NTV Telugu Site icon

Top Headlines @ 9 PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

హైదరాబాద్‌ లాంటి నగరం మనకు లేదు.. అందుకే పదేపదే విశాఖ పేరు..!
రాష్ట్ర విభజనలో హైదరాబాద్‌ను కోల్పోయి.. ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తాను పదే పదే విశాఖపట్నం ప్రస్థావన ఎందుకు తీసుకొస్తానంటే.. ప్రతి రాష్ట్రానికి ఓ ఎకనామిక్‌ పవర్‌ హౌస్‌ ఉండాలన్నారు.. 60 ఏళ్లుగా కష్టపడి హైదరాబాద్‌ లాంటి నగరాన్ని నిర్మించుకున్నాం.. కానీ, దానిని కోల్పోయాం అన్నారు.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ తలసరి ఆదాయం తగ్గిపోయిందన్నారు. ప్రతిరాష్ట్రానికి ఓ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ఉండాలి.. అందుకే నేను విశాఖ, విశాఖ అంటాను అన్నారు. రాష్ట్రం ప్రతి ఏడాది రూ.13వేల కోట్ల ఆదాయం నష్టపోతుంది అంటూ అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఇక, గత ప్రభుత్వ విధానాల వల్ల కూడా బాగా నష్టం జరిగింది.. ఆర్థిక వ్యవస్థ కుదేలు అయ్యింది.. గత ప్రభుత్వ విధానాల వల్ల విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి రంగాలు కుదేలయ్యాయి అన్నారు సీఎం జగన్‌.. ప్రతీ రాష్ట్రానికి ఒక ఎకనామిక్‌ పవర్‌ హౌజ్‌ ఉండాలి.. అలాంటి పవర్‌హౌజ్‌ లేకపోతే రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవు అన్నారు. ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్‌ను కోల్పోయాం.. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతోందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం తగ్గిపోయింది.. అందుకే వైజాగ్‌ గురించి పదే పదే చెబుతున్నాను అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఎదగడానికి పెద్ద పెద్ద నగరాలు అవసరం.. ఓ హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ప్రతీ రాష్ట్రంలో ఉండాలి అన్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. ఇక అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

చంద్రబాబు చేసిన అప్పులు..! అసెంబ్లీలో బయటపెట్టిన సీఎం జగన్‌
చంద్రబాబు ఏనాడూ మంచి చేసింది లేదు.. కానీ, రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి లాగి వెళ్లారని విమర్శించారు సీఎం వైఎస్‌ జగన్.. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన పథకాలు, ప్రజలకు చేకూరిన లబ్ధిని వివరించారు.. ఇదే సమయంలో.. కేంద్రం కంటే రెట్టింపు స్థాయిలో చంద్రబాబు అప్పులు తెచ్చాడు అని ఫైర్‌ అయ్యారు. కానీ, ఎక్కువ అప్పులు చేశామని మన మీద అబద్ధాల ప్రచారం చేస్తున్నారని.. మన హయాంలో కేంద్ర ప్రభుత్వం 6.5 శాతం అప్పులు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు 5.2 శాతం మాత్రమే చేసింది.. ఏ రకంగా చూసినా గత ప్రభుత్వానికి, మనకూ ఎంత వ్యత్యాసముందో చెప్పేందుకు ఈ సమాచారం సరిపోతుందన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన నాటికి రూ.లక్షా 53 వేల కోట్ల అప్పు ఉంటే.. చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.4.12 లక్షల కోట్లకు చేరిందన్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. 2019 మే నెల నాటికి 4,12,288 కోట్ల రూపాయల అప్పులు ఏపీకి ఉన్నాయన్న ఆయన.. రూ.4.12 లక్షల కోట్ల అప్పుతో ప్రయాణం ప్రారంభించాం. ఇప్పుడది ఏడు లక్షల కోట్ల పై చిలుకుగా ఉందన్నారు.. మన హయాంలో ఆర్థిక సంఘం సిఫారసుల కంటే రూ. 366 కోట్లు తక్కువగా అప్పులు తీసుకున్నామని గుర్తుచేశారు.. గ్యారెంటీలతో కలిపి వివిధ సంస్థలు చేసిన అప్పులు.. గ్యారెంటీల్లేని అప్పులను కూడా పరిగణలోకి తీసుకుంటే విభజన నాటికి.. రాష్ట్ర ప్రభుత్వం అప్పు 132000 కోట్లుగా ఉందన్నారు. గ్యారెంటీల్లేని ప్రభుత్వ అప్పులు కూడా కలుపుకుంటే మొత్తం అప్పు రూ. 1,53,000 కోట్లు అన్నారు.. మొత్తంగా చంద్రబాబు హయాంలో అప్పులు పెరగింది 21.87 ఏడాదికైతే… మన హయాంలో ఇది కోవిడ్‌ వల్ల ఆదాయాలు తగ్గినప్పటికీ.. ఖర్చులు పెరిగినప్పటికీ.. బటన్‌లు నొక్కినప్పటికీ కూడా.. చంద్రబాబు హయాయంలో ఉన్న 21. 87 శాతం అప్పుల పెరుగుదల రేటు ఉంటే మన హయాంలో మాత్రం అది 12.13 శాతం మాత్రమే ఉందన్నారు సీఎం వైఎస్‌ జగన్‌.. అంటే.. అప్పుల పెరుగుదల 12 శాతానికి పరిమితం చేశామని వెల్లడించారు.. కానీ, మనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అసెంబ్లీ వేదికగా విపక్షాలపై విరుచుకుపడ్డారు.. సీఎం జగన్‌ అసెంబ్లీలో ఏం మాట్లాడారో కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

డీఎస్సీపై ఓ నిర్ణయానికి వచ్చిన ఏపీ ప్రభుత్వం..! రేపే నోటిఫికేషన్..!
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నిర్వహణపై ఓ నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం.. సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన గత వారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో డీఎస్సీకి ఆమోద ముద్ర పడింది.. 6,100 పోస్టులను భర్తీ చేయడానికి మెగా డీఎస్సీ-2024 నోటిషికేషన్ విడుదలకు కేబినెట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇక, ఇప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.. ఈ రోజు ఉదయం విద్యాశాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌పై విధివిధానాలను ఖరారు చేశారు. రేపు 6,100 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.. ఇవాళ ఉదయం విద్యా శాఖ అధికారులతో సమావేశం అయిన మంత్రి బొత్స సత్యనారాయణ.. 6,100 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ప్రకటన, విధివిధానాల ఖరారుపై చర్చించారు. ఈ సమావేశంలో పోస్టులు ఖాళీలు, విధివిధానాలు, తేదీలు, ఎప్పుడు నోటిఫికేషన్ విడుదల చేయాలని, ఎప్పటిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే విషయాలపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక, రేపు డీఎస్సీ -2024 నోటిఫికేషన్ విడుదల చేస్తారని చెబుతున్నారు. కాగా, డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎంతో కాలంగా నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.. త్వరలోనే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.. 6,100 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీతో పాటు టెట్ కూడా నిర్వహించడానికి ఏపీ కేబినెట్‌ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.

రసవత్తరంగా నూజివీడు రాజకీయం.. ఆ ఇద్దరి మధ్య కోల్డ్‌ వార్..!
నూజివీడు టీడీపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇక్కడ ఇంఛార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, అనధికారిక ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్న వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే పార్థసారధి మధ్య కోల్డ్ వార్ ముదురుతోంది. నూజివీడు నియోజకవర్గంగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనమని క్యాడర్ వాపోతున్నారు.. పెనమలూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారథి.. వచ్చే ఎన్నికల్లో నూజివీడు నుంచి టీడీపీ తరపున బరిలోకి దిగటానికి అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారట. దీంతో, నూజివీడులో తన వర్గాన్ని పూర్తిస్థాయిలో మోహరించిన సారథి.. పార్టీలోకి అధికారికంగా చేరకపోయినా ఇంఛార్జ్‌గా తాను చేయాల్సిన పనులను పెనమలూరు నుంచే చక్కబెట్టేస్తున్నారట. అయితే, ఈ పరిణామాలన్నీ కూడా నూజివీడు టికెట్ ఆశిస్తున్న ప్రస్తుత ఇంఛార్జ్‌ ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు కాకపుట్టిస్తున్నాయని సమాచారం. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇస్తామని చంద్రబాబు చెప్పారని ఇప్పటికీ ముద్దరబోయిన తన వర్గానికి చెబుతున్నారట. మరోవైపు సారథి స్పీడు మాత్రం ఆయన్ని కలవరపెడుతున్నాయనేది లోకల్ టాక్. పెనమలూరు సీటును టీడీపీ నుంచి కూడా పార్ధసారథి మొదట్లో ఆశించారు. అయితే అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. దీంతో చంద్రబాబు ఆదేశాల మేరకు సారథి నూజివీడు నుంచి పోటీ చేయటానికి సిధ్ధపడ్డారట. తనకు పెనమలూరు ఇవ్వటంలేదు కాబట్టి తన సన్నిహితుడుగా ఉన్న రాజీనామా చేసిన కమ్మ కార్పొరేషన్ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్ కు పెనమలూరు కోటాలో టికెట్ ఇవ్వాలని పార్ధసారథి కోరినట్టు సమాచారం.

కూతురు బ్రెయిన్‌డెడ్.. దుఃఖాన్ని దిగమింగుతూ పలువురికి ప్రాణదానం
ఓ వైపు అల్లుడిని కోల్పోయిన బాధ వారిని వెంటాడుతూనే ఉంది.. ఇప్పుడు కూతురు కూడా కోలుకోలేని స్థితికి వెళ్లిపోయింది.. అయితే, ఆ దుఃఖాన్ని దిగమింగుతూ పలువురు జీవితాల్లో వెలుగు నింపారు.. ఇంకా కొందరికి ప్రాణదానం చేశారు.. ఆ దంపతులు.. కర్నూలుకు చెందిన పావని లత అనే మహిళ బ్రెయిన్ డెడ్ కావడంతో కిడ్నీలు, కాలేయం, మూత్రపిండాలు, కళ్లు.. ఇలా అవయవాలను దానం చేశారు. పావని లత భర్త కొన్ని నెలల క్రితమే చనిపోవడంతో.. కుటుంబ పోషణకు ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లింది.. అప్పటికే మూర్ఛ వ్యాధి ఉన్న పావని లతకు మరోసారి ఫిట్స్ రావడంతో మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయి కోమాలోకి వెళ్లిపోయింది.. కుటుంబ సభ్యులకు సమాచారం రావడంతో.. హైదరాబాద్‌కు వెళ్లి పావని లతను కర్నూలు తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. కానీ, బ్రెయిన్‌ డెడ్‌ అయిపోయిన పావనిలత.. ఎప్పటి కోలుకుంటుంది.. కోమా నుంచి ఎప్పుడు బయటపడుతుందో తెలియని పరిస్థితి.. అయితే, బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవదానం చేయాలని రెడ్ క్రాస్ చైర్మన్ డా.గోవిందరెడ్డి.. పావనిలత పేరెంట్స్‌ని ఒప్పించారు. ఇక, పావని లత భర్త కూడా కొన్ని నెలల క్రితమే కిడ్నీ ఫెయిల్ కావడం, ట్రాన్సప్లాంటేషన్ చేయిద్దమన్నా కిడ్నీ దొరక్కపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. అలాంటి బాధ ఇంకొకరికి రాకూడదని కుటుంబసభ్యులు పావని లత అవయవాలుదానం చేశారు.

బాపట్లలో కలకలం.. రౌడీషీటర్‌ కొట్టి చంపిన స్థానికులు..!
బాపట్లలో రౌడీ షీటర్ హత్య కలకలం రేపింది… గంజాయి సేవించి స్థానికులపై రౌడీషీటర్లు సుమంత్, రాహుల్ దాడులకు తెగబడ్డారు.. అయితే, రౌడీషీటర్లపై స్థానికులు తిరగబడ్డారు.. మొదట వినోద్ అనే కారు డ్రైవర్ పై దాడి చేశాడు రౌడీ షీటర్ సుమంత్.. స్థానికులపై కూడా దాడికి ప్రయత్నించాడు.. ఈ నేపథ్యంలో స్థానికులు తిరగబడ్డారు.. రౌడీ షీటర్లు సుమంత్, రాహుల్‌కు దాడి చేశారు. స్థానికుల దాడిలో తీవ్రంగా గాయపడిన సుమంత్ అనే రౌడీషీటర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.. ఇక, స్థానికుల దాడి నుండి రాహుల్ అనే రౌడీ షీటర్ తప్పించుకొని పరారయ్యాడు. కాగా, రాహుల్, సుమంత్ ఇద్దరూ గంజాయి సేవించి స్థానికులపై తరుచూ దాడులు చేసేవారిని.. ఈ రోజు కూడా అలాగే దాడి చేస్తుంటే స్థానికులంతా ఒకేసారి తిరగబడ్డారని సమాచారం.. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి పరిశీలించారు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంగారెడ్డి జిల్లాలో మరోసారి భూకంపం..
సంగారెడ్డి జిల్లాలో మరోసారి భూకంపం వచ్చింది. 10 రోజుల వ్యవధిలో భూకంపం రెండు సార్లు వచ్చింది. న్యాల్కల్ మండలంలో గత నెల 27న భూకంపం రాగా.. కాసేపటి క్రితం పలు చోట్ల భూమి కంపించింది. ఐదు సెకన్ల పాటు భారీ శబ్దంతో భూమి కంపిచింది. దీంతో ఒక్కసారిగా స్థానికులు భయపడి బయటకు పరుగులు తీశారు. పది రోజుల వ్యవధిలో రెండుసార్లు భూ ప్రకంపనలు రావడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది. ఇంతకుముందు.. న్యాల్కల్ మండలంలోని న్యాల్కల్, ముంగి గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. కాగా.. ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. కానీ.. జిల్లాలో భూకంపం అనగానే ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.

నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టే నాగార్జున సాగర్ కట్టాం
బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలు ఫైర్‌ అయ్యారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టే నాగార్జున సాగర్ కట్టామన్నారు. నీళ్ల గురించి మాకు తెలుసు కాబట్టే శ్రీశైలం కట్టామని ఆయన పేర్కొన్నారు. నీకు తెలియదు కాబట్టి కూలి పోయేలా కాళేశ్వరం కట్టావు కేసీఆర్ అని ఆయన విమర్శలు గుప్పించారు. అనంతరం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. మాకు నీళ్ల గురించి తెలుసు.. కానీ కోట్లు కొల్ల గొట్టడం కేసీఆర్ కి తెలుసు అని అన్నారు. కాళేశ్వరం మీద ఇప్పటి వరకు ఎందుకు నోరు మెడపలేదని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు. అంతేకాకుండా.. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ముందు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. నీళ్ల పేరుతో నిధులు దోచుకోవడం కేసీఆర్ కి తెలిసినట్టు మాకు తెలియదని, కాళేశ్వరం.. మేడిగడ్డ మీద ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. కేసీఆర్, జగన్ కలిసి తెలంగాణకు రావాల్సిన నీటి వాటా పై కుట్ర చేశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారని అన్నారు. బోర్డుకు కేసీఆర్ సర్కార్ నిధులు ఇచ్చిందని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ కు ఓకే చెప్పేందుకే కేసీఆర్ అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు పోలేదని అన్నారు.

శరద్ పవార్‌కి ఈసీ షాక్.. నిజమైన “ఎన్సీపీ” అజిత్ పవార్‌దే..
కేంద్ర ఎన్నికల సంఘం శరద్ పవార్‌కి షాక్ ఇచ్చింది. నిజమైన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అజిత్ పవార్‌దే అని, నిజమైన ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానిదే అని మంగళవారం ప్రకటించింది. పార్టీ గుర్తును ఉపయోగించుకునే హక్కును ఇచ్చింది. 6 నెలలుగా సాగిన, 10కి పైగా విచారణల అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. గతేడాది అజిత్ పవార్, శరద్ పవార్‌పై తిరుగుబాటు చేసి ఎన్సీపీని రెండుగా చీల్చారు. కీలకమైన నేతలు, మెజారిటీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వర్గానికి మద్దతుగా నిలిచారు. మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన ప్రభుత్వం ఎన్సీపీ కూడా చేరి ఎన్డీయే కూటమిలో మిత్రపక్షమైంది. అయితే, శరద్ పవార్ మాత్రం కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ ఇతర పార్టీలతో కూడిన ఇండియా కూటమిలో భాగంగా ఉన్నారు. ఇరు వర్గాలు తమదే నిజమైన ఎన్సీపీ అని, ఎన్నికల గుర్తు కోసం పోరాడుతున్నాయి. ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. శాసనసభలో ఎక్కువ మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వర్గంలోనే ఉన్నారు. దీంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తన వర్గానికి ఒక పేరు పెట్టుకోవాలని శరద్ పవార్‌ని ఈసీ కోరింది. ఫిబ్రవరి 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోగా తన వర్గం పేరు, గుర్తును ఎన్నికల సంఘానికి తెలియజేయాలని కోరింది.

“పెళ్లి చేసుకోండి లేదా దత్తత తీసుకోండి.. వివాహ పవిత్రత మాకు ముఖ్యం”.. సరోగసీ కేసులో సుప్రీంకోర్టు..
సరోగసీ ద్వారా పిల్లలు కనేందుకు అనుమతి ఇవ్వాలని ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేసింది. 44 ఏళ్ల అవివాహిత మహిళ పిటిషన్‌ను విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. పాశ్చాత్య దేశాల వలే వివాహం కాకుండా పిల్లలు కనడంలా కాకుండా, వివాహ పవిత్రతను కాపాడటం చాలా ముఖ్యమని పేర్కొంది. మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న మహిళ తన లాయర్ ద్వారా సుప్రీంకోర్టులో సరోగసీ ద్వారా తల్లికావడానికి అనుమతించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు బివి నాగరత్న, అగస్టిన్ జార్జ్ మసీతో కూడిన ధర్మాసనం విచారించింది. దీనిపై జస్టిన్ నాగరత్న మాట్లాడుతూ.. వివాహ వ్యవస్థలో తల్లిగా మారడం ఇక్కడ ఆచారం, వివాహ వ్యవస్థకు బయట తల్లిగా ఉండటం ప్రమాణం కాదని, మేము దీనిపై ఆందోళన చెందుతున్నామని, దేశంలో వివాహ వ్యవస్థ మనుగడ సాగించాలా..వద్దా..? మనం పాశ్చాత్య దేశాల్లా కాదని, వివాహ వ్యవస్థను రక్షించుకోవాలని, మీరు మమ్మల్ని సంప్రదాయవాదిగా చెప్పవచ్చు, మేము దానిని అంగీకరిస్తామని ఆమె అన్నారు.

మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి ఉరిశిక్ష తప్పదా.? పాక్ ఆర్మీ చట్టాలు ఏం చెబుతున్నాయి.?
పాకిస్తాన్ ఎన్నికలు గురువారం జరగబోతున్నాయి. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాద దాడులు, వేర్పాటువాద ఉద్యమాలతో ఆ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో ఈ ఎన్నికలు వస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ జైలులో ఉన్నాడు. ఇప్పటికే అక్కడి కోర్టులు అతనికి పలు కేసుల్లో జైలుశిక్ష విధించాయి. ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పోలింగ్‌కు కొద్ది రోజుల ముందు తన ఎన్నికల చిహ్నాన్ని కూడా కోల్పోయింది. ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్థులను భయపెడుతున్నారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్‌పై 150కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యంత తీవ్రమైన కేసులు కూడా ఉన్నాయి. వీటిల్లో కొన్నింటిలో నేరం రుజువైతే ఉరిశిక్ష తప్పదు. పాకిస్తాన్ మాజీ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ మరణశిక్ష తప్పాదా.? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ గత చరిత్ర చూసినా కూడా.. ఇదే స్పష్టమవుతోంది. తమకు ఎదురుతిరిగిన ఏ నేతనైనా పాక్ ఆర్మీ క్షమించలేదని గత అనుభవాలు చెబుతున్నాయి. గతంలో పాక్ ప్రధానిగా ఉన్న జుల్ఫీకర్ అలీ భుట్టోను అక్కడి సైన్యం ఉరితీసింది. హుస్సేన్ షాషీద్ సుహ్రవర్దీ మిలిటరీ రూలర్ అయూబ్ ఖాన్‌కి ఎదురుతిరిగినందుకు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ వంతు వచ్చింది.

ఆ రాళ్లు ఎత్తే ఓపిక లేదు.. బురద తుడుచుకునే ఓపిక లేదు..
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పేద‌ల క‌ష్ట‌న‌ష్టాల‌ను తెలుసుకుని వాటిని తీర్చ‌టానికి చేసిన పాద‌యాత్ర ఆధారంగా రూపొందిన సినిమా యాత్ర. దీనికి కొనసాగింపుగా రూపొందిన చిత్రం యాత్ర 2. వై.ఎస్‌.ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌గా ఆయ‌న‌ త‌న‌యుడు వై.ఎస్‌.జ‌గ‌న్ పాత్ర‌లో కోలీవుడ్ స్టార్ జీవా న‌టించారు. 2009 నుంచి 2019 వ‌ర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజ‌కీయ ప‌రిస్థితులు, వై.ఎస్‌.జ‌గ‌న్ పేద‌ల కోసం చేసిన పాద‌యాత్ర ఆధారంగా యాత్ర 2 చిత్రాన్ని రూపొందించారు. ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌ల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ నేడు ఈ సినిమా ప్రెస్ మీట్ ను నిర్వహించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు చిత్రబృందం సమాధానాలు చెప్పుకొచ్చింది. ఇక ఈ మీట్ లో మహి వి రాఘవ్ కు ఒక ప్రశ్న ఎదురైంది. సినిమా గురించి సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి.. ట్రోల్ చేస్తున్నారు .. దానికి మీ సమాధానం ఏంటి అన్న ప్రశ్నకు మహి వి రాఘవ్ మాట్లాడుతూ.. ” రాజకీయం గానీ రాజకీయ నాయకుల గురించి గానీ రాజకీయ నేపథ్యం ఉన్న సినిమాలు చేసినప్పుడు గాని రాళ్లు వేసే వాళ్ళు రాళ్లు వేస్తారు. బురద వేసే జల్లేవాళ్ళు జల్లుతారు. ఇప్పుడు నాకు ఆ రాళ్లు ఎత్తే ఓపిక లేదు, బురద తుడుచుకునే ఓపిక లేదు.. అది నా జాబ్ కాదు. సోషల్ మీడియాలో వంద వస్తాయి. పని లేనివాడు వాటిని చదివి సమాధానాలు ఇస్తాడు.. మిగతవాళ్ళు వదిలేస్తారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

నార్మల్ రేట్లకే టికెట్లు.. గెట్ రెడీ అంటున్న ఈగల్ టీం
రవితేజ హీరోగా ఈగల్ అనే సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ థియేటర్ల సర్దుబాటు వ్యవహారంలో ఫిలిం ఛాంబర్ సలహాతో వెనక్కి తగ్గింది. ఈ ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈగల్ మీద ముందు నుంచి ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టు టీజర్, ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది దానికి తోడు ఫిలిం ఛాంబర్ మాటకు గౌరవం ఇస్తూ వెనక్కి తగ్గడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో మంచి పాజిటివ్ బజ్ కూడా ఏర్పడింది. ఇక ఈ సినిమాకి పోటీగా తమిళ డబ్బింగ్ సినిమా లాల్ సలాం రిలీజ్ అవుతుంది. కానీ ఎందుకో ఇప్పటివరకు ఆ సినిమా సరైన సౌండ్ చేసినట్లు అనిపించడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే అందరి దృష్టి రవితేజ ఈగల్ మీదనే కేంద్రీకృతం అయి ఉంది. ఫైనల్ కాపీ రెడీ అవ్వడంతో రవితేజ సినిమా యూనిట్ తో కలిసి సినిమా చూసి తాను సాటిస్ఫై అయ్యాను అంటూ ఒక వీడియో రిలీజ్ చేయడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అభిమానులైతే భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈగల్ సినిమాకి ప్రేక్షకులను రప్పించడం లక్ష్యంగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచి అమ్మడం లేదని తెలుస్తోంది. సాధారణంగా ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్లకి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అంటే హైదరాబాద్ పీవీఆర్ – ఐనాక్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ‘ఈగల్’ టికెట్ రేటు రూ. 200 మాత్రమే ఉండనుంది, ఇక ఏషియన్ మల్టీప్లెక్స్‌లలో కొన్ని చోట్ల 175 రూపాయలే. సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేటు విషయానికి వస్తే బాల్కనీ రేటు రూ. 150 మాత్రమే కాగా స్క్రీన్ ముందు ఉండే నేల టికెట్ రేటు 50 రూపాయలుగా ఉండనుంది ఇక మరోపక్క ఏపీలోనూ ‘ఈగల్’ టికెట్ రేట్లు పెంచలేదు. మెజారిటీ సింగిల్ స్క్రీన్లలో రూ. 110 మాత్రమే ఉండగా కొన్ని థియేటర్లలో 145 రూపాయలు పెట్టారు. ఇక ఈ ‘ఈగల్’ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేయగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు. ఇంతకు ముందు రవితేజతో ఆయన ‘ధమాకా’ తీయగా ఆ సినిమా భారీ వసూళ్లు సాధించింది. అదే సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందని సినిమా యూనిట్ నమ్మకంగా ఉంది.

సూర్య హీరోయిన్ విడాకులు.. 12 ఏళ్ల కాపురానికి స్వస్తి
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హేమామాలిని కూతురు, నటి ఈషా డియోల్ అభిమానులకు చేదువార్త చెప్పింది. తన భర్త భరత్ తక్తానీతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తుతున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తాజాగా ఆమె ఈ విషయాన్నీ కన్ఫర్మ్ చేసింది. తామిద్దరం 12 ఏళ్ళ వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నామని, పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నామని, పిల్లలు మాత్రం తమకు చాలా ఇంపార్టెంట్ అని తెలిపింది. దీంతో ఆమె అభిమానులు షాక్ కు గురవుతున్నారు. ఈషా డియోల్.. బాలీవుడ్ స్టార్ కపుల్ ధర్మేంద్ర- హేమామాలిని పెద్ద కూతురు. తల్లి అడుగుజాడల్లోనే ఈ చిన్నది 21 ఏళ్ళ వయస్సులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అన్ని భాషల్లో 30 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన యువ సినిమాలో సూర్య సరసన నటించి మెప్పించింది. ఈ సినిమా తరువాత ఆమెకు తెలుగు, తమిళ్ అభిమానులు పెరిగిపోయారు అని చెప్పొచ్చు. అనంతరం 2012లో భరత్ తక్తానీని పెళ్లి చేసుకుని ఓ మూడేళ్లు నటనకు బ్రేక్ ఇచ్చింది. వీరికి ఇద్దరు పిల్లలు. పిల్లలు పుట్టాకా వారిని పెంచడంతో ఆ సమయం గడిచిపోయింది. ఇక డిజిటల్ ఓటిటీ లు రావడంతో ఈషా కూడా ఓటిటీలో రీ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టింది. ఇక గత కొన్నేళ్లుగా భరత్ – ఈషా మధ్య పడడం లేదని, ఇరు కుటుంబాల పెద్దలు రాజీ కుదర్చాలని చూసినా కూడా వర్క్ అవుట్ కాకపోవడంతో విడాకులు తీసుకొని విడిపోయినట్లు తెలుస్తోంది.