NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

కీలక నిర్ణయం.. ఇక ఆటోమేటిక్‌గా రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌.. 0.35 పైసలకే..
ట్రాన్స్‌పోర్ట్‌ పెరిగింది.. వేగం పెరుగుతోంది.. గమ్యస్థానాల మధ్య దూరం తగ్గిపోయినట్టే కనిపిస్తోంది.. కానీ, అనుకోని ప్రమాదాలు బాధితుల కుటుంబాలను చిందరవందర చేస్తున్నాయి.. దీంతో.. ప్రమాద బీమాపై అంతా దృష్టిపెడుతున్నారు.. తమకు ఏదైనా జరిగితే.. తమను నమ్ముకుని ఉన్నవారు ఇబ్బందుల్లో పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.. అయితే, ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) వెబ్‌సైట్‌ కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై ఐఆర్‌సీటీసీలో టికెట్‌ బుక్‌ చేసుకోవాలంటే బీమా కోసం ప్రత్యేకంగా ఆప్షన్‌ ఎంచుకోవాల్సిన పనిలేదు.. ఎందుకంటే.. ఇండియన్‌ రైల్వే టికెట్ బుకింగ్‌లో బీమా సదుపాయాన్ని డిఫాల్ట్‌గా అందజేయనున్నట్టు పేర్కొంది. IRCTC పోర్టల్‌లో రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు ఇప్పుడు ఆటోమేటిక్‌గా రూ. 10 లక్షల బీమా కవరేజీ అందించబడుతుందని బీమా పరిశ్రమ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.. రూ. 10 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీని ఎంచుకోవడం నుండి, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) ఇప్పుడు ఈ పథకాన్ని ఎంపిక చేసుకునేలా మార్చింది. మరో మాటలో చెప్పాలంటే, IRCTC పోర్టల్‌లో తమ రైలు టిక్కెట్‌లను బుక్ చేసుకునే ప్రయాణీకులకు ఇప్పుడు ఆటోమేటిక్‌గా రూ. 10 లక్షల బీమా కవరేజీ అందించబడుతుంది.. బీమా రక్షణను కోరుకోని వారు తగిన బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా అది నిలిపివేయబడుతుంది.. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే, రూ. 10 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీకి ప్రీమియం కేవలం 0.35 పైసలు మాత్రమే చార్జ్‌ చేయనున్నారు. కాగా, IRCTC వెబ్‌సైట్‌ ద్వారా రోజుకు దాదాపు 15 లక్షల మందికి పైగా ప్రయాణికులు టికెట్లు బుక్‌ చేసుకుంటూ ఉంటారు.

వారికి గుడ్‌న్యూస్‌ చెప్పిన సీఎం జగన్‌..
వరుసగా సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులను బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇక, స్వయం సహాయక సంఘాలకు కూడా శుభవార్త చెప్పేందుకు సిద్ధం అయ్యారు.. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన ఖరారు అయ్యింది.. ఈనెల 26వ తేదీన అమలాపురంలో పర్యటించబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి.. అమలాపురంలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ రాయితీ నిధులను బటన్ నొక్కి జమ చేయనున్నారు ఏపీ సీఎం.. ఇక, ముఖ్యమంత్రి సభకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా…

సీఎంతో కె రహేజా గ్రూప్‌ ప్రెసిడెంట్‌ భేటీ.. రూ.600 కోట్ల పెట్టుబడి..
తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని కలిశారు కె రహేజా గ్రూప్‌ ప్రెసిడెంట్‌ నీల్‌ రహేజా.. ఈ సమావేశానికి ఇనార్బిట్‌ మాల్స్‌ సీఈవో రజనీష్‌ మహాజన్, కె రహేజా గ్రూప్‌ ఆంధ్రా, తెలంగాణా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ గోనె శ్రావణ్‌ కుమార్‌ హాజరయ్యారు.. అయితే, విశాఖపట్నంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణ పనుల శంకుస్ధాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఆహ్వానించారు కె రహేజా గ్రూపు ప్రతినిధులు.. విశాఖపట్నంలో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్‌ మాల్‌ నిర్మాణం చేపట్టనున్నారు.. మూడేళ్లలో రూ.600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు కె రహేజా గ్రూప్‌ సిద్ధమైంది.. ఇక, ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని పెట్టుబడులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో చర్చించారు కె రహేజా గ్రూపు ప్రతినిధులు. ఈ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఏపీఐఐసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఇక, మూడు రాజధానులపై ముందుకు సాగుతోన్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం.. త్వరలోనే విశాఖ కేంద్రంగా పరిపాలన ప్రారంభిస్తామని ప్రకటించిన విషయం విదితమే. విశాఖ పరిపాలన రాజధానిగా.. అమరావతి శాసన రాజధానిగా.. కర్నూలు న్యాయ రాజధానిగా చేస్తామని పలు సందర్భాల్లో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఏయూ ప్రొఫెసర్‌ లైంగిక వేధింపుల్లో కొత్త ట్విస్ట్..!
ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. హిందీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ సత్యనారాయణపై లైంగిక వేధింపుల ఆరోపణ వచ్చిన విషయం తెలిసిందే కాగా.. హిందీ ప్రొఫెసర్ లైంగిక వేధింపుల ఆరోపణల తర్వాత మీడియా ముందుకు బాధితురాలి భర్త వచ్చారు.. జాతీయ మహిళా కమిషన్, పోలీసులు, యూనివర్శిటీ విచారణ జరుపుతోందని.. మూడు నెలల క్రితం మేం ఫిర్యాదు చేశామన్నారు.. ఇక, దురుద్దేశపూర్వకంగా ప్రొఫెసర్ సత్యనారాయణ ప్యానెల్ ఇవ్వ కుండా అడ్డుకుంటున్నారు.. అర్హత లేకుండా యూనివర్శిటీలో నియామకం, పీహెచ్‌డీ అడ్మిషన్లలో అక్రమాలు సహా ప్రొఫెసర్ సత్యనారాయణ చేస్తున్నవి నిరాధారమైన ఆరోపణలు అని కొట్టిపారేశారు. ఈ వ్యవహారంలో మీడియా ప్రమేయం అనవసరం, ఇది పూర్తిగా చట్టబద్ధంగా జరుతున్న విచారణ. యూనివర్సిటీ అధికారులు మాత్రమే సమాధానం చెప్పాలి అని బాధితురాలి భర్త ఉజ్వల్ ఘటక్ డిమాండ్‌ చేశారు. అయితే, ఉజ్వల్‌ ఘటక్‌ అనే ప్రైవేటు వ్యక్తి ద్వారా ఈ వ్యవహారాలన్నీ యూనివర్సిటీ అధికారులు నడుపుతున్నారని ప్రొఫెసర్‌ ఆరోపించారు. డిఫెన్స్ లిక్కర్ వ్యాపారం చేస్తూ యూనివర్సిటీ అధికారులను ఉజ్వల్ చెప్పుచేతల్లో పెట్టుకున్నాడని ఆరోపించారు. తన భార్యకు అర్హత లేకపోయినా ఫ్రీ పీహెచ్‌డీ కోసం ఒత్తిడి తెచ్చారని, నిబంధనలకు విరుద్ధమని తిరస్కరించినందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ప్రొఫెసర్‌ సత్యనారాయణ ఆరోపించారు.. ఒక్కరోజు కూడా డిపార్ట్ మెంట్‌కు రాని మహిళపై లైంగిక వేధింపులు ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

ప్రధాని మోడీ సమక్షంలో 38 పార్టీలతో ఎన్డీయే కూటమి భేటీ
దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బెంగళూరులో 26 విపక్ష పార్టీలు సమావేశం కాగా.. అటు ఢిల్లీలో ఎన్డీయే కూటమి కూడా 38 పార్టీలతో తన బలాన్ని నిరూపించుకునే పనిలో నిమగ్నమైంది. ఈ రోజు ఢిల్లీలోని అశోక హోటల్‌లో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో ఎన్డీయే కూటమి భేటీ జరిగింది. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్డీయే బల నిరూపణగా భావించే ఈ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని హోటల్ అశోకకు చేరుకున్నారు. ఈ సమావేశానికి వచ్చిన ప్రధాని మోడీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఘనస్వాగతం పలికారు. భారత్‌ అంతటా విస్తరించి ఉన్న తమ కూటమి భాగస్వాములతో నేడు సమావేశం జరగనుండటం సంతోషంగా ఉందని భేటీకి ముందు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రాంతీయ ఆకాంక్షలు నెరవేరడానికి, దేశ అభివృద్ధికి ఇది సరైన సమయమని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ముందు కూటమిలో ఉన్న పార్టీల నేతలు ప్రధాని మోడీకి పూల మాలతో సత్కరించారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్‌డీఏను గట్టెక్కించడానికి, అభివృద్ధి చెందుతున్న మహా ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’కు వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి బీజేపీ కొనసాగుతున్న ప్రయత్నాలలో ఈ సమావేశం ఓ భాగమని తెలుస్తోంది. ఎన్డీఏ కూటమికి హాజరైన పార్టీలు చాలావరకు చిన్న పార్టీలు. తక్కువ ఎంపీలు ఉన్న పార్టీలు కాగా.. మరికొన్నింటికి అసలు ఎంపీలే లేరు. ఏదైమైన ఈ భేటీతో వచ్చే ఎన్నికల్లో సీట్ల పంపకాల విషయంలో తేల్చుకునే అవకాశంగా ఈ భేటీని చిన్న పార్టీలు భావిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. వచ్చే ఎన్నికల కోసం బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. యూపీ, బీహార్‌ లాంటి పెద్ద రాష్ట్రాల్లో తమ పట్టును నిలుపుకునేందుకు అన్ని చర్యలు చేపడుతోంది.

తమిళనాడు మంత్రి రూ.41.9 కోట్ల ఆస్తులను ఫ్రీజ్‌ చేసిన ఈడీ
అక్రమ ఇసుక మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి తమిళనాడు విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి, ఆయన కుమారుడి ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉన్న రూ.41.9 కోట్ల విలువైన ఆస్తులను స్తంభింపజేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం తెలిపింది. మంత్రి విల్లుపురం జిల్లాలోని తిరుక్కోయిలూరు అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉండగా, ఆయన 49 ఏళ్ల కుమారుడు గౌతమ్ సిగమణి కల్లకురిచ్చి స్థానం నుంచి పార్లమెంట్‌ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్థిక నేరాలపై దర్యాప్తు చేస్తున్న దర్యాప్తు సంస్థ, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద మంత్రికి సంబంధించిన ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ”ఈడీ పీఎంల్‌ఏ, 2002 కింద 17/07/2023న ఎమ్మెల్యే, తమిళనాడు ప్రభుత్వంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న కె. పొన్ముడికి చెందిన ఏడు ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. ఆయన కుమారుడు, ఎంపీ గౌతమ్ సిగమణికి చెందిన ప్రాంతాల్లో కూడా సోదాలు చేపట్టింది.” అని మంత్రి రెండోసారి విచారణకు హాజరైన తర్వాత ఈడీ ట్వీట్ చేసింది. రాత్రిపూట దాదాపు ఏడు గంటలపాటు ప్రశ్నించిన తర్వాత తండ్రీకొడుకులు ఈ ఉదయం మాత్రమే కార్యాలయం నుంచి బయలుదేరారు. ”సోదాల సమయంలో, వివిధ నేరారోపణ పత్రాలు, నగదు మొత్తం రూ.81.7 లక్షల విలువైన విదేశీ కరెన్సీ (బ్రిటీష్ పౌండ్లు)ని స్వాధీనం చేసుకున్నాం. రూ. 13 లక్షల భారతీయ కరెన్సీ స్వాధీనం చేసుకున్నాం. రూ.41.9 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఫ్రీజ్ చేయబడ్డాయి.” అని ఈడీ తెలిపింది.

మ్యాట్రిమోనీలో 14 మ్యాచ్‌లు.. కన్‌ఫ్యూజ్‌తో నెటిజన్లకు యువతి ప్రశ్న..
ఒకప్పుడు తెలిసినవారి ద్వారా సంబంధాలు చూసేవారు.. పురురోహితులు కూడా సంబంధాలు చూసిపెట్టేవారు.. ఇక, ఇప్పుడు మొత్తం మ్యాట్రిమోనీ సైట్లదే హవా.. వయస్సు, చదువు, ఉద్యోగం, జీతం.. తదితర వివరాలను పేర్కొంటూ మ్యాట్రీమోనీ సైట్లలో నమోదు చేసుకోవడం.. నచ్చిన మ్యాచ్‌ కోసం చూస్తున్నారు.. అయితే, ఓ యువతికి ఏకంగా 14 మ్యాచ్‌లు వచ్చాయట.. కానీ, ఎవరిని చేసుకోవాలి అనే విషయంలో మాత్రం.. ఆ అమ్మాయి ఓ నిర్ణయానికి రాలేకపోయింది.. దాంతో.. అందరి ప్రొఫైన్స్‌ను తీసి సోషల్‌ మీడియాలో పెట్టి.. ఎవరు బెటరో చెప్పండి అంటూ.. నెటజన్లకు ఓ ప్రశ్న వేసింది.. ఆ యువతి వ్యవహారం ఇప్పుడు సోషల్‌ మీడియాలో రచ్చగా మారింది..

కూల్‌డ్రింక్ డబ్బులు అడిగిందని.. షాప్ యజమానిపై పోకిరీల దాడి
ఈరోజుల్లో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. యాటిట్యూడ్ పేరుతో నిబ్బా వేషాలు వేయడమే కాదు, దాడులకు కూడా పాల్పడుతున్నారు. తామేదో గొప్పవాళ్లమని, తాము చేసిందే కరెక్ట్ అని భావించి.. ఎదుటివారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు నలుగురు పోకిరీలు సైతం అలాగే హద్దుమీరి ప్రవర్తించారు. ఒక షాప్‌లో కూల్‌డ్రింక్ తీసుకుని తాగిన ఆ దుండగులు.. వాటికి డబ్బులు ఇవ్వకపోగా, తమకే డబ్బులు అడుగుతావా? అంటూ షాప్ యజమానురాలిపై దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. రాకీ ఫిలిప్స్, మహ్మద్‌మాజ్ ఖాన్, మహ్మద్ అర్బాజ్, మహ్మద్ తైమూర్ అనే నలుగురు యువకులు జులై 17వ తేదీన రాత్రి సమయంలో పార్టీ చేసుకున్నారు. ఫుల్లుగా మందు తాగి ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఎస్ఆర్ నగర్ పరిధిలోని బాపునగర్‌లో ఒక కిరాణా దుకాణానికి వెళ్లారు. అక్కడ కూల్‌డ్రింక్స్ తీసుకుని తాగారు. అనంతరం డబ్బులు ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోసాగారు. అప్పుడు షాప్ యజమానురాలు వారిని కూల్‌డ్రింక్ డబ్బులు అడిగింది. ‘మేమెవరో తెలుసా? మమ్మల్నే డబ్బులు అడుగుతావా?’ అంటూ ఆమెతో దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ‘ఎవరైతే నాకేంటి? కూల్‌డ్రింక్ డబ్బులు ఇవ్వండి’ ఆమె అడగ్గా.. ఆ పోకిరీలు రెచ్చిపోయారు. ఆమెని తీవ్రంగా కొట్టి, అక్కడి నుంచి వెళ్లిపోయారు.

వర్షాకాలంలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు తడిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. ?
గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, మరి కొన్ని రోజలు పాటు భారీ వానాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అందువల్ల ఈ సీజన్ లో మీరు మీ గాడ్జెట్స్ ను జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. స్మార్ట్ ఫోన్ లు, ఇయర్ బడ్స్, ఇతర గాడ్జెట్స్ ను నీటి నుంచి డ్యామేజ్ కాకుండా రక్షించుకోడానికీ.. అవి తడిస్తే ఏం చెయ్యాలి అనే దానికి మీకోసం ఈ చిట్కాలు. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇతర గాడ్జెట్‌లు వాటర్‌ప్రూఫ్ కాదు.. మీరు వానాకాలంలో బయటకు వెళ్తే, మీ గాడ్జెట్స్ ను వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లో దాచి ఉంచాలి.. తద్వారా స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, గాడ్జెట్‌లు వర్షంలో తడిసిపోకుండా సురక్షితంగా ఉంటాయి. ఒక వేళ మీ గాడ్జెట్స్ వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లు అతిగా తడిస్తే.. వాటిలోకి కూడా నీరు వెళ్లే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, వాటిలో ఉంచిన గ్యాడ్జెట్‌లలోకి నీరు వెళ్లి అవి పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. అందుకే తేమను బాగా పీల్చుకునే సిలికా జెల్ పౌచ్‌లను బ్యాగ్‌లో ఎప్పుడూ ఉంచుకోవాలి.

కుడి ఎడమ అయితే పొరపాటు లేదోయ్ .. నాగ్ ప్రోమో వచ్చేసిందోచ్
ఎన్నాళ్ళో వేచిన ఉదయం .. ఈరోజే ఎదురయ్యింది.. బిగ్ బాస్ 7 ఎట్టకేలకు వచ్చేస్తోంది అంటూ పాడేసుకుంటున్నారు ప్రేక్షకులు. బుల్లితెర రియాలిటీ షోగా బిగ్ బాస్ కు ఒక గుర్తింపు ఉంది. ఇప్పటివరకు ఆరు సీజన్లను విజయవంతంగా పూర్తిచేసిన బిగ్ బాస్ .. ఇప్పుడు ఏడవ సీజన్ కు రెడీ అవుతోంది. కొన్ని కారణాల వలన లేట్ అయినా .. లేటెస్ట్ గా వస్తున్నామని ఈ మధ్యనే బిగ్ బాస్ ప్రోమో ను రిలీజ్ చేసి షాకిచ్చారు మేకర్స్. ఇక ఇప్పటివరకు ఈ సీజన్ కు హోస్ట్ ఎవరు..? అంటూ ఆసక్తి నెలకొనడమే కాకుండా డిబేట్ లు కూడా జరిగాయి. నాలుగు సీజన్స్ నుంచి అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఏడవ సీజన్ కు నాగ్ కాకుండా కొత్త హోస్ట్ వస్తున్నాడంటూ వార్తలు వినిపించాయి. అయితే ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిసిపోయింది. ఈ సీజన్ కు కూడా మన్మథుడే హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడని మేకర్స్ అధికారికంగా తెలిపేశారు. తాజాగా.. నాగ్ కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో నాగ్ అదరగొట్టేశాడు. చేతిలో పాప్ కార్న్ డబ్బా పట్టుకొని.. ” బిగ్ బాస్ సీజన్ 7.. ఈసారి సీజన్.. ఏం చెప్పాలి..చాలా కొత్తగా చెప్పాలి.. హా.. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. ” అంటూ చిటికె వేయగానే.. అక్కడ ఇంట్లో ఉన్న వస్తువులు అన్ని ఒక్కసారిగా రివర్స్ అవ్వడం చూపించారు. దీంతో ఈ సీజన్ లో మేకర్స్ ఏదో కొత్తగానే ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈసారి ఈ సీజన్ లో ఎలాంటి కంటెస్టెంట్స్ వస్తారో.. వారిని నాగ్ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

వైష్ణవి చైతన్యను చెప్పుతో కొట్టిన అభిమాని.. వీడియో వైరల్
ఒకే ఒక్క సినిమాతో స్టార్ స్టేటస్ ను అందుకుంది వైష్ణవి చైతన్య. బేబీ సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ హీరోలుగా నటించారు. జూలై 14 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. పెద్ద విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ ను రాబడుతోంది. లవ్ ఫెయిల్యూర్స్ ఈ సినిమాను బాగా ఓన్ చేసుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఇద్దరు హీరోలను మోసం చేసి మూడోవాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. ఈ పాయింట్ కు నేటి యువత చాలా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ప్రేమ విఫలమయిన అబ్బాయిలు వైష్ణవిలో తమ మాజీ ప్రేయసిని ఉహించుకుంటున్నారు. అది ఎంతలా అంటే.. బయట బేబీ పోస్టర్ చూసినా, ఫ్లెక్సీ కనిపించినా అందులో ఉన్న వైష్ణవి ఫోటోను చెప్పులతో కొడుతున్నారు. తాజాగా ఒక యువకుడు వైష్ణవి ఫోటోను చెప్పుతో కొడుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అంటే అంతలా ఆ క్యారెక్టర్ కు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారని అర్ధం. సినిమా నుంచి బయటికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడు హీరోయిన్ ను తిట్టుకుంటూనే బయటకు వచ్చాడు అంటే అతిశయోక్తి లేదు. నిజం చెప్పాలంటే.. ఒక పాత్రను ఇంతలా కనెక్ట్ చేసుకొని.. థియేటర్ నుంచి బయటకు వచ్చినా కూడా ఆడే పాత్ర మనసులో, మైండ్ లో ఉండడం అనేది చాలా రేర్ గా జరుగుతోంది. ప్రస్తుతం వైష్ణవి పాత్ర కూడా అలాగే కుర్రకారుకు ఒక డ్రగ్ లా ఎక్కేసింది. బేబీ లో వైష్ణవి పాత్ర ఎంతలా జనాలను ఎక్కేసిందో చెప్పాలంటే.. ఈ ఒక్క వీడియో చాలు అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.