NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానం.. రాజ్‌భవన్‌కు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సిద్ధం అయ్యారు.. అందులో భాగంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యేలు ఆయన్ని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న విషయం విదితమే.. ఇక, ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమైన కూటమి నేతలు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పురంధేశ్వరి.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు.. టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతిచ్చిన 164 మంది సభ్యుల జాబితాను ఈ సందర్భంగా గవర్నర్‌కు అందజేశారు.. సాయంత్రంలోపు చంద్రబాబును ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తామని గవర్నర్‌ వ్యాఖ్యానించినట్టు ఎన్డీయే కూటమి నేతలు వెల్లడించిన విషయం విదితమే.. కాగా.. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానించారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్.. దీంతో.. రాజ్‌భవన్‌కు చేరుకున్నారు కాబోయే ముఖ్యమంత్రి.. ప్రభుత్వ ఏర్పాటు.. మంత్రుల కూర్పు విషయాన్ని గవర్నర్‌కు వివరించారు చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు ప్రమాణస్వీకారం.. బెజవాడకు వీఐపీల క్యూ..
ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని అందుకుంది తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి. దీంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.. నాల్గో సారి సీఎంగా చంద్రబాబుతో పాటు మరికొందరు మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి దేశ ప్రధానితో సహా ఢిల్లీ పెద్దలు.. వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున వీఐపీలు రాబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే పెద్ద సంఖ్యలో వీఐపీలు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు క్యూ కట్టారు. ఇక సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్నారు. రేపు ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ఎయిర్ పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి సభా ప్రాంగణానికి రాబోతున్నారు ప్రధాని మోడీ. ఆ తర్వాత నేరుగా ఒడిషాకు వెళ్లి.. అక్కడ సాయంత్రం ఒడిషా సీఎం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ప్రధాని. ఇక అమిత్ షా, జేపీ నడ్డా, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ వంటి వారు రాబోతున్నారు. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవి కుటుంబం హాజరు కానుంది. చిరంజీవిని స్టేట్ గెస్టుగా ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మెగా ఫ్యామ్లీని గౌరవించింది. అలాగే రజనీ కాంత్ కు చంద్రబాబు ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు. దీంతో వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలు.. మరికొందరు ముఖ్య నేతలు హాజరు కాబోతున్నట్టు సమాచారం. అలాగే నారా, నందమూరి ఫ్యామీలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. మరోవైపు.. ప్రమాణ స్వీకారం అనంతరం రేపు సాయంత్రం తిరుపతి వెళ్లనున్నారు చంద్రబాబు దంపతులు.. ఎల్లుండి తిరుమల వెంకన్నను దర్శించుకోనున్నారు.

వైఎస్‌ జగన్‌కు చంద్రబాబు ఫోన్‌
సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకుంది టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. ఇక, రేపు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం ఇది నాల్గోసారి కాగా.. నవ్యాంధ్ర సీఎంగా రెండోసారి.. గన్నవరం ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.. ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల అగ్రనేతలు, మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్‌ రజనీకాంత్.. ఇలా ఎందరో ప్రముఖులు తరలిరానున్నారు.. నందమూరి, నారా ఫ్యామిలీలు కూడా సందడి చేయనున్నాయి.. అయితే, ఈ కార్యక్రమానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కూడా ఆహ్వానించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు.. కానీ, ఆయన అందుబాటులోకి రాలేదట.. తన ప్రమాణస్వీకారానికి వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను స్వయంగా ఆహ్వానించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నం చేశారు.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించారు టీడీపీ అధినేత.. కానీ, ఫోన్ కాల్‌కు వైఎస్‌ జగన్‌ అందుబాటులోకి రానట్టుగా చెబుతున్నారు. కాగా, రేపు ఉదయం 11.27 గంటలకు ఏపీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు చంద్రబాబు.. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానిస్తూ గవర్నర్ లేఖ రాశారు.. రేపు ఉదయం 11:27 గంటలకు ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా చంద్రబాబుకు లేఖ అందజేశారు గవర్నర్‌.. ఇక, శాసనసభా పక్ష నేతగా ఎన్నికైనందుకు చంద్రబాబుకు గవర్నర్ అభినందనలు తెలిపారు.

తెలంగాణకు స‌మాచార క‌మిష‌న‌ర్లు.. ద‌ర‌ఖాస్తులకు ఆహ్వానం
తెలంగాణలో సమాచార కమిషనర్ల నియామకానికి సిద్ధం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.. దీని కోసం దరఖాస్తులు ఆహ్వానించింది.. అర్హులై, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులు
చేసుకోవాలని సూచింది.. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులైన అభ్యర్థులు.. ఈ నెల 29వ తేదీన సాయంత్రం 5 గంటల వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం.. అభ్యర్థులు సంబంధిత డాక్యుమెంట్లను జత చేసి.. రిజిస్టర్‌ పోస్ట్‌ కూడా చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇక, దీనికి సంబంధించిన దరఖాస్తు పత్రాన్ని https://telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు అని సూచించారు.. మరోవైపు.. గ‌త ప్రభుత్వ హ‌యాంలోనూ ద‌ర‌ఖాస్తుల‌ను స్వీకరించారు అధికారులు.. అయితే, గ‌తంలో ద‌ర‌ఖాస్తు చేసుకున్నవారు మరోసారి దరఖాస్తు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని స్పష్టం చేశారు సీఎస్‌..

బడికి వేళాయే.. రేపటి నుండి తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం
వేసవి సెలవులు అనంతరం స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో రేపటి (జూన్ 12) బుధవారం నుంచి బడులు తెరుచుకోనున్నాయి. నేటితో వేసవి సెలవులు ముగియడంతో జూన్ 12 నుంచి తరగతుల్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల్ని ప్రోత్సహించేందుకు ఇప్పటికే బడిబాట కార్యక్రమాన్ని ప్రారంబించారు. గతవారం నుంచి.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట ప్రారంభమైంది. అందులో భాగంగానే జూన్ 12వ తేదీన తెలంగాణ‌ సీఎం రేవంత్ రెడ్డి స్కూళ్లను పున:ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో తరగతుల్ని ఉదయం 9 గంటలకే ప్రారంభించనున్నారు. అయితే.. ప్రైవేట్ పాఠశాలల్లో బోధన 8గంటలకే ప్రారంభం అవుతుంటే ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే 9.30కు మొదలు కావడంపై పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన, డ్రాపౌట్ల సంఖ్యను తగ్గించేందుకు విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కొత్త విద్యా సంవత్సరంలో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో కనీసం 90 శాతం విద్యార్ధుల హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లలో ఇకపై ప్రతిరోజు కనీసం 90 శాతం మంది విద్యార్ధులు హాజరు కావాల్సిందేనని తెలిపారు. అందుకోసం పేరెంట్స్ కమిటీలు, విద్యా కమిటీలు, స్థానిక స్వచ్ఛంధ సంస్థలు, ఉపాధ్యాయులను భాగస్వామ్యుల్ని చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కృషి
మోడీ 3.0లో ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణపై దృష్టి పెట్టవచ్చని పలువురు అభిప్రాయ పడ్డారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ వ్యూహం కాస్త మారినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం గత హయాంలో చమురు కంపెనీ పెట్టుబడుల ఉపసంహరణలో బిజీగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వ వైఖరి మారింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖను హర్దీప్ సింగ్ పూరీ బాధ్యతలు చేపట్టిన వెంటనే.. ప్రస్తుతం బీపీసీఎల్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ఉద్దేశం లేదని చెప్పారు. పెట్టుబడుల ఉపసంహరణ ప్రశ్నకు సమాధానమిస్తూ.. చమురు, గ్యాస్ పిఎస్‌యుల నుంచి ప్రభుత్వానికి 19-20 శాతం రాబడి వస్తుందన్నారు. అందువల్ల ఇప్పుడు BPCLలో పెట్టుబడుల ఉపసంహరణ ఉద్దేశం లేదని.. అన్వేషణ, ఉత్పత్తిపై మరింత దృష్టి పెట్టడానికి ప్రణాళిక ఉందన్నారు. త్వరలో చమురు ఉత్పత్తిని రోజుకు 45,000 బ్యారెళ్లకు పెంచనున్నట్లు తెలిపారు. దీనితో పాటు ముడిచమురు ధర బ్యారెల్‌కు 75-80 డాలర్లకు చేరినప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. గ్రీన్‌ఫీల్డ్ రిఫైనింగ్‌కు బిపిసిఎల్ అధునాతన దశలో ఉందని హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. పెట్రోలు, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించడం ఇంకా కష్టమన్నారు.

తవ్వకాల్లో బయటపడ్డ కళ్యాణి చాళుక్యుల నాటి శివుని ఆలయం..
మహారాష్ట్రలో పురాతన శివుడి ఆలయం బయటపడింది. నాందేడ్ జిల్లాలోని హోట్టల్ గ్రామంలో జరిపిన తవ్వకాల్లో శివుడి ఆలయానికి చెందిన ఆనవాళ్లు బయటపడ్డాయి. కళ్యాణి చాళుక్యుల నాటి ఆలయాలకు కేంద్రంగా ఉన్న హోట్టల్‌లో ఆలయంతో పాటు మూడు రాతి శాసనాలు లభించాయని అధికారులు వెల్లడించారు. క్రీ. శ. 1070 ప్రాంతంలో ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతల విరాళాలు ఈ శాసనాల్లో ఉన్నాయని చెప్పారు. ఒకప్పుడు కళ్యాణి చాళుక్యుల రాజధానిగా ఉన్న ఈ ప్రాంతం, అద్భుతమైన శిల్పాలకు, ఆలయాలకు కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ చారిత్రాత్మక దేవాలయాలలో కొన్నింటిపై చేపడుతున్న పరిరక్షణ పనుల్లో భాగంగా శిథిలాలను తొలగిస్తున్నప్పుడు పురావస్తు శాఖ అధికారులు ఆలయ స్థావరాన్ని కొనుగొన్నారు. నిర్మాణాన్ని నిర్ధారించేందుకు నాలుగు కందకాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. శివలింగంతో కూడిని ఆలయాన్ని వెలికితీశారు. ఈ ఆలయ నిర్మాణానికి ఇటుకలు వాడినట్లు రాష్ట్ర పురావస్తు శాఖ నాందేడ్ డివిజన్ ఇన్‌‌ఛార్జ్ అమోల్ గోటే తెలిపారు.

వారణాసి నుంచి ప్రియాంకా పోటీ చేసి ఉంటే, మోడీ ఓడిపోయేవారు..
తన సోదరి ప్రియాంకాగాంధీ వారణాసి నుంచి పోటీ చేసి ఉంటే ప్రధాని నరేంద్రమోడీని రెండు నుంచి మూడు లక్షల ఓట్లతో ఓడించేవారని మంగళవారం రాహుల్ గాంధీ అన్నారు. వారణాసి నుంచి 2014 నుంచి మోడీ పోటీ చేస్తున్నారు, 2014, 2019తో పోలిస్తే 2024లో గెలుపు మార్జిన్ తక్కువగా ఉంది. ఇటీవల రాయ్‌బరేలీ నుంచి మూడు లక్షల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిని ఓడించిన రాహుల్ గాంధీ, ఈ రోజు అక్కడి నుంచి మాట్లాడుతూ మోడీని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. తాను అహంకారంతో ఈ మాట చెప్పడం లేదని, మోడీ రాజకీయాలు తమకు నచ్చడం లేదని భారత ప్రజలు ఆయనకు సందేశం పంపారని, అందుకు తాను ఈ మాట చెబుతున్నట్లు వెల్లడించారు. ద్వేషం, హింసకు వ్యతిరేకంగా తాము నిలబడుతామనే సందేశాన్ని ప్రజలు పంపారని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ అమేథీ నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నప్పటికీ, ఆమె పోటీ నుంచి దూరంగా ఉన్నారు.

ఎంపీలుగా విజయం.. 10 రాజ్యసభ సీట్లు ఖాళీ
ఆయా పార్టీల్లో ఉన్న ఆశావాహులకు మరో లక్కీ ఛాన్స్ దక్కనుంది. లోక్‌సభ ఎన్నికల పుణ్యమా? అంటూ రాజ్యసభలో పది రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో త్వరలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ రానుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన రాజ్యసభ ఎంపీలు.. లోక్‌సభ ఎంపీలుగా గెలుపొందారు. దీంతో వారు రాజ్యసభ స్థానాలను వదులుకోనున్నారు. అసోం, బీహార్‌, మహారాష్ట్రల నుంచి రెండు చొప్పున, హర్యానా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, త్రిపుర నుంచి ఒక్కో స్థానం ఖాళీ అయినట్లు రాజ్యసభ కార్యాలయం ప్రకటనలో వెల్లడించింది. కామాఖ్య ప్రసాద్‌ తాసా, సర్బానంద సోనోవాల్‌ (అసోం), మీసా భారతి, వివేక్‌ కుమార్‌ (బీహార్‌), ఉదయన్‌రాజే భోంస్లే, పీయూష్‌ గోయల్‌ (మహారాష్ట్ర), దీపేందర్‌ సింగ్‌ హుడా (హర్యానా), కేసీ వేణుగోపాల్‌ (రాజస్థాన్‌), బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ (త్రిపుర), జ్యోతిరాదిత్య సింధియా (మధ్యప్రదేశ్‌)లు ఈ జాబితాలో ఉన్నారు. వీరంతా లోక్‌సభ ఎన్నికల్లో ఆయా స్థానాల నుంచి గెలుపొందారు. రాజ్యసభ సెక్రటేరియట్‌ నుంచి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో.. ఈ ఖాళీల భర్తీకి ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించనుంది.

‘నింద’ పడితే తుడిచేదెలా? ఆసక్తికరంగా వరుణ్ సందేశ్ సినిమా ట్రైలర్
హీరో వరుణ్ సందేశ్ చాలా కాలం తరువాత ‘నింద’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 21న రాబోతోంది. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించగా ఈ మూవీ నుంచి ఇప్పటికే వదిలిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, పాటలు అన్నీ కూడా సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక మైత్రీ మూవీస్ ఈ సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇక తాజాగా విశ్వక్ సేన్, సందీప్ కిషన్ ఈ మూవీ ట్రైలర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసి సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ అయితే సమాజాన్ని ఆలోచించేలా ఉంది. ‘మంచోడికి న్యాయం జరుగుతుందని నమ్మకం పోయిన రోజు.. ఒక సమాజం చనిపోయినట్టు’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌లో.. ‘మంచివాడి కోపం ఒక వినాశనానికి ఆరంభం’.. ‘అబద్దాన్ని బలంగా చెప్పినంత మాత్రాన నిజం అయిపోదు’.. ‘బలవంతుడిదే రాజ్యం అని అనుకోవడానికి మనమేమీ అడవుల్లో బతకడం లేదు’.. అంటూ సాగిన డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒక అమ్మాయి హత్యాచారం చుట్టూ కథ తిరుగుతుండటంతో అసలు నేరస్థుడు ఎవరు? అని హీరో చేసే ఇన్వెస్టిగేషన్ ఉత్కంఠ భరితంగా ఉండేలా కనిపిస్తోంది. శ్రేయారాణి, ఆనీ, క్యూ మధు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్యకుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో శ్రీరామసిద్ధార్థ కృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. రమీజ్ నవీత్ సినిమాటోగ్రాఫర్‌గా, అనిల్ కుమార్ ఎడిటర్‌గా పని చేశారు.

భార్యకు అక్రమ సంబంధం.. రాజ్ కుమార్ ఫ్యామిలీ హీరో సంచలనం!
ఒకపక్క సినీ పరిశ్రమలో పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండగానే మరోపక్క విడాకుల వ్యవహారాలు కూడా తెర మీదకు వస్తూనే ఉన్నాయి. చందన్ శెట్టి – నివేదా గౌడ విడాకులు తీసుకోవడం శాండల్‌వుడ్‌లో చర్చనీయాంశమైంది. ఇప్పుడు మరో శాండల్‌వుడ్‌ జంట విడాకుల వార్త వెలుగులోకి వచ్చింది. ‘యువ’ సినిమా ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన యువ రాజ్‌కుమార్‌ పెళ్లి పెటాకులు అయింది. శ్రీదేవి, యువరాజ్‌ కుమార్‌లు విడిపోయారు. యువ రాజ్‌కుమార్ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో డా.రాజ్‌కుమార్ కుటుంబాన్ని అందరూ గౌరవంగా ‘దొడ్మానయేవా’ అని పిలుచుకుంటారు. మనకి ఇక్కడ ఎన్టీఆర్, అక్కినేని, చిరంజీవి ఫ్యామిలీల లానే అక్కడ డాక్టర్ రాజ్‌కుమార్‌ది పెద్ద కుటుంబం. డాక్టర్ రాజ్‌కుమార్‌ కుమారులు శివరాజ్‌కుమార్‌, రాఘవేంద్ర రాఘవేంద్ర, పునీత్‌ రాజ్‌కుమార్‌లు సినిమాలు చేస్తూనే సమాజానికి ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. అయితే దొడ్మానయేవా కుటుంబానికి చెందిన విడాకుల కేసు తెరపైకి రావడం ఇదే తొలిసారి. నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్ 2వ కుమారుడు యువరాజ్, శ్రీదేవి బైరప్ప విడాకుల కేసు కోర్టుకు వెళ్లడంతో యువరాజ్ తరపు న్యాయవాది శ్రీదేవికి అనైతిక సంబంధం ఉందని ఆరోపించారు. అయితే మరోపక్క శ్రీదేవి తరఫు న్యాయవాది దీప్తి ఐతాన్ దీనిని ఖండించారు, ఇది వైవాహిక జీవిత సమస్య అని అన్నారు. నిజానికి శ్రీదేవిపై చాలా ఆరోపణలు వచ్చాయి.