NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

ఏపీలో మందస్తు ఎన్నికలు..? క్లారిటీ ఇచ్చిన సజ్జల
ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలపై ఎప్పటి నుంచో చర్చ సాగుతోంది.. అయితే, తాజాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హస్తినలో పర్యటించారు.. ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌తో సమావేశమై.. పలు అంశాలపై చర్చించారు.. కానీ, ఇదే సమయంలో మరోసారి ముందస్తు ఎన్నికలపై ప్రచారం ఊపందుకుంది.. ముందస్తు కోసమే సీఎం జగన్‌ ఢిల్లీ వెళ్లారనే చర్చ పొలిటికల్‌ సర్కిల్‌లో మొదలైంది.. దీనిపై ప్రభుత్వ సలహాదారు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు.. ముందస్తు ఎన్నికలు అన్నది మీడియా చేస్తున్న హడావిడి, కొన్ని పార్టీలు చేస్తున్న ప్రచారం మాత్రమేనన్న ఆయన.. ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదన్నారు.. ఇప్పటికే చాలా సార్లు చెప్పాం.. ప్రజా తీర్పు ప్రకారం చివరి రోజు వరకు పాలన ఉంటుందని తేల్చేశారు. ముందస్తు చంద్రబాబు చేస్తున్న గేమ్ ప్లాన్ లా ఉందని విమర్శించారు సజ్జల.. చంద్రబాబు తల కింద తపస్సు కూడా చేసుకోవచ్చు.. ఇద్దరే మాట్లాడుకునే విషయాలను వీరే ఊహించుకుని రాస్తారు.. సోఫాల కింద ఉంటారా? అంటూ సెటైర్లు వేశారు. సీఎం వైఎస్‌ జగన్‌.. ఢిల్లీ వెళ్ళిన ప్రతీసారీ ఫలితాలను రాష్ట్రం చూస్తూనే ఉందన్న ఆయన.. ఈ సారి మా ప్రభుత్వానికి పాజిటివ్ ఓటు రానుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పాజిటివ్ ఓటుతోనే గెలవాలని సీఎం కోరుకుంటున్నారని వెల్లడించారు. ఆర్ 5 జోన్ లో కొన్ని సంపన్న, కులీన వర్గాలే పేదలకు ఇళ్ళు రావద్దు అని కోరుకుంటున్నారని ఆరోపించారు.. కేంద్రం నుండి ఇళ్ళ నిర్మాణానికి నిధులు రావటం జాప్యం అయినా.. రాష్ట్ర వాటా నుంచి పనులు ప్రారంభం అవుతాయన్న ఆయన.. పేదలకు ఇళ్లు ఇస్తాం అంటే కోర్టులు మాత్రం ఎందుకు కాదంటాయి? అని ప్రశ్నించారు. మరోవైపు, షర్మిల ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్న తర్వాత ఆమె నిర్ణయాలు ఆమెకు ఉంటాయి.. వైసీపీగా మా విధానాలు మాకు ఉంటాయని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి.

హోటల్ రంగాన్ని ఇండస్ట్రియల్ రంగంగా గుర్తిస్తాం.. క్వాలిటీ ముఖ్యం
ఆంధ్రప్రదేశ్‌లో హెటల్‌ రంగాన్ని ఇండస్ట్రియల్ రంగంగా గుర్తించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.. ఏపీ హోటల్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హోటల్‌ రంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు.. హెటల్‌ రంగాన్నిఇండస్ట్రియల్‌ రంగంగా గుర్తించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక, చిన్న స్థాయి హోటల్స్ కూడా బాగుపడాలి.. ఏ వర్గం కూడా ఇబ్బంది పడకూదన్నదే మా ప్రభుత్వ ఉద్ధేశం అని స్పష్టం చేశారు మంత్రి బొత్స.. ఇదే సమయంలో.. హోటల్స్ లో భోజనం క్యాలిటీగా ఇవ్వాలని సూచించారు.. క్వాలిటీగా ఇస్తేనే.. ప్రజలు హోటల్స్‌కు వస్తారని తెలిపారు.. ఏ రంగంలో నైనా ఫ్రెండ్లీ విధానం ఉండాలి.. అదే మా ప్రభుత్వ లక్ష్యం అన్నారు.. సమస్యలు ఏవైనా మా దృష్టికి తీసుకువస్తే.. వెంటనే వాటిని సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తాం అని పేర్కొన్నారు మంత్రి బొత్స సత్యానారాయణ.. కాగా, విజయవాడలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.. అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆర్‌వీ స్వామి ప్రమాణ స్వీకారం చేశారు.

వారిపై కేసులు ఎత్తివేయాలని మంత్రి, ఎంపీ విజ్ఞప్తి.. సీఎం సానుకూల స్పందన..
సీఎం వైఎస్‌ జగన్‌ను కలిశారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, మాదిగ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొమ్మూరు కనకారావు.. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో.. 2017లో మాదిగలు తలపెట్టిన కురుక్షేత్ర మహాసభలో పాల్గొన్న పలువురు విద్యార్ధులు, పోరాటసంఘాల కార్యకర్తలపై అప్పటి ప్రభుత్వం నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ గడిచిన కొంతకాలంగా వివిధ దళిత సంఘాలు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి.. అయితే, దళిత సంఘాల వినతిని ఇవాళ సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు నేతలు.. కురుక్షేత్ర మహాసభలో పాల్గొన్నవారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.. దీంతో, కేసుల ఉపసంహరణకు సానుకూలంగా స్పందించారు సీఎం వైఎస్‌ జగన్‌.

వైసీపీ నేత హత్య కేసు.. టీడీపీ నేత అరెస్ట్..
క‌డ‌ప‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత శ్రీనివాసుల రెడ్డి హత్య కేసులో ప్రధాన కుట్రదారుడు టీడీపీ నేత సుబ్బారెడ్డిని అరెస్ట్‌ చేశారు పోలీసులు.. గత నెల 23న కడప సంధ్య స‌ర్కిల్ లో శ్రీనివాసుల రెడ్డి నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యాడు.. హత్య చేసేందుకు నిందితులకు టీడీపీ నేత పాలెం పల్లె సుబ్బారెడ్డి గట్టి ప్రోత్సాహం ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు.. రూ. 30 లక్షలు డబ్బులు సుపారితో పాటు అన్నీ చూసుకుంటాన‌ని నిందితులకు భరోసా ఇచ్చాడట సుబ్బారెడ్డి.. మీడియాతో మాట్టాడిన డీఎస్పీ ఎండి. షరీఫ్.. ఈ సంచలన విషయాలను వెల్లడించారు.. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రతాప్ తో పాటు ఐదుగురిని అరెస్ట్‌ చేశామని.. ప్రధాన కుట్రదారుడైన టీడీపీ నేత పాలంపల్లి సుబ్బారెడ్డి అలియాస్ రాజు సుబ్బారెడ్డి (42)ని కూడా అరెస్ట్‌ చేసినట్టు తెలిపారు. ఏ3 ముద్దాయి మేరువ శ్రీనివాసులు అలియాస్ ల్యాబ్ శ్రీను హత్య కు కొన్ని రోజుల ముందు సుబ్బారెడ్డి ఇంటిలో హత్యకు కుట్ర చేశారని తెలిపార డీఎస్పీ షరీఫ్‌.. హతుడు శ్రీనివాసుల రెడ్డికి, పాలెంపల్లి సుబ్బారెడ్డి ఇరువురి మధ్య పెండింగ్ లో కొన్ని భూ వివాదాలు ఉన్నాయని.. శ్రీనివాసులరెడ్డి వ్యాపారంలో ఎదుగుతూ ఉండడంతో ఓర్వలేకపోయిన టీడీపీ నేత సుబ్బారెడ్డి కుట్రకు పూనుకున్నారని పేర్కొన్నారు. హత్య జరిగిన తర్వాత ఏ 3 అయిన ల్యాబ్ శ్రీను పాలెంపల్లి సుబ్బారెడ్డి కి హతమార్చినట్టు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.. గూగుల్ టేక్ అవుట్ ద్వారా సాంకేతిక ఆధారాలు సేకరించాం.. అరెస్ట్ అయిన టీడీపీ నేత పాలెంపల్లి సుబ్బా రెడ్డి 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని వెల్లడించారు. రెండు హత్యాయత్నం కేసులు, రెండు ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులతో పాటు ఒక ఎస్పీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో సుబ్బారెడ్డి నిందితుడిగా ఉన్నాడని డీఎస్పీ ఎండీ షరీఫ్‌ తెలిపారు.

కడపలో సీఎం జగన్‌ పర్యటన.. మూడు రోజుల పూర్తి షెడ్యూల్‌ ఇదే..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తీరిక లేకుండా గడుపుతున్నారు.. ఓవైపు ఢిల్లీ పర్యటన, మరోవైపు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై వరుస సమీక్షలు, పార్టీ మీటింగ్‌లు, బహిరంగసభలు.. బటన్‌ నొక్కి నిధులు విడుదల చేయడం ఇలా బిజీగా గడిపేస్తున్నారు.. ఇక, తన సొంత జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు సీఎం జగన్‌.. ఈ నెల 8, 9, 10 తేదీల్లో కడప జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తొలిరోజు తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం ఇడుపులపాయలోని ప్రార్థన మందిరానికి వెళతారు. ఇక, 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

నో ప్లై జోన్లుగా వరంగల్, హనుమకొండ ప్రాంతాలు
ఈ నెల 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగం ప్రధాన మంత్రి పర్యటించే ప్రాంతాల్లో గగనతలాన్ని నో ప్లై జోన్ ప్రకటిస్తూ వరంగల్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేసారు. ఈ ఉత్తర్వులను అనుసరించి ప్రధాన మంత్రి భద్రత దృష్ట్యా నేటి నుండి 8తేదీ వరకు వరంగల్, హనుమకొండ నగరానికి 20 కిలో మీటర్ల వ్యాసార్థంలో గగనతలాన్ని నో ప్లై జోన్ గా ప్రకటిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కావున డ్రోన్, రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్, పారాగ్లైడర్ లాంటివి ఎగరవేయడం పూర్తిగా నిషేధించబడ్డాయి. ఎవరైన వ్యక్తులుగాని, సంస్థలుగాని ఉత్తర్వులను అతిక్రమించినట్టయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసారు.

కాంగ్రెస్‌కు 10 ఎకరాలు.. బీఆర్‌ఎస్‌కు 11 ఎకరాలు.. సైన్స్ సిటీకు మాత్రం స్థలం ఇవ్వరు
మరోసారి కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల సంగతి అతీగతీ లేదని, పక్క రాష్ట్రంలో 15 లక్షల ఇళ్లు కట్టారన్నారు. పార్టీ ఆఫీస్ లకు స్థలం ఉంటుంది తప్ప పేద ప్రజలకు ఇళ్లకు ఇవ్వడానికి ఉండదని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి కంటోన్మెంట్ లో 10 ఎకరాలు ఈ ప్రభుత్వం ఇచ్చిందని, 11 ఎకరాలు తమ పార్టీ కి కేటాయించకుందన్నారు. కానీ.. సైన్స్ సిటీ కు మాత్రం స్థలం ఇవ్వరంటూ చురకలు అంటించారు. వరంగల్ లో సైనిక్ స్కూల్ నీ అటకెక్కించారని, మెట్రో ఎక్కడ వరకు ఉండాలని కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. పాత పట్నంలో ఎందుకు నిర్మించలేదని, ఎస్సీ విద్యార్థులు అకౌంట్స్ లో డబ్బులు వేస్తామని అంటే… గత పది నెలలు గా విద్యార్థులకు అందకుండా ఈ ప్రభుత్వం చేస్తుందని, ఆ డబ్బులు ప్రగతి భవన్ కి ఇవ్వండి మేము ఇస్తామని అంటున్నారని కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబానికే దశాబ్ది ఉత్సవాలు.. తెలంగాణ ప్రజల కు కాదని ఆయన విమర్శించారు.

జూలై 18న ఎన్డీఏ మీటింగ్.. కలిసి వెళ్లేది ఎవరు..?
జూలై18న ఎన్డీయే కూటమి కీలక సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి పలు పార్టీలకు ఆహ్వానాలు పంపించేందుకు ఎన్డీఏ సిద్ధమయినట్లు తెలుస్తుంది. అయితే బీజేపీ మాత్రం ఏ కూటమికి చెందని మరికొన్ని పార్టీలను ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లోని పలు పార్టీలతో పొత్తుల కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. కర్నాటకకు చెందిన జేడీఎస్, ఏపీకి చెందిన వైసీపీలతో పొత్తులుంటాయని రాజకీయవర్గాల్లో చర్చ కొనసాగుతుంది. అయితే, ఇటీవల అమిత్ షా నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జేపీ నడ్డాతో కూడా చర్చలు జరిపారు. ఈ లెక్కనా ఈ మీటింగ్ కు టీడీపీకి కూడా ఆహ్వానం వస్తుందనే టాక్ రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్డీయేలో చేరేది ఏ పార్టీ అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. 2018లో ఎన్డీయే నుంచి టీడీపీ పార్టీ వైదొలగింది. గతంలో ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు వ్యవహరించారు. అయితే ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయనే వార్తలు వస్తుండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదును పెట్టాయి. సరిగ్గా ఇదే సమయంలో ఎన్డీయే సమావేశం జరుగుతుంది.

చంద్రయాన్-3 ప్రయోగం.. ఇస్రో అధికారిక ప్రకటన.. డేట్‌ మారింది..
చంద్రయాన్-3 ప్రయోగంపై అధికారికంగా ప్రకటన చేసింది ఇస్రో.. ముందుగా ఈ నెల 13వ తేదీన చంద్రయాన్‌ ప్రయోగం ఉంటుందంటూ ముందుగా వెల్లడించిన.. ఇప్పుడు మూన్ మిషన్ ప్రయోగం ఒక రోజు వెనక్కి నెట్టబడింది.. ఈ ప్రయోగం జూలై 14 మధ్యాహ్నం 2.35 గంటలకు జరగనుంది.. దీంతో.. చంద్రున్‌ ప్రయోగం కోసం మరో రోజు వేచి ఉండాలి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రయాన్-3 జులై 13న బయలుదేరుతుందని గత వారం ప్రకటించిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), ఈ రోజు ప్రయోగాన్ని ఒక రోజు వెనక్కి నెట్టినట్లు తెలిపింది. ఈ ప్రయోగం ఇప్పుడు జూలై 14న మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో జరగనుంది. భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయ్యాయి. ప్రయోగం తర్వాత రెండు నెలలపాటు ప్రయాణించనున్న స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌తో దాని జర్నీ ముగుస్తుంది. ఆ తర్వాత జాబిల్లపై పరిశోధనలు ప్రారంభమవుతాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గతంలోనూ చంద్రయాన్‌ మిషన్లు చేపట్టింది. మొత్తం ప్రయోగంలో సాఫ్ట్‌ల్యాండింగ్‌ చాలా క్లిష్టమైన ప్రక్రియ. చంద్రయాన్‌-2 సాఫ్ట్‌లాండింగ్‌లో విఫలం కావడంతో చంద్రుడిపై కూలిపోయింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్‌-3 ప్రయోగం కోసం ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది.. ఇప్పుడు కూడా సాఫ్ట్‌ల్యాండింగ్‌ ఏమంత సులభం కాదని కూడా నిపుణులు చెబుతున్నారు.

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం.. శరద్ పవార్ తో రాహుల్ గాంధీ కీలక భేటీ
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ గందరగోళం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చీలిక తర్వాత జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ ఢిల్లీలో కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎనిమిది తీర్మానాలను ఆమోదించారు. ఇందులో అజిత్ పవార్ సహా 9 మందిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శరద్ పవార్‌ను కలిశారు. అయితే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. కాంగ్రెస్ మీడియా సమావేశం ఒకేసారి నిర్వహించారు.. విషయం తెలుసుకున్నా.. రాహుల్ గాంధీ అకస్మాత్తుగా తన ప్రెస్ మీట్ ను రద్దు చేసుకుని అక్కడి నుంచి వెంటనే శరద్ పవార్‌ను కలిసేందుకు బయలుదేరారు. రాహుల్ గాంధీ శరద్ పవార్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. దీంతో రాహుల్ గాంధీకి జితేంద్ర అవద్ స్వాగతం పలికారు. ఈ భేటీలో ఎన్సీపీలో తిరుగుబాటు, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు వ్యూహంపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.

గ్రీన్ శారీలో అదరగోడుతున్న అరియానా..
అరియానా.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆర్జీవి తో చేసిన ఒక్క ఇంటర్వ్యూ తో ఈ అమ్మడు బాగా పాపులర్ అయింది. ఈమె అందాలను పొగుడుతూ ఆర్జీవీ చేసిన కామెంట్స్ అప్పట్లో సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారాయి. అలా వచ్చిన పాపులరిటితో అరియానా బిగ్ బాస్ షో కి ఎంపిక అయ్యింది. బిగ్ బాస్ షో లో ఈ అమ్మడు అందాలకి అందరూ తెగ ఫిదా అయ్యారు. ఆ షో తరువాత కూడా ఆర్జీవి తో ఒక బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ లో ఆర్జీవీ అరియానా అందాలను బోల్డ్ గా వర్ణిస్తూ ఉంటాడు. ఆ ఇంటర్వ్యూ కూడా బాగా వైరల్ అయింది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని ఫిగర్ తో అందరినీ అలరిస్తుంది ఈ హాట్ బ్యూటీ. ప్రతిరోజు అందాల విందు చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. అయితే తాజాగా గ్రీన్ శారీ తో మరింతగా రెచ్చగొట్టింది. ఈ శారీలో ఎంతో హాట్ గా కనిపించింది అరియానా..

కృతిశెట్టికి స్టార్ హీరో కొడుకు వేధింపులు.. అసలు నిజం చెప్పేసిందిగా!
బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించిన ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా మారింది కృతి శెట్టి. పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాదు దాదాపు 100 కోట్ల కలెక్షన్స్ కూడా తీసుకురావడంతో ఆమెకు వరుస సినిమా అవకాశాలు లభించాయి. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఆమెకు సినిమా అవకాశాలు లభిస్తూ వస్తున్నాయి. దీంతో తెలుగులో సినిమాలు చేస్తూనే మరో పక్క తమిళంలో కూడా మెరుస్తోంది. అయితే తాజాగా ఆమె ఒక స్టార్ హీరో కొడుకు తన ఇబ్బంది పెడుతున్నాడని, తమిళ మీడియాతో వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. తమిళ్ లో ఒక స్టార్ హీరో కొడుకు ఆమె వెళుతున్న ప్రతి ఫంక్షన్ కి అటెండ్ అవుతూ ఆమె వెళుతున్న ప్రతి చోటకి వెళుతూ ఆమెకు కాల్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడని కృతి శెట్టిని స్నేహితురాలుగా మార్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు కానీ ఆమెకి ఇష్టం లేక ఇబ్బంది పడుతున్నట్లు తమిళ మీడియాతో వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయం మీద కృతి శెట్టి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చింది. దయచేసి ఇలాంటి వార్తలు పుట్టించి తప్పుడు సమాచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయొద్దని చేతులు జోడించి ఆమె త్వీట్ పెట్టింది. అసలు ఏ మాత్రం సెన్స్ లేని ఈ పుకార్లను లైట్ తీసుకుందామని అనుకున్నాను కానీ హద్దులు దాటి ఈ వార్త ముందుకు వెళ్తోంది కాబట్టి ఈ విషయం క్లారిటీ ఇస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతానికి ఆమె చేతిలో తెలుగు సినిమాలేవీ లేవు కానీ ఒక మలయాళ సినిమాతో పాటు జీని అనేది తమిళ సినిమాలో కూడా అని హీరోయిన్ గా నటిస్తుంది.