*మంగళగిరి ఎయిమ్స్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
ఎన్నికల వేళ ఏపీపై ఫోకస్ పెట్టారు ప్రధాని మోడీ. మంగళగిరితో పాటు దేశంలోని 5 అఖిల భారత వైద్య విద్యా సంస్థలను ప్రారంభించి వాటిని జాతికి అంకితం చేశారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా ఈ ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా మంగళగిరికి ఈ ఎయిమ్స్ వచ్చింది. మంగళగిరి ఎయిమ్స్‌ను ప్రధాని మోడీ ఆదివారం రాజ్‌కోట్ నుంచి వర్చువల్‌గా జాతికి అంకితం చేశారు. దీనిని కేంద్రం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. మంగళగిరి ఎయిమ్స్‌లోని 9 క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు ప్రధాని శంకుస్థాపన చేశారు. రూ.1,618.23 కోట్లతో 183.11 ఎకరాల్లో 960 పడకలతో ఎయిమ్స్ ఆస్పత్రిని నిర్మించారు. ఇందులో 125 సీట్లతో కూడిన వైద్య కళాశాల ఉంది. కాకినాడలో 100 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రిని వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే విశాఖ పెదవాల్తేరు వద్ద స్టేట్ ఫుడ్ ల్యాబ్ క్యాంపస్‌లో రూ.4.76 కోట్లతో నిర్మించిన మైక్రోబయాలజీ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్, రూ.2.07 కోట్ల విలువైన మరో 4 మొబైల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌లను మోడీ ప్రారంభించారు. యానాం ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్మించిన జిప్‌మర్ మల్టీస్పెషాలిటీ యూనిట్‌ను కూడా వర్చువల్‌గా ప్రారంభించారు. మంగళగిరి ఎయిమ్స్‌లో 2019 మార్చి నుంచే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. రోజుకు రెండున్నర వేల మంది రోగులు అక్కడ వైద్యం పొందుతున్నారు. 2018 నుంచే ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేస్తున్నారు. మంగళగిరి ఎయిమ్స్‌లో ప్రస్తుతం 600 మంది వైద్య విద్యార్థులు చదువుకుంటున్నారు. మరో 100 మంది వివిధ కోర్చుల్లో పీజీ చేస్తున్నారు. ఈ ఏడాది నుంచి పారామెడికల్ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్, ఏపీ మంత్రి విడదల రజని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఎంపీలు జీవిఎల్, సీఎం రమేష్, అధికారులు పాల్గొన్నారు.
*సీఎం జగన్ అధ్యక్షతన ఈ నెల 27న వైసీపీ కీలక సమావేశం
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఈ నెల 27న వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్‌లో ఈ మీటింగ్ జరగనుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతల హాజరు కానున్నారు. సుమారు 2 వేలకు పైగా మండల స్థాయి నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ ఎన్నికల్లో వై నాట్ 175 లక్ష్యంగా నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించాలని నేతలకు సూచించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటికే ‘సిద్ధం’ పేరుతో సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మార్చి 3వ తేదీన మరో ‘సిద్ధం’ సభ నిర్వహించేందుకు పార్టీ ఏర్పాట్లు కూడా చేసింది. ఈ నెల 27న మండల స్థాయి నేతలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీలు చేసే తప్పుడు ప్రచారాన్ని ఏ విధంగా తిప్పికొట్టాలో, ఎన్నికల విధులు ఎలా నిర్వహించాలనే విషయంపై ఈ సమావేశంలో శిక్షణ ఇస్తారని తెలుస్తోంది. ఈ నెల 27న ఉదయం 9.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల సమయంలో సీఎం జగన్ రానున్నారు. పార్టీ నేతలతో ముఖ్యమంత్రి మాట్లాడనున్నారు.
*రోజంతా బుజ్జగింపులతో చంద్రబాబు బిజీ బిజీ
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికార వైసీపీ ఓడించాలనే లక్ష్యంతో ఇరు పార్టీలు జాబితాను విడుదల చేశాయి. ఈ క్రమంలోనే సీట్లు దక్కని నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రోజంతా బుజ్జగింపులతో చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు. కొందరు నేతలకు హామీలు, మరి కొందరి నేతలకు టీడీపీ అధినేత స్పష్టత ఇచ్చారు. ఆలపాటి రాజా, పీలా గోవింద్, దేవినేని ఉమా, బొడ్డు వెంకట రమణ చౌదరి, గంటా శ్రీనివాసరావు, గండి బాబ్జీ, అయ్యన్న, ముక్కా రూపానంద రెడ్డిలు టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. వారందరికి చంద్రబాబు హామీలు ఇచ్చినట్లు తెలిసింది. గంటా శ్రీనివాసరావుకు చీపురుపల్లి నుంచే పోటీ చేయాల్సి ఉంటుందని చంద్రబాబు స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. విశాఖ సౌత్ నుంచి గండి బాబ్జీకి లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నిర్ణయమే శిరోధార్యమంటూ నమస్కారం చేసి దేవినేని ఉమ వెళ్లారు. చంద్రబాబుతో భేటీ అనంతరం ఆలపాటి రాజా, బొడ్డు వెంకట రమణ చౌదరి సంతృప్తితో వెళ్లారు. ఆలపాటి రాజాకు సముచిత న్యాయం జరుగుతుందని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలిసింది. రాజమండ్రి ఎంపీ సీటును బీజేపీ అడగకుంటే ఆ స్థానం నుంచి బొడ్డు పేరును పరిశీలిస్తామని చంద్రబాబు తెలిపినట్లు సమాచారం. పీలా గోవిందును చంద్రబాబు ఇంటికి వెంటపెట్టుకొచ్చారు అయ్యన్నపాత్రుడు. చంద్రబాబుతో భేటీ తర్వాత కూడా అసంతృప్తిగానే పీలా గోవింద్ వెళ్లినట్లు తెలిసింది. రాజంపేట టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబును ముక్కా రూపానంద రెడ్డి కోరారు.
*సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ.. విచారణకు హాజరు విషయంపై ప్రస్తావన
రేపు సీబీఐ విచారణకు ఎమ్మెల్సీ కవిత హాజరుకావడంలేదు. సీబీఐ విచారణకు ఎందుకు రావడం లేదోనని సుదీర్ఘ లేఖ రాసింది కవిత. కాగా.. లిక్కర్ స్కాం కేసులో రేపు తమ ముందు హాజరు కావాలని కవితకు సీబీఐ 41ఏ నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి లేఖ రాసింది. లేఖలో కీలక అంశాలను ప్రస్తావించింది ఎమ్మెల్సీ కవిత. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోండని తెలిపారు. ఒకవేళ తన నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని తెలిపారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న రీత్యా.. ఈ నెల 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని పేర్కొన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 2022 డిసెంబరులో అప్పటి ఐవో ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారు.. గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదని అన్నారు. నోటీసు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపజేస్తున్నదని తెలిపారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావునిస్తోంది.. తనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని అన్నారు. ఇది తన ప్రజాస్వామిక, రాజ్యంగ హక్కులకు భంగం కలిగిస్తుందని ప్రస్తావించారు. సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో తన పాత్ర లేదని… పైగా కేసు కోర్టులో పెండింగ్ లో ఉందని కవిత లేఖలో తెలిపారు. ఈడీ నోటీసులు జారీ చేయగా తాను సుప్రీం కోర్టును ఆశ్రయించానని పేర్కొన్నారు. ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది.. తనను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చారని తెలిపారు. సుప్రీం కోర్టులో హామీ సీబీఐకి కూడా వర్తిస్తుందని అన్నారు. గతంలోనూ సీబీఐ బృందం హైదరాబాద్ లోని తన నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించానని లేఖలో ప్రస్తావించారు. నియమ నిబంధనలను కట్టుబడి ఉండే దేశ పౌరురాలిగా సీబీఐ దర్యాప్తునకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తాను.. కానీ 15 నెలల విరామం తరువాత ఇప్పుడు పిలవడం మరియు సెక్షన్ల మార్పు అనేక అనుమానాలకు తావిస్తుందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తనకు తమ పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించింది.. రానున్న ఆరు వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైందని లేఖలో ప్రస్తావించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటాను.. ఈ రీత్యా ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేనని లేఖలో పేర్కొన్నారు.
*చేవెళ్ల సభలో మరో రెండు గ్యారెంటీ పథకాల అమలు ప్రకటన చేస్తాం..
కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న చేవెళ్ల సభలో మరో రెండు గ్యారెంటీ పథకాల అమలు ప్రకటన చేస్తామని తెలిపారు. మార్చి నెలలో 200 యూనిట్లు లోపు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అంతేకాకుండా.. డ్వాక్రా సంఘాలకు త్వరలో వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు. రేపు సాయంత్రం 43,000 మంది సింగరేణి కార్మికులకు కోటి రూపాయల బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. కావలసినంత నాణ్యమైన విద్యుత్తు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎస్ఆర్ఎస్పి భారీ ప్రాజెక్టులపై పంప్ స్టోరేజ్ కి ప్రణాళికలు చేస్తున్నామన్నారు. గత పదేళ్లుగా విద్యుత్ పాలసీ లేకపోవడంతో రాష్ట్రానికి ఎవరు రాలేదని తెలిపారు. త్వరలో కొత్త విద్యుత్ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోతోందని పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో సింగరేణిలో బొగ్గు పత్తిని 67 మిలియన్ టన్నుల నుంచి 100 మిలియన్ టన్నులకు పెంచుతాం.. రాష్ట్రంలోని బొగ్గు గనులన్నీ సింగరేణికే చెందాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సర్కులర్ జారీ చేసింది.. గత పదేళ్లుగా కనీస వేతన చట్టం లేక లక్షలాది కార్మికులు నష్టపోయారని డిప్యూటీ సీఎం తెలిపారు. సీఎల్పీ నేతగా ప్రతి సభలోను ఆ అంశాన్ని ప్రశ్నించినా.. బీఆర్ఎస్ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మాటలకే పరిమితం కావడంతో సింగరేణిలో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయిందని తెలిపారు. రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఉద్యోగం కల్పించడమే ఇందిరమ్మ సంక్షేమ రాజ్యము లక్ష్యమని భట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణిలో ప్రారంభించిన సౌర విద్యుత్ ప్రాజెక్ట్ రాష్ట్రానికే కాదు దేశానికి దిశా నిర్దేశం అని తెలిపారు. సింగరేణి సంపదను రాష్ట్ర ప్రజలకు, కార్మికులకు పంచుతామని అన్నారు. కరెంటు కావాలా? కాంగ్రెస్ కావాలా అని కేసిఆర్ ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రజలు కరెంటు కావాలి కాంగ్రెస్ కావాలని తీర్పునిచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం ప్రారంభించిన భద్రాద్రి, యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాలు రాష్ట్రానికి గుదిబండలా మారాయని దుయ్యబట్టారు. విద్యుత్ సరఫరా విషయంలో కాంగ్రెస్ సర్కారు విఫలం చెందితే బాగుండు అని కొందరు మిత్రులు కలలు కంటున్నారని చెప్పారు.
*సీట్ల పంపకం కుదిరింది.. రాహుల్ గాంధీ యాత్రలో అఖిలేష్ యాదవ్..
కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరుగుతున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరడంతో ఆ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఈ రోజు జోడో యాత్రలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీతో కలిసి పాల్గొన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రా మీదుగా సాగుతున్న యాత్రలో అఖిలేష్ యాదవ్ చేరారు. రెండు పార్టీల నడుమ గత కొన్ని నెలులగా సీట్ల షేరింగ్ గురించి చర్చలు నడుస్తున్నాయి. తాజాగా పొత్తు ఖరారైంది. దీంతో అఖిలేష్ యాదవ్ యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌తో సీట్ల పంపకం పూర్తైతేనే తాను యాత్రలో పాల్గొంటానని, వారం రోజులుగా యాత్రలో చేరేందుకు అఖిలేష్ నిరాకరించారు. ఆదివారం, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ సమాజ్ పార్టీ చీఫ్‌ని యాత్రలోని ఆహ్వానిస్తూ.. ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు అని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటం, బీజేపీ నాశనం చేసిన బీఆర్ అంబేద్కర్ కలల్ని నెరవేర్చడం అతిపెద్ద సవాల్ అని అఖిలేష్ యాదవ్ అన్నారు. ‘‘బీజేపీ హటావో, దేశ్ కో బచావో, సంకట్ మిటావో(బీజేపీని తొలగించండి, దేశాన్ని రక్షించండి మరియు సంక్షోభాన్ని అంతం చేయండి)’’ అంటూ పిలుపునిచ్చాడు. రాబోయే రోజుల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎను ఓడించేందుకు భారత కూటమి, పిడిఎ (పిచ్రే, దళిత మరియు అల్పశంఖక్) పనిచేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లోని 80 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు ఇచ్చేందుకు ఎస్పీ ఒప్పుకుంది. మిగిలిన సీట్లలో ఎస్పీ తన మిత్రపక్షాలతో కలిసి పోటీ చేయనుంది. 2014 ఎన్నికల్లో బీజేపీకి ఈ రాష్ట్రం నుంచి 71 సీట్లు రాగా.. 2019లో ఓట్ల శాతం పెరిగినప్పటికీ, 62 సీట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రంలో అధికారంలోకి రావాలంటే ఉత్తర్ ప్రదేశ్ కీలకమైన రాష్ట్రం కావడంతో బీజేపీతో పాటు ఇండియా కూటమి ఈ రాష్ట్రంపై దృష్టి సారించాయి.
*పాకిస్తాన్‌కి షాక్.. రావి నది నీటిని నిలిపేసిన భారత్..
సింధు దాని ఉపనదుల జలాలను భారత్ సమర్థవంతంగా వాడుకునేందుకు సిద్ధమైంది. పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో నిర్మితమవుతున్న షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం తుదిదశకు చేరుకోవడంతో పాకిస్తాన్‌కి రావి నది నీటి ప్రవాహాన్ని భారత్ నిలిపేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లోకి ప్రవహించే 1150 క్యూసెక్కుల రావి నది నీటిని ఇప్పుడు జమ్మూ కాశ్మీర్‌లోని కథువా, సాంబా జిల్లాల్లోని 32,000 హెక్టార్ల భూమికి సాగు నీరుగా ఇవ్వనున్నారు. బ్యారేజీ పూర్తి కావడంతో షాపూర్ వద్ద నీటి నిలుపుదల ప్రక్రియ ప్రారంభం అయింది. భారత్-పాక్ మధ్య కుదిరిన ఇండస్ వాటర్ ట్రిటీ ప్రకారం.. భారత్ ఇప్పుడు రావి నది నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోనుంది. గతంలో పాత లఖన్‌పూర్ డ్యామ్ నుంచి పాకిస్తాన్ వైపు ప్రవహించే నీరు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ప్రజలకు ఉపయోగపడనున్నాయి. షాపూర్ కంది బ్యారేజీ ప్రాజెక్ట్‌కు 1995లో మాజీ ప్రధాని PV నర్సింహారావు పునాది రాయి వేశారు. అయితే, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ ప్రభుత్వాల మధ్య విబేధాల కారణంగా చాలా కాలం అడ్డంకులు ఎదుర్కొంది. పీఎం మోడీ, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తోమర్ జోక్యం చేసుకునే వరకు ఈ ప్రాజెక్టు పనులు కదల్లేదు. 2018 తర్వాత పనులు పున:ప్రారంభమయ్యాయి. రూ. 3300 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు ద్వారా సాగు నీటితో పాటు 206 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో పాటు పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇటీవల సింధు నది మరో ఉపనది అయిన ‘చీనాబ్’ నీటిని కూడా భారత్ సమర్థవంతంగా వినియోగించాలని నిర్ణయించుకుంది. జమ్మూకాశ్మీర్ రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుని వేగవంతం చేసేందుకు చీనాబ్ నది నీటిని మళ్లించింది. సింధూ నదీ జలాలపై 1960లో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌లు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. భారత్‌కి తూర్పు నదులు బియాస్, రావి, సట్లేజ్‌లు, పాకిస్తాన్‌కి సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ ఉంటుంది.
*గాజాలో ఆకలి కేకలు.. కలుపు మొక్కలు, పశుగ్రాసమే ఆహారం..
ఇజ్రాయిల్ హమాస్ మిలిటెంట్ల దాడి సాధారణ పాలస్తీనియన్లను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేసింది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని దారుణంగా చంపేసింది. మరికొందరిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఇప్పటివరకు మరణాల సంఖ్య 30,000లను దాటింది. ఇదిలా ఉంటే ఇప్పుడు గాజాలోని ప్రజలు ఆకలితో దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఆహారం, మందులు లేక విలవిల్లాడుతున్నారు. ఉత్తర గాజా నుంచి వేల మంది పాలస్తీనియన్లు పారిపోతున్నారు. దక్షిణంగా ఈజిప్టు వైపుగా ప్రజలు ఆహారాన్ని వెతుక్కుంటూ వలస వెళ్తున్నారు. అక్కడ దుర్భరమైన ఆకలి కేకలు వినిపిస్తున్నాయని, ఆ పరిస్థితులను వర్ణించలేనివిగా ఉన్నాయని గాజా ప్రజలు చెబుతున్నారు. పాలు లేకుండా, పశుగ్రాసంతో తయారు చేసిన రొట్టెలను పిల్లలకు పెడుతుండటం అక్కడి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపెడుతోంది. తినడానికి తిండి లేకపోవడంతో స్థానికంగా పెరిగే మాలో అనే మొక్కలను ఆహారంగా తీసుకుంటున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఉత్తర గాజాను టార్గెట్ చేసింది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడుతోంది. దీంతో లక్షలాది మంది దక్షిణం రఫా బోర్డర్ వైపు వెళ్తున్నారు. గాజాలో 28 లక్షల మందిలో 80 శాతం మంది ఇప్పటికే దక్షిణ ప్రాంతాలకు వెళ్లిపోయారు. భీకర దాడుల్లో ఆహారం, మందులు వంటి మానవతా సాయాన్ని తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. యూఎన్ ఫుడ్ ప్రోగ్రాం కూడా నిరాశ స్థాయికి చేరడంతో సంక్షోభం మరింత ముదిరింది. మానవతా సాయం నిలిచిపోవడంతో అక్కడి ప్రజల పరిస్థితులు ఘోరంగా మారాయి. కొంతమంది నివాసితులు కుళ్లిన మొక్కజొన్న, పశుగ్రాసం, గుర్రాల మాంసం, చెట్ల ఆకుల్ని కూడా తింటున్నారు.
*గుండెపోటుతో టాలీవుడ్ నిర్మాత మృతి..
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత వి. మహేష్ కన్నుమూశారు. 85 ఏళ్ల మహేష్ .. శనివారం రాత్రి చెన్నైలోని తన ఇంటి బాత్ రూమ్ లో కాలుజారి కిందపడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలముకున్నాయి. వి. మహేష్ అప్పట్లో మంచి మంచి తెలుగు సినిమాలను నిర్మించారు. 1975లో మాతృమూర్తిసినిమా ద్వారా మహేష్ నిర్మాతగా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఆయనకు మంచి పేరునే తీసుకొచ్చి పెట్టింది. ఇక ఈ చిత్రం తరువాత ఎన్టీఆర్ హీరోగా మనుషులంతా ఒక్కటే, మహాపురుషుడు సినిమాలు తీశారు. ఆ తరువాత చిరంజీవి హీరో సింహపురి సింహం సినిమాకు తెరకెక్కించారు. ఇక సుమన్ నటించిన ముసుగు దొంగ సినిమాను కూడా ఈయనే నిర్మించారు. సినిమాలు మాత్రమే కాకుండా పలు సీరియల్స్ కు కూడా రైటర్ మరియు నిర్మాతగా వ్యవహరించారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌లో ప్రసారమైన హరి భక్తుల కథలు సీరియల్‌కి ప్రొడ్యూసర్, రైటర్‌గా పనిచేశారు. ఈ సీరియల్ కు ఎంతోమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇక నెల్లూరుకు చెందిన మహేష్.. ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయారు. ప్రముఖ టెలివిజన్ నిర్మాత, దర్శకుడు వల్లభనేని మహీధర్.. మహేష్ మేనల్లుడే. ఇకపోతే మహేష్ అంత్యక్రియలు నేడు చెన్నైలో జరిగాయి. ఈ విషయం తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
*ముగిసిన మూడో రోజు ఆట.. భారత్ విజయానికి ఎన్ని పరుగులు కావాలంటే..?
రాంచీలో జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్లో 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆట ముగిసేసరికి వికెట్ కోల్పోకుండా 40 పరుగులు చేసింది. క్రీజులో రోహిత్ 24, జైస్వాల్ 16 పరుగులతో ఉన్నారు. కాగా.. ఇంకా భారత్ విజయానికి 152 పరుగులు కావాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 145 పరుగులకు ఆలౌట్ అయింది. భారత స్పిన్లర్లు దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్లు చేతులెత్తేశారు. భారత్ బౌలింగ్ లో అశ్విన్ 51 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ కూడా 22 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు, జడేజా ఒక వికెట్ సంపాదించాడు. ఇక.. ఇంగ్లండ్ బ్యాటర్లలో క్రాలే 60 పరుగులు, బెయిర్ స్టో 30 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ఫోక్స్ (17), డకెట్ (15), రూట్ (11) రెండంకెల స్కోర్లు చేయగా.. పోప్ 0, స్టోక్స్ 4, హార్ట్లీ 7, రాబిన్సన్ 0, ఆండర్సన్ 0 పరుగులకే ఔటయ్యారు. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 353 పరుగులు చేసింది. రూట్ (122) అజేయ సెంచరీ చేయడంతో ఆ జట్టుకు కీలక పరుగులు లభించాయి. రాబిన్సన్ (58), జాక్ క్రాలే (42), బెయిర్‌స్టో (38), ఫోక్స్ (47) పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్‌దీప్ 3, సిరాజ్ 2, అశ్విన్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా.. ఇప్పటికే భారత్ రెండు టెస్ట్ మ్యాచ్ ల్లో విజయం సాధించగా, ఇంగ్లాండ్ ఒక్క టెస్ట్ మ్యాచ్ గెలిచింది. కాగా.. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని ఆత్రుతగా ఉంది భారత్.
