Site icon NTV Telugu

Top Headlines@9PM: టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

*జగన్‌ నీకు యుద్ధాన్ని ఇస్తా.. మర్చిపోకు: పవన్‌ కల్యాణ్

సిద్ధం సిద్ధం అంటున్న వైఎస్ జగన్ కి 2024ఎన్నికల్లో యుద్ధం ఇద్దామంటూ జనసైనికులను ఉద్దేశించి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో ఆయన ప్రసంగించారు. ఐదేళ్ల పాలనలో యువత, రైతులు, మహిళలు, అంగన్వాడి, ఉద్యోగులు అందరినీ మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఏపీ రోడ్లు పై పాలు పోస్తే తిరిగి గిన్నెల్లో ఎత్తుకోవచ్చని, చదువుకున్న వాళ్లకు ఎక్కడపడితే అక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి అంటూ వైసీపీ నాయకులు పగటి కలల్లో ఉన్నారని పవన్‌ ఎద్దేవా చేశారు. రోడ్లపై తిరుగుతుంటే రోజులు గడిచిపోతున్నాయన్నారు. OG లో వచ్చిన డబ్బులతో కేజీ బియ్యం కొనకుండా హెలికాఫ్టర్‌కు పెడుతున్నానని పవన్‌ చెప్పారు. ఐదు కోట్ల ప్రజలను ఐదుగురికి తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. వచ్చే 45రోజుల్లో వైసీపీ గుండాలు కూటమి కార్యకర్తలను బెదిరిస్తే మక్కెలు ఇరగొట్టి మడత మంచంలో పెడతానని హెచ్చరించారు. ఎక్కడికి వెళ్ళినా ఐదుగురు పెత్తనం చేస్తున్నారని.. ఇది క్లాస్ వార్ అని జగన్ అంటున్నారన్నారు. 2014పార్టీ పెట్టిన నాటి నుంచి తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర, దేశ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. రాజకీయాల్లో సహకారం, సంగ్రామం రెండు ఉంటాయి.. 2024లో జనసేన సహకారం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సీఎం బతుకు నాకు తెలుసు.. ఇప్పటివరకు సీఎం ఏమేమి చేశారో తనకు తెలుసన్నారు. ఎస్సీలు, ఎస్టీలు అందరినీ మోసం చేస్తున్నారని.. అందుకే పొత్తు నేనే ప్రతిపాదించానన్నారు. రాజధాని అంటే మూడు చోట్లకు పరిగెట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. అమరావతి రాజధానిగా ఉంటుంది అని తాడేపల్లిగూడెం వేదికగా చెబుతున్నానన్నారు. ప్రజల సొమ్ము ప్రజలకు పంచుతూ దానకర్ణులుగా చెప్పుకుంటున్నారని విమర్శించారు.నేను ఉన్నది యువతకి 10కేజీల బియ్యం, ఐదువేల బృతి ఇవ్వడానికి కాదు, పాతికేళ్ల భవిషత్తు ఇవ్వడానికి అని పవన్‌ అన్నారు. యువతలో ఏ కులం ఎంతమంది ఉన్నారో చూస్తున్నారు తప్ప ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో చూడటం లేదన్నారు. కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నా.. యువత భవిష్యత్తు కోసం పోరాడుతున్నానని పవన్‌ చెప్పారు. పొద్దున్న పథకాలు కింద డబ్బులు ఇస్తూ సాయంత్రం సారా పేరుతో తీసుకుపోతున్నారన్నారు. పొత్తులో 24సీట్లు తీసుకుంటే ఇంతేనా అంటున్నారని.. ఎన్నికలు అయ్యాక తెలుస్తుందని… నెత్తిపై కాలు వేసి తొక్కుతామన్నారు. అంకెలు లెక్క పెట్టొద్దని చెప్పండి.. పవన్ , జనసేన వైపు చూసే దైర్యం చేయకండన్నారు. ఇప్పుడే ఇటుక ఇటుక పేర్చుతున్నామన్నారు. సలహాలు ఇచ్చేవాళ్ళు అవసరంలేదు.. మరిగే రక్తం ఉన్న యువకులు కావాలన్నారు. జనసేనకు సలహాలు ఇచ్చే వాళ్ళు అక్కర్లేదు.. పోరాటం చేసే యువకులు కావాలి.. తెగువ చూపే వీర మహిళలు కావాలన్నారు. నేను ఏమి చేయకపోయినా నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. ‘‘పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లు తీసుకున్నానన్న ఆయన.. 24 సీట్లేనా అని అవతలి పక్షం విమర్శించిందన్నారు. బలి చక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నారని.. నెత్తిన కాలుపెట్టి తొక్కితే ఎంతో అని తెలిసిందన్నారు. “దోపిడీలు, అన్యాయాలు చేయకపోయినా నన్ను నా వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తున్నారని.. నాతో నడిచేవాడే నావాడు.. నాతో ఉండాలి అనుకునేవాళ్లు నన్ను ప్రశ్నించకండి.. ఎక్కడినుంచి పోటీ చేసినా ఓడిన, గెలిచినా మీతోనే ఉంటా.. పవన్ కళ్యాణ్ తో స్నేహం చచ్చే దాకా.. పవన్ కళ్యాణ్ తో శతృత్వం అవతలి వాడు చచ్చేవరకు..” అని పవన్‌ కల్యాణ్ తెలిపారు.

 

*ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు.. వచ్చే ఎన్నికల్లో సత్తా చూపిస్తాం..
తెలుగు జన విజయకేతన సభ ఇది అని.. తాడేపల్లిగూడెం సభ చరిత్రను తిరగరాస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. మన పోరాటం వైసీపీ దొంగలపై అన్న ఆయన.. తాడేపల్లిగూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపిస్తుందన్నారు. మేము చేతులు కలిపింది మా కోసం కాదని.. రాష్ట్ర భవిష్యత్తు కోసమని.. హత్యకు గురైన ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కలసి పోరాటం చేస్తున్నామని చంద్రబాబు టీడీపీ-జనసేన పొత్తు గురించి వ్యాఖ్యానించారు. ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు అని.. మేం చేతులు కలిపింది అధికారం కోసం కాదు, ప్రజల కోసమని.. భవిష్యత్‌కు నాందీ పలకాల్సిన బాధ్యత మనపై ఉందని చంద్రబాబు అన్నారు. ప్రజావేదిక కూల్చి పాలన మొదలు పెట్టారని.. ఇది వైసీపీ నైజమని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుద్దుతున్నారని విమర్శించారు. క్రికెటర్ హనుమ విహారి వైసీపీ వేదింపులు తట్టుకోలేక పారిపోయాడని ఆరోపించారు. రాజకీయ వ్యాపారం చేస్తున్న ముఖ్యమంత్రికి అడ్డువస్తే చంద్రబాబు, పవన్, ప్రజలు ఎవరినీ లెక్కచేయడం లేదని ఆయన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రజలు ఉండాలని సీఎం కోరుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. ఏమి పొడిచారని వై నాట్ 175 అంటున్నారని.. మేము అడుగుతున్నాం.. వై నాట్ జ్యాబ్ క్యాలండర్, వై నాట్ ఉచిత ఇసుక, వై నాట్ డీఎస్సీ.. జగన్‌ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. జగన్ ది ఫ్లాప్ సినిమా.. దీనికి సీక్వెల్ ఉండదన్నారు. వైసీపీ రౌడీలకి 40రోజుల తర్వాత అసలు సినిమా చూపిస్తామన్నారు. జనసేన, టీడీపీ సూపర్ విన్నింగ్ టీమ్.. వైసీపీ సిట్టింగ్ టీమ్ అంటూ చంద్రబాబు అన్నారు. బాధ్యతగా అభ్యర్థుల ఎంపిక చేస్తున్నాం.. మా అభ్యర్థులను చూశాక వైసీపీలో భయం పట్టుకుందన్నారు. కూటమి అభ్యర్థులను చూసి మళ్ళీ అభ్యర్థులను మార్చుతాం అంటున్నారంటూ ఎద్దేవా చేశారు. బీసీ, ఎస్సీ డిక్లరేషన్ ఇస్తామన్నారు. ఉమ్మడి మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తామన్నారు. కోరుకున్న అందరికీ సీట్లు ఇవ్వలేమన్న ఆయన.. పని చేసిన నాయకులకు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామన్నారు. ఒక పార్టీ వెనుక మరొక పార్టీ నడవడంలేదు.. రెండు సమానంగా వెళ్తున్నాయన్నారు. నాయకులు ఎవ్వరూ ఈగోలకు పోకూడదన్నారు.పొత్తు సూపర్ హిట్స్.. ఆంధ్రప్రదేశ్ అన్ స్టాపబుల్ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

 

*హెచ్ఎండీఏ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
సచివాలయంలో హెచ్ఎండీఏ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ పై రివ్యూ చేపట్టారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వైపు ఉన్న ప్రాంతాన్ని ఒక యూనిట్ గా తీసుకుని అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా.. రీజనల్ రింగ్ రోడ్డు పరిధి లోపల ఉన్న ప్రాంతాన్ని హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకురావాలని సీఎం పేర్కొన్నారు. ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ కు అనుసంధానంగా రేడియల్ రోడ్స్ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అదే విధంగా.. మాస్టర్ ప్లాన్-2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మరోవైపు.. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం ఇచ్చారు. వెంటనే పూర్తి వివరాలు సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ అమ్రా పాలీకి ఆదేశాలు ఇచ్చారు. సీబీఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో.. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని యోచిస్తున్నారు.

 

*తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో ఐఏఎస్ బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా.. ఐదుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్‌ కలెక్టర్‌గా రాహుల్‌ రాజ్‌, ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా రాజర్షి, కుమురంభీమ్‌ ఆసిఫాబాద్‌ కలెక్టర్‌గా స్నేహ శబరీశ్‌, హైదరాబాద్‌ అదనపు కలెక్టర్‌గా హేమంత కేశవ పాటిల్‌ను బదిలీ చేసింది. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా బి.హెచ్‌.సహదేవ్‌రావును నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా 8 మంది స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు, 32 డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. జగిత్యాల అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ)గా పర్సా రాంబాబు, హనుమకొండ అదనపు కలెక్టర్‌గా ఎ.వెంకట్‌రెడ్డి, సూర్యాపేట అదనపు కలెక్టర్‌గా బీఎస్‌ లత, ములుగు అదనపు కలెక్టర్‌గా సీహెచ్‌ మహేందర్, భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్‌గా డి.వేణుగోపాల్‌ బదిలీ అయ్యారు.

 

*బీఆర్ఎస్ మేడిగడ్డకు పోవాలి.. క్షమాపణ చెప్పాలి
బీఆర్ఎస్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ సందర్శనకు పోవాలి.. క్షమాపణ చెప్పాలని అన్నారు. చీఫ్ ఇంజనీర్ కేసీఆర్ పోయి చూసి.. ప్రజలకు క్షమాపణ చెప్తే బాగుంటుందని ఆరోపించారు. అధికారులకు ఆదేశాలు ఇచ్చాం.. బీఆర్ఎస్ వాళ్లకు అన్నీ చూపెట్టమని అని తెలిపారు. కాళేశ్వరంపై పెద్ద ఫ్రాడ్ చేసి.. ఉల్టా తమపై ఆరోపణలు చేయడం దుర్మార్గం అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టారని మంత్రి ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే.. రూ.లక్ష 47 వేల కోట్లు అవుతాయని తెలిపారు. బీఆర్ఎస్ రాజకీయంగా ట్విస్ట్ చేయాలి అని చూస్తుందని తెలిపారు. లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్టు కింద లక్ష ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు లేదని విమర్శించారు. మేడిగడ్డ కుంగినప్పుడు సీఎంగా కేసీఆర్ ఎందుకు స్పందించలేదని మంత్రి ప్రశ్నించారు. మేడిగడ్డ రిపేర్ గురించి అప్పుడు కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ దుయ్యబట్టారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి విచారణ అప్పగించాం.. NDSAకి త్వరగా నివేదిక ఇవ్వండి అని కోరామన్నారు. ఇరిగేషన్ పై విజిలెన్స్ రిపోర్ట్ అందింది.. విజిలెన్స్ రిపోర్ట్ పై న్యాయ సలహాలు తీసుకుంటామని చెప్పారు. లీగల్ ఒపియన్ తీసుకున్నాక చట్టపరమైన చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

 

*HMDAలో విజిలెన్స్ దాడులతో వెలుగులోకి కీలక విషయాలు..
హైదరాబాద్ లోని మైత్రివనంలో ఉన్న HMDAలో జరిగిన విజిలెన్స్ సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉదయం నుంచి దాదాపు 50 మంది స్పెషల్ టీమ్ తో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్.. గత ప్రభుత్వం ఇచ్చిన బహుళ అంతస్తుల భవనాల అనుమతులకు సంబంధించిన ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. కాగా.. 4, 5వ అంతస్తులో రికార్డు సెక్షన్ నుంచి 51 అనుమతులకు సంబంధించి మాన్యువల్ ఫైల్స్ మాయం అయినట్లు నిర్ధారించారు. కాగా.. ఈ విషయాన్ని విజిలెన్స్ బృందం ఉన్నతాధికారులకు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. HMDAకు సంబంధించి 4, 5, 7వ అంతస్తులో ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. అయితే.. గత తొమ్మిదేళ్ల కాలంలో గత ప్రభుత్వం అనుమతులిచ్చిన కీలక ఫైల్స్ మాయమాయ్యాయి. ఐతే.. దీని వెనుక ఎవరి హస్తం ఉంది.. ఏ విధంగా వీటిని మాయం చేశారు.. ఎప్పుడు మాయం చేశారనే దానిపై దర్యాప్తు కొనసాగనుంది. అంతేకాకుండా.. పలువురు అధికారులను కూడా ఫైల్స్ మాయంపై ప్రశ్నించనున్నారు.

 

*లోక్‌సభ అభ్యర్థులపై బీజేపీ కసరత్తు.. ప్రకటన ఎప్పుడంటే..!
త్వరలోనే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అన్ని పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తు్న్నాయి. ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించేస్తున్నాయి. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ, ఢిల్లీలో ఆప్ అభ్యర్థులను ప్రకటించేసింది. కానీ బీజేపీ, కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. దీనిపై తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి సింగిల్‌గా 370 సీట్లు సాధిస్తామని ప్రధాని మోడీ చెబుతున్నారు. ఇక ఎన్డీఏ కూమిటి అయితే 400 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కమలనాథులు తీవ్ర మేథోమదనం చేస్తున్నట్లు సమాచారం. బుధవారం ఆయా రాష్ట్రాల నేతలతో అగ్ర నాయకులు చర్చించారు. ఆయా రాష్ట్రాలకు చెందిన పార్టీ నేతలతో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah), బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాలు వేర్వేరుగా సమావేశాలు ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ నేతలతో భేటీ అయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన నేతలతోనూ ఈ తరహా భేటీలు నిర్వహించారు. త్వరలోనే బీజేపీ తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి జాబితాలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అమిత్‌ షా వంటి ముఖ్య నాయకుల పేర్లు ఉన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీరితోపాటు 2019 ఎన్నికల్లో బీజేపీ గెలవని స్థానాలను కూడా ఈ జాబితాలో చేర్చనున్నారని సమాచారం. 2019 ఎన్నికల సమయంలో విడుదల చేసిన తొలి జాబితాలోనూ మోడీ, షా పేర్లు ఉన్నాయి. అయితే కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) షెడ్యూల్‌ విడుదల చేసిన తర్వాతే అభ్యర్థుల జాబితా ప్రకటించింది. కానీ ఈసారి మాత్రం ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు.

 

*జమిలిపై ఫైనల్‌గా లా కమిషన్ ఏం తేల్చిందంటే..!
దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోడీ ప్రభుత్వం భావించింది. ఈసారే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. కానీ సాధ్యం కాలేదు. అసలు జమిలి ఎన్నికలు సాధ్యమా? కాదా? అన్నది తెలుసుకునేందుకు మాజీ రాష్ట్రపతి కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ అధ్యయనం చేస్తోంది. ఇక తాజాగా వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై లా కమిషన్ స్పందించింది. ప్రస్తుతానికి జమిలి సాధ్యం కాదని పేర్కొంది. లా కమిషన్ (Law Commission) చైర్మన్ జస్టిస్ రీతూరాజ్ ఆవస్తి నేతృత్వంలో ఏర్పాటైంది. గతేడాది సెప్టెంబర్ 27న ఢిల్లీ వేదికగా జరిగిన లా కమిషన్ సమావేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై చర్చించారు. తాజాగా లా కమిషన్ నుంచి ఒక కీలక ప్రకటన వచ్చింది. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి జమిలి ఎన్నికలు అమల్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశముందని లా కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం. అయితే రాజ్యాంగంలో కొన్ని సవరణలు చేయాల్సిన అవసరముందని ప్రతిపాదించింది. రాజ్యాంగంలో కొత్తగా ‘Simultaneous election’ అనే సెక్షన్ చేర్చాలని ప్రతిపాదించింది. ఇలా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ఎన్నేళ్ల పాటు కొనసాగించవచ్చన్న అంశం కూడా అందులో చేర్చాల్సిన అవసరముందని స్పష్టం చేసింది. అసెంబ్లీలు, పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చని వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలను పాటిస్తూనే… కొత్తగా మార్పులు ఎలా చేయొచ్చో ఆలోచించాలని తెలిపింది. సాధారణంగా అసెంబ్లీ గడువు ఐదేళ్ల వరకూ ఉంటుంది. అయితే…మూడు లేదా ఆరు నెలల లోపు గడువు ముగిసే రాష్ట్రాలను ముందుగా పరిగణనలోకి తీసుకుని అక్కడ తొలి విడతలో ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ ప్రతిపాదించింది. ఈ లోగా ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం కారణంగా కుప్ప కూలినా…ఒకవేళ హంగ్ ఏర్పడినా ఆ సమయంలో unity government ని ఏర్పాటు చేయాలని తెలిపింది. అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రతినిధులను ఎంపిక చేసుకుని ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. ఒకవేళ unity government ఆలోచన సక్సెస్ కాకపోతే…వెంటనే ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ కూడా పర్యవేక్షిస్తోంది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా? కాదా? అన్న విషయాన్ని ఈ కమిటీ మేధోమథనం చేస్తోంది. వచ్చే ఏడాది మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బిహార్, ఢిల్లీలో వచ్చే ఏడాది, 2026లో అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో ఎన్నికలు జరగనున్నాయి. 2027లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ ఎన్నికలకు వెళ్తాయి. లా కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

 

*యూపీలో బీజేపీ క్లీన్‌స్వీప్ ఖాయం
దేశ వ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలుచుకోబోతుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) జోస్యం చెప్పారు. అలాగే యూపీలో ఉన్న మొత్తం 80 పార్లమెంట్ స్థానాలను కూడా బీజేపీనే కైవసం చేసుకోబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
బుధవారం ‘టైమ్స్ నౌ నవభారత్ నవనిర్మాణ మంచ్ 2024’ కార్యక్రమంలో యూపీ సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం అఖిలేష్‌పై ధ్వజమెత్తారు. ముందు అఖిలేష్ తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. అభివృద్ధిలో భారత్ మరింత ముందుకు సాగాలంటే మోడీ మూడోసారి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అయోధ్యలో ఒక పెద్ద కార్యక్రమం జరిగిందని.. రాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిందని చెప్పుకొచ్చారు. దీంతో కొత్త అయోధ్య రూపుదిద్దుకుందని తెలిపారు. భారత ఐక్యత కోసం రాహుల్ గాంధీ ఏ రోజూ పని చేయలేదని యోగి విమర్శించారు. బీజేపీని ఓడించేందుకే రాహుల్ దేశమంతా తిరుగుతున్నారని విమర్శించారు. 2014కు మందు దేశం సర్వనాశనం అయిందని.. బీజేపీ అధికారంలోకి వచ్చాక.. అభివృద్ధిలో దూసుకుపోతుందని యోగి వివరించారు.

 

*జమ్తారాలో ఘోర రైలు ప్రమాదం.. 12 మంది మృతి
జార్ఖండ్‌లోని జమ్తారాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మణం చెందారు. రైల్లో మంటలు చెలరేగడంతో భయాందోళనతో ప్రయాణికులు కిందకు దూకేశారు. అదే సమయంలో ఝఝా-అసన్సోల్ రైలు ఎదురుగా వస్తోంది. దీంతో ఆ రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘనాస్థలికి బయల్దేరారు. చీకటి కావడంతో సహాయ చర్యలకు ఇబ్బందులు కలుగుతున్నట్లు సమాచారం.

Exit mobile version