*అంబేడ్కర్ మహాశిల్పాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి జగన్
విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ప్రపంచంలోనే ఎత్తయిన అంబేడ్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. 18 ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు చేసి అందులో 206 అడుగులున్న అంబేడ్కర్ మహాశిల్పాన్ని సీఎం ఆవిష్కరించారు. అంబేడ్కర్ విగ్రహం ఎత్తు 125 అడుగులు కాగా.. పీఠం 81 అడుగుల ఎత్తు ఉంది. విజయవాడలో నెలకొల్పిన అంబేడ్కర్ విగ్రహాన్ని పూర్తిగా స్వదేశీ వస్తువులతోనే రూపొందించారు. ఇందుకోసం రూ.404.35 కోట్లు ఖర్చు చేశారు. 18.18 ఎకరాల్లో ఈ భారీ ప్రాజెక్టు నిర్మించారు. పీఠంపై జీ ప్లస్ 2 తరహాలో గదులు నిర్మించారు. పీఠాన్ని బౌద్ధ మత కాలచక్ర మహామండపం తరహాలో తీర్చిదిద్దారు. ఇక్కడ అంబేద్కర్ జీవిత విశేషాలతో కూడిన ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు, రెండు వేల మంది సామర్థ్యంతో కూడిన కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది.అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యకమంలో డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. పోరాటానికి రూపమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని కీర్తించారు. సామాజిక న్యాయ మహాశిల్పం పేరిట అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. అందరినీ ఒక్కతాటిపై తీసుకురావడానికి అంబేద్కరే స్ఫూర్తి అని పేర్కొన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహం ప్రపంచంలోని ఇతర అంబేద్కర్ విగ్రహాలన్నింటి కంటే పెద్దది అని వెల్లడించారు. స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ కు ఇకపై విజయవాడ చిరునామాగా మారుతుందని సీఎం స్పష్టం చేశారు. అంబేడ్కర్ భావజాలం పెత్తందార్లకు నచ్చదని అన్నారు. దళిత, బలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమ లేదని విమర్శలు గుప్పించారు.
*మరణం లేని మహానేత అంబేడ్కర్: సీఎం జగన్
సామాజిక చైతన్యాలవాడగా విజయవాడ కనిపిస్తోందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన సామాజిక సమతా భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. అంబేడ్కర్ విగ్రహం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్.. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా గుర్తొస్తుందని సీఎం వెల్లడించారు. ఇక స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఏపీ గుర్తుకు వస్తుందన్నారు. ఈ విగ్రహం పేదల హక్కులకు, రాజ్యాంగ హక్కులకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. దళిత వర్గాలకు బలహీన వర్గాలకు అంబేడ్కర్ గొంతుకగా నిలిచారని.. మరణం లేని మహానేత అంబేడ్కర్ అంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. అంటరానితనంపై తీవ్రంగా స్పందించారు సీఎం జగన్. అంటరానితనం తన రూపం మార్చుకుందని.. పేదలను దూరంగా ఉంచడం మాత్రమే అంటరానితనం కాదన్నారు. పేదవారు ఇంగ్లీష్ మీడియం చదవొద్దని కోరుకోవడం కూడా అంటరానితనమేనన్నారు. పేదలు తెలుగు మీడియంలోనే చదవాలనడం వివక్ష కాదా? అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పేద కులాల వారు ఎప్పటికీ తమ సేవకులుగానే ఉండాలంట అంటూ తీవ్రంగా మండిపడ్డారు. పేదలు ప్రయాణించే ఆర్టీసీని కూడా నిర్వీర్యం చేయాలనుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు ఆత్మగౌరవంతో బతకొద్దని పెత్తందారు కోరుకుంటున్నారని.. పథకాల అమలులో కూడా వివక్ష చూపడం అంటరానితనమేనన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేడ్కర్ విగ్రహం అని చెప్పడానికి గర్వపడుతున్నానని సీఎం జగన్ వెల్లడించారు. దళితులకు చంద్రబాబు సెంటు భూమి ఇవ్వలేదని సీఎం జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు అంబేడ్కర్ విగ్రహాన్ని నిర్మించింది లేదని.. దళిత, బలహీన వర్గాలపై చంద్రబాబుకు ప్రేమే లేదన్నారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అన్న వ్యక్తి చంద్రబాబు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. దళితులంటే చంద్రబాబుకు నచ్చరని ఆయన చెప్పారు. పెత్తందారి పార్టీలకు పెత్తందారి నేతలకు పేదలు పట్టరని విమర్శించారు. పేదలకు అండగా ఉండాలని పెత్తందారి పార్టీలకు ఎందుకు ఆలోచన రాదని ప్రశ్నించారు. “వైసీపీ నుంచి శాసనమండలిలో 29 మంది సభ్యులు బలహీనవర్గాల వారేనని.. 8 మందిని రాజ్యసభకు పంపితే అందులో సగం ఎస్సీ, బీసీలే.. 13 జడ్పీ ఛైర్మన్లలో 9 మంది బలహీనవర్గాల వారే.. ఇలాంటి సామాజిక న్యాయం మన ప్రభుత్వంలో తప్పితే ఎక్కడైనా చూశారా?.. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు.” అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
*ప్రపంచంలోని సమస్యలకు ప్రజాస్వామ్యమే పరిష్కారం: రేవంత్ రెడ్డి
లండన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి భారతీయ మూలాలున్న బ్రిటిష్ పార్లమెంట్ మెంబర్లను కలుసుకున్నారు. చారిత్రాత్మకమైన వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘భారత్ మరియు బ్రిటన్ మధ్య బలమైన బంధాలలో ఒకటైన ప్రజాస్వామ్యం. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచడమే అత్యవసరం…’అన్నారు. వెస్ట్ మినిస్టర్ ప్యాలెస్ ను యునెస్కో 1016 సంవత్సరంలోనే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ చారిత్రక భవనంలో జరిగిన సమావేశంలో లేబర్ ఎంపీ వీరేంద్ర శర్మతో పాటు మరో ఏడుగురు ఎంపీలు, ఉన్నత స్థాయి అధికారులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “నేడు ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. హింస, ఉగ్రవాదం, ప్రజల హక్కుల హరణ, ప్రజాస్వామ్యంపై దాడి లాంటి సమస్యలను ప్రపంచం ఎదుర్కొంటోంది. కేవలం ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలను శక్తిమంతులను చేయటమే అసలైన పరిష్కారం.‘ అన్నారు. ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలను ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. ‘ఒకప్పుడు మీ దేశం మా దేశాన్ని పరిపాలించింది. మా కాంగ్రెస్ పార్టీనే మీకు వ్యతిరేకంగా పోరాడింది. అప్పుడు మహాత్మ గాంధీ ఎంచుకున్న సత్యం, అహింస, న్యాయ పోరాటమే మీ దేశానికైనా మా దేశానికైనా ఇప్పటికీ మార్గదర్శకాలు…‘ అన్నారు. ఇదే సందర్భంగా తన స్వీయ అనుభవాలను సీఎం పంచుకున్నారు. ‘నాది గ్రామీణ ప్రాంతం. నేను సామాన్య రైతు బిడ్డను. కేవలం ప్రజాస్వామ్యం వల్లనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. నేనున్న కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య భావనను నరనరాన జీర్ణించుకున్న పార్టీ. నాకు ఈ అవకాశం వచ్చినట్లే.. దేశంలో ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందే అవకాశం ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేస్తేనే సాధ్యమవుతుంది…’ అన్నారు.
*శ్రీశైలం, నాగార్జున సాగర్‌లు కేఆర్‌ఎంబీ పరిధిలోకి వెళ్తే నష్టమే
ఉమ్మడి నీటిపారుదల ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్‌ఎంబీ) ద్వారా కేంద్రం ఆధీనంలోకి తీసుకువస్తామని వస్తున్న వార్తలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రెండు ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకురావడం వల్ల తెలంగాణపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రయోజనాలకు నీరు చాలా కీలకమని, రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధిని ప్రభావితం చేసే అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ చర్యను ప్రశ్నిస్తూ, తెలంగాణకు నష్టం వాటిల్లుతుందని, ఆంధ్రప్రదేశ్ లాభపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి నీటిపారుదల ప్రాజెక్టులను 2021 జూలైలో కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదించిందని, దానిని అప్పటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్రంగా వ్యతిరేకించారని మాజీ మంత్రి గుర్తు చేశారు. “బదులుగా, మేము రెండు రాష్ట్రాలకు కృష్ణా నది నీటి కేటాయింపులో 50 శాతం డిమాండ్ మరియు శ్రీశైలం నుండి హైడల్ పవర్ ఉత్పత్తి చేయడం వంటి అనేక షరతులను ప్రతిపాదించాము. కానీ కేంద్రం వాటిని ఇప్పటి వరకు ఆమోదించలేదు’’ అని అన్నారు. ఆపరేషన్ మాన్యువల్ గిల్డీన్‌లను విడుదల చేయకుండా రెండు నీటిపారుదల ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ప్రశ్నించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా ఇంకా తేలనప్పుడు ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి ఎలా తెస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తెస్తే తీవ్ర విద్యుత్ సంక్షోభం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ప్రభావం పడుతుందని, హైదరాబాద్ తాగునీటి సరఫరాపై ప్రభావం పడుతుందని హరీశ్‌రావు హెచ్చరించారు. రాజకీయాలను పక్కనబెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైతే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సరికొత్త ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్‌ఎస్ కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల నుంచి తక్షణమే నీటిని విడుదల చేసి ఆయా ఆయకట్టుల పరిధిలోని వ్యవసాయ పొలాలకు నీరందించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పంప్‌హౌజ్‌లను ఒకటి, ఆపివేయకుండా సమర్ధవంతమైన నీటి వినియోగం కోసం 24 గంటలూ ఆపరేట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన సూచించారు. బీఆర్‌ఎస్ ప్రయోజనాలను కాపాడేందుకు బీఆర్‌ఎస్ దేనికైనా సిద్ధమని ఆయన పునరుద్ఘాటించారు.
*ఇరిగేషన్ శాఖను ధ్వంసం చేశారు: మంత్రి ఉత్తమ్
రెండు మూడు రోజుల్లో సీతారామ ప్రాజెక్టుల సందర్శనకు మంత్రులందరం వెళతామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాము ఏదో చేస్తున్నామని భ్రమలు కల్పించారు బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు అని ఆయన మండిపడ్డారు. 1500 కోట్లతో పూర్తి అయ్యే ప్రాజెక్టులు 2981 కోట్లకు అంచనా వ్యయం పెంచారన్నారు. ఇరిగేషన్ మంత్రిగా నేనే నిర్ఘాంత పోయా.. ఇరిగేషన్ శాఖను ద్వంసం చేశారని, 94 వేల కోట్లు ఖర్చు చేస్తే కాళేశ్వరంలో లక్ష ఎకరాలకు నీరు ఇవ్వలేదన్నారు. పదేళ్ల బీఆర్ ఎస్ ప్రభుత్వంలో నీటి వాటాలో ఒక చుక్క ఎక్కువ తీసుకువచ్చారా? అని ఆయన ప్రశ్నించారు. జాతీయ ప్రాజెక్టులకు 60 శాతం నిధులు కేంద్రం ఇస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం సరైన ఫార్మేట్ లో అప్లై చేయలేదని, జాతీయ హోదా అనే అంశం రాజకీయాల కోసం బీఆర్ఎస్ నేతలు మాట్లాడారని, జాతీయ హోదా అనేది దేశంలో ఎక్కడా లేదని కేంద్ర జలశక్తి మంత్రి తేల్చి చెప్పారన్నారు. జాతీయ హోదా కాకుండా ఇతర మార్గాల్లో 60 శాతం నిధులు ఇస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని, ఇప్పుడు జాతీయ హోదా గురించి మాట్లాడటానికి హరీష్‌కు సిగ్గూ శరం ఉండాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. కేఆర్‌ఎంబీకి ఏ ప్రాజెక్టు అప్పగించడానికి మేము ఒప్పుకోలేదని ఆయన మండిపడ్డారు. రాజకీయం చేయను అనుకుంటూనే హరీశ్ రాజకీయాలు మాట్లాడాడని, కేఆర్ఎంబీకి రాష్ట్రంలోని ప్రాజెక్టులు అందివ్వలేదన్నారు. కృష్ణా నది పై ఉన్న ప్రాజెక్టులపై కేంద్రం చర్చలు జరిపింది. దీనిపై తెలంగాణ ఎలాంటి సమాధానం చెప్పలేదని, మేము కేంద్రం చెప్పిందనికి అంగీకారాన్ని తెలుపలేదన్నారు. కృష్ణ వాటర్ గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. మీరు జగన్మోహన్ అలై బలై తీసుకున్నారు. సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా జగన్ కృష్ణా నీటిని తీసుకు వెళ్తున్న ఒక్కసారి కూడా మాట్లాడలేదు. హైదరాబాద్ లో గంటలు గంటలు జగన్మోహన్ రెడ్డితో మీరు ఏకాంత చర్చలు జరిపారు. తెలంగాణ సంపద 2 లక్షల కోట్లు సంపద దోపిడీకి, అన్యాయానికి గురైంది. కేసీఆర్ 10.5, 11 %కు కార్పొరేషన్ లోన్లు తీసుకు వచ్చారు. బీఆర్ ఎస్ తీసుకు వచ్చిన అప్పులకు రిపేమాంట్ ఇంట్రెస్ట్ 18 వేల కోట్లు అవుతుంది.’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
*దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడటానికి ప్రజల సహకారం అవసరం: భట్టి విక్రమార్క
ఖమ్మం జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పాలని సమీక్ష సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇరిగేషన్ శాఖపై మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల, పొంగులేటితో పాటు అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ల కోసమని, దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ వ్యయం రూ.1681కోట్లు కాగా.. రూ.889 కోట్లు 2014 కంటే ముందే ప్రభుత్వం ఖర్చు చేసిందని భట్టి విక్రమార్క ఈ సందర్భంగా తెలిపారు. ఇందిరా సాగర్ వ్యయం రూ.1824 కోట్లు కాగా.. 1064 కోట్లు ఖర్చు చేశారన్నారు. రెండు ప్రాజెక్టులకు మిగతా రూ.1552 కోట్లు ఖర్చు చేస్తే 4లక్షల ఎకరాలకు నీరు అందేదని ఆయన వెల్లడించారు. సీతారామ ప్రాజెక్టు అని పేరు చెప్పి 18500 కోట్లకు కేసీఆర్ ప్రభుత్వం అంచనా వ్యయం పెంచిందని.. కానీ కొత్త ఆయకట్టు లేదని మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. సీతమ్మ బ్యారేజీకి నీటిని అందించేందుకు రూ. 3,486 కోట్లకు ప్రాజెక్టు ఖర్చు అంచనా వేయగా.. కానీ మొత్తం రూ.4,481కోట్లు ఖర్చు చేశారన్నారు. రీడిజైన్ పేరుతో ఒక్క ఎకరానికి నీరు అందివ్వ లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి మూడు సంవత్సరాల్లో సంవత్సరానికి రూ.500 కోట్లు ఖర్చు చేస్తే వేల ఎకరాలకు నీరు వచ్చేదన్నారు. దోపిడీ నుంచి రాష్టాన్ని కాపాడటానికి ప్రజల సహకారం అవసరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంటే చూస్తే ఊరుకుంటే కడుపు తరుక్కు పోతుందన్నారు.
*కిషన్ రెడ్డికి సెర్బియా ఆహ్వానం
భారత పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి.. సెర్బియా పర్యటనకు రావాల్సిందిగా ఆహ్వానం అందింది. ఈఏడాది ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు బెల్‌గ్రేడ్‌లో జరిగే.. 45వ ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్ (ITF)కు హాజరుకావాలని.. సెర్బియా పర్యాటక శాఖ మంత్రి శ్రీ హుసేన్ మెమిక్ ఆహ్వాన పత్రాన్ని పంపించారు. యూరప్, సెర్బియా ప్రాంతంలో పర్యాటక రంగాభివృద్ధికి జరిగే అతిపెద్ద ఈవెంట్కా ఇది. గత 30 ఏళ్లుగా ఈ కార్యక్రమం జరుగుతోండగా.. ఈసారి ‘అడ్వెంచర్ బిగిన్స్ హియర్’ అనే థీమ్ తో ఈ ITF జరగనుంది. వివిధ దేశాలనుంచి పర్యాటక శాఖల మంత్రులు, ఈ రంగానికి సంబంధించిన భాగస్వామ్య పక్షాలు, ఇన్వెస్టర్లు ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో పాల్గొననున్నారు.
*అతిథుల చార్టర్డ్ విమానాల పార్కింగ్.. 12 ఎయిర్ పోర్టులను సంప్రదించిన ఆలయ ట్రస్ట్
అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా.. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, ప్రముఖ న్యాయవాది పరాశరన్ నుండి అదార్ పూనావాలా వరకు ఐదు వందల మందికి పైగా ప్రత్యేక అతిథులు రానున్నారు. ఈ క్రమంలో.. 100 చార్టర్డ్ విమానాలు రానున్నాయని శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ అంచనా వేస్తుంది. అందుకోసం.. విమానాల పార్కింగ్ కోసం 12 విమానాశ్రయాలను సంప్రదించారు. వీఐపీలను మూడు కేటగిరీలుగా విభజించారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 20, 21, 22 తేదీల్లో మొత్తం 100 చార్టర్డ్ విమానాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అటువంటి పరిస్థితిలో.. ఈ చార్టర్డ్ విమానాల పార్కింగ్ కోసం 1000 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 12 విమానాశ్రయాలను సంప్రదిస్తున్నారు. మూడు రోజుల్లో దాదాపు వంద చార్టర్డ్ విమానాలు వస్తాయని అనుకుంటున్నట్లు.. అందుకు ఏర్పాట్లు చేయాలని ఎయిర్‌పోర్టు అధికారులను కోరామని చంపత్ రాయ్ తెలిపారు. జనవరి 22న దాదాపు 50 చార్టర్డ్ విమానాలు అయోధ్యకు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో.. చార్టర్డ్ విమానాల పార్కింగ్ కోసం అయోధ్య విమానాశ్రయం నుండి గోరఖ్‌పూర్, గయా, లక్నో, ఖుజ్రాహో విమానాశ్రయాలను సంప్రదిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అయోధ్యలో వీఐపీలకు బస చేసేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అంతేకాకుండా.. రామ్ మందిర్ ట్రస్ట్ ప్రత్యేక అతిథుల కోసం QR కోడ్‌తో కూడిన ప్రత్యేక కార్డ్‌ను కూడా సిద్ధం చేసింది.
*28 ఏళ్ల తర్వాత “మిస్ వరల్డ్” పోటీలకు భారత్ ఆతిథ్యం..
28 ఏళ్ల తర్వాత భారత్ “మిస్ వరల్డ్” పోటీలకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. 71వ ప్రపంచ సుందరి పోటీకలు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు ఈవెంట్ నిర్వాహకులు తెలిపారు. ‘‘మిస్ వరల్డ్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశంగా భారతదేశాన్ని గర్వంగా ప్రకటిస్తున్నప్పుడు ఉత్సాహాన్ని నింపుతుంది. అందం, వైవిధ్యం, సాధికారత యొక్క వేడుక వేచి ఉంది. అద్భుత ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. #మిస్ వరల్డ్ ఇండియా #బ్యూటీ విత్ పర్పస్’’ అంటూ మిస్ వరల్డ్ అధికారిక ఎక్స్(ట్విట్టర్) అకౌంట్లో మిస్ వరల్డ్ చైర్మన్ జూలియా మోర్లీని ఉటంకిస్తూ ప్రకటించారు. భారతదేశంలో చివరి సారిగా బెంగళూర్‌లో 1996లో ఈ పోటీలు జరిగాయి. తొలిసారిగా ఇండియా తరుపున రీటా ఫారియా పావెల్ 1966లో మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత 1994లో ఐశ్వర్యరాయ్, 1997 డయానా హెడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంకా చోప్రా, 2017లో మానుషి చిల్లర్ ఈ కిరిటాన్ని సొంతం చేసుకున్నారు. గత పోటీల్లో పోలాండ్‌కి చెందిన కరోలినా బిలావ్క్సా విజేతగా నిలిచారు. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 మధ్య ఈ ఏడాది ఈవెంట్ నిర్వహించనున్నారు. మిస్ ఇండియా ఓపెనింగ్ సెర్మనీ ‘ఇండియా వెల్కమ్ ది వరల్డ్ గాలా’ పేరుతో ఐటీడీసీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ అశోక హోటల్‌లో నిర్వహిస్తారు, ఫైనల్స్‌కి మార్చి 9న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ వేదిక అవుతుంది.
