NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం.. ముమ్మరంగా ఏర్పాట్లు..
ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో గ్రాండ్‌ విక్టరీ కొట్టిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధం అవుతుంది.. ఇక, ఈ నెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ఆయన ప్రమాణస్వీకారోత్సవానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. గన్నవరం ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధం చేస్తున్నారు.. వీఐపీలు పెద్ద సంఖ్యలు తరలిరానున్న నేపథ్యంలో.. ప్రముఖుల కోసం ఐదు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు.. ఇక, ప్రధాని నరేంద్ర మోడీ కూడా వస్తుండడంతో.. పటిష్ట భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ ప్రధాన గేటు నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా వేదిక దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక, 65 ఎకరాల్లో ఐదు చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు.. ఈ నెల 12న ఉదయం 11.27 నిమిషాలకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ కార్యక్రమానికి రెండు లక్షల మందికి సరిపోయే విధంగా ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వ యంత్రాంగం.. వర్షం వచ్చినా తట్టుకునే విధంగా అల్యూనినియం షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ ఏర్పాటు చేస్తుండగా.. మిగిలిన 11.5 ఎకరాల్లో నేతలు, ప్రజల కోసం గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు.. మరోవైపు భారీ led తెరలు ఏర్పాటు చేస్తున్నారు.. విమానాశ్రయం ప్రధాన గేటు నుంచి 800 మీటర్ల దూరంలో ఉన్న సభా వేదిక దగ్గరకు ప్రధాని ఇతర కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం.. ప్రముఖుల భద్రత, వేదిక, వసతుల కల్పన, బారికేడ్ల ఏర్పాటు, పారిశుధ్యం వంటి పనులను పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు..

కేశినేని నాని సంచలన నిర్ణయం.. రాజకీయాలకు గుడ్‌బై..
బెజవాడ రాజకీయలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. మాజీ ఎంపీ కేశినేని నాని సంచల నిర్ణయం తీసుకున్నారు.. ఇక, ప్రత్యక్ష రాజకీయాలనుంచి వైదొలుగుతున్నాను అంటూ ప్రకటించారు.. తనను రెండు సార్లు ఎంపీగా గెలిపించిన విజయవాడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు నాని.. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించారు బెజవాడ మాజీ ఎంపీ.. కాగా, 2014, 2019 ఎన్నిలకలో టీడీపీ నుంచి బరిలోకి దిగి బెజవాడ ఎంపీగా గెలిచిన నాని.. మొన్నటి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.. ఇక, ఈ సార్వత్రిక ఎన్నికల్లో తన తమ్ముడు కేశినేని చిన్నిపై నాని ఓడిపోయిన విషయం విదితమే.. ఈ నేపథ్యంలోనే ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ట్విట్టర్‌ (ఎక్స్‌)లో ఆయన పోస్టును పరిశీలిస్తే.. “జాగ్రత్తగా ఆలోచించి, ఆలోచించిన తర్వాత నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను మరియు నా రాజకీయ ప్రయాణాన్ని ముగించాను.. రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా విజయవాడ ప్రజలకు సేవ చేయడం అపురూపమైన గౌరవం. విజయవాడ ప్రజల స్థైర్యం మరియు దృఢసంకల్పం నాకు స్ఫూర్తినిచ్చాయి, వారి తిరుగులేని మద్దతుకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను రాజకీయాలకు దూరమవుతున్నా, విజయవాడ పట్ల నా నిబద్ధత బలంగానే ఉంది. విజయవాడ అభివృద్ధికి నేను చేయగలిగిన విధంగా మద్దతు ఇస్తూనే ఉంటాను. నా రాజకీయ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను కొత్త అధ్యాయానికి వెళుతున్నప్పుడు, నేను ప్రతిష్టాత్మకమైన జ్ఞాపకాలను మరియు అమూల్యమైన అనుభవాలను నాతో తీసుకువెళుతున్నాను. విజయవాడ అభివృద్ధి, శ్రేయస్సు కోసం పాటుపడుతున్న కొత్త ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు. విజయవాడ ప్రజలకు పదేళ్లపాటు సేవ చేసే అపురూపమైన అవకాశాన్ని కల్పించినందుకు మరోసారి వారికి కృతజ్ఞతలు. హృదయపూర్వక కృతజ్ఞతతో.. మీ కేశినేనా నాని” అంటూ ట్వీట్‌ చేశారు బెజవాడ మాజీ ఎంపీ కేశినేని నాని..

మా కులంలోకి రావొద్దు.. రెడ్ల పరువు తీయొద్దు..!
కాపు ఉద్యమ నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ లీడర్‌ ముద్రగడ పద్మనాభం పేరు మార్పు వ్యవహారాన్ని కొందరు రెడ్డీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.. అనపర్తి మండలం కొప్పవరం మాజీ సర్పంచ్‌ కర్రి వెంకట రామారెడ్డి దీనిపై ఓ లేఖ విడుదల చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది.. లేఖ విడుదల చేయడంతో పాటు.. ఓ వీడియోను కూడా సోషల్ మీడియాలో వదిలారు కర్రి వెంకట రామారెడ్డి… “ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముద్రగడ బలపర్చిన పార్టీ ఘోర పరాజయం పొందినందుకు రెడ్డి కులంలో కలవాలని గెజిట్‌ పబ్లికేషన్‌ కొరకు అన్నీ సిద్ధం చేసుకున్నట్టు ఓ ప్రకటన నాలుగు రోజుల క్రితం వెలవడింది.. అయితే, వారిని నేను కొన్ని వివరాలు కోరుతున్నాను.. అయ్యా పద్మాభం మీరు రెడ్డి కులంలో చేరటానికి మా రెడ్లు ఎవరైనా అనుమతి ఇచ్చారా? మా రెడ్డి కులంలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు..? మా రెడ్ల పరువు తీయడానికి మీరు చేరాలనుకుంటున్నారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. మరోవైపు ఆంధ్రా రెడ్డి సంఘం సభ్యలకు కూడా ఓ విజ్ఞప్తి చేశారు వెంకట రామారెడ్డి.. ముద్రగడ పద్మనాభం రెడ్లలో చేరాలని ప్రకటించి నాలుగు రోజులు అయినా మీరు ఎందుకు మాట్లాడటం లేదు ? అని నిలదీశారు. గౌరవంగా బ్రతికే రెడ్లు.. నైతిక విలువలు లేకుండా మాట్లాడే వ్యక్తులు మన రెడ్లలో చేరాలనుకుంటే.. వారిని చేర్చుకోవాల్సిన అవసరం మనకు ఏంటి? అని మండిపడ్డారు. ఇటువంటి వ్యక్తులను మన రెడ్లకు దూరంగా ఉంచవలసిన అవసరం సంఘం సభ్యులుగా మీకు ఉంది.. ఇప్పటికైనా సంఘం సభ్యులు ఒక ప్రకటన ద్వారా ఇటువంటి వ్యక్తులను మా రెడ్లలో చేర్చుకోవటం లేదని ప్రకటించాలని కోరారు.. ఏదైమైనా ముద్రగడ పద్మానభం రెడ్లలో చేరటాన్ని ఒక గ్రామ మాజీ సర్పించ్‌గా, రెడ్డిగా నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పేర్కొన్నారు కర్రి వెంకట రామారెడ్డి..

తెలుగు రాష్ట్రాల కేంద్రమంత్రుల శాఖలు ఇవే
మోడీ 3.0 ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి చోటు లభించింది. వరుసగా రెండోసారి కిషన్‌రెడ్డికి అవకాశం దక్కగా.. తొలిసారి బండి సంజయ్‌కు కూడా కేబినెట్‌లో అవకాశం దక్కింది. ఇక పొత్తులో భాగంగా తెలుగు దేశానికి చెందిన ఇద్దరి ఎంపీలకు మోడీ కేబినెట్‌లో చోటు లభించింది. రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ దక్కగా… కిషన్‌రెడ్డికి బొగ్గు, గనులు శాఖ, బండి సంజయ్‌కి హోంశాఖ సహాయ మంత్రి, పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణ, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి, శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి శాఖలు దక్కాయి. బీజేపీ నుంచి ముగ్గురికి, టీడీపీ నుంచి ఇద్దరికి అవకాశం లభించింది.
సికింద్రాబాద్ – కిషన్‌రెడ్డి (బీజేపీ)
కరీంనగర్ – బండి సంజయ్ (బీజేపీ)
శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు (టీడీపీ)
గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్‌ (టీడీపీ)
నరసాపురం – శ్రీనివాస వర్మ (బీజేపీ)

కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌లను వరించిన పదవులు ఇవే..!
కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ నిన్న 71 మంది మంత్రులతో ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంత్రులతో ప్రమాణం చేయించారు. మోదీ ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలను కేటాయించింది. తెలంగాణ నుంచి కిషన్‌ రెడ్డికి బొగ్గు, గనుల శాఖను అప్పగించిన కేంద్రం.. బండి సంజయ్‌కి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిని కట్టబెట్టింది. వీరితో పాటు.. మోడీ 3.0లో అమిత్ షా హోం మంత్రిత్వ శాఖను, రాజ్‌నాథ్ సింగ్ రక్షణ శాఖను కొనసాగించారు. మరోవైపు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖను నితిన్ గడ్కరీ తన వద్దే ఉంచుకున్నారు. మంత్రివర్గంలో అజయ్ తమ్తా, హర్ష్ మల్హోత్రా రాష్ట్ర మంత్రులుగా నియమితులయ్యారు. ఆర్థిక మంత్రిత్వ శాఖను నిర్మలా సీతారామన్ కొనసాగించారు , విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు నాయకత్వం వహించే బాధ్యతను ఎస్ జైశంకర్ కొనసాగిస్తారు. మోడీ 3.0లో రక్షణ, హోం వ్యవహారాలు, ఆర్థిక , విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ – బిగ్ 4లో ఎలాంటి మార్పులు చేయలేదు.

తొలి కేబినెట్ భేటీ.. 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ఆమోదం
ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో తొలి కేబినెట్ సమావేశం అయింది. ఢిల్లీలోని మోడీ నివాసంలో ఈ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆదివారమే మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక సోమవారం పీఎంవోలో ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించి.. సిబ్బందికి అభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు. అనంతరం సాయంత్రం కేబినెట్ తొలి సమావేశం అయింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని మంత్రి అవాస్‌ యోజన కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. ఇక మోడీ బాధ్యతలు స్వీకరించాక రైతులకు సంబంధించిన పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై తొలి సంతకం చేశారు. దీంతో 9.3 కోట్ల మంది రైతులకు రూ.20వేల కోట్ల ఆర్థిక సహాయం అందనుంది. ఈ సమావేశానికి రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ఎస్ జైశంకర్, ఎంఎల్ ఖట్టర్, హెచ్‌డి కుమారస్వామి, పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, జితన్ రామ్ మాంఝీ, రాజీవ్ రంజన్ సింగ్, సర్బానంద సోనోవాల్, డాక్టర్ వీరేంద్ర కుమార్, రామ్మోహన్ నాయుడు తదితరులు హాజరయ్యారు.

కేంద్ర మంత్రి పదవికి రాజీనామాపై క్లారిటీ!
సార్వత్రిక ఎన్నికల్లో కేరళ నుంచి గెలిచిన ఒకే ఒక్కడైన బీజేపీ ఎంపీ, నటుడు సురేష్ గోపికి అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి దక్కింది. కేరళలో త్రిసూర్ పార్లమెంట్ నుంచి ఎన్నికైన మొదటి బీజేపీ ఎంపీ సురేషే. సీపీఐ అభ్యర్థి సునీల్ కుమార్‌పై విజయం సాధించారు. అయితే ఆయన ఆదివారం కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే కొన్ని గంటలైనా గడవక ముందే సురేష్ గోపి రాజీనామా చేస్తున్నారంటూ వార్తలు షికార్లు చేశాయి. ఈ వార్తలపై సురేష్ గోపి స్పందించారు. తన రాజీనామాపై తప్పుడు కథనాలు ప్రచురిస్తు్న్నాయని ఆరోపించారు. మోడీ ప్రభుత్వంలో పని చేయుటకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మోడీ కేబినెట్‌లో ఉండడం గర్వకారణంగా భావిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర మంత్రిగా కేరళ అభివృద్ధి కోసం కృషి చేస్తానని వెల్లడించారు. ఆదివారం  మోడీతో పాటు 71 మంది కేంద్ర మంత్రులు ప్రమాణం చేశారు. వీరిలో 30 మందికి కేబినెట్‌ హోదా దక్కింది. ప్రధానితో సహా కేబినెట్ మంత్రిగా సురేశ్‌ గోపి ఆదివారం ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలోనే తనకు కేంద్ర మంత్రి పదవిపై ఆసక్తి లేదని.. ఎంపీగా కొనసాగడమే ఇష్టమని ఆయన తెలిపినట్లు వార్తలు పుట్టుకొచ్చాయి. తన అభిప్రాయాన్ని అధిష్ఠానానికి తెలియజేశానని.. తుది నిర్ణయం పార్టీకే వదిలేస్తున్నానని ప్రమాణ కార్యక్రమం అనంతరం ఆయన మాట్లాడినట్లు ఫేక్‌ సమాచారం ప్రచారమైంది. ఊహాగానాలు చర్చనీయాంశంగా మారడంతో సురేశ్‌ గోపి స్పందించారు. రాజీనామా చేసే ఉద్దేశం లేదన్నారు. మీడియాలో ఫేక్ ప్రచారం సాగుతోందని కొట్టిపారేశారు.  ఇక త్రిసూర్ నుంచి సురేష్ గోపి 74 వేల మెజార్టీతో ఘన విజయం సాధించారు.

గూజ్ బంప్స్ తెప్పిస్తున్న కల్కి ట్రైలర్.. చూశారా?
ది వెయిట్ ఈజ్ ఫైనల్లీ ఓవర్! ప్రభాస్ హీరోగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె & దిశా పటానీ నటించిన సైన్స్ ఫిక్షన్ మాగ్నమ్ ఓపస్ ‘కల్కి 2898 AD’ ట్రైలర్ ను ఎట్టకేలకి రిలీజ్ చేశారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్‌లో బి&బి బుజ్జి & భైరవ ప్రిల్యూడ్ విడుదలైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులుఈ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించినట్టుగానే ప్రకటించిన సమయానికి ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ లో మనం భైరవను, బుజ్జిని చూడొచ్చు. విజనరీ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో విజువల్ వండర్ గా రూపొందిన ‘కల్కి 2898 AD’ లో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ సహా ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. ఈ మూవీ అద్భుతమైన కథాంశం, హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ఇండియన్, ఇంటర్ నేషనల్ మార్కెట్లలో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వైజయంతీ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

నాలుగేళ్ల బాలిక రేప్ .. పోక్సో యాక్ట్ కింద ‘దృశ్యం’ నటుడు అరెస్ట్?
మలయాళ ‘దృశ్యం’తో పాటు పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్, విలన్‌లు పోషించిన మలయాళ నటుడు కూటికల్ జయచంద్రన్.. బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. మలయాళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఘటన జరిగిన రోజు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లిన బాలిక చాలాసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. అయితే బాలిక దుస్తులు కాస్త చిరిగిపోయి, శరీరం దుమ్ము కొట్టుకు పోయి ఉండటాన్ని ఆమె బంధువులు గమనించారు. ఈ క్రమంలో కోజికోడ్ పోలీస్ స్టేషన్‌లో 4 ఏళ్ల చిన్నారిని వేధించినట్టు తల్లి లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. నాలుగేళ్ల బాలికను వేధించాడంటూ చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కసబా పోలీసులు నటుడిపై కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలతో జయచంద్రన్ తన కుమార్తెను చిత్రహింసలకు గురిచేశాడని ఫిర్యాదు చేసింది. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆదేశాల మేరకు పోలీసులు చిన్నారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. పోలీసులు చిన్నారి ఇంటికి చేరుకుని వాంగ్మూలం నమోదు చేశారు. ఇక నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో నటుడు జోతుక్కల్ జయచంద్రన్‌ను పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలులో పెట్టారని వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపింది. జయచంద్రను కఠినంగా శిక్షించాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. వీరి స్వస్థలం పాలక్కాడ్ అయినప్పటికీ, కొంతకాలం నుంచి పొల్లాచ్చిలో నివసిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ అంశం మీద జయచంద్రన్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని నటుడిని ఇంకా అరెస్టు చేయలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.