Site icon NTV Telugu

Top Headlines@9PM: టాప్‌ న్యూస్

Top Headlines

Top Headlines

*యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణంలో జాప్యానికి కారకులు ఎవరు..?
యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నిర్మాణంలో ఇంత జాప్యానికి కారకులు ఎవరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన.. ఇంధన శాఖ కార్యదర్శి రిజ్వితో కలిసి బీహెచ్‌ఈఎల్‌ అధికారులతో యాదాద్రి పవర్‌ ప్లాంట్‌పై సమీక్షించారు. అగ్రిమెంట్‌ ప్రకారం 2020 అక్టోబర్‌ నాటికి రెండు యూనిట్లు, 2021 అక్టోబర్‌ నాటికి మరో మూడు యూనిట్లు పూర్తి చేసుకొని మొత్తం 4వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిని ప్రారంభించాల్సి ఉండగా, నిర్మాణం ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉండటానికి గల కారణాలేమిటని అడిగారు. కాంపిటీటివ్‌ బిడ్డింగ్‌ విధానంలో టెండర్లను ఆహ్వానించకుండా నామినేషన్‌ పద్ధతిలో బీహెచ్‌ఈఎల్‌కు ఎందుకు పనులు అప్పగించారని అడిగారు. యాదాద్రి విద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి జెన్‌కో రూపొందించిన అంచనాలు, బీహెచ్‌ఈఎల్‌ కోట్‌ చేసిన రేటు, ధరల విషయంలో బీహెచ్‌ఈఎల్‌తో జరిగిన నెగోషియెషన్స్, అంగ్రిమెంట్‌ విలువ వంటి అంశాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని ఇంధన శాఖ కార్యదర్శిని ఆదేశించారు. యాదాద్రి పవర్‌ ప్లాంటు నిర్మాణానికి రూ.34,500 కోట్ల అంచనాలతో 2015 జూన్‌ 6న బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం చేసుకోగా, 2017 అక్టోబర్‌లో వర్క్‌ ఆర్డర్‌ జారీ చేశారని, ఈ అగ్రిమెంట్‌ ప్రకారం 2021 నాటికి పనులన్నీ ఎందుకు పూర్తి కాలేదు ? ఇంకా విద్యుదుత్పత్తి ఎందుకు ప్రారంభం కాలేదు? అని భట్టి ప్రశ్నించారు. సకాలంలో తమకు బిల్లులను చెల్లించలేదని బీహెచ్‌ఈఎల్‌ అధికారులు ఆలస్యానికి కారణాలను వివరిస్తూ తెలిపారు. పర్యావరణ అనుమతులకు సంబంధించిన ఇబ్బందులు సైతం జాప్యానికి కారణమని తెలిపారు. రూ.34,500 కోట్ల పనుల్లో బీహెచ్‌ఈఎల్‌కు అప్పగించిన పనులు విలువ ఎంత? అని మంత్రి ప్రశ్నించారు. బీహెచ్‌ఈఎల్‌కు రూ. 20,444 కోట్లు విలువ చేసే పనులు అప్పగించారని, మిగిలిన పనులను జెన్కో ఇతర సంస్థలు చేపట్టాయని బీహెచ్‌ఈఎల్‌ అధికారులు వివరించారు. తమకు ఇచ్చిన పనుల్లో రూ.15,860 కోట్ల పనులు పూర్తి చేయగా, రూ.14,400 కోట్ల చెల్లింపులు చేశారన్నారు. రూ.1167 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. గత ప్రభుత్వం చెల్లింపులు విడతల వారీగా చేయలేదని, 2023 మార్చి ఒక్క నెలలోనే 91శాతం పేమెంట్‌ చేశారన్నారు. నిధులు సకాలంలో చెల్లించకపోవడంతో తాము సబ్‌ కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయలేక పోయామని, దీంతో పనులు సజావుగా జరగలేదని వివరించారు. పర్యావరణ అనుమతులను ఏప్రిల్‌ 2024 నాటికి తీసుకువస్తే తాము సెప్టెంబర్‌ 2024 వరకు రెండు యూనిట్లు, డిసెంబర్‌ 2024 వరకు మరో రెండు యూనిట్లు, 2024 మే నాటికి మిగిలిన ఒక యూనిట్‌ను పూర్తి చేసి విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభిస్తామని పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా అధికారులు తెలియజేశారు.

 

*ఆరోగ్యశ్రీ ఉచిత సేవలు పొందే విషయంలో ఎవ్వరికీ సందేహాలు ఉండొద్దు.. సీఎం ఆదేశం
వైద్య, ఆరోగ్యశాఖపై తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్‌ 2పై సమావేశంలో చర్చించారు. ఆరోగ్యశ్రీని ఎలా వినియోగించుకోవాలనేదానిపై ముమ్మరంగా ప్రచారం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్యచికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సకాలంలో మందులు అందించాలన్నారు. ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి అవసరమైన వారికి క్యాంప్‌ల ద్వారా వైద్యసేవలు అందించాలని సీఎం సూచించారు. ప్రివెంటివ్‌ కేర్‌ అనేది చాలా ముఖ్యమని.. గ్రామంలో ప్రతి ఇల్లూ మ్యాపింగ్‌ జరగాలని, ప్రతి ఆరు నెలలకోసారి డేటా అప్డేట్‌ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీపై అధికారులను సీఎం ఆరా తీశారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా రూ. 25 లక్షల వరకూ వైద్యసేవలు, ఈ సేవలు ఎలా పొందాలన్న విషయంలో ఎవ్వరికీ సందేహాలు ఉండకూడదని వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం జగన్‌ మరోసారి స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ వినియోగంపై ముమ్మరంగా ప్రచారం చేయాలి, ఆరోగ్యశ్రీ సేవలను ఎలా వినియోగించుకోవాలన్న అంశంపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రగతిని అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. మెగా ఆరోగ్యశ్రీ అవేర్‌నెస్‌ క్యాంపెయిన్‌ స్టేటస్‌ను అధికారులు వివరించారు. నిర్ణీత టార్గెట్‌లోగా ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఆరోగ్యశ్రీ యాప్‌ డౌన్‌లోడ్‌ స్టేటస్‌ గురించి అధికారులు సీఎంకు వివరించారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా రూ. 25 లక్షల వరకూ వైద్యసేవలు అందించాలని.. ఈ సేవలు ఎలా పొందాలన్న విషయంలో ఎవ్వరికీ సందేహాలు ఉండకూడదన్నారు. ఈ సమాచారం తెలియని వారు ఉండకూడదన్నారు. నెట్‌ వర్క్‌ ఆస్పత్రులకు ఎలా వెళ్లాలన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలియాలన్నారు. అవేర్‌నెస్‌ అనేది పెంచాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి అనేది బాగా అవేర్‌నెస్‌ పెరగాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష అమలు, పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు చేయూతనిచ్చే కార్యక్రమం ఎలా జరుగుతుందన్న దానిపై నిరంతరం సమీక్ష చేయాలని సీఎం ఆదేశించారు. సీఎం జగన్‌ మాట్లాడుతూ.. “ప్రివెంటివ్‌ కేర్‌ అనేది ముఖ్యం, ప్రతి ఇంటిని జల్లెడ పట్టి క్యాంపుల ద్వారా అవసరమైన వారికి వైద్యసేవలు అందాలి. గ్రామాన్ని జల్లెడ పట్టాలి, ప్రతి ఆరునెలలకోసారి ఇది జరగాలి. విలేజ్‌ శాచురేషన్‌ మోడ్‌లో జరగాలి. ప్రతి ఇల్లు కవర్‌ అవ్వాలి ఇదే మన ప్రధాన ధ్యేయంగా ఉండాలి. ఏ గ్రామంలో ఎంతమందికి బీపీ, షుగర్‌ ఉన్నాయి, ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, వారికి అందే వైద్యసేవలు తదితర డేటా మ్యాపింగ్‌ అనేది జరగాలి. బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించి ప్రివెంటివ్‌ కేర్‌ లో భాగంగా చికిత్సలు అందించడం, మందులు ఇవ్వడం, మంచానికి పరిమితమైన వారికి కావాల్సిన మందులు ఇవన్నీ కూడా మ్యాప్‌ చేయాలి. ప్రతి 6 నెలలకోసారి మీ రికార్డులు అప్డేట్‌ చేయాలి. శాచురేషన్‌ కాన్సెప్ట్‌ ఉండాలి, గ్రామంలో 100 శాతం జరగాలి, ఎక్కడైనా ఆరోగ్యశ్రీ కార్డు మిస్‌ అయినా వారికి కూడా వైద్యం అందాలి. ప్రైమరీ ఇన్వెస్టిగేషన్‌లో ఐడెంటిఫై చేసిన వారికి రీకన్ఫర్మేషన్‌ టెస్ట్‌లు చేయండి. సెకండ్‌ క్యాంప్‌ తర్వాత ప్రతి కేసుకు సంబంధించి టెస్ట్‌లు పూర్తి కావాలి, టెస్ట్‌లు అవసరముంటే మళ్ళీ తప్పకుండా చేయాలి. క్యాంప్‌లపై సీరియస్‌ గా దృష్టిపెట్టాలి. ప్రతి సచివాలయాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని డ్రైవ్‌ చేయాలి. స్టెమీ కార్యక్రమం విలేజ్‌ క్లీనిక్‌ దగ్గర నుంచి మొదలవ్వాలి, అవసరమైన ఓరియెంటేషన్‌ ఇవ్వాలి, పబ్లిక్‌ అవేర్‌నెస్‌పై మరింత ఫోకస్‌ పెట్టాలి.” అని సీఎం అధికారులకు సూచించారు.

*ఐదు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతాం..
సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ప్రజా పాలన సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఐదు గ్యారంటీల అమలు కోసం సుమారు రెండున్నర గంటల పాటు ఉన్నతాధికారులతో చర్చించారు. ప్రజా పాలనలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి?. డాటా ఎంట్రీ ఎంత వరకు పూర్తయింది?. ఐదు గ్యారంటీలకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తుల్లో గ్యారెంటీ వారిగా వచ్చిన అభ్యర్థనలు ఎన్ని? అనే దానిపై చర్చించారు. ఈ సమావేశంలో సీనియర్ అధికారులు ఐదు గ్యారంటీల అమలు కోసం యాక్షన్ ప్లాన్ చేయడానికి వారి అభిప్రాయాలను వెల్లడించారు. ఐదు గ్యారెంటీలు లబ్ధి పొందడానికి అసలైన దరఖాస్తుదారుల ఎంపిక విధానం గురించి భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. డేటాలో డూప్లికేషన్ లేకుండా సీజీజీ, ఐటీ డిపార్ట్మెంట్ తో పాటు మిగతా అన్ని శాఖలు సమిష్టిగా డేటాను షేర్ చేసుకొని శుద్ధమైన డేటాను సిద్ధం చేయాలని మంత్రులు ఆదేశాలు ఇచ్చారు. ప్రజా పాలన దరఖాస్తు డేటా సేకరణలో కానీ, ఎంట్రీలో కానీ ఎవరు కూడా దరఖాస్తుదారుని ఓటీపీ అడగలేదు. ఓటీపీ అనే అంశం దరఖాస్తులోనే లేదు. ఎవరైనా సైబర్ నేరస్తులు ఫోన్ చేసి దరఖాస్తుదారులను ఓటీపీ అడిగితే ఇవ్వవద్దు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. సైబర్ నేరస్తులు అడిగే ఓటీపీకి ప్రజాపాలనలో సేకరించిన దరఖాస్తులకు సంబంధం లేదన్నారు. ఐదు గ్యారంటీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన స్పందనను జీర్ణించుకోలేక కొంతమంది దురుద్దేశపూర్వకంగా రాజకీయం చేయడం తగదని మంత్రులు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఐదు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పారు.

 

*బీజేపీతో పొత్తు గతంలో లేదు భవిష్యత్తులోనూ ఉండదు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు గతంలో లేదు.. భవిష్యత్ లో ఉండదని అన్నారు. కేసీఆర్ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో బీజేపీతో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఇకపై ఎమ్మెల్యే చుట్టూ పార్టీ తిరిగే విధానం ఉండదని.. ఇకపై పార్టీ చుట్టూ ఎమ్మెల్యే తిరిగే విధానం ఉంటుందన్నారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని తెలిపారు. బీఆర్ఎస్ కు బీజేపీ బీ టీం అయితే.. ఎమ్మెల్సీ కవిత పై కేసు పెట్టేదా? అని ప్రశ్నించారు. కవిత అరెస్టు కాకపోవడానికి కారణం సుప్రీంకోర్టు జోక్యం తప్పా.. బీజేపీతో సంబంధాలు కారణం కాదన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కుమ్మకై బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని చూశాయని కేటీఆర్ ఆరోపించారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ ను ఓడించాయని పేర్కొన్నారు. బీజేపీ మతాన్ని రాజకీయం కోసం వాడుకుంటోందని విమర్శించారు. తాము కూడా యాద్రాద్రి అక్షింతలను నల్లగొండ, భువనగిరిల్లో పంచితే గెలిచే వాళ్ళమేమో అని అన్నారు. బీజేపీ వాళ్ళు పొలిటికల్ హిందువులు అయితే.. కేసీఆర్ మతాన్ని మతంగా చూసే హిందువని కేటీఆర్ తెలిపారు.

 

*రెండేళ్లలో నల్గొండ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలి..
నల్గొండ జిల్లా రైతాంగానికి సాగునీళ్లు అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు సచివాలయంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన సమీక్షలో.. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను త్వరతగతిన పూర్తిచేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి ఇద్దరు మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఉదయసముద్రం, బ్రహ్మణవెల్లముల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కెనాల్స్ తో పాటు.. పెండింగ్ లో ఉన్న SLBC టన్నెల్ పనులను యుద్ధప్రతిపాదికన చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే SLBC కాలువలను పూర్తిచేసినప్పటికి, బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం మెయింటెనెన్స్ కూడా చేయలేదని ఆరోపించారు. SLBC కాలువలకు మరియు వరద కాలువకు గత 10 సంవత్సరాల నుంచి మొయింటెనెన్స్ లేకపోవడంతో చెట్లు, పూడిక పెరిగిందన్నారు. వీటికి మరమ్మత్తులు చేపట్టాలి, బెడ్ మరియు సైడ్స్ లైనింగ్ పనులను ఈ సంవత్సరంలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు క్రింద మొదటిదశలో 50 వేల ఎకరాలకు, రెండవ దశలో మరో 50 వేల ఎకరాలకు భూసేకరణ చేపట్టడం, కాలువలను తవ్వే పనులను పూర్తి చేసి లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీళ్లు అందించేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వంలో నల్గొండ సాగునీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మెజారిటీ పనులు పూర్తయిన SLBC ప్రాజెక్టును కూడా నిర్లక్ష్యం చేసి వదిలేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను స్వయంగా ఎన్నోసార్లు ఈ ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో మాట్లాడినా ఆనాటి ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నల్గొండ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో ఉందని.. జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సాగునీటిపారుదల శాఖ మంత్రిగా ఉండటం జిల్లా ప్రజల అదృష్టమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

 

*మతాంతర జంటపై దాడి, యువతిపై అత్యాచారం.. జాతీయ మహిళ కమిషన్ సీరియస్..
కర్ణాటకలో మతాంతర జంట హోటల్ గదిలో ఉండగా.. ముస్లిం యువకుల మూక వారిపై దాడి చేసింది. ఏడుగురు నిందితులు వారిని తిడుతూ, తీవ్రంగా కొట్టారు. ఈ ఘటన రాష్ట్రంలోని హవేరి ప్రాంతంతో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో బాధిత యువతిపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలి ఆరోపణలతో పోలీసులు అత్యాచారం కేసును నమోదు చేశారు. ఈ ఘటన జనవరి 8న జరిగింది. మైనారిటీ వర్గానికి చెందిన 26 ఏళ్ల వివాహిత, 40 ఏళ్ల కేఎస్ ఆర్టీసీ డ్రైవర్‌తో మధ్యాహ్నం 1 గంట సమయానికి హోటల్‌లోకి ప్రవేశించింది. గత మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరు హోటల్ గదిలో ఉండగా 7 మంది వ్యక్తులు గదిలోకి ప్రవేశించి దాడికి పాల్పడ్డారు. నిందితులు బాధితుడిని హోటల్ గదిలోనే ఉంచీ, యువతిని వారితో తీసుకెళ్లి శారీరక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) సీరియస్ అయింది. నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కర్ణాటక డీజీపీని ఆదేశించింది. ఎన్‌సిడబ్ల్యు చైర్‌పర్సన్ రేఖా శర్మ ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ మూడు రోజుల్లో స్పందన రాకపోతే..కర్ణాటకకు తమ బృందాన్ని పంపుతామని చెప్పారు. మహిళపై ఆరుగురు వ్యక్తులు అత్యాచారం చేశారని ఆమె ఆరోపించారు. హోటల్ గదిలో జరిగిన ఈ దాడిని నిందితులు చిత్రీకరించారని, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతున్నాయని వారు తెలిపారు. వీలైనంత త్వరగా అరెస్టు చేసి.. బాధితురాలికి ఉచితంగా వైద్యం అందించాలని ఎన్‌సిడబ్ల్యూ కోరింది.

 

*9-14 ఏళ్ల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సినేషన్.. ప్రారంభించనున్న కేంద్రం..
మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ని ఎదుర్కొనే లక్ష్యంతో కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. దేశంలో 9-14 ఏళ్ల బాలికలకు హ్యుమన్ పాపిల్లోమావైరస్ (HPV) టీకా ప్రచారాన్ని ప్రారంభించనుంది. సర్వైకల్ క్యాన్సర్‌ని అడ్డుకునే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఇమ్యూనైజేషన్ డ్రైవ్ ప్రారంభించనున్నారు. మూడు దశల్లో ఈ కార్యక్రమం ఉండనుంది. ప్రారంభ దశ కోసం 7 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని సిద్ధం చేశారు. కేంద్రం ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. గర్భాశయ క్యాన్సర్(సర్వైకల్ క్యాన్సర్) భారతదేశ మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో రెండో ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గర్భాశయ క్యాన్సర్‌ను ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అత్యంత సాధారణ రకం క్యాన్సర్‌గా పేర్కొంది. HPV వ్యాక్సిన్ ప్రస్తుత ధర రూ. 2000కి అందుబాటులో ఉంది. ఇది కేవలం గర్భాశయ క్యాన్సర్‌ని మాత్రమే కాకుండా మలద్వారాం, యోగి, ఒరోఫారింక్స్‌ని ప్రభావితం చేసే ఇతర ప్రాణాంతకాలను కూడా ఎదుర్కోవడానికి ఈ వ్యాక్సిన్ సాయపడుతుంది. జననేంద్రియ మొటిమలకు కారణమయ్యే క్రిముల నుంచి రక్షణ అందిస్తుంది. హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) కలిగించే ఆరోగ్య ప్రమాదాలను అడ్డుకుంటుంది. ప్రపంచంలోని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులలో దాదాపు ఐదవ వంతుగా ఉన్న భారతదేశంలోనే ఉన్నాయి. ఈ క్యాన్సర్ ఇటీవల కాలంలో పెరుగుతోంది. క్యాన్సర్ కేసుల సంఖ్య 2022లో 14.6 లక్షల నుండి 2025 నాటికి 15.7 లక్షలకు పెరుగుతుందని అంచనా. ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో గర్భాశక క్యాన్సర్‌ని చేర్చాలనే ఉద్దేశంతో కేంద్రం అందరికి వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది. టీకాను ఉచితంగా అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ వైరస్‌కి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు వ్యాక్సిన్ ఇవ్వాలని అనుకుంటోంది.

 

*మాల్దీవుల నుంచి ఇండియాకు వచ్చిన మహిళకి JN.1 వేరియంట్ పాజిటివ్..
దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గతంలో రెండంకెల లోపే కేసులు నమోదైతే, ఇప్పుడు వందల్లో కేసులు వస్తున్నాయి. దీంతో పాటు ప్రమాదకరమైన వేరియంట్ JN.1 కలవరపరుస్తోంది. కేసుల సంఖ్య పెరిగేందుకు ఇది కూడా కారణమవుతోంది. ఇదిలా ఉంటే మాల్దీవ్స్ నుంచి ఇండియా వచ్చిన 33 ఏళ్ల మహిళలో జెఎన్.1 సబ్-వేరియంట్ కరోనావైరస్ ఉన్నట్లు తేలింది. మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో పరీక్షించగా ఈ వైరస్ ఉన్నట్లు కొనుగొన్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు శుక్రవార అధికాకులు తెలిపారు. డిసెంబరు 13న ఆ మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. భోపాల్‌కు చెందిన ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో ఆమె శాంపిల్ హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ (డబ్ల్యుజిఎస్) కోసం పంపించారు, తాజాగా గురువారం వచ్చిన నివేదికలో JN.1 వేరియంట్ ఆమెకు సోకినట్లు నిర్ధారించబడింది. ప్రస్తుతం మాల్దీవులు, ఇండియా మధ్య దౌత్య వివాదం నడుస్తున్న సమయంలో అక్కడి నుంచి వచ్చిన మహిళలో ఈ వేరియంట్ ఉండటం చర్చనీయాంశం అయింది. ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ వెళ్లడంపై మాల్దీవ్స్ మంత్రులు అవమానకరంగా మాట్లాడటం వివాదాస్పమైంది. భారతీయలు ‘బాయ్‌కాట్ మాల్దీవ్స్’ అంటూ ఆన్‌లైన్‌లో ట్రెండ్ చేస్తున్నారు.

Exit mobile version