NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

వైఎస్సార్‌ ఘాట్‌లో నివాళులర్పించిన సీఎం జగన్‌..
దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 74వ జయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నిర్వహించారు ఆయన అభిమానులు, కాంగ్రెస్‌ శ్రేణులు.. ఇక, ఏపీలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి.. ఇడుపులపాయలో ఘనంగా వైఎస్‌ జయంతి నిర్వహించారు. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి వైఎస్‌ భారతి, ఆయన తల్లి వైఎస్‌ విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పర్యటన ముగించుకుని నేరుగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్దకు చేరుకున్న సీఎం జగన్‌.. కుటుంబ సభ్యులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

‘వారాహి’ కష్టం వృథా కాదు.. వచ్చే ఎన్నికల్లో బలమైన ముద్ర..
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ బలమైన ముద్ర వేస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. తొలి విడత వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసిన జనసేనాని.. రెండో విడత వారాహి యాత్రకు సిద్ధం అవుతున్నారు.. ఇక, ఈ రోజు వారాహి యాత్ర కమిటీలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు.. మొదటి విడత వారాహి యాత్ర జరిగిన విధానంపై సమీక్ష జరిపారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారాహి యాత్ర కోసం పడిన కష్టం వృథా కాదు.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన బలమైన ముద్ర వేస్తుందన్నారు. ప్రజాకంటక పాలనకు విముక్తి గోదావరి జిల్లాల నుంచే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. మలి విడత యాత్రను కూడా ఇదే పట్టుదలతో విజయవంతం చేయాలి అని పిలుపునిచ్చారు. మనం ఎంత బలంగా ముందుకెళ్తే.. రాష్ట్రానికి అంత మేలు జరుగుతుందన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

వచ్చే వైఎస్సార్ జయంతి నాటికి.. జగన్‌ రెండోసారి సీఎం కావాలి..
వచ్చే ఏడాది వైఎస్సార్ జయంతి నాటికి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖపట్నం పెందుర్తిలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. వైస్సాఆర్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు మేనిఫెస్టోలో ఒక్కటైన సొంత ఆలోచన ఉందని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తాను అంటూ ప్రకటించారు. 175 సీట్లను ఎలా గెలవాలో జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తుంటే.. 175 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల కోసం చంద్రబాబు ఇతర పార్టీలతో సంప్రదిస్తున్నాడని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో జగన్ కు చంద్రబాబుకు మధ్య నక్కకి నాగలోకానీకి ఉన్నంత వ్యత్యాసం ఉందన్నారు అమర్నాథ్. ఇక, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరు కాగా.. మంత్రి అమర్నాథ్, ఎమ్మెల్యేలు, ఎంపీ సత్యవతి తదితరులు పాల్గొన్నారు.. దివ్యాంగులకు బ్యాటరీ బైక్ లు పంపిణీ చేశారు వైవీ సుబ్బారెడ్డి.

రైల్వే స్టేషన్‌ మాయం.. స్విమ్మింగ్ పూల్‌ ప్రత్యక్షం.. వదిలేస్తామా ఏంటి..?
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అంతంత మాత్రంగానే కురుస్తున్నాయి.. ఈశాన్య రుతుపవనాలు విస్తరించినా.. వర్షాలు అక్కడక్కడ మాత్రమే కురుస్తున్నాయి.. కానీ, మహారాష్ట్ర, గుజరాత్‌ లాంటి రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి.. ఇక, ముంబైలో పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి.. ఆగకుండా కురుస్తున్న వానలకు నవీ ముంబైలో నూతనంగా నిర్మిస్తున్న రైల్వే స్టేషన్‌లోకి నీళ్లు చేరాయి. ఇక్కడ రైల్వే స్టేషన్‌ ఉండేది ఏమైపోయింది అంటై ఆశ్చర్యం వ్యక్తం చేసేలా పరిస్థితి మారిపోయింది.. అయినా వదిలేస్తామా ఏంటి..? ఓ వైపు వర్షం వస్తున్నా.. మరోవైపు రైల్వే స్టేషన్‌లోకి నీరు చేరుతున్నా.. స్థానిక యువకులు మాత్రం.. అక్కడ నీటిలో జలకాలాడుతూ ఎంజాయ్‌ చేస్తున్నారు.. ఆ దృశ్యాలకు కాస్తా సోషల్‌ మీడియాకు ఎక్కడంతో.. వైరల్‌గా మారిపోయాయి.. ముంబైలో కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ రోడ్ల మీద వరదనీరు నిలిచిపోగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నవీ ముంబైలోని ఉరాన్ లోకల్ రైల్వే స్టేషన్ అయితే, స్విమ్మింగ్ పూల్ ని తలపిస్తూ నిండుగా నీళ్లు చేరాయి. దీంతో యువత అందులో హాయిగా జలకాలాడారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.. అయితే, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసిన పనులు ఎంత నిర్లక్ష్యంగా చేస్తున్నారే విమర్శలు కూడా ఉన్నాయి.. ఉరాన్ రైల్వే స్టేషన్ నుంచి ఇదే పరిస్థితి వెలుగులోకి వచ్చింది. ఉరాన్ రైల్వే స్టేషన్ నాసిరకమైన పని వెలుగులోకి తెచ్చాయి భారీ వర్షాలు.. వర్షం కారణంగా ఇక్కడ పెద్ద ఎత్తున నీరు చేరింది. నిలిచిన నీటిలో ఈత కొడుతూ ఆనందించారు యువకులు.. ఖార్కోపర్ నుండి ఉరాన్ లోకల్ రైలు ప్రారంభం కాకముందే ఉరాన్ రైల్వే స్టేషన్ వరదలతో నిండిపోయింది. గతంలో స్టేషన్‌లో ‘కబ్‌ ఆవోగే’ పాటలు పాడి రైల్వే సర్వీసులను ప్రారంభించాలంటూ మహిళలు డిమాండ్‌ చేశారు.

పెంపుడు కుక్కలతో కలిసి ధోనీ బర్త్ డే వేడుకలు.. వైరల్ అవుతున్న వీడియో..!
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా మహేంద్రుడి జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా చేసుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లో 52 అడుగుల ధోనీ కటౌట్ పెట్టారు. ఇక ఏపీలో అయితే ఏకంగా 77 అడుగుల ధోనీ కటౌట్ పెట్టారు మాహీ వీరాభిమానులు. నందిగామ సెంటర్‌లో ధోనీ 77 అడుగుల కటౌట్‌కి అభిమానులు, పాలాభిషేకం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే మహేంద్ర సింగ్ ధోని కోసం అభిమానులు ఇంత గొప్పగా సెలబ్రేట్ చేస్తే.. ధోనీ మాత్రం చాలా కూల్‌గా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు. రాంఛీలో తన నివాసంలో మూడు పెంపుడు కుక్కలతో కలిసి కేక్ కట్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అప్పుడెప్పుడో ఐదు నెలల క్రితం తన ఫామ్‌హౌజ్‌లో పొలం దున్నుతున్న వీడియోను షేర్ చేసిన ధోనీ, బర్త్ డే తర్వాతి రోజు తన కుక్కలతో సెలబ్రేషన్స్ జరుపుకున్న వీడియోను షేర్ చేసాడు. ‘మీ అందరి విషెస్‌కి చాలా థ్యాంక్యూ.. నేను నా బర్త్ డే రోజున ఏం చేశానో చెప్పడానికి ఇది ఓ చిన్న టీజర్’ అంటూ కాప్షన్ ఇచ్చాడు.

అన్ని లోకల్ లాంగ్వేజ్ లోకి చాట్ జీపీటీ..
ప్రస్తుతం చాట్ జీపీటీ పెద్ద ఎత్తున ప్రజాదరణను సొంతం చేసుకుంది. చాట్ జీపీటీ భాష ఆధారంగా ఒక మోడల్.. దానిపై ఏదైనా అడగండి.. అది మీతో సేమ్ మనిషిలా మాట్లాడనుంది. దాంతో మాట్లాడితే మీరు రోబోతో మాట్లాడుతున్నట్లు అనిపించదు.. నిజంగా మనిషితోనే మాట్లాడుతున్న అనుభుతి కల్గుతుంది. ఈ కృత్రిమ మేధస్సుపై ఆధారపడి ఉంటుంది. జీపీటీ అనేది AI చాట్ బాట్ లాంటిది. ఇది ఆన్‌లైన్ కస్టమర్ కేర్ కోసం రూపొందించారు. బహుళ భాషలను ఏకకాలంలో అర్థం చేసుకునే ప్రక్రియను అర్థం చేసుకునే విధంగా ఇది ఇప్పటికే ట్రైనింగ్ పొందింది. ఇప్పుడు మీకు లోకల్ భాషల్లో కూడా ఆన్సర్ ఇవ్వగలదు. మీ ప్రాంతీయ భాషలో ప్రశ్నలకు సమాధానాలు తెలుపనుంది. ప్రస్తుతం.. చాట్ జీపీటీ కొన్ని స్థానిక భాషలకు మాత్రమే సపోర్ట్ ఇస్తుంది.

ఇంటర్నెట్ నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేయాలి.. మణిపూర్ హైకోర్టు ఆదేశం
జాతి హింసకు గురైన రాష్ట్రంలో లీజుకు తీసుకున్న లైన్లు, ఫైబర్ ఆప్టిక్ కనెక్షన్లు ఉన్న వారికి ఇంటర్నెట్ యాక్సెస్‌ను అనుమతించాలని మణిపూర్ హైకోర్టు ఎన్.బీరెన్ సింగ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మెజారిటీ వర్గమైన మెయిటీ, గిరిజన కుకీల మధ్య జాతి ఘర్షణల కారణంగా మణిపూర్ రెండు నెలలుగా హింసతో రగిలిపోతోంది. షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ) హోదా కోసం మెయిటీల డిమాండ్‌కు నిరసనగా మే 3న రాష్ట్రంలోని కొండ జిల్లాల్లో ‘గిరిజన ఐక్యతా మార్చ్’ నిర్వహించిన తరువాత ఉద్రిక్తత పెరిగింది. కుకీ, మెయిటీ తెగల మధ్య హింస చెలరేగడంతో మే 3న మణిపూర్‌లో ప్రభుత్వం ఇంటర్నెట్‌ను నిలిపివేసింది. హింసను ఆపడానికి నకిలీ సమాచారం వ్యాప్తిని అరికట్టడం లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నందున ఇంటర్నెట్ నిషేధం ప్రభావాన్ని చాలా మంది ప్రశ్నించారు. అయితే రెండు నెలలుగా కాల్పులు, హత్యలు కొనసాగుతున్నాయి. “వైట్‌లిస్ట్” ఫోన్ నంబర్‌లకు ఇంటర్నెట్ కనెక్టివిటీని పునరుద్ధరించవచ్చో లేదో రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలని హైకోర్టు పేర్కొంది. మణిపూర్‌లో ఇంటర్నెట్ నిషేధం బిల్లు చెల్లింపులు, పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలు, పరీక్షలు, సాధారణ షాపింగ్, ప్రైవేట్ సంస్థల కార్యకలాపాలను ప్రభావితం చేసింది. పలువురు వ్యక్తులు దాఖలు చేసిన అభ్యర్థనలను అనుసరించి, జూన్ 20న హైకోర్టు కొన్ని నియమించబడిన ప్రదేశాలలో పరిమిత ఇంటర్నెట్ సేవలను అనుమతించాలని రాష్ట్ర అధికారులకు తెలిపింది.

వ్యాన్‌లో పేలిన గ్యాస్‌ సిలిండర్, ఏడుగురు దుర్మరణం.. విచారణకు ఆదేశించిన సీఎం
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ సర్గోధా జిల్లాలో శనివారం ప్యాసింజర్ వ్యాన్‌లోని గ్యాస్ సిలిండర్ పేలింది. గ్యాస్ సిలిండర్ పేలడంతో కనీసం ఏడుగురు మరణించారు. 14 మంది గాయపడ్డారు. రెస్క్యూ 1122 కంట్రోల్ రూమ్‌ను తెలిపిన వివరాల ప్రకారం.. ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. పంజాబ్‌లోని సర్గోధా జిల్లా భల్వాల్ తహసీల్‌లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని భల్వాల్ తహసీల్ హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను కూడా అదే ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురిలో ఐదుగురి ఆచూకీ తెలియకపోవడం గమనార్హం. గాయపడిన వారిలో ఇద్దరు 4 ఏళ్ల పిల్లలు, కొంత మంది 12 సంవత్సరాల పిల్లలు, 50 ఏళ్ల వయస్సు గల ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఉదయం 8:35 గంటలకు ఈ సంఘటన గురించి తమకు కాల్ అలర్ట్ వచ్చిందని రెస్క్యూ 1122 తెలియజేసింది. ఘటనాస్థలికి తొమ్మిది అంబులెన్స్‌లు, మూడు ఫైర్ ఇంజన్లు, ఒక రెస్క్యూ వాహనాన్ని పంపించారు.

ఉల్లిపాయ తొక్కలతో కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..!
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యదు.. ఎన్నో పోషకాలు ఉన్న ఉల్లిపాయలు రుచి పరంగా బెస్ట్.. ప్రతి వంటకు ఉల్లిపాయ ఉండాల్సిందే.. లేకుంటే కూర రుచించదు..ఉల్లిపాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని తెలుసు కానీ ఉల్లిపాయ తొక్కలు వల్ల కూడా మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఉల్లిపాయ జుట్టుకు ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఉల్లిపాయ తొక్కలను నీటిలో నానబెట్టి ఆ నీటితో తల స్నానం చేస్తే జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా అవుతుంది. ఉల్లిపాయల తొక్కలో ఫ్లేవనాయిడ్ల, క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్ ఉండటం ద్వారా ల్లెర్జిలు, ఇన్ఫెక్షన్ల మందుల తయారీలో కూడా బాగా ఉపయోగపడుతుంది.. అంతేకాదండోయ్ మనుషులకు మాత్రమే కాదు మొక్కలకు కూడా చాలా మంచిది.. దీన్ని మొక్కలకు కంపోస్ట్ ఎరువుగా కూడా వాడవచ్చు.. చీడ పీడల నుంచి కాపాడుతుంది.. ఇంకా చెప్పాలంటే మంచి దిగుబడికి దోహదం చేస్తాయి.. అందుకే ఇప్పటి నుంచి ఉల్లిపాయ తొక్కలను వేస్ట్ చెయ్యకండి.. వాటిని మీకు నచ్చినట్లు వాడుకోండి..

ప్రాజెక్ట్ కే అంటే ఏంటి.. ఈ టీ-షర్ట్స్ సొంతం చేసుకోండి
మన భారతీయ చిత్రసీమలో రూపొందుతున్న అత్యంత క్రేజీ ప్రాజెక్టుల్లో ప్రాజెక్ట్ కే ఒకటి. ప్రభాస్, కమల్ హాసన్, అమితాభ్ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పతాని వంటి భారీ స్టార్‌కాస్ట్‌తో.. యువ దర్శకుడు నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తొలుత పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనుకున్నారు కానీ, ఇప్పుడిది పాన్ వరల్డ్ సినిమాగా రాబోతోంది. అలాంటప్పుడు అంచనాలు మామూలుగా ఉంటాయా? బహుశా తారాస్థాయి అనే మాట కూడా చిన్నదే అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ నుంచి కొత్త అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అంటూ కళ్లు కాయలు కాచేలా ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. చిత్రబృందం కూడా అప్పుడప్పుడు క్రేజీ అప్డేట్స్‌తో సినీ ప్రియుల్ని మెస్మరైజ్ చేస్తోంది. జులై 20వ తేదీన శాన్‌డియాగో కామికాన్ వేడుకలో ఈ సినిమా టైటిల్‌ని రివీల్ చేయబోతున్నట్టు మేకర్స్ రీసెంట్‌గానే ప్రకటించారు. ఆ తర్వాత ‘ప్రాజెక్ట్ కే అంటే ఏంటో తెలుసుకోవాలని ఉందా?’ అంటూ ఓ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సర్‌ప్రైజ్‌ని రివీల్ చేస్తూ.. మెర్చండైజ్‌ని రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా.. ‘ప్రాజెక్ట్ కే అంటే ఏంటి?’ అని రాసి ఉన్న ఓ టీషర్ట్‌ని అందుబాటులో ఉంచారు. అయితే.. దీన్ని సొంతం చేసుకోవాలంటే, చాలా వేగంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రాజెక్ట్ యూనిట్ పొందుపరిచిన లింక్‌ని క్లిక్ చేసి, ఆపై ఓపెన్ అయిన విండోలో ‘పసుపు రంగులో’ ఉంటే కంటిన్యూ బటన్‌ని నొక్కాలి. దాన్ని నొక్కగానే.. మన పేరుతో పాటు ఈమెయిల్‌ని పొందుపరచాలి. అప్పుడు మనకు కావాల్సిన సైజ్‌లో టీషర్ట్‌ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. అంతే.. ఈ సింపుల్ స్టెప్స్‌తో ప్రాజెక్ట్ కే టీజర్ట్‌ని మీరు సొంతం చేసుకోవచ్చు.