NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

టీడీపీ, బీజేపీ పొత్తు..! సీఎం రమేష్‌ సంచలన వ్యాఖ్యలు..
రాజకీయాల్లో శాశ్వత శతృత్వం, మిత్రత్వం ఉండదు అన్నారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన… ఆంధ్రప్రదేశ్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా రాష్ట్రానికి మేలు జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.. ఇక, ఏపీలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గద్దె దించేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని తెలిపారు బీజేపీ ఎంపీ.. ప్రజలకు మేలు చేసే పలు చట్టాలు చేసేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ కూడా మద్దుతిచ్చిందని గుర్తుచేశారు. అయితే, రాష్ట్రాల్లో అధికారంలో ఉండే పార్టీలు చట్టాలకు మద్దతు ఇవ్వడం వేరు.. రాజకీయాలు వేరన్నారు. ఇక, దేశమంతటా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ హవా.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉందన్నారు ఎంపీ సీఎం రమేష్‌.. బీజేపీ దేశంలో బలంగా ఉంది.. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక మంచి పనులు చేసిందన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే పొత్తులపై స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో జరిగిన నా సమావేశంలో కూడా ఏపీ రాజకీయాలు చర్చకు వచ్చాయని వెల్లడించారు. మరోవైపు పార్టీ అధినాయకత్వం ఆదేశిస్తే లోకసభ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అని ప్రకటించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్‌.

చంద్రబాబు పొత్తుల వ్యవహారం ఊహించిందే.. ఎంతమంది కలిసినా జగన్‌ సింగిల్‌గానే..!
ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన సాగుతుంటే.. మరోవైపు ఎన్నికల పొత్తులపై స్పందించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఆ పొత్తుల వ్యవహారం ఊహించిందే అంటున్నారు. వాపక్షాలు ప్రత్యక్షంగా.. కాంగ్రెస్‌ పరోక్షంగా టీడీపీకి మద్దతు ఇస్తున్నాయన్న ఆయన.. ఇక, బీజేపీ నేతలంతా టీడీపీ నుంచి వెళ్లినవారే అన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ఎంత మందితో కలిసి వచ్చినా.. మా నాయకుడు సింగిల్‌గానే వస్తాడని చెబుతున్నారు మంత్రి పెద్దిరెడ్డి. నంతపురంలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. అనంతపురంలో ఈ నెల 11న జరగాల్సిన సిద్ధం బహిరంగ సభ 18కి వాయిదా వేసినట్టు తెలిపారు.. ఈ నెల18న సిద్ధం బహిరంగసభ ఉంటుందన్నారు.. ఇక, తాజా రాజకీయాలపై స్పందిస్తూ.. ముందు నుండి ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసే ఉన్నాయని విమర్శించారు. కాంగ్రెస్ కూడా ఇండైరెక్ట్ సపోర్ట్ టీడీపీకే ఇస్తుందన్నారు. బీజేపీలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారన్న ఆయన.. ఎంతమంది కలిసినా మాకు ఆశ్చర్యం లేదు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం సింగిల్ గా వస్తారని స్పష్టం చేశారు. ఇక, భద్రత లేదని షర్మిలా మాట్లాడారు.. కాంగ్రెస్ పార్టీని వీడినప్పుడు మాకు ఉన్న రక్షణ తొలగించారని గుర్తుచేశారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మా మద్దతుతో గెలిచి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూశారన్నారు. మా నాయకుడిని 16 నెలలు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

ఏ పథకం ఆగదు.. మేం మరింత ఇస్తామే తప్ప.. ఏదీ ఆపం..!
టీడీపీ-జనసేన ప్రభుత్వంలో ఏ పథకం ఆగదు.. మరింత సంక్షేం ఇచ్చేలా జనసేన-టీడీపీ వ్యవహరిస్తాయి అని స్పష్టం చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ప్రమాదవశాత్తు మృతిచెందిన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా చెక్కులను అందించిన పవన్‌ కల్యాణ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనసేన – టీడీపీ వస్తే పథకాలు ఆపేస్తారంటూ వైఎస్‌ జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న ఆయన.. మేం మరింత ఇస్తామే తప్ప.. ఏదీ ఆపం అని క్లారిటీ ఇచ్చారు.. ఇక, డ్వాక్రా రుణాల మాఫీపై అధ్యయనం చేస్తున్నాం.. డ్వాక్రా రుణాల మాఫీపై టీడీపీతో చర్చిస్తున్నాం అని వెల్లడించారు. పెద్ద పెద్ద మోసం చేసే కంపెనీలకు, బ్యాంకులు రుణాలిచ్చి వదిలేస్తున్నాయి. డ్వాక్రా మహిళలకు ఏ విధంగా రుణ మాఫీ చేయాలోననే అంశంపై ఆలోచన చేస్తున్నాం అన్నారు. ఇక, జనసేన-టీడీపీ ప్రభుత్వం మరింత సంక్షేమం అందిస్తుంది తప్పితే.. ఏ పథకం ఆగదు అని స్పష్టం చేశారు పవన్‌.. సొంత డబ్బులను పేదల కోసం ఖర్చు పెడుతున్నాను.. సంక్షేమ పథకాలు ఎలా ఆపుతాం..? అని నిలదీశారు. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు చెక్కులిచ్చే సందర్భంలో బాధేస్తోందన్న ఆయన.. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు ఇచ్చే రూ. 5 లక్షలు పెద్ద మొత్తం కాదు.. కానీ, వారికి కాస్తో కూస్తో చేయూతనిస్తోందన్నారు. కేవలం బీమా చెక్కులను అందించడంతో ఆగకుండా.. మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడానికి మరింత పని చేసే ఆలోచన ఉందన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. చనిపోయిన కార్యకర్తల కుటుంబాన్ని ఆదుకోవడానికి.. ఆ కుటుంబాల్లోని పిల్లలను చదివించాలనే ఆలోచన ఉందన్నారు. కొందరికి అధికారం ఉన్నా.. మనస్సు ఉండదు.. కానీ, జనసేనకు మానవతా ధృక్పధం ఉంది.. మావనతా ధృక్పథానికి అధికారం తోడైతే ఇంకా బాగుంటుందన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

కాంగ్రెస్ వాస్తవాలు బయట పెట్టారు ప్రధాని
పార్లమెంట్‌లో మోడీ ప్రసంగంలో కాంగ్రెస్ పై చేసిన వాఖ్యలు చర్చ జరుగుతోందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెహ్రూ, ఉద్యోగాలు, రిజర్వేషన్లపై చేసిన మాటలు అని, ప్రధాని ఉభయసభల్లో బయట పెట్టారన్నారు. మండల కమిషన్ ను రాజీవ్ గాంధీ అడ్డుకున్నారని, అంబేడ్కర్ ను కాంగ్రెస్ ఓడించింది.. ఇబ్బంది పెట్టిందన్నారు లక్ష్మణ్‌. కాంగ్రెస్ వాస్తవాలు బయట పెట్టారు ప్రధాని అని, పది సంవత్సరాల యూపీఏ పాలన, పదేళ్ల ఎన్డీయే పాలన పోల్చి చూడాలన్నారు. ఎన్నో సంస్థలు మోడీ నేతృత్వంలో అభివృద్ధి చెందాయని, పదేళ్ల యూపీయే కాలంలో అవినీతే, కుంభకోణాలు ఇపుడు వెలుగులోకి వచ్చాయన్నారు లక్ష్మణ్‌. కుటుంబం కోసమే కాంగ్రెస్ పని చేస్తోందని, బీసీల పట్ల కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందన్నారు. ఓట్ల కోసం విభజన రాజకీయాలు కాంగ్రెస్ చేస్తోందని, ప్రజలు కాంగ్రెస్ కు బుద్ది చెప్తారన్నారు. మూడో సారి మోడీ పిఎం అవుతారని, బీఆర్‌ఎస్‌ కథ ముగిసిందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఇక తెలంగాణ లో భవిష్యత్ బీజేపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్ ఒక్కటిగా గత ఎన్నికల్లో పని చేశాయని, వాళ్ళు ఏ ప్రచారం చేసినా ప్రజలు నమ్మరన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అభివృద్ధి, అబద్ధాలకు మధ్య పోరు జరుగుతోందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి దోహదపడే బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్‌కు రాజకీయ భవిష్యత్ లేదని ఆయన పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందని, ఇది కాంగ్రెస్ గెలుపు కాదని చురకలంటించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేయకుండా దాట వేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

పాలకుర్తిలో నా ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి
జనగామ మండలంలోని శామీర్ పేట శివారులోని ఓ ఫంక్షన్ హల్ లో నిర్వహించిన జనగామ నియోజకవర్గ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తిలో తన ఓటమికి గల కారణాలపై కామెంట్ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. పాలకుర్తిలో నా ఓటమికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. ఏడు సార్లు నేనే ఉన్న కాబట్టి ఈసారి వేరే వాళ్లకు అవకాశం ఇవ్వలనుకున్నారే తప్ప, నా పై వ్యతిరేకతతో కాదని ఆయన అన్నారు. నన్ను పాలకుర్తి ప్రజలు వద్దనుకోలేదని, నియోజకవర్గం లో నేను గెలిస్తే జైల్లో పెడతానని,చెప్పుడు మాటలతో వదంతులు సృష్టించడంతో ఓటమి చెందనన్నారు. ఎన్టీ రామారావునే అప్పుడు ఓడించారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను నమ్మి ప్రజలు మోస పోయారన్నారు.

రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు
తెలంగాణ‌లో రేపు స్కూళ్లు, కాలేజీల‌కు సెల‌వు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. రేపు తెలంగాణలో స్కూళ్లు, కాలేజీలతో పాటు ఉద్యోగులకు కూడా సెలవులను ప్రకటించింది తెలంగాణ సర్కార్‌. ఫిబ్రవరి 8న తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. రేపు షబ్-ఎ-మెరాజ్ పండుగను పురస్కరించుకొని సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఇది ముస్లింలు జరుపుకునే పండుగ. ఈ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే.. షబ్-ఎ-మెరాజ్ ముస్లింలు పవిత్రమైన రోజుగా భావించి… ఆ రోజు మసీదులను దీపాలతో అందంగా అలంకరిస్తారు. రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు. ఈ పండగ రోజు మసీదుల్లో ఇస్రా, మేరాజ్‌ల కథను చెబుతుంటారు మత పెద్దలు. ముస్లింలు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చే ఈ పండగ రోజును ప్రభుత్వం సెలవుగా ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆ మత పెద్దలు. ఇక ఫిబ్రవరి 8న సాధారణ సెలవు దినంగా ప్రకటన విడుద‌ల కావడంతో ఆ రోజున ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూత పడనున్నాయి. ఇకపోతే ఫిబ్రవరి 8వ తేదీ తర్వాత ఈ నెలలో సాధారణ సెలవులు లేవు. వచ్చే నెల మార్చి నెలలోనే సాధారణ సెలవులు ఉండనున్నాయి.

“కృష్ణుడు 5 గ్రామాలు అడిగాడు, మేం 3 అడుగుతున్నాం”.. అయోధ్య, మధుర, కాశీలపై యోగి..
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బుధవారం అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కాశీ, మధుర, అయోధ్య గురించి మాట్లాడారు. రామ మందిర ప్రాణప్రతిష్ట జరిగిన కొన్ని రోజులు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతనను సంతరించుకున్నాయి. అయోధ్య నగరాన్ని గత ప్రభుత్వాలు నిషేధాలు, కర్ఫ్యూల పరిధిలో ఉంచాయని, శతాబ్ధాలుగా అయోధ్యను నీచ ఉద్దేశాలతో తిట్టారని, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం బహుశా మరెక్కడ చూడలేదని, అయోధ్యకు అన్యాయం జరిగిందని యోగి అన్నారు. ‘‘ నేను అన్యాయం గురించి మాట్లాడేటప్పుడు, మేము 5,000 ఏళ్ల నాటి విషయం గుర్తుకు తెచ్చుకుంటాము. ఆ సమయంలో పాండవులకు కూడా అన్యాయం జరిగింది. అయోధ్య, కాశీ, మధురలోనూ అదే జరిగింది’’ అని యోగి అన్నారు. ‘‘ఆ సమయంలో కృష్ణుడు కౌరవుల వద్దకు వెళ్లి మాకు 5 గ్రామాలు ఇవ్వండి, మీ వద్ద ఉన్న భూమి అంతా మీరే ఉంచుకోండని, సగం అయినా న్యాయం చేయాలని కృష్ణుడు అడిగాడు, కానీ ఇక్కడ సమాజం వందల ఏళ్లుగా మూడు, కేవలం మూడు ప్రాంతాల గురించి మాట్లాడుతున్నారని, అయోధ్య, మధుర, వారణాసి గురించి ప్రస్తావించారు. ఈ మూడు స్థలాలు దేవుళ్ల అవతార ప్రదేశాలు’’ అని ఆయన అన్నారు.

డీకే శివకుమార్‌‌పై కేసు నమోదుకు కోర్టు ఆదేశం
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులకు ప్రత్యేక కోర్టు ఆదేశించింది. బీజేపీ నేతల నిరసన చిత్రాన్ని మార్ఫింగ్ చేసినందుకు డీకే శివకుమార్‌తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర ఐటీసెల్ హెడ్ బీఆర్ నాయుడుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ప్రత్యేక కోర్టు ఆదేశించింది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో ఆందోళనలో పాల్గొన్న కరసేవక్ శ్రీకాంత్ పూజారిని పోలీసులు ఇటీవల అరెస్టు చేసినందుకు వ్యతిరేకంగా కమలనాథులు నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా ఆందోళనకారులు ‘నేను కూడా కరసేవక్‌నే.. నన్ను కూడా అరెస్టు చేయండి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే ఈ ప్లకార్డులను కాంగ్రెస్ మరో రకంగా మార్చి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. మోసాలు, ఇతర అక్రమాలు మేమే చేశాం అనే అర్థం వచ్చేలా మార్ఫింగ్‌ చేసి కాంగ్రెస్ ఐటీ సెల్ పోస్ట్ చేసింది. ఇదే పోస్టులను డీకే.శివకుమార్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండాల్సింది స్వీటీ..
ఒక సినిమా కోసం నటీనటులు ఎంత కష్టపడతారో చాలామందికి తెలియదు. కొన్నిసార్లు ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. గుండు చేయించుకోవడం, బరువు తగ్గడం, బరువు పెరగడం.. ఇలా చేసినప్పుడు ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ ను కూడా ఫేస్ చేస్తారు. వీటివలన వారి జీవితాలే మారిపోవచ్చు. అలాంటి ఒక నిర్ణయం వలన అనుష్క శెట్టి జీవితమే మారిపోయింది. సూపర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ అనుష్క శెట్టి. యోగా టీచర్ అయిన అనుష్క.. తన ఫిజిక్ తో కుర్రకారును తన కొంగుకు కట్టేసుకుంది. బిల్లాలో బికినీ వేసినా.. అరుంధతితో భయపెట్టినా కూడా అమ్మడి అందానికి ఫిదా అయిపోయారు. ఇక సినిమా కోసం ఏదైనా చేసే అనుష్క.. సైజ్ జీరో కోసం బరువు పెరగుతాను అని చెప్పి కఠినమైన నిర్ణయం తీసుకుంది. అమ్మాయిలకు అందం మనసు మాత్రమే అని, బరువు కాదని ఒక ప్రయోగాత్మకమైన సినిమాగా సైజ్ జీరో తెరకెక్కింది. ఇక ఈ సినిమా కోసం స్వీటీ బరువు పెరగాలి. ఇకపొతే ముందు డైరెక్టర్.. సీజీలో స్వీటీని బరువు పెరిగినట్లు చూపిద్దామని అనుకున్నారట. కానీ, నేచురల్ గా ఉండదని స్వీటీనే బరువు పెరుగుతానని చెప్పిందట. అందుకోసం ఆమె బాగా తిని బరువు పెరిగింది. ఇక సినిమాలో కనిపించినట్లు స్వీటీ అంత లావుగా మారిపోయింది. ఇక సినిమా రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. దీంతో స్వీటీ పడిన కష్టమంతా వృధా అయ్యింది. అది పక్కన పెడితే అప్పటినుంచి స్వీటీ ఆరోగ్యంలో మార్పులు వచ్చాయి. ఎంత తగ్గాలి అని ప్రయత్నించినా కూడా అనుష్క తగ్గలేకపోయింది. ఇప్పటికీ ఆమె బొద్దుగానే ఉంది. దీనివలన అనుష్క ఎన్నో ట్రోల్స్ కు గురవుతుంది. తాజాగా అనుష్క వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. వైట్ అండ్ వైట్ డ్రెస్, ముఖానికి మాస్క్ పెట్టుకొని ఆమె కారులో నుంచి దిగుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. స్వీటీని అలా చూసిన అభిమానులు.. సైజ్ జీరో కోసం బరువు పెరగకుండా ఉండాల్సింది స్వీటీ.. అది చేసి తప్పు చేసావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం అనుష్క.. కన్నడలో ఒక మూవీ చేస్తోంది.

నల్లమల అడవులు-నల్ల చీర.. డైరెక్టెడ్ బై రాధిక.. టిల్లు గాడు గతాన్ని మర్చిపోలేదే!
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ చిత్రం కల్ట్ స్టేటస్ సాధించింది. ఆ సినిమాలో సిద్ధు పలికిన “అట్లుంటది మనతోని”, “నువ్వు అడుగుతున్నావా రాధిక” వంటి మాటలు.. సోషల్ మీడియాలో మీమ్స్‌గా మారడమే కాకుండా, నిజ జీవితంలో యువత రోజువారీ సంభాషణలుగానూ మారిపోయాయి. అంతలా ‘డీజే టిల్లు’ సినిమా, అందులోని సిద్ధు పాత్ర ప్రేక్షకులపై ప్రభావం చూపాయి. ఐకానిక్ క్యారెక్టర్ ‘టిల్లు’తో ప్రేక్షకులను మరోసారి అలరించాలని నిర్ణయించుకున్న సిద్ధు జొన్నలగడ్డ.. ‘డీజే టిల్లు’ చిత్రానికి కొనసాగింపుగా ‘టిల్లు స్క్వేర్’ చేస్తున్నారు. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి.. టిల్లుని, అతని చేష్టలను తిరిగి వెండితెరపై చూడటం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే “టికెట్టే కొనకుండా”, “రాధిక” పాటలను విడుదల చేయగా.. రెండు పాటలూ విశేషంగా ఆకట్టుకొని, చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇక ఇప్పుడు ఫిబ్రవరి 7న సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా, చిత్ర బృందం ఈ సినిమా నుండి స్పెషల్ బర్త్‌డే గ్లింప్స్‌ను విడుదల చేసింది. రాత్రి సమయంలో కారు నడుపుతూ తన పక్కనే ఉన్న లిల్లీ(అనుపమ పరమేశ్వరన్) టిల్లుకి ముద్దు పెట్టడం గ్లింప్స్‌ లో చూడవచ్చు. అతని గత పుట్టినరోజు గురించి లిల్లీ అడుగగా.. రాధికతో జరిగినప్పటి సంఘటనలను టిల్లు గుర్తు చేసుకోవడం ఆసక్తికరంగా ఉంది. రాధికతో జరిగిన విషయాల గురించి టిల్లు పూర్తిగా చెప్పకుండా తనదైన హాస్య పద్ధతిలో సింపుల్ గా చెప్పడం బాగుంది. ఇక ఆ విషయం అతనికి బాధ కలిగిస్తుంది కాబట్టి.. దాని గురించి ఇక ప్రశ్నలు అడగవద్దని లిల్లీని కోరతాడు. మొత్తానికి వీరి మధ్య సంభాషణ ఎంతో వినోదభరితంగా ఉంది. టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో మరోసారి డైలాగులతో మ్యాజిక్ చేశాడు. ఈ గ్లింప్స్‌ లో అనుపమ పరమేశ్వరన్ గతంలో కంటే చాలా అందంగా, మరింత గ్లామరస్‌గా కనిపిస్తుందని చెప్పక తప్పదు. ఇక ఈ సినిమా ట్రైలర్ ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ప్రముఖ స్వరకర్త ఎస్ థమన్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.