NTV Telugu Site icon

Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

వారందరికీ శుభవార్త చెప్పిన కేబినెట్‌..
సచివాలయంలో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం పలు కీలక అంశాలకు ఆమోదముద్ర వేసింది.. కేబినెట్‌ ముగిసిన తర్వాత తీసుకున్న నిర్ణయాలను, ఆమోదం లభించిన అంశాలను, వాటి ద్వారా ఎవరికి లబ్ధి చేకూరనుంది అనే వివరాలను వెల్లడించారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ.. ఈనెల 18న జగనన్న తోడు ఇవ్వటానికి మంత్రి మండలి ఆమోదించింది.. ఈనెల 21న నేతన్న నేస్తం కింద లబ్ధిదారులకు నిధులు జమ చేయనున్నారు.. 80,600 మందికి 300 కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చేందుకు ఆమోదం వేశారు. ఈ నెల 24న సీఆర్డీఏ ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.. 50 వేల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు లబ్ధి జరగనుంది. ఈనెల 26న సున్నావడ్డీ కింద డ్వాక్రా మహిళలకు డబ్బు జమ చేస్తారు.. ఈ నెల 28న జగనన్న విదేశీ విద్య కింద.. రూ.50 కోట్లు వెచ్చిస్తూ.. 400 మంది విద్యార్థులకు ప్రయోజనానికి కేబినెట్‌ ఆమోదించిందని వెల్లడించారు. మరోవైపు.. ఉద్యోగాల భర్తీకి కూడా ప్రభుత్వం సిద్ధమైంది.. విద్యా సంస్థల్లో ఖాళీల భర్తీకి ఆమోదం లభించింది.. జేఎన్టీయూ కాకినాడకు బోధనేతర సిబ్బంది నియామకానికి ఆమోదం లభించగా.. యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది కొరతను అధిగమించటానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని ప్రభుత్వం గుర్తించింది.. 62 ఏళ్లకు రిటైర్ అయిన బోధనా సిబ్బందిని 65 ఏళ్ళ వరకు కాంట్రాక్టు పద్ధతిన నియమించాలని నిర్ణయించింది. మెడికల్ కాలేజీల్లో 706 పోస్టులకు ఆమోద ముద్ర పడగా.. ఒక్క వైద్య, ఆరోగ్య రంగంలోనే మా ప్రభుత్వం 50 వేల మందిని నియమించటం చారిత్రాత్మకంగా పేర్కొన్నారు. ఏపీ వైద్య విధాన పరిషత్ విలీనానికి ఆర్డినెన్స్‌ తీసుకుని రావటానికి కేబినెట్‌ ఆమోదించింది. కడప జిల్లా గండికోట వరద బాధితులకు నష్టపరిహారానికి ఆమోదం లభించింది. 10 వేల మందికి పునరావాస ప్యాకేజీకి కింద.. ఒక్కో బాధితుడికి 10 వేల రూపాయల నష్టపరిహారం చెల్లించనున్నారు.

ఇది ఐబీ డైరెక్టర్ సీరియస్‌గా తీసుకోవాలి.. నిఘా వర్గాల నివేదిక పవన్‌కు ఎలా..?
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలను ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) డైరెక్టర్‌ సీరియస్ గా తీసుకోవాలని సూచించారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ.. కేబినెట్‌ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. కేబినెట్‌ నిర్ణయాలు వెల్లడించారు. ఇక, వాలంటీర్లపై పవన్‌ చేసిన కామెంట్లపై సీరియస్‌గా స్పందిస్తూ.. ఈ వ్యవహారాన్ని ఐబీ సీరియస్‌గా తీసుకోవాలన్నారు.. నిఘా వర్గాలు నివేదికలు కేంద్ర హోం శాఖకు ఇస్తాయి.. కానీ, పవన్ కల్యాణ్‌కు ఎందుకు ఇస్తారు? అని ప్రశ్నించారు. ఏపీలో మిస్ అయిన మహిళలు ట్రాఫికింగ్ కు గురయ్యారని ఆలోచించటం తప్పు అని హితబోధ చేసిన ఆయన.. పవన్ ఆలోచనలు అలానే ఉంటాయి అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలను ప్రజలు సీరియస్ గా తీసుకోవటం లేదు అన్నారు మంత్రి వేణు గోపాలకృష్ణ.. ఇక, చంద్రబాబు.. పవన్ కల్యాణ్‌ను రెండు జిల్లాలకు పరిమితం చేశాడని విమర్శించారు. సొంతంగా పేరు ఉండటం వల్లే రాపాక వరప్రసాద్ గత ఎన్నికల్లో గెలిచాడని.. కానీ, అందులో పవన్‌ కల్యాణ్‌ పాత్రే లేదని ఆరోపించారు. వాలంటీర్ వ్యవస్థ పై పవన్ కల్యాణ్‌వి నీచమైన ఆరోపణలు అంటూ మండిపడ్డారు.. చంద్రబాబు ట్రాప్ చేసి పవన్ కల్యాణ్‌తో మాట్లాడించాడని దుయ్యబట్టారు. మిస్సింగ్ కేసులన్నీ ట్రాఫికింగ్ అవుతాయా? అని నిలదీశారు. మహిళలు అంటే ఎంత చులకనో పవన్ మాటలను బట్టి అర్థం అవుతుందన్నారు మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ.

పవన్‌కు రూ.300 కోట్ల ప్యాకేజ్‌.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఎప్పటి నుంచో ఆరోపణలు గుప్పిస్తేనే ఉన్నారు.. తాజాగా వాలంటీర్ల వ్యహారం హాట్‌ టాపిక్‌ కాగా.. అంతకు ముందు నుంచే ప్యాకేజీ స్టార్‌ అంటూ.. దత్తపుత్రుడు అంటూ విమర్శలు చేస్తున్నారు.. ఈ వ్యహారంలో ఈ రోజు సంచలన ఆరోపణలు చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి.. పవన్ రూ. 300 కోట్ల ప్యాకేజ్‌ ఇస్తే.. జై చంద్రబాబు అంటాడు అంటూ విమర్శలు గుప్పించారు. దమ్ము, ధైర్యం ఉంటే సింగిల్‌గా పోటీ చేయి, ప్రజల తీర్పు చూద్దాం అంటూ సవాల్‌ చేశారు. వాలంటీర్లు, మహిళలపై పవన్ కల్యాణ్‌ విమర్శలు మంచిది కాదు.. మాట్లాడే పద్ధతులు నేర్చుకో అంటూ హితవుపలికారు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి.. ఇక, పవన్‌ కల్యాణ్‌ కరోనా వచ్చినప్పుడు ఇంట్లో దాక్కున్నాడు అంటూ విమర్శలు గుప్పించారు బాలనాగిరెడ్డి.. కరోనా వచ్చినా ప్రాణాలు లెక్కచేయకుండా వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది పనిచేశారని గుర్తుచేశారు. చంద్రబాబు గురించి మాట్లాడితే పడే వర్షాలు కూడ పడవు అంటూ ఎద్దేవా చేశారు. నారా లోకేష్ మా జిల్లాలో కాలు పెట్టి నందుకు వర్షాలు వెనక్కి వెళ్లాయని సెటైర్లు వేశారు. చంద్రబాబు కంటే నారా లోకేష్ పెద్ద ఐరన్ లెగ్ అంటూ మండిపడ్డారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. కాగా, పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఏపీలో వాలంటీర్లు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు.. నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. పవన్‌ దిష్టిబొమ్మలను సైతం దగ్ధం చేస్తున్నారు. మరోవైపు.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులు.. సీఎం వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన విషయం విదితమే.

కేంద్ర నిఘా వర్గాల సమాచారం నిజమేనా..? పవన్‌ బయటపెట్టాలి..
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయన్నది నిజమేనా? పవన్‌ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అయితే, పవన్‌కు వచ్చిన సమాచారం బటయపెట్టాలని డిమాండ్‌ చేశారు మంత్రి తానేటి వనిత.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, మేయర్ భాగ్యలక్ష్మి, కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి తానేటి వనిత.. కరోనా కష్టకాలంలో సేవలందించింది వాలంటీర్లే అన్నారు.. కేంద్ర నిఘా వర్గాలు సమాచారం ఇచ్చిన మాట నిజమే అయితే.. ఆ సమాచారాన్ని పవన్‌ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. జగనన్న ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్ధ ద్వారా ప్రతీదీ అమలు చేస్తున్నాం.. సురక్ష ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం.. జిల్లాస్థాయిలో ఒక టీమ్‌ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలపై ఆరా తీస్తున్నామని వెల్లడించారు. సమస్యలు పరిష్కరించినా మిగిలిపోయి ఉంటే సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు. ఇక, విజయవాడ పశ్చిమంలో స్ధిర నివాసాలు ఏర్పాటు చేయడానికి ఆలోచిస్తున్నాం అన్నారు. త్రాగునీరు, కరెంటు కష్టాలు ఉన్నాయని తెలిసిన చోట వెంటనే సమస్య తీరుస్తున్నాం అని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి తానేటి వనిత.

వెనక్కి తగ్గని పవన్‌.. మరోసారి వాలంటీర్లపై సంచనల వ్యాఖ్యలు..
సీఎం వైఎస్‌ జగన్‌ను మరోసారి టార్గెట్‌ చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో జరిగిన వారాహి బహిరంగసభలో.. జగన్ గారు నమస్కారం అండి.. నేను జనసేన అధ్యక్షుడిని పవన్ కల్యాణ్‌.. తాడేపల్లిగూడెం నుంచి మాట్లాడుతున్న అండి అంటూ తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు. జగన్‌ను ఏకవచనంతో పిలుస్తానంటూ ఈ మధ్య ఆయన అలాగే సంభోదిస్తుండగా.. వైసీపీ నుంచి దీనిపై సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు. దీంతో.. జగన్‌ గారు అంటూ ప్రారంభించి.. జగన్‌ అని పిలిచారు.. నేను, రాజకీయాల్లోకి మార్పు కోసం వచ్చా. . ఒక పార్టీ నడపడం ఎంత కష్టమో ఒక ఇల్లాలు అర్థం చేసుకోగలదు.. నాకు చాలా చనువు ఉంటే తప్ప ఏక వచనంతో పిలవను అన్నారు. సీఎం ప్రమాణ స్వీకారంకి పిలిస్తే రాలేను అని చెప్పాను.. మనస్పూర్తిగా అభినందనలు చెప్పాను.. ఆయన ఏక వచనంతో పిలిచినా నేను గౌరవించా అన్నారు. ఇక, సీఎం జగన్‌ను ఏకవచనంతో పిలవడానికి కారణం ఆయనకి ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోలేదు గనేకే అన్నారు పవన్‌.. మీరు మా కుటుంబాన్ని, జనసేన వీర మహిళలను కించ పరిచినా ఏం మాట్లాడ లేదు.. పెళ్లాం, పెళ్లాం అని మాట్లాడతావ్ ఏంటి జగన్‌? ఇలాంటివి భరించాల్సి వస్తుంది అని చెప్పా.. చిన్న పిల్లల కార్యక్రమంలో భార్య గురించి మాట్లాడే అంత సంస్కార హీనులా మీరు? అంటూ ప్రశ్నించారు. వాలంటీర్స్ అంత నాసోదర సమానులు.. మీకు 5వేలు వస్తే మరో ఐదు వేలు వేసి ఇచ్చే మనస్తత్వం నాది అన్నారు పవన్‌.. కానీ, వాలంటీర్స్ వ్యవస్థ అవసరమా అనే నేను ప్రశ్నించేది.. అన్నారు. వాలంటీర్స్ అంటే ఏ మాత్రం డబ్బు ఆశించకుండా పని చేసే వారు.. రెడ్ క్రాస్ వాలంటీర్స్ కు అధిపతులు ఉన్నారు.. మీ వాలంటీర్ వ్యవస్థ కు అధిపతి ఎవరు.? అని నిలదీశారు. మరోవైపు.. వాలంటీర్స్ ఇచ్చే సమాచారం హైదరాబాద్ లో ఎందుకు పెట్టారు.? వాలంటీర్స్ వ్యవస్థ ఉపయోగించే విధానం పైన మాట్లాడుతున్నాం.. వాలంటీర్స్ చేసిన అఘాయిత్యాలకు ఎవరు బాధ్యత వహిస్తున్నారు.. వాలంటీర్స్ ఎర్ర చందనం తరలింపు లో పట్టుబడ్డారు.. చిన్నారుల పై అఘాయిత్యాలు చేస్తున్న వారికి కాళ్ళు కడిగి దైవాంశ సంభూతులు అంటున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని అవ్వకుండా రాహుల్‌పై బీజేపీ కుట్ర.. కాంగ్రెస్ నేతలు ఫైర్
వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని కాకుండా అడ్డుకోవాలని బీజేపీ చూస్తోందని.. అందుకే ఎంపీగా పోటీ చేయకుండా అడ్డుకునేందుకు కుట్ర పన్నుతోందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. 2004లో ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. కాంగ్రెస్ ఉచిత విద్యుత్ ఇస్తున్నప్పుడు బీఆర్ఎస్ కూడా తమతోనే ఉందని గుర్తు చేశారు. రైతులకు కాంగ్రెస్ ఏం చేయలేదంటే జనం నమ్మరని అన్నారు. రైతులకు రుణమాఫీ చేసింది సోనియాగాంధీ అని, కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొచ్చారు. మోడీ వాట్సాప్ యూనివర్శిటీ రాహుల్‌పై అసమర్థుడు అనే ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తోందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. అదానికి, మోడీకి సంబంధం ఏంటనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మోడీ భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. అందుకే రాహుల్‌పై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఆరోపణలు చేశఆరు. గుజరాత్ కోర్టులు బీజేపీ కార్యాలయాలుగా మారాయా? అనే చర్చ ప్రజల్లో జరుగుతోందన్నారు. న్యాయస్థానాలపై నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తోందన్నారు. రాహుల్ గాంధీకి మద్దతుగా సత్యాగ్రహ మౌన దీక్ష దేశవ్యాప్తంగా చేపడుతున్నామన్నారు. గాంధీ కుటుంబం దేశానికి ఎంతో సేవ చేసిందని పేర్కొన్నారు.

ఆ స్థానాలు, 5 రాష్ట్రాల ఎన్నికలే టార్గెట్.. నడ్డా నేతృత్వంలో బీజేపీ కీలక సమావేశం..
2024 లోక్ సభ ఎన్నికలు, ఈ ఏడాది జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ రోజు ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి సమాలోచన చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ తక్కువ ఓట్లతో ఓడిపోయిన 160 పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేయడంపై చర్చించారు. బీజేపీ రూపొందించిన “లోక్ సభ ప్రవాస్” కార్యక్రమంతో సంబంధమున్న ముఖ్య నేతలందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికల ముందు జరిగే ఈ ఎన్నికల్లో బీజేపీ తప్పక గెలవాలని అనుకుంటోంది. ముఖ్యంగా ఇప్పటికే అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని నిలుపుకోవడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోని రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో గెలవాలని బీజేపీ భావిస్తోంది. ఇక తెలంగాణలో సత్తా చాటాలని అనుకుంటోంది. కర్ణాటక ఎన్నికల పరాజయం తర్వాత ఏ చిన్న అవకాశాన్ని కూడా జారవిడుచుకోవద్దని కృతనిశ్చయంతో బీజేపీ ఉంది. అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి, పూర్తి సామర్ధ్యం తో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సాధించే విజయం ద్వారా రానున్న సార్వత్రిక లోకసభ ఎన్నికలను ప్రభావితం చేయాలన్నదే బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల ముందు జరిగే 5 రాష్ట్రాల ఎన్నికలే చాలా కీలకమని ప్రస్తుతం బీజేపీ భావిస్తోంది. తాజాగా ఈ రోజు జరిగిన సమావేశానికి పార్టీ కార్యనిర్వాహక సభ్యులు, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ CNG లాంచ్.. ఏకంగా 28.51 కి.మీ మైలేజ్.. ధర ఎంతంటే..?
మారుతి సుజుకి CNG కార్ల విభాగంలో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ కార్ మేకర్ నుంచి స్విఫ్ట్, బాలెనో, బ్రెజ్జా, ఎర్టిగా, డిజైర్, వ్యాగన్ -ఆర్, ఆల్టో 800, సెలెరియో, ఎకో.ఎక్స్ఎల్6, గ్రాండ్ విటారా కార్లు CNG వెర్షన్ లో లభిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో ఫ్రాంక్స్ కూడా చేరింది. తాజాగా ఫ్రాంక్స్ CNG వెర్షన్ లాంచ్ చేశారు. మారుతి సుజుకీ నుంచి ఇది 15వ CNG కార్. కొత్తగా వచ్చిన ఫ్రాంక్స్ ధర రూ. 8.41(ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కానుంది. కేవలం రెండు వేరియంట్లలోనే ఈ ఫ్రాంక్స్ CNG కార్ వస్తుంది. 2010లో మారుతి సుజుకీ సీఎన్జీ ప్రస్థానం ప్రారంభమైంది. ఇప్పటి వరకు 1.4 మిలియన్ కంటే ఎక్కువ సీఎన్జీ కార్లను విక్రయించింది. సుమారుగా 1.44 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడంలో దోహదపడినట్లు మారుతి సుజుకీ వెల్లడించింది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న సీఎన్జీ ప్యాసింజర్ వాహనాల్లో 26 శాతం మారుతి సుజుకి వాహనాలే ఉన్నాయి. ఫ్రాంక్స్ CNG 1.2-లీటర్ డ్యూయల్-జెట్ డ్యూయల్-VVT పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. పెట్రోల్ మోడ్‌లో, ఈ ఇంజన్ గరిష్టంగా 89.73 పీఎస్ పవర్, 113ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇదే CNG మోడ్‌లో 77.5 పీఎస్, 98.5 ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్రాంక్స్ CNG వెర్షన్ లో ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ఇవ్వడం లేదు. 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే అందుబాటులో ఉంది. మైలేజ్ విషయానికి వస్తే ఏకంగా కేజీ సీఎన్జీకి 28.51 కి.మీ మైలేజ్ ఇస్తుంది. సిగ్మా, డెల్టా వేరియంట్లలో ఫ్రాంక్స్ లభ్యమవుతుంది. సిగ్మా ధర రూ. 8.41 లక్షలు(ఎక్స్-షోరూం), డెల్టా ధర రూ. 9.27 (ఎక్స్-షోరూం)గా ఉంది.

‘మహారాజా”గా వస్తున్న ఉప్పెన విలన్..
సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసే స్థాయి నుంచి హీరోగా మారి మక్కల్ సెల్వన్ అనే పేరు సంపాదించాడు విజయ్ సేతుపతి. తన సహజ నటనతో కేవలం తమిళంలోనే కాదు తెలుగులో సైతం ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న సేతుపతి ఒక పక్క హీరోగా మరోపక్క విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాల పాత్రాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తాజాగా ఆయన 50వ సినిమా టైటిల్ ఫిక్స్ చేస్తూ మేకర్స్. ఆ సినిమాకి మహారాజా(Maharaja) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో ‘చుట్టూ ఏముందో అదే వస్తుంది’ అంటూ ఇంగ్లీష్ లో పేర్కొని ఉండడమే కాకుండా ఒక రాజు, ఆ రాజు తలపై చదరంగపు పావు, దానిపై ఓ పక్షి ఉండడం సినిమా మీద ఆసక్తి పెంచేసింది. ఇక ఈ సినిమాకి దర్శకుడు నితిలన్ స్వామినాథన్‌ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకున్నట్లు చెబుతున్నారు. షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతానికి శరవేగంగా జరుగుతున్నాయి. ప్యాషన్ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్ సహా నట్టి నటరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా అభిరామి, అరుల్ దాస్, మునిష్కాంత్, బాయ్స్ మణికందన్, సింగం పులి, భారతీరాజా, వినోద్ సాగర్, పిఎల్ తేనప్పన్ వంటి వారు ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

అప్పుడే ‘లాల్ సలాం’ పూర్తి చేసేసిన రజినీకాంత్
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ క్రేజీ మూవీ ‘లాల్ సలాం’ మీద ప్రకటించిన నాటి నుంచే అంచనాలు ఉన్నాయి. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ సినిమాను ర‌జినీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్య డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ముంబై డాన్‌ మొయినుద్దీన్ భాయ్‌గా సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ కీలక పాత్రలో న‌టిస్తుండ‌టం విశేషం. ర‌జినీకాంత్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెంజెండ్ క‌పిల్ దేవ్ త‌దిత‌రులు ఇతర ముఖ్యమైన పాత్రలలో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో మొయినుద్దీన్ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్న రజినీకాంత్ ఆ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేశారు. ఈ విష‌యాన్ని సినిమా డైరెక్టర్ ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. ‘‘మీతో కలిసి సినిమా చేయడం ఓ అద్భుతం, నాన్నా. మీరు ఎప్పుడూ నటనతో మ్యాజిక్ చేస్తుంటారు ‘లాల్ సలాం’లో మొయినుద్దీన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి’’ అయింది అంటూ అని ఆమె పేర్కొన్నారు. ర‌జినీకాంత్ స‌హా ఎంటైర్ యూనిట్ క‌లిసి దిగిన ఫొటోను ఆమె షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్‌ రీసెంట్‌గా విడుద‌లైన పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ 2తో సూపర్ సక్సెస్‌ను సాధించగా అదే నిర్మాణ సంస్థ నుంచి రానున్న మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ ‘లాల్ సలాం’పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక ఈ సినిమాకి ఎ.ఆర్‌.రెహ‌మాన్‌ సంగీతం అందిస్తుండగా విష్ణు రంగస్వామి సినిమాటోగ్ర‌ఫీ, బి ప్ర‌వీణ్ భాస్క‌ర్‌ ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

లోదుస్తులు లేకుండా ఘాటు అందాలను చూపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తుందిగా..
బిగ్ బాస్ బ్యూటీ ఇనయ సుల్తానా సీజన్ 6 లో పాల్గొని తన అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఇనయ హౌస్ లో ధైర్యంగా నిలబడింది. తాను నమ్ముకున్న విధానంలోనే ముందుకు వెళ్ళింది. అదే సమయంలో గ్లామర్ తో కూడా అలరించింది.. బిగ్ బాస్ షోతో వచ్చిన గుర్తింపుతో ఇనయకి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇనయ చివరగా క్రాంతి అనే చిత్రంలో నటించింది. ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. అమ్మడు అందాల జాతరకు యువత అల్లాడిపోతున్నారు.. ఇక తాజాగా లోదుస్తులు లేకుండా ఘాటు అందాలతో ఫోటోలని బందించి నెట్టింట షేర్ చేసింది.. అవి ఏ రేంజులో వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇనయ బిగ్ బాస్ హౌస్ లో దాదాపు 100 రోజులు గడిపింది. అయితే టాప్ 5 లో నిలవలేకపోయింది. తన గ్లామర్ ప్రదర్శిస్తూ, బాగానే గోల చేస్తూ ఉన్నన్ని రోజులు ఇనయ సుల్తానా ప్రేక్షకులకు వినోదాన్ని అందించింది.. ప్రస్తుతం ఇనయ సుల్తానా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. తన గ్లామర్ లుక్స్ తో యువతని తనవైపు తిప్పుకుంటోంది. బోల్డ్ గా యద పరువాలు ఆరబోయడం మాత్రమే కాదు జనాలను రెచ్చ గొట్టేలా ట్యాగ్ లను కూడా యాడ్ చేస్తుంది.. ప్రస్తుతం ఇనయ కిర్జిగిస్తాన్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ చల్లని గాలిలో షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..ప్రకృతి ప్రదేశంలో ఇనయ తన అందాలు చూపిస్తూ కుర్రాళ్ళకి గాలం వేస్తోంది. తన భారీ ఎద అందాలు ప్రదర్శిస్తూ ఇనయ ఇస్తున్న ఫోజులు కైపేక్కిస్తున్నాయి..ఇంస్టాగ్రామ్ లో ఇనయ మ్యూజిక్ వీడియోలు, అందాల ఆరబోతతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బిగ్ బాస్ లో కంటే ఇనయ ఇప్పుడు మరింత బొద్దుగా మారింది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఇక ప్రస్తుతం రెండు సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తుంది..