Site icon NTV Telugu

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

కాంగ్రెస్‌ ది డర్టీ గేమ్‌.. అప్పుడు మా చిన్నాన్న.. ఇప్పుడు నా సోదరి..
కాంగ్రెస్‌పై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. తిరుపతిలో ఇండియాటుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ డర్టీ గేమ్‌ ఆడుతుంది.. అది ఆ పార్టీ సంప్రదాయంగా చూస్తున్నాం అని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించారు.. విభజించి రాష్ట్రాన్ని పాలించాలనుకున్నారు.. అలాగే మా కుటుంబాన్ని కూడా విభజించారని మండిపడ్డారు. నేను కాంగ్రెస్‌ నుంచి విడిపోయినప్పుడు గతంలో మా చిన్నాన్న (వైఎస్‌ వివేకానందరెడ్డి)కు మంత్రిపదవి ఇచ్చి మాపై పోటీకి పెట్టారు.. అయినా చరిత్ర నుంచి వారు పాఠాలు నేర్వేలేదు.. ఇప్పుడు ఆ పార్టీ సారథ్య బాధ్యతలు మా సోదరి (వైఎస్‌ షర్మిల)కి ఇచ్చారు.. మా కుటుంబాన్ని విభజించి పాలించాలనే కుట్ర కాంగ్రెస్‌ పార్టీ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, అధికారం అనేది దేవుడు ఇచ్చేది.. దేవుడ్ని నేను బలంగా నమ్మతాను.. ఆయనే అన్నీ చూస్తాడు అని వ్యాఖ్యానించారు సీఎం వైఎస్‌ జగన్‌.

చంద్రబాబు అరెస్ట్‌పై సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు.. అందుకే..!
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. తిరుపతిలో నిర్వహించిన ఇండియాటుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే పోలీసులు అరెస్ట్‌ చేశారని స్పష్టం చేశారు.. చంద్రబాబు అరెస్ట్‌ విషయంలో ప్రతీకారం అన్నది లేనే లేదన్నారు. చంద్రబాబుపై అవినీతి ఆరోపణల విషయం కోర్టుకు చేరింది.. ఆ ఆరోపణలు, ఆధారాలను చూసి కోర్టు నిర్ణయం తీసుకుని రిమాండ్‌ విధించింది.. అలాంటప్పుడు ప్రతీకారం ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. సీఐడీ కేసులు పెట్టినా, కోర్టులు ఆధారాలను చూస్తాయి కదా? వాటిని చూసి కన్వెన్స్‌ అయితేనే కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి అన్నారు. పోలీసులు సాక్ష్యాధారాలను కోర్టుకు అందించారు.. అందుకే చంద్రబాబు 52 రోజులు జైలులో ఉన్నారని తెలిపారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఎన్నికల ముందు ఎవరైనా అపోజిషన్‌ నేతను అరెస్ట్‌ చేయాలని అనుకోరన్న ఆయన.. చంద్రబాబు తప్పుచేశారు కాబట్టే అరెస్ట్‌ అయ్యారు అన్నారు.

మార్పులు, చేర్పులపై జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు.. వారిపై అసంతృప్తి..!
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో మార్పులు, చేర్పుల వ్యవహారం కాకరేపుతూనే ఉంది.. అయితే, ఈ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.. ప్రతిపార్టీకూడా సర్వేలు చేస్తుంది.. వాటి ఫలితాలు ఆధారంగా మార్పులు, చేర్పులు చేస్తుందన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సానుకూలంగా ఉన్నారు.. కానీ, కొందరు స్థానిక నాయకులు విషయంలో కొంత అసంతృప్తితో ఉన్నారు.. అంతేకాకుండా సామాజిక సమీకరణాల దృష్ట్యా కూడా కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందన్నారు. చివరిదశలో మార్పులు చేసి అయోమయం సృష్టించే కన్నా, ముందుగానే నిర్ణయిస్తున్నాం అన్నారు. ఇక, జాతీయ రాజకీయాల విషయంలో మావిధానం స్పష్టంగా ఉందన్నారు.. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మేం రాజీపడం.. ప్రజల ప్రయోజనాల విషయంలోనే కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో ముందుకు వెళ్తున్నాం అన్నారు సీఎం జగన్‌..

జనసేనకు ‘గాజు గ్లాసు’ గుర్తు ఖరారు.. ఏపీ ఈసీకి ఆదేశాలు..
జనసేన పార్టీకి ఎన్నికల గుర్తును ‘గాజు గ్లాసు’ గుర్తును ఖరారు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల సంఘం ప్రధానాధికారిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్టు జనసేన వెల్లడించింది. ఇక, కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఉత్తర్వులకు సంబంధించిన కాపీలను.. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో.. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు అందించారు పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్.. కాగా, జనసేనకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించవద్దని గతంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌కు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు చేసింది.. గుర్తింపు పొందని పార్టీలకు వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఒకే గుర్తు కేటాయించకూడదని వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది.. అయితే, 2024 ఎన్నికలకు ముందు జనసేన పార్టీకి గుడ్‌ న్యూస్‌ చెబుతూ.. మళ్లీ గాజు గ్లాసు గుర్తును ఖరారు చేసింది సీఈసీ.

నా బలం పెనమలూరు ప్రజలే.. డబ్బుతో నా వెంట్రుక కూడా కొనలేరు..
నా బలం, బలగం పెనమలూరు నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలే అన్నారు టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్.. ఎవరికి కష్టం వచ్చినా ఆదుకోవడానికి ముందుకు వస్తానని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గంలో నిర్వహించిన టీడీపీ జయహో బీసీ సభలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు.. గుంటూరు మార్కెట్‌ యార్డ్‌ గోడౌన్‌లోకి వెళ్లి చూస్తే.. బీసీలకు కేటాయించాల్సిన పనిముట్లు తుప్పుపట్టిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి ప్రజలకు అందకూడదన్న ఉద్దేశంతోనే.. సీఎం వైఎస్‌ జగన్‌ సైకో మారి.. ఈ విధంగా బీసీలకు పనిముట్లు అందకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఏ కష్టం వచ్చినా.. ప్రజలకు, టీడీపీ శ్రేణులకు అండగా ఉంటూ కాపాడుకుంటూ వస్తున్నా అన్నారు బోడే ప్రసాద్.. రోజుకు ఒకరు కొత్త వ్యక్తులు వస్తూనే ఉంటారు.. కానీ, ప్రజలకు అందుబాటులో ఉన్న నేతల గురించి ఆలోచించాలన్నారు. మరో నియోజకవర్గంలో ఉన్న గంజాయి మొక్కను.. పెనమలూరుకు తీసుకొస్తే.. తులసి మొక్క అవుతుందా? అంటూ మంత్రి జోగి రమేష్‌పై విరుచుకుపడ్డారు. ఇక, టీడీపీ అభ్యర్థిని మారుస్తారట.. బోడె ప్రసాద్‌ డబ్బులకు అమ్ముడు పోయాడట అని కొందరు నాకు ఫోన్‌ చేస్తున్నారు.. నేను ఒకటే చెబుతున్నా.. నేను డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదు.. డబ్బుతో నా వెంట్రుకను కూడా కొనలేరని స్పష్టం చేశారు. రాజీపడే ప్రసక్తే లేదు.. కార్యకర్తలకు అప్పుడు, ఇప్పుడు.. ఎప్పుడే అండగా ఉంటానని పేర్కొన్నారు. ఇక, టీడీపీ నేతలను వైసీపీ సర్కార్‌ వేధింపులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఓ కేసులో ఉన్న వ్యక్తి.. టీడీపీ నేతకు ఫోన్‌ చేసినా.. అరెస్ట్‌ చేసి వేధిస్తారు.. సోషల్‌ మీడియాలో పోస్టును షేర్‌ చేసినా.. అరెస్ట్‌ చేసి క్షోభకు గురిచేస్తున్నారు అంటూ వైఎస్‌ జగన్‌ సర్కార్‌పై ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్.

జనసేనాని బిజీ బిజీ.. వరుస సమావేశాలు, జనసేనలో చేరికలు, రివ్యూలు..
ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి.. ఇక, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వరుస కార్యక్రమాలతో బిజీ అయ్యారు.. వరుస సమావేశాలు, పార్టీలో చేరికలు, రివ్యూ సమావేశాలు నిర్వహిస్తున్నారు.. పవన్‌ కల్యాణ్‌తో గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సమావేశం అయ్యారు.. గూడూరు వైసీపీ టికెట్‌ను మేరిగ మురళికి కేటాయించింది.. దీంతో పార్టీపై అసంతృప్తితో ఉన్న వరప్రసాద్‌.. జనసేనానితో టచ్‌లోకి వెళ్లారు.. ఈ రోజు పవన్‌తో భేటీ అయ్యి.. జనసేన పార్టీలో చేరే అంశంపై చర్చించారు.. అయితే, తిరుపతి ఎంపీ స్థానాన్ని వర ప్రసాద్ ఆశిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఆయనకు జనసేనాని ఏ స్థానం కేటాయిస్తారు అనేది తెలయాల్సి ఉంది. మరోవైపు.. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ.. మరోసారి పవన్‌తో భేటీ అయ్యారు.. ఇప్పటికే జనసేన పార్టీలో చేరాలని కొణతాల నిర్ణయం తీసుకున్న విషయం విదితమే కాగా.. అనకాపల్లి లోక్ సభ నుంచి జనసేన టికెట్‌ను ఆశిస్తున్నారాయన.. త్వరలోనే అనకాపల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధం అయ్యారు.. అయితే, పార్టీ తన సేవలను ఎలా ఉపయోగించుకున్నా.. పూర్తిస్థాయిలో పనిచేస్తానని.. ఏ స్థానం కేటాయిస్తారు అనేది పార్టీ అధినేత ఇష్టమని ప్రకటించారు కొణతాల.. ఇక, ఇప్పటికే 35 నియోజకవర్గాలకు సంబంధించిన రివ్యూ మీటింగ్‌లు పూర్తి చేశారు పవన్‌.. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలోని సీట్ల ఖరారుపై ఆయన ఫోకస్‌ పెట్టారు.. ఈరోజు ప్రముఖ సినీ నటుడు పృధ్వీ రాజ్.. మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు పవన్‌.. ప్రముఖ సినీ నృత్య దర్శకుడు షేక్ జానీ మాస్టర్ కూడా జనసేన గూటికి చేరారు.. ఆయనకు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు పవన్‌ కల్యాణ్‌.. ఎన్నికల్లో చేపట్టాల్సిన ప్రచారంపై నటుడు పృధ్వీ, డ్యాన్స్ మాస్టర్ జానీతో పవన్ చర్చలు జరిపారు.. మొత్తంగా వరుస కార్యక్రమాలతో పవన్‌ కల్యాణ్‌ బిజీగా గడుపుతున్నారు.

రాహుల్ గాంధీ ప్రజలను సంఘటితం చేసే పనిలో ఉన్నారు
రాహుల్ గాంధీ ప్రజలను సంఘటితం చేసే పనిలో ఉన్నారన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జగ్గారెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. న్యాయమైన పాలన బీజేపీ చేయడం లేదు కాబట్టి రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారన్నారు. పెరుగుతున్న ధరలకు హద్దు లేకుండా పోయింది మోడీ పాలనలో అని, అస్సాంలో రాహుల్ గాంధీని అడ్డుకోవడం ఎంత వరకు సమంజసం అని ఆయన మండిపడ్డారు. అస్సాం సీఎం హేమంత బిశ్వశర్మ.. ఒకప్పుడు కాంగ్రెస్ గూటి పక్షే అని ఆయన వ్యాఖ్యానించారు. మెప్పుకోసం రాహుల్ గాంధీని అడ్డుకుంటున్నారని, రాహుల్ గాంధీ గుడికి పోవద్దా అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ గుడికి పోవాలి అంటే.. అస్సాం సీఎం అనుమతి అవసరమా అని ఆయన జగ్గారెడ్డి అన్నారు. మోడీ మెప్పు కోసం అస్సాం సీఎం ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వమే లా అండ్ ఆర్థర్ సమస్య సృష్టిస్తోందన్నారు జగ్గారెడ్డి.

ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురావాలి
లక్డికాపుల్ ని కలెక్టరెట్ కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం జరిగింది. సమీక్షా సమావేశంలో ముఖ్య అతిధిగా హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్, రవాణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ అనుదిప్ దురశెట్టి అధ్యక్షతన జరిగిన సమావేశానికి అడిషనల్ కలెక్టర్ ముధుసుదన్, ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.. హైదరాబాద్ జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యలపై, పెండింగ్ లో ఉన్న పనులపై, వివిధ శాఖల వారిగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాబోయే పదవ తరగతి పరీక్షల పై జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని డిపార్మెంట్ ఏదైనా అధికారులు పాఠశాలల్లో పర్యవేక్షించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. గురుకులాలు, బీసీ వెల్ఫెర్ హాస్టల్ లలో సమస్యలు లేకుండా చూసుకోవాలని సూచించారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని నగరంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావలని ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు..

“బడ్జెట్ హల్వా” కార్యక్రమంలో నిర్మాలా సీతారామన్.. అసలు ఈ హల్వా ప్రాముఖ్యత ఏంటి..?
మధ్యంతర కేంద్ర బడ్జెట్-2024 తయారీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. దీంతో సాంప్రదాయ ‘హల్వా వేడుక’ ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని నార్గ్ బ్లాక్‌లోని కేంద్రం మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హల్వాను ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులకు పంచారు. ఈ కార్యక్రమానికి మంత్రితో పాటు కేంద్రం ఆర్థిక శాఖ సహాయమంత్రి డాక్టర్ భగవత్ కరాద్ ఉన్నారు. బడ్జెట్ ప్రక్రియ ముగింపు, ముద్రణకు ముందు ఇలా హల్వా వేడుకలను సాంప్రదాయకంగా నిర్వహిస్తారు. రాబోయే బడ్జెట్ గోప్యత పాటించేందుకు, పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు బడ్జెట్ ప్రక్రియతో సంబంధం ఉన్న అధికారులంతా ఆర్థిక మంత్రిత్వ శాఖ భవనంలోనే ఉండాలి. ఈ ఆచారం దశాబ్ధాలుగా ఉంది. ముఖ్యంగా భారతీయలు ఏదైనా వేడుకకు ముందు ఇలా స్వీట్లు పంచుకోవడం అనేది సంప్రదాయంగా ఉంది. శుభవార్తలకు నోరు తీపి చేసుకోవాలని చెబుతుంటారు. బడ్జెట్ కూడా అలాంటి వేడుక వంటిదే అని చెప్పేందుకు ఇలా హల్వా వేడకల్ని నిర్వహిస్తారు. భారత్ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆచరించే ఒక సంప్రదాయం. ఇది దేశ బడ్జెట్ చివరి దశను సూచిస్తుంది. కేంద్రం పార్లమెంట్‌కి బడ్జెట్ సమర్పించే కొన్ని రోజుల ముందు ఈ వేడుకలు జరుగుతాయి. దీనికి ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారు.

తొలి “లిక్కర్ షాప్” ప్రారంభించనున్న సౌదీ అరేబియా.. కానీ, కండిషన్స్ అప్లై..
ఇస్లామిక్ చట్టాలను కఠినంగా పాటించే సౌదీ అరేబియాలో మద్యపానంపై బ్యాన్ ఉంది. ఆ దేశంలో ఎక్కడా కూడా ఆల్కాహాలు దొరకదు, ఎవరైనా వాటితో పట్టుబడితే నేరంగా పరిగణిస్తారు. ఇదిలా ఉంటే తాజాగా సౌదీలో మొట్టమొదటి సారిగా లిక్కర్ షాప్ ప్రారంభించేందుకు సిద్ధమైంది. ప్రత్యేకంగా ముస్లిమేతర దౌత్యవేత్తల కోసం రాజధాని రియాద్‌లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. కస్టమర్లు మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ కోడ్‌ని పొందాలని సౌదీ ప్రభుత్వ పత్రాలు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. నెలవారీ కోటాపై కూడా పరిమితి ఉండనన్నట్లు సమాచారం. ఇస్లాంలో మద్యం సేవించడం నిషేధించబడుతుంది. అయితే, ఇటీవల సౌదీ కూడా పర్యాటకంగా వ్యాపారపరంగా అభివృద్ధి చెందాలని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పలు చారిత్రత్మక నిర్ణయాలను తీసుకుంటున్నారు.

ఫిబ్రవరి 1 నుంచి పెరగనున్న టాటా కార్‌ల ధరలు..
టాటా మోటార్స్ కార్లు కొనుగోలు చేయాలనుకునే వారు ఇకపై మరింత ధనాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. టాటా మోటార్స్ ఫిబ్రవరి 1 నుంచి అన్ని మోడళ్లపై ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, హారియర్, సఫారీ, టియాగో ఈవీ, టిగోర్ ఈవీ, నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీలపై ధరలు పెరగనున్నాయి. కంపెనీ తన కార్ల ధరలను సగటున 0.7 శాతం పెంచనుంది. ఈ పెంపు ఫిబ్రవరి 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదలను పాక్షికంగా భర్తీ చేయడానికి ధరలు పెంచాల్సి వస్తోందని టాటా మోటార్స్ ప్రకటించింది. ప్రస్తుతం టాటా డిజిల్, పెట్రోల్, సీఎన్‌పీ, ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. ఇటీవల పూర్తిగా ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్ మీద బిల్ట్ అయిన పంచ్ ఈవీని టాటా విడుదల చేసింది. 2023లో ఏకంగా టాటా మోటార్స్ 5,50,838 యూనిట్ల కార్లను విక్రయించింది. ఈ ఏడాది 4.56 శాతం వృద్ధిని సాధించింది. అంతకు ముందు ఏడాది 2022లో 5,26,798 కార్లను విక్రయించింది.

విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి ప్రపంచ దేశాలు మనవైపు చూసేలా సినిమాలు చేస్తున్నారు
ఈ రోజు నుంచి చారిత్రక గోల్కొండ కోట అత్యాధునిక హంగులతో కనువిందు చేయబోతుంది. పర్యాటకులను పెంచడమే లక్ష్యంగా రాత్రి వేళ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా, ఈ కోట చరిత్రను తెలిపేలా సౌండ్‌ అండ్‌ లైట్‌ షోను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, మెగాస్టార్​ చిరంజీవి, ఎంపీ విజయేంద్రప్రసాద్‌ ముఖ్య అతిథులుగా హాజరు అయిన ఈ వేడుకలో లైట్‌ షోను ప్రారంభించారు. ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ ప్రపంచ దేశాలు భారత దేశ చలన చిత్ర వైపు చూస్తున్నాయని, విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి లాంటి వాళ్ళు అంతర్జాతీయ స్థాయి సినిమాలు చేస్తున్నారని అన్నారు. వెయ్యి పదాలు చెప్పలేని దాన్ని ఒక దృశ్యం చెబుతుందని భవిష్యత్ తరాలకు చెప్పేందుకు కలర్ ఫుల్ గా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లైట్ అండ్ లేజర్ షో ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా జాతీయ స్థాయిలో ఉమ్మడి ఎపీని టూరిజం లో నెంబర్ గా నిలబెట్టానని అన్నారు.

గుంటూరు కారం కుర్చీ తాత అరెస్ట్.. మహేష్ బాబు వల్లనే అంటూ ప్రచారం… అసలు విషయం ఏంటంటే
కుర్చీ మడతపెట్టి అని ఒక బూతు డైలాగుతో ఫేమస్ అయిన కాలా పాషా అలియాస్ కుర్చీ తాత అనే ఒక వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తి నోటి వెంట వచ్చిన కుర్చీ మడత పెట్టి అని బూతు మాటతోనే గుంటూరు కారం సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక బ్లాక్ బస్టర్ సాంగ్ సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పోలీసులు సదరు కూర్చి తాతను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. కుర్చీ తాతను ఎస్ ఎస్ థమన్ వరకు తీసుకెళ్లిన వైజాగ్ సత్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్ట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలో వైజాగ్ సత్య అనే వ్యక్తి ఉప్పల్ బాలుతో కలిసి టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా సెలబ్రిటీగా చలామణి అవుతున్నాడు. ఆయన స్వయంగా కుర్చీ తాతను తమన్ వరకు తీసుకువెళ్తే ఇప్పుడు తమన్ దగ్గర డబ్బులు తీసుకుని తాను కాజేసినట్టు కుర్చీ తాత ప్రచారం చేస్తున్నాడని పోలీసులు ఫిర్యాదు చేశాడు. ఆయన ముందు తనతో బాగానే ఉండేవాడని మహేష్ బాబు నుంచి ఇల్లు ఇప్పించమని అడిగితే నా వల్ల కాదని చెప్పిన తర్వాత ఎదురు తిరిగి ఇలా తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని వైజాగ్ సత్య చెబుతున్నారు. వైజాగ్ సత్య ఫిర్యాదు మేరకు పోలీసులు కుర్చీ తాతను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇంకా అందాల్సి ఉంది.

Exit mobile version