సుసాన్, మృతుడు బీనా భర్త సాజు గాయాలతో ఆస్పత్రిలో చేరారు. బుధవారం అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని అంటున్నారు. వారు తమ బంధువు మరణానంతర కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో తిరువనంతపురంలోని షష్టమ్స్‌లో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారిపై జీపు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో మాథ్యూ సోదరుడు జాన్ వాహనం నడుపుతున్నా అతనికి తీవ్రంగా గాయాలు కాలేదు. బీనా భర్త సాజు, మాథ్యూ తల్లిదండ్రులు బిజు, సుసన్‌లకు కూడా గాయాలయ్యాయి. వారిని ఎర్నాకులం మెడికల్ ట్రస్ట్ ఆసుపత్రిలో చేర్చారు.