NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

పొత్తులపై పవన్‌ క్లారిటీ.. టీడీపీ నేతలను సీఎంను చేయడానికి జనసేన లేదు..!
పొత్తులపై మరోసారి క్లారిటీ ఇచ్చారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనసేన మండల, డివిజన్‌ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడిన పవన్‌.. సీఎం.. సీఎం అనే కేకలు వేస్తే ముఖ్యమంత్రి కాలేను. క్రేన్లతో గజమాలలు వేసే కన్నా.. ఓట్లు వేయాలి. ఓట్లు వేస్తేనే సీఎం అవుతామని గుర్తించాలని సూచించారు. ప్రజాశక్తిని ఓట్ల కింద మార్చుకోవాలంటే నా అంత బలంగా తిరగాలి. ఏం చేసినా నిర్మాణాత్మకంగా చేయాలి. సీఎం అనే పదవి రావాలంటే సముచిత స్థానంలో గెలిపించాలని పిలుపునిచ్చారు.. సీఎం అభ్యర్థి ఎవరనేది ఎన్నికలయ్యాక తేలుతుందన్న పవన్.. ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చాయో చూసి ఆ తర్వాత సీఎం అభ్యర్థి ఖరారు అవుతారని తెలిపారు.. సీఎం అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు.. ఈ సీఎం ఉండకూడదనేదే ముఖ్యం అన్నారు. ఆవేశంతో రాజకీయం చేయకూడదు.. టీడీపీ-బీజేపీలతో పొత్తుకు సిద్ధమనే ప్రకటించాం.. ఇంకా విధి విధానాలు ఖరారు కాలేదు. పొత్తు ఖరారై.. విధి విధానాలు ఓకే అయితే కామన్ మినిమమ్ ప్రొగ్రాం సెట్ చేస్తాం అని తెలిపారు పవన్‌ కల్యాణ్.. జనం మధ్యనే కూర్చొని కామన్ మినిమమ్ ప్రొగ్రాం రూపొందిస్తామన్న ఆయన.. జనసేనలో ఉండేవాళ్లకే నేను బాధ్యతలు ఇస్తాను.. ఇలా వచ్చి.. అలా వెళ్లిపోయే వాళ్లకి నేను బాధ్యతలు ఇవ్వను అని స్పష్టం చేశారు.. పార్టీలో నాదెండ్లను చాలా మంది విమర్శిస్తున్నారు.. ఇది కరెక్ట్ కాదని హితవుపలికారు.. పార్టీలో అనుకూల శత్రువులుగా మారొద్దు.. అనుకూల శత్రువులు ఎవరైనా ఉంటే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తా అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.. మనోహర్ ఏ రోజూ నన్ను సంప్రదించకుండా ఏం మాట్లాడరన్న ఆయన.. నాదెండ్ల లాంటి వ్యక్తిని గుండెల్లో పెట్టుకోవాలి.. కానీ, తూలనాడొద్దు అన్నారు.. నేను అంటే పడి చచ్చిపోతామనే వాళ్లు.. నాదెండ్లను విమర్శిస్తున్నారు. ఇలాంటి వాళ్లను నేను వైసీపీ కోవర్టులుగానే భావిస్తాను.. నా మీద కోపాన్ని నాదెండ్ల మీద చూపుతున్నారు.. ఏదైనా ఉంటే నా మీదే కోప్పడండి.. నన్నే విమర్శించాలని సూచించారు.

పవన్‌ కామెంట్లకు అంబటి కౌంటర్‌.. ఆయన కంటే సకల కళాకారులు ఉంటారా?
వైసీపీలో కొందరు సకల కళా కోవిదులున్నారు.. చిట్టి చిట్టి అడుగులేసుకుంటూ.. క్యూట్ క్యూట్ గా నన్ను విమర్శించేందుకు కొందరు నేతలు వస్తారు కదా..? వాళ్లని సీఎం అభ్యర్థులుగా ప్రకటించండి అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించిన విషయం విదితమే.. ఇక, మేం చేయలేమని వైసీపీ భావిస్తే.. మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటారు..? టీడీపీనైనా పట్టించుకోవడం లేదు కానీ.. మమ్మల్ని మాత్రం వదలడం లేదన్న ఆయన.. వైసీపీకి మేమంటే భయం అందుకే మమ్మల్ని విమర్శిస్తున్నారని కామెంట్‌ చేసిన విషయం విదితమే.. అయితే, జనసేనాని కామెంట్లకు కౌంటర్‌ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు ఉండవు అనే నానుడికి తాజా ఉదాహరణ పవనే అన్నారు.. రాజకీయాలు చేయటం కోసం పవన్ రాజకీయ పార్టీ పెట్టలేదు.. చంద్రబాబును గెలిపించటం కోసమో పార్టీ పెట్టారని ఎద్దేవా చేశారు.. 2014లో ఒక్క సీటు కూడా తీసుకోకుండా చంద్రబాబు కోసం పని చేశాడు.. చంద్రబాబుకు అధికారం ఇవ్వటం ప్రజలకు అధికారం ఇవ్వటమా? అని నిలదీశారు. జన సైనికులు, కాపు సోదరులు బట్టలు చించుకుని పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అని అరుస్తా ఉన్నారు.. పవన్ నాకు సీఎం వద్దు.. మాట్లాడవద్దు అన్నాడు.. క్యాష్ తీసుకుని షూటింగ్ లు చేసుకుంటే మద్దతు పెరుగుతుందా? అని ప్రశ్నించారు అంబటి రాంబాబు.. సింగిల్ గా వెళ్తే చిత్తుచిత్తుగా ఓడిపోతాను అన్న తర్వాత వీర మహిళలు ఎందుకు? కాపు సోదరులు ఎందుకు? ఆలోచించండి అని సూచించారు. ప్యాకేజీ అడిగే చంద్రబాబు వేసే ముష్టి ఎత్తుకోవటానికి జాతి మొత్తాన్ని తాకట్టు పెట్టే దుస్థితి వచ్చిందన్నారు.. స్థానికంను అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్ళి పెళ్ళి చేసుకున్న పవన్ కళ్యాణ్ కంటే సకల కళాకారులు ఎవరైనా ఉంటారా? అంటూ కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు మంత్రి..

దివ్యాంగులను అక్కున చేర్చుకున్న సీఎం.. ఏడుగురికి తక్షణమే సాయం..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దివ్యాంగులను అక్కున చేర్చుకున్నారు.. వారి సమస్యను తెలుసుకుని తక్షణమే వారికి సాయం అందేలా చేశారు.. కావలి పర్యటనకు వెళ్లిన సీఎం జగన్‌.. దివ్యాంగులను చూసి చలించిపోయారు.. తనను కలిసేందుకు ఎదురుచూస్తున్న వికలాంగులను ప్రత్యేకంగా హెలిపాడ్ ప్రాంగణంలోకి పిలిపించుకుని, వారి సమస్యలను తెలుసుకున్నారు.. ఏడుగురు దివ్యాంగులు ముఖ్యమంత్రికి తమ ఆవేదన వెలుబుచ్చుకున్నారు. వీరి సమస్యలను ఆలకించిన ముఖ్యమంత్రి తక్షణసాయంగా లక్ష రూపాయలు అందించి, అవసరమైన వైద్య సేవలు సత్వరమే అందించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఈ మేరకు ఏడుగురు దివ్యాంగులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, ఆర్డీవో సీనా నాయక్ సమక్షంలో దివ్యాంగులకు తక్షణ సాయంగా ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ ప్రత్యేకంగా వికలాంగుల వద్దకు వెళ్లి వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తానే స్వయంగా నమోదు చేసుకుని, ప్రభుత్వపరంగా అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

పవన్‌ చేతులేత్తేశారు.. సీఎం కావాలంటే మూడు పెళ్లిళ్లు చేసుకున్నంత ఈజీ కాదు..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాజాగా పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల్లో పొత్తులు, సీఎం అభ్యర్థి విషయం చేసిన కామెంట్లపై కౌంటర్‌ ఎటాక్‌ చేవారు.. పవన్ కళ్యాణ్ పార్టీని నదపలేనని చేతులు ఎత్తేశారన్న ఆయన.. జనసేన కాదు అది జెండా సేన.. ప్రతీ ఎన్నికల్లోనూ ఎదో ఒక పార్టీ జెండా మోయడమే పని అని ఎద్దేవా చేశారు. జనసైనికులు ఇక నుంచి జెండా కూలీలు అని హాట్‌ కామెంట్లు చేశారు. చంద్రబాబు దగ్గర ఎంత తీసుకున్నారో పవన్ చెప్పాలి…? అని డిమాండ్‌ చేశారు అమర్నాథ్.. కాపులను కట్టకట్టి చంద్రబాబుకు తాకట్టు పెట్టాలని పవన్ చూస్తున్నారు అని విమర్శించారు.. ఎవరి దగ్గరో కూలికి చేరతానని చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి పార్టీ పెట్టానని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ కాదు ప్యాకేజ్ స్టార్ అని మొదటి నుంచి చెబుతున్నాం.. ఇప్పుడు అదే నిజమైందన్న ఆయన.. మేం చెబితే చెప్పులు చూపించిన పవన్ ఇప్పుడేం చూపిస్తారు..? అని దుయ్యబట్టారు. పొత్తుల గురించి పార్టీలో చర్చించడం కోసమే మండల స్థాయి అధ్యక్షుల సమావేశం ఏర్పాటు చేశారని విమర్శించారు.

రాజకీయ లబ్ది కోసమే బంద్.. నాకు సంబంధం లేదు..
జగిత్యాల జిల్లాలో రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో జరిగిన సంఘటనపై రూరల్ ఎస్సై అనిల్ తాజాగా ఓ వీడియోను విడుదల చేశారు. రేపటి జగిత్యాల పట్టణ బంద్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. రాజకీయ నాయకులు కొన్ని వర్గాలు వారి స్వలాభం కోసమే బంద్ చేస్తున్నారు అని అనిల్ అన్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదు.. పోలీస్ఉన్నతాధికారులపై, చట్టంపై నాకు నమ్మకం ఉంది అని ఎస్సై అనిల్ తెలిపారు. పోలీస్ క్రమశిక్షణ చర్యలను పోలీస్ నియమ నిబంధనల ప్రకారం చట్టపరంగా పరిష్కరించుకుంటాను అని ఆయన వెల్లడించారు. కాగా.. సస్పెన్షన్ వేటుపడిన ఎస్సై అనిల్‌కు మద్దతుగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ రేపు జగిత్యాల బంద్ కు పిలుపునిచ్చింది. వెంటనే ఎస్సై అనిల్ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. ఎస్సై విషయంలో ఎలాంటి విచారణ జరగకుండానే సస్పెండ్ చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సులో బలహీన వర్గానికి చెందిన ఓ మహిళ మీద దాడి చేసి, పైగా ఆ మహిళ భర్త అయిన ఎస్సై అనిల్ ను సస్పెండ్ చేశారని, ఇది కక్ష సాధింపు చర్యగా కనిపిస్తోందని అన్నారు. అందు కోసమే రేపు ( శనివారం ) జగిత్యాల పట్టణ బంద్ కు పిలుపునిచ్చినట్లు విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ప్రకటించాయి. ఇదే ఇష్యూపై ఇప్పటికే టీ.బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యారు.

హైదరాబాద్ లో నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలపై పోలీసుల నజర్
వాహనదారులు తమ వాహనాలకు విధిగా నెంబర్ ప్లేట్స్ వాడి నేరాల నియంత్రణకు సహకరించాలని రాచకొండ జాయింట్ సీపీ వి. సత్యనారాయణ తెలిపారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ ఆదేశాల మేరకు.. ఎల్బీనగర్ లోని ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో జనవరి నుంచి ఇప్పటివరకు నెంబర్ ప్లేట్లు లేని 48,998 వెహికిల్స్ ను మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఫైన్లు వేశామని జాయింట్ సీపీ వి. సత్యనారాయణ వెల్లడించారు. దొంగతనం, చైన్ స్నాచింగ్, హత్యలు చేసేవారు, మారక ద్రవ్యాలు సరఫరా చేసేవారు ఎక్కువగా నెంబర్ ప్లేట్లు లేని వెహికిల్స్ నే ఉపయోగిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం, నేరాలను నియంత్రించేందుకు నెంబర్ ప్లేట్లు వాడని వాహనదారులపై ఉక్కుపాదం మోపుతున్నట్లు జాయింట్ సీపీ వి. సత్యనారాయణ తెలిపారు. నెంబర్ ప్లేట్స్ లేకుండా వాహనాలు నడిపినా, మాస్క్ లతో నెంబర్ ప్లేట్స్ కవర్ చేసినా మోటర్ వెహికల్ చట్టం ప్రకారం.. మూడు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు జరిమాన విధించడంతో పాటు జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుందని వెల్లడించారు.

18 నెలల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం..
ఏప్రిల్ నెలలో భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గినట్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) కంఫర్ట్ జోన్ లోనే వరసగా రెండో నెల కొనసాగినట్లు నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్(ఎన్ఎస్ఓ) విడుదల చేసిన డేటాలో వెల్లడించింది. వినియోగదారుల ధర సూచి ఆధారంగా (సీపీఐ) ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. ఏప్రిల్ నెలలో 4.7 శాతంగా ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో 5.66 శాతంగా ఉంటే ఇది ఏప్రిల్ లో 4.7 శాతానికి చేరినట్లు గణాంకాలు వెల్లడించాయి. నవంబర్ 2021 నుంచి పోలిస్తే తొలిసారిగా 5 శాతాని కన్నా దిగువకు ద్రవ్యోల్బణం చేరింది. ఆహార ధరలు తగ్గుదల కారణంగా ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. ఆహార ధరల ద్రవ్యోల్బణం మార్చిలో 4.79 శాతం నుంచి 3.84 శాతానికి పడిపోయింది. ఏప్రిల్‌లో గ్రామీణ ద్రవ్యోల్బణం 4.68 శాతంగా ఉండగా, పట్టణ ద్రవ్యోల్బణం 4.85 శాతంగా ఉందని డేటా వెల్లడించింది. వరసగా వడ్డీరేట్ల పెంపు తర్వాత గత సమీక్షలో వడ్డీరేట్లను రిజర్వ్ బ్యాంక్ అలాగే ఉంచింది. ప్రస్తుతం ద్రవ్యోల్బణం తగ్గుదల ఆర్బీఐకి ఉపశమనం కలిగించింది. చాలా మంది ఆర్థికవేత్తలు అంచనాలకు అనుగుణంగానే ద్రవ్యోల్భణం దిగివచ్చింది. వివిధ రంగాల వృద్ధిరేటను చూపే పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు కూడా మార్చిలో 1.1 శాతానికి పెరిగింది. 1,114 పట్టణ మార్కెట్లు, 1,181 గ్రామాల నుండి ధరల డేటాను సేకరించినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఆహారం, ఇంధన ధరలు ద్రవ్యోల్బణం తగ్గుదలకు దోహదపడ్డాయి. ఏప్రిల్ 2022లో ద్రవ్యోల్బణం 7.8 శాతంగా ఉంది. ఇది ఆర్బీఐ సేఫ్ జోన్ 6 శాతంతో పోలిస్తే చాలా ఎక్కువ.

నువ్వు కటౌట్ వే.. ప్రభాస్ వి కాదు
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అన్ని మంచి శకునములే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ఇక ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలా కనిపిస్తుంది. రెండు కుటుంబాలు.. వారి మధ్య దూరం.. ఆ దూరాన్ని దగ్గరచేసే ఒక పెళ్లి.. ఆ పెళ్ళిలో వచ్చే గొడవలు.. ఇలా ట్రైలర్ సాగిపోతూ కనిపిస్తుంది. ట్రైలర్ ను బట్టి.. హీరో హీరోయిన్లు బావమరదళ్ళుగా కనిపిస్తున్నారు. రెండు కుటుంబాల మధ్య గొడవలు.. కోర్టుకు వెళ్లడంతో ఎవరికి వారు విడిపోతారు. అయితే బావమరదళ్ళ మధ్య ఆ ప్రేమ చిన్నప్పటి నుంచి పెరుగుతూ వస్తుంది. కానీ, ఇంట్లో పెద్దవాళ్ళ గొడవల వలన వారు చెప్పుకోరు అన్నట్లు కనిపిస్తుంది. అసలువీరి మధ్య గొడవ ఏంటి.. హీరోహీరోయిన్లు చివరికి కుటుంబాలను కలిపారా..? అన్ని మంచి శకునములే అని పెద్దవారు ఎందుకు అంటారు..? అనేది అంతా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాలో ఉన్నవారంతా స్టార్ క్యాస్టింగ్ అని చెప్పుకోవాలి. రాజేంద్ర ప్రసాద్, నరేష్, రావు రమేష్, గౌతమీ, వాసుకి, వెన్నెల కిశోర్.. ఇలా చాలామంది నటించారు. మిక్కీ జె మేయర్ సంగీతం వినసొంపుగా ఉంది. ఈ సినిమా మే 18 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.

బండ్ల గణేష్ తోసేస్తే.. పవన్ పరిగెత్తుకుంటూ వచ్చి.. దండం పెట్టి
టాలీవుడ్ లో లేడీ కమెడియన్ గా పేరు తెచ్చుకుంది పావలా శ్యామల. గోలీమార్, ఆంధ్రావాలా సినిమాల్లో పావలా శ్యామల చేసిన కామెడీ ఇప్పటికీ మీమ్స్ రూపంలో వస్తూనే ఉంటుంది. ఇక వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆమె ఆరోగ్యం కొంచెం కొంచెం క్షీణిస్తూ వస్తుంది. ఇక ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంది. అయితే ఆర్థిక ఇబ్బందులు మాత్రం తప్పడంలేదని వాపోయింది. అయితే గతంలో పవన్ కళ్యాణ్.. పావలా శ్యామలకు కొన్ని లక్షలు ఇచ్చాడని, దానితోనే ఆమె బ్రతుకుతుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై పావలా శ్యామల.. ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించింది కూడా. పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం, పెద్దల పట్ల ఆయనకున్న గౌరవం గురించి చెప్పుకొచ్చింది. పవన్ తనకు ఒక లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చారని.. అంతకుమించి తనకోసం ఆయన పరిగెత్తుకుంటూరావడం చాలా గొప్ప విషయమని చెప్పింది. ఈ ఓల్డ్ వీడియో ప్రస్తుతం మరోసారి నెట్టింట వైరల్ గా మారింది. ” గబ్బర్ సింగ్ షూటింగ్ అనుకుంటా.. అప్పుడు నా ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఆర్థిక ఇబ్బందులు.. ఇండస్ట్రీలో ఒకరు ఇద్దరికీ చెప్తే.. పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి కలవండి అని చెప్పారు. ఏదైనా చిన్న క్యారెక్టర్ ఇస్తారేమో అని అడగడానికి అక్కడకు వెళ్ళాను. నడవలేకపోతున్నాను.. వణికిపోతున్నా చలిలో.. నా కూతురితో పాటు వెళ్లి నిలబడ్డాను. అయితే లోపలికి పవన్ మేనేజర్ నన్ను వెళ్లనివ్వలేదు. చాలాసేపు బయట నిలబడ్డాను. ఆయన కోపంగా ఉన్నారు.. ఇప్పుడు వెళ్ళకండి.. బయటికి వచ్చాకా చూద్దామని చెప్పుకొచ్చారు. ఇక ఆయన క్యార్ వ్యాన్ ఎక్కే దగ్గర ఎదురుచూస్తున్నాను. అక్కడే బండ్ల గణేష్ కూడా ఉన్నాడు. మేమిద్దరం కలిసి మూడు సినిమాలు చేశాం.. ఇలా పవన్ ను కలవాలి అని అంటే.. ఆయన కూడా ఇప్పుడు కాదు.. ఆయన కోపంలో ఉన్నారు.. వెనక్కి వెళ్ళండి అని తోసేశాడు. ఇక నాకు కోపం వచ్చి.. వారిని తోసుకొని ముందుకు వెళ్లాను. అప్పటికే పవన్ .. జీప్ లో ఎక్కి వెళ్లిపోతున్నారు.