హైదరాబాద్ మెట్రో రైల్ ఆల్ టైం హై రికార్డ్..
హైదరాబాద్ మెట్రో రైలు మరో అరుదైన రికార్డును సృష్టించింది.. హైదరాబాద్‌లో మెట్రో రైల్ పట్టాలు ఎక్కిన తర్వాత.. క్రమంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో మెరుగు పడుతూ వస్తుంది.. ఇక, గణేష్ నిమజ్జనం మరికొన్ని ప్రత్యేక సందర్భాల్లో రికార్డు స్థాయిలో ప్రయాణికులను తీసుకెళ్లింది.. అయితే, ఇప్పుడు చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది హెచ్‌ఎంఆర్.. సోమవారం రోజు ఏకంగా 5.10 లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చింది.. హైదరాబాద్ మెట్రో రైలు చరిత్రలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి. ఈ రికార్డు సంఖ్యలు ఈ పర్యావరణ అనుకూలమైన, వేగవంతమైన, హైదరాబాద్‌లో సౌకర్యవంతమైన మరియు అత్యంత సుఖవంతమైన ప్రయాణ విధానం పట్ల ప్రయాణీకుల విశ్వాసం మరియు ఆమోదాన్ని సూచిస్తోందని హెచ్‌ఎంఆర్ పేర్కొంది. చారిత్రాత్మకమైన మైలురాయిని అందుకున్న నేపథ్యంలో.. హెచ్‌ఎంఆర్ ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్, ఎండీ అండ్ సీఈవో కేవీబీ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది ఒక ముఖ్యమైన సందర్భం, హెచ్‌ఎంఆర్‌ని తాము ఇష్టపడే ప్రయాణ భాగస్వామిగా ఎంచుకుంటూ తమ సంఘీభావాన్ని చూపిన మా విలువైన ప్రయాణికులకు మేం ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం అని వెల్లడించారు. ఇక, కరోనా మహమ్మారి మా వ్యాపారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.. కానీ, టీమ్‌ల యొక్క స్థిరమైన ప్రయత్నాలు, కృషి ద్వారా, ఈ రోజు మనం ఈ విజయాన్ని అందుకున్నాం అన్నారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ నుండి నిరంతర సహకారం, లభిస్తోన్న మద్దతు వల్ల నగర ప్రజలకు అత్యంత అనుకూలమైన, విశ్వసనీయమైన, వేగవంతమైన.. ప్రజా రవాణా వ్యవస్థను అందించడం సాధ్యమైందని పేర్కొన్నారు కేవీబీ రెడ్డి.
పురంధేశ్వరిపై జాలి పడుతున్నా.. బీజేపీ చేసిన పనులకు సమాధానం చెప్పాలి
భారతీయ జనతా పార్టీ, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరి నియమితులైన విషయం విదితమే.. ఆమెకు బీజేపీ నేతలతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా శుభాకాంక్షలు చెబుతుండగా.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేవీపీ రామచంద్రరావు మాత్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశరాఉ.. పురంధేశ్వరి పట్ల జాలి పడుతున్నానన్న ఆయన.. బీజేపీ చేసిన పనులకు పురంధేశ్వరి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. అసలు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు అన్యాయం చేసింది బీజేపీయే అని మండిపడ్డారు కేవీపీ.. బీజేపీకి ఉన్న 0.48 ఓటు శాతం ఇంకా తగ్గిపోతోందని జోస్యం చెప్పారు. మరోవైపు.. చంద్రబాబుకు ఒక నిబద్ధత లేదని విమర్శించారు కేవీపీ.. మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఘటనా ఘటన సమర్ధుడు అని విమర్శించారు.. రాహుల్ గాంధీతో స్టేజీ పంచుకుని, 2018లో కలిసి పోటీ చేశారు.. కానీ, రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే చంద్రబాబు నోరు మెదపలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేవీపీ.. 2024లో ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారకపోవచ్చు.. కానీ, సంస్ధాగతంగా బలపడతాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు.. వాటికి నా శరీరం అలవాటు పడింది..!
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును తప్పించి.. పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించింది అధిష్టానం.. కేంద్ర బీజేపీ వర్గాల నుంచి ఈ సమాచారం వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయారు వీర్రాజు.. నడ్డా నుంచి ఫోన్ వచ్చిన తర్వాత పార్టీ కార్యాలయం నుంచి ఇంటికెళ్లిపోయిన ఆయన.. అధ్యక్ష స్థానం నుంచి తప్పించడంపై మీడియాతో మాట్లాడేందుకు మొదట నిరాకరించారు.. అయితే, పురంధేశ్వరికి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.. ఇక, సాయంత్రానికి మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. అధిష్టానం సరైన నిర్ణయం తీసుకుందన్నారు సోము వీర్రాజు.. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదిస్తున్నానన్న ఆయన.. పార్టీ చెప్పిన విధంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇక, రాజకీయాల్లో ఫిర్యాదులు కొత్తేమీ కాదన్నారు వీర్రాజు.. ఇటువంటి ఫిర్యాదులకు నా శరీరం అలవాటు పడిందన్న ఆయన.. నా మీద ఫిర్యాదులు ఎవరు చేశారో, పార్టీలో నా వ్యతిరేకులు ఎవరో నాకు తెలియదని పేర్కొన్నారు. చాలా మంది పంచాయతిలో కూడా గెలవలేనని నన్ను విమర్శిస్తారు.. అలా గెలవాలనుకుంటే వేరే పార్టీలో ఉండే వాడిని అంటూ హాట్ కామెంట్లు చేశారు. 1978 నుంచి బీజేపీలో ఉన్నాను.. నా పార్టీ బీజేపీయే అని స్పష్టం చేశారు.. బీజేపీ బలోపేతం కోసం నా శాయశక్తులా పని చేశాను.. ఇప్పుడు మా అధిష్టానం నిర్ణయం వల్ల నాకు బాధ లేదు, ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు.. బూత్ స్థాయిలో కమిటీలు వేసి పార్టీ కోసం పని చేశాను. నా సారథ్యంలో జరిగిన మూడు ఉప ఎన్నికలలో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపిపారు.. నా సేవలను ఏ విధంగా ఉపయోగిస్తారనేది అధిష్టానం ఇష్టం. సామాన్య కార్యకర్తగా పని చేయడానికి అయినా సిద్ధమే అన్నారు.. ఎవరి సారథ్యంలో కమిటీలు వచ్చినా.. పార్టీ కోసం అందరూ పని చేస్తారు అని వెల్లడించారు సోము వీర్రాజు.
హరిరామ జోగయ్యపై మంత్రి అమర్నాథ్ ఫైర్.. సీనియర్ ప్యాకేజీ స్టార్..!
వైసీపీ, మాజీ మంత్రి హరిరామ జోగయ్యపై లేఖల యుద్ధం నడుస్తూనే ఉంది.. ఇక, హరిరామ జోగయ్యపై మంత్రి అమర్నాథ్ ఫైర్ అయ్యాడు.. జోగయ్య సీనియర్ ప్యాకేజ్ స్టార్, నమ్మక ద్రోహి అంటూ విరుచుకుపడ్డారు.. మాట్లాడలేని, కనీసం పెన్ను పట్టుకోలేని వయసులో ఆయన రాతలు జుగుప్స కలిగిస్తున్నాయన్న ఆయన.. జోగయ్య భూమికి భారం.. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజ్ తీసుకుని సంతకం పెట్టి లేఖలు విడుదల చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. పీఆర్పీ నుంచి బయటకు వచ్చి చిరంజీవి వ్యక్తిత్వాన్ని కించపరిచిన నైజం జోగయ్యది అని దుయ్యబట్టారు. చిరంజీవి సీట్లు అమ్ముకున్నారని మాట్లాడిన జోగయ్య ను పవన్ కల్యాణ్ సమర్థిస్తారా..? సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. రేపు పవన్ కల్యాణ్, చంద్రబాబుకు ఇదే పరిస్థితి జోగయ్య ద్వారా ఎదురుకావడం ఖాయమని జోస్యం చెప్పారు. మరోవైపు హరిరామజోగయ్య బహిరంగ లేఖ రాశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. “మా నాన్న గారితో మీకున్న పరిచయాలను దృష్టిలో ఉంచుకుని గుడివాడ గుర్నాథరావు గారి కొడుకుగా ఈ ఉత్తరం రాస్తున్నాను. మీకు ఇలాంటి ఉత్తరం రాస్తున్నందుకు బాధగానే ఉన్నా, మీరు ఎంత స్థాయికి దిగజారిపోయారో, మీరే సమాజంలో నిరూపించుకున్న తర్వాత, ఇక నాబోటి వారికి మీకు సమాధానం చెప్పక తప్పటం లేదు. ఏ మనిషికైనా వయసు పెరిగేకొద్దీ సంస్కారం పెరుగుతుందని అంటారు. మీకు మాత్రం పవన్ కల్యాణ్ సాంగత్యంతో వయసు పెరిగేకొద్దీ అశ్లీలత పెరుగుతోంది. కాబట్టే, ఇలాంటి చెత్త ఉత్తరాలను జనం మీదకు వదిలి మీరు కూడా స్వాతిరెడ్డి అలియాస్ స్వాతి చౌదరితో పోటీపడాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోందని విమర్శించారు.
దారుణం.. గిరిజనుడిపై బీజేపీ నేత మూత్ర విసర్జన..!
మధ్యప్రదేశ్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.. ఆధునిక సమాజంలోనూ మనిషిని మనిషిగా చూడడంలేదంటూ ఈ ఘటనపై దళిత, గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మానవాళికి అవమానం కలిగించే ఈ ఉదంతం మధ్యప్రదేశ్‌లో కలకలం రేపుతోంది.. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి.. అక్కడ మెట్లపై కూర్చొని ఉన్న మరో వ్యక్తిపై మూత్ర విసర్జన చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారిపోయింది.. సమాచారం ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లా నుండి ఈ విషయం నివేదించబడింది. ఈ ఘటనపై సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ఘటనపై మాట్లాడుతూ ‘సిధి జిల్లాకు సంబంధించిన వైరల్ వీడియో నా దృష్టికి వచ్చింది. నిందితుడిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిపారు.. కాగా, వైరల్ అయిన వీడియోలో, ఒక పేద వ్యక్తి మెట్లపై కూర్చొని ఉన్నాడు. అతని జుట్టు చిందరవందరగా ఉంది. చాలా రోజులుగా ఆకలితో ఉన్నట్టుంది అతని ముఖం. అయితే, నీలిరంగు జీన్స్ మరియు చెక్డ్ షర్ట్ ధరించిన ఒక వ్యక్తి అతడి ముందు నిలబడి, సిగరెట్ తాగుతూ.. అతడిపై మూత్ర విసర్జన చేస్తున్నాడు. మూత్ర విసర్జన చేసే వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక, మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసే వ్యక్తి బీజేపీ యూత్ లీడర్ ప్రవేశ్ శుక్లాగా చెబుతున్నారు. కానీ, బీజేపీ నేతలు దీనిపై స్పందించడానికి నిరాకరించారు.. మరోవైపు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశాల మేరకు సిద్ధి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనపై గిరిజన, దళిత, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.. తాగితే తాగు.. ఊగు.. కానీ, సాటి మనిషి అనే కనికరం లేకుండా.. ఇలా ప్రవర్తించడం ఏంటి? అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మధ్యప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీపై విపక్షాలు ఈ వీడియో షేర్ చేస్తూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.
ఖలిస్తాన్ ఉగ్రవాదులకు పాక్ ఐఎస్ఐ సహకారం.. పోర్చుగల్‌లో కొత్త స్థావరం..
ఖలిస్తాన్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తరుచుగా ఆందోళన పేరుతో విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. ఇదిలా ఉంటే పాకిస్తాన్ గూఢాచార సంస్థఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) ఇటీవల పంజాబ్‌లోని క్రియాశీల నేరస్థులకు, ఖలిస్తానీ ఉగ్రవాదులకు సాయం చేస్తోంది. పోర్చుగల్ నుంచి అక్రమ ఆయుధాలను పంపినట్లు సమాచారం. ఇప్పటికే వివిధ దేశాల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు స్థావరాలు ఉండగా.. కొత్తగా పోర్చుగల్ లో స్థావరాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట..
జార్ఖండ్ హైకోర్టులో కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి ఊరట లభించింది. పరువు నష్టం కేసులో దాఖలైన పిటిషన్ హైకోర్టు విచారణ జరిపింది. రాహుల్‌పై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఆగస్టు 16న విచారణ చేపట్టనున్నది. 2019లో కర్ణాటక కోలార్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రధానిని ఉద్దేశించి ‘మోడీ’ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పరువు నష్టం కేసులు నమోదయ్యాయి. జార్ఖండ్‌లో నమోదైన కేసు విచారణ సందర్భంగా రాహుల్‌కు హైకోర్టు మధ్యంతర ఉపశమనం ఇచ్చింది. జస్టిస్ సంజయ్ కుమార్ ద్వివేది బెంచ్ పిటిషన్‌పై విచారణ జరిపింది. విచారణ సందర్భంగా అన్ని పక్షాల వాదనలు విన్న కోర్టు, సమాధానం ఇవ్వాలని పిటిషనర్ ప్రదీప్ మోడీని ఆదేశించింది. అదే సమయంలో రాహుల్ గాంధీకి ఊరటనిస్తూ తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది. రాంచీలో రాహుల్ గాంధీపై బిజెపి నేత ప్రదీప్ మోదీ పరువునష్టం కేసు వేశారు. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన విషయం తెలిసిందే. రాహుల్ గాంధీ పరువు నష్టం కేసు పాట్నాలో కూడా కొనసాగుతోంది.
పాకిస్థాన్‌లోని కటాస్‌రాజ్ శివాలయం
పాకిస్థాన్‌లోని ఈ శివాలయానికి 900 ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు. ఈ ఆలయ చరిత్ర శివుడు మరియు మాత సతితో పాటు పాండవులకు సంబంధించినది. సతీ తల్లి అగ్నికి తనను తాను సమర్పించుకున్నప్పుడు శివుని కన్నీళ్లు ఇక్కడ పడ్డాయని చెబుతారు. అందుకే ఇక్కడ అమృత్ కుండ్ సరోవర్ ఏర్పడింది. శివరాత్రి మరియు శ్రావణ సమయంలో ఈ ఆలయంలో వివిధ ప్రకాశం ఉంటుంది.
క్లైమాక్స్ సీన్ కోసం భారీగా ప్లాన్ చేస్తున్న సుకుమార్..?
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన పుష్ప ది రైజ్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించింది. ఈ సినిమాను క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ భారీ స్థాయిలో తెరకెక్కించాడు.ఈ సినిమాతో అల్లుఅర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు.ఈ సినిమా నార్త్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది.ఈ చిత్రం కు కొనసాగింపుగా పుష్ప ది రూల్ ను తెరకెక్కిస్తున్నాడు సుకుమార్.. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి గా చూస్తున్నారు.ముఖ్యంగా సౌత్ ప్రేక్షకుల కంటే ఎక్కువగా నార్త్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. పుష్ప ది రూల్ సినిమాను సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెలిసిందే.మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప ది రైజ్ సినిమాలో దేవిశ్రీ అందించిన పాటలు చాట్ బస్టర్ గా నిలిచాయి..ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ అందుకుంది.ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా నుండి తాజాగా మరొక అప్డేట్ బయటకు వచ్చింది. పుష్ప 2 కు సంబంధించిన కీలక సీన్స్ ను ఇప్పటికే తెరకెక్కించిన సుకుమార్ ఇప్పుడు బ్యాలెన్స్ గా ఉన్న క్లైమాక్స్ సీక్వెన్స్ ను తెరకెక్కించేందుకు భారీ సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.. ఈ క్లైమాక్స్ షూట్ కోసం భారీ సెట్ ను వేయిస్తున్నారని ఈ సీక్వెన్స్ లో రష్మిక పాత్రకు సంబంధించిన డెత్ మిస్టరీ రివీల్ అవుతుంది అని సమాచారం… మరి క్లైమాక్స్ ను సుకుమార్ భారీ స్థాయిలోనే ప్లాన్ చేసినట్టు సమాచారం.మరి ఈ సినిమా విడుదల అయిన తరువాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
మెగాడాటర్ నిహారిక-చైతన్య విడాకుల ప్రక్రియ పూర్తి?
మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల కొంతకాలం క్రితం చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. పెద్దలు కుదిర్చిన వీరి వివాహం కొన్నాళ్ల క్రితం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి కుటుంబ సభ్యులు వివాహాన్ని రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ లో ఘనంగా నిర్వహించారు. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్టుగా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద అటు మెగా ఫ్యామిలీ నుంచి ఖండన కానీ అలాగే సమర్థన కానీ ఏదీ రాలేదు. కేవలం మెగా ఫ్యామిలీ అనే కాదు చైతన్య జొన్నలగడ్డ కుటుంబం నుంచి కూడా రాలేదు. అయితే తాజాగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు ప్రస్తుతానికి నిహారిక కొణిదెల చైతన్య జొన్నలగడ్డ దంపతులు అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నిజానికి ఇద్దరూ మ్యూచువల్ డైవర్స్ కోసం కొన్నాళ్ల క్రితం అప్లై చేశారని అది ఈరోజుతో అఫీషియల్ గా పూర్తయింది అని తెలుస్తోంది. వీరికి విడాకులు మంజూరు చేస్తున్నట్లు కోర్టు అధికారికంగా ప్రకటించినట్లు చెబుతున్నారు. దీంతో ఈ జంట అధికారికంగా విడాకులు తీసుకున్నట్లయింది. ఇక వీరిద్దరూ ఎందుకు విడాకులు తీసుకున్నారు అనే వివరాల మీద మాత్రం ఎలాంటి సమాచారం లేదు. ఈ ఏడాది మార్చి నెలలో జొన్నలగడ్డ చైతన్య అతని ఇంస్టాగ్రామ్ ఖాతాలో నిహారికతో ఉన్న అన్ని ఫోటోలు డిలీట్ చేసినప్పుడు వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి అని ప్రచారం మొదలైంది. అప్పుడే వీరు విడిపోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అప్పటికి నిహారిక ఆ ఫోటోలను తొలగించకపోవడంతో ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఏమో అనుకున్నారు. ఆ తర్వాత నిహారిక కూడా చైతన్యతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేయడంతో వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే విషయం తెర మీదకు వచ్చింది. ఇక వీరి విడాకుల ప్రక్రియ కూడా పూర్తి కావడంతో మెగా ఫ్యామిలీ నుంచి ఈ విషయం మీద ఏదైనా క్లారిటీ వస్తుందేమో వేసి చూడాలి.
దివంగత వైఎస్సార్‌ను అవమానపరిచేలా పోస్టులు.. వీడియో రిలీజ్ చేసిన అనంతశ్రీరామ్
తెలుగు ప్రేక్షకులందరికీ అనంత శ్రీరామ్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో అనేక సూపర్ హిట్ సినిమాలకు పాటలు రాశారు అనంత శ్రీరామ్. చిన్న వయసు వాడైనా సరే సాహితీ సంపదలో చాలా పెద్దవాడు అని అనేకమంది సినీ రచయితలు ఆయనను మెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి అనంత శ్రీరామ్ అనూహ్యంగా ఒక వివాదంలో చిక్కుకున్నాడు ఈ నేపథ్యంలో ఆ వివాదానికి సంబంధించిన క్లారిటీ ఇస్తూ ఒక వీడియో విడుదల చేశారు. ఈ మేరకు అనంత శ్రీరామ్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా నిముషం 19 సెకండ్ ల నిడివి గల ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో అనంత శ్రీరామ్ మాట్లాడుతూ ‘’నమస్కారం అండి నేను అనంత శ్రీరామ్, దివంగత ముఖ్యమంత్రి శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఆయనను అవమానపరిచేలా పొలిటికల్ మిస్సైల్ అనే ఒక ట్విట్టర్ ఖాతాలో కొన్ని రాతలు రాస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆ రాతల వెనుక ఆ పోస్టుల వెనుక ఉన్నది నేనే అనే వదంతులు వ్యాపించాయి, అయితే నాకు ఆ రాతలకు ఆ పోస్టులకు అవి పోస్ట్ చేస్తున్న ఖాతాకు ఎలాంటి సంబంధం లేదు. నా వృత్తి రీత్యా నేను అన్ని పార్టీలకు పాటలు రాస్తాను, అంతే తప్ప వ్యక్తిగతంగా ఏ పార్టీ మీద నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. అవన్నీ నమ్మవద్దని నేను వైసీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకవేళ భవిష్యత్తులో రాజకీయాల మీద ఎలాంటి అభిప్రాయం తెలియజేయాల్సి వచ్చిన, అది నిక్కచ్చిగా నిర్భయంగా నా అధికారిక సామాజిక మాధ్యమాల్లో తెలియజేస్తానని అంతే తప్ప ఇలా ఊరు పేరు లేని ఖాతాల ద్వారా ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించనని భవిష్యత్తులో కూడా ఇది జరగదని మాట ఇస్తున్నాను. ప్రస్తుతం నేను నాటా మహాసభల్లో పాల్గొనడానికి అమెరికా రావడం జరిగింది, అందువల్ల నేను భారత దేశంలో లేను, అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఈ విషయం మీద ఖచ్చితంగా సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు.