NTV Telugu Site icon

Top Headlines @ 9PM : టాప్‌ న్యూస్

Top Headlines

Top Headlines

*ముచ్చటగా మూడోసారి.. ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం..

ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మోడీతో పాటు కేంద్రమంత్రులుగా 72 మంది ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుల్లో 30 మంది కేబినెట్ మంత్రుల కాగా, 36 మంది సహాయమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2014, 2019, 2024లో వరసగా మూడు పర్యాయాలు ప్రధానిగా మోడీ బాధ్యతలు చేట్టారు. ప్రధానిగా మోడీతో పాటు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, మనోహర్ లాల్ కట్టర్ తదితరులు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్డీయేలోనిమిత్ర పక్షాలకు 11 మందికి మంత్రి పదవులు దక్కాయి. 72 మంది మంత్రుల్లో 43 మంది పార్లమెంట్‌లో మూడు పర్యాయాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేసిన వారు కాగా, 39 మంది ఇంతకు ముందు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. మంత్రి మండలిలో అన్ని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం లభించే విధంగా ఓబీసీ నుంచి 27 మంది, షెడ్యూల్డ్ కులాల నుంచి 10 మంది, షెడ్యూల్డ్ తెగల నుంచి ఐదుగురు, మైనారిటీల నుంచి ఐదుగురుకి మంత్రి పదవులు దక్కాయి. మోడీ ప్రమాణస్వీకారానికి భారత ఇరుగుపొరుగు దేశాలకు చెందిన దేశాధినేతలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్‌, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో సహా పలువురు అంతర్జాతీయ దేశాధినేతలు హాజరయ్యారు.

 

*ప్రధాని మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో తళుక్కుమన్న తారలు, పారిశ్రామికవేత్తలు
ఈ రోజు జరిగిన ప్రధాని నరేంద్రమోడీ ప్రమాణస్వీకారంలో పారిశ్రామికవేత్తలు, సినీ తారలు మెరిశారు. రాష్ట్రపతి భవన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, సూపర్ స్టార్లు షారుఖ్ ఖాన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. మరోవైపు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ భార్యా సమేతంగా ఈ కార్యక్రమానికి వచ్చారు. 12TH ఫెయిన్ యాక్టర్ విక్రాంత్ మాస్సేతో పాటు ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రధానిగా మూడోసారి నరేంద్రమోడీ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్రమాణస్వీకారం చేయించారు. మొత్తం 72 మందితో మోడీ 3.0 కేబినెట్ ఉండబోతోంది. ఇందులో 30 మంది కేంద్రమంత్రులు కాగా, మిగిలిన వారు సహాయమంత్రులుగా ఉండబోతున్నారు. ఎన్డీయే కూటమిలోని తెలుగుదేశం, శివసేన, జేడీయూ, ఎల్జేపీ వంటి మిత్రపక్షాలకు సంబంధించి 11 మందికి మంత్రి పదవులు దక్కాయి. ఇదే కాకుండా పొరుగుదేశాలు ఫస్ట్ అనే భారత విధానానికి అనుగుణంగా మన చుట్టుపక్కల ఉన్న దేశాల అధినేతలకు ఆహ్వానాలు అందాయి. పీఎం మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జూ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్‌, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో సహా పలువురు అంతర్జాతీయ దేశాధినేతలు హజరయ్యారు.

 

*మోడీ కేబినెట్‌లోకి జేపీ నడ్డా.. బీజేపీకి కొత్త చీఫ్..
చారిత్రాత్మక ఘట్టాని సమయం ఆసన్నమైంది. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన తర్వాత వరసగా మూడోసారి ప్రధాని నరేంద్రమోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 7.15 గంటలకు మోడీ బాధ్యతలు చేపట్టనున్నారు. మోడీతో పాటు ఆయన కేబినెట్‌లో చేరబోతున్న ఎంపీలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే మంత్రిపదవులు దక్కిన వారికి సమాచారం వెళ్లింది. వారంతా ఢిల్లీ చేరుకున్నారు. మరోవైపు ఈ కార్యక్రమానికి భారత మిత్రదేశాలైన భూటాన్, బంగ్లాదేశ్, మారిషస్, మాల్దీవులు, శ్రీలంక, నేపాల్, సీషెల్స్ వంటి దేశాల అధినేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఇదిలా ఉంటే, బీజేపీ జాతీయాధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాను మోడీ మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రధానితో పాటు మొత్తం 30 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. వీరిలో జేపీ నడ్డా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2014-2019లో నరేంద్రమోడీ తొలి ప్రభుత్వంలో నడ్డా మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ఆరోగ్యమంత్రిత్వ శాఖ చూశారు. 2020లో అమిత్ షా స్థానంలో జేపీ నడ్డాను బీజేపీ జాతీయాధ్యక్షుడిగా చేశారు. సెప్టెంబర్ 2022లో నడ్డా పదవీకాలం ముగిసినప్పటికీ, 2024 సార్వత్రిక ఎన్నికల వరకు పొడగించారు. ఇదే జరిగితే బీజేపీకి కొత్తగా జాతీయాధ్యక్షుడు వచ్చే అవకాశం ఉంది. మోడీ 3.0 కేబినెట్‌లో ఈ సారి మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేనలకు ప్రాధాన్యత లభిస్తోంది. టీడీపీకి చెందిన కె రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ పెమ్మసాని, జెడి(యు) నుండి లల్లన్ సింగ్, రామ్‌నాథ్ ఠాకూర్‌లు నేడు ప్రమాణస్వీకారం చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రీయ లోక్‌దళ్‌కు చెందిన జయంత్ చౌదరి, లోక్ జనశక్తి పార్టీ ఆర్‌వి చిరాగ్ పాశ్వాన్, శివసేనకు చెందిన ప్రతాప్ రావ్ జాదవ్, హెచ్‌ఎఎం జితన్ రామ్ మాంఝీ, ఎజెఎస్‌యుకు చెందిన చంద్ర ప్రకాష్ చౌదరి, ఆర్‌పిఐకి చెందిన రాందాస్ అథవాలే, అప్నాదళ్ నుంచి అనుప్రియా పటేల్, జేడీఎస్ నుంచి కుమారస్వామిలకు మంత్రి పదవులు దక్కబోతున్నాయి.

 

*స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, నారాయణ రాణేలకు కేబినెట్‌లో దక్కని చోటు..?
లోక్‌సభ ఎన్ని్కల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయం సాధించింది. మరోసారి కేంద్రంలో అధికారంలోకి రాబోతోంది. ఈ రోజు ప్రధానిగా నరేంద్రమోడీ వరసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. సాయంత్రం 7.15 గంటలకు ప్రధానిగా తన బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ కార్యక్రమానికి భారతదేశ ఇరుగుపొరుగు దేశాలైన బంగ్లదేశ్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు, సీషెల్స్, మారిషన్ దేశాధినేతలు హాజరుకాబోతున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పటికే మోడీ కేబినెట్‌లో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోయే ఎంపీలకు కాల్స్ వెళ్లాయి. వీరంతా ఢిల్లీ చేరుకున్నారు. ఎన్డీయే కూటమిలోని తెలుగుదేశం, జేడీయూ, శివసేన పార్టీలకు కూడా కేబినెట్ బెర్తులు దక్కాయి. ఇదిలా ఉంటే గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన పలువురు బీజేపీ నాయకులకు ఈ సారి మొండిచేయి చూపించారు. కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, అనురాగ్ ఠాకూర్, నారాయణ్ రాణేలకు ఈ సారి మంత్రి పదవులు దక్కవని సమాచారం. స్మృతీ ఇరానీ ఈసారి జరిగిన ఎన్నికల్లో త్తరప్రదేశ్‌లోని అమేథీ నుంచి కాంగ్రెస్ విధేయుడు కిషోరీ లాల్ శర్మ చేతిలో 1.6 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీని ఓడించిన స్మృతీ ఈ సారి మాత్రం విజయం సాధించలేకపోయారు. గతంలో మోడీ మంత్రివర్గంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. హిమాచల్ ప్రదేశ్ హమీర్ పూర్ నుంచి ఎంపీగా గెలిచిన అనురాగ్ ఠాకూర్‌కి కూడా ఈ సారి మంత్రి పదవి దక్కదని తెలుస్తోంది. ప్రధాని మోడీ రెండో టర్మ్‌లోని మంత్రివర్గంలో ఈయన క్రీడలు మరియు సమాచార మరియు ప్రసార శాఖలను నిర్వహించారు. ఇక మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత, రత్నగిరి-సింధు దుర్గ్ నుంచి విజయం సాధించిన నారాయణ రాణేకి కూడా ఈ సారి బెర్త్ కన్ఫామ్ కాలేదని సమచారం. గతంలో ఈయన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం మోడీ 3.0 కేబినెట్‌లో అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, నితిన్ గడ్కరీ, మన్సుఖ్ మాండవియా, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, ప్రహ్లాద్ జోషి, కిరణ్ రిజిజు , CR పాటిల్, L మురుగన్, హర్దీప్ పూరి, ML ఖట్టర్, శివరాజ్ చౌహాన్, గజేంద్ర షెకావత్, సురేష్ గోపి, మరియు జితిన్ ప్రసాదలకు మంత్రి పదవులు దక్కతున్నట్లు సమచారం. ఎన్డీయేలోని ఇతర నేతలైన హెచ్‌డి కుమారస్వామి, జయంత్ చౌదరి, ప్రతాప్ జాదవ్, రామ్ మోహన్ నాయుడు, సుదేశ్ మహతో మరియు లల్లన్ సింగ్‌లకు మంత్రి పదవులు దక్కుతున్నాయి.

 

*కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు.. శ్రీకాకుళం ప్రజలకు పాదాభివందనాలు
కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కినందుకు హర్షం వ్యక్తం చేశారు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌ నాయుడు. కాసేపట్లో కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్న తరుణంలో ఆయన సోషల్‌ మీడియాలో తన సందేశాన్ని విడుదల చేశారు. ఈ ఆనందానికి కారణమైన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి ఎర్రన్నాయుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ తనపై ఉన్నాయన్నారు. ఆయన ఆశీర్వాదమే తనను ముందుకు నడిపిస్తోందన్నారు. తనకు మార్గనిర్దేశం చేస్తూ ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్, ప్రధాని మోడీ, ముఖ్యంగా అచ్చెన్నాయుడికి ధన్యవాదాలు తెలిపారు. తన కుటుంబ సభ్యులు ఎన్నో త్యాగాలు చేసి తాను మూడు సార్లు గెలవడానికి కారణమయ్యారని ఆయన వెల్లడించారు. తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం ప్రధానంగా శ్రీకాకుళం ప్రజలు అని.. వారికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నానన్నారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉఙ్వలంగా కనిపిస్తోందని ఎంపీ రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పథంలో నడిపేందుకు, దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయడమే తన లక్ష్యమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి ఎంత అవకాశం ఉంటే అంత సహకారం పొందాలన్నారు.

 

*యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై టెర్రరిస్టుల కాల్పులు.. పలువురు మృతి..
జమ్మూ కాశ్మీర్‌లో టెర్రరిస్టులు బరితెగించారు. ఆదివారం రియాసి జిల్లాలో యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. బస్సు శివఖోడా ఆలయం నుంచి కత్రాకు తిరిగి వస్తుండగా ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.దాడి జరిగిన వెంటనే పోలీసులు, సైన్యం, పారామిలటరీ బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని పోలీసులు తెలిపారు. రాజౌరి, పూంచ్, రియాసి ఎగువ ప్రాంతాల్లో దాక్కున్న ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

*భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌!
క్రికెట్ ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్తాన్‌ మధ్య మరికొద్దిసేపట్లో మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ హై వోల్టేజ్‌ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇండో-పాక్ దేశాల అభిమానులతో పాటు యావత్‌ క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు వరుణ దేవుడు క్రికెట్‌ అభిమానులను కలవరపెడుతున్నాడు. భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ ప్రారంభ సమయానికి కల్లా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు న్యూయార్క్‌ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వర్షం కారణంగా టాస్‌ కూడా లేటు అవుతుందని సమాచారం. అయితే సమయం గడిచేకొద్ది వర్షం పడే అవకాశాలు తక్కువ అట. ప్రస్తుతం అక్కడ ఆవకాశం మేఘావృతమై ఉంది. ఆకాశమంతా మబ్బులు పట్టి ఉన్నప్పటికీ.. మ్యాచ్‌ నిర్వహణకు అంతరాయం కలగకపోవచ్చట. ఒకవేళ మ్యాచ్‌కు వర్షం ఆటకం కలిగించినా.. ఓవర్ల కుదింపుతో జరిగే అవకాశం ఉంది. మ్యాచ్ రద్దైతే మాత్రం భారత్‌, పాకిస్తాన్‌ జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. మొత్తానికి మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. న్యూయార్క్‌ పిచ్‌ ఆటగాళ్లను ఆందోళనకు గురి చేస్తుంది. ఒక్కో రోజు ఒక్కోలా ఈ పిచ్‌ ప్రభావం చూపిస్తోంది. కొన్ని సార్లు ఎక్కువ బౌన్స్‌తో బంతి వెళ్తుంది. మరికొన్నిసార్లు అస్సలు పైకే లేవడం లేదు. ఇక అవుట్‌ ఫీల్డ్‌ కూడా చాలా నెమ్మదిగా ఉంది. దాంతో బ్యాట‌ర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదు కాలేదు. మరి ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి.

 

*పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీకి అసాధారణ రికార్డులు!
మరికొద్దిసేపట్లో భారత్, పాకిస్థాన్ మధ్య టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ హై వోల్టేజ్‌ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరు దేశాల అభిమానులతో పాటు యావత్‌ క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇండో-పాక్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఐపీఎల్‌లోని ఫ్రాంచైజీలు విరాట్ రికార్డులను నెట్టింట పోస్ట్ చేశాయి. టీ20ల్లో పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీకి అసాధారణ రికార్డులు ఉన్నాయి. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో ఇతర జట్లపై మరే ఆటగాడికి సాధ్యం కానీ రికార్డులు విరాట్ పేరిట ఉన్నాయి. పాకిస్థాన్‌పై 5 మ్యాచ్‌లు ఆడగా.. మూడుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. పాక్‌పై అత్యధిక సార్లు ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగా విరాట్ నిలిచాడు. 2012, 2016, 2022 ప్రపంచకప్‌లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కోహ్లీ అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్ ఏడు సార్లు తలపడ్డాయి. ఇందులో విరాట్ కోహ్లీ మూడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. 2007ప్రపంచకప్‌ గ్రూప్ స్టేజ్‌లో మహ్మద్ అసిఫ్, ఫైనల్‌లో ఇర్ఫాన్ పఠాన్ అవార్డు అందుకోగా.. 2014లో అమిత్ మిశ్రా, 2021లో షాహిన్ అఫ్రిదిలు అందుకున్నారు. పాకిస్థాన్‌పై అయిదు ఇన్నింగ్స్‌ల్లో 308 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం. ప్రపంచకప్‌లో పాక్‌పై 308 సగటు కలిగిన ఏకైక బ్యాటర్‌‌గా విరాట్ రికార్డుల్లో నిలిచాడు. విరాట్ తన జోరును నేటి మ్యాచ్‌లోనూ చూపిస్తే టీమిండియా విజయం ఖాయం.