NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

సీఐ అంజుయాదవ్‌పై పవన్‌ సీరియస్‌.. అక్కడికే వచ్చి తేల్చుకుంటా..!
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసిన విషయం విదితమే… సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ కార్యకర్తలు నిరసనకు దిగారు. ఇందులోభాగంగా పట్టణంలోని పెళ్లిమండం దగ్గర సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. దిష్టిబొమ్మ దహనానికి అంగీకరించబోమని మహిళా సీఐ అంజు యాదవ్‌ తేల్చిచెప్పారు. అయినా దిష్టిబొమ్మ కాల్చేందుకు యత్నించడంతో పలువురు నాయకుల్ని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆ తర్వాత జనసేన నాయకులు పోలీసుల కళ్లగప్పి కూడలి దగ్గరకు చేరుకున్నారు. ఈ క్రమంలో జనసేన నేతలపై సీఐ అంజు యాదవ్ చేయిచేసుకున్నారు. చిత్తూరు జిల్లా కార్యదర్శి సాయి రెండుచెంపలను చెళ్లుమనించారు సీఐ. దీంతో.. ఆ వీడియో వైరల్‌గా మారిపోయింది.. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ దృష్టికి వెళ్లింది.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్‌.. తణుకు నియోజకవర్గంలో జనసేన నాయకులు, వీర మహిళలతో మాట్లాడారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. జనసేన కార్యకర్తను పోలీసులు కొట్టడం మంచిది కాదని హెచ్చ రించారు.. జనసేన కార్యకర్తలు శాంతియుతంగా నిరసన తెలిపితే.. అతణ్ని ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. అయితే, ఈ విషయంలో తాను ఇప్పుడు ఇంక మాట్లాడబోనని, తాను స్వయంగా శ్రీకాళహస్తికి వచ్చి సంగతేంటో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. జనసైనికులపై దెబ్బ పడితే నేనే వస్తాను.. మా పార్టీ నాయకుడు సాయిని కొట్టారు.. నేనే స్వయంగా శ్రీకాళహస్తి వస్తాను.. మా వాడిని ఎందుకు కొట్టారు అని నిలదీస్తా అన్నారు.. మా వాడిని కొట్టారు.. నన్ను కొట్టినట్టే అన్నారు. ఇక, నేను నమ్మిన సిద్ధంతం కోసం నాకు పెచ్చి ఉంటుంది.. నా కుటుంబాన్ని చంపేస్తారా? చంపేయండి.. అని వ్యాఖ్యానించారు.. అంత తెగింపు నాలో ఉంది.. అలా తెగించకపోతే.. ఈ క్రిమినల్‌ సామ్రాజ్యాన్ని కూల్చలేమన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

వైసీపీలో చేరిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్‌
ఏపీలో అప్పుడే ఎన్నికల హీట్‌ మొదలైంది.. ముందస్తుకు వెళ్లేది లేదు.. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.. అయితే, ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మరోవైపు.. పార్టీలోకి వచ్చేవారికి కండువా కప్పి ఆహ్వానిస్తున్నారు.. ఈ రోజు వైసీపీలో చేరారు కర్నూలు నగరానికిచెందిన కాంగ్రెస్ నేత పి.అహ్మద్ ఆలీఖాన్.. తాడేపల్లిలో పార్టీ కండువా కప్పి ఆయన్ని వైసీపీలోకి ఆహ్వానించారు సీఎం వైఎస్ జగన్.. అనంతరం అహ్మద్ ఆలీఖాన్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో పలు పదవుల్లో ఉంటూ నేను దేశ వ్యాప్తంగా పర్యటించా.. ఏపీలోనే పారదర్శకంగా పాలన జరుగుతోంది.. పాఠశాలలు చాలా బాగా అభివృద్ది చెందుతున్నాయి.. అందుకే ఎలాంటి షరతులు లేకుండా వైసీపీలో చేరానని తెలిపారు. అధిష్టానం ఏది ఆదేశిస్తే అది చేస్తాను అని స్పష్టం చేశారు. పోటీ విషయమై పార్టీ నాకు ఎలాంచి హామీ ఇవ్వలేదన్నారు అహ్మద్‌ ఆలీఖాన్‌. ఇక, ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం అంజాద్ బాష మాట్లాడుతూ.. అహ్మద్ ఆలీ ఖాన్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేశారు.. రాబోయే రోజుల్లో ఆయన సేవలను వైసీపీ వినియోగించుకుంటుందన్నారు. గతంలో మైనార్టీలకు వక్ఫ్‌ బోర్డు పదవులే దక్కేవి.. ఇప్పుడు అన్ని స్థానాల్లో పలు పదవుల్లో ముస్లింలు మేలు జరుగుతోందన్నారు.. ఇక, అహ్మద్ ఆలీఖాన్ కు గుర్తింపు ఇస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారని తెలిపారు అంజాద్‌ బాష.. మరోవైపు కర్నూలు ఎంపీ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. నా చిన్ననాటి స్నేహితుడు వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారని గుర్తుచేశారు. అయితే, మైనార్టీ ఓట్లు చీలకూడదు. అంతా ఒకటిగానే ఉండాలి.. మైనార్టీలంతా వైసీపీకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. యూసీసీ చట్టాలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.

జగన్ గురించి ప్రధానికి చెప్పాల్సిన అవసరం లేదు.. మేమే చూసుకుంటాం..
నా దగ్గర సమర్థత లేకపోతే ప్రధాని ఒక ముఖ్యమంత్రితో పాటు సమానంగా నాకు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తారు..? అని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. సీఎం వైఎస్‌ జగన్ గురించి ప్రధాని దగ్గర ప్రస్తావించాల్సిన అవసరం లేదన్నారు.. ప్రస్తావించాల్సి వస్తే ఏం ప్రస్తావించాం అనేది భవిష్యత్తులో తెలుస్తుందన్నారు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఆయన మాట్లాడుతూ.. ఏ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళైనా జనసేనలో ఉంటే వాళ్ళు జనసేన నాయకులు.. ఏ సామాజిక వర్గానికి చెందినవారు అనేది దానికి ప్రాధాన్యత కాదు .. నిలబడేవారా? కాదా? అనేదానికి మాత్రమే ప్రాధాన్యత ఉంటుందన్నారు. ధైర్యం ఉన్నవాడు పోరాటం చేస్తే బ్రిటీష్ వాళ్ళే పారిపోయినప్పుడు జగన్ ఎంత? అని ప్రశ్నించారు. ఇక, నా పోరాటం వైఎస్‌ జగన్ పై కాదు.. ఆయన పరివర్తనపైనే అన్నారు పవన్‌.. జగన్‌ తనకు శత్రువు కాదు.. అతనికి అంత సీన్‌ లేదన్న ఆయన.. ప్రజాస్వామ్యాన్ని పట్టిపీడిస్తున్న జలగలపైనే తన పోరాటమని, బ్రిటీష్ వాళ్లే పారిపోయినప్పుడు జగన్‌ ఎంత అని ప్రశ్నించారు. జనసేన వచ్చాక పెండింగ్ లో ఉన్న సుగాలి ప్రీతి లాంటి కేసుల సంగతి తెలుస్తాం అన్నారు. సీఎం జగన్‌ జగన్ గురించి ప్రధాని దగ్గర ప్రస్తావించాల్సిన అవసరం లేదు.. ప్రస్తావించాల్సి వస్తే ఏం ప్రస్తావించాం అనేది భవిష్యత్తులో తెలుస్తుందన్న ఆయన.. జగన్ మా ఇలాఖ పిల్లాడు. . ఆయన సంగతి మేమే చూసుకుంటాం అన్నారు. రాజకీయ అవినీతిని నిర్మూలించడం జనసేన మొదటి ప్రాధాన్యతగా చెప్పుకొచ్చిన పవన్‌.. 300 లంచం తీసుకునే పోలీసు నేరం కంటే.. టీడీఎస్ బాండ్స్ పేరుతో 309 కోట్లు దోచేసిన రాజకీయనేతది పెద్ద తప్పు అన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో.. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కేటీఆర్ బహిరంగ లేఖ
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్షపూరిత వైఖరి ప్రదర్శిస్తోందంటూ మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల రెండవ దశ పర్యావరణ అనుమతులను పక్కన పెట్టిన నేపథ్యంలో.. కేటీఆర్ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగున ఆటంకాలు కల్పిస్తోందని మండిపడ్డారు. 9 ఏళ్లుగా తెలంగాణ ప్రగతి ప్రస్థానం పై అంతులేని వివక్ష కనబరుస్తోందని విమర్శించారు. నదీ జలాల వినియోగం నుంచి మొదలుకొని ప్రాజెక్టుల నిర్మాణం దాకా.. అన్నింట్లోనూ అడ్డంకులు సృష్టిస్తోందని కేంద్రంపై విరుచుకుపడ్డారు. 9 సంవత్సరాలు అయినా.. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా డిమాండ్‌ను తేల్చకుండా, కేంద్రం తాత్సారం చేస్తోందంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ పచ్చబడడం కేంద్రానికి ఇష్టం లేదని దుయ్యబట్టారు. కేంద్ర సహాయ నిరాకరణ, వివక్ష ఉన్నప్పటికీ.. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో దేశానికి ఆదర్శంగా నిలబెట్టామని ఉద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఎన్ని విధాలుగా అణచివేతకు ప్రయత్నించినా.. తెలంగాణ అభివృద్ధి పట్ల తమ నిబద్ధతను, సంకల్పాన్ని అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొనే శక్తులపై తాము రాజీ లేకుండా పోరాడుతామని ఛాలెంజ్ చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలు ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.

ఉచితాలకు పోతే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి..ఢిల్లీ ప్రజలు మేలుకోవాలి..
ఇదిలా ఉంటే భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ తాజా పరిస్థితులపై స్పందించారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ప్రజలకు ఏదీ ఉచితంగా రాదని, ఉచితాల వైపు వెళ్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని, ఢిల్లీ ప్రజలు మేలుకోవాలని ట్వీట్ చేశారు. ‘‘ ఢిల్లీ ప్రజలారా మేలుకొండి.. రాజధాని నగరం మురికి కాల్వను తలపిస్తోంది. ఏదీ ఉచితంగా రాదు. ఈ మూల్యం చెల్లించుకోవాల్సిందే’’ అని పరోక్షంగా ఆప్ ఉచిత పథకాలను గురించి విమర్శించారు.

భర్తను వెతకండి, రూ.4 లక్షలు ఇస్తా.. ఓ మహిళ బంపర్ ఆఫర్..
లాస్ ఏంజిల్స్‌కు చెందిన 35 ఏళ్ల కార్పొరేట్ లిటిగేషన్ అటార్నీ ఈవ్ టిల్లీ-కొల్సన్ తను వివాహం చేసుకోబోయే వ్యక్తితో ఆమెను కనెక్ట్ చేయడంలో సహాయపడటానికి టిక్‌టాక్‌లో వీడియో అప్పీల్‌ను పోస్ట్ చేసింది. ఈమెకు టిక్‌టాక్ లో 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. తాను ఇంతకుముందు తన స్నేహితులకు ఈ ఆఫర్ ఇచ్చానని, అయితే ప్రస్తుతం సాధారణ ప్రజలకు కూడా ఇస్తున్నానంటూ తెలిపింది. 35 ఏల్ల కౌల్సన్ తనకు కాబోయే భర్త తనతో ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం లేదని, నేను అతడికి 20 ఏళ్లలో విడాకులు ఇవ్వగలను అంటూ పోస్ట్ చేసింది. తాను దాదాపుగా 5 ఏళ్లుగా ఒంటరిగా ఉన్నానని, డేటింగ్ లో విసిగిపోయానని, కోవిడ్ నుంచి డేటింగ్ సంస్కృతిలో విచిత్రమైన మార్పులు వచ్చాయని అంటుంది కౌల్సన్. నిజమైన రిలేషన్ షిప్ కి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. తనకు కాబోయే భర్తకు 27 నుండి 40 సంవత్సరాల వయస్సు, 5.11 అడుగులు లేదా అంతకంటే ఎక్కువ పొడవు ఉండాలని, సెన్సాఫ్ హ్యూమర్ ఉండాలని, క్రీడలపై మక్కువ, పిల్లలు, జంతువులతో ప్రేమ కలిగి ఉండాలని కండీషన్స్ పెట్టింది. నేను పొడవుగా ఉన్నాను కాబట్టి పొడవైన భర్త కావాలని చెప్పింది. తాను ప్రేమ కోసం సిద్ధంగా ఉన్నానని, మతం, జాతి, విశ్వాసాలు, రాజకీయ అభిప్రాయాల గురించి తనకు పట్టింపు లేదని తెలిపింది. డ్రగ్స్ తీసుకోకూడదని కండిషన్ పెట్టింది. మ్యారేజ్ సర్టిఫికేట్ పై సంతకం చేసిన వెంటనే భర్తను వెతికిపెట్టిన వారికి రూ. 4 లక్షలు ఇస్తానంటుంది.

వెస్పా ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలో మార్కెట్ లోకి ఈ-వెస్పా..
ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది.. అదే ట్రెండ్ నడుస్తుంది.. పెట్రోల్ కు సంబందించిన వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఈవీ వాహనాలు మార్కెట్ లోకి వస్తున్నాయి.. ఇక ప్రభుత్వాలు కూడా అదే విధంగా ఇందన వాహనాలకు చెక్ పెట్టేలా చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు.. ప్రపంచంలో ఈవీ వాహనాల మార్కెట్‌లో అమెరికా, చైనా తర్వాత స్థానంలో భారతదేశం ఉందంటే దేశంలో ఈవీ వాహనాలను జనాలు ఎంతగా వాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ముఖ్యంగా ఫోర్‌ వీలర్స్‌తో పోల్చుకుంటే ద్విచక్ర వాహనాల్లో ఈవీ వాహనాల వృద్ధి అధికంగా ఉంది. అయితే ద్విచక్ర వాహనాల్లో కూడా స్కూటర్లు ఎక్కువగా ప్రజలు ఆకర్షిస్తున్నాయి. దీంతో ప్రముఖ స్కూటర్‌ తయారీదారుల నుంచి స్టార్టప్‌ కంపెనీల వరకూ ఈవీ వాహనాలను రిలీజ్‌ చేస్తున్నాయి.. పెట్రోల్ లో కొన్ని ప్రముఖ కంపెనీలు కూడా ఈవీ వాహనాల రిలీజ్‌ చేయడంలో వెనుకంజలో ఉన్నాయి… ఈ క్రమంలో ప్రముఖ బ్రాండెడ్ కంపెనీ వెస్పా ఈవీ వెర్షన్‌లో అందుబాటులోకి వస్తుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. వెస్పా ఈవీ వెర్షన్‌ గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం.. త్వరలో పియాజియో 1 ప్లస్‌ పేరుతో ఈవీ వాహనాల మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తుంఆది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌తో, పియాజియో ఈ స్కూటర్‌ని ఆధునిక ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రూపొందించింది. విశేషమైన శ్రేణి, అసాధారణమైన ఫీచర్ల శ్రేణిని అందిస్తుంది. పియాజియో 1 ప్లస్‌ ఒక్కసారి ఛార్జింగ్‌తో 100 కిమీ మైలేజ్‌ అందిస్తుందని కంపెనీ ప్రతనిధులు చెబుతున్నారు..

మిధాని హైదరాబాద్ లో జాబ్స్.. రూ . 2లక్షల జీతం..ఎలా అప్లై చెయ్యాలంటే?
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీలకు వరుసగా నోటిఫికేషన్ లను విడుదల చేస్తుంది.. ఈ మేరకు మరో నోటిఫికేషన్ ను తాజాగా విడుదల చేసింది.. హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ- మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఏడాది ట్రేడ్‌, గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్ శిక్షణకు అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహిస్తోంది. ఇందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. తాజాగా ఇందుకు సంబందించిన నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 3 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. డిప్యూటీ మేనేజర్ జనరల్, మేనేజర్, హౌజ్ కీపర్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.. పోస్టులు తక్కువగా ఉండటంతో పోటీ కూడా ఎక్కువగానే ఉంటుందని తెలుస్తుంది.. ఇక ఈ పోస్టులకు అర్హతల విషయానికొస్తే.. పోస్టుల ఆధారంగా టెన్త్, గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్ల్యూఏ పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా అభ్యర్థుల వయస్సు 30-45 ఏళ్లు ఉండాలి… ఈ ఉద్యోగాలకు జీతాలు.. ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.19130 నుంచి రూ.2.2 లక్షల వేతనం ఉంటుంది.

ఏది.. ఈ విషయంలో మంచు లక్ష్మీని ట్రోల్ చేయండి.. చూద్దాం
మంచు మోహన్ బాబు గురించి కానీ, మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి గానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు కుటుంబాన్ని మొత్తం సోషల్ మీడియాలో ట్రోలింగ్ వస్తువుగా వాడుకుంటారు. వాళ్ళు ఏది చెప్పినా, ఏది మాట్లాడినా ట్రోల్స్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా మంచు లక్ష్మీ ఇంగ్లీష్ గురించి, డ్రెస్సింగ్ స్టైల్ గురించి ట్రోల్ చేయడం తెల్సిందే. అయితే ఇవేమీ పట్టించుకోని మంచు కుటుంబం తమ పనుల్లో తమ బిజీగా ఉంది. ఇక మంచు లక్ష్మీ గురించి చెప్పాలంటే ప్రస్తుతం ఆమె నటిగా, నిర్మాతగా బిజీగా ఉంది. ఇంకొపక్క తల్లిగా కూతురుతో నిత్యం సోషల్ మీడియాలో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా మంచు లక్ష్మీ చేసిన ఒక పని ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాకుండా అభిమానుల ప్రశంసలను అందుకుంటుంది. అదేంటంటే.. మంచు లక్ష్మీ గతేడాది నుంచి టీచ్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా గత ఏడాది యాదాద్రి జిల్లాలో 56 పాఠశాలలను ఆమె దత్తత తీసుకుంది. సరైన చదువు లేకపోవడం వలన ఇబ్బంది పడుతున్న విద్యార్థులు కానీ, లేక చదువుకోవాలని ఉన్న చదవలేని విద్యార్థులను, మంచి సదుపాయాలు లేని స్కూల్స్ ను దత్తత తీసుకొని దగ్గరుండి ఆ స్కూల్స్ ను బాగుచేయించడం, విద్యార్థుల అవసరాలను తీర్చడం లాంటివి టీచ్ ఫర్ చేంజ్ కార్యక్రమంలో చేస్తారు. ఇందులో సెలబ్రిటీలు కూడా పాల్గొంటారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది గద్వాల్ జిల్లాలోని 30 పాఠశాలలను మంచు లక్ష్మీ దత్తత తీసుకుంది. ఇక దత్తత తీసుకున్న పాఠశాలలకు వెళ్లి ఆమె వారికి ఏఏ అవసరాలు ఉన్నాయో అని తెలుసుకుంటుంది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అక్క చేసిన పనికి తమ్ముడు మంచు మనోజ్ గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పుకొచ్చాడు. మంచు లక్ష్మీ ఫోటోలు షేర్ చేస్తూ.. “మా అక్కని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఆమె జోగులాంబ గద్వాల జిల్లాలో ని 30 పాఠశాలలను దత్తత తీసుకుంది. ఇది చాలా గొప్ప నిర్ణయం.

విరామం అనేది చెడ్డ విషయం కాదు.. సామ్ పోస్ట్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమాలను పూర్తిచేసి అమ్మడు ఒక ఏడాదిపాటు సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నదని తెల్సిన విషయమే. ఇక ప్రస్తుతం సామ్.. తెలుగులో ఖుషీ సినిమాలో నటిస్తుండగా.. హిందీలో సిటాడెల్ సిరీస్ చేస్తోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సిరీస్ అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సిరీస్ ను పూర్తిచేసి సామ్ రెస్ట్ తీసుకోనుందని తెలియడంతో అభిమానులు కొద్దిగా నిరాశ చెందారు. సిటాడెల్.. ఇంకొన్ని రోజులు షూటింగ్ చేసుకుంటే బావుండు అని కోరుకున్నారు. అయితే.. సామ్ మాత్రం పట్టుదలగా సిటాడెల్ షూటింగ్ ను పూర్తిచేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా అభిమానులకు తెలిపింది. సిటాడెల్ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఏమి జరుగుతుందో మీకు తెలిసినప్పుడు విరామం అనేది చెడ్డ విషయంగా అనిపించదు. రాజ్ అండ్ డీకే, సీతా ఆర్ మీనన్ నాకు తెలియని కుటుంబం.. కానీ, నాకు అవసరం అనిపిస్తుంది. నా ప్రతి ఒక్క యుద్ధంలో పోరాడటానికి మీరు చేసిన సహాయానికి నేను దన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎప్పుడు మీరు నన్ను వదలలేదు. ప్రపంచంలోని అన్నింటికంటే మిమ్మల్ని గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నాను..నాకు జీవితాంతం గుర్తుండిపోయేలా పాత్ర ఇచ్చినందుకు థాంక్స్. అంటే.. అలాంటి పాత్ర మరొకటి మీరు రాసే వరకు..” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో సామ్ .. బ్రేక్ కు సిద్దమవుతుందట. అసలు బ్రేక్ అంటే అమ్మడు ఎక్కడికి వెళ్తోంది. అసలు ఈ ఏడాది కనిపించదా.. ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరి ప్రమోషన్ల మాట ఏమిటి.. ? అని అభిమానులు ఆరాలు తీస్తున్నారు.