NTV Telugu Site icon

Top Headlines @ 9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

*చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. ముహూర్తం, వేదిక ఫిక్స్
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12వ తేదీ ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌ వద్ద ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీయే కూటమి ముఖ్యనేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నందున.. ఎయిమ్స్‌ సమీపంలోని స్థలాన్ని అధికారులు, టీడీపీ నేతలు పరిశీలించారు. కానీ ఆ ప్రాంతం అంత అనువుగా లేకపోవడంతో గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏర్పాట్లకు కావాల్సిన సామాగ్రిని కూడా సిద్ధం చేశారు అధికారులు. సభా వేదిక నిర్మాణం కోసం ఇప్పటికే 12 లారీలలో సామాగ్రిని తీసుకొచ్చారు. ఇదిలా ఉండగా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్‌, తదితరులు సభాస్థలాన్ని పరిశీలించారు. ఈనెల 12వ తేదీన చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తొలుత 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించినా అదేరోజు ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తుండడం.. ఆ కార్యక్రమానికి హాజరవ్వాల్సి వుండడంతో చంద్రబాబు తన కార్యక్రమాన్ని 12కు వాయిదా వేసుకున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి.. దానికి ముందు 11వ తేదీన టీడీపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును టీడీపీ పక్ష నేతగా ఎన్నుకుంటారు. చంద్రబాబును టీడీఎల్పీ నేతగా ఎన్నుకుని గవర్నర్‌కు నివేదించాక 12న ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది.

 

*ఏపీలో నామినేటెడ్ పోస్టుల తొలగింపునకు ప్రభుత్వం ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల తొలగింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు సంబంధించి నామినేటెడ్ ఛైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యుల రాజీనామాలకు ఆదేశించింది. వచ్చిన రాజీనామాలను వెంటనే ఆమోదించాలని.. ఈ మేరకు అన్ని శాఖల సెక్రటరీలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం రాష్ట్రంలోని సలహాదారులను అందర్నీ ఏపీ ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. మొత్తంగా 40 మంది సలహాదారులను తొలగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 4వ తేదీ నుంచి తొలగింపు ఉత్తర్వుల్లో జీఏడీ వెల్లడించింది. అంటే ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే ఈ తొలగింపు ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ఇదిలా ఉండగా.. బుధవారం సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు 20 మంది సలహాదారులు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. చేయని వారిని తాజాగా ప్రభుత్వం తొలగించింది. మరోవైపు మంత్రుల పేషీల్లోని సిబ్బందిని జీఏడీ మాతృ శాఖలకు పంపింది. ఈ నెల 11వ తేదీలోగా ఆయా మంత్రుల పీఏ, పీఎస్, ఏపీఎస్‌లను వారి వారి మాతృ శాఖల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు జీఏడీ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. మంత్రుల పేషీల్లోని ఫైళ్లు, రికార్డులను, డాక్యుమెంట్లను సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందచేయాలని ఆదేశించారు. ఫర్నిచర్, కంప్యూటర్, స్టేషనరీల జాబితాను అక్నాలెడ్జ్ చేసి ఇవ్వాలని.. నో డ్యూస్ సర్టిఫికెట్లు తీసుకోవాలని.. మంత్రుల నివాసాల్లో ఉన్న ఫర్నిచర్‌ను కూడా అక్నాలెడ్జ్ చేసివ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రుల నివాసాల్లో ఉన్న ఫైళ్లను కూడా సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు అందచేయాలని ఆదేశించింది.

 

*గుడ్ న్యూస్.. ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ విడుదల..
తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యింది. ఈ నేపథ్యంలో పదవీ విరమణకి 3 సంవత్సరాల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుండి మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం. పండిట్, పీఈటీ పోస్టులలో అప్‌గ్రేడేషన్ చేస్తున్నట్లు తెలిపారు. మల్టీ జోన్ 2లో హెచ్‌ఎం ప్రమోషన్, మల్టీ జోన్ 1 లో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్‌తో షెడ్యూల్ మొదలు కానుంది. కోర్ట్ కేసులతో గతంలో ఎక్కడ అయితే ప్రక్రియ ఆగిపొయిందో అక్కడి నుండి మళ్ళీ మొదలు కానున్నాయి బదిలీలు. టెట్ తో సంబంధం లేకుండానే ప్రమోషన్లు ఇవ్వనునట్లు అధికారులు తెలిపారు. జూన్ 8 వ తేదీ నుండి ఈ పక్రియ ప్రారంభం కానుంది. మల్టీ జోన్ వన్ లో జూన్ 8 నుండి 22 వరకు బదిలీలు, పదోన్నతులు జరుగనున్నాయి. మొత్తం 15 రోజుల వ్యవధిలో ప్రక్రియ పూర్తి కానుంది. మల్టీ జోన్ 2 లో జూన్ 8 నుండి 30 వరకు ప్రక్రియ సాగనుంది. ఇందులో ఏకంగా 23 రోజులలో పూర్తి ప్రక్రియ జరగనుంది.

 

*రాష్ట్రపతిని కలిసిన ఎన్డీఏ నేతలు.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి
రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నరేంద్ర మోడీ, ఎన్డీయే మిత్రపక్షాలు సమావేశం అయ్యాయి. ఈ సందర్భంగా ఎన్డీఏ చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతికి మోడీ అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని మోడీ కోరారు. తీర్మానాన్ని పత్రాన్ని తీసుకున్న తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు మోడీని రాష్ట్రపతి ఆహ్వానించారు. శుక్రవారం మోడీని ఎన్డీఏ పక్ష నేతగా  ఎంపీలు ఎన్నుకున్నారు. ఇక రాష్ట్రపతితో సమావేశం అనంతరం మరోసారి ఎన్డీయే సమావేశం కానుంది. ఈ భేటీలో మంత్రి పదవులు, ఇతర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే జూన్ 9న సాయంత్రం 6గంటలకు మోడీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ నేతలతో పాటు ఆయా దేశాధినేతలు హాజరుకానున్నారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్డీఏ పక్షనేతగా మోడీని ఎన్నుకున్నారు. ఎన్డీఏలో జనతాదళ్-యునైటెడ్, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, జనతాదళ్ సెక్యులర్, శివసేన, నేషనల్ కాంగ్రెస్ పార్టీ, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్), రాష్ట్రీయ లోక్ దళ్ మరియు ఇతర పార్టీలు ఉన్నాయి. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్‌ 272కు బీజేపీ దూరమైంది. బీజేపీ మూడోసారి అధికారంలోకి రావాలంటే మిత్రపక్షాల మద్దతు అవసరం. కూటమి సభ్యుల మద్దతుతో ఎన్డీఏ బలం 293కు చేరింది. ఇక ఇండియా కూటమి 232 సీట్లు సాధించింది. ఇక ముచ్చటగా మూడోసారి మోడీ.. జూన్ 9న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మోడీచే ప్రమాణం చేయించనున్నారు. ఈ ప్రమాణస్వీకారానికి దేశం నుంచే కాకుండా ఆయా దేశాల నుంచి అతిథులు హాజరుకానున్నారు.

 

*ప్రధాని మోడీకి ‘‘తీపి పెరుగు’’ తినిపించిన రాష్ట్రపతి..
18వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించింది. ప్రధానిగా నరేంద్రమోడీ వరసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. శుక్రవారం జరిగిన ఎన్డీయే సమావేశంలో భాగస్వామ్య పార్టీలన్నీ మోడీని ఎన్డీయే పార్లమెంటరీ నేతగా ఎన్నుకున్నాయి. ప్రధానిగా మోడీకి అంతా సమ్మతి తెలిపారు. దీంతో ఈ రోజు(శుక్రవారం) ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి ప్రభుత్వ ఏర్పాటు గురించి చర్చించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న మోడీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ‘‘ దహీ-చీనీ( తీపి పెరుగు)’’ తినిపించారు. బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకున్న తర్వాత కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని రాష్ట్రపతి మోడీని ఆహ్వానించారు.జూన్ 9(ఆదివారం) సాయంత్రం 6 గంటలకు మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన మోదీ.. తనను ప్రధానమంత్రిగా నియమించాలని అధ్యక్షుడు ముర్ము లేఖ ఇచ్చారని, ప్రమాణ స్వీకారోత్సవానికి తగిన సమయం వివరాలను కోరారని చెప్పారు. తనతో ప్రమాణం చేసే మంత్రుల జాబితాను కూడా ఆమె కోరినట్లు తెలిపారు.

 

*ప్రమాణస్వీకారం తర్వాత మోడీ పర్యటన ఈ దేశాల్లోనే..
లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వచ్చింది. 543 సీట్లలో బీజేపీ కూటమి 293 సీట్లను కైవసం చేసుకుని మెజారిటీ సాధించింది. ఆదివారం రోజు మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరసగా మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపడుతూ నరేంద్రమోడీ చరిత్ర సృష్టిస్తున్నారు. శుక్రవారం జరిగిన ఎన్డీయే నేతలు, ఎంపీల సమావేశంలో భాగస్వామ్య పార్టీలైన తెలుగుదేశం, జేడీయూ, శివసేన, జనసేన ప్రధానిగా మోడీని బలపరిచాయి. ఇదిలా ఉంటే మోడీ ప్రమాణస్వీకారం తర్వాత తొలి విదేశీ పర్యటన ఇటలీలో చేయన్నారు. G7 సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఇటీవల ప్రధాని జార్జియా మెలోని ప్రధాని నరేంద్రమోడీని ఆహ్వానించారు. ఈ ఆహ్వానం మేరకు ఆయన ఇటలీ పర్యటించనున్నారు. మెలోని ఆహ్వానం అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇటలీ ప్రజలకు వారి 79వ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. G7 సమ్మిట్ జూన్ 13 నుండి 15 వరకు అపులియాలోని బోర్గో ఎగ్నాజియాలో జరుగుతుంది. G7 దేశాలలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK ,US ఉన్నాయి. ఈ సమ్మిట్ తర్వాత స్విట్జర్లాండ్‌లో జూన్ 15 నుంచి 16 వరకు ‘‘ ఉక్రెయిన్‌లో శాంతి శిఖరాగ్ర సదస్సు’’ జరుగనుంది. ఈ సమావేశానికి పీఎం మోడీని అధికారికంగా ఆహ్వానించారు. అయితే, ఈ సదస్సుకు ప్రధాని హాజరవుతారా..? లేదా.? అనేది సందేహమే. రష్యాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సదస్సుకు మోడీ హాజరయ్యే అవకాశాలు చాలా తక్కువ.

 

*రాజీనామాకు సిద్ధమైన ఫడ్నవీస్.. అమిత్ షా ఏం చెప్పారంటే..
లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ దారుణ ఫలితాలు తెచ్చుకుంది. 48 ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రంలో బీజేపీ 09 స్థానాలకు పరిమితమైంది. ఎన్డీయే కూటమి మొత్తంగా 17 స్థానాలను గెలుచుకుంది. ప్రతిపక్ష ఇండియా కూటమి ఏకంగా 30 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. ఈ ఘోర పరాజయం తర్వాత, ఈ ఫలితాలకు తానే బాధ్యత వహిస్తున్నట్లు బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. తాను డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. పార్టీ బలోపేతానికి పనిచేస్తానని అన్నారు. ఎక్కడ తప్పుజరిగిందో చూసుకుని, ప్రణాళికలను సిద్ధం చేసుకుంటానని చెప్పారు. అయితే, దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా వ్యవహారంలో అమిత్ షా జోక్యం చేసుకున్నారు. ఫడ్నవీస్‌తో మాట్లాడిన షా, ప్రభుత్వంలో కొనసాగాలని సూచించినట్లు సమాచారం. శుక్రవారం ఎన్డీయే సమావేశం ముగిసిన తర్వాత సీఎం ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్, ఫడ్నవీస్ రాష్ట్రంలో పరిస్థితులపై అమిత్ షాతో చర్చించారు. ఈ సమావేశంలోనే ఫడ్నవీస్ రాజీనామా అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ఫడ్నవీస్, అమిత్ షా నివాసంలో కలిశారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో పనిచేయడంతో పాటు రాష్ట్రంలో బీజేపీని మరింత బలపరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అమిత్ షా, ఫడ్నవీస్‌కి సూచించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ‘‘మీరు రాజీనామా చేస్తే బీజేపీ కార్యకర్తల నైతిక స్థైర్యం దెబ్బతింటుంది. కాబట్టి రాజీనామా చేయకండి’’ అంటూ షా, ఫడ్నవీస్‌తో చెప్పారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరుగనున్న ప్రధాని మోడీ ప్రమాణస్వీకారం తర్వాత వివరంగా చర్చిస్తానని చెప్పారు.

 

*చెప్పాల్సింది పవన్ కే చెప్పా.. ఇక చెప్పేదేం లేదు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన కామెంట్ చేశారు. తాజాగా తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ తో కుమారుడు అకీరా నందన్ ప్రధానమంత్రి మోదీని కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే ఆ ఫోటోల కింద వస్తున్న కామెంట్లకు సైతం స్పందిస్తున్నారు. ఈ క్రమంలో ఒక నెటిజన్ అంతా ఓకే గాని కళ్యాణ అన్న గురించి కూడా ఏమన్నా చెప్పొచ్చుగా వదిన. చాలా మంది వెయిటింగ్, ఏమైనా చెప్తారా? బట్ మీరు ఏ పోస్ట్ లోనూ చెప్పట్లేదు. మూడు రోజుల నుంచి అంటూ పవన్ కళ్యాణ్ గురించి స్పందించమని ఒకరు అడిగారు. అయితే నేను ఏదైనా చెబితే ప్రతి ఒక్కరు నేను అటెన్షన్ కోసం చెప్పానని అంటారు. అయితే నేను చెప్పాల్సింది ఏంటో ఆయనకు డైరెక్ట్ గా ఫోన్ కాల్ లో చెప్పేశాను. మీరు హ్యాపీగా ఉండొచ్చు అంటూ ఆమె కామెంట్ చేసింది. ఇక అఖిరా నందన్ హైట్ ఎంత అనే విషయాన్ని కూడా ఆమె ఈ పోస్ట్ లోనే వెల్లడించింది. అకిరా నందన్ ఆరడుగుల 4 అంగుళాలు ఉంటాడని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే అకిరా నందన్ అంత హైట్ అవ్వడానికి కాంప్లాన్ ఎన్నిసార్లు ఇచ్చారు అని అడిగితే ఇప్పటివరకు అసలు కాంప్లాన్ అనేది తాగలేదని ప్యూర్ గా వెజిటేరియన్ ఫుడ్ తింటాడని అది కూడా ఇంట్లో పండించిన ఆర్గానిక్ కూరగాయల తోనే తింటాడని, ఇద్దరు తల్లిదండ్రుల నుంచి వచ్చిన జెనెటిక్స్ కూడా అంత హైట్ రావడానికి ఉపయోగపడ్డాయని ఆమె కామెంట్ చేసింది. అలాగే ఈ ఫోటోలో ఆద్య మిస్సయిందని అంటే ఆమెకు స్కూలు మొదలైంది కాబట్టి ఆ రోజు ఆమె వెళ్లలేకపోయిందని రేణు చెప్పుకొచ్చింది.