NTV Telugu Site icon

Top Headlines @ 9PM : టాప్‌ న్యూస్

Top Headlines

Top Headlines

*జగన్‌ విశాఖలో సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు..

రాష్ట్రం అంతా ఫ్యాన్ గాలి బలంగా వీచిందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడ్డామన్న సీఎం హామీలను ప్రజలు విశ్వసించారని ఆయన పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆత్మగౌరవం కాపాడారన్న అభిమానం ముఖ్యమంత్రిపై మహిళలలో పెరగడం వల్ల నిన్న ఎద్ద ఎత్తున ఓటింగ్ జరిగిందన్నారు. ఇది నూతన ఒరవడి అంటూ పేర్కొన్నారు. టీడీపీ మోసాలు , కుయుక్తులు చేసిందని ఆయన విమర్శించారు. ల్యాండ్ యాక్ట్‌పై టీడీపీ చేసిన ప్రచారాలను రైతులు నమ్మలేదన్నారు. రాజకీయాల్లో చిత్తశుద్ధి ముఖ్యమని, దానిని చూసే ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారన్నారు. విశాఖలో ప్రమాణ స్వీకారం తేదీని ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. జగన్‌ విశాఖలో సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారన్నారు. పండుగ లాంటి వాతావరణంలో ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో కూటమి దిగజారిపోయిందని.. ఇది పరాకాష్ట అని పేర్కొన్నారు. కూటమి దౌర్జన్యాలకు పాల్పడితే మేం సంయమనం పాటించామన్నారు. ప్రతిపక్షం చేష్టలు, చేతలు,మాటలు ఎంత రెచ్చగొట్టే విధంగా వున్న సంయమనం పాటించమనేది మా పార్టీ అధ్యక్షుడి ఆదేశమన్నారు. వైసీపీ కార్యకర్తలు సహకరించడంతో మంచి పోలింగ్ జరిగిందన్నారు. 175కి 175 గెలుస్తామని.. ప్రజల నాడి తెలుసు కనుకే మా నాయకుడు ఆ నినాదం తీసుకున్నారన్నారు. హింసాత్మక ఘటనలు ఎవరి మీద జరుగుతున్నాయో చూడాలన్నారు. ఓటమి భయంతో వైసీపీ మీద టీడీపీ దాడులకు తెగబడుతోందన్నారు. జరుగుతున్న దాడులలు చూస్తుంటే ఎవరు ఓటమి భయంతో వున్నారో అర్థం అవుతుందన్నారు. సీఎం విదేశాలకు వెళ్ళాలనేది ఎన్నికల ముందే నిర్ణయం జరిగిందన్నారు. విద్యావ్యవస్థకు సంబంధించిన మీటింగ్ ఒకటి వుంటుందన్నారు. ఎన్నికల ముందు షెడ్యూల్ చెబితే ఎన్నికలకు ముడిపెడతారని ప్రకటించలేదన్నారు. ఏపీలో ఊహించని ఫలితాలు రాబోతున్నాయని చంద్రబాబు చెప్పింది నిజమేనన్నారు. గతంలో వచ్చిన 23 కూడా ఇప్పుడు రావన్నారు.

 

*జగన్‌ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. సీఎం జగన్‌ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 17 నుండి జూన్ 1 వరకు యూకే వెళ్ళడానికి జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. తమ కుటుంబ సమేతంగా సీఎం జగన్ విదేశీ పర్యటన చేయనున్నారు. సీబీఐ కోర్టు అనుమతితో ఈ నెల 17న జగన్ లండన్ వెళ్లనున్నారు. లండన్‌, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌లో పర్యటించేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పర్యటనపై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్రమాస్తుల కేసులో విచారణ జరుగుతోందని, అనుమతి ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది.

 

*రేపటి నుండి పరిపాలన మీద దృష్టి సారిస్తున్నాం: రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపటి నుండి పరిపాలన మీద దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రుణమాఫీ పై ఫోకస్, విద్యాశాఖ మీద ఫోకస్, అన్ని హస్టల్స్ కి సన్న బియ్యం.. బీఆర్ఎస్ ఇచ్చిన సన్న బియ్యం కాదు.. నిజమైన సన్నబియ్యం ఇస్తామని అన్నారు. త్వరలో బ్యాంకర్ల సమావేశం ఉంటుందన్నారు. రుణమాఫీ పై చర్యలు, రైతుల రుణాలు ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రైతుల రుణాలు మాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని.. దాని ద్వారా రుణాలు మాఫీ చేసుకోవచ్చని తెలిపారు. మరోవైపు.. దేశంలో బీజేపీకి పూర్తి మెజార్టీ రాదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సగం కాంగ్రెస్, సగం బీజేపీకి పోతే బీఆర్ఎస్ పార్టీనే ఉండదని విమర్శించారు. కాగా.. కాంగ్రెస్ పై ఎవరు ఏం విమర్శలు చేసినా పట్టించుకోమన్నారు. తాము 13 సీట్లు గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి కొన్ని ప్రాంతాల్లో డిపాజిట్ కూడా రాదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు పోటీ బీఆర్ఎస్ అని.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పోటీ అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలేనని.. బీఆర్ఎస్ అదే చేస్తుందని అన్నారు. నా పరంగా ఎన్నికలు ముగిసాయి.. రేపటి నుండి పరిపాలనపై ద్రుష్టి పెడతానని ముఖ్యమంత్రి తెలిపారు. రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర పైనే ఎక్కువ ఫోకస్ ఉంటుందన్నారు. రైతు పండించే వాటిని రేషన్ షాపుల్లో అందించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. మిల్లర్లు మింగి కూసుంటాం అంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. మరోవైపు.. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పారు. విద్యుత్ శాఖలో కొందరు కావాలని పవర్ కట్ చేస్తున్నారని.. వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి.. పూర్తి స్థాయి చర్యలు ఉంటాయన్నారు. మరోవైపు.. రిటైర్డ్ ఉద్యోగుల పై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

 

*చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి
ఏపీలో పోలింగ్ తర్వాత కూడా దాడు ఆగడం లేదు. ఎన్నికల సంఘం ఎన్ని చర్యలు చేపట్టినా దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తిరుపతి జిల్లా స్ట్రాంగ్‌ రూమ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్ట్రాంగ్‌రూమ్‌ను పరిశీలించేందుకు వచ్చిన చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన జరిగింది. రామాపురంకు చెందిన ఓ వైసీపీ నేత, అతని అనుచరులు సుత్తి, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. పులివర్తి నాని కారు ధ్వంసం కాగా.. గన్‌మెన్‌కు బాగా గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే పులివర్తి నాని గన్‌మెన్‌ రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. కాల్పులు జరపగా.. నిందితులు అక్కడి నుంచి వెళ్లపోయారు. ఈ దాడి గురించి పులివర్తి నాని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. పులివర్తి నానిపై దాడి నేపథ్యంలో పద్మావతి మహిళా వర్శిటి స్టాంగ్ రూం వద్ద పరిస్థితులు అదుపు తప్పాయి. పులివర్తి నానికి మద్దతు చేరుకున్న వేలాది మంది కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వైసీపీ నేత వాహనాన్ని ధ్వంసం చేశారు. నిందితులను అరెస్టు చేసి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. పద్మావతి వర్సిటీ లోపలే టీడీపీ కార్యకర్తలు ధర్నాకు దిగుతున్నారు. ఈ క్రమంలో అక్కడికి పోలీసులు భారీగా చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

 

*తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం.. సీఐ తలకు గాయం !
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్‌ ముగిసినా అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటూనే ఉన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. మంగళవారం తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైసీపీ నేతలపై టీడీపీ నేతలు దాడికి యత్నించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ నేతలు రాళ్ల దాడికి ప్రయత్నించారు. దీంతో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరు పార్టీల నేతలు పరస్పరం రాళ్లదాడికి దిగగా ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. రాళ్ల దాడిలో సీఐ మురళీకృష్ణకు తీవ్ర గాయాలవ్వగా.. ఆస్పత్రికి తరలించారు. టీడీపీ నేత సూర్యముని ఇంటి వద్ద జరిగిన ఘర్షణలో సీఐకి గాయాలయ్యాయి. రాయలసీమలోని అత్యంత సమస్యాత్మక నియోజకవర్గమైన తాడిపత్రి ఎన్నికల ప్రారంభం నుంచి రావణ కాష్టంలా రగులుతుంది. అడుగడుగున వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతూ ఘర్షణ వాతావరణం సృష్టిస్తున్నారు.

 

*5 రూపాయిల కుర్కురే కొనివ్వలేదని భర్తను వదిలేసిన అర్ధాంగి
భార్యాభర్తలన్నాక చిన్ని చిన్న అలకలు.. కోపగించుకోవడాలు ప్రతి ఇంట్లో సహజంగానే ఉంటాయి. అది కూడా కొద్ది సేపు ఉంటుంది. ఆ తర్వాత అంతా మామూలు అయిపోతుంది. సంసారం అంటేనే ఒకరికొకరు అర్థం చేసుకోవడం.. సర్దుకుపోవడం అంటారు. అన్ని సమయాల్లో ఆశించినవి దొరకవు.. పరిస్థితులను బట్టి అర్థం చేసుకుంటే.. ఆ సంసారం మూడు పువ్వులు.. ఆరుకాయలు అన్నట్టుగా వెలిగిపోతుంది. ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవండి. ఉత్తరప్రదేశ్‌లో ఓ వింతైన సంఘటన చోటుచేసుకుంది. భర్త కుర్కురే కొనివ్వలేదని ఏకంగా భర్తకు విడాకుల నోటీసు పంపించింది ఓ ఇల్లాలు. ఈ ఘటన ఆగ్రాలో వెలుగుచూసింది. గతేడాదే వారిద్దరికి వివాహం అయింది. పెళ్లైన కొత్తలో ఇద్దరూ అన్యోన్యంగానే ఉన్నారు. భార్య అడకుండానే అన్ని కొనిచ్చి ప్రేమగా చూసుకున్నాడు. డ్యూటీ నుంచి వచ్చేటప్పుడే భార్యకు నచ్చిన స్నాక్స్‌ను తీసుకొస్తూ ఉండేవాడు. అలా ఆమె చిరుతిళ్లకు అలవాటు పడింది. ఇప్పుడు అదే ఆ సంసారానికి నిప్పు పెట్టింది. భార్యను మురిపించేందుకు సంవత్సరం కాలమంతా బాగానే చూసుకున్నాడు. అయితే ఈ మధ్య భర్త ఎలాంటి స్నాక్స్ ఇంటికి తీసుకురావడం లేదు. దీంతో దంపతుల మధ్య రోజూ గొడవ జరుగుతోంది. ఐదు రూపాయల కుర్కురే తీసుకురాలేవంటూ భర్తతో భార్య గొడవ పడుతుంది. ఎంత చెప్పినా స్నాక్స్ తీసుకురావడం లేదని విసుగెత్తిన ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అంతేకాకుండా భర్తకు విడాకుల నోటీసు పంపించింది. ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కింది. తన భార్య పోరు భరించలేకపోతున్నానని.. రోజూ కుర్కురే తీసుకురావాలని గొడవ చేస్తుందని బాధితుడు పోలీసుల ముందు మొర్రపెట్టుకున్నాడు. దీంతో భార్యాభర్తలిద్దరినీ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇప్పించారు. కుటుంబ సలహా కేంద్రం వారు.. జంటకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా ఇద్దరిలో మార్పు కనిపించలేదు. మరోసారి రావాలని పోలీసులు ఇంటికి పంపించారు. ఇంతలోనే ఆమె విడాకులకు అప్లై చేసింది. భార్యాభర్తల మధ్య గొడవకు ఐదు రూపాయల కుర్కురే కారణమని పోలీసులు తెలిపారు. ఆమెకు కుర్కురే అంటే విపరీతమైన ఇష్టమని చెప్పారు. పెళ్లైన కొత్తలో భర్త.. రోజూ తెచ్చేవాడని.. ఇప్పుడు తీసుకురాకపోవడం వల్లే సంసారంలో గొడవలు మొదలయ్యాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ జంటకు 2023లో వివాహం అయిందని వెల్లడించారు.

 

*200 ఫ్లైట్‌లు ఎక్కాడు.. లక్షల్లో దోచేశాడు.. ఘరానా దొంగ ఎలా దొరికాడంటే..!
మనం ఎక్కువగా ఇళ్లల్లో దొంగతనాలు.. లేదంటే చైన్‌స్నాచింగ్‌లు.. ఇంకా లేదంటే దారి దోపిడీలు చూసుంటాం. వినుంటాం. కానీ ఓ కేటుగాడు ఏకంగా ఆకాశంలో తిరిగే విమానాలను టార్గెట్ చేసుకున్నాడు. సహజంగా విమానాల్లో బాగా ధనవంతులు, లేదంటే ఆయా రకాలైన వీఐపీలు ప్రయాణం చేస్తుంటారు. చిన్న చిన్న దోపిడీలతో ఉపయోగం లేదనుకున్నాడో.. ఏమో తెలియదు గానీ.. ఏకంగా విమానాల్లో చోరీలకు పాల్పడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇలా లక్షల్లో దోచుకున్నాడు. కానీ పాపం పండి ఖాకీలకు చిక్కి కటకటాల పాలయ్యాడు. రాజేష్ కపూర్ అనే వ్యక్తిని ఏకంగా 110 రోజుల్లో 200 విమానాలు ఎక్కాడు. అలా ప్రయాణాలు చేస్తూ లక్షల విలువైన ఆభరణాలను దొంగిలించాడు. అయితే గత నెలలో హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఓ మహిళ తన హ్యాండ్‌బ్యాగ్‌లోని రూ. 7 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయని చెప్పడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై సీసీకెమెరాలను జల్లెడ పట్టగా కొత్త తరహా చోరీని ఛేదించారు. మొత్తానికి రాజేష్ కపూర్ అనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. విచారణలో అతడు చేసిన నేరాలను పోలీసులు కక్కించారు. నిందితుడికి ఢిల్లీ పహర్‌గంజ్‌లోని రికీ డీలక్స్ అనే గెస్ట్‌హౌస్ ఉండడం విశేషం. రాజేష్.. గత సంవత్సరం 200 విమానాలు ఎక్కినట్లుగా గుర్తించారు. 2023లో అనేక మంది ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులను దొంగిలించాడు. విమానాశ్రయాల్లో దోపిడీలు చేసేందుకు అతడు 100 రోజుల పాటు దేశంలో వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. అయితే గత నెలలో హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఓ మహిళ తన హ్యాండ్‌బ్యాగ్‌లోని రూ. 7 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయని చెప్పడంతో ఢిల్లీ పోలీసులు ఈ చోరీని ఛేదించారు. అలాగే తన క్యాబిన్ బ్యాగ్ నుంచి రూ. 20 లక్షల విలువైన వస్తువులు దొంగిలించబడ్డాయని యూఎస్ నుంచి వచ్చిన మరో వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తానికి పోలీసులు రంగంలోకి దిగి కొన్ని గంటల ఫుటేజీని స్కాన్ చేయగా.. రాజేష్ కపూర్ భండారం బయటపడింది. అనంతరం కేటుగాడ్ని అరెస్టు చేశారు. నిందితుడు వృద్ధులు, మహిళా ప్రయాణీకులను లక్ష్యంగా ఎంచుకున్నాడని పోలీసులు తెలిపారు. విమానాశ్రయంలో బాధితుల ప్రవర్తనను గమనించేవాడని సీనియర్ పోలీసు చెప్పాడు. బ్యాగ్‌లోని విలువైన వస్తువుల గురించి వారిని అనుసరించేవాడన్నారు. బ్యాగేజీ డిక్లరేషన్ స్లిప్‌లోని సమాచారాన్ని తెలివిగా చదివాడని చెప్పారు. ఇక బోర్డింగ్ గేట్ దగ్గర ఎక్కువగా సంభాషించడాన్ని చూసినట్లు పోలీసులు చెప్పారు. కనెక్టింగ్ ఫ్లైట్స్‌లో ప్రయాణించే ప్రయాణికులను రాజేష్ లక్ష్యంగా చేసుకున్నాడని ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఉషా రంగరాణి తెలిపారు. ఏప్రిల్‌లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న మహిళ ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయం నుంచి యూఎస్‌కి కనెక్టింగ్ ఎయిర్ ఇండియా విమానం ఎక్కవలసి వచ్చింది. అదే విధంగా యూఎస్ నివాసి వర్జిందర్‌జిత్ సింగ్.. అమృత్‌సర్ నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు ప్రయాణిస్తున్నాడు. ఢిల్లీ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్‌ ఎక్కినప్పుడు చోరీ జరిగిందని వెల్లడించారు. నిందితుడు ప్రయాణికుల పక్కనే ఉండేలా సీటు మార్చాల్సిందిగా విమానయాన సంస్థను కోరేవాడని పోలీసులు తెలిపారు.

 

*అపరిచితుడు మళ్ళీ వస్తున్నాడు… జాగ్రత్త!
సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, ప్రముఖ నిర్మాత వీ రవిచంద్రన్ కాంబినేషన్‌లో విక్రమ్, సదా నటించిన అపరిచితుడు సినిమా చాలా మందికి ఇష్టమైన సినిమాల్లో ఒకటి. ప్రభుత్వ అధికారుల్లో అవినీతి, అక్రమాల కథ నేపథ్యంగా రూపొందిన ఈ సినిమా 2005లో రిలీజై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా విక్రమ్‌ను స్టార్ హీరోగా, కమర్షియల్ హీరోగా మార్చగా అప్పటి నుంచి మార్కెట్లో దూసుకు పోతున్నాడు. ప్రస్తుతం రీ రిలీజ్‌ల హవా కొనసాగుతున్న నేపథ్యంలో అపరిచితుడు సినిమాను మే 17వ తేదీన రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. ఆస్కార్ సినిమా బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రాన్ని 20 కోట్ల రూపాయలతో నిర్మించగా సుమారుగా 60 కోట్ల రూపాయల షేర్ ప్రపంచవ్యాప్తంగా సాధించి పెట్టింది. ఈ సినిమా ఆ ఏడాది రిలీజైన అన్ని చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో విక్రమ్, ప్రకాశ్ రాజ్ మధ్య వచ్చే సన్నివేశాలు హై ఓల్టేజ్‌ను అందించగా విక్రమ్ నట విశ్వరూపాన్ని ప్రేక్షకులు చూడగలిగారు. ద్విపాత్రాభినయంతో రెమో అనే అపరిచితుడుగా, బ్రాహ్మణుడిగా రెండు పాత్రల్లో దుమ్మురేపారు. ఇక ఈ సినిమాకు హ్యారీష్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. ఆయన రూపొందించిన పాటలు చార్ట్‌బస్టర్‌‌లో బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆ సాంగ్స్ కుర్రకారును ఉర్రూతలూగించాయి. ఇలాంటి సినిమాను రీ రిలీజ్ అవుతుందంటే.. ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక తెలుగు, తమిళ రాష్ట్రాల్లో అపరిచితుడు రీరిలీజ్‌కు అంతా సిద్దమైంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ మొదలవ్వగా మంచి స్పందన కనిపిస్తుంది. ఎన్నికల తర్వాత సరైనా సినిమా థియేటర్‌లో లేకపోవడంతో విక్రమ్ చిత్రం భారీ వసూళ్లను నమోదు చేస్తుందని ఆశిస్తున్నారు నిర్మాతలు.